నా విమర్శనాలోకనం…

5
2

[dropcap]”C[/dropcap]riticism is the branch of study concerned with classifying, expanding, evaluating work of Literature”

రాగద్వేషాలకు అతీతంగా కావ్యంలోని బాగోగులను, మంచిచెడ్డలను, అర్ధాన్ని, సొగసును, లోపాలను స్పష్టంగా ఎత్తి చూపేది విమర్శ. ప్రాచీన కాలంలో సంస్కృత కావ్యాలను విశ్లేషించడాన్ని “భాష్యం చెప్పటం” అనే అనేవారు. టీకా తాత్పర్యాలను, విశేషాలను తెలియజేసేవారు.

దాదాపు అన్ని ప్రక్రియల లాగే ఈనాడు మనం వ్యవహరిస్తున్న ‘విమర్శ’ కూడా ఆంగ్లం ప్రభావంతో వచ్చిందని చెప్పవచ్చు. Kritein అనే గ్రీకు పదం నుండి Criticism అనే ఆంగ్ల పదం ఏర్పడింది. దానికి సమానార్థకంగా ‘విమర్శ’ అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. సాధారణంగా లోకంలో విమర్శించటం అంటే ఆక్షేపించడం లేదా తిట్టడం అనే అనుకుంటారు. కానీ విమర్శ అంటే – బాగా పరిశీలించుట, పరీక్షించుట, ఆలోచించుట, చర్చించుట అనే అర్థాల్లో చెప్పవచ్చు. ఒక రచనలోని ఉచితానుచితాలు, భావ గాంభీర్యం, అలంకారిక రచనా పాటవం, పాత్రచిత్రణ, రసపోషణ, సన్నివేశ కల్పన, శిల్ప సౌందర్యాది సత్య విషయాలను కూలంకషంగా చర్చించడం ‘విమర్శ’. ఇది చాలా నేర్పుతో చేయవలసిన పని. విమర్శ అనేది రచయిత మీద కాకుండా రచన మీద ఉండాలి. పొగడ్త కాకుండా తెగడ్త కాకుండా నిష్పక్షపాతంగా ఉత్తమ సాహిత్యానికి తగిన ‘ప్రేరణ’ నిచ్చేదిగా ఉండాలి. పొగిడినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి రాకపోవచ్చు, కానీ నిష్కర్షగా విమర్శించినప్పుడు విమర్శకుడు తాను చెప్పిన విషయాలకు తగిన ఆధారాలు చూపిస్తూ సమాధానం చెప్పవలసిన సందర్భం రావచ్చు. అలా చెప్పటానికి తగిన సాహసం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఒకానొకచో దీర్ఘ వాదోపవాదాలకు సంసిద్ధమై ఉండాలి. రచయితకు పాఠకుడికి మధ్య వారధి లాంటివాడు విమర్శకుడు. గత తరంలోని వారి రచనలు, సమకాలీన రచనలు చదవాలి. వ్యక్తిగత విమర్శలు చేయటం, లోపాలు ఏకరువు పెట్టటం, స్తోత్రపారాయణం చేయటం కానీ లేకుండా విచక్షణత పాటిస్తూ సరైన విమర్శ చేసినవాడు సద్విమర్శకుడు.

ఒకానొక రచయిత ప్రముఖుడు అయినంత మాత్రాన అతని తదుపరి రచన అద్భుతంగా ఉండాలని లేదు. ఆ విషయం నిర్భయంగా విమర్శిస్తూనే, సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావించి దుయ్యబట్టడం చేయకూడదు. వ్యక్తిగత ద్వేష పూరితమైన విమర్శ ‘దుర్విమర్శ’ అవుతుంది. దాని వలన పాఠకునిలో అయోమయం ఏర్పడుతుంది. సాహిత్యాన్ని సాహిత్య దృష్టితో చూడగల ‘సహృదయత’ విమర్శకునిలో ఉండాలి. ఎప్పటికప్పుడు సాహిత్యంలో ఏర్పడుతున్న సాహిత్య ధోరణులు, సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుంటూ – రచయిత ఏం చెప్తున్నాడు, ఎలా చెబుతాడు, అతని దృక్పథం ఏమిటి, విశేషార్థం ఏమిటి, ఎంతవరకు కృతకృత్యుడయ్యాడు, ఆ రచనకి సాహిత్యంలో ఏర్పడిన స్థానం ఏమిటి అన్న విషయాలను అన్వేషించి ఆవిష్కరించిందే నిజానికి ‘సద్విమర్శ’. అలాంటి విమర్శే రచయితకి రచనకి న్యాయం చేస్తుంది. పాఠకుడికి మార్గదర్శకంగా తోడ్పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here