విద్యార్థి విజయానికి సారథులు ఉపాధ్యాయులు

0
2

[box type=’note’ fontsize=’16’] 5 సెప్టెంబరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధాయ్యుడి ఉండవలసిన లక్షణాలు, ధర్మాలు, బాధ్యతలు మొదలైనవి ఏమిటో ఈ చిన్న వ్యాసంలో వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు.  [/box]

[dropcap]ఉ[/dropcap]పాధ్యాయులు నిర్వర్తించే పని ఒక సేవలాంటిది. ఈ సేవలో ఉపాధ్యాయుడు అంకితభావంతో సేవ చేస్తే విద్యార్థికి తద్వారా దేశానికి ఏంతో మేలు జరుగుతుంది. విద్యను దానము చేయటము మహోన్నత దానముగా మన సంస్కృతీ సాంప్రదాయాలు చెపుతున్నాయి. గురువుకి సమాజమంలో అతున్నత స్థానము కల్పించి గురువును సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపముగా చెపుతున్నారు. ప్రస్తుతము డబ్బే ప్రధానము అని సమాజములో చెలామణి అవుతుంది. ఈ పరిస్థితిని సరిదిద్దటానికి ఎందరో గురువులు ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. ఈ ప్రయత్నములో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? ఏ లక్షణాలను కలిగి ఉండాలి? మొదలైన అంశాలపై కొద్దిపాటి వివరణ ఇద్దామని నా చిన్న ప్రయత్నము.

తరగతి గదిలో ప్రవేశించిన ఉపాధ్యాయుడు ముందుగా మనస్సులో ఇలా ప్రశ్నించుకోవాలి, “నా ముందున్న పిల్లలు ఎవరు ఇక్కడ నేను చేయవలసిన పని ఏమిటి?”. ఇలా ప్రశ్నించుకున్నప్పుడు వచ్చే జవాబుల సంక్షిప్త రూపము, “ఈ పిల్లలు జ్ఞాన సముపార్జనకు వచ్చారు. ఈ పిల్లలలో అన్ని వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరికి రాజ్యాంగము విద్య హక్కు కల్పించింది. నేను వారి హక్కులను వారికి అందివ్వటానికి ఈ ఉపాధ్యాయ స్థానములో ఉన్నాను” అని గుర్తించినప్పుడు ఉపాధ్యాయుడు పలికే ప్రతి పలుకు విద్యార్థులలో ఉద్దేపనను కలుగజేస్తుంది.

ఉపాధ్యాయుడు కూడా కేవలము తానూ జీతము తీసుకొనే వ్యక్తిగా కాక ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉత్తమ పౌరుడిగా, ఒక సమగ్రమైన వ్యక్తిగా ఎదుగుతాడు. సమగ్రమైన వ్యక్తి అంటే ఇతరుల జీవితాలలో వెలుగును నింపే సామర్థ్యము కలిగిన వ్యక్తి. అంటే వికసించిన లేదా పరిణతి చెందిన వ్యక్తిత్వము కలిగి ఉంటాడు. వికసించని వ్యక్తిత్వము కలిగిన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులతో విద్యార్థులతో ఘర్షణ పడుతూ ఉంటారు. సమగ్ర వ్యక్తిగా రూపొందినవారు ఇతర ఉపాధ్యాయుల, విద్యార్థుల మనసును గెలుచుకుంటారు. విద్యార్థులకు చక్కటి భోధన చేయగలరు. సామాజికాభివృద్దికి తోడ్పడగలరు. వివేకానందుడు చెప్పినట్లు మనిషిని రూపొందించేదే విద్య. కానీ ప్రస్తుతము సమగ్ర వ్యక్తిని తయారుచేసే విద్య పాఠశాలలోగాని కళాశాలలోగాని ఇచ్చే అవకాశాలు లేవు. విద్యార్థుల జీవితాల మార్గ నిర్దేశనానికి ఉపాధ్యాయులు తప్ప మరెవ్వరూ లేరు అన్నసత్యాన్ని గ్రహించి తదను గుణముగా వ్యవహరించవలసిన బాధ్యత ఉపాధ్యాయుల పైనా ఉంది.

అలా చేయటానికి ఉపాధ్యాయ్యుడి ఉండవలసిన లక్షణాలు, ధర్మాలు, బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకుందాము. లక్షణాల విషయానికి వస్తే ముందు ప్రతిభ ఉండాలి. పాఠాన్ని సమర్థవంతముగా చెప్పగలిగే సామర్థ్యము ఉండాలి. సత్ప్రవర్తన, సౌశీల్యము ఉండాలి. పిల్లలను ఉత్తేజ పరిచే విధముగా భోధన ఉండాలి. పిల్లలతో తోటి ఉపాధ్యాయులతో సత్ సంబంధాలను కలిగి ఉండాలి. పిల్లలలో అభిరుచులను పెంచాలి. నాయకత్వపు లక్షణాలను పెంపొందించాలి. ఉపాధ్యాయుడు కొన్ని మార్గదర్శకాలను ఏర్పరచుకోవాలి. అంటే పిల్లలను సొంత బిడ్డలా మాదిరిగా ప్రేమిస్తూ వారిలో తారతమ్యాలను తొలగించటానికి ప్రయత్నించాలి. చేస్తున్న వృత్తిని గౌరవించాలి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల నుండి నేర్చుకోవాలి. వ్యక్తిగత సమస్యలను ఇంటి వద్దే వదిలి స్కూల్ అనే ప్రపంచములోకి అడుగు పెట్టాలి. ఆత్మ విశ్వాసముతో మెలగాలి. భావ ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి. క్లాసు రూములో మీ ప్రవర్తన పిల్లలు గమనిస్తూ ఉంటారు కాబట్టి సక్రమముగా ప్రవర్తించండి

