విక్రమసింహ

0
2

[dropcap]వి[/dropcap]క్రమసింహ మంచి దేహదారుఢ్యము గల యోధుడు. మల్ల యుద్ధము, కత్తి యుద్ధము, కర్ర యుద్ధము, విలువిద్య మొదలగు వీరోచిత యుద్ధాలలో ఎనలేని నైపుణ్యము గలిగిన యుద్ధ వీరుడు. మంచి అవయవ సౌష్టవముతో బాటు ఆకర్షణీయమైన అందము అతని సొంతం. చలాకీతనముతో కూడుకున్న చురుకైన ఆహార్యము, సమయస్ఫూర్తి గలిగిన ధీరోదాత్తుడు. అన్నిటినీ మించి భవానీ అమ్మవారి భక్తుడు.

అది కాకులు కూడా దూరని కీకారణ్యములో, ఎత్తైన చెట్లు, పొదలు, కొండలు, గుట్టల మధ్య నిర్మింపబడిన ఒకానో పురాతన ఆలయము. ఎప్పుడు నిర్మింపబడిందో ఎవరికీ తెలియదు. ఆ ఆలయములో మూలవిరాట్టైన భవానీమాత విగ్రహము చాలా ఆకర్షణీయంగా వుంటుంది. ఆలయము ముంగిట నాలుగు స్తంభాల మండపము, అందలి శిల్ప సౌందర్యము చాలా చక్కగా ఉంటుంది. విక్రమసింహ యొక్క నిత్యకృత్యము ఈ ఆలయానికి వచ్చి దేవీ దర్శనము చేసుకోవడమే. ఒకనాడు అతను తన తెల్లని గుర్రము మీద ఆలయానికి వచ్చి మధురమైన కంఠంతో దేవీస్తుతి చేసిన తర్వాత తన రాజ్యమైన త్రిలింగ దేశమునకు బయలు దేరే సమయంలో అక్కడే ఆలయము అరుగుమీద కూర్చున్న జంగమదేవర విక్రమసింహ యొక్క దేవీస్తుతిని విని

“ఎవరు నాయనా నీవు, దేవీ స్తుతిని చక్కగా ఆలపించినావు. ఏ ప్రాంతము వాడివి” అని అడిగాడు. జంగమదేవర పొడవైన జడలు కట్టిన తెల్లటి జుట్టుతో, తెల్లటి పొడవైన గడ్డముతో, దేహానికి నుదురుకు విభూతి రేఖలతో, జోలెతో వంకర తిరిగిన యోగ దండము లాంటి చేతి కర్రతో, మెడలో వివిధ రకాల రుద్రాక్ష మాలలతో తెల్లటి దుస్తులతో కూర్చుని వుండడము గమనించిన విక్రమసింహుడు అతనిని ఉద్దేశించి

“తాతా! నా పేరు విక్రమసింహ, మాది త్రిలింగదేశము. మా దేశపు రాజు సోమనాధుడు. ఇక్కడినుండి చాలా దూరము వుంటుంది. నేను రోజూ నా గుర్రము మీద గుడికి వచ్చి దేవీ దర్శనము చేసుకుంటూ వుంటాను. ఇది నా దినచర్య”. అని చెప్తూ వుంటే జంగమదేవర పక్కనే గల అరుగురాతిని ఆనుకొని వున్న సన్నటి దొనలాంటి కాలువ ప్రక్కననే నల్లగండుచీమల దండు బారులుగా పోవడము గమనిస్తాడు. ఆ దండులోంచి ఒక చీమ అదుపుతప్పి నీళ్ళలో పడి గిలగిల తన్నుకుంటూ వుంటుంది. విక్రమసింహ ప్రక్కనే వున్న చెట్టు కొమ్మలోని ఒక పుల్లను త్రుంచి ఆ చీమను ఆసరాగా పెట్టి, నీటినుంచి బయటకు తీసి మరలా ఆబారులోనికి తోస్తాడు. ఇది గమనించిన జంగమదేవర ఈ యువకుడికి మంచి భూత దయ వుందని గ్రహిస్తాడు.

“నాయనా! చూడబోతే నీవు మంచి యోధుడిలాగా వున్నావు” అని చెప్పి తన జోలెలో వున్న చిన్న స్ఫటిక లింగముతో కూడుకున్న రుద్రాక్ష మాలను తీసి విక్రమ సింహకు ఇస్తూ

“దీనిని నీ మెడలో ఎల్లప్పుడూ ధరించు. నీకు జయము కలుగుతుంది” అని చెప్పి దీవిస్తాడు. విక్రమసింహ ఆ రుద్రాక్షమాలను మెడలో వేసుకుని జంగమదేవరకు కృతజ్ఞతలు చెప్పి, తన రాజ్యమునకు బయలుదేరుతాడు. అలా కొండలు, దట్టమైన చెట్ల మధ్య, సన్నటి మార్గములో ప్రయాణిస్తూ వుండగా హఠాత్తుగా చెట్లమాటు నుండి దాదాపు పది మంది బందిపోటు దొంగలు విక్రమ్ పై కత్తులు, కర్రలతో దాడి చేస్తారు. వారికి ధీటుగా విక్రమ్ కూడా వారిని ఎదిరించి యుద్ధము చేస్తాడు. విక్రమ్‌ను బంధించడానికి వారు ఒక పెద్ద వలను విక్రమ్ మీదికి విసురుతారు. విక్రమ్ తప్పించుకొని వారితో హోరాహోరి యుద్ధము చేసి వారు తెచ్చిన వలలోనే వారిని బంధించి వలను గుర్రానికి కట్టి వారిని ఈడ్చుకుంటూ రాజ్యానికి తీసుకెళ్తాడు. రాజ్యములో వుండే జనం విక్రమ్ ధైర్య సాహసాలను మెచ్చుకొని దారి పొడవునా కేరింతలు కొడుతూ, జయజయనాదాలు చేస్తూ విక్రమ్‌ను అభినందిస్తారు. విక్రమ్ వారిని సోమనాధరాజుకు అప్పగిస్తాడు. సోమనాధరాజు విక్రమ్‌ను అభినందించి ఆ దుండుగలను చెరసాలలో వేయిస్తాడు. ఈ తతంగమంతా రాజభవనం పై అంతస్తు నుండి గమనిస్తూ వున్న రాకుమారి అపర్ణ కూడా విక్రమ్‌ను మనసులోనే అభినందిస్తుంది. విక్రమ్‌ను వెంటనే కలవాలనుకుని, తన సఖీజనంతో క్రిందికి వచ్చి విక్రమ్ తిరిగి ఇంటికి వెళ్ళుతుండగా రాజప్రాంగణంలో వున్న పూల పొదల మాటనుండి సవ్వడి చేస్తుంది. ఇది విన్న విక్రమ్ అపర్ణను చూస్తాడు. అపర్ణ అందానికి ముగ్గుడౌతాడు. కళ్ళు కళ్ళు కలుస్తాయి. చిరునవ్వు నవ్వుతాడు. “యువరాణి అపర్ణ గారికి నమస్కారాలు” అంటూ దగ్గరికి వెళ్ళబోతాడు. అపర్ణ కూడా “నీ సాహసానికి జోహార్లు”. రాజభవనము పై అంతస్తు నుండి ప్రజలు నీకు బ్రహ్మరధం పట్టడం చూశాను. నేనూ సంతోషించాను. మన రాజ్యంలో ఇంత గొప్ప యోధుడున్నందుకు గర్వపడుతున్నాను” అని అభినందిస్తుంది.

“యువరాణి గారు, అతన్ని మరీ ఎక్కువగా పొగడకండి. అతనికి దిష్టి తగులుతుంది” అని చెలికత్తెలు పరిహాసం చేస్తారు.

“రాణీ గారూ! ఇక నేను వెళ్తాను. ఇప్పటికే బాగా అలిసి పోయి వున్నాను. మరలా కలుస్తాను” అని చెప్పి విక్రమసింహ గుర్రము మీద ఇంటికి బయలుదేరుతాడు.

విక్రమసింహ తండ్రి జయసింహ సోమనాధుని కొలువులో సైన్యాధికారిగా వుండి వయసుమీద పడడంతో ఉద్యోగము వదిలి యింటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ వుంటాడు.

