[dropcap]”ర[/dropcap]వీ…” అంటూ బయటినుంచి పిలిచాడు రాజశేఖర్.
“ఎవరూ..?” అంటూ బయటికి వచ్చి “ఓ నువ్వా! రాజశేఖర్…. రా లోపలికి రా బాబూ” అన్నారు రవి అమ్మగారు. లోనికి దారి చూపిస్తూ, “బయటికెళ్లాడు బాబు, కూర్చో వస్తాడు” అన్నారు.
“సరేనండీ.” అని కుర్చీలో కూర్చున్నాడు రాజశేఖర్.
కాసేపటికి టీ తీసుకుని వచ్చాడు పని అబ్బాయి.
టీ తాగి, ఏం చేయాలో తెలియక అటూ ఇటూ చూస్తూ అలాగే కూర్చున్నాడు రాజశేఖర్.
కాసేపట్లో లోపల్నుంచి రవి చెల్లెలు, రాణి, వచ్చి రాజశేఖర్‌ను చూసి, ముభావంగా తిరిగి లోపలికి వెళ్ళిపోయింది.
రాణి ఎవరితో మాట్లాడకుండా, ఎప్పుడూ సీరియస్‌గా ఆలోచిస్తూ కూర్చోవడం గమనించాడు రాజశేఖర్. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది.
“రవి స్నేహితుడు వచ్చాడు, ఒక్కడే కూర్చున్నాడు, ఏదైనా వారపత్రిక ఇవ్వు, లేదా ఏదైనా మాట్లాడించు” అన్నారు రవి అమ్మ, రాణి వేపు చూసి.
“సరే..!” నంటూ రాజశేఖర్ కూర్చున్న హాల్ లోకి వెళ్ళింది రాణి.
“అదేమిటి, ఒక్కరే కూర్చున్నారు?” అంటూ కాస్త మెల్లిగా ప్రశ్నించింది రాజశేఖర్‌ను ఉద్దేశించి.
“రవి బయటికి వెళ్లాడట, వస్తాడని చెప్పారు అమ్మ, అందుకే వెయిట్ చేస్తున్నాను” అన్నాడు ఆమె కళ్ళల్లోకి చుస్తూ.
“డిగ్రీ అయిపోయింది కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు?” అంటూ వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంది రాణి.
“బ్యాంకు ఉద్యోగాల గురించి ప్రయత్నిస్తూ వున్నానండి” అన్నాడు చిన్న చిరునవ్వు నవ్వి,
ఆమె ముఖంలోకి చూస్తూ “మీరు ఏ కాలేజీలో చదివారు” అని అడిగాడు రాజశేఖర్ సంభాషణ పొడిగించటానికి.
“లయోలా కాలేజీ అండీ” అని చెప్పింది రాణి.
“అది చాలా మంచి కాలేజీ కదా! పైగా అక్కడ కో-ఎడ్యుకేషన్ కూడానూ, అంతేకాకుండా… కాలేజీ వాతావరణం కూడా చాలా బాగుంటుంది.” అన్నాడు ఉత్సాహంగా ముందుకు జరిగి.
అది వినగానే రాణి కళ్ళలో మెరుపులు మెరిసాయి, సంతోషంతో ఆమె మొహం కుసుమంలా వికసించింది.
“అవునండి… మంచి జీవితం…. మూడు సంవత్సరాలు… నాకు తెలియకుండా గడిచిపోయింది అక్కడ” అని నిట్టూర్చింది.
“మా కాలేజీ కూడా కో-ఎడ్యుకేషన్ నండి, చాలా సరదాగా… గమ్మత్తుగా ఉండేది. అమ్మాయిలతో అన్నింటిలోనూ పోటీలు,… గొడవలు ఎవరూ ఊహించని విధంగా స్నేహం,….కొందరికి అది ప్రేమగా మారటం గమ్మత్తుగా ఉండేది. మా దగ్గర కెమిస్ట్రీ లెక్చరర్ చాలా స్మార్ట్‌గా ఉండేవారు. మా బ్యాచ్‌లో లక్ష్మి అనే అమ్మాయి, కాలేజీ పూర్తయిన తర్వాత ఆయన్నే వివాహం చేసుకుంది.” అని రాజశేఖర్ చెప్పేసరికి విని పకపకా నవ్వేసింది రాణి.
రాణి మొదటిసారిగా అలా నవ్వటం చూసి ఆశ్చర్య పోయాడు. కాసేపటికి తేరుకుని “మీరు స్పోర్ట్స్, గేమ్స్ బాగా ఆడేవారు అనుకుంటాను.” అన్నాడు రాజశేఖర్ పొడవాటి ఆమె జడను చూస్తూ.
“మీకు… ఎలా తెలుసు?” అంది ఆమె నవ్వుతూ, ఆ జడను ముందు వేపుకు వేసుకుని వెనక్కు వొరుగుతూ..
“మీ పర్సనాలిటీ చూస్తే తెలుస్తుందిగా, ఎవరూ చెప్పాల్సిన పని లేదు” అన్నాడు, ఆమెను పరిశీలనగా చూస్తూ
“అవును. నేను వాలీబాల్ ప్లేయర్‌ని” అని గర్వంతో ఆమె చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో మళ్లీ వింత మెరుపులు మెరిసాయి.
వాళ్లిద్దరూ చాలాసేపు అలా కాలేజీ విశేషాలు చెప్పుకుంటూ గడిపేశారు.
“భోజనం సమయం అయింది, మీరు ఇక్కడే భోజనం చేసేయండి” అంది రాణి.
“అబ్బే వద్దండి. థాంక్స్… నేను ఇంటికి వెళతాను” అన్నాడు మొహమాటంగా. నిజానికి బాగా ఆకలితో నీరసంగా వుంది రాజశేఖర్‌కు.
“పర్వాలేదు ఇక్కడే తినాలి” అంటూ లేచి వెళ్లి కాసేపట్లో “రాజశేఖర్! రండి” అంటూ పిలిచింది రాణి.
ఇద్దరూ సరదాగా కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. రాజశేఖర్ భోజనం చేస్తున్నవిధానం చూసి అతను చాలా ఆకలి మీద ఉన్నట్టుగా గమనించింది రాణి. భోజనం అయిన తర్వాత, ఎంతసేపు కూర్చున్నా రవి రాకపోవడం చూసి “ఇంక నేను వెళ్ళొస్తానండి” అంటూ లేచాడు రాజశేఖర్.
