[1973 నాటి ‘వికాసలహరి’ పుస్తకానికి శ్రీ వంగపల్లి విశ్వనాథం వ్రాసిన ముందుమాటను పాఠకులకు అందిస్తున్నాము.]
(తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువ భారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఇకపై ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.)
ప్రేరణ
“ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట యెంతో దుష్కరము సుమ్ము”
[dropcap]బ[/dropcap]హుశః ఏ కొద్దిపాటిపాటినో మినహాయిస్తే, చెప్పుకోదగ్గ ధ్యేయాలు- అనేవాటికి పరిమితం చేస్తే, “ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము”- లోని నిజం – స్పష్టంగా అవతరిస్తుంది. అసలు – ఆలోచన కలగడమే కష్టం. ఏ ప్రేరణ వల్లనో – ఆ ఆలోచన కలుగుతుంది. కలిగిన ఆలోచన స్పష్టంగా రూపుకట్టడం మరీ కష్టం. రూపుకట్టిన ఆలోచనకు – మాటల రూపంలో సరైన ఆకృతినిచ్చి – ఆ ఆకృతిని నిలపగలగడం ఇంకా కష్టం. ఆలోచనలో లీలగా మెదిలిన ఆకృతికి – అక్షరాకృతి కల్పించి – నలుగురి ఎదుట ఆవిష్కరించి – నచ్చచెప్పగలగడం కష్టం తాను చేయబూనడం కష్టం. చెప్పి చేయీంచబూనడం మరీ కష్టం. మెదిలిన ఆలోచనలన్నీ – ఎక్కడో ఓచోట, ఈ వైకుంఠపాళిలో జారి పడిపోతాయి. మొదటికొస్తాయి; కొన్ని మొదలంటూ లేకుండా మాయమైపోతాయి. కార్యక్షేత్రంలో శ్రీకారానికి నోచుకునే భాగ్యం – ఏ కొద్ది ఆలోచనలకు మాత్రమే కలుగుతుంది. ఆ కురుక్షేత్రంలో – ఓటమి – గెలుపు, ఏ సూత్రాల బట్టి నిర్ణయింపబడుతుందో – ఆ సూత్రాలకు భాష్యాలు, ఆ భాష్యాలకు తాత్పర్యాలు ఏ మాత్సర్యాల కారణంగా మారుతుంటాయో – అదో పెద్ద భారతం. శ్రీకార భాగ్యానికి నోచుకున్న ఆలోచన – ఏ శ్రీరామరక్ష కారణంగానో తప్ప – సాధ్యపడటం కష్టం. అందుకే..”ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము” గాలిబ్ గట్టిమాటే చెప్పాడు.
అనుభవమున్న వాళ్ళకు – కనీసం ఆలోచన ఉన్నవాళ్ళకు తెలుస్తుంది. ధ్యేయాన్ని నిర్ణయించడం – నిర్ణయించిన ధ్యేయాన్ని సాధించడంలోని కష్టనష్టాలు. ఆలోచనలకు అవకాశమిస్తే – అవకాశాలకు ప్రోత్సాహం లభిస్తే – కృషి వికసిస్తుంది. కానీ, అన్ని సందర్భాలలోనూ, అనేక ఆలోచనలు ఈ అదృష్టాన్ని నోచుకోవు.
ఏ కొందరు మహనీయుల ఆలోచనల కారణంగానో, కృషి ఫలితంగానో, ఈనాడు మనం ఎన్నింటినో ఆనందిస్తున్నాం. అనుభవిస్తున్నాం. కష్టంతో సాధ్యమైన దానిలో కష్టాన్ని విస్మరించిన సందర్భాలే ఎక్కువ. ఆ కష్టం- గుర్తింపబడక పోవడం వల్ల – మరింకింత మంచి కృషికి ప్రేరణ కావలసింది, మత్తుగా మట్టిలో కూరుకుపోతోంది. అందుకే – గతంలోని మంచిని గమనించడం అవసరం. అది పునాది. పునాదులు లేని కట్టడాలు, ఏపాటి నిలుస్తాయి. గతంలో కాపురం చెయ్యమని కాదు, భావం. గతంలోని మంచిని గమనించగలిగినప్పుడు – వర్తమానం విస్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడే, భవిష్యత్తును ఊహించగల్గడం, బాధ్యతలను నిర్వర్తించడానికి సరైన పద్ధతిలో పూనుకోవడం సాధ్యమౌతుంది. ఈ విషయం గురించి – సమగ్రమైన అవగాహన, సమ్యక్ దృష్టి ఏర్పడినప్పుడే – జాతిలో, వికాసవీచికలు వెల్లివిరుస్తాయని యువభారతి విశ్వాసం.