జయసింహ కూడా మంచి యోధుడు. రాజభక్తి కిలిగినవాడు. విక్రమసింహ తనకు ఒక్కగానొక్క కొడుకు. విక్రమసింహకు, అతని స్నేహితులకు నిరంతరం యుద్ధ నైపుణ్యాలను నేర్పిస్తూ వుంటాడు.

త్రిలింగ రాజ్యము ప్రక్కన గరుడ రాజ్యముంటుంది. గణపతిరాజు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. సుఖ సంతోషాలతో రాజ్య ప్రజలు ఆనంద దాయకంగా వుంటారు. ఒకనాడు కొండవీటి రాజ్యాన్ని పరిపాలించే భూమ కేతనుడు గరుడ రాజ్యము మీద దండెత్తుతాడు. భూమకేతనుడు మహా క్రూరుడు. విపరీతమైన రాజ్య కాంక్ష కలిగినవాడు. ఆజానుబాహుడు. మంచి దేహదారుడ్యము కలిగినవాడు. చాలా మొరటైన ముఖ కవళికలు, మొరటైన ఆహార్యము కలిగినవాడు. తన రాజ్య ప్రజలను అతిక్రూరంగా హింసిస్తూ వుంటాడు. గరుడ రాజ్యాన్ని జయించాలనే కాంక్షతో తన సైన్యముతో దండెత్తుతాడు. గణపతిరాజు యొక్క సైన్యము, భూమకేతనుడి సైన్యము హోరాహోరీగా పోరాడుతాయి. యుద్ధములో గణపతిరాజు సైన్యము ఓడిపోతుంది. గణపతిరాజును, రాణీవాసాన్ని బంధించి, రధాలమీదికి ఎక్కించి గణపతిరాజు మంత్రి అయిన చిత్రాంగదుడిని ఉద్దేశించి

“ఓ మంత్రీ! నీ రాజును, రాణీవాసాన్ని కూడా బంధించి తీసుకొని వెళ్తున్నాను. వచ్చే పౌర్ణమికి మరలా వచ్చి మీ రాజ్యాన్ని ఆక్రమిస్తాను” అని చెప్పి తన సైన్యముతో రథాల మీద తన రాజ్యానికి బయలుదేరుతాడు.

కొండవీటి రాజ్యము, త్రిలింగ రాజ్యము, గరుడ రాజ్యము ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు క్రూరమృగాలు మధ్య వెలసిన రాజ్యాలు. ఒక రాజ్యానికి, మరొక రాజ్యానికి చాలా దూరము వుంటుంది. మరీ ముఖ్యంగా కొండవీటి రాజ్యము పెద్ద పెద్ద రాతికొండలు, దట్టమైన చెట్ల మధ్య దుర్బేధ్యంగా వుంటుంది. ఒకవైపు రాజ్యానికి వెళ్ళే మార్గము అతి కఠినంగా వుంటుంది. రాజ్యాన్ని చేరగానే అతి పెద్ద సింహద్వారము వుంటుంది. దీనిని రాజభటులు నిరంతరము కాపలా కాస్తూ వుంటారు. ఈ కొండవీటి రాజ్యము అనేక పర్వతాలు, కొండల మధ్య దట్టమైన చెట్ల మధ్య వుండడము చేతనే దీనికి కొండవీటి రాజ్యము అని పేరు వచ్చింది. ఈ రాజ్యాన్ని చేరుకోవడానికి మరొక మార్గము వుంది. అదే నదీ మార్గము. కొండల మధ్య ప్రవహించే చారుమతీ నది చాలా విశాలమైన చాలా లోతైనది. ఈ నదిలో పడవల ద్వారా నదిని దాటి ఆ కొండల పైనెక్కి కొండవీటి రాజ్యాన్ని చేరుకోవాలి. ఇది చాలా కఠినమైన మార్గము.

భూమకేతనుడు సింహద్వారము గుండా ప్రవేశించి గణపతి రాజును, అతని రాణీవాసాన్ని కొండల గుహల మధ్య వున్న అతి రహ్యమైన కారాగారములో ఇతర బందీలతో బంధిస్తాడు. తనకు ఎదురు తిరిగిన ప్రజలను బంధీలుగా చేసి అతి క్రూరంగా శిక్షిస్తూ వుంటాడు. ప్రజలు ఏ చిన్న తప్పు చేసినా కనికరము లేకుండా పరిపరి విధాలుగా హింసిస్తూ వుంటాడు. ప్రజలను బానిసలుగా చేసి సైనికులు కూడా క్రూరంగా శిక్షిస్తూ రాక్షసానందం పొందుతూ వుంటారు.

జంగమదేవర కూడా భవానీమాత భక్తుడు. ఎప్పుడూ గుడి మండపములో కూర్చొని ధ్యానము చేస్తూ వుంటాడు. ఆ మండపమే అతని స్థావరము. గుడి చుట్టు ప్రక్కల వుండే గిరిజన స్థావరాలు, అటవీ

ప్రాంతములో గల వివిధ మార్గాలు అన్నీ కూడా అతనికి బాగా తెలుసు. భూమకేతనుడు గణపతి రాజును బంధించి తీసుకొని పోవడము చూస్తాడు. వెంటనే కాలినడకమ వడివడిడగా గరుడ రాజ్యానికి వస్తాడు . మంత్రి చిత్రాంగదుడిని కలుస్తాడు. ఆ సమయములో చిత్రాంగదుడు ఇతర ప్రముఖులతో మంత్రులు,

సేనాధిపతులతో సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని దీర్ఘంగా చర్చిస్తూ వుంటాడు. జంగమదేవర చిత్రాంగుడితో “ఓ మంత్రీ! గణపతి రాజును, గరుడ రాజ్యాన్ని కాపాడగల వీరుడు ఒక్కడే. అతనే విక్రమసింహ, వెఐటనే త్రిలింగ దేశానికి వెళ్ళి త్రిలింగరాజును కలిసి విక్రమసింహ సహాయము కోరుము” అని చెప్పి వెళ్ళిపోతాడు.

చిత్రాంగదుడు త్రిలింగ దేశానికి బయలుదేరుతాడు. త్రిలింగరాజును కలుస్తాడు. గరుడ రాజ్యాము, త్రిలింగ రాజ్యము రెండింటి సైనిక సంపద కలిసినా కొండవీటి రాజ్య సైనిక సంపదలో సగమైనా వుండదు. ఈ రాజ్యాలకు రెండింతలు వుంటుంది కొండవీటి రాజ్యము. భూమకేతనుడు తన రాజ్యానికి సమీపములో వున్న రాజ్యాలన్నిటినీ ఆక్రమించివుంటాడు. “మహారాజులకు జయము, నేను గరుడ రాజ్యానికి మంత్రిని మారాజైన గణపతి రాజును, రాణీ పరివారాన్ని కొండవీటి రాజైన భూమ కేతనుడు యుద్ధము చేసి వారిని బంధించి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మా దేశము రాజులేని అనాధ దేశముగా వుంది. ప్రజలందరు చాలా దీనావస్థలో వున్నారు. కావున మీ రాజ్యానికి చెందిన పరాక్రమవంతుడు విక్రమసింహ సహాయము కోరడానికి వచ్చాను. దయచేసి అతనిని మా రాజును విడిపించి తీసుకురమ్మని ఆదేశించండి. ఈ సహాయానికి మీకు ఎంతో రుణపడి వుంటాను” అని అతి దీనంగా సోమనాధ రాజును వేడుకుంటాడు.

సోమనాధుడు దీర్ఘంగా ఆలోచిస్తాడు. భూమకేతనుడు ఇప్పుడు గరుడ రాజ్యముపై దండెత్తాడు. మున్ముందు తన రాజ్యము పై పడవచ్చు. తన రాజ్యము కూడా చిన్నది, పెద్దగా సైనిక బలము లేదు. కాబట్టి రెండు రాజ్యాలు కలిస్తేనే భూమకేతునుడిని ఎదుర్కోవచ్చు. ఈ విధంగా ఆలోచించిన సోమనాధుడు “మంత్రీ! నీవు చెప్పినట్లుగానే విక్రమసింహను పిలిపిస్తాను. మీ రాజ్యానికి సహాయము చేయమని ఆదేశిస్తాను. కానీ ఒక్క వీరుడు అతి క్రూరుడైన భూమకేతనుడిని అతని సైన్యాన్ని ఎదిరించగలడా? అని

అనుమానిస్తున్నాను” అంటాడు. రాకుమారి అపర్ణ కూడా వీరి సంభాషణ వింటూ వుంటుంది. ఒక్కగానొక్క కూతురైనప్పటికి సోమనాధుడు అపర్ణకు యుద్ధ శిక్షకులను పెట్టి అన్ని యుద్ధనైపుణ్యాలను నేర్పిస్తూ వుంటాడు.

