విలువల బడి

0
2

[box type=’note’ fontsize=’16’]”ప్రతి విద్యార్థి మనసును ప్రక్కదారి పట్టనివ్వకుండా చదువుమీద లగ్నం చెయ్యాలి. అదే భవిష్యత్తుకు పూలబాట” అనే సందేశంతో కూడిన నాటికని అందిస్తున్నారు యలమర్తి అనూరాధ. [/box]

పాత్రలు:

కీర్తికిరణ్ – విద్యార్థి – పదవతరగతి – అంతరంగం

పావని – విద్యార్థిని – పదవతరగతి

ధర్మారావు – పావని తండ్రి

రాజ్యలక్ష్మి – పావని తల్లి

రంగి – పని అమ్మాయి

శ్రీను – కీర్తికిరణ్ స్నేహితుడు

***

(పావని కూర్చుని స్కూలు వర్క్ చేసుకుంటూ ఉంటుంది)

కీర్తి : ఓ! పావనీ ఇక్కడున్నావా? నీ కోసం అంతా వెతికేస్తున్నా.

పావని : నువ్వా కీర్తీ! నాతో ఏం పని?

కీర్తి : ప్రేమించుకుందాం అని చెప్పడానికి.

పావని : అమ్మో! నాకు భయం

కీర్తి : భయమా? (హఁ! హఁ! అని నవ్వుతాడు)

పావని : (చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ) ఏయ్! ఎందుకా నవ్వు?

కీర్తి : మరి నవ్వు రాదా? చిన్నపిల్లలా భయం అంటుంటే….?

పావని : (నసుగుతున్నట్లు) ఊ….!

కీర్తి : (ప్రక్కన దగ్గర చేరి) భయమెందుకు చెప్పు? యల్.కె.జీ వాళ్ళు కూడా లవ్ చేసుకుంటున్నారు.

పావని : (ప్రశ్నార్థకంగా) అయితే…?

కీర్తి : మనమెందుకు ప్రేమించుకోకూడదు?

పావని : ఏమో?

కీర్తి : నేనంటే ఇష్టమా? కాదా?

పావని : ఇష్టమే! కానీ… (నసుగుతూ)

కీర్తి : ఎన్ని సినిమాల్లో చూడటం లేదూ? అలాగే మనమూ… లవ్ చేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ తెలుసా?

పావని : (అనుమానంగా చూస్తూ) ఇంట్లో తెలిస్తే?

కీర్తి : తెలియనిస్తామా ఏమిటి? అంతా గప్‍చిప్‍గా… లెటర్స్ రాసుకుని నోట్‍బుక్‍లో పెట్టి ఒకళ్ళనొకళ్ళం ఇచ్చుకుందాం. అంతే!

పావని : (ఉత్సాహంగా) అయితే సరే కిరణ్.

కీర్తి : ఇకనుంచీ టైమ్ పాస్ అయిపోతుంది. మజాగా కూడా ఉంటుంది. నువ్వే చూస్తావుగా.

పావని : మన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే అమ్మా వాళ్ళు చంపేస్తారు.

కీర్తి : ఆ విషయం నాకు వదిలేయ్.

పావని : ఎలా?

కీర్తి : అందరిముందూ మామూలుగా ఉందాం. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు.

పావని : (అంగీకారంగా) అలాగే.

కీర్తి : ఇలా అనుకుంటుంటే ఎగ్జైటింగ్‍గా లేదూ!

పావని : నాకయితే భలే థ్రిల్‍గా ఉంది.

కీర్తి : సరే! రేపటి నుంచీ ఏమేమి చెయ్యాలో ప్లాన్ చేసుకుందాం.

పావని : సరే!

***

ధర్మారావు ఇంట్లో లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. రాజ్యక్ష్మి చీరకు వర్కు చేసుకుంటూ ఉంటుంది.

రాజ్యలక్ష్మి : ఏమండీ!

ధర్మారావు : (పలకడు)

రాజ్యలక్ష్మి : (మళ్ళీ గట్టిగా) ఏమండీ?

ధర్మారావు : (విసుగ్గా) ఏమిటే పని చేసుకోనివ్వకుండా.

రాజ్యలక్ష్మి : పని ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు నామాట వినండి.

ధర్మారావు : సరే చెప్పు.

రాజ్యలక్ష్మి : రోజులు బాగాలేవండి. సినిమాల్లో పదవతరగతి, ఇంటర్ నుంచే ప్రేమించుకుంటున్నట్లు చూపిస్తుంటే పిల్లలంతా ప్రేమించడమే గొప్ప అనుకుంటున్నారు.

ధర్మారావు : వాళ్ళేమో వెరైటీ కోసం తీస్తున్నారు. వీళ్ళేమో వాటిని అనుసరిస్తున్నారు. మంచి చూపిస్తున్నామని చెబుతూ ఇలా చెడగొడుతున్నారు.

రాజ్యలక్ష్మి : అవునండీ. అదే భయంగా ఉంది. పావనిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే పెద్దమనిషి అయిన పిల్ల.

ధర్మారావు : అవునే రోజులు అసలు బాగాలేవు.

రాజ్యలక్ష్మి : చిన్నపిల్లలని చూడకుండా ఎక్కడపడితే అక్కడ ఎవరిని పడితే వారిని అత్యాచారం చేసేస్తున్నారు.

ధర్మారావు : ఓ కంట కనిపెట్టి ఉండు. అదీ దానికి తెలియకుండా జాగర్తపడు. తెలిస్తే బాధపడుతుంది.

రాజ్యలక్ష్మి : అలాగే.

(పనిమనిషి ‘అమ్మగారూ! అమ్మగారూ!’ అంటూ అక్కడికి వస్తుంది)

రాజ్యలక్ష్మి : ఏమిటే, ఈరోజు ఆలస్యంగా వచ్చావ్?

రంగి : మన పాపగారు చదివే స్కూల్లో హెడ్ మాష్టారు ఓ పాపను బాత్రూంలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడటమ్మా.

రాజ్యలక్ష్మి : అయ్యోఁ!

ధర్మారావు : ఎలా తెలిసింది?

రంగి : స్పృహ తప్పి పడిపోయుంటే ఎవరో చూశారట.

రాజ్యలక్ష్మి : (ఆత్రంగా) ఇప్పుడెలా ఉంది?

రంగి : ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఏమౌతుందో? ఏమో? వెధవ సచ్చినోడు పోయేకాలం దాపరించింది.

రాజ్యలక్ష్మి : గురువు స్థానంలో ఉండి తండ్రిలా కాపాడవలసింది పోయి ఈ రాక్షసత్వం ఏమిటో?

ధర్మారావు : ఆ విచక్షణే ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు (లక్ష్మీ) అది లేకే… ప్చ్… అంటూ వెళ్ళిపోతాడు.

