Site icon Sanchika

విజ్ఞాన జ్యోతి

[dropcap]చీ[/dropcap]కట్లు ముసురుతున్నాయి. సంటెన్న తన పాత మట్టి మిద్దె ముందర నిలబడి, జారిపోతున్న సల్యాడ్యాన్ని పైకెగనూకి, దాని లాడెను బిగించి కట్టుకున్నాడు. లోపల్నుంచి రాగి సంగటి సట్టిలో ఉడుకుతున్న సప్పుడు, కోడలు రేవతి రోట్లో బుడ్డలు (వేరుశనగ) ఉరుమిండి నూరుతున్న సప్పుడు ఇనడుతూండాయి.

ఇంటి బయట రెండేండ్ల మనమడు ‘మద్దిలేటి’ ఒక పాత టైరుతో ఆడుకుంటుంటాడు.

“అంబటి పొద్దుననగా పోయినోడు రాతిరయితున్నా రాకుండా ఏం చేత్తున్నాడబ్బా!” అని కోడుమూరికి, వాండ్ల రెడ్డితో పాటు జీపులో బోయిన తన కొడుకు ఎంగటేసు గురించి ఇదవుతున్నాడు సంటెన్న.

“మామా! తిండి తిందువుగాని రా మల్ల!” అంటూ సంటెన్నను బిలిచింది కోడలు.

“ఆమన్సి ఎప్పుడొచ్చాడో ఏమో, నీవు దిను. పొద్దుబోయినంక తింటే అరగలేదని తనకలాడ్తావు” అన్నది రేవతి.

మల్లొకసారి ఈది సివరవరకూ సూసి అరుగుపక్కన గోలెంలోని నీళ్లతో కాల్లుసేతులు కడుక్కొని లోపలికి బోయినాడు సంటెన్న.

సంటెన్నకు అరవై ఏండ్లు దాటినాయి. మొన్నటివరకు వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. వరిగడ్డి, జొన్న చొప్ప పెద్ద పెద్ద వాములు వేయడంలో మొనగాడని పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఒగడే కొడుకు ఎంగటేసు. ఆ వూరి పెద్ద రెడ్డి దగ్గర జీతగాడు. ఈ మజ్జ కొంచెం దగ్గు బుస వచ్చాంది సంటెన్నకు. అందుకే పనులకు బోవడం తగ్గించినాడు. ఎంగటేసుకు పది బస్తాల వడ్లు, అరబస్తా కందులు, ఐదు వేల రూపాయలు జీతం, సంవత్సరానికిస్తాడు రెడ్డి. కోడలు కూడ పొగాకు బేళ్ల కాడ పనికి పోతాది. తిండికి కరువు లేని సంసారం.

సంటెన్న సంగటి తింటుండగా బయటి నుండి పెద్ద పెద్ద అరుపులు ఇనబడినాయి – “సంటెన్న బావా! గోరం జరిగిపోయినాది! యాడుండావు!” అంటూ.

సంటెన్న, కోడలు వెంటనే బయటకు బోయి చూసినారు. ఎంగటేసును నలుగురు మన్సులు శేతుల మీద మోసుకొని బయట అరుగుమీద పండబెట్టినారు. అతని పైనిండా కత్తులతో చేసిన గాయాలు!

రేవతి గుండెలపై బాదుకుంటూ “బావా! ఏమైంది బావా!” అని మనిషి మీద బడి రోదించసాగింది. సంటెన్న శక్తి లేనట్లుగా కూలబడిపోయినాడు. నెత్తిన చేతులతో మోదుకుంటూ “కొడుకా! యా నా కొడుకులురా నిన్ను పొడిసింది” అంటూ ఏడుస్తున్నాడు. రెండేళ్ల మద్దిలేటికి ఏం జరుగుతుందో అర్థం గాక బిక్క మొగంపెట్టి సూస్తన్నాడు.