“నాన్నా! విక్రమ్‌తో నేను కూడా వెళ్తాను. భూమకేతునుడిని మట్టుబెడ్తాము” అని అంటుంది.

సోమనాధుడు చిరునవ్వు నవ్వి “నీవు యుద్ధము చేసే సమయము ఇంకా రాలేదు. తొందరలోనే ఆ సమయము కూడా రావచ్చు. సిద్ధముగా వుండు. నిరంతరము నీ గురువుల వద్ద శిక్షణ తీసుకుంటూ వుండు. అయినా విక్రమ్‌ను పిలిపించి అతని ఉద్దేశము ఏమిటో తెలుసుకుందాము” అని చెప్పి ఇద్దరు భటులను పిలిచి విక్రమసింహను వెంటనే పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. భటులు విక్రమసింహ నివాసానికి వెళ్తారు. అప్పుడు విక్రమ్ తన స్నేహితులతో కత్తి యుద్ధ మెళకువలను సాధన చేస్తూ వుంటాడు. తన స్నేహితులు కూడా మంచి యోధులే. వారిలో ముఖ్యంగా విజయ్, త్రివిక్రమ్, గంగాధర్‌లు విక్రమ్‌కు అత్యంత సన్నిహితులు, ఆ భటులు “విక్రమసింహ! రాజుగారు మిమ్మల్ని వెంటనే పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించారు. కాబట్టి మీరు వెంటనే మాతో బయలు దేరి రండి” అని అంటారు.

“మీరు వెళ్ళండి! నేను వస్తాను” అని చెప్పి వాళ్ళను పంపిస్తాడు, విక్రమ్, తనతోటి స్నేహితులు రాజు పిలిపించడానికి గల కారణమేమై వుంటుందని దీర్ఘంగా ఆలోచిస్తూ వుంటారు. ఇంతలో విక్రమ్ తండ్రి జయసింహ విక్రమ్‌తో “ఇదిరాజు గారి ఆజ్ఞ. మనము సేవకులము, ఏదో ఒక బలీయ కారణము వుండడము చేతనే నీకు కబురు పెట్టారు. కావున నీవు వెంటనే బయలుదేరు” అని చెబుతాడు.

విక్రమ్ తక్షణమే తన గుర్రము మీద రాజభవనానికి బయలుదేరుతాడు. రాజప్రాకారములో ప్రవేశించి ముంగిట సుందరమైన వనము ద్వారా రాజభవనం దగ్గరికి వెళ్తుండగా హఠాత్తుగా అపర్ణ అక్కడికి వస్తుంది.

“విక్రమ్! నాన్నగారు నీకు చాలా బృహత్తరమైన పనిని అప్పగిస్తున్నారు. ఎలా పరిష్కరిస్తావో, ఏమో మరి” అని చిలిపిగా సరదాగా కవ్వించడానికి యపత్నిస్తుంది. విక్రమ్ అపర్ణతో “నా సామర్థ్యము పైన నాకు సంపూర్ణ విశ్వాసముంది. నా సామర్థ్యము మీద నీవు అనుమానించవలసిన పనిలేదు. అసలు విషయము రాజు గారిని అడిగే తెలుసుకుంటాను” అని గర్వంగా చెబుతాడు, “వెళ్ళు, వెళ్ళు, నీ వెంటనే నేను కూడా వస్తాను” అని భవనంలోకి వెళ్తుంది.

విక్రమ్ రాజదర్బారులో ప్రవేశిస్తాడు. అక్కడ సోమనాధ రాజు, చిత్రాంగదుడు, ఇతర రాజ సన్నిహితులు దీర్ఘంగా చర్చించుకుంటూ వుంటారు. విక్రమ్‌ను చూడగానే సోమనాధుడు “రా! విక్రమ్! నీ

కోసమే ఎదురు చూస్తున్నాం. ఇతడు చిత్రాంగదుడని గరుడ రాజ్య మంత్రి. భూమకేతనుడు వీరి రాజైన గణపతి రాజు పై దండెత్తి, అతనిని యుద్ధములో ఓడించి, బంధించి, రాణి వాసాన్ని కూడా బంధించి కొండవీటి రాజ్యానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చిత్రాంగదుడు భూమకేతనుడిని ఓడించి తమ రాజును విడిపించి తీసుకొని రావాలని నీ సహాయము కోరుతున్నాడు. మరి నీ అభిప్రాయము ఏమిటి?” అని అంటాడు.

“ఓ రాజా! చిత్రాంగద మంత్రి మీ ద్వారా నా సహాయాన్ని కోరుతున్నారు. మీరు ఆజ్ఞాపిస్తేనే నేను వెంటనే భూమకేతనుడిని ఓడించి, గణపతి రాజును, అతని పరివావారాన్ని విడిపించి తీసుకొని వస్తాను” అని ఆత్మవిశ్వాసంతో కూడుకున్న వినయాన్ని ప్రదిర్శిస్తాడు. అదే సమయంలో అక్కడే వున్న అపర్ణ “నాన్నగారూ! భూమకేతనుడు మహా క్రూరుడు గదా! చాలా పెద్ద సైన్యము గల రాజు. అతడిని ఎదుర్కోవడము విక్రమ్ ఒక్కడివల్ల కాదు, అందుకు నేను కూడా తోడుగా వెళ్తాను”. అని అంటుంది.

సోమనాధుడు తన కూతురి మనసును పసిగడ్డాడు. చిరునవ్వుతో “అమ్మా! నీకు ముందే చెప్పాను గదా! నీవు కూడా యుద్ధము చేసే సమయము వస్తుందని, అంతదాక ఓపికపట్టు!” అని బుజ్జగిస్తాడు. అప్పుడు విక్రమ్ –

“రాజా! నేను ఒక్కడినే వెళ్తాను. నేను భూమకేతనుడిని జయస్తాననే నమ్మకము నాకు వుంది. ఎటువంటి అవాంతరాలు వచ్చినా తట్టుకొనే శక్తి నాకుంది. నాకు తెలుసు. మీరు నాకు అప్పగించిన ఈ కార్యము చాలా కఠినమైందని. కానీ రాకుమారికి యుద్ధము చేయవలెనని ఉబలాటము ఎక్కువగా ఉన్నట్టుంది. మీరు చెప్పినట్లు రాకుమారి గారు యుద్ధము చేయవలసిన సమయము ముందు ముందు రావచ్చు అందుకు ఇది తరుణం కాదు”. అని చెబుతాడు. విక్రమ్ మాటలకు అపర్ణ మూతి ముడుచుకొని లోపలికి వెళ్తుంది. విక్రమ్ చిత్రాంగదుడిని ఉద్దేశించి

“ఓ మంత్రివర్యా! మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ రాజును భూమకేతనుడి నుండి విడిపించుకొని వస్తాను. మీరు మీ రాజ్యానికి వెళ్ళి మీ ప్రజలకు ఈ విషయం చెప్పండి” అంటూ “ఓ రాజా! నేను వెంటనే బయలుదేరుతాను. నాకు సెలవిప్పంచండి” అని అడుగుతాడు.

సోమనాధరాజు, చిత్రాంగదుడు, చాలా సంతోషపడి “విజయీభవ, దీర్ఘ ఆయుష్మాన్ భవ” అని హృదయపూర్వకంగా దీవిస్తారు. విక్రమ్ ఇక తన నివాసానికి బయలు దేరుతాడు.