రంగి : అక్కడే ఆలస్యం అయిపోనాది. బేగీ అంట్లు తోమేసి వెళ్ళిపోవాలి.

రాజ్యలక్ష్మి : సరే! పద.

రంగి : ఇలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు. ఉరి తియ్యాలి.

రాజ్యలక్ష్మి : వేస్తున్నారే రంగీ! మధ్యప్రదేశ్‍లో ఇలా చేసినవాళ్ళకు మరణశిక్ష వేస్తున్నారు. మనకూ అది ప్రాకితే అన్నా కాస్త ఈ ఆగడాలు తగ్గుతాయి.

రంగి : చల్లని వార్త చెప్పారు. అది విన్నకాడ నుండి నా మనసు కుతకుతా ఉడికిపోతోంది. అక్కడిక్కడ వాడ్ని వేసెయ్యాలనిపించింది. ఈ గడ్డ మీద పుట్టి ఇలాంటి వేషాలేస్తారా.

రాజ్యలక్ష్మి : అందుకే కదా మన ప్రభుత్వం కూడా ఈ మధ్య పన్నెండేళ్ళలోపు పిల్లలపైన అత్యాచారం చేసినవాళ్ళకు మరణశిక్ష ఖరారు చేసేస్తోంది.

రంగి : అలాగే చెయ్యాలమ్మా. ఇలాంటివాళ్ళ తిక్క కుదరాలి.

(ఇద్దరూ లోపలకు వెళ్ళిపోతారు)

***

(ఇందిరా పార్కు. పిల్లల ఆటలు శబ్దాలు..)

కీర్తి : ఏదైనా చెప్పు పావనీ.

పావని : ఏంటి చెప్పేది? ఇక్కడ ఎవరైనా చూస్తే…?

కీర్తి : చూడరులే… ఏదైనా మాట్లాడు.

పావని : నాకు భయంతో మాటలు రావడం లేదు. నువ్వే చెప్పు.

కీర్తి : ఈ రోజు నీ పుట్టినరోజు కదా! నీకు ‘సెల్’ గిఫ్ట్‌గా తెచ్చాను. హ్యాపీ బర్త్‌డే!

పావని : (ఆనందంగా) ఓ! థ్యాంక్యూ!

కీర్తి : అమ్మానాన్నా ఇచ్చే పాకెట్ మనీ దాచి నీకోసం కొన్నా తెలుసా?

పావని : అవునా? మీ అమ్మా నాన్న ఏమీ అనరా?

కీర్తి : ఉహుఁ! వాళ్ళకి తీరికే ఉండదు. ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఖాళీగా ఉన్నా ఒకళ్ళు వాట్సప్‍లో, మరొకరు ఫేస్‍బుక్‍లో.

పావని : అదేమిటి? మీరంతా కలిసి మాట్లాడుకోరా?

కీర్తి : ఉహుఁ! అంతా సెల్‍లోనే. నేను నా రూమ్‍లో ఉంటా ఎప్పుడూ.

పావని : అవునా? అదేం బాగుంటుంది? మా ఇంట్లో అందరం కలిసే ఉంటాం.

కీర్తి : మా ఇంట్లో ఆ సీన్ లేదు. అందుకే నీతో అన్నా మాట్లాడవచ్చని ఇది కొన్నా.

పావని : దీన్ని దాచిపెట్టాలి. లేదంటే ఎక్కడిదని వంద ప్రశ్నలు వేస్తారు.

కీర్తి : మాట్లాడుకోకుండా మెసేజ్‍లు పెట్టుకుందాం.

పావని : సరే.

కీర్తి : రాత్రి అందరూ నిద్రపోయాక దుప్పటి ముసుగేసుకుని మాట్లాడుకుందాం.

పావని : అలాగే. అమ్మావాళ్లు తొందరగా నిద్రపోతారు. తొమ్మిదిన్నర తర్వాత చేస్తా.

కీర్తి : ఎదురుచూస్తుంటా.

పావని : ఇప్పటినుంచే…?

కీర్తి : ఆఁ! ఎప్పుడా టైమ్ అవుతుందా అని.

పావని : మా ఇంట్లో తెలిస్తే చదువుకూడా మాన్పించేస్తారు.

కీర్తి : అంత తెలియనిస్తామా ఏమిటి? పద! పోదాం.

***

రాజ్యలక్ష్మి, రంగి

రంగి : (హడావిడిగా వస్తూ) అమ్మగారూ! అమ్మగారూ!

రాజ్యలక్ష్మి : చెప్పు. ఈ రోజు ఏం వార్త మోసుకొచ్చవ్?

రంగి : ఏమ్మా! నేను పేపరు లెక్క కనిపిస్తున్నానా?

రాజ్యలక్ష్మి : (నవ్వుతూ) కాదు లేవే. మేము పేపరు కొనుక్కోలేం కదా! ఆ ముచ్చట తీరుస్తున్నావు అంటున్నా! అంతే!

రంగి : మీరేమన్నా అనుకోండి. నాకు విషయాలు చెప్పకపోతే మనసు ఆగదు.

రాజ్యలక్ష్మి : ఇంతకీ సంగతి ఏమిటి?

రంగి : పాపగారిని ఐస్‍క్రీమ్స్, చాక్‍లెట్స్ స్కూలు ముందు అమ్మితే కొనుక్కోవద్దని చెప్పండి.

రాజ్యలక్ష్మి : దానికి ఇంట్లోనే చేసిపెడతాను. బయట తిననివ్వను. డబ్బులూ కొనుక్కోవటానికి ఇవ్వం.

రంగి : మంచి పనిచేస్తున్నారు.

రాజ్యలక్ష్మి : ఎందుకలా చెబుతున్నావే?

రంగి : మత్తుమందులు అందులో కలిపేస్తున్నారటమ్మా. పిల్లలకి అవి అలవాటు చేసి ఆపైన ఎత్తుకుపోతారట.

రాజ్యలక్ష్మి : అమ్మో! ఇంత దారుణమా?

రంగి : అవునమ్మా! ఎంతోమంది సరదాగా ఇంటర్వెల్ సమయంలో వచ్చి కొనుక్కుంటూ ఉంటారుగా. ఆడనే పని. చూస్తూ ఉంటాగా. గమనిస్తూ ఉంటా.

రాజ్యలక్ష్మి : ఈ విషయం తెలియదా పిల్లలకు?

రంగి : తెలియదమ్మా. లోపల దాచేస్తే ఎలా తెలుస్తుంది? ఆ మత్తుమందు చాక్లేట్ లోపల పెట్టేస్తారు. పైకి మామూలు చాక్లేట్ లానే కనిపిస్తుంది?

రాజ్యలక్ష్మి : అంత మోసమే! అదీ పిల్లల మీద.

