Site icon Sanchika

విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-9

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

The Egoist

[dropcap]భ[/dropcap]గవద్గీతలో మూడవ అధ్యాయంలో 20వ శ్లోకం దగ్గర జనకుడి ప్రస్థావన వస్తుంది. ఆయన బ్రహ్మ జ్ఞానం పొందిన రాజుగా చెప్పబడ్డాడు.

ఆ జనక మహారాజుకే అష్టావక్రుడు అత్యుత్తమమైన జ్ఞానాన్ని సరళమైన భాషలో, సూటిగా తెలియజేశారు. దానికి సంబంధించిన కథ ఈ విధంగా ఉంది. అసలు జనకుని వద్దకు అష్టావక్రుడు ఎందుకు వెళ్ళాడు? ఆత్మజ్ఞానానికి సంబంధించిన చర్చ వారి మధ్య ఎలా జరిగింది అన్నది ఒక రసవత్తరమైన గాథ.

అష్టావక్రునికి, అతని తండ్రికి మధ్య కలిగిన జగడము (అష్టావక్రుడు గర్భవాసిగా ఉన్నప్పుడు), ఆ సమయంలో పుట్టని బిడ్డ మీద ఉన్న కోపంతో శపిస్తాడు. అష్టవంకరలు ఉన్న శరీరం పొందు అని.

వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇస్తాడని, ఓడినవారు జలమజ్జితులై ఉండాలని విన్నాడు ఏకపాదుడు. వెళ్ళాడు. వందితో వాదమునకు తలపడి ఓడిపోయాడు. నియమం ప్రకారం జలమజ్జితుడై ఉండిపోయినాడు.

ఇదంతా అష్టావక్రుడు జన్మించటానికి పూర్వమే జరిగింది.

మరోసారి చెప్తున్నాను. స్వాతి కిరణం సినిమాలో గంగాధరం Sanction of the Victim కు ఉదాహరణ. Atlas Shrugged లో హాంక్ రేర్డన్ లాగా. చుట్టు పక్కల వారి ప్రభావాలకు కాస్త తలొగ్గుతాడు. Self guilt వల్ల. లేదా induced guilt వల్ల.

ఈ విషయాన్ని మనకు బలంగా చూపేది మంత్రపుష్పం సన్నివేశం. అప్పుడు మోరల్ గా చూస్తే, అనంతరామ శర్మతో పోలుస్తే, గంగాధరానిది తప్పు లేదు. పెద్దవాడైన, ఆదర్శప్రాయుడైన, ఇంకా చెప్పాలంటే గంగాధరానికి బెంచ్మార్క్ గా నిలిచే అనంతరామ శర్మ చేసిన పనిని అనుకరించాడు. అంతే.

కాకపోతే పిల్లవాడు కనుక తనదైన కోణంగి ట్విస్ట్ ఇచ్చాడు. అప్పుడు అనంతరామ శర్మ, సంగీతం టీచరమ్మ, తల్లితండ్రులు, ఆఖరకు స్నేహితులు కూడా మందలిస్తారు. కోపగిస్తారు. నిజానికి ఆ మందలించటం చేయదగిన పనే. కానీ, అనంతరామ శర్మ చేసిన పనిని గర్హించక పోవటం పెద్ద తప్పు.

ఎత్తి చూపాల్సిన తప్పేనా అంటే కనీసం అప్పుడు కాకపోయినా ఆయనే స్వయంగా వేదమంత్రాలను అపస్వరంతో.. అని గంగాధరాన్ని కోప్పడినప్పుడైనా సరే అంతమంది పెద్దవారిలో ఒకరైనా మాట్లాడాల్సింది. లేదా గంగాధరానికైనా తేడా సరిగ్గా చెప్పాల్సింది.

ఎవరూ ఏమీ చేయలేదు సరికదా అందరూ గంగాధరానిదే తప్పని ఆ పిల్లవాడి మీద విరుచుకు పడ్డారు. అతనిలో undeserved guilt ను ప్రవేశ పెట్టారు. అదే అతని పతనానికి నాంది పలికింది.