ఇంతలో పెద్ద రెడ్డి నలుగురితో కలిసి వచ్చినాడు. వాండ్లు కోడుమూరి నుండి వస్తూంటే నాగలాపురం మెట్టకాడ పుట్లూరు లింగారెడ్డి మనుసులు దాడి సేసినారనీ, తన ప్రానం కాపాడడానికి ఎంగటేసు వాండ్లను ఎదిరించి బలయిపోయినాడనీ విచారంగా చెప్పినాడు సంటెన్నతో.

అలా ఫాక్షన్ గొడవలకు ప్రానం బోగొట్టుకున్నాడు ఎంగటేసు. పెద్ద రెడ్డి దగ్గరుండి అన్నీ జరిపించినాడు. పెద్ద దినం అయినంక రేవతి చేతిలో పదివేలు పెట్టి చేతులు దులుపుకున్నాడు.

కొన్ని నెలలపాటు మామ, కోడలు తేరుకోలేదు. సంటెన్న ఆరోగ్యం రోజు రోజుకు బాగలేదు. పెద్ద రెడ్డిచ్చిన డబ్బులు అయిపోవస్తున్నాయి. కాలం ఎంతటి దుక్కాన్నయినా మాన్పుతాది గద! రేవతి సంటెన్నకు శెల్లెలి కూతురే. వాండ్లది వెల్దుర్తి దగ్గర ‘అల్లుగుండు’ గ్రామం. రేవతి వెల్దుర్తి జడ్.పి. హైస్కూలులో ఎనిమిదో తరగతి వరకు చదివి ఆపేసింది.

ఒకరోజు సంటెన్న కోడలని దగ్గర కూర్చునబెట్టుకుని సెప్పినాడిట్లా. “మ్మేవ్! మనం ఈ వూర్లో బతకలేం తల్లీ. ఈ మిద్దె అమ్ముకోని ‘డోను’కు బోయి బ్రతుకుదాంపా. అది టవును కాబట్టి బతుకు తెరువుంటాది. ముక్యంగా నీవు మల్లా సదువుకోవాల! నిండా ఇరవై ఏండ్లు లేవు నీకు! వాడు ఉండింటే మనకీ గతి పట్టకపోను. పిల్లోన్ని పెంచి పెద్దజేయ్యాలగద! నేనా ఎన్నాల్లుంటానో తెలియదు. ఏమంటావు?”

రేవతి సరేనన్నదది. మిద్దె అమ్మితే ముప్పై వేలు వచ్చింది.

డోనులో రాజా టాకీసు ఎనక ఒక రేకుల యిల్లు బాడిక్కి దీసుకున్నారు. రెండు ఎనుములు (గేదెలు) కొనుకున్నారు. ఐదారిండ్లకు పాలు పోయసాగింది రేవతి. ఎనుము శాదానమంతా సంటెన్నే చేస్తున్నాడు.

కొంత స్తిమిత పడిన తర్వాత, వాండ్ల ఊరాయన ఒకరు డోన్ లోనే ఎయిడెడ్ హైస్కూలులో టీచరుగా పనిచేస్తున్న కాంతారెడ్డి సారు దగ్గరకి బోయినారు. ఆయనకు జరిగినదంతా తెలుసును.

డోన్‌కు వచ్చి మంచి పని చేసినారన్నాడు సారు. రేవతిని సదివించాలనుకుంటున్నట్లు చెప్పాడు సంటెన్న.

తన ఎనిమిదో తరగతి టి.సి. సూపిచ్చిందాయనకు రేవతి. “ఇగనేం, సలీసుగ పదికి కట్టొచ్చు. మా స్కూలులోనే సెంటరుంది.”

“ఇది ఇంకా జూనే గద! వచ్చే సంవత్సరం మార్చిలో టెంత్ రాయవచ్చు. పుస్తకాలు, గైడ్లు మన శిష్యుడు మల్లికార్జున షాపులో తీసిస్తా, రోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకు టెంత్ వాండ్లకు ట్యూషన్ ఎట్లా చెబుతూనే ఉన్నాను, నీవు గూడ రామ్మా” అన్నాడు కాంతారెడ్డిసారు.

