Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-56: విలువలకి విలువ

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజుల్లో జరుగుతున్న పెళ్ళిళ్ళు చూస్తుంటే ఒక్కసారి నా కళ్ళముందు నాకు గుర్తున్నంతవరకూ చిన్నప్పట్నించీ జరిగిన పెళ్ళిళ్ళు కళ్ళముందు కొచ్చేయి.

అప్పటి అయిదురోజుల పెళ్ళిళ్ళూ, కట్నాలూ కానుకలూ, ఆచారాలూ సాంప్రదాయాలూ, ఆనవాయితీలూ అమాంబాపతులూ…అన్నీ గుర్తొచ్చేయి.

మగపెళ్ళివారు వాళ్ల ఊరినుంచి బంధువులందరినీ కూడేసుకుని ఓ బస్సు మాట్లాడుకుని పెళ్ళికంటూ ఆడపెళ్ళివారి ఊరికి వచ్చేవారు. ఇంకక్కణ్ణించీ మొదలు. స్నాతకం చేసుకున్నాక ఏరు దాటకూడదని అంటారుట. అందుకని ఒకవేళ మధ్యలో ఏ ఏరైనా దాటవలసివస్తే ఆడపెళ్ళివారింటికొచ్చే స్నాతకం చేసుకోవడం. పెళ్ళయి అప్పగింతలవడానికి శుక్రవారం పొద్దు కనక వచ్చేస్తే మళ్ళీ శనివారంపొద్దు వచ్చేవరకూ ఆడపెళ్ళివారికి ముఖ్య అతిథులుగా వుండిపోవడమే. అంతవరకైతే బాగానే వుంటుంది. బంధుత్వం కలుపుకునే రెండు కుటుంబాల మధ్యనా ఏ పొరపొచ్చాలూ ఉండవు. కానీ చుట్టూ వున్న బంధుగణం వాళ్లనలా వుండనివ్వరుగా! ఇద్దరి మధ్యలో ఏదో పుల్ల పెట్టెస్తారు. తోకలూపుకుంటూ వాళ్ల వెనకాల ఇంకాస్తమంది చేరతారు. ఒక నోటి మాట మరో నోటి నుంచి వచ్చేటప్పటికి దాని అర్ధం మారిపోతుంది.

“మీరు దేవుడండీ…” అని గౌరవంగా నమస్కారం పెడితే, దాని అర్ధం మార్చేసి “నువ్వు దేవుడివిట… అంటే ఏంటీ… నెత్తి మీద కొబ్బరికాయ కొట్టినా మాట్లాడవనే కదా దానర్థం… ఇంత మెతకవాడిని చేస్తారనుకోలేదు నిన్ను…” అంటూ లేని అర్థాలు తీసి పెళ్ళివాళ్ళిద్దరి మధ్యలో మంట పెట్టేస్తారు. మామూలుగానే మిగిలినవాళ్ళు ఆ మంటని ఇంకాస్త ఎగదోస్తారు. చిలికి చిలికి గాలివానయి ఆఖరికి పెళ్ళాగిపోయి, పెళ్ళివారు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది.

అప్పటి రోజుల్లో జరిగిన అలాంటి సంఘటన మా పెద్దలు చెప్పగా విన్నదొకటి గుర్తొచ్చి ఇప్పుడు మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను.

ఆ ఊరిలో ఆయన పరువుమర్యాద గల పెద్దమనిషి. పెద్ద కుటుంబంలో పుట్టి, మంచి చదువు చదువుకుని, అదే ఊళ్ళో స్కూల్లో హెడ్ మాస్టర్‌గా చేస్తున్నారు. స్కూల్లో క్రమశిక్షణ పాటించడమే కాదు మనిషి కూడా పధ్ధతైన మనిషే. కాస్త శాస్త్రంలో కూడా పట్టు సాధించడంవల్ల ఊళ్ళో చిన్నా పెద్దా అందరూ ఆయన దగ్గరకే సలహాలకి వస్తుండేవారు. ఆయన కూడా వారి గౌరవాన్ని నిలబెడుతూ, వాళ్లకి కావల్సిన సలహా లిచ్చేవారు. అలా ఆ ఊళ్ళో ఆయన ఒక గౌరవ మర్యాదలున్న పెద్దమనిషిగా పేరు తెచ్చుకున్నారు.

ఇలా ఉండగా ఆ హెడ్ మాస్టారుగారమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఊరంతా ఆయనకి పెళ్ళిపనుల్లో అండగా నిలబడింది. తెల్లారుతూనే మగపెళ్ళివారు తరలివచ్చారు. చక్కగా స్నాతకం చేసుకున్నారు. మధ్యాహ్నం స్నాతకం భోజనాలయ్యాక భుక్తాయాసం తీరని ఒకాయన తీరికూర్చుని భోజనంలో లేని వంకని ఎత్తి చూపించేడు. ఆయన కాళ్ళొత్తేవారు దానిని సాగదీసేరు.

