విమర్శకుల సమూహం

0
2

[dropcap]వి[/dropcap]మర్శకులు వాట్సాప్ గ్రూపులో, సదానందం తన కథ ‘అగ్గిపెట్టి’ని పోస్ట్ చేశాడు. కానీ కాస్త భయంగా ఉందతనికి.

ఈ విమర్శకుల గ్రూప్‌ని కొందరు రచయితలూ, రచయిత్రులూ కలిసి పెట్టుకున్నారు. వాళ్ళ కథల్లోని లోపాలని పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు గాను, ఇలా వారు ఈ గ్రూపు పెట్టుకున్నారు. అందులో ఎవరు కథ పెట్టినా విమర్శ లేదా ప్రశంసా, చాలా చాలా లోతుగా చేస్తారు. అది ప్రశంస అయితే పర్వాలేదు. కానీ విమర్శ అయితే, కొంత స్థిమితంగా, కొంత ఓపిగ్గా తీసుకోవాలి. కనుకే సదానందానికి ఆ భయం. అతను భయపడినట్టే, కథ పెట్టీపెట్టగానే సమీక్షకుడు పిల్లబాబు వ్రాసిన సమీక్ష చదవడం మొదలెట్టాడు సదానందం, “కథలో హీరోయిన్ మాట్లాడుతూ, ఎం.వి.పి రైతు బజార్‍కి వెళ్ళి ఒక కేజీ టమోటాలు తెమ్మని ఇరవై రూపాయలు ఇస్తుంది. అయితే ఎం.వి.పి కాలనీలో రెండు రైతు బజార్లు ఉన్నాయని రచయిత మర్చిపోయినట్లున్నాడు, కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్న రైతు బజార్ ఒకటి, ఏ.ఎస్. రాజా కాలేజీలో రైతు బజార్ రెండవది. కనుక ఇది ముమ్మాటికి తప్పు. అలాగే కె.జి టమాటాలు నలబై రూపాయిలు. కానీ ఆమె ఇరవై ఇస్తుంది. అలాగే ఆమె తల స్నానం చేసి వచ్చి ఆఫీస్‌కి వెళ్లిపోయింది అని వ్రాసారు. అంటే ఆమె తల తుడుచుకోకుండా ఆఫీసుకెళ్లిందా?. అలాగే హీరో మధు, నీ మొహం చూస్తే చందమామ గుర్తొస్తోంది అని వ్రాసారు. అది చందమామ సినిమానా, చందమామ పుస్తకమా లేక చందమామ గ్రహమా అనేది స్పష్టత లేదు. అలాగే, అతనికి కోపం వచ్చి చేయి ఎత్తాడు అని వ్రాసారు. అది కుడి చేయ లేక ఎడం చేయా అనేది స్పష్టత లేదు. ఇలాగే కథంతా తప్పుల తడకగా, దరిద్రంగా ఉంది. యాక్ ఛీ, ఏం రాసావురా నాయనా అనిపించింది. కథ చిత్తూరు నాగయ్య గారి కాలం నాటిది, కానీ కథనం శ్రీదేవిలా చక్కగా నడిచింది. ముగింపు అమ్రిష్‌పురి మొహంలా యావగింపు కలిగించింది. అలాగే కథలో, అత్తగారి పాత్రకు బదులు మావగారి పాత్రని హాస్పటల్లో జాయిన్ చేస్తే బాగుండేది. ఎందుకంటే, అత్తగారు ఒడియాలు పెడుతుండగా, ఆమెకి గుండెపోటు వచ్చింది. ఆమెని ఆసుపత్రిలో చేరిస్తే, ఒడియాల పిండి మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా! కాబట్టి రచయిత ఈ విషయం ఆలోచించాల్సింది. ఇలాగే కథలో బోలెడు తప్పులు. ఇది అసలు రచనేనా! ఏం రాశాడో, ఏం పాడో అనిపించింది. ఇక చివరగా ఒక మాట, నేను పైన రాసిన సమీక్ష అంతా, రచయిత చచ్చినట్టు సహృదయంతో స్వీకరించాలి. ఎందుకంటే విమర్శలూ, తిట్లూ, శాపనార్థాలూ, ఛీత్కారాలూ, చీదరింపులే అతన్ని ఇంకా మంచి రచయితని చేస్తాయి. మీరందరూ కూడా ఈ కథని చదివి, తిట్టి తిట్టి పెట్టండి. దుమ్మెత్తి పోయండి. అదీ సమూహంలోనే. ఇవన్నీ రచయిత సహృదయంతో తీసుకుంటే కాంప్లాన్ తాగినట్టు కొబ్బరి చెట్టులా ఎదుగుతాడు. లేదా బోన్సాయి చెట్టులా ఉండిపోతాడు. ఇట్లు సమీక్షకుడు పిల్లబాబు” అని అతని సమీక్ష చదవడం ముగించాడు సదానందం పళ్ళు కొరుకుతూ.