విక్రమ్ యింటికి వచ్చిన తర్వాత తండ్రితో, తన స్నేహితులతో విషయము చెప్తాడు. తండ్రి జయసింహ “మనము రాజుగారి సేవకులము. మన రాజ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనమీద వుంది. అవసరమొస్తే ప్రాణత్యాగానికైనా వెనుకాడకూడదు. గణపతిరాజును రక్షించడానికి సోమనాధరాజు నీపై ఈ భారము పెట్టినందుకు నేను గర్విస్తున్నాను. కాబట్టి నీవు వెంటనే ఈ కార్యము నిర్వర్తించడానికి ఉపక్రమించు, కాని నీవు ఒంటరిగా వెళ్ళవద్దు, నీ స్నేహితులు, నీతో సమానమైన యోధులు కొంతమందిని తీసుకొని వెళ్ళు”. అని చెప్పి అడవి దారిలో విషపురుగుల బారినుండి రక్షణ కొరకు కొన్ని ఔషధాలను, మూలికలను ఇస్తాడు. కొండవీటి రాజ్యానికి పోయే దారి యొక్క చిత్రపటము (మ్యాప్) ఇతర ముఖ్యమైన వస్తువులను విక్రమ్‌కు ఇచ్చి ఆశీర్వదిస్తాడు.

విక్రమ్ తన ముఖ్య స్నేహితులైన విజయ్, త్రివిక్రమ్, గంగాధర్‌తో బయలుదేరుతాడు. విజయ్ యుద్ధానికి అవసరమైన కత్తులు మొదలగు ఆయుధ సామాగ్రిని కొన్ని పెద్ద పెద్ద తాళ్ళు మొదలగు సామాగ్రి గల పొడవైన సంచిని భుజాలకెత్తుకుంటాడు.

త్రివిక్రమ్ ప్రయాణానికి కావలసిన ఆహార పదార్థాలను, మంచి నీటిని, కొన్ని నిల్వ పదార్ధాలను, ఔషధములు గల సామాగ్రి సంచిని భుజానికెత్తుకుంటాడు. గంగాధర్ దూరదర్శిని (బైనాక్యులర్స్), మరికొన్ని యుద్ధ పరికరాలను ధరిస్తాడు. నలుగురు వారి వారి గుర్రాల మీద కొండవీటి రాజ్యానికి ప్రయాణమౌతారు.

కొండవీటి రాజ్యానికి పోయే దారి చాలా కఠినమైన దారి. దారికిరువైపులా ఎతైన చెట్లు, చిన్న చిన్న గుట్టలు, వాటినానుకొని కొండలు, దట్టమైన అడవి ప్రాంతములో క్రూరమృగాలు, ఇలా వుండడము వలన ప్రయాణము చాలా భయానకరంగా వుంటుంది. ఇలా నలుగురూ కొంత దూరము వెళ్ళగానే విక్రమ్ తన స్నేహితులతో “మీరు పోతూ వుండండి, నేను రాకుమారి అపర్ణను కలిసి వస్తాను. కొంతసేపైన తర్వాత మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పి చాలా వేగముతో గుర్రముపైన రాజభవనానికి బయలుదేరుతాడు. రాజభవనము చేరుకున్న తర్వాత ముందరి ప్రాంగణములో గల ఉద్యానవనములో ప్రవేశించి, రాణి చెలికత్తెలతో కబరు పంపుతాడు. అపర్ణ వెంటనే ఉద్యానవనానికి వస్తుంది.

“అపర్ణా! నేను కొండవీటి రాజ్యానికి ప్రయాణమయ్యాను. కొంత దూరము వెళ్ళాక నా స్నేహితులతో నిన్ను కలిసి వస్తానని చెప్పాను. నిన్ను చూడకుండా వుండలేకపోయాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు వీడ్కోలు చెప్పి పోదామని వచ్చాను” అని అంటాడు.

అపర్ణ కూడా విక్రమ్ ను ప్రేమిస్తుంది. తన మనసులోని మాటను విక్రమ్‌కు చెబుతుంది.

“నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూడకుండా వుండలేక పోతున్నాను. ఈ ఎడబాటును భరించడం కష్టమే. కాని నీవు తప్పకుండా విజయంతో వస్తావు. నాకు ఆ నమ్మకం వుంది. త్వరలో మనం కలుసుకుంటాంలే” అని ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ, విక్రమ్‌కు ధైర్యం చెప్పి వీడ్కోలు పలుకుతుంది.

విక్రమ్ మరలా గుర్రం మీద అతివేగంగా వెళ్తూ తన స్నేహితులను కలుసుకుంటాడు. స్నేహితులకు కూడా విక్రమ్ ప్రేమ గురించి తెలుసు. నలుగురూ అలా కొంత దూరం ప్రయాణిస్తూ వుండగా హాత్తుగా కొండగుట్టల నుండి బందిపోటు దొంగలు దాడి చేస్తారు. వారి మధ్య సుదీర్ఘమైన పోరు మొదలవుతుంది. నలుగురూ కలిసి ఆ దొంగలను మట్టు పెడ్తారు. మరి కొంత దూరము ప్రయాణము చేశాక అలసిపోవడము చేత విశ్రాంతి కుపక్రమిస్తారు. అలా నలుగురూ నిద్రిస్తూ వుండగా రాత్రి అవుతుంది. రాత్రంతా అదమరిచి నిద్రిస్తూనే వుంటారు. ఇక తెల తెల్లవారుతుండగా విక్రమ్ ప్రక్కనే కొంత అలజడి జరుగుతుంది. అదేమిటో చూసే లోపలనే ఒక పెద్ద కొండ చిలువ విక్రమ్‌ను చుట్టేస్తుంది. విక్రమ్ అతి కష్టంతో పెనుగులాడుతూ దాని తలను గట్టిగా పట్టుకుంటాడు. మిగిలిన స్నేహితులు కత్తులలో దాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. విక్రమ్ వారిని వారిస్తాడు. అలా చేస్తే అది ఇంకా రెచ్చిపోయి పట్టు బిగిస్తుందని చెబుతాడు. అలా కొంత సేపు దాని బలమైన మెలికలనుండి తప్పించుకుంటూ అతి కష్టం మీద మెల్ల మెల్లగా నేలపై ప్రాకుకుంటూ ప్రక్కనే వున్న పెద్ద చెట్టు మొదలుకు జరుగుతాడు. చెట్టునుండి క్రిందికి వేలాడే ఒకానొక కొమ్మనుండి రెండు ధృఢమైని పుల్లలను త్రుంచి దాని ముక్కు పుటాలలో దూర్చుతాడు. వెంటనే దాని తలను చెట్టు కాండానికి గట్టిగా అదిమిపట్టే సరికి అది ఊపిరాడక వెంటనే చస్తుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

నలుగురు యోధులు మరల ప్రయాణం సాగిస్తారు. ఇలా చాలా దూరము వెళ్ళాక కొండవీటి రాజ్యము యొక్క సింహద్వారము పరిసరాల్లోకి చేరుకుంటారు. విక్రమ్ వెంటనే ఆగమని చెప్తాడు.

“మనం రాజమార్గము ద్వరా వెళ్తే అక్కడ కాపలా కాస్తున్న రాజభటులతో యుద్ధము చేయవలసి వస్తుంది. ఈ వార్త భూమకేతనుడికి తెలుస్తుంది. అతను తన అపారమైన సేనను వెంటనే పంపిస్తాడు. అప్పుడు అంతమంది సైనికులతో మనము యుద్ధము చేయవలసి వస్తుంది. ఇది మనకు సాధ్యము కాని పని. మనము ఎలా వెళ్ళాలంటే గుట్టు చప్పుడు కాకుండా, అతి రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా వేరే మార్గములో రాజ్యములో ప్రవేశించాలి. అలాగే అతి రహస్యంగా ఒక్కొక్క సైనికుణ్ణి రాత్రి వేళలో చంపుతూ పోవాలి”. అని చెప్పి ప్రధాన రహదారి నుండి ప్రక్కనే చెట్ల పొదల ద్వారా వేరే దారిలో ప్రయాణిస్తారు. అలా కొంత దూరము పోయాక వారికి ఒక ఆశ్రమము కనపడుతుంది. వారు ఆశ్రమానికి చేరుకుంటారు. అది శివముని అనే ఒక యోగి ఆశ్రమము. చాలా మంది శిష్యగణంతో ఆశ్రమాన్ని నడిపిస్తూ ఉంటాడు. విక్రమ్, అతని స్నేహితులు శివమునికి నమస్కరించి తాము వచ్చిన కారణాన్ని వివరిస్తారు. శివముని వారిని ఎంతో ఆదరంగా పలుకరించి కొండవీటి రాజ్యానికి పోయే రహస్య దారిని వివరిస్తాడు. విక్రమ్ తన తండ్రి యిచ్చిన చిత్రపటాన్ని శివమునికి చూపిస్తాడు. “ఇది సరియైన చిత్రపటము. రాజ్యానికి ఎలావెళ్ళాలో నేను చెబుతాను వినండి.”