రంగి : తప్పు చేసేటోడికి చిన్నాపెద్దా వ్యత్యాసం ఏమి ఉంటుంది. మీ పిచ్చిగానీ.

రాజ్యలక్ష్మి : లోకం రోజురోజుకీ తగలబడిపోతోంది. దారుణాలు పెట్రేగిపోతున్నాయి.

రంగి : అవునమ్మగోరూ! పోలీసోళ్ళు ఇలాంటోళ్ళందరి పనీ ఇలాగే కనిపెట్టేయ్యాలి.

రాజ్యలక్ష్మి : వాళ్ళుమాత్రం ఎంతకని చేస్తారు? రోజురోజుకీ కొత్త ప్లానులు వేస్తూ దొంగలు తెలివి మీరిపోతున్నారు.

రంగి : అదీ నిజమే అమ్మగారూ!

రాజ్యలక్ష్మి : ఏమైనా పసిపిల్లల జీవితాలతో ఆటలాడుకోకూడదే రంగీ.

రంగి : అది ఆ వెధవ సచ్చినోళ్లకి తెలియదు కదమ్మా!

రాజ్యలక్ష్మి : పాపం పండేదాకా బయటపడదుగా. ఈలోపు ఎన్ని అనర్థాలు జరిగిపోతాయో! ఎన్ని కాపురాలు వీధిన పడతాయో?

రంగి : తెల్దమా! ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఈ కాలంలో ఇలాంటివి కొనుక్కోని పిల్లలుండరు.

రాజ్యలక్ష్మి : అందుకే పిల్లలకి ఎప్పుడూ ఇంట్లో తయారు చేసినవే తినే అలవాటు చెయ్యాలి.

రంగి : చిన్నచూపు చూస్తారు గదమ్మా అలా చేస్తే.

రాజ్యలక్ష్మి : మన ఆరోగ్యం మనకి ముఖ్యం కదా! పావని గొడవపెట్టినప్పుడు నేను ఇదే చెబుతుంటా.

రంగి : తెలియక చేసినా మీరు ఈ బాధలోంచి భలేగా తప్పించుకున్నారు. ఇప్పుడు ఏడవని అమ్మానాన్నలు లేరంటే మీరు నమ్మాల్సిందే. వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.

రాజ్యలక్ష్మి : అంతేలే…. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో?

రంగి : చాలారోజులనుంచీ జరుగుతోందటండీ ఈ వ్యవహారం.

రాజ్యలక్ష్మి : పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా చిన్నపిల్లల మీదనా వాళ్ళ ప్రయోగాలు.

రంగి : భలేవారమ్మా! ఈ రోజుల్లో ఎదుటి వారి గురించి ఆలోచించే వారు లేరమ్మా! అంతా తమ గురించి తాము చూసుకునే వాళ్ళే!

రాజ్యలక్ష్మి : నిజం చెప్పావు.

రంగి : నానెప్పుడూ నిజం సెప్తానండీ.

రాజ్యలక్ష్మి : ఇదంతా కలికాలం మహాత్యంలే.

***

(హాలులో)

కీర్తి : మీ అమ్మానాన్నా ఊరెళ్ళారా?

పావని : మా అత్తయ్యకి ఒంట్లో బాగోలేదని చూడటానికి వెళ్ళారు. అవసరమైతే అమ్మను అక్కడే ఉంచేసి వస్తానన్నారు నాన్న.

కీర్తి : ఇంటికి ఎందుకు రమ్మన్నావ్?

పావని : నీకో విషయం చెప్పాలని.

కీర్తి : విషయమా? ఏమిటది?

పావని : ఆ రోజు పార్కుకు వద్దంటే వెళదామన్నావ్. మా పనిపిల్ల రంగి మనిద్దరిని చూసినట్లే ఉంది.

కీర్తి : అంతా నీ అనుమానం.

పావని : అది చూస్తే అమ్మవాళ్ళకు చెప్పేస్తుంది. అప్పుడు వాళ్లు నన్ను బయటకు కదలనివ్వరు.

కీర్తి : ఏం చూసి ఉండదులే! అప్పుడప్పుడు అలా వెళ్ళకపోతే థ్రిల్ ఏం ఉంటుంది?

పావని : ప్రేమ అంటూ, చదువులో వెనకపడతావేమో. ఇంతవరకూ చదువులో ఫస్ట్ వచ్చేవాళ్ళం.

కీర్తి : ఎంతసేపూ చదువేనా? చదవవచ్చులే కంగారుపడకు.

పావని : నాన్నగారికి నేను మంచిమార్కులు తెచ్చుకోవాలని కోరిక. అది నేను ప్రక్కన పెడుతున్నానేమోనని నా భయం.

కీర్తి : చదువు చదువని విసిగించకు. ఈ వయసులో ప్రేమలో పడకపోతేనే బాగోదు. ఇలా దొంగచాటుగా కలుసుకోవడం, ఫోనులో రహస్యంగా మాట్లాడుకోవడం, ప్రతి నిముషం మెసేజ్‍లతో దగ్గరవ్వటం… నీకు మాత్రం బాగోలేదా?

పావని : బాగుంది.. కానీ అమ్మానాన్నకు తెలిస్తే…. అది చెప్పు.

కీర్తి : ఊరు వదిలి పారిపోదాం.

పావని : మరి పరీక్షలు?

కీర్తి : ఇంకోసారి రాసుకుందాం.

పావని : సంవత్సరం వృథా అయిపోదూ.

కీర్తి : తప్పకపోతే ఏం చేస్తాం?

పావని : బయటకెళ్ళి ఎలా బ్రతుకుతాం?

కీర్తి : ఏదో ఒకటి చేసి నిన్ను పోషిస్తాలే.

పావని : అంతేనంటావా?

కీర్తి : ఇప్పటికి ఇంతే!

పావని : నీకు తినటానికి ఏదైనా తెస్తానుండు.

(లోపలికి వెళ్తుంది)

కీర్తి : (మనసులో) ఓ ముద్దిమ్మని అడిగితే… తిడుతుందేమో… అయిన అడిగి చూద్దాం.

అంతరంగం : అడిగేదేముంది? పెట్టేసుకో.

కీర్తి : బాబోయ్! అరిచిందంటే చస్తాను. బయటివాళ్లంతా లోపలికి వచ్చేస్తారు. అసలే భయం పిల్ల.

అంతరంగం : అయితే నోరుమూసుకో.

కీర్తి : అలా ఊరుకో బుద్ధికాదే.

అంతరంగం : అయితే అనుభవించు.

(పావని టిఫిన్ ప్లేటుతో వస్తుంది)

పావని : టిఫిన్ తీసుకో! మంచినీళ్ళు తీసుకువస్తాను. (మళ్ళీ లోపలకు వెళ్తుంది)

కీర్తి : ఏం చెయ్యమంటావ్? చెప్పు.