ఆ తరువాత, జీవ కుమార్ తన ‘ఐ స్పోయిల్’ అనే తన కథ పెట్టాడు. ఆ కథ చదివిన ఓ రచయిత్రి లబోదిబో అంటూ అడ్మిన్ ఆనందరావుకి ఫోన్ చేసి, “హద్దు దాటిన కథలు వద్దని” చెప్పమని ముక్కు చీది మరీ నెత్తి బాదుకుంది. మరో రచయిత్రి, ఆ కథ చదివి, “సమూహంలో ఏవిటండీ ఈ కథ. అన్నీ బూతులే. అశ్లీలం, జుగుప్సా, ఛీ పాడు కథ. కొండ బాబు చేతిలోని బీడీ కట్టని బండబాబు లాక్కున్నాడని, కొండబాబు అతని చొక్కా చించేస్తాడు. దాంతో బండబాబు ఈ సారి నీ యవ్వ ఏందిరా బూతులు, బూతులు, బూతులు, ఆ తరువాత బండబాబు, అతని చొక్కాతో పాటు బనియన్ కూడా చించేస్తాడు. తరువాత ఇద్దరూ పేడ తీసుకుని విసురుకుంటారు. ఆ తరువాత కుళ్ళు కాలువలో పడి పోట్లాడుకుంటారు. ఏవిటండీ ఈ కథ? నాకు నచ్చలేదు. పైగా పులిహోర, గుత్తివంకాయ్ తినే ముందు ఈ కథ చదివాను. దాంతో ఆకలి చచ్చి, డోకొచ్చేలా ఉందిపుడు” వ్రాసిందావిడ.

మరో రచియిత్రి, “అదేం కాదు. నాకు ఐ స్పోయిల్ కథలో బూతులు, బూతుల్లానే అనిపించలేదు. వారి దరిద్రం మాత్రమే కనిపించింది. ఎంత బావుందో కథ. ఇలాంటి కథలంటే ముక్కు కోసుకుంటాను. ఇలాంటివి ఇంకా ఉంటే పెట్టండి, బాబ్బాబూ” పెట్టిందావిడ.

ఇంకో రచయిత, “అవును కథ బావుంది. విన్న పచ్చి బూతులని అలానే రాసేసాడు మహానుబావుడు. కాకపోతే ఈ కథని మా అమ్మని కానీ, చెల్లెల్ని కానీ, నా కూతురిని గానీ చదవమని అడగలేకపోయాను.. డొక్కలో గుద్దుతారేమో అని భయం వేసింది”.

ఆ తరువాత ఐ స్పోయిల్ కథా రచయిత, “ఈ కథ గొప్పది. చదవడం రాలేదు మీకు. బూతులు, తిట్లు కూడా కథలో భాగం. సహజంగా వ్రాసాను” అని సందేశం పెట్టేసి ఊరుకున్నాడు.

