‘విమర్శ వీక్షణం’లో నేను

4
2

[dropcap]గొ[/dropcap]ప్ప పుస్తకాలు, ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు చదివేవాళ్ళు అంతా కథలు, కవిత్వం, వ్యాసాలు రాసేస్తారని చెప్పలేము. అందరి విషయంలో ఇది సాధ్యం కూడా కాదు! అలాగే వివిధ ప్రక్రియల్లో సాహిత్యాన్ని రాస్తున్న వారందరూ గొప్ప చదువరులనీ చెప్పలేము. కానీ ఏమీ చదవకుండా రాసేవారు, ఎక్కువగా చదివి రాస్తున్నవారి రచనల్లోని తేడాని యిట్టె పట్టేయవచ్చు. రచయిత గానీ, కవి గానీ, నిత్యం పాఠకులై ఉండాలి. అందులో ప్రాచీన, ఆధునిక సాహిత్యం ఉండాలి, అవసరమైతే కొన్ని ఉదాహరణలు చెప్పగలగాలి. సందేహాలను నివృత్తి చేయగల సత్తావుండాలి. అప్పుడే రచయిత రచనకు సార్థకత ఏర్పడుతుంది, అలాంటి రచన కలకాలం నిలుస్తుంది కూడా!

అలాగే, తాము రచయితలూ లేదా రచయిత్రులు అయివుండి కూడా ఇతరుల రచనలు కూడా చదివి, బాగుంటే ‘బాగుంది’ అని లేకుంటే ‘లేదు’ అని ముఖం మీద చెప్పేస్తారు. ఇక్కడ వారికి ఎలాంటి మొహమాటమూ ఉండదు. స్వపరభేదాలు వుండవు. దానిని, సమీక్ష ఆనండి లేదా విమర్శ ఆనండి, నిష్కర్షగా చెప్పేస్తారు. అయితే అలాంటివారు బహు అరుదు. అలాంటి వారిలో, ప్రముఖ రచయిత్రి, సమీక్షకురాలు, విమర్శకురాలు, వక్త, సహృదయిని శ్రీమతి ప్రొఫెసర్ సి. హెచ్. సుశీలమ్మ గారు ఒకరు. సుశీలమ్మ గారు మంచి విద్యావంతురాలు. మంచి పాఠకురాలు, మంచి రచయిత్రి. ఆవిడ పుట్టినది విద్య, ఉద్యోగం, గుంటూరు చుట్టుపక్కల ప్రదేశాలే! అందుకే సుశీల గారికి ‘గుంటూరు’ అంటే మక్కువ ఎక్కువ!

ప్రొఫెసర్ సుశీలమ్మ గారు విద్యారంగంలో వివిధ హోదాలలో పనిచేసి, ప్రిన్సిపాల్‍గా పదవీ విరమణ చేసారు. ఇప్పుడు రచనా వ్యాసంగంలోనూ, పుస్తక పఠనంలోనూ, పూర్తి సమయాన్ని కేటాయించి తన విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.

సుశీలమ్మ గారి మనస్సులో ఒక మంచి ఆలోచన మెదిలి, అది ఆచరణలో పెట్టడం మొదలు పెట్టారు. అది తన తండ్రి స్వర్గీయ సి.హెచ్.లక్ష్మీనారాయణ గారి పేర ‘స్మారక పురస్కారం’ నెలకొల్పడం. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన ‘విమర్శ’ ప్రక్రియకు ఇవ్వడం గొప్ప విషయం. మూడు సంవత్సరాలుగా ఈ పురస్కారం విమర్శ ప్రక్రియలో నిష్ణాతులైన సాహితీ పెద్దలకు ఇస్తూ వస్తున్నారు. అదే విధంగా పురస్కార సభ నాటికి ఒక పుస్తకం రాసి కుటుంబ సభ్యులకు వరుసగా అంకితం ఇస్తున్నారు. ఇది మూడో సంవత్సరం.