అంతరంగం : నీ పాట్లు నువ్వు పడు.

కీర్తి : అడుగుతా.

అంతరంగం : చెంప పగలకొడితే…. నీ ప్రేమే వద్దంటే…? అప్పుడు ఏం చేస్తావ్? ఆలోచించు.

కీర్తి : ఏం కాదు. నేనంటే తనకి చాలాప్రేమ.

అంతరంగం : నీ ఏడుపు నువ్వు ఏడ్వు. మంచి చెబితే ఎవరూ వినరుగా.

కీర్తి : (చిన్నబుచ్చుకున్నట్లు) వింటాలే. నువ్వేది చెప్పినా వింటాగా.

అంతరంగం : అలాగయితే ఈ ప్రేమా, దోమా నేను చెయ్యమన్నానా?

కీర్తి : అమ్మో! నీకు అలుసు ఇస్తే నెత్తిన ఎక్కుతావు. వదిలేసి వెళ్ళు. నీకు దణ్ణం పెడతాను?

పావని : ఏమిటి? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు?

కీర్తి : (తడబడుతూ) ఏం లేదు.. ఏం లేదు.

పావని : నీమీద ఎంత నమ్మకం లేకపోతే ఇంటికి పిలుస్తాను చెప్పు, అమ్మ వాళ్ళు లేకున్నా.

కీర్తి : అది నిలబెట్టుకుంటున్నానుగా.

పావని : చిన్నప్పటి నుంచీ ఒకేచోట పెరిగాం. ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటున్నాం.

కీర్తి : అందుకే నువ్వంటే నాకంత ఇష్టం. ఇష్టం కంటే ఎక్కువ ప్రేమ.

పావని : నాకూ నువ్వంటే అంతే.

కీర్తి : రంగి చెప్పేసిందా ఇంట్లో? నువ్వేదో అనుకున్నావుగా.

పావని : ఏమో! అర్జెంట్‍గా ఊరెళ్ళారు. వచ్చాకే తెలుస్తుంది.

కీర్తి : ఏం కాదులే.

పావని : తెలియకపోతే ఏం కాదు. తెలిస్తే చాలా జరుగుతుంది.

కీర్తి : నేనున్నాగా. భయపడకు.

పావని : అదే నా ధైర్యం.

కీర్తి : సరే! నే వెళతాను.

పావని : ఊఁ!

***

ధర్మారావు : చెల్లి అలా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని ఉండాల్సింది కాదు.

రాజ్యలక్ష్మి : పరువుగల కుటుంబం. కూతురు అలా ఎవడితోనో వెళ్ళిందంటే తననేగా అంటారు ముందు.

ధర్మారావు : అదేం చేస్తుంది?

రాజ్యలక్ష్మి : సరిగ్గా పెంచలేదని తల్లినే అంటుంది ఈ లోకం.

ధర్మారావు : అందుకని ప్రాణం తీసేసుకుంటారా?

రాజ్యలక్ష్మి : మరి ఆ పరిస్థితుల్లో ఏం చేస్తుంది పాపం?

ధర్మారావు : ఈ లోకంలో కష్టాలు లేనివి ఎవరికి? అలా కష్టమొచ్చిన ప్రతివాళ్ళూ చచ్చిపోతే బ్రతకటానికి ఎవరూ ఉండరు.

రాజ్యలక్ష్మి : మీ అంత ధైర్యం అందరికీ ఉండొద్దూ.

ధర్మారావు : ఎవరికి వాళ్ళే ధైర్యం తెచ్చుకోవాలి. పిరికితనం మాత్రం దేవుడు అందరికీ ఇచ్చాడా? ఎవరికి వాళ్ళు పుచ్చుకోవటంలా. అలాగే ఇదీనూ!

రాజ్యలక్ష్మి : ఇలా ఆత్మహత్య ఆలోచన ఉన్నవాళ్ళందరికీ మీతో కౌన్సిలింగ్ ఇప్పించాలి.

ధర్మారావు : అవసరమైతే అదీ చేస్తాను. కొద్దిలో ప్రమాదం తప్పింది. లేకపోతే కుటుంబం అంతా రోడ్డున పడేది. పిల్లలు తల్లిలేని వాళ్ళయ్యేవారు.

రాజ్యలక్ష్మి : అంతా మన అదృష్టం. అందుకే మీ చెల్లి బ్రతికి బయటపడింది.

ధర్మారావు : దానికేదైనా అయితే మా బావగారిని సముదయించటం కష్టమయ్యేది. అదంటే ఆయనకు పిచ్చిప్రేమ.

రాజ్యలక్ష్మి : అసలు ఈ పిల్లలకు బుద్ధిలేదు. ఒకళ్ళను చూసి ఒకళ్ళు తగలబడిపోతున్నారు. ఇంత చిన్నతనం నుంచి ప్రేమలు ఏమిటి?

ధర్మారావు : వాళ్ళకు అంత ఆలోచన ఉంటే పెద్దవాళ్లకు ఇన్ని ఇబ్బందులు ఎందుకుంటాయి?

రాజ్యలక్ష్మి : చదువులు పూర్తిచేసుకుని తమ కాళ్ళమీద తాము నిలబడ్డాక ఆలోచించవలసినవి ఇప్పటి నుంచే ప్రారంభించెయ్యటం ఏమిటి ప్రారబ్దం కాకపోతే?

ధర్మారావు : అలా చెప్పేవాళ్ళు ఎవరు? ఎవరికివాళ్ళు తీరికలేని వాళ్ళు అయిపోయారుగా. ఇక స్కూల్సులో మోరల్ క్లాసులకు తావే లేదు. ఎలా వాళ్ళకి ఇలాంటివి తెలుస్తాయి?

రాజ్యలక్ష్మి : మరి పెట్టవచ్చు కదా!

ధర్మారావు : వినేవాడు ఎవరు? అందరికీ కావాల్సింది రాంక్‌లే. నైతిక విలువలు కాదు. ఇప్పటి గురువులకూ, తల్లిదండ్రులకూ, పిల్లలకు కూడా!

రాజ్యలక్ష్మి : పోనీ పెద్దవాళ్ళు చెబుతారు అనుకుంటే వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపేస్తున్నారు. ఇక పిల్లలకు సుద్దులు చెప్పేదెవరు?

ధర్మారావు : చెప్పినా వినే ఓపిక లేదు ఈనాటి చిన్నారులకు.

రాజ్యలక్ష్మి : అలా అనకండి. మనకన్నా వాళ్లు తెలివైనవాళ్ళు. వాళ్ళకు మనం చెప్పాలే కానీ చక్కగా అర్థం చేసుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఆ సమయం ఉండటం లేదు.