సారు కాల్లకు మొక్కింది రేవతి. అలా ఆమె చదువు ప్రారంభమైంది. ఆ సమయంలో సంటెన్న చాలా కష్టపడినాడు. రేవతి సదువుకుంటొంటే పిల్లోన్ని చూసుకునేవాడు. ఎనుముల శాదానం ఉండనే ఉంది. మధ్యాహ్నం రాజా టాకీసు క్యాంటిన్లో సోడాకాయలు నింపేవాడు.

రేవతి సహజంగా తెలివైనది. తనకంటే చిన్న పిల్లలతో పాట కూర్చొని చదువు నేర్చుకుంది. కాంతారెడ్డిసారు ట్యూషను ఫీజు తీసుకోలేదు. కనీసం రోజు అరలీటరు పాలుపోస్తానన్నా ఒప్పుకోలేదు.

సంటెన్న ప్రతిరోజు కోడలిని ప్రోత్సహించేవాడు. డోన్ కొచ్చినాక అతని ఆయాసం కూడ బాగా తగ్గింది. వంట పని తప్ప రేవతిని ఏ పనీ తాకనివ్వడం లేదు. మద్దిలేటి తాతకు బాగా మాలిమి అయినాడు. అమ్మ చదువుకొంటూంటే అసలు అల్లరి చేయడం లేదు.

లెక్కలు, ఇంగ్లీష్ ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టేవి. కాంతారెడ్డిసారు. ఆదివారాలు ప్రత్యేకంగా ఆమెకు చెప్పేవాడు. మార్చిలో జరిగిన యస్.యస్.సి. పరీక్షలలో ఆమె యాభై మూడు శాతం తెచ్చుకుంది! రేవతిలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది! చదువు తెచ్చిన నిబ్బరమిది! తర్వాత ఇంటర్మీడియట్ కట్టించాడమెతో సారు. హెచ్.యి.సి. గ్రూపు తీసుకుంది. ఒక్క ఇంగ్లీష్‌కు మాత్రం సారు కోచింగ్ యిచ్చాడు.

రెండేండ్లు గడిచాయి. మద్దిలేటిని స్కూల్లో వేసినారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటరు యిచ్చినారు రేవతికి. పరీక్షలన్నీ బాగా రాసి, అరవై ఏడు శాతం తెచ్చుకుంది!

రిజల్టు వచ్చిం తర్వాత కాంతారెడ్డిసారు సంటెన్ననూ, రేవతనీ కూర్చోబెట్టుకొని ఇట్టా చెప్పినాడు.

“సెకండరీ గ్రేడు టీచరు ట్రయినింగు చేస్తే మంచిది. రెండు సంవత్సరాలు కర్నూల్లో గాని, అనంతపురంలో గాని ఉండాల. టీచరుద్యోగమొచ్చినాక కావాలంటే డిగ్రీ, పి.జీ కూడ ప్రయివేటుగా చదువుకోవచ్చును. రెండేండ్లకు ఫీజు, హాస్టలు కర్చులు యాభై వేలన్నా గావాల! మీకా ఉండాయా మరి!”

“మరి మామ, పిల్లోడు!”

సంటెన్న అన్నాడు. “అందరంబోయి అంత పెద్ద ఊర్లో బతకలేము. నేను పిల్లోని చూపెట్టుకుని ఈడనే ఉంటా. ఒక ఎనమునమ్మితే ఇరవై వేలు పైనే వస్తాది. ఒక సంవత్సరం గడుస్తాది. ఈలోపల నేనింకో పని యాదన్నా జూసుకుంటా.”

“మామా! నివ్వు కష్టపడుతున్నది సాలు. నేనే యాదన్న చిన్న ఉద్యోగం జేసి సంపాయిస్తాలే.”

సారన్నాడు “రెండో సంవత్సరం చదువుకునేనిస్తాలెండి. ఉద్యోగమొచ్చింతర్వాత తీర్చుకోవచ్చును.”