గుంటూరు సభావేదికపై పురస్కారం అందజేస్తున్న ప్రొఫెసర్ సుశీలమ్మ గారు వారి సోదరుడు శ్రీ ద్వారకా తిరుమల రావుగారు

ఈ సంవత్సరానికి గాను, ప్రముఖ విమర్శకులు శ్రీ కె.పి. అశోక్ కుమార్ గారిని పురస్కార గ్రహీతగా ఎన్నుకోవడమే గాక ‘విమర్శ వీక్షణం’ అనే పుస్తకం రాసి, చెల్లెలికి – మరిదికి (విజయకుమార్ & సాయినాథ్) అంకితం చేశారు. విశేషం ఏమిటంటే ఈ ‘విమర్శ వీక్షణం’ లో డా. సి. హెచ్. సుశీలమ్మ గారు, నేను రాసిన కవితపై రాసిన వ్యాసం వ్రాయడం. ఇది నేను ఊహించనిది, ఆశ్చర్యానికి, ఆనందానికీ గురి చేసిన విషయం.

నవంబరు నెల 26వ తేదీన గుంటూరులో ఈ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నన్నూ – నా మిత్రుడు శ్యామ్ కుమార్‌ను, కార్యక్రమానికి రమ్మని పదేపదే ఆహ్వానించారు. ఆవిడ ఆహ్వానం మేరకు నేను, మిత్రుడు శ్యామ్ కారులో గుంటూరు వెళ్ళాము. కార్యక్రమం ఘనంగా జరిగింది.

సభాప్రాంగణంలో సుశీలమ్మ గారు, వారి తమ్ముడు శ్రీ ద్వారకా తిరుమల రావు గారు (ఎడమ) తదితరులు.

డా. సుశీలమ్మ గారి స్వయానా తమ్ముడు శ్రీ ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. గారు సభా ప్రాంగణంలో ఉండడం వల్ల సభాప్రాంతం అంతా పోలీసు వలయంలో వుండి కార్యక్రమం సజావుగా జరగడానికి అనుకూలించింది. తండ్రి జ్ఞాపకార్థం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు ఒకరిద్దరూ తప్ప ఎక్కువగా కనిపించరు.

ప్రొఫెసర్ సుశీలమ్మ గారు పుస్తకం బహుకరిస్తూ..

సుశీలమ్మ గారు ‘అమ్మా.. నువ్వెక్కడ?’ అన్న కవితను తన వ్యాసంలో, విపులంగా సమీక్షించారు. ఈ వ్యాసం శ్రీ ఇందూరమణ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ‘సాహో -మాసపత్రిక’ కోసం రాశారు. ఈ నా కవితను తన వ్యాసం కోసం ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. నేను తల్లిని తలుచుకుంటూ కవిత రాస్తే, డా. సుశీలమ్మగారు, తల్లిగా తన అనుభవాలను సింహావలోకనం చేసుకుని ఈ వ్యాసం (అమ్మా నువ్వెక్కడ?) రాసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరి తల్లిగా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన ఘనత ఆవిడది. తన ఉద్యోగ నిర్వహణ సజావుగా చేస్తూనే, రచనా వ్యాసంగం లోనూ, పరిశోధనా రంగంలోనూ అవిరళ కృషి చేస్తూనే పిల్లల్ని పెంచి పెద్ద చేయడం మామూలు విషయం కానేకాదు. అందుకే ఆమెలో పవిత్రమైన అమ్మ వుంది, అమ్మ త్యాగం వుంది, అమ్మ ప్రేమ వుంది. అందుకేనేమో.. రచయిత్రి ఎలాంటి సందేహం లేకుండా నా కవితను చక్కగా సమీక్షించి న్యాయం చేయగలిగారు.

ప్రొఫెసర్ సుశీలమ్మ గారి స్వగృహంలో.. శ్రీ శ్రీ కావ్యం తో

డా. సుశీల గారికి ఎన్నో అవార్డులు వచ్చినా, ఆవిడ కృషికి తగిన ఫలితంగా రావలసిన అవార్డులు రాలేదనే చెప్పాలి. ఇది ప్రభుత్వం ఆలోచించ వలసిన విషయమే! త్వరలో అలాంటి అవార్డులు రావాలని ప్రగాఢంగా కోరుకునే వాళ్లల్లో నేనూ ఒకడిని. ఆ శుభ ఘడియ కోసం సుశీలమ్మ గారి సాహిత్య సువాసనలు ఎరిగిన వారు అందరూ ఎదురు చూస్తూ వుంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదనుకుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here