అందుకనే – యువభారతి కార్యక్రమాలు తప్పుదారిబట్టిస్తున్నాయని విమర్శించే సహృదయులకు, నమస్కరించి, ఈ సమగ్ర అవగాహన, ఈ సమ్యక్ దృష్టి కల్పించడం జాతి చైతన్య వికసనానికి అవసరమని, మా కృషిని కొనసాగిస్తున్నాం.
ఆలోచనల్లో నిర్మాణాత్మక దృక్పథం ఉండాలనీ – సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలనీ – ఈ ధ్యేయ సాధనకు, సాహిత్యం కంటే ఇతరమైన సాత్విక సాధనం లేదనే విశ్వాసంతో – యువభారతి, ఇతోధిక కార్యక్రమాలను రూపొందించి కృషి చేస్తున్నది.
ప్రతిక్షణం – ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము అని గుర్తుకువస్తూ ఉంటుంది.
మనిషి మనిషిగా, మర్యాదగా బ్రతికేందుకు అవసరమైన వాతావరణం సృష్టింపబడాలనీ – కనీస విలువలపై నమ్మిక, మానవతామర్యాదలపై విశ్వాసం చోటుచేసుకోని చోట, అలాంటి వాతావరణం ఏర్పడటం కష్టమనీ మా నమ్మిక. అనువైన అవకాశాలను కల్పించి, అలాంటి కృషికి దోహదం చేయడం సమిష్టిగా సమాజం బాధ్యత – సమాజంలోని, అనేక సంఘాల బాధ్యతగా యువభారతి గుర్తిస్తున్నది. ఆలోచనాపరులైన మేధావులు – తమ కర్తవ్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అని విస్తుపోతున్నారు. అధిక సంఖ్యాకులు ఎందుకిలా స్తబ్ధ స్థితికి తలలొగ్గి – ఊర్కుండిపోతున్నారో అని, విచారిస్తున్నది. రాజకీయాల, ఇజాల నిజానిజాల ముసుగుల ఆవల – కావలసినదాన్ని గమనించి, కార్యక్రమాన్ని నిర్ణయించి, సంఘటితంగా మెలిగి, మంచిని సాధించబూనడం అందరి బాధ్యత అనీ – కనీసం అక్షరాస్యులైనవారి బాధ్యత అనీ మా విశ్వాసం. ఈ మేరకు సక్రమమైన ఆలోచనా పద్ధతినీ, నిర్మాణాత్మక దృక్పథాన్నీ కలిగించే ధ్యేయంతోనే, యువభారతి కృషిచేస్తున్నది. చైతన్యవంతమైన ధ్యేయసాధనా సంరంభాన్ని జడమైన అచ్చుసిరా ద్వారా అందించబూనడం కష్టం. మా కృషి వెనుకనున్న ఆలోచనల స్వరూపాన్ని, సహృదయులు పోల్చుకోగలరనీ – తమ మనస్ఫూర్తి సహాయసహకారాలు అందించగలరనీ ఆశిస్తున్నాము.
ఏ ముహూర్తబలాన గిరీశం అన్నాడో – “మనవాళ్ళు ఉట్టి..” అని. ఆ మాట వమ్ము చేద్దామని మా పట్టుదల. “మంచిపనులు చవకగానే చేయవచ్చు” అని నిరూపించాలని మా ధ్యేయం. అనేక సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి అధికోత్పత్తివల్ల కలిగే లాభాలను, ప్రజాసామాన్యంలోకి, చౌకగా తీసుకురాగలుగుతుండగా – ఎందుకోమరి, అక్షరాస్యుడైనవాడికి, చౌకగా ఉత్తమసాహిత్యం అందించే విషయంలో మాత్రం – ఇది ఇంతవరకు సాధ్యపడలేదు. ఏం కారణమో, ఎవరు అడ్డుకుంటున్నారో – తెలియడం లేదు. అచ్చుపోసిన అక్షరాల ద్వారా, ఆలోచనలను వెదజల్ల వచ్చుననీ – ఆ ఆలోచనలే ఉత్తేజాన్ని కల్గించి కార్యోన్ముఖుల్ని చేయగలవనీ – గుర్తించడం అవసరం. ప్రజాస్వామ్యం విలువలు పదికాలాలపాటు పదిలంగా కాపాడబడటానికి – అధిక జనావళి ఆలోచనాశూన్యత ప్రాతిపదిక కాకూడదనీ, ఈ అజ్ఞానాంధకారాన్ని ఛేదించడానికి అచ్చుయంత్రాన్ని విరివిగా వాడటంలోని లాభాలను అందరికీ అందుబాటులోకి తేవాలనీ, మా ఆశయం.