“మీరు ఈ అశ్రమము నుండి తిన్నగా ఎడమవైపునకు కొంత దూరము పోయాక చారుమతి నదిని చేరుకుంటారు. అది చాల విశాలమైన, లోతైన నది. మీరు పడవ ద్వారా ఆ నదిని దాటాలి.. అలా కొంత దూరము ప్రయాణించిన తర్వాత నదీ గట్టునుండే ఏర్పడిన పర్వత శ్రేణులను చేరుకుంటారు. ఆ పర్వతమును ఎక్కాలి, ఎత్తైన ఆ పర్వత శిఖరాన్ని చేరుకోగానే పై నుండి చూస్తే ఆవలివైపున చుట్టూ ఇతర పర్వత శ్రేణుల మధ్య చాలా సుందరంగా నిర్మింపబడిన కొండవీటి రాజ్యము కనబడుతుంది. ఆ పర్వతాన్ని ఎక్కడమే ఒక పెద్ద సాహసము. పర్వతము యొక్క రాతి సందులో విషసర్పాలు వుంటాయి. పర్వతము చాలా నునుపుగా వుంటుంది. అతి జాగ్రత్తగా మీరు ఆ పర్వతాన్ని అధిరోహించాలి. మీ అశ్వములను నా ఆశ్రమములోనే వదిలి పెట్టండి. నేను వాటిని చూసుకుంటాను. భూమకేతనుడి సంగతి నాకు బాగా తెలుసు. ఈ చుట్టుపక్కల వుండే అటవీ ప్రాంతపు గిరిజనులు, వారి మహిళలను చాలా చిత్రహింసలు పెట్టి అత్యాచారాలు చేశాడు. ఇతనిని ఎవరైనా అంతము చేస్తే బాగుంటుందని అనుకొనేవాణ్ణి. అదృష్టవశాత్తు అతను నా ఆశ్రమము జోలికి రాలేదు. చూడబోతే మీరు మంచి యోధులు లాగా వున్నారు. అతనిని అంతము చేయగలరు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుంటాయి” అని చెప్పి వాళ్ళను దీవిస్తాడు.

నలుగురు కాలినడకన ఆశ్రమము నుండి బయలుదేరుతారు. చారుమతి నదీతీరాన్ని చేరుకుంటారు. విక్రమ్ నదీ తీరములో నిలబడి దూరదర్శినిలో నలువైపులా ఒకసారి చూస్తాడు. నది యొక్క ఆవలి ఒడ్డున కొండలు, దట్టమైన చెట్లు వుంటాయి. నది చాలా గంభీరంగా ప్రవహిస్తూ వుంటుంది. నదీ తీరములో ఏ పర్వత శ్రేణి వైపుకు వెళ్ళాలో అర్ధము కాదు. అప్పుడు విక్రమ్ తన స్నేహితులతో

“మనము రాత్రి వరకు వేచి వుందాము. కొండవీటి సైనికులు నది ద్వారా వచ్చే శత్రువులున పసిగట్టడానికి పర్వతము నుండి దివిటీలతో అమత్తంగా వుండి కాపలా కాస్తూ వుంటారు. అప్పుడు మనము ఎటువైపు వెళ్ళాలో అర్ధమౌతుంది” అని అంటాడు. “నీ ఆలోచన చాలా బాగుంది విక్రమ్. నీవు చెప్పినట్లే రాత్రి వరకు వేచివుందాము” అని అంటారు అతని మిత్రులు ముగ్గురూ. బాగా విశ్రాంతి తీసుకుంటారు. ఇంతలో రాత్రి అవుతుంది. అద్భుతం! ఉత్తరము వైపు వున్న పర్వత శ్రేణిలో వివిధ ఎత్తులలో చీమలదండులాగ దివిటీలు వెలుగుతుంటాయి. దీని అర్థము రాత్రివేళ సైనికులు కాపలా కాస్తున్నారని మరియొక వింత ఏమిటంటే పర్వతము యొక్క ఒకానొక గుహ ద్వారము నుండి విపరీతమైన రెండు కాంతి పుంజాలు నదిలో ప్రసరిస్తూ నది నంతటినీ కలియదిరుగుతూ శత్రువుల ఉనికిని పసిగట్టడానికి నిర్మించబడి వుంటాయి. ఈ అద్భుతాన్ని ఆ నలుగురూ అభినందించకుండా వుండలేక పోయారు. విక్రమ్ మిగతా వారితో

“మనము ఇప్పుడు పడవ ద్వారా కాంతిపుంజాన్ని తప్పించుకుంటూ చీకటి ప్రాంతము ద్వారా ఉత్తర దిక్కునున్న పర్వత శ్రేణి దగ్గరకు వెళ్ళాలి. చీకట్లోనే ఆ పర్వతాన్ని ఎక్కాలి. కాబట్టి వెంటనే బయలు దేరుదాము” అని చెప్పి అక్కడ అనేక ఖాళీ పడవలుంటే ఒక దానిని ఎంచుకొని నీటిలో కాంతిపుంజాన్ని తప్పించుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తారు. అలా చాలా సేపు తర్వాత పర్వతాన్ని చేరుకుంటారు.

