[dropcap]“మా[/dropcap]వాడు సివిల్ ఇంజినీరింగ్‌లో పి.ఎహెచ్.డి. చేశాడు. చెన్నైలో ఎల్.ఎన్.టి.లో మేనేజర్ ఉద్యోగం. మొదటి నుంచీ వాడు సరస్వతీ పుత్రుడు. అన్నింట్లోనూ ఫస్టు. అంతటా ఫస్ట్ బెస్ట్.” చిరునగవును చిందిస్తూ సగర్వంగా తాతయ్య గంగాధరం గారు.
“మా అమ్మాయి ఏం తక్కువ తినలేదు. అది స్కూల్లో ఫస్ట్. కాలేజీలో ఫస్ట్. యూనివర్సిటీలో ఎం.టెక్.లో గోల్డ్ మెడలిస్ట్..” గంగాధరాన్ని చుర చురా చూస్తూ.. పలికింది పిల్ల నాయనమ్మ కాళేశ్వరి.
“అమ్మా!.. కాళేశ్వరమ్మగారూ!.. మీ ఇరువురి కుటుంబాలు అనాదిగా మంచి చరిత్ర గలవి. అందుకే నేను.. ఒకరిని గురించి ఒకరికి వివరంగా తెలియజేశాను. ఇపుడు సమక్షంలో మాటలు జరిగాయి. పెద్దలు మీరు మంచి మనస్సుతో తమరి అంగీకారాన్ని తెలియజేస్తే.. నిశ్చితార్థ.. వివాహ ముహూర్తాలను నిర్ణయించడంతో నా కర్తవ్యం పూర్తి అవుతుంది.” ఎంతో వినయంగా చెప్పాడు వామనశాస్త్రి గారు.
“ఏం వియ్యంకుడు గారూ!.. మా సంబంధం మీకు నచ్చినట్లేనా?..” గంగాధరంగారి ముఖం లోకి సూటిగా చూస్తూ అడిగింది కాళేశ్వరమ్మ.
“నచ్చింది కాళేశ్వరమ్మగారూ!.. నిశ్చితార్థానికి, వివాహానికి ముహూర్తాలను నిర్ణయించమని శాస్త్రిగారికి చెప్పండి..” నవ్వుతూ మృదుమధురంగా పలికాడు గంగాధరం.
“వామనశాస్త్రి గారూ!.. విన్నారుగా.. మా వియ్యంకుడి గారి మాటలు. ముహూర్తాలు నిర్ణయించి చెప్పండి..” సాంత్వనంగా పలికింది కాళేశ్వరమ్మగారు.
“అమ్మా!.. చాలా సంతోషం..” పంచాంగాన్ని చేతికి తీసుకొని అందులోనుంచి ఒక కాగితాన్ని తీసి.. “అమ్మా!.. అయ్యా!.. నిశ్చితార్థానికి చైత్ర శుక్ల పంచమి సోమవారం.. వివాహానికి వైశాఖ శుక్ల సప్తమి శుక్రవారం.. ఎంతో గొప్ప ముహూర్తాలు. తమరు సమ్మతిస్తే వాటిని ఖాయం చేసి వ్రాసి తమరికి ఇస్తాను..” వినయంగా విన్నవించాడు వామనశాస్త్రి.
వచ్చిన పని సవ్యంగా జరిగినందుకు గంగాధరం.. కొడుకు గోపాలం, కోడలు సుమతీ, మనుమరాలు లలితా.. కాళేశ్వరమ్మ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసి తమ గ్రామానికి బయలు దేరారు.
***
గంగాధరంగారి గ్రామానికి, కాళేశ్వరమ్మ గారి గ్రామానికి మధ్యదూరం యిరవై కిలోమీటర్లు.
కాళేశ్వరమ్మ కొడుకు రంగారావు, ఆతని ఇల్లాలు సుమిత్ర. యీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి హారతి, రెండవ అమ్మాయి స్వాతి. నిశ్చయించ బడిన వివాహం హారతికి. ఆమె అంటే.. ఆ ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం. చిన్నతనం నుంచీ హారతి ఆడింది ఆట.. పాడింది పాట. నాయనమ్మ కాళేశ్వరికి హారతి అంటే ఎంతో ప్రేమాభిమానాలు.