అచ్చు ఆదరణను నోచుకోనప్పుడు కృషి స్తంభిస్తుంది. ఆలోచనే ఆదరణను నోచుకోదు. మానవతా మర్యాదల మీద ఏమాత్రం నమ్మకమున్న సమాజమైనా, ప్రగతిని వాంఛిస్తున్న ఏ జాతిఐనా చూస్తూ చూస్తూ స్తబ్దతను ఆమోదించదు. అందుకే ఆలోచన అందరికీ అందుబాటులో ఉండాలనీ – అందరూ ఆలోచించాలనీ – అందుకు దోహదంగా అచ్చుయంత్రాన్ని వీలైనంగా ఎక్కువగా వాడుకోవడం అవసరమనీ, గుర్తించడం ఎంతైనా అవసరం.
వాణిజ్య నాడి తెలిపిన విషయాలను, జాతి సాహిత్యపరమైన అవసరాలకు అనుసంధించడం ద్వారా – సమగ్ర వ్యక్తిత్వ నిర్మణానికి అవసరమైన నిర్మాణాత్మక ఆలోచనా సరళిని సృష్టించగలిగే సాహిత్యాన్ని – వీలైనంత ఎక్కువమందికి, వీలైనంత తక్కువ వెలకు అందించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకు నారుపోసే ప్రతిభా సౌమనస్యాలు జనావళిలో ఇతోధికంగా పెరగడానికి తోడ్పడగలమని మా “యువభారతీయు”ల విశ్వాసం.
ప్రచురణ పూర్వ విరాళాల పద్ధతిని, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి, వేలకొద్దీ సంఖ్యలో ప్రతులను అందంగా ముద్రించి విజయవంతంగా అందించాం. మా కృషిలోని ఔచిత్యాన్ని, అవసరాన్ని గమనించి, కొందరు సహృదయులు ముందుకువచ్చి సాయం చేశారు. ఇలా కృషి జరుగుతున్న విషయం మరింత విస్తారంగా తెలియాలనీ – ఈ కృషిలో పాలుపంచుకునే మిత్రులకోసం, ఈ సాహిత్యోద్యమ నిర్వహణలో బరువు బాధ్యతలు పంచుకునే సహృదయుల సహకారం కోసం – రూపొందించిన పథకం సాహితీ మిత్ర. పుస్తకాలు కొని చదవడం అలవాటు చేయాలని మా కృషి. సాహితీ మిత్రుల సంఖ్య – ఈనాటికి దాదాపు 5,000. ఇది పదింతలుగా పెరగాలనీ, ఈ పరిచయాలు వృద్ధిపొంది, ఈ కృషి విస్తరిల్లాలనీ ఆశిస్తున్నాం.
యువభారతి సాగిస్తున్న కృషి – సాధిస్తున్న ఫలితాలు, అనంతమైన అవసరాల దృష్ట్యా – స్వల్పమైనవే. కష్టాలు ఇబ్బందులు అనల్పమైనవే. ఐనా – ఈ కృషి సాగించడంలోని ఔచిత్యం దృష్ట్యా, యువభారతి సుస్థిర భవిష్యత్తుకు పటిష్టమైన ఏర్పాట్లు జరగాలని, నిధిసేకరణ ధ్యేయంతో కృషిని సహృదయులు పోల్చుకోగలరనీ, ధ్యేయసాధనలో సహకరిస్తారనీ ఆశిస్తున్నాం.