ధర్మారావు : నువ్వు చెప్పినది నిజమేలే.

రాజ్యలక్ష్మి : ఆటలు ఆడుకునే టైం కూడా వాళ్ళకు ఉండటం లేదు. మనం చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం? వీళ్ళకవేమీ తెలియవుగా.

ధర్మారావు : వీళ్ళకు అవకాశం దొరికితే కంప్యూటర్ గేమ్స్ ఆడతారు.

రాజ్యలక్ష్మి : నిజమే! ప్రకృతితో అసలు వీళ్ళకు అనుబంధమే ఉండటం లేదు.

ధర్మారావు : భలేదానివే రాజ్యం. మనుషులతోనే బంధాలు లేవు, ఇక ప్రకృతితో ఏముంటుంది?

రాజ్యలక్ష్మి : ఉండాలండీ. అందరికీ అందరితో సంబంధాలు ఉండాలి. ఫ్యానుగాలికి సహజమైన చిరుగాలికి తేడా తెలిస్తే వాళ్ళు ఇంట్లో ఎందుకుంటారు?

ధర్మారావు : మన పిల్లను మనం బాగనే పెంచాం. మనకిలాంటి కష్టాలు రావులే.

రాజ్యలక్ష్మి : (తలూపుతూ) అవునండీ.

(ఇంతలో రంగీ పరుగెత్తుకుంటూ వస్తుంది)

రంగి : (రొప్పుతూ) ఊరునుంచీ వచ్చేసారా అమ్మగారూ!

రాజ్యలక్ష్మి : కాస్త ఆగి చెప్పు. అంత హైరానా పడతావు. ఎందుకు?

రంగి : విననంతసేపే మీరు ఇలా…. విన్నారంటే ఇక ఆ హైరానా అంతా మీదే.

రాజ్యలక్ష్మి : బాబోయ్! అలా భయపెట్టకే. ఇంతకీ విషయం చెప్పు.

రంగి : అమ్మాయిగారిని మన ప్రక్కింటి కిరణ్‍బాబుతో పార్కులో చూశానండీ.

ధర్మారావు : ఎవరినో చూసి అలా అనుకుని ఉంటావ్. మా అమ్మాయి పార్కులో ఉండటం ఏమిటి? ఎవరిని చూసి ఎవరనుకున్నావ్?

రంగి : లేదు అయ్యగారూ! మన అమ్మాయే! కావాలంటే పిలిచి అడగండి. ఈ రోజు ఆదివారమే గదా.

రాజ్యలక్ష్మి : (గట్టిగా) పావనీ! పావనీ! (అని పిలుస్తూనే లోపలికి వెళ్తుంది. రెండు నిమిషాల్లో గాబరాగా బయటకు వస్తుంది)

రాజ్యలక్ష్మి : అమ్మాయి లేదండీ (కంగారుగా)

ధర్మారావు : అదేమిటే అలా అంటావ్. నువ్వు సరిగ్గా చూసి ఉండవ్. నేను చూసి వస్తానుండు.

(అతను లోపలికి వెళ్తాడు)

ధర్మారావు : (గాభరాగా) లేదే. నువ్వు చెప్పిందే నిజం.

రాజ్యలక్ష్మి : ఇప్పటిదాకా ఇక్కడే ఉందిగా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రంగి మాటలు విని భయపడి పారిపోయిందా? హతవిధి!

ధర్మారావు : కంగారుపడకు. అలా బయటకు వెళ్లి చూసి వస్తాను.

(హడావిడిగా బయటకు వెళ్ళిపోతూ)

రాజ్యలక్ష్మి : (కంగారు కంగారుగా) ఏమై ఉంటుంది?

(అక్కడే అటూ ఇటూ తిరుగుతూ)

రంగి : నేను వెళ్ళోస్తానమ్మా

(అంటూ వెళ్ళిపోయింది)

***

(బస్టాప్…. హారన్స్ అవి వినిపించాలి)

పావని : కిరణ్ వచ్చేశావా?

కీర్తి కిరణ్ : ఆఁ! వచ్చేశాను. ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తారు. పద శ్రీనూ ఇంటికి వెళదాం.

పావని : వాళ్ళ వాళ్ళు ఇంట్లో లేరా?

కీర్తి కిరణ్ : లేరు. వాళ్ళంతా ఊరు వెళ్ళారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని నేనే అడిగి తీసుకున్నా వాడింటి తాళాలు.

పావని : సరే. అయితే పద. రంగి చెప్పడం విని నీకు ఫోను చేసి పెరటి దారిన వచ్చేశాను.

కీర్తి కిరణ్ : అయితే మీవాళ్ళు వెతుక్కుంటూ వచ్చేస్తారు. హరీయప్.

(ఇద్దరూ పరుగెడుతున్న శబ్దాలు వినిపించాలి)

***

పావని : హమ్మయ్యా! ఎలాగైతేనేం వచ్చిపడ్డాం.

కీర్తి కిరణ్ : పారిపోవటం అంటే ఇంత ఇదా? సాయంత్రం దాకా పర్లేదు. ఆ తర్వాత మా అమ్మా వాళ్ళు కూడా వేటకు బయలుదేరుతారు నేను కనిపించకపోతే.

పావని : అంతా గందరగోళమైపోతుంది.

కీర్తి కిరణ్ : సమయానికి ఒక్క బస్సు వచ్చి చావలేదు. ముందు ఏదో ఒక ఊరు వెళ్ళిపోయేవాళ్ళం.

పావని : ఆ సమయంలో బస్సులు ఉండవు. లంచ్ టైమ్ కదా.

కీర్తి కిరణ్ : కాసేపు ఉంటే వచ్చేసేవేమో. మీ వాళ్ళు వచ్చేస్తారని భయపడ్డా!

పావని : అవును. మా వాళ్ళు ఇంట్లో ఎంతసేపని వెతుకుతారు. వచ్చేసేవాళ్ళే.

కీర్తి కిరణ్ : ముందు బస్ స్టేషన్. తర్వాత రైల్వే స్టేషనేగా ఎవరైనా వెతికేది ఇప్పుడైతే మనం ఎక్కడున్నామో ఎవరికీ తెలియదు.

పావని : ఇప్పుడు ఏం చేద్దాం?

కీర్తి కిరణ్ : చూద్దాంలే. ఇంట్లో ఉన్న డబ్బంతా బ్యాగ్‍లో సర్ది తీసుకొచ్చేశా. కొన్నాళ్ళవరకూ ఫర్వాలేదు.

పావని : ఆ తర్వాత….

కీర్తి కిరణ్ : ఏదో ఒకటి చెయ్యవచ్చులే. ఇప్పుడా గొడవ ఎందుకు?