మధ్యాహ్నం భోజనాల్లో వడ్డించేటప్పుడు స్నాతకంబూరెల్లో నెయ్యి బూరెమధ్యలో చిల్లు నిండా వెయ్యకుండా కాస్త మటుకు అభికరించి వెళ్ళిపోయేడని ఒకాయనంటే, అసలు నెయ్యి నేతిజారీలో కాకుండా చిన్న గిన్నే, చెంచా పట్టుకొచ్చినప్పుడే నేనకున్నాను అంటూ ఇంకొకాయన వంతపాడేడు.

పౌరుషంగల ఆడపెళ్ళివారిలో ఒకాయన దాన్ని ఖండింఛేరు. చిలికి చిలికి గాలివాన అయింది. పెళ్ళివాళ్ళిద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. మగపెళ్ళివారు పెట్టీ బుట్టా సద్దుకుని తిరుగుప్రయాణానికి సిధ్ధమైపోయేరు.

సంగతి తెలిసిన హెడ్ మాస్టరూ, ఇంకా కొందరు పెద్దలూ వచ్చి అలా వెళ్ళవద్దని బతిమాలేరు. “మేం పౌరుషం, అభిమానం కలవాళ్ళం, ఇలాంటి పిసినార్లతో వియ్యమందడం మాకు అవమానం..” అంటూ వాళ్ళు వాళ్ల వెంట తెచ్చుకున్న బస్సెక్కేసేరు. పాపం ఆ హెడ్ మాస్టారి కేం చెయ్యలో తోచలేదు.

ఇదంతా చూస్తున్న ఊళ్ళో పెద్దలందరూ అప్పటికప్పుడు ఏకమైపోయేరు. తామంతా గౌరవించే హెడ్ మాస్టారి అమ్మాయిపెళ్ళి అలా ఆగిపోవడం వాళ్లకి నచ్చలేదు. అంతే అంతా ఒక్కటిగా అయిపోయి ఆ బస్సుకి అడ్డుగా నిలబడిపోయి, దాన్ని అంగుళం కదలకుండా ఆపేసేరు. గంటలు గడిచేయి. పౌరుషం తగ్గని మగపెళ్ళివారు రూట్ బస్సెక్కి వెడతామంటూ బస్ స్టాప్ వైపు వెళ్ళేరు. ఊళ్ళోకి ఒక్క బస్సునీ రానివ్వకుండా ఊరి పొలిమేరల్లో మనుషులని పెట్టేరు ఈ ఊరివాళ్ళు. వాళ్ల బస్సుని కదలనివ్వరు. బైట బస్సుల్ని రానివ్వరు.

చిన్నపిల్లలు ఆకలికి ఆగలేక గొడవ పెట్టడం మొదలెట్టేరు. పెద్దవాళ్ళు పైకి చెప్పకపోయినా ఏం పెట్టినా తినే పరిస్థితికి వచ్చేసేరు. వాళ్ళలో వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయేరు. పుల్ల పెట్టినవాళ్లని ఎత్తి చూపించి వాళ్లవల్లే ఈ ఇబ్బంది అంటూ వాళ్లని వేరు చేసేసేరు.

ఊరంతా ఒక్కటై ఆ మాస్టారి తరఫున నిలబడి మగపెళ్ళివారిని అష్టదిగ్బంధనం చేసినట్టు చేసేసేరు. ఇలా ఒక పూట గడిచింది. లొంగిపోవడం తప్ప మరో దారి లేకపోయింది పాపం పెళ్ళివారికి. దెబ్బకి దిగివచ్చేరు ఆ మగపెళ్ళివారు. బస్సు దిగి, లక్షణంగా తమ కొడుక్కి మాస్టారుగారమ్మాయిని పెళ్ళి చేసుకుని, మర్యాదగా కోడలిని తీసుకువెళ్ళేరు.

ఇదంతా మా పెద్దవాళ్ళు చెపుతుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఒక పధ్ధతైన పెద్దమనిషికోసం ఆ ఊరు ఊరంతా ఒక్కటవ్వడం చూస్తే ఆ రోజుల్లో విలువలను ఎంత గౌరవించేవారో ననిపించింది.

ఇప్పుడు కూడా అలా విలువలకి విలువలిచ్చేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు.. కానీ చాలా తక్కువమంది మాత్రమే.

Exit mobile version