పర్వతాన్ని ఎక్కడానికి ఉపక్రమిస్తారు. తమ వెంట తెచ్చుకున్న సామాగ్రితో కృతిమంగా తయారు చేసుకున్న చిన్న చిన్న దివిటీలతో ఆ పర్వత నెరియలలోనికి బలమైన మేకులను దింపి, తాళ్ళను ఆ మేకులకు బిగించి ఆ తాళ్ళద్వారా పర్వతము నెక్కుతారు. విక్రమ్ తాడు పట్టుకొని పైకి పోతూ వుంటే అతనిని విజయ్, త్రివిక్రమ్, చివరలో గంగాధర్ అతి జాగ్రత్తగా అనుసరిస్తారు. ఇంతలో సన్నటి వర్షపు చినకులు ప్రారంభమౌతాయి. అసలే రాతి పర్వతము చాలా నునుపుగా వుంటుంది. ఇప్పుడు వర్షము ప్రారంభమైంది. ఎక్కడము చాలా కష్టంగా మారింది. ఇంతలో హఠాత్తుగా రాతి బొరియనుండి ఒక నాగుపాము విక్రమ్‌ను కాటేయడానికి బుసకొడూ బయటికి వస్తుంది. విక్రమ్ అతి చాకచక్యంగా దాని మెడ ప్రాంతమును తట్టుక్కున పట్టుకొని దూరంగా విసిరివేస్తాడు. విజయ్, త్రివిక్రమ్, గంగాధర్లను హెచ్చరిస్తాడు. వారు భయం, భయంగా ఎక్కుతూ వుంటారు. అలా కొంత ఎత్తున కెళ్ళాక ఉన్నట్టుండి త్రివిక్రమ్ పట్టుకోల్పోయి క్రిందికి జారుకుంటూ పడబోతూ వుంటాడు. ఇది గమనించిన గంగాధర్ వెంటనే త్రివిక్రమ్‌ను గట్టిగా పట్టుకుంటాడు. పై నుండి విజయ్ కొంతమేర క్రిందికి తాడు సహాయంతో దిగి అతనికి చేయి అందిస్తాడు. త్రివిక్రమ్ విజయ్ చేయి పట్టుకొని అతి కష్టం మీద పైకి ఎగబ్రాకుతాడు. మరలా అందరూ పర్వతము ఎక్కుతూ వుంటారు. ఇంతలో హఠాత్తుగా రాతి బోరియలనుండి రక్త పింజరి విజయ్‌ను కాటేయడానికి వస్తుంది. విజయ్ కూడా దాన్ని చాకచక్యంతో పట్టుకొని దూరంగా విసిరి వేస్తాడు. ఇలా అతికష్టము మీద వాళ్ళు ఎక్కుతూ పర్వత శిఖరాన్ని చేరుకుంటారు. పర్వత శిఖరము నుండి క్రిందికి చూస్తే కొండవీటి రాజ్యము అద్భుతంగా కనబడుతుంది. ఉత్తర, దక్షిణ దిక్కుల పర్వత శ్రేణులకు కొంచెము క్రింద రాతి కొండలు ఉంటాయి. ఈ కొండలలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు (బంకర్లు) కృతిమంగా మలచిన గుహలు ఉంటాయి. ఇంకా క్రింద రాతి కట్టడాల మధ్యలో నడకదారి కూడా కృతిమంగా కట్టబడి వుంటుంది. ఈ దారికి ఇరువైపులా అనేక రాతి శిల్పాలు వుంటాయి. అట్లాగే ఉత్తర, దక్షిణ రాతి గుహలలో నుండి క్రింద కనబడుతూ వున్న విశాల గుహ ద్వారాలు (రంధ్రాలు) చాలా చక్కగా నిర్మితమై వుంటాయి. రాజభటులు ఆ గుహ రంధ్రాల ద్వార విల్లంబులతో బాణాలను మైదానములోనికి వదులుతూ వుంటారు. ఈ నిర్మాణాలు చాలా ప్రత్యేకమైనవి. మైదానానికి తూర్పు దిక్కున విశాలమైన బంగారుతో నిర్మితమైన రాజ సింహాసనము వుంటుంది. సింహాసనానికి ఇరువైపులా చాలా పెద్ద గుంటలు వుంటాయి. రాజు అక్కడ నుండే ప్రజాదర్బారును నిర్వర్తిస్తూ వుంటాడు. శిక్షపడిన ప్రజలందరూ మైదానములోనికి చేరుకోగానే రాజు గంటలను మ్రోగించమంటాడు. గంటల ప్రతిధ్వని మైదానమంతా విస్తరిస్తుంది. వెంటనే రాజభటుల పై నుండి గుహల రంధ్రాల నుండి బాణాల వర్షాన్ని ప్రజల మీదికి కురిపిస్తారు. వారు వెంటనే మరణిస్తారు. బాణాలు ఎక్కడినుంచి వస్తున్నాయో వారికి అర్థము కాని పరిస్థితి. సింహాసనము నుండి రాజు రాక్షసానందము పొందుతూ వుంటాడు. అట్లాగే మైదానము ఉత్తర, దక్షిణ కొండలలో ప్రజలు కూర్చోవడానికి మెట్లు కూడా (గ్యాలరీ) నిర్మించబడి వుంటాయి. ప్రజా దర్బారు జరిగేటప్పుడు వారు ఇక్కడనే కూర్చుంటూ వుంటారు.

విక్రమ్, విజయ్, త్రివిక్రమ్, గంగాధర్ శిఖరాగ్రము చేరుకొనే సరికి తెల్లవారుతుంది. అప్పుడు విక్రమ్ “మనము ఇప్పుడు ఈ కొండలలో రహస్యంగా తలదాచుకోవాలి. లేకుంటే సైనికులు మనలని పసిగడ్డారు. ఈ కొండ గుహలలోనే రహస్య ప్రదేశమొక దానిని ఎంచుకోవాలి. అక్కడినుండి ఈ రోజంతా ఏమి జరుగుతుందో చూడాలి. మనము దాడులను రాత్రివేళల్లో చేయాలి. ఎవ్వరూ పసిగట్టకుండా ఒక్కొక్క సైనికుడి మీద విరుచుకుపడాలి. రెండవ సైనికునికి తెలియకుండా మట్టు బెట్టాలి. కాబట్టి మనము వెంటనే ఒక రహస్య స్థావరాన్ని ఎంచుకుందాము పదండి” అని చెప్తూ ముందరికి కదులుతాడు. అలా ఆ కొండ గుహలలో తారట్లాడిన తర్వాత వాళ్ళకు అనువుగా వుండే ఒక స్థావరాన్ని ఎంచుకుంటారు. అక్కడ నుండి క్రింద ఏమి జరుగుతుందో గమనిస్తూ వుంటారు. ఇంతలో సాయంత్రమౌతుంది. అప్పుడు కొంతమంది సైనికులు ఆహార పదార్థాలను వరుసగా కొండలలో ఏర్పరుచుకున్న దారి గుండా తీసుకొని వెళ్తూ వుంటారు. ఆ నలుగురూ వెంటనే వారిని రహ్యంగా అనుసరిస్తూ వుంటారు. అలా ఆ సైనికులు ఒకానొక గుహ ద్వారము దగ్గరికి వెళ్తారు. నిజానికి ఆ గుహ ఒక పెద్ద కారాగారము.

ఆ కారాగారములో గణపతి రాజును, అతని పరివారాన్ని ఇతర ఖైదీలతో బంధించి వుంటారు. కొంతమంది సైనికులు అక్కడ కాపలా కాస్తూ వుంటారు. విక్రమ్ తన ముగ్గురు మిత్రులతో ఆ సైనికుల మీదికి దాడి చేసి వారిని హతమారుస్తాడు. గణపతిరాజును, పరివారాన్ని విడిపించుకొని మరొక రహస్య స్థావరానికి తీసుకొని వెళ్తాడు. గణపతిరాజుకు తనను పరిచయం చేసుకొని తన మిత్రులను కూడా పరిచయం చేస్తాడు. బాగా చీకటి పడివుండడము వలన వీళ్ళను ఏ సైనికుడు గుర్తుపట్టలేదు. అప్పుడు విక్రమ్ తన స్నేహితులతో జరగబోయే వ్యూహాన్ని వివరిస్తాడు. విక్రమ్ పరాక్రమమైన యోధుడే కాక మంచి వ్యూహకర్త కూడా. విక్రమ్ తన స్నేహితులతో

“విజయ్! నీవు ఈ గుహవద్ద వీళ్ళను కాపలా కాస్తూ వుండాలి. నాకు అందుబాటులో వుండాలి. నేను త్రివిక్రమ్, గంగాధర్‌తో కలిసి మొదట బాణాలను సంధించే సైనికులను చంపేస్తాము. అడ్డువచ్చిన సైనికులను కూడా చంపేస్తాము. అందరి సైనకులను రాత్రికి రాత్రి హఠాత్తుగా దాడి చేసి చంపేస్తాము. కాంతి పుంజాలను నియంత్రించే సైనికులను కూడా చంపేస్తాము. ఉత్తర, దక్షిణ కొండలలో గల సైనికులను వరుసగా చంపుతూ పోతాము. ఇప్పుడు కారాగారము వద్ద చంపిన సైనికుల దుస్తులను మనమందరము శిరస్త్రాణాలతోసహా ధరిస్తాము. విజయ్! నీవు తిన్నగా రాజుగారి సింహాసనము దగ్గరికి చేరుకోవాలి. అక్కడ రాజుగారి వద్ద శల్య సారధ్యము చేయాలి. నేను ‘కాలయముడు’ అనే పేరుతో ఎవరికీ తెలియకుండా తిరుగుతూ వుంటాను. నీవు వెంటనే భూమకేతనుడి దగ్గరికి వెళ్ళి ‘ప్రభూ! ఎవరో కాలయమడంట. కారాగారము వద్ద నున్న మన సైనికులను చంపి గణపతిరాజును, అతని పరివారాన్ని విడిపించుకొని పోయాడు. ఈ కాలయముడు ఎవరో అసాధ్యుడుగా వున్నాడు. ఎవరికీ కనపడడు. మనము జాగ్రత్తగా వుండాలి’ అని భూమకేతనుడు భయపడేవిధంగా చెప్పాలి” అని చెప్తాడు. విజయ్ ఇటువంటి విద్యలలో ఆరితేరినవాడు. వెంటనే

“విక్రమ్! నేను ఇక్కడ కాపలాకాస్తూ అప్పుడప్పుడు భూమకేతనుడి దగ్గరికి వెళ్ళి నీవు చెప్పినట్లే అతను భయపడేవిధంగా పిరికి మాటలు చెప్తూ వుంటాను. మీరు ముగ్గురూ మిగతా పనులను చూసుకొండి” అని చెబుతాడు. నలుగురూ వాళ్ళు చంపిన సైనికుల దుస్తుల్ని, శిరణాలను ధరించి ఎవ్వరూ గుర్తుపట్టని విధంగా మరలా తమ స్థావరాన్ని చేరుకుంటారు.