“ఇంకాసేపు కూర్చొని చూడండి, వస్తాడేమో?”అంది రాణి.
“చాలా సేపు అయింది వచ్చి. ఇంక బయలుదేరుతాను. వీలైతే మా ఇంటికి రమ్మని రవికి చెప్పండి” అంటూ లేచి నిలబడ్డాడు రాజశేఖర్.
“సరేనండి” అని, సెలవు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రాణి.
ఇంతలో రవి అమ్మగారు లోపల్నుంచి వచ్చి “ఏం చేస్తున్నావ్ బాబు నువ్వు ఇప్పుడు” అన్నారు.
“ఏమి లేదండి,ఇంకా ఉద్యోగ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రస్తుతం ఖాళీనే” అన్నాడు రాజశేఖర్.
“రాజశేఖర్! అయితే.. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు అబ్బాయి. చాలా రోజుల తర్వాత రాణి, ఇంత సంతోషంగా మాట్లాడడం చూస్తున్నాం. ముఖ్యంగా ఎన్నో సంబంధాలు మధ్యలోనే ఆగిపోయి, వచ్చిన మంచి సంబంధం కూడా ఈ మధ్యనే వాళ్లు విరమించుకోవడం మూలాన, తను ఇంకా డిప్రెషన్‌లో ఉంది బాబు. దాదాపు సంవత్సరం నుంచి అలాగే ఉంటోంది. రాణి నాన్నగారు చాలా విధాలుగా వెతుకుతున్నారు,కానీ ఏవి మంచి సంబంధాలు దొరకట్లేదు. మనకు మంచి అనిపించిన అబ్బాయి సంబంధం చూస్తే, వాళ్ళకి మన అమ్మాయి నచ్చటం లేదు. ఇదేమో ఒక సంవత్సరం నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంది గంట గంటకీ. ఇద్దరు సైకియాట్రిస్ట్స్‌కి కూడా చూపించాము. కానీ ఏమి లాభం కనపడలేదు.” తలవంచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది.
“పర్వాలేదండి,… అన్నిటికి దేవుడున్నాడు. నాకు వీలైనప్పుడల్లా నేను వస్తాను,.. నమస్కారం.” అంటూ బయలు దేరాడు రాజశేఖర్.
***
రవి వారం తర్వాత బ్యాంకులో పని చూసుకొని సాయంత్రం డ్యూటీ అయిపోగానే రాజశేఖర్ ఇంటికి వచ్చాడు.
రాజశేఖర్ ఇంట్లోకి అడుగుపెట్టి, వెంటనే “మా ఇంటికి వెళ్దాం, పద” అన్నాడు రవి.
“సరే వస్తున్నా, కూర్చో” అంటూ లోపలికి వెళ్ళాడు రాజశేఖర్.
ఇద్దరూ కలిసి రవి ఇంటికి వెళ్లి స్టడీ రూమ్‌లో కూర్చుని రాబోయే సివిల్ సర్వీసెస్ పరీక్షల గురించి, రాత్రి తొమ్మిది గంటల వరకూ మాట్లాడుతూ ఉండిపోయారు.
“నేను వస్తాను రవి” అంటూ పుస్తకాలు పక్కన పెట్టి లేచాడు రాజశేఖర్.
“సరే,… కానీ, భోజనం సమయం అయింది కదా, తినేసి వెళ్ళు” అన్నాడు రవి.
డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరూ కూర్చోగానే రాణి వచ్చి వడ్డించడం మొదలు పెట్టింది. రాణిని చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు రవి. చాలా నెలల తర్వాత సంతోషంగా మాట్లాడుతూ వాళ్ళ కబుర్లలో పాలుపంచుకుంది రాణి.
భోజనం పూర్తి అయ్యే సమయానికి, అమ్మగారు వచ్చి “కాస్త రోజూ ఉదయం మన ఇంటికి రమ్మని రాజశేఖర్‍కు చెప్పరా రవి.” అంది రాజశేఖర్ వైపు చూస్తూ.
రాజశేఖర్ వేపు చూసి అన్నాడు రవి, “ఉదయం వచ్చే రా… నా రూమ్‌లో కూర్చొని చదువుకో కావాలంటే, ఏమి పర్వాలేదు, అమ్మ రమ్మంటుందిగా… రా.” అన్నాడు చాలా మాములుగా చేతులు కడుక్కుంటూ.
“సరే వస్తా రా, గుడ్ నైట్” అని బయటకు వచ్చి ఇంటికి వెను తిరిగాడు.
అయితే, ప్రతి దినం నాకు రాను పోను పదహారు కిలోమీటర్ల నడక అని ఆలోచిస్తూ నవ్వుకొన్నాడు రాజశేఖర్.
అతని మనసుని తెలీని సంతోషం ఆవరించింది. మరుసటి రోజు రాణికి యేమేమి కబుర్లు చెప్పాలి, ఏ విషయాలు చర్చించాలి? అని ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనలతోనే ఇంటికి చేరాడు.
ఇంట్లోకి వెళ్లి చూస్తే అందరూ పడుకుని వున్నారు. “ఏం తిన్నారు?” అడిగాడు అమ్మను చూసి.
“ఏవీ లేవు, అందరూ అటుకులు హాయిగా తిన్నారు, పడుకున్నారు” అంది.
“ఎందుకలా?” అని కాస్త బాధగా అడిగాడు.
“ఏది? మీ నాన్న ఈ రోజంతా రాలేదు కదా” కాస్త నిరాశతో అంది అమ్మ.
“సరే అమ్మ. పడుకోండి” అంటూ బయట ఆవరణలో పడుకోడానికి చాప దిండు తీసుకుని వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు చాలా ఉత్సాహంగా రాణి ఇంటికి బయలుదేరాడు రాజశేఖర్. కాలినడకన రాణి ఇంటికి చేరుకోవటానికి ఒక గంట పైగానే పట్టింది.
టిఫిన్ తినకుండా బయల్దేరినందుకు, పైగా ఏడు కిలోమీటర్ల నడకతో ఎండలో, కాస్త నీరసంగా అనిపించినప్పటికీ, కాలేజీ విషయాలు మాట్లాడుకుంటూ దాదాపుగా రెండు గంటలు గడిపేసాడు రాజశేఖర్. ఆ రోజంతా రాణి మాట్లాడుతూ ఉంది. రాజశేఖర్ వింటూ కూర్చున్నాడు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్లయింది రాజశేఖర్‌కు.