పాతికేళ్ళ స్వతంత్ర జీవనం గడిపిన జాతి, సాధించిన ప్రగతి – ప్రోత్సాహజనకంగా లేదు. వివిధ రంగాల్లో, సమర్థవంతమైన నాయకత్వం ఉబికి రాలేదు. ఇది వాస్తవం. స్పందనలేని స్తబ్ధ వాతావరణం ఆవరించుకొని ఉంది. అందుకే చుట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని తిట్టుకుంటూ ఊరికే కూర్చోవడం కంటె, ప్రయత్నించి ఎంత చిన్నదీపాన్నైనా వెలిగించడం మంచిదన్న మా విశ్వాసంతో, ఉడుతాభక్తితో ప్రయత్నిస్తున్నాం.
అభిలాష, అభిమానం, కృషికి ప్రేరణను కల్పించగలవని భావిస్తున్నాం. అభిమానం అవసరం. విఱ్ఱవీగే స్థితికి చేరి, విపరీతమైన దురభిమానంగా పరిణమించకూడదు. అభిమానం ఏ మూలైనా ఏ కాస్తయినా, మెదలనిదే, అసలు పనులు సాగవు. ఆలోచనలు పారవు. తెలుగువాళ్ళం – ఎవరికీ, ఎందులోనూ తీసిపోమనీ, తీసిపోకూడదనీ పట్టుదల కలిగించగలుగుతే తెలుగుజాతి సగర్వంగా తలెత్తుకు తిరిగేలా కృషి జరగడానికి అంకురార్పణ చేసిన వాళ్ళమౌతాము. ఈ అభిమానం కలిగించడానికి, సాహిత్యాభిమానం కలిగించడం అవసరమన్న ధ్యేయంతో – యువభారతి పెద్దఎత్తున, లహరి పరంపరలో ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. తెలుగువాళ్ళ సాహిత్య సభలకు సైతం, సహస్రాధిక సంఖ్యలో సహృదయులైన సభికులు హాజరౌతారని నిరూపించగలిగింది. క్రమశిక్షణతో, దీక్షతో కృషి చేయడంలో ప్రయోజనవంతమైన ప్రయోగ ఫలితాలను సాధించగలిగింది. సాహిత్యం సమాజాన్ని చైతన్యలహరిగా పొంగులెత్తించాలని, సమాజ భవితవ్యం వికాసలహరిగా వినూత్న శోభనలతో వెల్లివిరియాలనీ, యువభారతి సాహిత్యసభలను తెలుగువారి తియ్యని పండుగలుగా పండించాలని యత్నిస్తున్నాం.
భాగవత పద్యాలతో పరిచయం, తెలుగుభాషా సౌందర్యంతో పరిచయం. పోతన్న పద్యాలు ఏదైనా నోటికి రాకుంటే, తెలుగుతనం ప్రకటించుకోవటం కష్టం. సాహిత్యాభిమానం కల్పించాలన్న లక్ష్యంతో, పుస్తకాలు కొని చదివే అలవాటు కలిగించాలన్న ధ్యేయంతో పోతన పద్యాలలో కొన్నింటిని, డా.సి. నారాయణరెడ్డి గారి మకరంద వ్యాఖ్యానాన్ని జతచేసి, ఒక్కరూపాయికే ‘మందార మకరందాలు’ అందిస్తున్నాం. సాహితీ వాహినిలో మొదటి తరంగంగా వెలువడిన మందార మకరందాలు, ప్రతి తెలుగింటిలో వెలుగులు విరజిమ్మాలనీ – కనీసం లక్షప్రతులైనా అందించాలనీ సంకల్పించి ప్రచురించిన మొదటి ముద్రణప్రతులు 25,000. ఐదువారాలలో చెల్లిపోయాయి. ఈ డిసెంబరు 2వ తేదీ నాడు, రెండవ ముద్రణ వెలువడుతోంది. సాహితీవాహినిలో రెండవ తరంగంగా, రానున్న ఆనంద ఉగాదికి. రసార్ద్రమైన ఆరుద్ర వ్యాఖ్యతో వేమన్న వేదం వెలువడుతోంది. ‘సాహితీవాహిని’ని ద్వైమాసపత్రికగా వెలువరించడానికి కాక, విశ్వసాహిత్యంతో కూడా పరిచయం కలిగించాలనీ, సాహిత్యపరమైన విషయాలేకాక, సాంస్కృతిక విజ్ఞాన విషయాలను సైతం అందించాలనీ సంకల్పిస్తున్నాం. ప్రయోగ ఫలితాల ఆధారంగా తెలుగులో రీడర్స్ డైజెస్ట్ లాంటి పత్రికను వెలువరించి తెలుగు సారస్వత సేవ చేయాలని సంకల్పం. ఒక్కరూపాయికే ఈ తరంగాలను అందించాలన్న మా ప్రయత్నంలోని సహృదయాన్ని సాహిత్యాభిమానులు పోల్చుకోగలరనీ, ఆదరిస్తారనీ, ఆశిస్తున్నాం.
