విమాన దుర్ఘటన

0
2

[‘విమాన దుర్ఘటన’ అనే అనువాద కథని అందిస్తున్నారు శ్రీమతి స్వాతీ శ్రీపాద. ఒరియా మూలం హృషికేశ్ పాండా.]

[dropcap]న[/dropcap]చికేత ఉదయం వెళ్తాడని తెలిసినప్పటినుండి జయ చిరాగ్గానే ఉంది. టేబుల్ మీద ఆ రోజు న్యూస్ పేపర్ పరచి ఉంది. దాని హెడ్ లైన్స్ అరుస్తున్నట్టుగా విమాన దుర్ఘటనలో ఎనభై మంది దుర్మరణం ప్రకటిస్తున్నాయి. నచికేత ఆఫీస్‌కు వెళ్ళబోతున్నాడు. అతను ఆగలేదు. న్యూస్ పేపర్ అందుకుంటే, ఉదయం నుండి చిరచిరలాడుతున్న జయ అరిచి ఉండేది, “ఇప్పుడు మీకు ఆలస్యం అవట్లేదు కదూ?” అంటూ.

వాళ్ళ పెళ్ళయిన గత అయిదు సంవత్సరాలలో ప్రతి సారీ ఇదే జరిగేది. నచికేత న్యూస్ పేపరో, పుస్తకమో, లేదా జయ షాపింగ్ బాగ్‌లో వదిలేసిన పాకెటో తీసుకున్నప్పుడల్లా ఆమె ఏదో ఒకటి అననే అంటుంది. దానికి అతనికి లోలోపలి పేగులు మెలిపెట్టినంత బాధ కలిగేది. క్రితం రాత్రి వాళ్ళ మధ్య చిన్న గొడవ జరిగింది. కాని నచికేత రెండు రోజులు పూర్తిగా దూరంగా వెళ్తున్నాడు, బహుశా మాయను కలుసుకుంటాడేమో తన స్వప్నాలలో ఆనందంగా గడుపుతాడేమో. అందుకే ఒకరోజంతా కల్లబొల్లి మాటలతో నువ్వు లేకుండా ఎలా వెళ్ళను అంటూ ఆమెను ఆనందపరచాడు.

ఈ రోజు ఉదయమే ఆమె ఫిర్యాదు, ముందు రోజు రాత్రి నచికేత నిద్రపోయేముందు కాళ్ళు కడుక్కోలేదని, షూస్ హాల్‌లో వదిలేసాడనీ, మూడేళ్ళ క్రితం ఇంతకు మునుపు పోస్టింగ్ అప్పుడు ఇద్దరూ కలిసి రెండువేల కిలో మీటర్ల దూరాన ఉన్న జలపాతానికి వెళ్ళినప్పుడు, స్థానిక గుళ్ళూ గోపురాలకు తిరిగే సమయంలో ఏదో విషయంలో నచికేత, అదేమిటో ఇప్పుడు జయకు గుర్తులేదు కాని, ఆమె అర్థం చేసుకోలేదని అన్నాడనీ, అతనో పెద్ద మేధావి అయినట్టు ఆమెదో ఒక ఆటవిక జాతికి చెందినది అయినట్టు, అతనికి పిల్లలపట్ల ఎంతో ప్రేమ ఉన్నా జయకు వ్యక్తం చెయ్యలేదనీ..

నచికేత ఆఫీస్‌కు పరుగెత్తి మధ్యాహ్నం ఫ్లైట్ అందుకునే లోగా కొన్ని పేపర్స్ ఫైనల్ చెయ్యాలి.

అతని కొడుకు ఏడుస్తూ, “పప్పా, టూర్ వెళ్ళకండి. టూర్ ఒక జిడ్డు, ఆఫీస్ ఒక జిడ్డు” అన్నాడు.