ఆ రోజు రాణి మనసంతా అల్లకల్లోలంగా సముద్ర తరంగాల లాగ ఉప్పొంగుతోంది. రాజశేఖర సమక్షంలో గతమంతా మర్చిపోయి చాలా సంతోషంగా గడుపుతోంది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని,… సంబంధాలు రావటం లేదనే ఆలోచనలు రాణి మనసు నుంచి ఎటో వెళ్లి పోయాయి. అలా ఒక నెల రోజుల పాటు అరమరికలు లేకుండా మాట్లాడుకోవటం అలవాటైంది రాణి రాజశేఖర్లకు.
ప్రతి దినం మధ్యాహ్నం కలిసి భోజనం చేయడం రాత్రి కూడా అందరితో కలిసి తిని వెళ్లడం చేసాడు రాజశేఖర్. ప్రతీసారి రాజశేఖర్‌కు రాణి ప్రత్యేకంగా వడ్డించటం గమనించి నవ్వుకున్నాడు రవి.
ఒక రోజు ఇంట్లోకి వెళ్లేసరికి ఇంకా రాణి పూజ చేసుకుంటోంది. అది చూసి రవి గదిలోకి వెళ్లి పుస్తకాలు ముందు వేసుకుని కూర్చున్నాడు రాజశేఖర్. కొద్దీ సేపట్లో రాణి ఆ గదిలోకి అడుగు పెట్టింది.
“హలో గుడ్ మార్నింగ్! రాజు!!” అని ఉత్సాహంగా పలకరింపు విని తల తిప్పి రాణి కేసి చూసాడు రాజశేఖర్. తల వెంట్రుకలు వదులుగా వేసి, నుదుటన పెద్ద బొట్టు, పసుపు రంగు కాటన్ చీరలో, ఎప్పుడూ లేనంత కళతో కనిపించింది. కళ్ళార్పకుండా అలాగే చూసాడు.
“ఏంటి ఏదో ఆలోచనలో వున్నారు, మీకే… గుడ్ మార్నింగ్” అంది కిల కిల నవ్వుతూ.
ఆ మాటతో ఈ లోకం లోకి వచ్చిపడ్డాడు రాజశేఖర్.
“ఓకే, ఓకే.” అంటూ కంగారుగా లేచాడు.
“కూర్చోండి.. ఏంటా పేపర్స్?” అంది ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ.
“గ్రూప్ టు పరీక్షలకు అప్లికేషన్స్.. అన్నట్లు మీరు కూడా వ్రాయచ్చుగా?” అంటూ ప్రశ్నార్థకంగా చూసాడు.
“అబ్బే నాకెందుకండి” అంది తేలికగా తీసేస్తూ.
“అలా అనకండి.. మీరు వ్రాస్తే తప్పేంటి?” అని ఒక పేపర్ రాణి ముందు పెట్టి “పూర్తి చేయండి.. ఇప్పుడే పోస్ట్ చేసేద్దాం” అన్నాడు రాజశేఖర్.
కాసేపు తదేకంగా రాజశేఖర్‍ను కళ్ళార్పకుండా చూసి “సరే, కానీ విజయం సాదిస్తానన్న నమ్మకం లేదు” అంది తల కిందకు వాల్చి, వ్రాయటం మొదలు పెట్టింది రాణి.
ఎప్పటిలాగే రవి ఇంట్లో, రాత్రి భోజనం చేసి తన ఇంటికి చేరాడు రాజశేఖర్. ఇంట్లోకి వెళ్ళగానే కావేరి కొడుకుని చూసి అడిగింది. “ఏరా, భోంచేశావా” అని.
“చేశానమ్మా” సమాధానం చెప్పాడు.
“ప్రతీ రోజూ అక్కడ తినటం ఎందుకు?” ప్రశ్నించింది కాస్త బాధతో కావేరి.
“నే అలా చేస్తే… మనకు ఇంట్లో అందరికీ అన్నం కలిసి వస్తుంది, మీరందరు కడుపు నిండా తినచ్చు అమ్మా” అన్నాడు గుండెల్లో బాధను దాచుకుంటూ.
“ఇక పడుకో.. ఇలా రోజూ అంత దూరం వెళ్ళటం, రావటం… భోజనం గురించి అక్కర లేదు. వున్న నాల్గు మెతుకులు పంచుకుని తినచ్చు” అంది కావేరి కళ్ళల్లో నీళ్లను ఆపుకుంటూ.
“లేదమ్మా.. రవి నా స్నేహితుడు, వాడు అంత వున్న వాడైనప్పటికీ, నాతో స్నేహంగా ఎప్పుడూ ప్రేమగా ఉంటాడు. వాడి చెల్లెలికామాత్రం సహాయం చేయటం నా ధర్మం. పైగా నాకు రెండు పూటలా కడుపుకి నిండుగా భోజనం పెడుతున్నారు.” అన్నాడు నిర్వేదంగా.
“ఇంకా ఎన్ని రోజులు మనకీ కష్టాలు.. భగవంతుడికే తెలియాలి.” అని కన్నీళ్లను కనపడ నీయకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయింది కావేరి.
అది గమనించి, తనకు వుద్యోగం రావటమే అన్నింటికీ పరిష్కారం అనుకున్నాడు రాజశేఖర్. తర్వాతి వారం నుండి రాణి, రాజశేఖర్ ఇద్దరూ కలిసి పరీక్షలకు సన్నద్ధం కాసాగారు. కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు రాజశేఖర్‌ను చూసి అంది రాణి.
“నేను మీ ఇంటికి వస్తాను, అక్కడ చదువుకుందాం, మీకు ప్రతి రోజు ఇక్కడికి రావటం ఇబ్బంది కదా?”
“రావచ్చు, కానీ మీకు ఇంత సౌకర్యంగా ఉండదు మా ఇంట్లో, పైగా ఇక్కడనుండి ఎనిమిది కిలోమీటర్ల దూరం” అన్నాడు నిరుత్సాహంగా.
“పర్వాలేదు.. మా కార్ ఉందిగా… వస్తాను” తన నిర్ణయాన్ని అనుమానం లేకుండా చెప్పింది రాణి.