సమకాలీన సారస్వత ప్రక్రియలను సమన్వయ దృక్పథంతో సమీక్షించడం, సమాజంలో రచయిత నిర్వహించవలసిన పాత్రను, ప్రపంచ భావపరిణామంలో యువత వహిస్తున్న పాత్రను, వివిధ దృక్కోణాలతో వివేచించడం – అన్న అంశాలపై, యువభారతి – ’రచన’, ‘మహతి’ విజయవంతంగా నిర్వహించి, వ్యాస సంకలనాలను ప్రచురించింది. ’యువత’ గోష్ఠి – అభిప్రాయ సేకరణ – వ్యాస సంకలనం ప్రచురణలను తలపెట్టింది.
భారత రజతోత్సవ ప్రచురణగా – 34 ఇంగ్లీషు వ్యాసాల సంకలనం Free India Forges Ahead ను ప్రచురించింది. తెలుగు నవల విశిష్టతను చాటిచెప్పేందుకు, వేయిపడగలు మొదలుకొని ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన 22 నవలలను భాషేతరులకు పరిచయం చేద్దామన్న సంకల్పంతో Telugu Novel ప్రచురణను ఇంగ్లీషులో వెలువరించనున్నది.
వికాసలహరి
ముకుళించిన మొగ్గలు ముగ్దమోహనంగా వికసించటం వికాసం. సుప్తచైతన్యం ప్రతిభోన్మీలనంగా ప్రగతివీచికలను ప్రసరిస్తూ ప్రస్ఫుటం కావటం వికాసం. ఆంధ్ర సాహిత్యనందనంలో కావ్యవచస్సులను, కవితాపయస్సులను, కల్పనారోచిస్సులను, సంస్కరణోద్యమ ఉషస్సులను, అవధానకళాయశస్సులను వినూత్నశోభలతో వెల్లివిరియించిన వికాసమూర్తుల సాహిత్య సేవాసమీక్ష ‘వికాసలహరి’.
గాసటబీసటగా గాథలల్లుకొనే తెలుగుజాతికి మహాకావ్యదక్షమైన పదవిద్యను ప్రసాదించిన ప్రథమాంధ్రమహాకవి నన్నయభట్టారకుడు, తెలుగు ప్రజాజీవితాన్ని భక్తిభావబంధురమైన భాగవత కవిత్వంతో పరవశింపజేసిన సహజపాండితీమంతుడు బమ్మెరపోతనామాత్యుడు, అపూర్వకథాకల్పనామహనీయ ప్రతిభతో ప్రబంధజగత్తులో మరో ప్రపంచాన్ని సృష్టించిన సాహిత్యకళాప్రపూర్ణుడు పింగళిసూరనామాత్యుడు, నవ్యాంధ్రసాహిత్యపితామహుడు, గద్యతికన, సారస్వతాన్ని సాంఘిక సంస్కరణాని కుపకరణంగా మలచుకొన్న మహామనీషి మానవతామూర్తి కందుకూరి వీరేశలింగంపంతులు: తెలుగు కవిత్వానికి రాజాస్థానపు రాణీవాసాన్ని తొలగించి అవధాన సభారంగం కల్పించి పండితపామరజనరంజకంగా భారతిని పూలపల్లకిలలో ఊరేగించిన అద్యతనాంధ్ర కవిప్రపంచనిర్మాతలు తిరుపతి వేంకటకవులు – వికాసలహరికై ఎన్నిక చేయబడిన కవితామహితాత్ములు.
ఆంధ్రమహాభారత కావ్యావతరణం నుండి అవధానకవితావిస్తరణం వరకు ఆంధ్రసాహిత్యనందనంలో ప్రసరించిన ప్రతిభాసౌగంధ్యలహరి ’వికాసలహరి’.