రెండవ రోజు ఈ ముగ్గురూ కాంతిపుంజాలను నియంత్రించే సైనికుల గుహ వద్దకు వెళ్ళి హఠాత్తుగా వారిమీద దండెత్తి అక్కడ వున్న సైనికులను హతమారుస్తారు. విజయ్ తిన్నగా భూమకేతనుడు రాజదర్బారులో వుండగా కారాగారము వద్ద జరిగిన సంగతిని వివరిస్తాడు. భూమకేతనుడు కోపముతో ఊగిపోతాడు. “ఎవరు ఈ కాలయముడు? ఎక్కడినుండి వచ్చాడు? వాడిని హతమార్చండి” అని తన సైనికులను ఆదేశిస్తాడు.

విజయ్ మళ్ళా రెండవరోజు భూమకేతనుడి దగ్గరికి వెళ్ళి “ప్రభూ! మన కాంతిపుంజాలను నియంత్రించే సైనికులను కాలయముడు హతమార్చాడు. అక్కడ అందరు సైనికులు చచ్చి పడి వున్నారు. కాంతిపుంజాలు పని చేయడము లేదు. కాలయముడు చాలా ఘటికుడుగా వున్నాడు ప్రభూ!” అని కాలయముడి గురించి చాలా భయంకరంగా చెబుతాడు. భూమకేతనుడు ఇంకా కోపముపట్టలేక గట్టిగా ఒక్క అరుపు అరుస్తాడు. రాజదర్బారంతా దద్దరిల్లి పోతుంది, ఒక పక్క కోపము మరొక పక్క భయముతో సతమతమవుతూ వుంటాడు. అతి క్రూరుడైన భూమకేతనుడు మొదటిసారి భయముతో వణికిపోవడము రాజు యొక్క పరివారము గమనిస్తుంది.

మూడవ రోజు విక్రమ్ మిగిలిన ఇద్దరు స్నేహితులు బాణాలు సంధించే గుహల వద్ద వున్న సైనికులను అనగా ఉత్తర దిక్కున వున్న దాదాపు ఎనిమిది గుహ రంధ్రాల వద్ద వున్న సైనికులను దక్షిణ దిక్కున వున్న అదే సంఖ్యలో గల ఎనిమిది గుహ రంధ్రాల సైనికులను హతమారుస్తారు. అడ్డు వచ్చిన సైనికులను కూడా హతమారుస్తారు.

రాజభవనానికి దక్షిణ దిక్కున రాణీవాసం యొక్క అంతఃపురము వుంటుంది. అదే దిక్కున భూమకేతనుడి తమ్ముడు రుద్రకేతనుడి భవనము వుంటుంది. రుద్రకేతనుడు కూడా అతి క్రూరుడు, స్త్రీలోలుడు. నిరంతరము కొండవీటి రాజ్యము సమీపులో వున్న గిరిజన స్థావరాలకు వెళ్ళి అక్కడి ప్రజలను నానా హింసలు పెడ్తూ వుంటాడు. గిరిజన మహిళలపై అత్యాచారము చేస్తూ వుంటాడు. అంతేగాక కొంతమంది బందిపోటు దొంగలతో కూడా స్నేహము వుంటుంది. వారిలో వీరబాహు అనే బందిపోటు దొంగల నాయకుడు అతనికి మంచి స్నేహితుడు.

సోమనాధుని కుమార్తె అపర్ణ చాలా ఆందోళన చెందుతూ వుంటుంది. తాను ప్రేమించిన విక్రమ్ ఇంకా తిరిగి రాలేదు. ఏముప్పు వాటిల్లిందో తెలియదు. విక్రమ్ లేని క్షణం ఒక యుగంలా గడిచిపోతూ వుంది. ప్రణయ ఎడబాటు రోజు రోజుకూ తీవ్రతరమౌతోంది. ఇక ఉండబట్టలేక తన చెలికత్తెలు భారతి, హేమలతో మారువేషం ధరించి ఒకనాడు రాత్రి తండ్రికి కూడా చెప్పకుండా అశ్వాలమీద యుద్ధ సామాగ్రితో కొండవీటి రాజ్యము వైపు బయలుదేరుతుంది. అలా ఆ ముగ్గురూ చాలాదూరం ప్రయాణించిన తర్వాత ఒక చెట్టు క్రింది విశ్రాంతి తీసుకుంటూ వుంటారు. ఇంతలో హఠాత్తుగా బందిపోటు దొంగైన వీరబాహు తన అనుచరులతో అపర్ణ ఇద్దరు చెలికత్తెల మీద దాడి చేస్తాడు. ఆడవారు ముగ్గురూ వీరబాహుతో యుద్ధము చేస్తారు. చివరకు వీరబాహు వారిని ఓడించి, బంధించి తన స్థావరానికి తీసుకెళ్ళి నగలు, ఇతర సామాగ్రిని తస్కరిస్తాడు. వీరబాహు తన అనుచరులతో రుద్రకేతనుడికి కబురు పంపుతాడు. రుద్రకేతనుడు తన రథములో వెంటనే వచ్చి అపర్ణను చూస్తాడు. అపర్ణ సౌందర్యానికి ముగ్ధుడౌతాడు. అపర్ణను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. అపర్ణ దురుసుగా తిరస్కరిస్తుంది. అపర్ణతో “నీవు త్రిలింగదేశ యురాణివని చెప్పుతున్నావు. నేను కొండవీటి దేశ యువరాజును కాబట్టి మన ఇద్దరి జోడి సరిపోతుంది. బెట్టు చేయకుండా నన్ను పెండ్లి చేసుకో. నిన్ను ఒక మహారాణిని చేస్తాను. ఏ లోటు రాకుండా పువ్వులలో పెట్టుకొని చూసుకుంటాను. ఏమంటావు”? అని అంటాడు. అందుకు అపర్ణ

“మీ రాజ్యానికి ముసలం పట్టుకుంది. నీవు, నీ సోదరుడు భూమకేతనుడు ఎప్పుడ అంతమౌతారో తెలియదు. చాలా పెద్ద ముప్పు మీముందు పొంచివుంది. కొద్ది రోజుల్లోనే చనిపోయే నీవు నన్ను ఎలా పెండ్లి చేసుకుంటావు” అని ఏదో జోస్యము చెప్పినట్లు చెప్తుంది. కాని విక్రమ సింహ గురించి ఒక్కమాట చెప్పదు. అతి అతనికి కీడు చేస్తుఐదని తనకు తెలుసు. రుద్రకేతనుడు అపర్ణ మాటలకు కోపము వచ్చి తన రధములో ముగ్గురిని బంధించి తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు.

సింహద్వారము చేరే సమయానికి చీకటి పడుంది. దక్షిణ దిక్కున వున్న తన భవనానికి అపర్ణను తీసుకొని వెళ్తూ వుంటాడు. అప్పటికే దక్షిణ దిక్కున వున్న సైనికులను విక్రమ్, త్రివిక్రమ్, గంగాధర్ లు చంపుతూ పోతూ వుంటారు. విక్రమ్ హఠాత్తుగా రుద్రకేతనుడు అపర్ణను తీసుకెళ్ళడము చూస్తాడు కోపోద్రిక్తుడౌతాడు. ఒక్క ఉదుటన రుద్రకేతనుడి మీదికి దండెత్తుతాడు. హోరాహోరీగా పోట్లాడుతాడు. గంగాధర్ అపర్ణను, ఆమె చెలికత్తెలను బంధాలనుండి విడిపించి పక్కనే రహస్య ప్రదేశానికి తీసుకెళ్తాడు. సైనికులు అతనిపై దాడి చేస్తారు. వారిని గంగాధర్ చంపేస్తాడు. ఇక్కడ విక్రమ్, రుద్రకేతునుడి మధ్య పోరు కొనసాగుతూనే వుంటుంది. త్రివిక్రమ్ ఇతర సైనికులతో యుద్ధము చేస్తూ వుంటాడు. కొంత సేపైన తర్వాత విక్రమ్ రుద్రకేతనుడిని చంపేస్తాడు. రుద్రకేతనుడు, ఇతర సైనికులు చనిపోయిన తర్వాత ముగ్గురూ, అపర్ణ, ఆమె చెలికత్తెలను తాము ఏర్పరచుకొన్న రహస్య స్థావరానికి తీసుకెళ్తారు. రుద్రకేతనుడి శవాన్ని గోనెసంచిలో చుట్టి తెల్ల తెల్లవారుతుండగా రాజభవనానికి ముంగిట వున్న విశాలమైన మైదానము మధ్యలో వదిలితిరిగి తమ స్థావరానికి వెళ్తారు.