జయ వాడిని ఎత్తుకోలేదు. వాడి మీద అరిచి, ఆపైన నచికేత మీద, పనిమనిషి మీద కూడా అరిచి, కొడుక్కి ఒక్కటి తగిలించింది. నచికేత మధ్యలో కల్పించుకోలేదు. కల్పించుకుంటే ఆమె మరింత పేట్రేగిపోతుంది, కొడుకు మరింత బొబ్బలు పెట్టేవాడు.

ఇంటి గడప దాటాక గమనించాడు. మామూలుగా సీట్ దొరికే 8.30 బస్ ఆపాటికే వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడిహ పూర్తిగా జనాలతో తొక్కిసలాడే బస్‌లో ఎక్కాలి.

అప్పుడు న్యూస్ పేపర్ చూసి, “ఆ ప్లేన్‌లో నేనుంటే ఎంత బాగుండేది?” అని అతని దురదృష్టాన్ని శపించుకున్నాడు. ఎవరిని శపిస్తున్నావని జయ అడిగే లోపే గబగబా మెట్లు దిగేసాడు.

బస్ స్టాప్‌కి వెళ్ళే దారిలో చిన్నప్పటి కథనం ఒకటి గుర్తుకు వచ్చింది. ఏళ్ళ కిందట ఇతర దేశంలో బ్రిడ్జ్ ఒకటి కూలిపోయి, ఏడుగురు మరణించారు. బాగా మత ఛాందసుడైన పోలీస్ ఆఫీసర్ విచారణ జరిపి ధృవపరచినది, ‘ఆ ఏడుగురిలో ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత విచారం, నిస్సహాయతల వల్ల చిక్కి శల్యమై చావుకి సిద్ధంగా ఉన్నార’ని.

నచికేత ఆ సిద్ధాంతాన్ని, మరో విషయంలో తరచు పరీక్షించాలని అనుకున్నా చావంటే, రక్తం అంటే, బాగా గాయపడిన శరీరాలంటే, వికారంగా మారిన వస్తువులంటే చచ్చేంత భయం వల్ల, ప్రాణాంతకమైన ప్రమాదాలకు దూరంగా ఉన్నాడు.

ఆ సిద్దాంతానికి వ్యతిరేకంగా ఎలాటి ఋజువూ లేనందున దాన్ని అంగీకరించాడు. ‘ఆ ప్లేన్ క్రాష్‌లో ఈ రోజు నేనొక్కడినీ చస్తే, ఆ సిద్ధాంతం నిరూపితమయ్యేదా?’ అని అనుకున్నాడు.

‘అదేమైనా సైకిలా నేనొక్కడినీ పోయి అందరూ బ్రతికుండేందుకు! అది విమానం!’

ఇలాటి ఆలోచనల మధ్య బస్‌లో దూరి పడిపోబోయి, ఈ లోకానికి వచ్చి నిలదొక్కుకున్నాడు. వందలాది వాహనాల్లో ఏదో ఒకదానికింద పచ్చడి అవవలసిన వాడే, కాని కాలేదు. ఆ బదులు వెంటనే ఆ బస్‌లో గుంపులో కలసిపోయాడు. బస్ దిగేప్పుడు, అప్పటికే అది కదలడం మొదలెట్టింది. నచికేత డ్రైవర్ వైపు నిందిస్తున్నట్టు చూసాడు.

ఆశ్చర్యపోయేలా డ్రైవర్ ఉద్రేకంగా గట్టిగా అరిచాడు, “ఎన్ని చోట్లని నేను బస్ ఆపాలి?”

అతను కావాలని యాక్జిలరేటర్ మీద కాలుంచాడు. నచికేత మరోసారి బస్ వెనక చక్రం కిందకు వెళ్ళిపోయే వాడే, కాని బతికి పోయాడు.

‘ఇవన్నీ రోజూ జరిగేవే’ నచికేత అనుకున్నాడు. ఆఫీస్‌కి వెళ్ళి తన పని తను చూసుకున్నాడు.