పాఠము చెప్పబోయే ముందు మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి. పాఠాన్ని ఆసక్తికరముగా చెప్పండి క్లాసులో పిల్లలందరిని గమనిస్తూ ఉండండి. ఉపాధ్యాయుడు తన బాడీ లాంగ్వేజ్ (శరీర భాషను) గమనిస్తూ అవసరమయితే సరిచేసుకోవాలి. అంటే గౌరవప్రదమైన దుస్తులు వేసుకోవాలి. క్లాసులో ఉన్నప్పుడు అవలించటాలు, చెవుల్లో ముక్కులో వేళ్ళు పెట్టుకోవటాలు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటము, పిల్లల మీద మాటిమాటికీ కోప పడటము వంటి పనులు చేయకండి. పిల్లలలో నేర్చుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్న ఆలోచనలను ప్రేరేపించండి. దీనికి పిల్లలో ప్రేరణ కలుగజేయాలి. ప్రముఖుల జీవితాలను గురించి చెప్పి వారు సాధించిన విజయాలను తెలియజేస్తూ ఘనత సాధించిన పూర్వ విద్యార్థుల గురించి కూడా చెపుతూ ఉండండి. పజిల్స్ క్విజ్ లాంటి ప్రోగ్రామ్‌లను స్కూల్‌లో నిర్వహిస్తూ విద్యార్థులను భాగస్వామ్యులుగా చేయండి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండండి. పిల్లలలో సంభాషణ నైపుణ్యాలు పెంచండి. అంటే వారికి మర్యాద మన్ననలను గురించి తెలియజేయండి. దీనివల్ల సభ్య సమాజములో సక్రమముగా మెలగగలరు.

ఉపాధ్యాయుడు తన బోధనను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు తన బోధనను మెరుగు పరచుకోవాలి. అవసరమైతే తన క్లాసు పుస్తకాల పరిధి దాటాలి. బోధనలో సరి అయిన సాధనాలను ఉపయోగిస్తూ పిల్లలలో ఆసక్తిని పెంచుతూ ఉండాలి. క్లాసులో ఉన్న అందరి మానసిక స్థితిగతులు, తెలివితేటలు వారి ఇంటి వాతావరణము ఒకే విధముగా ఉండవు అన్న విషయాన్ని గుర్తించి మీ బోధనను మార్చుకుంటూ ఉండండి. కొవ్వొత్తి తానూ వెలుగుతున్నంత సేపే ఇంకో వత్తిని వెలిగించగలదు.

ఎప్పుడు కూడా అరచి, శిక్షించి, క్రమశిక్షణను అమలు చేయగలము అనుకోకండి. పాఠ్యాంశాల బోధనతో పాటు మానవతా విలువలు బోధనకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ విధముగా శారీరక వికాసముతో పాటు సామాజిక మానసిక భావ వికాసాన్ని కూడా కలుగజేయండి.

ఉపాధ్యాయులారా మీ బాధ్యత మీకు ఉండవలసిన లక్షణాలు, మీరు తరగతి గదిలో ఉండవలసిన తీరు పిల్లలను ఎలా తీర్చి దిద్దాలో అన్న అంశాలను నాకు ఉన్న అనుభవంతో నేటి ఉపాధ్యాయులకు చెపుతున్నాను. వారు అన్ని గాకపోయిన కొన్ని అయినా పాటిస్తే మంచి ఉపాధ్యాయులుగా రాణిస్తారు. సమాజానికి మంచి పౌరులను శాస్త్రవేత్తలను అందించగలరు. చివరిగా సాధారణ ఉపాధ్యాయుడు పాఠము చెపుతాడు. మంచి ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు ఉదాహారణలతో విద్యార్థుల ఇన్వాల్వ్‌మెంట్‌తో బోధిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు తన విద్యార్థులను ఉత్తేజపరుస్తాడు. రాళ్లను తన నైపుణ్యముతో శిల్పి గొప్ప శిల్పాలుగా చెక్కి దేవాలయములో దేవతా మూర్తులుగా ప్రతిష్ఠిస్తాడో అలాగే ఉపాధ్యాయుడు కూడా పిల్లలను అందమైన మూర్తులుగా ప్రతిభావంతులుగా సమాజానికి అందిస్తాడు. ఆ ప్రతిభావంతులు సామాజికాభివృద్ధికి తోడ్పడతారు. తద్వారా దేశము అభివృద్ధి చెందుతుంది. జైహింద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here