“అలాగే.. రేపు వస్తారా మరి.” నిర్ధారించుకోవటానికి అడిగాడు రాజశేఖర్
”వూ. అంతేగా.” అంది రాణి.
మరుసటి ఉదయం తన ఇంట్లో చేయవలసిన భోజన సౌకర్యాలు, వగైరాల గురించి అలోచిస్తూ ఇంటి వేపుగా నడక సాగించాడు రాజశేఖర్. ఇంట్లోకి వెళుతూనే అమ్మతో ఈ విషయం చెప్పాడు.
“దానిదేముందిరా ప్రొద్దున్నే కూరగాయలు, పెరుగు,పాలు పట్టుకుని రారా. మనకున్నంతలో పెడదాం, దానికి కంగారు ఎందుకు” అంది.
మరుసటి ఉదయం పది గంటల సమయానికి కార్లోంచి దిగి డ్రైవర్‌కు చెప్పి కార్ వెనక్కు పంపించేసింది రాణి. గుమ్మం బయటకు వెళ్లి రాణిని పలకరించి లోనికి తీసుకెళ్లి అమ్మకు,చెల్లెలికి పరిచయం చేసాడు రాజశేఖర్ “మన రవి చెల్లెలు, పేరు రాణి” అని.
“రా.. రాణమ్మ,” అని రాణిని చూసి పలకరింపుగా నవ్వి, కూతురి వేపు తిరిగి “అరుణా.. కాఫీ పెట్టు” అంది.
“ఇదుగో మా చెల్లెలు అరుణ.. ఇప్పుడు పదవ తరగతి”
అరుణను చూసి చిన్న చిరునవ్వు నవ్వి “హలో, గుడ్ మార్నింగ్” అంది రాణి.
అరుణ ప్రతి నమస్కారం చేసి “ఇదుగో ఇప్పుడే కాఫీ తీసుకుని వస్తాను” అంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది.
“ఇది మా ఇల్లు మొత్తంగా నాల్గు గదులు… ఆ గదిలో మనం చదువుకుందాం రండి” అంటూ గదిలో ఒక పక్కగా వున్న చక్క బల్ల, పక్కనే వేసిన రెండు కుర్చీలను చూపించాడు రాజశేఖర్.
ఇల్లంతా ఒకసారి కలయ చూసింది రాణి, పూర్తిగా మధ్య తరగతి కుటుంబం, కానీ రాజశేఖర్ మాత్రం చాల గంభీరంగా ఉంటాడు, ప్రవర్తన కూడా చాల గౌరవంగా ఉంటుంది అని మనసులో అనుకుంది..
మధ్యాహ్న భోజనాలు చాల రుచిగా వున్నాయి అయితే ఎక్కడా మసాలాలు, నూనె కనపడలేదు.
భోజనాలు అయినా తర్వాత “ఇల్లు, పొందికగా బాగుంది” అంది రాణి.
“బాడుగ కూడా ఎక్కువే” అన్నాడు నవ్వుతూ రాజశేఖర్. బాధతో కూడిన అతడి ఆంతర్యాన్ని గమనించింది రాణి. అప్పటికి రాజశేఖర్ ఇంటి పరిస్థితి అంతా అర్థం అయ్యి మనసు బాధతో నిండి పోయింది. తన గురించి ఇంత దూరం రోజు నడకతో వస్తాడని స్ఫురించి హృదయం ద్రవించిపోయింది.
“మరి ఇక… నేను వస్తాను, సాయంత్రం ఎప్పటిలా వచ్చేయండి, అన్నట్లు మీరు ఏ ఆదివారం కూడా అసలు కనపడరు, ఎటు వెళతారు” అంది కుతూహలంగా రాణి.
“ఆదివారం అనాథ, వృద్ధ ఆశ్రమానికి వెళ్లి అక్కడ వాళ్లకు సేవలు చేసి వస్తాను… చాలా తృప్తిగా ఉంటుంది” అన్నాడు ఆకాశం వైపు చూస్తూ రాజశేఖర్.
విస్తుపోయింది రాణి. “ఇన్నాళ్లుగా మరెప్పుడూ చెప్పలేదే” అంది.
“వారానికి ఒక మారు అక్కడ గడిపితే, నాకంటే ఎక్కువ బాధల్లో వున్నవారు కనిపిస్తారు. వారికి సేవలు చేస్తే వచ్చే పుణ్యం ఎన్ని దేవాలయాలు తిరిగినా రాదు.” అన్నాడు రాజశేఖర్ కళ్ళు మూసుకుని.
“అక్కడ మీకు శాలరీ ఇస్తారా” ప్రశ్నించింది రాణి.
సమాధానంగా చిన్నగా మందహాసం చేసాడు రాజశేఖర్.
“వస్తానండి మరి” అని రాజశేఖర్ అమ్మగారిని చూసి “వంట చాల బాగుందండి, మీరు కూడా మా ఇంటికి రండి” అని రాణి నమస్కారం చేసి బయటకు వెళ్లి కారెక్కి చేయి ఊపుతూ ఉండగా కార్ వెళ్లి పోయింది.
దుమ్ము లేపుతూ వెళుతున్న కార్ వేపు చూసి “రాజు.. బాగా వున్న వారి కూతురు.. జాగ్రత్తగా వుండు కన్నా, మనం మన తాహతుని మరవ కూడదు” అంది కావేరి కాస్త హెచ్చరింపు స్వరంతో రాజశేఖర్‌ను చూసి.
“మన స్తోమత నేనెప్పుడూ మరువనమ్మా, నువ్వేమి కంగారు పడొద్దమ్మా, స్నేహితుడి చెల్లెలు, పైగా వాళ్ళింట్లో అందరూ అరమరికలు లేకుండా నన్ను నమ్మారు” అమ్మ భుజం మీద చేయి వేసి లోనికి తీసుకెళుతూ అన్నాడు రాజశేఖర్.
***
తర్వాత నాల్గు నెలలు ఇద్దరూ చదువుతూ, కల్సి ఉద్యోగ పరీక్షలు వ్రాస్తూ పోయారు. కొన్ని ఇంటర్వ్యూ లకు కూడా వెళ్లొచ్చారు. కొంత కాలం తర్వాత ఇద్దరికీ ఒకేసారి బ్యాంకు ఉద్యోగానికి ఎన్నిక అయినట్లుగా ఉత్తరాలు వచ్చాయి.