కాళేశ్వరమ్మ ఆ కాలంలో బి.ఏ.. వరకు చదివిన వ్యక్తి. ఆమె భర్త ఆనందరావు గతించి ఐదేళ్ళయింది. వారి కాలంలో వారు ఆ గ్రామానికి సర్పంచ్. వారి తర్వాత కాళేశ్వరమ్మ ఆ హోదాను తనకు దక్కించుకొంది. వీధిన ఈమె నడిచి వెళుతుంటే.. ఆడా మగా ప్రక్కకు నిలిచి.. ఈమెకు చేతులు జోడించ వలసిందే. ఆమె ముందు నిలబడి వాదించే ధైర్యం ఆ ఇంట్లోనే కాక, ఆ వూరిలోనూ ఎవరికీ లేదు.
కాళేశ్వరమ్మగారి గారాల పెంపకంలో హారతి మగరాయుడిలా పెరిగింది. కాలేజీలో గౌతమ్ అనే కుర్రాడి ప్రేమలో పడింది. గౌతమ్‍ను తాను ప్రేమించానని, పెండ్లి జరిపించమని తల్లిని తండ్రిని నానమ్మనూ కోరింది. కులాల తేడా కారణంగా.. గౌతమ్ పేదవాడైన కారణంగా కాళేశ్వరమ్మ మొదటిసారిగా మనుమరాలి నిర్ణయాన్ని కాదు.. కూడదు అని హెచ్చరించింది. మనుమరాలి చుట్టూ కాపలా జనాన్ని నియమించింది. తమకు అన్నివిధాలా తగిన గంగాధరం కొడుకు రఘుతో హారతి వివాహం జరిగేలా నిర్ణయించింది.
గంగాధరం.. కొడుకు గోపాలం, కోడలు సుమతి. గోపాలం కొడుకు రఘు. కూతురు లలిత. సహజంగా గంగాధరంగారు మంచి మనిషి. ధర్మాధర్మాలను.. సత్యా సత్యాలను, నీతి నిజాయితిని.. తూ..చ.. తప్పకుండా పాటిస్తాడు. వారి వూరికి వారూ సర్పంచే.
కొడుకు కోడలికి, మనుమడు మనవరాలికి పెద్దాయన అంటే ఎంతో ఇష్టం.. అభిమానం.. ఈ మంచి గుణాలు వారికి గంగాధరం ద్వారానే సంక్రమించాయి. మూడేళ్ళ క్రిందట గంగాధరం గారి ఇల్లాలు పార్వతి స్వర్గస్థురాలయింది.
కాళేశ్వరమ్మ పేరు ప్రతిష్ఠలు విని, తన మనుమడికి ఆమె మనుమరాలితో వివాహాన్ని నిర్ణయించారు. కట్నకానుకలను వారు ఇస్తామన్నా.. వీరు వద్దన్నారు.
నిర్ణయించిన ముహూర్తానికి రఘుకు హారతికి.. వివాహం ఘనంగా జరిగింది. ఆ రోజు నవ దంపతులకు తొలిరేయి.
***
కొత్త పెండ్లికొడుకు రఘు తొలిరేయి శయ్యా గృహంలో ప్రవేశించాడు. పందిరిమంచం పైనా చుట్టూ మల్లెపూల దండలు అందంగా అలంకరించబడివున్నాయి. పరపు.. దిండ్లు.. పైన తెల్లటి బెడ్ షీట్ క్రమంగా అమర్చబడివున్నాయి. మంచం ప్రక్కన టేబుల్, దానిపైన ద్రాక్ష, దానిమ్మ, గజదానిమ్మ, అరటి పండ్లు వేరువేరు తట్టల్లో నిండి వున్నాయి. అగరువత్తులు వెలిగించి నందున గదినిండా మంచి వాసన నిండి వుంది. విద్యుద్దీపాల కాంతిలో గది ఎంతో శోభాయమానంగా మనస్సుకు ఆహ్లాదంగా.. ఆనందంగా వుంది. రఘు మనస్సులో ఏవేవో కోరికలు. చక్కటి అందమైన ఆనందమైన ఆలోచనలు. అతని కళ్ళు తన ఇల్లాలి రాక కోసం వేచి ద్వారం వైపే లగ్నమై యున్నాయి. కాలం చాలా భారంగా నడుస్తున్నట్లు అనిపించింది.