తరువాత, ఆరిన దీపం, వెలగని అగ్గిపుల్ల అనే కథ పెట్టాడు రచయిత పుల్లారావ్. ఆ కథపై పెద్దబాబు సమీక్షిస్తూ, “హీరోయిన్, హీరోని కర్రతో చితక బాదిందని వ్రాసారు. కత్తితో పొడిస్తే బావుండేదని నా అభిప్రాయం” అని పెట్టాడు.

“మీ విలువైన సలహాకి ధన్యవాదాలు” అని చెప్పి, మనసులో “గుర్తుపెట్టుకుంటాను, నువ్వేదో పెద్ద గొప్ప కథలు రాసినట్టు!, అప్పుడెప్పుడో నువ్వు రాసిన ముక్కుకి జలుబు చేసింది, బట్టతల బావ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. నేనూ చదివాను” అనుకున్నాడు మంటగా.

తర్వాత అమరంబాబు అనే రచయిత, పుల్లారావ్ కథని సమీక్ష చేస్తూ, “సంభాషణలు పెద్దగా బాలేదు. గుండెల మీద గుద్దాడు అనడానికి బదులు, గుండెల మీద తన్నాడు అని రాయాల్సింది. అలానే మనిషివా గేదెవా అనడానికి బదులు, మనిషివా జంతువ్వా అంటే బాగుండేది” అని పెట్టాడు.

అది చదివిన పుల్లారావ్, సరే అని కోపం అణుచుకుని, “బాగా సద్విమర్శ చేశారు సంతోషం” అన్నాడు.

తర్వాత యవ్వన రావ్, “ఇదో అర్థం పర్థం లేని కథ. నాకు నచ్చలేదు, చిప్ప పత్రికల్లో వచ్చిన అరకేజీ పావురం అనే కథను కాపీ చేసినట్టుగా ఉంది. అలా చేసినా కానీ ఎగరలేదు. కథలో విషయం స్పష్టంగా లేదు” అని వ్రాసాడాయన.

అది చదివిన పుల్లారావ్ కి ఫుల్లుగా కోపం వచ్చింది. దాంతో అతను ఆవేశంతో ఊగిపోతూ, “నోరు మూయండి. నా కథ నా ఇష్టం. అయినా పత్రిక వచ్చింది కదా! ఎందుకు మీ కడుపు మంట?” అంటూ నాలుగు తిట్లు తిట్టాడు. దాంతో సమూహ అడ్మిన్ ఆనందరావ్ ఆలోచనలో పడ్డాడు. తరువాత తేరుకుని, “కథ చదివి సద్విమర్శ చేయాలి, అదీ రచయితల గౌరవానికి భంగం కలగకుండా, వారిని చిన్నబుచ్చకుండా మాత్రమే చేయాలి. వీలయితే వారి వ్యక్తిగత ఖాతాకి మీ సమీక్ష, విమర్శలు పంపండి. అతి సర్వత్రా వర్జయేత్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే, ఇది కూడా కుటుంబం లాంటిదే. మన కుటుంబంతో కలిసి ఎలాంటి సినిమాలు చూస్తామో, ఎలాంటి కథలు పంచుకోగలమో మనకి తెలుసు. అలాగే ఇక్కడ పెట్టే కథలు కూడా రచయిత్రులు, పెద్దలు చదువుతారు. వారికి ఇబ్బంది కలిగించే మోటు సంభాషణలు, చవకబారు వర్ణనలూ ఉండే కథలూ ఇక్కడ పెట్టడం తగదు. అలానే, నేను విన్నదే పాట, నేను తిన్నదే సపోటా అనుకోకూడదు. రాళ్ళ గుట్టలో ఓ గులక రాయిలా కాదు, బంగారం నాణ్యతని పరీక్షించే గీటు రాయిగా మారాలి. అన్ని వీధులూ శివాలయానికే అన్నట్టు, అన్ని సమూహాలూ ఆరోగ్యకరమైన సాహిత్యానికే అన్నది గ్రహించాలి” అని చెప్పడంతో, అప్పటినుండి సమూహం ప్రశాంతంగా మారింది. అడ్మిన్ ఆనందం నిజంగా ఆనందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here