రాణి ఇంటికి వెళ్ళగానే రాణి అమ్మానాన్న, రవి అందరూ రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపి – “అసలు రాణి ఇలా మారటానికి కారణం పూర్తిగా నువ్వే, దేవుడి లాగ వచ్చావు మా ఇంటికి, మేమెప్పటికీ నీకు రుణ పడి వున్నాం బాబు, తాను మాములు మనిషి లాగ మారింది.” అంటూ చేతులు ప్రేమగా పట్టుకున్నారు.
“అవేం మాటలు, స్నేహితుడి చెల్లెలికి నేను ఆ మాత్రం చేయటం గొప్పేమి కాదు, పైగా మీరు నాకు అన్నపూర్ణ లాగ ఆరు నెలలుగా అన్నం పెడుతున్నారు” అన్నాడు వినమ్రతతో, తల కిందకు వేసుకుని.
“నోరు మూయరా, పెద్ద మాటలు వద్దు.’ ‘అన్నాడు రవి,రాజశేఖర్ భుజం పైన చెయ్యి వేసి.
రాణి మాత్రం ఏమి మాట్లాడకుండా, ఒక పక్కగా నిలబడి రాజశేఖరాన్నే తదేకంగా చూస్తూ వుంది. ‘మనసంతా బంగారమే, నిజంగా నా గురించే దిగి వచ్చాడు, అసలీ ఆరు నెలలు క్షణాలలాగా గడిచి పోయాయి. ఇన్నాళ్లుగా ఎందుకు కలవ లేదో ఇతడు’ అనుకుంది అతడిని చూస్తూ.
“మరో నెలలోగా మీ పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి” సాలోచనగా అన్నాడు రవి.
ఇక వారం పాటు ఎవరూ పుస్తకాల జోలికి వెళ్లకుండా, క్యారం బోర్డ్స్, కార్డ్స్ ఆడుకుంటూ వున్నారు.
“వచ్చే వారం విజయవాడ నుండి మళ్ళీ ఆ డాక్టర్ పెళ్ళికొడుకు ఇంటి వాళ్ళు వస్తామని ఫోన్ చేసారు” అంది రాణి అమ్మగారు కాస్త సంతోషంగా. ఆడుతున్న కార్డ్స్ కింద వేసి చిరాకుగా అంది రాణి “నచ్చలేదని వెళ్లిపోయారుగా ఆరు నెలల కిందే, నాకు బ్యాంకు వుద్యోగం వచ్చిందని గాని తెల్సిందా”.
“అవును, మధ్యవర్తికి మేమే చెప్పి పంపాము” సమాధానం చెప్పింది అమ్మగారు.
“నా పేరు మీద మీరీ మధ్యన ఆస్తి కూడా రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారా?” అంది ఇంకాస్త కోపంగా.
అవునన్నట్లుగా తలూపింది రాణి అమ్మగారు. లేచి సరసరా తన గది లోకి వెళ్ళిపోయింది రాణి. అక్కడ వున్నట్లుండి వాతావరణం గంభీరంగా మారి పోయింది.
“మరి నేను వెళ్ళొస్తారా” అంటూ లేచాడు రాజశేఖర్ అక్కడి పరిస్థితి అర్థం చేసుకుని. రాణి పెళ్లి చూపుల విషయం గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు రాజశేఖర్.
ఇంటికెళ్లి పడుకున్నాడు రాజశేఖర్. “అదేంటి రాజు అలా.. పడుకున్నావు, ఏమైంది…. భోజనం చేసావా,లేదా?” అడిగింది అమ్మ. మాట్లాడలేదు రాజశేఖర్.
“అందని కొమ్మకు నిచ్చెన వేయటం మంచిది కాదు రాజా, జాగ్రత్త” అని రాజశేఖర్ తల నిమిరి వెళ్ళింది అమ్మ.
“లేదమ్మా. అలాంటిదేమి చేయను” అని సమాధానం చెప్పి కళ్ళు మూసుకున్నాడు. తన మనసు అల్లకల్లోలంగా ఉండటానికి కారణం ఏంటో తెలియటం లేదు రాజశేఖర్‌కి.
రాణి కూడా ఆ రాత్రంతా ఆలోచిస్తూ వుంది, తెల్లవారు ఝామున ఒక నిర్ణయానికి వచ్చి, మనసు తేలిక పడి, అప్పుడు నిద్ర పోయింది రాణి.
రాణి ఇంట్లో అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేస్తుండగా రాణి, నాన్న వేపు చూసి “నాన్నా! నా ఆస్తి రిజిస్ట్రేషన్ పేపర్లు నాక్కావాలి” అంది.
అసలు విషయం అర్థం కాక కూతుర్ని చూసి “తీసుకోరా, అడుగున బీరువాలో వున్నాయి. ఇంతకూ దేనికో చెబుతావా??” అడిగాడు ప్రేమగా.
“చెబుతా నాన్న,… కాస్త ఆగండి.. నా మీద నమ్మకం వుందిగా” అంది రాణి.
“అదేంటిరా అమ్మా.. అన్నీ మొత్తం కూడా తీసుకో.. నీకంటే ఎవరెక్కువ” ఆప్యాయంగా చూస్తూ అన్నాడు రాణి నాన్న.
ఇంతలో రాజశేఖర్ లోపలి వచ్చి, రవి దగ్గరికి వెళ్లి “ఏంటి రవి, ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది, అమ్మగారు, రాణి లేరా?”ప్రశ్నించాడు.
రాజశేఖర్‌ను చూసాడు రవి. అతడి మొహంలో కాస్త దిగులు, బాధ కనిపించాయి.
“అవునురా..ఇద్దరూ బయటకి వెళ్లారు” అని సమాధానం చెప్పాడు.
“అయితే మనం మొదలు పెడదామా?”అని నిరుత్సాహంగా పుస్తకాలు తీసాడు రాజశేఖర్.
ఆ రోజు ఏమీ మాట్లాడకుండా వుండిపోయాడు రాజశేఖర్.
రెండు గంటల తర్వాత రాణి వచ్చి రవి పక్కన కూచుని “ఏంటి అలా వున్నారు” అడిగింది రాజశేఖర్‌ని.
‘ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ వుండండి” అని లేచి వెళ్ళాడు రవి.