తలుపు తెరచుకొని ఒక పదేళ్ళ బాలుడు లోనికి వచ్చాడు. రఘు చేతికి ఒక మడిచిన కాగితాన్ని ఇచ్చి మెరుపులా పరుగున మాయమైనాడు. అతని చర్యకు రఘు ఆశ్చర్య పోయాడు. చేతిలోని కాగితాన్ని విప్పి చూడసాగాడు.
పిడుగు పడినట్లు అయింది. అతని శరీరం చెమటతో తడిసిపోయింది. అతని కళ్ళకు ఆ గదిలో కారు చీకట్లు క్రమ్ముకొన్నట్లు గోచరించింది.
“బ్రదర్!.. గుడ్ ఈవినింగ్. యథార్థం చెప్పాలంటే నీవు చాలా దురదృష్టవంతుడివి. కారణం, నేను హారతి ప్రేమికులం. మా మధ్య అంతా ముగిసిపోయింది. నానమ్మ కాళేశ్వరమ్మ.. నిర్బంధంతో హారతి పెండ్లి పీటలమీద కూర్చుంది. ఆమె మనస్సు నిండా నేనున్నాను. నా మనస్సు నిండా హారతి వుంది. నా పేదరికం.. కుల భేదం కారణంగా కాళేశ్వరమ్మ మా వివాహానికి అంగీకరించలేదు.
మగవాడిగా.. ఆమె భర్తగా.. నీవు ఆమె శరీరాన్ని దోచుకోవచ్చు. కానీ మనస్సు దోచుకోలేవు. ఈ రాత్రి నీ చర్య మన మూడు జీవితాలకు సంబంధించింది. నీవూ బాగా చదువుకొన్న వాడివి.. మంచివాడివని విన్నాను. నీ జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే యథార్థాన్ని నీకు తెలియజేస్తున్నాను. బాగా ఆలోచించి.. మంచి నిర్ణయం తీసుకో, దాన్ని పాటించు. అలా జరిగితే అది మన ముగ్గురికీ మంచిది.
ఇట్లు.. నీ స్నేహితుడు.”
ఉత్తరం సొంతం చదివేసరికి అది రఘు చేతినుండీ జారి క్రిందపడింది. రఘు కలలన్నీ చెదిరిపోయాయి. తలపై పిడుగు పడినట్లు అయింది. అతని శరీరం చెమటతో తడిసిపోయింది. అతని కళ్ళకు ఆ గదిలో కారు చీకట్లు క్రమ్ముకొన్నట్లు గోచరించింది.
తలుపు తెరుచుకొని హారతి గదిలోనికి వచ్చింది. మెల్లగా నడిచి టేబుల్‍ను సమీపించి పాలగ్లాసును టేబుల్ పైన వుంచింది. వెనక్కు వెళ్ళి తలుపు గడియ బిగించింది. ఎదుటివైపున వున్న సోఫాలో కూర్చుంది. మౌనంగా కళ్ళు మూసుకొంది.
శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని రఘు అతి కష్టం మీద హారతి ముఖంలోకి చూచాడు. ఆమె కళ్ల నుంచి కారుతున్న అశ్రువులు అతనికి గోచరించాయి.
వంగి క్రిందపడివున్న కాగితాన్ని చేతికి తీసుకొన్నాడు. మడిచి.. పాలగ్లాసు క్రింద వుంచాడు. ఆ వాతావరణం అతనికి ఎంతో చికాకును కలిగించింది.
వెలుగుతున్న విధ్యుత్ దీపాల కాంతి కారు చీకటిగా గోచరించింది. మనస్సు ఎంతో వికలమైంది.
ఆ గది తను తొలిరేయి గడపవలసిన గది.. ప్రస్తుతంలో అది అతనికి చెరశాలలా గోచరించింది. తను యిప్పుడు ఏంచేయాలి?.. పారిపోవాలా?.. లేక ఆమెను బలవంతంగా తన చేతుల్లోకి తీసుకోవాలా? ఆ పుత్తరాన్ని ఆమెకు చూపి ఆమె గతాన్ని వివరంగా తెలుసుకోవాలా!.. విషయం తెలిసిన తర్వాత ఆమెను అడగటం సభ్యతా!.. ఆలాచేస్తే ఆమె మనస్సు కష్టం కలిగించిన వాడిని అవుతాను కదూ!.. అది తనకు తగునా.. ‘తగదు.. తగదు..’ అని అతని ఆత్మ ఘోష.
