Site icon Sanchika

యువభారతి వారి ‘విజయానికి అభయం’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

విజయానికి అభయం

“బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాం

అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్”

[dropcap]యు[/dropcap]వభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ – ఇతిహాసాలైన రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలే కాక, ప్రాచీన కావ్యాలు, నాటకాల మీద కూడా ప్రముఖుల చేత ఉపన్యాసాలనిప్పించి, వారి ఉపన్యాసాలను పుస్తకాలుగా ప్రచురించి అందరికీ అందుబాటులో ఉంచుతోంది. అంతే కాక, మారుతున్న కాలాలకు అనుగుణంగా నేటి యువతకు అవసరమైన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను కూడా దీక్షతో చేపడుతోంది.

అమూల్యమైన జీవితాన్ని ఉన్నతశిఖరాలకు చేర్చడానికి కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకునే సన్నాహాలూ చేయాలి.  ఆ ప్రయత్నంలో, సకృత్తుగా ఆటంకాలెదురైనా, సడలిపోకుండా, ముందడుగుతో సాగిపోవాలి. అప్పుడే అభయవిజయం వరిస్తుంది. అట్టి యోగానికి బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయం, ఆరోగ్యం, వాక్పటుత్వం, ప్రయత్నం (చైతన్యం) అనే సాయుధ గణ గుణాలను ఆసరాగా చేసుకుంటే, అన్నివైపులా గెలుపు మనదే.  యువభారతి 177 వ ప్రచురణ ‘విజయానికి అభయం’ ప్రధాన ఉద్దేశం అదే.

ఈనాటి మన యువతను గమనిస్తే, ఒకవైపు వయస్సుకు మించిన అద్భుతాలను సాధిస్తూ, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ, ఉల్లాసంతో ఉద్యమిస్తూ, విజయపథంలో దూసుకెళ్తున్న వారెందరో ఉన్నారు. మరో వంక, తమ ప్రయత్నాలకు తగిన ఫలితం లభించడం లేదన్న భావనతో, ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియడం లేదని అనుకుంటున్నా వారూ (కొంచెం ఎక్కువ శాతం లోనే) కనిపిస్తారు. ఈ రెండవ కోవకు చెందిన వారికి స్ఫూర్తి నిచ్చేందుకు ఉద్దేశించబడింది ఈ చిన్న పుస్తకం.

బుద్ధి: మన ప్రవర్తన మన బుద్ధిని అనుసరించి ఉంటుంది. బుద్ధి మంచిదైతే ప్రవర్తన కూడా మంచిదై ఉంటుంది. మనస్సుకు కలిగిన సంశయాలను బుద్ధి పరిష్కరిస్తుంది.

బలం: ఎవరు ఏ పనిని చేయాలన్నా, అందుకు తగిన బలం వారికి ఉండాలి. అవసరమైన బలం చేయాల్సిన పనినిబట్టి మారుతూ ఉంటుంది.

యశస్సు: ఈ పదానికి మిగతా అర్థాలతో పాటు కీర్తి, మహాత్మ్యం, ప్రతాపం, జ్ఞానం అనే అర్థాలు ఉన్నాయి. విజయాన్ని లక్ష్యంగా చేసుకుని, ఆ దిశలో కృషి చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దృష్టి లక్ష్యంపై ఉండాలిగాని, కీర్తిపై ఉండరాదు.

ధైర్యం, నిర్భయం: పసితనం వల్ల, అమాయకత్వం వల్ల, అనుభవం లేనందు వల్ల, సహజంగానే భయం ఉంటుంది. భయాన్ని మించిన అభివృద్ధి నిరోధకం మరొకటి ఉండదు. రాను రాను భయాన్ని వదలి నిర్భయత్వాన్ని అలవాటు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి.

ఆరోగ్యం: ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనైనా సాధించడం సాధ్యమౌతుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న వారు లక్ష్య సాధనమీద గురి పెట్టలేరు. శారీరక బాధల కారణంగా శ్రమ చేయడం అసాధ్యం ఔతుంది.

వాక్పటుత్వం: మన భావాలను ఇతరులకు తెలియజేయడం, వారి భావాలను అర్థం చేసుకుని, తగిన విధంగా ప్రతిస్పందించడం అవసరం. మన నోటి నుండి వెలువడే మాట సరియైనదిగా ఉందో లేదో నిరంతరం సరిచూసుకోవాలి. చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి.

ప్రయత్నం: మనకంటూ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రయత్నం చేయాలి. సరైన సిద్ధాంతం లేని లక్ష్యం వృథా. అలాగే దాన్ని చేరుకునే గమనం గూడా గొప్పగా ఉండాలి. అందుకు నిరంతరం కష్టపడాలి.

శ్రీ గంధం నారాయణ గారు పైన చెప్పబడ్డ ఒక్కొక్క అంశాన్నీ తీసుకుని, ఆసక్తిదాయకంగా విశ్లేషిస్తూ, వివరిస్తూ, యువతకు ప్రబోధాత్మకంగా ఈ రచనను మలిచారు. రామాయణం లోని హనుమ పాత్రనూ, వివిధ సన్నివేశాలలో హనుమ వ్యవహార సరళినీ మనముందు ఉంచుతూ, వ్యక్తిత్వ వికాసానికి అందులోనుండి గ్రహించవలసిన ఉదాత్త గుణ సంపద గురించి గుర్తింప చేశారు.

మీ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన సాధన సంపత్తిని చేకూర్చుకోవాలనుకుంటే,  ఈ క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి పుస్తకాన్ని ఉచితంగానే చదువుకుని, ఆచరించడానికి ప్రయత్నించండి.

https://archive.org/details/VijayanikiAbhayam_AssuranceForSuccess/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version