“ఏమీ లేదు, ఒక వుద్యోగం అయితే వచ్చినట్లే కదా, అందుకు కాస్తంత నిదానంగా వున్నాను.” అని తల దించి, కళ్ళలో భావాలను కనిపించనీయకుండా జాగ్రత్తగా చెప్పాడు రాజశేఖర్. రాణి కూడా రాజశేఖర్ భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండిపోయింది.
కొద్దీ క్షణాల తర్వాత అన్నాడు “మీకు, నాకూ, వుద్యోగం కూడా వచ్చేసింది, ఇంక మనం ఇప్పుడప్పుడే ప్రతీ రోజూ చదివే తొందర కూడా లేదు?, మిమ్మల్ని నేను రోజూ వచ్చి చదవమని బోరు కొట్టించను కదా” రాజశేఖర్ గొంతు జీర పోయి, మాట సరిగ్గా బయటకు రాలేదు.
రాజశేఖర్ కళ్ళలోకి సూటిగా చూసి, తిరిగి తన చూపులను పక్కకు మరల్చి అంది – “మీరు రోజూ రండి ఎప్పటి లాగే”.
చటుక్కున లేచాడు రాజశేఖర్. “నాక్కాస్త పని వుంది, మళ్లీ వస్తాను, చెప్పండి రవికి” అంటూ మొహంలో కలిగే బాధ రాణికి చూపించకుండా బయటకు చక చకా వెళ్ళిపోయాడు.
వెళుతున్న అతడినే చూస్తూ చిన్నగా, తృప్తిగా నిట్టూర్చి కళ్ళు కిందకు వాల్చి ఆలోచించసాగింది రాణి.
ఇంటికెళ్లి ముభావంగా పడుకున్న రాజశేఖర్ దగ్గరగా వచ్చి నిలబడి అంది కావేరి “వుద్యోగం వచ్చింది నీకు. మొదటి జీవిత సమస్యను అధిగమించావు…. అలాగే నీవనుకున్నవి అన్నీ కూడా నెరవేరుతాయి.. అంత వరకూ మానసిక ధైర్యంతో స్థిమితంగా ఉండాలి.” అని చెప్పి తల వెంట్రుకలు నిమిరి వెళ్ళింది కావేరి.
అది విని, మనసు తేలికగా అయ్యి, మరు నిమిషంలో నిద్ర లోకి జారుకున్నాడు రాజశేఖర్.
(2)
అనుకున్నట్లుగానే వారం తర్వాత ఆ రోజు పెళ్లి కొడుకు ఇంటి వారు రెండు కార్లలో రాణి ఇంటి ముందు దిగారు.
కాఫీ, ఫలహారాలు అయిన తర్వాత, “పెళ్లి కార్యక్రమాల గురించి ఇక మాట్లాడుకుందాము” అంటూ నవ్వాడు మధ్యవర్తి.
“అమ్మాయికి ఇరవై ఎకరాలు మాగాణి, ఒక బంగాళా, వంద తులాల బంగారం ఇస్తాను… ముందనుకున్నట్లుగా” అని ఆపాడు రాణి నాన్నగారు.
ఇంతలో గది తలుపు వద్ద నిలబడి, రాణి అంది. “లేదు నాన్న గారు, నా ఆస్తి రెండు రోజుల కింద దేవుడి గుడికి ఇచ్చేసాను..”
తాగుతున్న నీటితో పొరపోయి దగ్గటం మొదలు పెట్టాడు మధ్యవర్తి. ఆశ్ఛర్యంతో చూడసాగారు మగ పెళ్లి వారు. ఎవరూ మాట్లాడ లేదు. అందరూ మాటలు రాక ఉండిపోయారు.
కూతురి కళ్ళలోకి, నింపాదిగా చూసాడు రాణి నాన్న గారు.
“నేను వుద్యోగం కూడా చేయదలచు కోలేదు” నిలకడగా మెల్లిగా చెప్పింది రాణి.
విస్తుపోయి కాసేపు ఏమి మాట్లాడ లేదు ఎవరూ.
రాణి నాన్నగారు లేచి నించుని “అన్నీ నువ్ చేసుకోగలిగే సామర్థ్యం ఉందని నాకు తెలీదమ్మా” అన్నాడు రాణి చూసి తన కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ.
“మీరు లేకుండా నేను ఏవీ చేసుకోలేను నాన్నా. కానీ ఇదొక్క విషయంలో నా పైన నమ్మకం ఉంచండి నాన్నా” అంది అభ్యర్థనగా రాణి.
“మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి,ఇది మా అమ్మాయి నిర్ణయం, నాకు ఇప్పుడే తెలిసింది. మిగిలిన విషయాలు మనమ్మాట్లాడుకుందాము..” అన్నాడు రాణి నాన్నగారు మగ పెళ్లి వారిని ఉద్దేశించి.
“ఇంక మేము మాట్లాడవలసింది ఏమి లేదండి,… మాకు సెలవిప్పించండి” అని లేచి వెళ్లిపోయారు మగ పెళ్లివారు.
పెళ్లి మాటలు మాటాడుకోవటానికి వచ్చిన చుట్టాలు, సంబంధీకులు కూడా లేచి వెళ్లి పోయారు. తల కిందికి వేసుకుని కదలకుండా కూర్చున్న నాన్న దగ్గరికి వచ్చి పక్కన కూచుంది రాణి.
కూతురి చేయి తన చేతిలో తీసుకుని “అసలు నీకు పెళ్లి సంబంధాలు రావటమే చాలా ఇబ్బంది అయ్యింది ఇప్పటికే, మరెలా,.. నువ్విలా చేస్తే” అనునయంగా అడిగాడు రాణి నాన్న.
“మీరిక సంబంధాలు వెదక వద్దు నాన్న… నాకు సరిపోయే అబ్బాయి ఆరు నెలలుగా మన ముందే వున్నాడు… అతడితో మాట్లాడండి నాన్నా. ఇప్పుడు, వచ్చే వాళ్ళందరూ నాకు, నీవిస్తానన్న ఆస్తి, డబ్బులు, చూసి నన్ను చేసుకోవటానికి అంగీకరిస్తున్నారు. పైగా ఇప్పుడేమో నాకు వుద్యోగం ఒకటి వచ్చిందని, వద్దు అని వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారు.. అందుకే ఆస్తి లేదని అలా అబద్దాలు మాట్లాడాను.. చెప్పాను, వీళ్లకు ఆస్తి, అవి ముఖ్యం కాకపోతే, కూర్చుని మీతో మిగిలిన విషయాలు మాట్లాడాలి. అంతే కానీ లేచి అలా వెళ్లి పోకూడదు కదా, అంటే వీళ్లకు డబ్బు ముఖ్యం కానీ నేను కాదు.” అంది తల నాన్న భుజం మీద ఆనించి.