పావని : అమ్మవాళ్ళు పోలీసు రిపోర్టు ఇస్తే….

కీర్తి కిరణ్ : దొరికితే జైల్లో పెడతారు.

పావని : అమ్మో! జైలే! నాకు భయం.

కీర్తి కిరణ్ : అయితే ఇంటికి వెళ్ళిపోతావా?

పావని : వెళ్ళను.

కీర్తి కిరణ్ : మరయితే నేను చెప్పినట్లు విను.

పావని : అందుకే ఇలాంటి పని వద్దన్నాను.

కీర్తి కిరణ్ : ఏమైందని ఇప్పుడు? అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు.

పావని : ఏమో! నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది.

కీర్తి కిరణ్ : నాకు మాత్రం సంతోషంగా ఉంది. సాహసం చేశాం కదా!

పావని : ఏం సాహసమో ఏమిటో. భయంతో ప్రాణం పోయేటట్లుంది కిరణ్!

కీర్తి కిరణ్ : ఇలా నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో. అన్ని భయాలూ పోతాయి.

పావని : ఉహూ! వద్దు.

కీర్తి కిరణ్ : పావనీ! ఏం భయపడకు. మనం బయలుదేరకముందే మన రహీమ్‍కి ఫోను చేశా బురఖాలు తెమ్మని. మనం అవి వేసుకుని దర్జాగా ఈ ఊరు దాటేద్దాం.

పావని : (ఆశ్చర్యంగా) నిజమా…?

కీర్తి కిరణ్ : ఆఁ! నేనేమన్నా తెలివితక్కువ వాడినని అనుకున్నావా?

పావని : (నవ్వుతూ) తెలుసులే.

కీర్తి కిరణ్ : అమ్మయ్య… ఇప్పటికి నీ ముఖంలో నవ్వు చూశాను.

పావని : (మళ్ళీ కిలకిలా నవ్వుతుంది)

(ఇద్దరి నవ్వులూ వినిపిస్తాయి)

***

ధర్మారావు : (బాధగా) ఏమైపోయారు ఈ పిల్లలు? ఇద్దరూ కలిశారని తెలుస్తోంది కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. అభం శుభం తెలియని వాళ్ళు.

రాజ్యలక్ష్మి : (ఏడుస్తూ) అసలే ఆడపిల్ల. మన పెంపకంలో పెరిగి కూడా ఇలా చేసిందేమిటండీ? ఒక్కమాట కూడా అనలేదే…. అసలు రంగి చెప్పకుండా ఉన్నా బాగుండేది. మన పిల్లలు మన దగ్గిరే ఉండేవాళ్ళు.

ధర్మారావు : అంతా మన ఖర్మ. ఊర్లోకి ఈ విషయం పొక్కిందంటే నా పరువేం కాను?

రాజ్యలక్ష్మి : పిల్లపోయి నేనేడుస్తుంటే మీరేమిటండీ పరువు గురించి మాట్లాడతారు? అది మన పిల్లండీ… మన పిల్ల. ఎంత అల్లారుముద్దుగా పెంచాందాన్ని.

ధర్మారావు : అందుకే ఇలాంటి వెధవ పని చేసింది.

రాజ్యలక్ష్మి : అది చేసింది తప్పే. నేను కాదనను. కానీ దాన్ని ఆడిపోసుకోకండి. నేను భరించలేను. ముందు దాన్ని పట్టుకునే మార్గం చూడండి.

ధర్మారావు : అందరికీ ఫోన్లు చేశాను. లేదనే సమాధానం. ఇంకేం చెయ్యాలి?

రాజ్యలక్ష్మి : పోలీసు రిపోర్టు ఇవ్వండి. వెంటనే వాళ్ళు పట్టుకుంటారు.

ధర్మారావు : ఎందుకు? ఇప్పటికే కిరణ్ వాళ్ళ నాన్నకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆయన వేట ప్రారంభించే ఉంటారు. దొరక్క ఎక్కడికి పోతారు? గోడకు కొట్టిన బంతిలా ఇంటికి తిరిగి రావల్సిందే.

రాజ్యలక్ష్మి : ఎవరివల్ల అయితేనేం? వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తే చాలు. వెంకటేశ్వరస్వామి! నా కూతురు వస్తే నీకు వంద కొబ్బరికాయలు కొడతాను.

ధర్మారావు : మనల్ని కాదని వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకే మొక్కులు…. బుద్ధి లేకపోతే సరి.

రాజ్యలక్ష్మి : కోపంలో అలా అంటున్నారు కానీ మీకు మాత్రం ప్రేమ లేదా ఏమిటి దానిమీద. ఒక్కగానొక్క కూతురు.

(ఫోనులో నెంబర్లు నొక్కుతూ ఉంటాడు)

ధర్మారావు : హలో శ్రీనూ! కిరణ్ వచ్చాడా?

శ్రీను : లేదండీ! మేము ఊర్లో లేము.

(ఫోను పెట్టేసిన శబ్దం)

ధర్మారావు : ఇప్పుడే వస్తానుండు.

(అంటూ బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు)

రాజ్యలక్ష్మి : ఏమిటి? అలా వెళ్ళి ఇలా వచ్చారు? ఏం చేసి… వచ్చారు?

ధర్మారావు : చిన్న ఆశ. అది తీర్చుకోవటానికి ఫోన్ చేసి వచ్చాను.

రాజ్యలక్ష్మి : ఏమంటున్నారు?

ధర్మారావు : కాసేపు ఆగు నీకే తెలుస్తుంది?

రాజ్యలక్ష్మి : ఏది తిన్నంగా చెప్పరు కదా! ఇలాంటి సమయంలో కూడా.

ధర్మారావు : నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి.

రాజ్యలక్ష్మి : మరి ఇందాక ఏదో అన్నారు?

ధర్మారావు : కాసేపు మాట్లాడకు రాజ్యం. బుర్ర బద్ధలయిపోతోంది. తలనొప్పితో.

రాజ్యలక్ష్మి : కాస్త టీ పెట్టి తెచ్చివ్వనా?

ధర్మారావు : ఇప్పుడు అది ఒక్కటే తక్కువ.

రాజ్యలక్ష్మి : మరి తలనొప్పిగా ఉందన్నారుగా.

ధర్మారావు : అది ఇలా పోయేది కాదులే.

రాజ్యలక్ష్మి : పోనీ టాబ్లెట్ తెచ్చివ్వనా?

ధర్మారావు : వద్దు రాజ్యం! కాసేపు నన్ను వంటరిగా వదిలెయ్

రాజ్యలక్ష్మి : సర్లెండి.

(ఇంతలో రంగి లోపలకు వస్తుంది)

రంగి : అమ్మా! పిల్లలు వచ్చేశారు.