‘మామధ్య అన్నీ ముగిసిపోయాయి’ ఉత్తరంలోని ఈ వాక్యం మదిలో మెదిలింది. ఈమె నాది కాదు. ఈ రాత్రి .. తనవలన ఆమెకు ఎలాంటి కష్టం కలుగరాదు. ఉదయం అయిదుగంటల వరకు జాగరణ చేయవలసిందే. ఇరువురి ఆలోచనలు విభిన్న కోణాల్లో గత జ్ఞాపకాలతో సతమతమవుతున్నాయి. తను అలా ఎంతసేపు సోఫాలో కూర్చుంటుంది?.. ఆమెను పలకరించాలి.. మంచంపై పడుకోమని.. తాను సోఫాలో పడుకొంటానని చెప్పాలని నిర్ణయించుకొన్నాడు. రఘు మెల్లగా సోఫాను సమీపించాడు. పరీక్షగా ఆమెను చూచాడు.
తెల్ల చీర, తెల్ల రవిక, మెడలో బంగారు నగలు, చేతులకు బంగారు గాజులు. చక్కగా దువ్వి వేసిన వాలుజడ, తల నిండా మల్లెపూలు. అలిగి కూర్చున్న దేవకన్యలా గోచరించింది హారతి రఘు కళ్ళకు. తన దురదృష్టాన్ని తలచుకొని నిట్టూర్చాడు రఘు.
“ఏమండీ!..” వంగి మెల్లగా పిలిచాడు.
హారతి కళ్ళు తెరచి అతని కళ్ళల్లోనికి చూచింది. విశాలమైన ఆమె నయనాలు చింతనిప్పుల్లా గోచరించాయి రఘుకు. చలించిపోయాడు.
“బాధపడకండి.. నేను మిమ్మల్ని తాకను. విషయం నాకు తెలిసింది. మీరు వెళ్ళి మంచంపై పడుకోండి. నేను సోఫాలో పడుకొంటాను. అయిదుగంటలకు లేచి వెళ్లిపోతాను.” ఎంతో అనునయంగా చెప్పాడు రఘు.
“మీరు వెళ్ళి మంచంపై పడుకోండి” ఆశ్చర్యంగా రఘు ముఖంలోకి చూస్తూ పలికింది హారతి.
“దానిమీద పడుకొనే అదృష్టం నాకు లేదు. నేను పడుకోను. మీరు వెళ్ళండి.”
హారతి అతని ముఖంలోకి పరీక్షగా చూచింది.
“ప్లీజ్.. నా ఈ ఒక్క మాటను వినండి..” అనిర్వచనీయమైన అభ్యర్ధన ధ్వనించింది రఘు పలుకులలో హారతికి.
వెంటనే లేచి హారతి మంచాన్ని సమీపించి వాలిపోయింది.
రఘు సోఫాలో కూర్చున్నాడు. వెలుగుతున్న బార్ లైట్లు వికృతంగా గోచరించాయి అతనికి. వెళ్ళి వాటిని ఆర్పి బెడ్ లైట్ స్విచ్ నొక్కి, సోఫాను చేరి వాలిపోయాడు.
ఆ ఇరువురూ నిద్రకు నోచుకోలేదు. గతం వారి.. మస్తిష్కాలలో వికృతంగా ప్రతిబింబించ సాగింది. ఎంతో ఆనందంగా.. వింత అనుభవాలతో.. మృదుమధుర సంభాషణలతో.. మరపురాని రేయిగా గడపవలసిన ఆ రేయి వారిపాలిట కాళరాత్రిగా ఎంతో భారంగా గడచిపోయింది.
రఘు అయిదుగంటలకు లేచాడు. మెల్లగా ఆమె మంచాన్ని సమీపించాడు. హారతి నిద్ర పోతూవుంది. కొన్ని క్షణాలు ఆమె ముఖంలోకి చూచాడు. ఆమె చెక్కిళ్లపై కన్నీటి చారలు అతనికి గోచరించాయి.
మెల్లగా తలుపు గడియ తీసి బయటికి నడిచాడు. తన వూరికి బస్సులో వెళ్లిపోయాడు.
సమయం ఉదయం ఆరున్నర గంటలు. హారతి తల్లి సుమిత్ర ఆ గదిని సమీపించింది. తలుపును తట్ట బోయి తెరచి వుండటం గమనించి.. తలుపును పూర్తిగా తెరచి గదిలోకి ప్రవేశించింది. గదినంతా కలయ చూసింది. అల్లుడు కనిపించలేదు. మంచంపై కలత నిద్రలో వున్న హారతిని తట్టి లేపింది. ఆమె మదిలో ఏదో అనుమానం.