రాజప్రాంగణములో ఎవరో శవమును వదిలి వెళ్ళారనే వార్త ప్రజలలో ప్రాకుతుంది. పొద్దున్నే ప్రజలందరూ రాజప్రాంగణంలో చేరుకుంటారు. వాళ్ళలో గుసగుసలు మొదలౌతాయి. అది ఎవరి శవమై వుంటుంది. ఎవరు చంపి వుంటారు. కాలయముడు రాజ్యములో సైనికులను చంపుతూ కోలాహలము సృష్టిస్తున్నాడు. అసలు ఎవరు ఈ కాలయముడు. క్రూరుడైన భూమకేతనుడిని గడగడలాడిస్తున్నాడు. ఇలా వాళ్ళు పరిపరివిధాలుగా మాట్లాడుకుంటూ వుంటారు.

విజయ్ వెంటనే భూమకేతనుడి వద్దకు వెళ్ళి “ప్రభూ! ప్రొద్దున్నే కాలయముడో, ఇంకెవరో గోనె సంచిలో ఒక శవాన్ని మైదానంలో వదిలివేశారు. ఆ గోనె సంచి పైన ‘ఇది ఒక శవము, భూమకేతనుడు చూసేవరకు సంచిని విప్పకండి’ అని రాసి వుంది. మీరు వెంటనే మైదానము వద్దకు రండి” అని ఆతృతగా చెప్తాడు.

భూమకేతనుడికి విపరీతమైన కోపము వస్తుంది ఒక్క ఉదుటున ప్రజా దర్బారు సింహాసనము దగ్గరికి వస్తాడు. తన భటులతో “ఆ గోనె సంచి విప్పండి” అని ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు సంచిని విప్పుతారు. ఒక్కసారి అందరూ విస్తుపోతారు. అది రుద్రకేతుడి శవము. భూమకేతుడు గట్టిగా అరుస్తాడు.

“ఎవరు ఈ పని చేసింది. పిరికి పంద! ఇది కాలయముడి పనేనా? అట్లయితే నాముందు వచ్చి నిలబడమనండి. వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా తమ్ముడిని చంపినందుకు ప్రతీకారము తీర్చుకుంటాను” అని బిగ్గరగా అరుస్తాడు. అప్పుడు నల్లని ముసుగులో ఒక వ్యక్తి మైదానములోనికి ప్రవేశిస్తాడు. అతనే కాలయముడు. ప్రజలందరూ ‘కాల’, ‘కాల’ అని హాహాకారాలు చేస్తారు. అప్పుడు భూమకేతనుడు “ముసుగువేసుకొని పిరికి పందలాగ వస్తున్నావు. నీవు ఎవరు? నీకు ధైర్యము లేదా? ఆ ముసుగు తొలగించి నన్ను ఎదుర్కో. ఈ ప్రజల ముందర నిన్ను చీల్చి చెండాడుతాను” అని బిగ్గరగా గర్జిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ముసుగు తొలగిస్తాడు.

“ఓ భూమకేతా! నేను విక్రమసింహుడిని. నా రాజ్యము త్రిలింగ దేశము. నిన్ను అంతము చేయడానికి వచ్చిన కాలయముడిని. గణపతి రాజును, అతని పరివారాన్ని అపహరించుకొని పోయిన వాణ్ణి నేనే!” అని బిగ్గరగా చెబుతాడు, వెంటనే భూమకేతనుడు “గంటలు మ్రోగించండి” అని తన భటులను ఆదేశిస్తాడు. గంటలు మ్రోగుతాయి. కాని బాణాల వర్షం కురువదు. “పిచ్చి భూమకేతా! బాణాలను సంధించే సైనికులందరిని నేనే చంపేశాను. అందుకే బాణాలు ఇక పడవు. నీ సైనికులను చాలా మందిని అంతమొందించాను. ఇక నీ వంతు” అని అంటాడు. ఈ మాటలకు భూమకేతనుడికి కోపము వచ్చి సింహాసనము నుండి కత్తి, డాలు తీసుకొని విక్రమ్ మీదికి దూసుకు వస్తాడు. విక్రమ్ కూడా ప్రక్కనే వున్న ఒక సైనికుడిని తన్ని కత్తి, డాలు తీసుకొని భూమకేతనుడి మీదికి ఒక్క ఉదుటన లంఘిస్తాడు.

ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధము జరుగుతుంది. ఇతర సైనికులు ఈటెలతో విక్రమ్‌ను చంపడానికి మీదికి వస్తారు. వాళ్ళను కూడా విక్రమ్ నరుకుతూ పోతాడు. సైనికులందరూ మైదానంలో పిట్టల్లాగా పడిపోయివుంటారు. విక్రమ్ మీదికి మరలా భూమకేతనుడు దండెత్తుతాడు. చాలా సేపు ఇద్దరి మధ్య అలా యుద్ధము జరిగిన తర్వాత ఇద్దరికీ బాగా గాయాలు తగులుతాయి. విక్రమ్ కన్నా భూమకేతుడికి ఎక్కువ గాయాలు తగిలి వుంటాయి. ఆ గాయాలు కూడా కాళ్ళు, తొడలు, ఛాతీ, చేతుల మీద బలంగా తగిలి వుండడము చేత శక్తి కోల్పోతాడు. కాళ్ళు విరుగుతాయి. నేలమీదనే ప్రాకుకుంటూ ఇంకా శక్తినంతటిని కూడగట్టుకొని విక్రమ్ మిదికి చివరగా లంఘిస్తాడు. విక్రమ్ ఒక్క వేటుతో అతనిని సంహరిస్తాడు. భూమకేతనుడు నేలకు ఒరుగుతాడు. ప్రజలందరూ “విక్రమ్, విక్రమ్” అని మిన్నంటేలా జయ జయధ్వానాలు చేస్తారు. గణపతిరాజు, అతని పరివారము, కారాగారములో బందీలుగా వున్న ఇతర ప్రజలను విజయ్ విడిపించుకొని వస్తాడు. వేగుల ద్వారా అపర్ణ విషయము తెలుసుకున్న సోమనాధుడు, చిత్రాంగదుడు వారి సైన్యముతో కొండవీటి రాజ్యానికి వస్తారు. భూమకేతనుడి సైనికులు కిక్కురుమనకుండా లొంగిపోతారు.

రాజ ప్రాంగణంలో వున్న మైదానములో అందరూ చేరుకుంటారు. ఈ లోగా శివముని తన శిష్యులతో అశ్వాలను తీసుకొని వస్తాడు. భూమకేతనుడు , రుద్రకేతనుడు చనిపోయారనే వార్త వినగానే చెట్టు ప్రక్కల వున్న దేశాల రాజులు ప్రజలు, ఆదివాసీ జనము అందరూ కొండవీటి రాజ్యానికి వస్తారు. అందరూ సంతోషిస్తూ, “విక్రమ్” “విక్రమ్” అని బిగ్గరగా అరస్తూ వుంటారు.

బంగారు సింహాసనము వద్ద గణపతి రాజు, సోమనాధ రాజు విక్రమ్‌ను అతని స్నేహితులైన విజయ్, త్రివిక్రమ్, గంగాధలను అభినందిస్తారు. విక్రమ్ తండ్రి జయసింహ కూడా అక్కడికి చేరుకుంటాడు.

సోమనాధ రాజు అపర్ణను విక్రమ్‌కు ఇచ్చి పెండ్లి చేస్తాడు. గణపతిరాజు, సోమనాధ రాజు ఇద్దరూ “కొండవీటి రాజ్యాన్ని నీవే ఏలుకో, సుఖంగా వుండు” అని దీవిస్తారు. ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణంలో నిండిపోయి ఉంటుంది.

— శుభం —-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here