“సరేనమ్మా ఇప్పుడు ఆ రాజశేఖర్ గురించి చూడమంటావు అంతే కదా… కానీ ఆ అబ్బాయి ఆర్థికంగా చాలా మధ్య తరగతి కదా, నీకు జీవితంలో ఇబ్బందులుంటాయి రా, ఆలోచించు” అన్నాడు దీర్ఘమైన నిట్టూర్పు వదుల్తూ.
“లేదు నాన్నా.. నేను కూడా బ్యాంకు వుద్యోగం చేస్తానుగా.” సమాధాన పరిచింది.
అప్పటి వరకూ మౌనంగా వున్న రాణి అమ్మగారు అడిగారు.
“మరి అతనికి నువ్ నచ్చాలి, అతను ఒప్పుకోవాలి కదా?”
“తప్పకుండా ఒప్పుకుంటాడు, నాకు అతని మనసు తెలుసు.” ఆత్మవిశ్వాసంతో అంది రాణి.
“రాజశేఖర్ మనసు నాకు కూడా తెలుసు, కానీ…. అతనికి ఆస్తిపాస్తులేమీ లేవు” అన్నాడు రవి హెచ్చరికగా రాణిని చూసి.
”అది నాతో వివాహం అయ్యే వరకే కదా అన్నయ్య, ప్రస్తుతం నాకున్న ఇరవై ఎకరాల మాగాణి, ఒక బంగాళా అతనికి కూడా చెందుతుంది కదా” అని కాస్త ఆగి నాన్న వేపు చూసి కొనసాగించింది “నాన్నా! నాకు నిస్వార్థంగా ధైర్యాన్నిచ్చి, నా మనసుకి అయిన గాయాన్ని, వివాహం కావటం లేదనే బాధను దూరంగా తరిమేసి, నాకసలు లేని ఆనందాన్ని, జీవితం మీద పోగొట్టుకున్న ఆశను బ్రతికించాడు. ఏ రోజు కూడా, ఎక్కడా, హద్దు మీరలేదు. ఎన్నో మార్లు రాత్రుళ్ళు ఆలస్యంగా ఇద్దరమే చదువుతూ కూర్చున్నాం ఇన్ని నెలలుగా, కానీ ఏనాడూ తన చూపులలో కూడా అసభ్యత లేదు…. ప్రతీ రోజు దాదాపుగా పదహారు కిలోమీటర్లు నడకతో మన ఇంటికి వచ్చాడు. నా గురించి ఒక్క సారి మీరు వారింటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి చూడండి.”
విస్తుపోయి కూతురి వంక చూసి అన్నాడు “నీకంత నచ్చినప్పుడు, మేమెందుకు కాదంటాము అమ్మా.”
తండ్రి భుజం మీద తల ఆనించి “మొదటగా ఎట్టి పరిస్థితులల్లో ఆ అబ్బాయిని మాత్రమే చేసుకోవాలని నిశ్చయించుకున్నా నాన్నా, ఇక వెనక్కి రాకూడదని అనుకున్నా, పైగా ఇంత గొప్ప మనసున్న, మంచి స్వభావం వున్న అతడిని వదిలేసి, కొత్తగా, ఎక్కడో తెలియని వారిని మనం వెతకటం ఎందుకు?”అంది రాణి తండ్రితో. ఏమీ మాట్లాడకుండా కూర్చుండి పోయాడు రాణి నాన్నగారు. అందరూ ఆలోచనల్లో పడిపోయారు.
నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నారు రాణి నాన్నగారు “రవీ! రేపు మనం రాజశేఖర్ ఇంటికే వెళుతున్నాం… వాళ్ళ నాన్నగారు ఏ సమయానికి వుంటారో, ఎప్పుడు వీలవుతుందో కనుక్కో” అని లేచి తల వంచుకుని ఆలోచిస్తూ తన గది లోకి మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్లిపోయారు.
అంతలో రాణి లేచి వచ్చి,”నాన్నా!,రేపు, నేనొక మారు రాజశేఖర్‌తో మాట్లాడుదామనుకుంటున్నాను, మీరు సరేనంటే!” అంది రాణి.
ఆ మాట విని ఆగి వెనక్కి తిరిగి కూతురుని చూసి చిన్న చిరునవ్వుతో “వెళ్లి రా అమ్మ” అన్నాడు.
ఇంట్లో ఇక ఎవరూ మాట్లాడలేదు. రవి లేచి బయటకు నడిచి రాజశేఖర్‌ను కలవాలి అని ఆలోచించుకుంటూ కార్ స్టార్ట్ చేసాడు.
రవి కార్ ఆగింది. లోపలి నుండి అది చూసి కార్ దగ్గరకు వచ్చిన రాజశేఖర్‍ను చూసి, “కార్ ఎక్కు రా రాజా, నీతో కాస్త పనుంది” అని రాజశేఖర్‌ను తీసుకుని ఊరి బయట వున్నా కాలవ దగ్గర ఆపి కార్ దిగాడు రవి.
“ఏంటి రవి, నాతో అంత పని. ఇంటి వద్దే మాట్లాడుకునే వాళ్ళం కదా”అన్నాడు రాజశేఖర్.
“సూటిగా అడుగుతున్నాను… రాణి మీద నీ అభిప్రాయం ఏంటి?” సీరియస్‌గా అడిగాడు రవి. కాసేపు మౌనంగా వుండిపోయాడు రాజశేఖర్.
మళ్ళీ అడిగాడు రవి “పర్వాలేదు… చెప్పు.”
“లేదు రవి.. నేను ఏమి చెప్పలేను… నా స్థాయి, అంతస్తు నీకు తెలుసు కదా?” కాస్త నిస్సహాయంగా అన్నాడు.
“మరి… ఆ విషయం ముందుగా తెలీదా నీకు. నా చెల్లెలికి కొత్త సమస్య తెచ్చి పెట్టావు” అన్నాడు రవి కాస్త కోపంగా.