మధ్యాన్నం ఎయిర్ పోర్ట్‌కి వెళ్తూ దారిలో ఇంటికి తిరిగి వచ్చేసరికి, అతను తెలుసుకున్నాడు, ముందు రోజు జరిగిన ప్లేన్ క్రాష్ వల్ల అప్‌సెట్ అయిందని. అతనికది తెలివి తక్కువగా అనిపించింది. కోపం వచ్చింది.

‘గాడిదకన్నా నేనేం పెద్ద తెలివైన వాడిని కాదు. ముఖ్యంగా కళ్ళద్దాలు పెట్టుకునే వాడు, చిన్నతనంలో అమ్మతో మొట్టికాయలు తిన్న వాడు’ అనుకున్నాడు.

నచికేత ఇల్లు వదిలి వెళ్ళే వరకూ జయ ఆఫీస్ నుండి తిరిగి రాలేదు.

ఫ్లైట్ నాలుగ్గంటలు లేట్. విమానం దాదాపు ఖాళీగా ఉంది. ప్రతి పాసెంజర్ మనసులోనూ భయం తారట్లాడుతోంది. సగం పైగా విమానం ఖాళీయే. ఏ చిన్న కుదుపు వచ్చినా ప్రతివాళ్ళూ హడలిపోతున్నారు. నచికేత ఎక్కడో చదివిన గుర్తు, ప్లేన్ క్రాష్ వార్త గనక న్యూస్ పేపర్ హెడ్ లైన్స్‌లో ఉంటే ఆ పేపర్ విమానంలో అందుబాటులో ఉంచరు. కాని ఆ విమానంలో అన్ని రకాల న్యూస్ పేపర్లు, వివిధ భాషల్లో ఉన్నాయి. అన్నింటిలోనూ ప్లేన్ క్రాష్ గురించి రకరకాల రిపోర్ట్‌లు. ఒక ప్రత్యేకమైన సాంకేతిక సమీక్ష, పైలట్ అసోసియేషన్ వారి రిపోర్ట్, చనిపోయిన పైలట్ భార్య వెక్కిళ్ళు పెడుతున్న ఫొటో, చనిపోయిన మరో పైలట్ సోదరి ఫొటో, బ్రతికి బయట పడ్డ పాసెంజర్ల వివరణలు, ఎయిర్ హోస్టెస్‌లను శ్లాఘించడం, సంబంధిత మంత్రివర్యుడి ఫొటో, స్టేట్‌మెంట్, ఫలానా ఎయిర్ క్రాఫ్ట్ గురించి రక్షణ గురించీ సాంకేతిక సమీక్షలు ఇలా.

పాసెంజర్‌లలో ఒకరు చెప్పారు, “నేను పొగతాగడం ఎప్పటికీ మానను. నేను గనక పొగ తాగకపోయి ఉంటే మొదటి వరుసలో పొగతాగని వారి ప్రాంతంలో ఉండి ఉండేవాడిని. కాలి చచ్చేవాడిని.”

‘ఇక్కడ ప్రశ్న నువ్వు కాలిపోతావా లేదా అనేది కాదు’, నచికేత అనుకున్నాడు, ‘నువ్వు నెమ్మదిగా కాలుతావా వేగంగానా అనేది ప్రశ్న’.

నచికేత పొగతాగే ప్రాంతంలో ఉన్నాడు, అతనికి పొగ తాగాలనిపించకపోయినా. అతని మిత్రులిద్దరు పొగతాగని చోట ఉన్నారు. ప్లేన్ రెండు మూడుసార్లు కుదుపులకి లోనయాక వాళ్ళు నచికేత వైపు వచ్చారు. “మాకు అక్కడ విసుగ్గా ఉంది” అన్నారు.

వాళ్ళకి తెలుసు, నచికేతకు తెలుసని. హాండ్‌లూమ్ కోపరేటివ్స్ గురించి, వాళ్ళ కొత్త లేడీ కొలీగ్ అందం గురించీ మాట్లాడారు. కాని విమానం కుదుపు వచ్చినప్పుడల్లా టాపిక్ ప్లేన్ క్రాష్‌కు మళ్ళించి పైలట్ యోగ్యత గురించి, ఎయిర్‌లైన్ యాజమాన్యం సమస్యల గురించి, ఆ ప్రత్యేకమైన విమానం కొనుగోలు నిర్ణయం గురించీ మరెన్నో విషయాల మీద తమ తమ తీర్పును వినిపించారు.