రాజ్యలక్ష్మి : ఏరే! వాళ్ళేరే!

రంగి : ఈ బురఖాలో ఉన్నది వాళ్ళేనమ్మా.

రాజ్యలక్ష్మి : (ఆనందంగా) పావనీ! వచ్చేశావా? ఏరా కిరణ్! ఇదేమన్నా మంచిపనేనా? మాతో చెప్పే పని లేదా? ఒంటరిగా వెళ్ళి ఎలా బ్రతుకుదామనుకున్నారు?

కీర్తి కిరణ్ : సారీ అత్తయ్యా.

పావని : నన్ను క్షమించమ్మా. నాన్న నువ్వు కూడా!

(ధర్మారావు అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు)

పావని : నాన్న మాట్లాడకుండా వెళ్ళిపోయారేమిటమ్మా.

రాజ్యలక్ష్మి : మీరిద్దరూ లోపలికి వెళ్ళండి

(వాళ్ళిద్దరూ లోపలికి వెళతారు)

రాజ్యలక్ష్మి : రంగీ! అసలు ఏం జరిగిందే?

రంగి : అదామ్మా! అయ్యగారు నాకు ఫోను చేసి ఒక్కసారి శ్రీను వాళ్ళింటికి వెళ్ళి చూడమన్నారు. నేను వెళ్ళేటప్పటికి ఇలా బురఖాలు వేసుకుని బయటకు వస్తున్నారు. నన్ను చూసి బెదిరిపోయి ఇంటికి వచ్చేశారు. అంతేనమ్మా.

రాజ్యలక్ష్మి : పోనీలే పెద్ద గండం తప్పింది.

రంగి : పిల్లలు బెదిరిపోయి ఉన్నారు. వాళ్ళకు కోప్పడకండి. నెమ్మదిగా నచ్చచెప్పండి. వాళ్ళ నాన్నవచ్చి ఎంత రగడ చేస్తాడో? ఆయన వచ్చేలోపే కిరణ్‍ను పంపెయ్యండమ్మా.

(రంగి వెళ్ళిపోతుంది. మామూలు బట్టలతో కిరణ్ కూడా)

రాజ్యలక్ష్మి :  భగవంతుడా! నీకు శతకోటి ధన్యవాదాలు. నా కూతుర్ని నా గూటికి చేర్చావు. చాలా సంతోషం తండ్రీ. నీకు నా మొక్కు చెల్లించుకుంటాను.

***

పావని నోట్సు చదువుకుంటుంది.

రాజ్యలక్ష్మి, వెనక రంగీ ప్రవేశిస్తారు.

రంగి : అమ్మగోరూ! మీకీ విషయం తెలుసా?

రాజ్యలక్ష్మి : ఏ విషయమే!

రంగి : పంతులుగారి కూతురు కనిపించటం లేదటండీ.

రాజ్యలక్ష్మి : నిజమా? కందిపప్పు కట్టిన పేపరు. అదే చదువుతున్నాను. ఇందులోనూ అదే వార్త. వీళ్ళంతా ఎక్కడికి మాయమవుతున్నారో అర్థం కావడం లేదు.

రంగి : పోలీసులు వెతుకుతున్నారు. దొరుకుతారని నమ్మకం పెట్టుకోవటానికి లేదు.

రాజ్యలక్ష్మి : గుమ్మం దాటే ఆడపిల్లలకు రక్షణ (లేదు) ఉండదు.

రంగి : అది పిల్లకాకులకు ఎలా అర్థమవుతుందమ్మా! మొన్న ఒకమ్మాయి ఇలాగే కనిపించలా. తర్వాత శవంలా చెరువులో తేలింది. అయిదుగురు రేప్ చేసి అందులో పడేశారట.

రాజ్యలక్ష్మి : అయ్యయ్యో! ఆ పిల్ల పచ్చటి బ్రతుకు నాశనమయ్యింది కదే!

రంగి : ఇలాంటివి చాలా వింటున్నాం. పిల్లల్ని ఎత్తుకు పోయి కిడ్నీలు అమ్మేయ్యటం, వ్యభిచారం చేయించే ముఠాలు ఉన్నాయట కదమ్మా.

రాజ్యలక్ష్మి : అవునే. నేనూ విన్నాను. మొన్నటికి మొన్న రోడ్డుమీద ఆడుకుంటున్న పిల్ల అయిపూ పత్తా లేకుండా పోయింది.

ధర్మారావు : (లోపలికి వస్తూ) ఒక్కరోజులో అంతా సర్వనాశనం.

రాజ్యలక్ష్మి : ఏమయ్యిందండీ!

ధర్మారావు : పంతులూ, పంతులు భార్య ఉరివేసుకుని చచ్చిపోయారు.

రాజ్యలక్ష్మి : అయ్యయ్యో! అదేమిటండీ. పిల్ల కనిపించలేదనే బాధతో ఈ అఘాయిత్యం చేసుకున్నారేమో?

ధర్మారావు : లేదే. లోకులు పలురకాలుగా కూస్తున్న కూతలు భరించలేక వెళ్ళిపోతున్నామని ఉత్తరం రాసిపెట్టి మరీ వెళ్ళిపోయారు.

రాజ్యలక్ష్మి : అసలే బాధలో ఉన్నవాళ్ళను మరింత వీళ్ళు బాధపెట్టడం ఏమిటో అర్థం కాదు.

ధర్మారావు : జనం అంటే అంతేనే!

రాజ్యలక్ష్మి : అదేమిటండీ అలా అంటారు. తోటిమనిషి ఆపదలో ఉంటే ఓదార్చాల్సింది పోయి రాబందుల్లా బ్రతికి ఉన్నవాళ్ళనే పొడుచుకుని తినటంలా ఉంది ఈ వ్యవహారం. ఏం మనుషులండీ బాబూ!

రంగి : (ఆశ్చర్యంగా) అంత ఘోరం జరిగిపోనాదా బాబూ!

ధర్మారావు : మరి పిల్లలు వాళ్ళ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తుంటే పెద్దవాళ్ళు అంతకన్నా ఏం చేస్తారు?

రాజ్యలక్ష్మి : పోయిన వాళ్ళిద్దరూ బాగానే వెళ్ళిపోయారు. ఉన్న ఆ మిగతా పిల్లలు అనాథలయిపోయారు కదండీ. ఈ లోకంలో తల్లీతండ్రీ లేని పిల్లలను దగ్గరకు తీసుకునే వాళ్ళు ఎవరున్నారు?

ధర్మారావు : ఏం చేస్తాం? పిల్లలను కనగలం కానీ వాళ్ళ రాతలను రాయలేంగా.