“మీరందరూ నాపై చూపించిన అభిమానాన్ని నేనెప్పుడూ దుర్వినియోగం చేయను..” అన్నాడు రాజశేఖర్ తలవంచుకుని.
“అది నాకు తెలుసు, కానీ ఇప్పుడు అది ఏ సంబంధం కూడా చేసుకోదట. నువ్వే కావాలంటోందీ. ఏం చేయమంటావ్” అన్నాడు రవి.
“నువ్ నా స్నేహితుడువి రవీ, నువ్ చెప్పరా నేనెం చేయాలో?” అభ్యర్థనగా అడిగాడు రాజశేఖర్.
“ఏమి చేయవద్దు.. వుద్యోగంలో చేరి.. వచ్చే సంవత్సరానికి రాణితో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకో” అన్నాడు గంభీరంగా రవి.
రవి గొంతులో కోపం వినిపించి తల పైకి లేపి చూసాడు రాజశేఖర్. బలవంతంగా నవ్వును ఆపుకుంటూ కోపం నటిస్తున్న రవిని చూసి మనసు తేలిక అయి “సరే నీ ఇష్టం” అంటూ సాలోచనగా జవాబిచ్చాడు రాజశేఖర్.
కాసేపటి తర్వాత బుజాల మీద చేతులు వేసుకుని మాట్లాడుకుంటూ స్నేహితులు ఇద్దరూ కాలవ గట్టు పైన నడుస్తూ వెళ్లి పోయారు.
మరుసటి రోజు రాణి ఉదయం డ్రైవర్‌ను పిలిచి, కార్ ఎక్కి “రాజశేఖర్ ఇంటికి పోనివ్వు” అని డ్రైవర్‌తో చెప్పి వెనక్కు జారగిలా పడి కూర్చుని ఆలోచనలో పడింది. ‘రాజశేఖర్‌కి నేనంటే అభిమానమే, కానీ పెళ్ళికి ఒప్పుకుంటాడా, ఒక వేళ తనకు ఆ ఆలోచన, అభిప్రాయం లేదంటే ఎలా, అసలు ఎలా ఆ విషయం అడగటం? ఇంట్లోకి వెళ్లి మాట్లాడితే బావుంటుందా? లేక బయటకు రమ్మని అడగాలా? వాళ్ళ అమ్మగారు ఏమంటారో?’ మనసు నిండా ఈ ఆలోచనలతో కళ్ళు మూసుకుంది రాణి.
“అమ్మా! సార్ ఇల్లు వచ్చేసింది” అన్న డ్రైవర్ మాటతో ఆలోచనలలోనుండి బయటపడి కార్‌లో నుంచి దిగింది రాణి. కార్ దిగుతున్న రాణిని చూసి రాజశేఖర్, వెనకగా అమ్మగారు కూడా బయటకు వచ్చి “లోపలికి రండి”అన్నారు మర్యాద పూర్వకంగా.
“ఒక విషయం మీరు తేల్చి చెప్పిన తర్వాత మాత్రమే వీలు అవుతుంది, నేను రావాలా, వద్దా అన్నది” అంది రాణి కదలకుండా రెండు చేతులూ కట్టుకుని బయటే నిలబడి.
రాజశేఖర్ ఆశ్చర్యంగా చూసి “ఏమిటది… లోపలి వచ్చి మాట్లాడవచ్చు కదా” అని నొసలు చిట్లించి అడిగాడు.
“ఇంతకు ముందులాగ స్నేహంతో మాత్రమే.. అయితే ఇప్పుడే రాగలను… కానీ నాకు మాత్రం మీ ఇంట్లోకి కోడలిగా రావాలని వుంది. మీకు… అది ఇష్టమైతే మాత్రం నేను లోపలికి ఇప్పుడు రాలేను. అత్తవారింటికి కోడలి హోదాతో వస్తాను.. పద్దతులతో… అన్ని హంగులతో.. ఇప్పుడు చెప్పండి ఎప్పుడు రావాలో” అంది ముగ్ధమనోహరంగా చిరునవ్వుతో.
అది విని తన తల్లి వేపు చూసాడు రాజశేఖర్. కొడుకు కళ్ళ లోకి చూసి, విషయం అర్థం అయి, తిరిగి రాణిని చూసి “అవునమ్మా రాణి నీవు చెప్పింది కరెక్ట్, నేనైతే ఇప్పుడు రావద్దని అంటాను… మరి వీడేమంటాడో!!విను” అని రాజశేఖర్ వేపు చూసి, “చెప్పరా!!” అంది భుజాలు ఎగరేసి, కళ్ళలో సంతోషం కురిపిస్తూ.
“నేను కూడా ఇప్పుడు…. మీరు రావటం పద్ధతి కాదంటాను” అన్నాడు రాజశేఖర్ నిష్కల్మషమైన నవ్వుతో, అతని మనసు ఊయలలు వూగుతుండగా.
ఆ మాట విని పరవశించి పోయింది రాణి. ప్రపంచం లోని ఆనందం అంతా తన స్వంతం అయినంత హాయిగా అనిపించింది. ‘ఇతడితో రాసి వుంది కాబట్టే ఇన్ని సంబంధాలు కుదరలేదు’ అనుకుంది.
“సరే, వెళ్లొస్తాను మరి.. రేపు మా నాన్న, మిగిలిన వాళ్ళు వస్తారు.. పెళ్లి విషయాలు మాట్లాడుకోవటానికి” అని చెప్పి, ప్రేమతో రాజశేఖర్‌ను చూసి, కార్ లోకి ఎక్కి కూర్చొని చెయ్యి ఊపుతూ.. రాజశేఖర్‌నే చూస్తూ వెనక్కు ఇంటికి దారి తీసింది రాణి మనసు గాలిలో తేలిపోతుండగా..
చేయి ఊపుతూ వెళుతున్న రాణిని చూసి, రవి నిన్ననే వచ్చి తనతో మాట్లాడి, ఆర్థిక అసమానతల విషయాన్ని కొట్టిపడేసి, రాణితో వివాహానికి తన ఇంట్లో అందరిని ఒప్పించిన విషయం గుర్తుకు వచ్చి సంతోషంగా ఇంట్లోకి అడుగులు వేసాడు రాజశేఖర్.