దాదాపు అయిదు గంటల ఆలస్యం తప్ప మాయ వాళ్ళ నగరం చేరే వరకూ ఎలాటి అవాంతరమూ రాలేదు.

2

మర్నాడు, నచికేతకు కాన్ఫరెన్స్ పట్ల ఎలాటి ఆసక్తీ లేదు. క్రితం రాత్రే మాయ అడ్రస్ కనుక్కోమని ఇద్దరికి ఆ పని అప్పగించాడు. మీటింగ్ మధ్యలో ఉండగా ఎవరో అడ్రస్, టెలిఫోన్ నంబర్ తెచ్చారు. నచికేత ఓ కాగితం ముక్కమీద వ్రాసాడు – నేనామెను ఒంటిగంటకు కలుస్తానని చెప్పండి. ఆ క్షణమే అతని గుండె గుర్రమెక్కి పరుగులు తీసింది. అతను కంపించి పోతున్నాడు.

నిజానికి విమానం దిగిన క్షణం, ప్లేన్ క్రాష్ అవలేదని తెలుసుకున్న క్షణం, మాయను కలుసుకోగలనని తెలిసిన మొదలు అతను కంపించి పోతున్నాడు.

మీటింగ్ ను పన్నెండున్నరకు ముగించి (మరో అవకాశం లేదు మరి),  సరిగ్గా ఒంటి గంటకు మాయ ఆఫీస్ చేరుకున్నాడు.

మాయ మరింత రంగు తేలింది. మొహం కొంచం బొద్దుగా తయారైంది.

“పదేళ్ళు, అయినా నువ్వే మాత్రం మారలేదు” ఆశ్చర్యంగా అంది.

మాయ కదిలిపోయింది.

“నా సమాచారం తెలిసినప్పటి నుండి ఇలాగే కంపిస్తున్నావా?” అడిగాడు నచికేత.

మాయ చిరునవ్వు నవ్వింది, సరిగ్గా పది పదకొండేళ్ళ క్రితం లానే కనబడింది. నచికేత చెప్పాలనుకున్నాడు, ఈ పదేళ్ళలో ఒక్కరోజు కూడా ఆమె గురించి ఆలోచించకుండా గడవలేదని.

కాని చెప్పింది మాత్రం, “నీ ఊరికి వచ్చినప్పటి నుండీ నేనూ కంపించి పోతూనే ఉన్నాను.”

‘నువ్వు నన్నేం చెయ్యలేదు మాయా!’ నచికేత అనుకున్నాడు. ఆమె ఆఫీస్ ముందు బిచ్చగాళ్ళు లైన్‌లో నిల్చున్నారు. నచికేత అడిగాడు, “వాళ్ళంతా నీ బిచ్చం కోసం ఎదురు చూస్తున్నారా?”

మాయ క్షమార్పణ చెబుతూ, “ఇది అద్దె ఇల్లు. నాకు ఇల్లు మినహా మిగతా స్థలం మీద ఎలాటి నియంత్రణ లేదు.”

నచికేత అన్నాడు, “నువ్వెక్కడ పని చేసినా నీకు కనీసం ఒక బిచ్చగాడైనా ఉంటాడు.”

“కోతిలా నా తెలివితక్కువతనం నన్ను విషాదం నుండి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంది.”

ఈ లోగా జనాలు రాడం మాయ వారితో రకరకాల చర్చలు చేయడం మొదలైంది. .