“అల్లుడుగారు ఏరే?..” ఆశ్చర్యంతో ఆందోళనతో.. సుమిత్ర కూతురును అడిగింది.
తల్లి ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచి హారతి.. “ఆయన వెళ్ళిపోయి వుంటారు..” అంది.
“ఎక్కడికి?..” ఆత్రంగా అడిగింది సుమిత్ర.
“నాకు తెలీదు..” నిర్లక్ష్యంగా జవాబు చెప్పి పాలగ్లాసు క్రింద వున్న కాగితాన్ని తీసుకొని వేగంగా గది నుంచి వెళ్లిపోయింది. సుమిత్ర చిత్తర్వులా నిలబడి పోయింది.
నాయనమ్మ కాళేశ్వరి హారతికి ఎదురయింది.
తన చేతిలోని కాగితాన్ని ఆమె చేతిలో వుంచి.. తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొంది హారతి.
ఉత్తరాన్ని చదివిన కాళేశ్వరమ్మ కళ్ళు తిరిగాయి. హృదయంపై ఎవరో సమ్మెటతో కొట్టినట్లనిపించింది. కళ్ళల్లో నీళ్ళు నిండాయి. రోదిస్తూ సోఫాలో కూలబడింది.
రఘు తన ఇంటికి చేరాడు. అతన్ని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. తన తొలిరేయి అనుభవాన్ని తాత గంగాధరానికి, తల్లిదండ్రులు గోపాలం, సుమతిలకు వివరించాడు. వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. బాధపడ్డారు.
“తాతయ్యా!.. మనం మోసపోయాం. ఈ విషయాన్ని గురించి మీరు ఎవరితోనూ ఎలాంటి చర్చలు చేయకూడదు. దానివల్ల ఎవరికీ ఎలాంటి ఫలితం వుండదు. నేను మగవాడిని. దేనినైనా.. ఎదుర్కొనే సామర్థ్యం నాకు మీ మూలంగా లభించింది. మధ్యవర్తుల మాటలను నమ్మి.. మీరు ఆ సంబంధాన్ని గురించి సక్రమంగా విచారించలేదు. వారి మాటలను మీరు నమ్మారు. ఆ కారణంగా మనం యీ చిత్రమైన సమస్యలో ఇరుక్కున్నాము. ఐనా ఫర్వాలేదు. సమస్యను మనం ఎదుర్కొనగలము. మీరు మా తండ్రిగారికి ఈ మానవ జన్మ విలువలను.. మంచినీ.. నీతినీ.. నిజాయితీనీ నేర్పారు. వారు వారి జీవితాన్ని ఎంతో క్రమశిక్షణలో సాగిస్తున్నారు. మీ హయాంలో మీరు ఎడ్లబండ్లలో పయనించారు. నాన్నగారు ఇప్పుడు కార్లల్లో ప్రయాణం చేస్తున్నారు. నేను మీ ఇరువురి దయవల్ల విమానాల్లో పయనిస్తున్నాను. నాటికి నేటికీ విజ్ఞానం ఎంతో పెరిగింది. కానీ మనిషిలో మానవతావాదం.. వివేకం.. విచక్షణ జ్ఞానాలు నశించాయి. స్వార్థం .. ద్వేషం .. మోసం.. ప్రబలాయి. ఎంతో విజ్ఞానవంతులైన వారు కూడా పై మూడింటికి బానిసలై పోయారు. చేయరాని పనులని తెలిసీ కూడా.. అహంతో అవలీలగా చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి యొక్క ధనాన్ని.. పదవిని ఆశించి.. తమను తాము మోసం చేసుకొంటూ.. మేకవన్నె పులులుగా బ్రతుకుతున్నారు చాలామంది ప్రస్తుత విజ్ఞాన యుగంలో.. ఈ కోవకు చెందిందే.. కాళేశ్వరమ్మ.