మామ, కోడలి కండ్లల్లో నీళ్లు!

“నీవు మా పాలి దేవునివి సారు!” అంటూ ఆయనకు మొక్కినారిద్దరూ!

రేవతి డి.యిడి ఎంట్రన్స్ రాసింది! ‘ఆదోని’లో సీటువచ్చింది! కొడుకును మామకప్పగించి, వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయింది.

నెలకొకసారి వచ్చి పోయేది. మద్దిలేటి బాగా చదువుకుంటున్నాడు. సంటెన్నకు డెభై ఏళ్లు వస్తున్నాయి. కోడలు జీవితం తీర్చిదిద్దాలనే పట్టుదలతో వయసు సహకరించకపోయినా పోరాడుతున్నాడు. రేవతి పొద్దునా సాయంత్రం కాన్వెంటు పిల్లలకు ట్యూషన్ చెప్పేది. హాస్టలు ఖరీదని, మరి యిద్దరు సహాధ్యాయినులతో కలిసి ఒక చిన్న యిల్లు తీసుకొని వండుకునేవారు.

ట్రెయినింగ్ పూర్తయింది! రేవతి డోన్‌కు వచ్చేసింది. సంటెన్నకు కొంత విశ్రాంతి దొరికింది. తర్వాత ఎడెనిమిది నెలలకే డి.యస్.సి. వచ్చింది. రేవతి సెలెక్టయింది! కౌన్సెలింగ్ తర్వాత ఆమెన ‘ప్యాపిలి’ గర్ల్స్ హైస్కూలుకు యస్.జి.టి. గా వేశారు. ప్యాపిలి డోన్‌కి 28 కి.మీ ఉంటుంది. రోజు వెళ్లిరావొచ్చు.

రెండు గదుల డాబా యింటికి మారినారు. క్రమంగా రేవతి బి.ఏ. ప్రయివేటుగా కట్టి, ఫస్టుక్లాసు తెచ్చుకుంది. ఒక సంవత్సరం లీవ్ మీద బి.యిడి చేసింది కర్నూల్లో. తర్వాత ఆమెను స్కూల్ అసిస్టెంటుగా ‘బేతంచెర్ల’ స్కూలుకు వేశారు. మద్దిలేటి హైస్కూలుకొచ్చినాడు. మామతో సహా అక్కడే కాపురం పెట్టారు. సంటెన్నను కంటికి రెప్పలా కాచుకోసాగిందామె. పూర్తి విశ్రాంతినిచ్చింది. “తల్లీ! నీకింకా ముప్పై నిండలేదు. సరైనవాడు అడిగితే మళ్లీ పెండ్లి జేసుకోమ్మా!” అన్నాడు మామ.

చిరునవ్వు నవ్వింది రేవతి! చదువు ఇచ్చిన సౌందర్యంతో ఆమె వెలిగిపోతూంది. “చూద్దాంలే మామా” అన్నది.

కాంతారెడ్డిసారు డబ్బు తిరిగి యిచ్చేసినారు. ఆయనకు, ఆయన భార్యకు బట్టలు పెట్టింది రేవతి.

“మీ వల్లనే ఈ స్థితికి…….” ఆమె గొంతు గద్గదమయింది.

సారిట్లా అన్నాడు!

“పిచ్చితల్లీ! నేను చేసిందేముంది! అంతా ‘చదువు’ చేసింది. చదువుకున్నావు. ఒదిగి ఉన్నావు. నీ జీవితంలో వెలుగు నింపింది చదువేనమ్మా! ‘ఆమె’కు ప్రతిఫలంగా, కృతజ్ఞతగా, బీదవారు, నిస్సహాయులకు చదువుకోవడంలో సహాయం చెయ్యి. ఇంతటితో ఆపకు! నీవు పి.జి. చేసి లెక్చరర్ అవ్వాలి!”

రేవతి వదనంలో ఒక విజ్ఞాన జ్యోతి!

Exit mobile version