“నువ్వు దేవతవు, కాని నీ నగరం మాత్రం దేవతల నగరం కాదు (అప్పుడే మాయ అతన్ని ఎవరికో పరిచయం చేసింది. అచ్చం కోతిలా ఒక నవ్వు నవ్వాడు.). నీ నగరాన్ని దొంగలు, దోపిడిదార్లు, స్మగ్లర్‌లు, అత్యాచారాలు చేసేవాళ్ళ పుట్టిన రోజు ఫొటోలు, వ్యక్తిత్వాలతో ప్లాస్టర్ చేసారు. వాళ్ళ సంఖ్య ఎంత పెద్దదో, వాళ్ళ పుట్టిన రోజులు ఎన్ని ఎక్కువో గాని సంవత్సరంలో ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండదు. ప్రతి గోడ మీద పోస్టర్లే, ప్రతి పోస్టర్ దగ్గరా కాపలాగా ఒక పహిల్వాన్.

నీ నగరం నాకు పిచ్చి పట్టిస్తోంది. మైడియర్ స్వీట్ గర్ల్. పదేళ్ళ క్రితం నిన్ను చూడటానికి రాడం నిన్న జరిగినట్టే ఉంది. పదేళ్ళ క్రితం, మీటింగ్స్‌తో వీఐపీల సందర్శనతో, మినిస్టర్ల పర్యవేక్షణతో, వారిని అనుసరించి వచ్చే అధికార జన సమూహంతో, అలాటి చెత్తా చెదారంతో నువ్వు బిజీగా ఉండేదానివి. ఇవ్వాళ కూడా, నువ్వు బిజీనే. ఆఫీస్ బిల్డింగ్ కోసం ఎస్టేట్ ఏజంట్లతో చర్చలు, సమాలోచనలు, ఇంకా అవును ఆర్థిక కార్యదర్శితో ముఖ్యమైన మీటింగ్ – ఈ జాతరలో నేను మరో సందర్శకుడిని. బిచ్చగాళ్ళ సరసన కూచుందుకు.

పదేళ్ళ క్రితం నువ్వు నాకేమీ ఇవ్వలేదు, సౌందర్య రాశీ, ఈ రోజునా ఏమీ ఇవ్వవు.”

మాయ తన పర్స్ లోంచి కొడుకు ఫొటో బయటకు తీసి అతనికి చూపించింది.

“ఒప్పుకుంటాను, పది సంవత్సరాల క్రితం నువ్వు భయపెట్టినట్టు నువ్వంత కురూపిలా ఏం మారలేదు. కాని చూడు ఇప్పుడేం జరుగుతోందో, నేనిక్కడ ఇంకా కూచుని నీ ముని వేళ్ళు తాకాలని ఎదురు చూస్తున్నాను. పదేళ్ళ క్రితం నీ మునివేళ్ళు తాకాలని ఎదురుచూసాను. నువ్వు మాయమైపోయావు. అరక్షితంగా నువ్వు నన్ను నిరాధారమైన, అభేద్యమైన ఏకాకితనపు కీకారణ్యంలో వదిలేసావు.

ప్రతిసారి నీ నగరం నన్ను దుర్బలమైన దిక్కులేనివాడిగా చేస్తుంది. పదేళ్ళ క్రితం లాగే, ఇప్పటిలా 200 సంవత్సరాల క్రితం నీ నగరం నుండి తెల్లతోలు సైన్యం నా నగరంపై గుర్రం మీద వచ్చి దండెత్తి నా పూర్వీకులను నిస్సహాయులుగా, నిరాధారమైన వారిగా మార్చింది.

పదేళ్ళ క్రితం లాగే అంతా అలాగే సాగుతోంది. ఆ సందర్భంలో నచికేత్ మాయ నగరానికి వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకోగానే అన్నాడు, “నీతో ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడాలి.” అతనితో ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నట్టూ, మాయ మరో మిత్రుడిని వచ్చి వారితో చేరమని ఆహ్వానించింది. ఆ మిత్రుడు ఉద్యోగం వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా మాయ మరో మిత్రుడిని పిలిచింది. అతను రాగానే మాయను మీటింగ్‌కు పిలిచారు. ఆమె వెళ్తూ క్షమార్పణలు అడిగింది.