లహరి పరంపరలో, మూడవదిగా వికాసలహరిని తెలుగు సాహిత్యానికి కానుకగా సమర్పిస్తున్నాం. రానున్న 1974లో ప్రతిభాలహరి పేరిట కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతిభాలహరికై ఎన్నికైన ప్రతిభామూర్తులు కవి సార్వభౌమ శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, పానుగంటి లక్ష్మీ
నరసింహారావు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ. ఈ లహరి పరంపర ఉపన్యాసాలను తెలుసు సోదరులు ఇంకా ఎక్కువగా ఆదరిస్తారనీ, అధిక సంఖ్యలో సాహితీమిత్రులుగా భారతీమిత్రులుగ, భారతీభూషణులుగా చేరి, ఈ కృషి కొనసాగించడానికి దోహదం చేస్తారని ఆశిస్తున్నాము.
మా అనుభవం ఆసరాగా, సోదరసాహితీసంస్థలు కొన్ని ప్రచురణపూర్వ విరళాలపై పద్ధతిగా ప్రచురణలను వెలువరించేందుకు పూనుకోవడం, మాకు ఆనందదాయకంగా ఉంది. మా ప్రయోగానుభవాలు పదిమందికీ ఉపయోగపడి, మరింత విసృత ప్రాతిపదికపై కృషి జరగాలనే మేము కోరుతున్నాము.
పెరుగుతున్న ధరలు – తెల్లకాగితం నుంచి, అచ్చుఖర్చు వరకూ, అన్నీ చికాకు కలిగిస్తున్నాయి. ప్రభుత్వవర్గాల వారు మరీ పెళ్ళినడక నడుస్తారు. దట్టంగా అలుముకున్న ఉపేక్షాభావం అడుగడుగునా కనిపిస్తుంది. ఉత్సాహం నీరుకారిపోయిన సందర్భాలే అనుభవంలోకి వస్తూండడం వల్ల, ఈసారి ప్రభుత్వ సహాయాన్ని అర్థించనేలేదు. ప్రజల ఆదరాభిమానాలే పెట్టుబడిగా సాగిస్తున్న కృషిలో – ఆశించిన మేరకు ప్రోత్సాహం లభించనందువల్ల ఏర్పడే చిక్కులు, మా పట్టుదలను పెంచుతున్నాయనే నివేదిస్తున్నాము. మా వేదనను, ఆవేదనను, త్వరలో పోల్చుకూంటారనీ తెలుగులోకం అర్థం చేసుకొని ఆదరిస్తుందనీ ఆశిస్తున్నాము.
యువభారతి వ్యాపార సంస్థ కాదు. తీరిక సమయాన్ని సాహితీసేవకు వినియోగించి, తద్వారా జాతి వికసనానికి తోడ్పడాలన్నదే మా ధ్యేయం. మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యత్నంలో – 25,000 ప్రతులు వేయగలుగుతే బావుంటుందని ఆశించాం. లహరి పరంపర – 10,000 సంఖ్యను దాటగలుగుతోంది. 25,000 లక్ష్యాన్ని అందుకోడానికి, సహృదయులైన ప్రజానీకం తమ సహకారాన్ని అందించగలరని ఆశిస్తున్నాం. “వికాసలహరి”ని అందుకుంటున్న సహృదయులందరూ, సాహితీమిత్రులుగా చేరుతారనీ, మీ మిత్రులందరికీ ఈ కృషిని పరిచయం చేయడం ద్వారా, మిత్రుల సంఖ్య సహస్రాధికంగా పెరగడానికి తోడ్పడగలుగుతారనీ, ’లహరి’ పరంపరను ఆదరించగలరనీ ఆకాంక్షిస్తున్నాము.
ఇది యువభారతికి సాహితీ చైతన్యంలో పదోవసంతం. ఈ సంవత్సరంలో, మూడుపుస్తకాలను పునర్ముద్రించడం, తొమ్మిది పుస్తకాలను ప్రచురించడం జరిగింది. తెలుగుతల్లికి మరిన్ని మణిహారాలను సమర్పించాలన్న మా ప్రయత్నాలకు, అందరి ఆదరణా, మనఃపూర్వక సహకారమూ అందగలవన్న ఆశతో, నిరీక్షణతో..
వంగపల్లి విశ్వనాథం
సమావేశకర్త
2-12-1973