తన మనుమరాలి వైవాహిక జీవిత విషయంలో ఆమె చాలా పెద్ద తప్పు చేసింది. ఆమె నిరంకుశ నిర్ణయం కారణంగా నాకు హరతికి వివాహం జరిగింది. కానీ.. ఆ వివాహం ఆమెకు ఇష్టం లేదు. ఆమె వేరొకరిని ప్రేమించింది. ఆ వ్యక్తి వ్రాసి పంపిన లేఖ వల్ల నాకు నిజానిజాలు తెలిసాయి. చాలాసేపు బాధ పడ్డాను. కానీ ఇపుడు నాకు ఎలాంటి బాధా లేదు. హారతి.. ఆమె ప్రేమించిన వ్యక్తితో ఆమె భావి జీవితాన్ని ఆనందంగా గడపాలి. త్వరలో ఆమె నానుంచి విడాకులు కోరవచ్చు. మీరు బాధపడకండి. ఆమె కోర్కెను నేను తప్పక తీరుస్తాను. కారణం.. నేను మీరు తీర్చిదిద్దిన రీతిగా.. మంచి మనిషిగా బ్రతకాలనుకొంటున్నాను తాతయ్యా!.. ఇక నా పునర్వివాహ విషయం.. ఆమెకు విడాకులు ఇచ్చిన కొంతకాలం తర్వాత.. తప్పకుండా చేసికొంటాను. మీకు ఆనందాని కలిగిస్తాను. నాకు.. నేను.. మీకు నాన్నగారికి తగిన వారసుడిగా మీలాగే గౌరవంగా బ్రతకాలనే ఆశ తాతయ్యా!.. నా నిర్ణయం సరైనదే కదా!..” ఎంతో ఆవేశంగా చెప్పి రఘు తన మాటలను ముగించాడు.
తండ్రి.. తాత కళ్ళల్లోకి చూచాడు. వారి నాయనాలు అశ్రుపూరితాలైనాయి. కానీ వదనాల్లో గర్వం.. తమ వారసుడు చెప్పిన మాటలే ఆ గర్వానికి కారణం.
“సరే నాన్నా!.. నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి..” గద్గద స్వరంతో పలికాడు గంగాధరం. మనుమడి వైవాహిక జీవితం ఇలా అయినందుకు ఆయనకు ఎంతో బాధ.
“నాన్నా!.. రఘు!.. నీవు చెప్పిన ప్రతిమాట అక్షర సత్యం. విజ్ఞానం పేరిట.. ఈ కాలం ఆడపిల్లల్లో కొంత మందిలో చిత్ర విచిత్రమైన మార్పులు. వారి కట్టు.. బొట్టు.. మాటతీరులో ఎంతో విచిత్రం. దీనికి తగినట్లుగా వారికి అండగా నిలిచి ప్రోత్సహించే మహా తల్లులు.. కాళేశ్వరమ్మ లాంటి వారు కొందరు వున్నారు. అలాంటివారి కారణంగానే.. విచక్షణా జ్ఞానం లేక.. వేగంతో తీసుకొనే నిర్ణయాల కారణంగా.. ప్రస్తుత సమాజంలో హారతి లాంటి పిల్లలు కొందరు తయారవుతున్నారు. పాపం.. అలాంటి వారిని ఆ భగవంతుడే రక్షించాలి..” పలికాడు తండ్రి గోపాలం.
గోపాలం భార్య.. సుమతి శిలాప్రతిమలా నిలబడి కొడుకు, మామగారు, తన భర్తల సంభాషణను ఆలకిస్తూ వుంది.
***
మూడు నెలలు ఆ రెండు కుటుంబాల మధ్యన భారంగా గడిచాయి. హారతి గౌతంతో వెళ్ళిపోయింది. మనశ్శాంతి కోసం.. కాళేశ్వరమ్మ.. కాశీకి వెళ్ళి పోయింది.
హారతి.. రఘు నుంచి విడాకులు కోరింది. ఆనందంగా ఆ కాగితాల మీద సంతకం చేశాడు రఘు. కొద్ది నెలలు తర్వాత వారి వివాహ రద్దును కోర్టు ఆమోదించింది. ఎంతో మంచి పేరున్న ఆ రెండు కుటుంబాలకు మాయని మచ్చ ఏర్పడింది. ఇదేకదా.. నేడు కొన్ని కుటుంబాల్లో జరిగే విజ్ఞానపు విన్యాసం?.. ఇలాంటి సంఘటనలు జరుగకుండా వుండాలంటే.. ఆడబిడ్డలను కన్న తల్లితండ్రులు కంటికి రెప్పవలే కాచి.. తగిన మగాడి చేతిలో పెట్టేవరకూ.. కాపాడాలి కదూ!!!..