ఆమె ఆఫీస్‌లో ఎంతో గంభీరంగా, దూరం అనిపిస్తున్నా, అతను రోడ్డు మీదకు వచ్చి ట్రాఫిక్‌లో కలిసిపోగానే, ఆమె అతి సుకుమారంగా, చిన్నదేవతలా అనిపించింది.

‘నువ్వు ప్లేన్ ప్రమాదాంలో మరణిస్తే న్యూస్ పేపర్ రిపోర్ట్ ఏమని రాస్తారు? ఒక అందమైన అమ్మాయి మరణించిందనా, అందరు అందమైన వాళ్ళూ పోయారనా?’ నచికేత అనుకున్నాడు.

3

నచికేత తన హోటల్ గదికి తిరిగి వచ్చాడు. ‘ఇప్పుడు నా లివర్ గురించి, కడుపు, మూత్రాశయం, గుండె, రక్తం, ఊపిరితిత్తులు, స్ప్లీన్, ఇంటెస్టైన్, కిడ్నీస్, ముఖ్యంగా మెదడు గురించి డాక్టర్ చెప్పినదీ, నా భార్య అన్నదీ పక్కన పెట్టాలి’ అని అతను నిర్ణయించుకుని జిన్, సోడా, లైమ్ ఆర్దర్ చేసాడు.

అతను ఆమెను గత పదేళ్ళుగా మరచిపోలేదన్నది నిజమా? లేదా కాలు నిలవని నిస్సహాయతతో ఆమె జ్ఞాపకాలు పట్టుకుని వేళ్ళాడుతున్నాడా? అతను మాయను గనక మర్చిపోతే అతన్ని వెన్నాడే శూన్యానికి భయపడా? మాయను ఎప్పుడైనా ప్రేమించాడా? లేదా ఆమెతో ప్రేమలో ఉన్నాననే భావనను ప్రేమిస్తూ వచ్చాడా?

తిరిగి వెళ్ళేప్పుడు ప్లేన్ క్రాష్‌లో తను గనక మరణిస్తే మాయా ఏడుస్తుందా? ఒక్క కన్నీటి చుక్కయినా విడుస్తుందా? లేదా తన మీటింగ్స్‌తో బిజీగా ఉండి, క్షణమో ఘడియో తప్ప అతని గురించి పెద్దగా ఆలోచించేంత తీరిక దొరకదా?

ఉదయం, క్రాష్ సంగతి పక్కన పెడితే విమానం సరయిన సమయానికే వచ్చింది. మాయతో ఎలా ఏమీ జరగలేదో, అతను యాచించిన అయిదు నిమిషాల సమయం దొరకనట్టే, ఆమెతో ఏమీ మాట్లాడనే లేదు. ఆ సిద్ధాంతం అబద్ధం. నువ్వు కోరితే మృత్యువు రాదు. ఒక కథలోలా సముద్రానికి భయపడి ఒకడు నావికుడు కాడానికి నిరాకరించాడు. తండ్రి, తాత సముద్రంలో మునిగిపోయి మరణించినా భయపడని మరో నావికుడిని చూసి ఆశ్చర్యపడ్డాడు. అడిగితే అతను చెప్పినది,

“అయితే ఇంట్లో మంచం మీద పడుకుందుకూ భయపడాలి, మరి మీ నాన్న, తాత ఆ మంచం మీదే పోయారుగా, మృత్యువు వేరే వాళ్ళకు వస్తుంది, నేను అజరామరుడిని.”

నచికేత ఆలోచించాడు నిజంగా తను చావాలని అనుకుంటున్నాడా? బహుశా చావును కోరుకునే భావనతోనే మోహపరవశుడు అవుతున్నాడేమో. బహుశా మాయతో ప్రేమలో పడనట్టుగానే. జయ తరచుగా అన్నట్టు అతను ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. కేవలం ప్రేమ అనే భావనతోనే ప్రేమలో పడ్డాడు.

ఒరియా మూలం –హృషికేశ్ పాండా

తెలుగు సేత — స్వాతీ శ్రీపాద

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here