రాజ్యలక్ష్మి : అయినా మన దేశమేమిటి? మన సాంప్రదాయాలేమిటి? ప్రపంచదేశాలన్నీ మనవైపు చూస్తుంటే మనమేమిటి వాళ్ళ అలవాట్ల వైపు మొగ్గుచూపుతున్నాం.

ధర్మారావు :  అదే కదా ఎవరికీ అర్థం కానిది. విచ్చలవిడితనం పెట్రేగిపోతుంది. ఆడామగా తేడా లేకుండా తిరగడం, డేటింగ్‍లు, పబ్‍లు, సహజీవనాలు, వినటానికే బాగుండటం లేదు.

రాజ్యలక్ష్మి : వేదాలు ఘోషించే ఈ భూమిపైన ఈ ఘోరాలు ఏమిటో? తండ్రి కన్న కూతుర్ని చెరచటం, గర్భిణీ స్త్రీని రేప్ చెయ్యబోతే రైల్లోంచి దూకెయ్యటం, ఇవన్నీ వింటూ ఉంటే మనది భారతదేశమేనా అనే అనుమానం వస్తోంది.

ధర్మారావు : మంచిపేరు రావాలంటే ఎన్నో యుగాలు పడుతుంది. దాన్ని పోగొట్టుకోవటానికి క్షణాలు పట్టదు.

రాజ్యలక్ష్మి : అవునండీ. విదేశీయులు మన ఆచారాల్ని పాటిస్తుంటే మనం వారిని అనుసరిస్తున్నాం. ప్రారబ్దం అంటే ఇదే!

ధర్మారావు : అంతటితో ఊరుకుంటున్నారా? మన ప్రతిష్ఠను కూడా కాలరాచేస్తున్నారు.

రాజ్యలక్ష్మి : అవునండీ. విదేశీవనితలు మన ఊర్లు చూడటానికి వస్తుంటే వాళ్ళను కూడా వదలడం లేదు మన కిరాతకులు.

ధర్మారావు : అతిథులను గౌరవించటం ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారం. అలాంటి ఆచారాలనే తుంగలో త్రొక్కేస్తున్నారు. 

రాజ్యలక్ష్మి : రేపటితరం వాళ్ళు ఈ పిల్లలే కదా. వీళ్ళు ఆ విలువలను కాపాడవల్సింది పోయి పోగొట్టేస్తుంటే చూడలేకపోతున్నానండీ!

ధర్మారావు : యువతే దీనిని బాగా అర్థం చేసుకోవాలి. మన భారతదేశం ‘విలువల బడి’ అని గుర్తించాలి.

రాజ్యలక్ష్మి : బాగా చెప్పారు. మీరు మాష్టారు అయితే బాగుండేది. పిల్లలు అందరూ బాగుపడేవారు.

ధర్మారావు : అదేముంది రాజ్యం? ఇవి చెప్పటానికి మాష్టార్లే అవ్వక్కర్లేదు. ఎవరయినా ఎవరికైనా తెలిసింది చెప్పవచ్చు.

రాజ్యలక్ష్మి : మనలాంటి వాళ్ళే పూనుకోవాలి. మళ్ళీ అప్పటిరోజులూ, అప్పటి విలువలూ తెప్పించటం మన బాధ్యతే!

ధర్మారావు : ఇది ఒకరి బాధ్యత  కాదు. ప్రతి ఒక్కరిది. ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషిదీ.

రంగి : అబ్బ! మీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే నాకలా వింటూ ఉండిపోవాలనిపిస్తోంది. ఇలాంటి మంచిమాటలు విని ఎన్నాళ్ళయిందో అమ్మగోరూ!

ధర్మారావు : వినే వాళ్ళుంటే చెప్పేవాళ్ళు తక్కువేం లేరు రంగీ.

పావని : అమ్మా! రజనీవాళ్ళింటికి వెళ్తున్నాను, పావుగంటలో వచ్చేస్తాను.

రాజ్యలక్ష్మి : అలాగే. వెళ్ళిరా.

(పావని వెళ్తుంది)

ధర్మారావు : రంగీ! వెళ్ళి తలుపు వేసిరా.

రాజ్యలక్ష్మి : (సందేహంగా) మన ప్లాను సక్సెస్ అవుతుందంటారా?

రంగి : మామూలు సక్సెస్ కదమ్మా సూపర్ సక్సెస్ అవుతుంది, మీరే చూడండి.

ధర్మారావు : అవును. అందుకే కదా ఇంత పథకం వేసింది.

(ముగ్గురూ కలిసి నవ్వుకుంటారు)

***

(గుడి జే గంటలు వినిపించాలి)

పావని : అమ్మానాన్నలను బాధపెడుతూ భవిష్యత్తును పాడుచేసుకునే ఈ ప్రేమలు మనకొద్దు కిరణ్.

కీర్తి కిరణ్ : అంతేనా పావనీ! మా ఇంట్లో కూడా ఇలాగే బాగా చివాట్లు పెట్టారు.

పావని : అంతే! బాగా చదువుకోవాలి. ఇప్పుడు మనకదే కదా ముఖ్యం. భవిష్యత్తుకు ఇదే కదా పునాది. నువ్వా నేనా స్కూలు ఫస్ట్ అని ఇదివరకు లానే పోటిపడతాం. ఓకేనా?

కీర్తి కిరణ్ : మరి మన ప్రేమ?

పావని : మన ప్రేమ ఎక్కడికి పోతుంది? అది మనతోనే ఉంటుంది. మనతోనే పెరుగుతుంది. అదెక్కడికీ పోదు. మనది నిజమైన ప్రేమ అయితే. ఏమంటావ్?

కీర్తి కిరణ్ : ఏమంటాను? నేను నీకు చెప్పాల్సింది పోయి నీతో నేను చెప్పించుకుంటున్నాను. నువ్వు చెప్పినట్లే బాగా చదువుకుని మంచి ఉద్యోగం వచ్చాక ఇంట్లోవాళ్లకి చెప్పి పెళ్ళిచేసుకుందాం.

పావని : ఎవరు ఎవరికి చెప్పారన్నది ముఖ్యం కాదు. మనం మంచిమార్గంలో నడవాలి. ఎందరికో మార్గదర్శకంగా నిలవాలి.

కీర్తి కిరణ్ : పద పావనీ. ఇక మీద మన ధ్యాసంతా చదువుమీదే పెడదాం.

పావని, కీర్తి కిరణ్ : ‘ప్రేమ వద్దు, చదువు ముద్దు’ అన్నదే ఇక నుంచీ మన నినాదం.

***

(బ్యాక్ గ్రౌండ్‍లో)

ప్రతి విద్యార్థి మనసును ప్రక్కదారి పట్టనివ్వకుండా చదువుమీద లగ్నం చెయ్యాలి. అదే భవిష్యత్తుకు పూలబాట

– సమాప్తం-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here