దానికి విరుద్ధంగా అష్టావక్రుడిని తండ్రి శపించిన తరువాత ఏ క్షణం కూడా ఆయనను ఎవరూ తండ్రికి ఎదురు చెప్పాడని అనలేదు. పైగా మాతామహుడు తన స్వంత బిడ్డ లాగా చూసుకుని విద్యాబుద్ధులు నేర్పించాడు. దాని వల్ల అష్టావక్రుడు లో induced guilty feeling ఏర్పడలేదు.

Atlas Shrugged లో ఐన్ ర్యాండ్ జాన్ గాల్ట్ ను గురించి చెప్తూ ఒక అద్భుతమైన ప్రయోగం చేస్తుంది. A Face Without Pain or Fear or Guilt అని. భయం కానీ, guilt కానీ, తప్పు చేశాననే బాధ లేని మనిషి ఎవరికీ లొంగడు. అలా ఉండాల్సిన పని కూడా లేదు.

అప్పటి జనకుని ఆస్థానానికి వెళ్ళినపుడు, ఈయన రూపం, నడకతీరూ చూసి సభాసదులు నవ్వసాగారు. స్థాణువుగా అందరూ సద్దుమణిగే వరకూ నిశ్చలంగా ఉన్నాడు అష్టావక్రుడు. ఒక్కసారి సభికులను కలియచూసి బిగ్గరగా నవ్వాడు.

“నువ్వెందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు జనకుడు.

“నువ్వు చెప్పులుకుట్టే వాడివి రాజా! చెప్పులు కుట్టేవాడే చర్మానికి విలువ కడతాడు, మీరు నా చర్మాన్నీ, ఆకారాన్నీ చూసి నా గురించి అంచనాకు వస్తున్నారు” అని అన్నాడు అష్టావక్రుడు.

అప్పుడ ఆయన జ్ఞానాన్ని గుర్తించి, ఆయనతో సంవాదం మొదలు పెడతాడు జనకుడు. అలా పుట్టినదే అష్టావక్ర గీత.

గీత అంటే ఆచరించి చూపబడ్డ సందేశము.

అష్టావక్రుడు అద్భుతమైన అద్వైత జ్ఞానాన్ని మనకు పంచాడు. అంతే స్థాయిలో అమృతతుల్యమైన సంగీతాన్ని అందించాల్సింది గంగాధరం. కానీ, చివరకు ఎవరికీ కొరగాని ఆత్మార్పణ చేసుకున్నాడు.

Accepting undeserved guilt is suicidal – Ayn Rand.

మరి గంగాధరం కథ అలా ముగిసిందేగా?

ఇంతకీ ఆ కథలో విలన్ ఎవరు? విక్టిమ్స్ ఎవరు?

ముందు ఈ శ్లోకాలు చూద్దాం.

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ।। 20 ।।

అంటే..

తమ ధర్మములను (విహిత కర్మలను) నిర్వర్తించటం ద్వారానే, జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి, ఓ అర్జునా! నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి.

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 21 ।।

అంటే..

గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.

ఇంకా వివరంగా చెప్పాలంటే..

జనక మాహారాజు, తన రాజ ధర్మాలను నిర్వర్తిస్తూనే, కర్మయోగం ద్వారా సిద్దిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా, కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. ఇంకా చాలా మంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా చేశారు.

అనంతరామ శర్మ మహాత్ముడు కాదు.

మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను/నడవడికను చూసి మానవాళి ప్రభావితమౌతుంది. అటువంటి వారు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనాలు అనుసరించడానికి మార్గాన్ని వేస్తారు. ఈ విధంగా, సమాజంలో ఉండే నాయకులకు, తమ నడవడిక (మనసా వాచా కర్మణా) ద్వారా, జనసామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక భాద్యత ఉంది.

ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో, సహజంగానే మిగతా సమాజం కూడా నీతిప్రవర్తన, నిస్వార్థం మొదలైనవి ఆచరిస్తారు. కానీ, ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో, మిగతా సమాజం కూడా, వారికి అనుసరించే ప్రమాణం లేక, స్వార్థ పూరితంగా, అనైతికతతో, మరియు అనాసక్తతతో దిగజారి పోతుంది.

కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిల్పటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి.

జరిగిందా?

(కలుద్దాం)

Exit mobile version