Site icon Sanchika

విమర్శకులా? వందిమాగధ భజన బృందాలా?

[box type=’note’ fontsize=’16’] ఈ వ్యాసంలోని కొంత భాగాన్ని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం తమ దూరవిద్య విభాగంలో తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంచుకుంది. [/box]

[dropcap]తె[/dropcap]లుగు పత్రికలలో సాహిత్య పేజీలు చూస్తుంటే తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైన రచయితలకు కొదువ లేదనిపిస్తుంది. తెలుగు రచనలను నోర్లు తిరగని విదేశీ రచయితల పేర్లతో పోల్చి పొగడటం కనిపిస్తుంది. తెలుగు పుస్తకాలను అర్థంకాని విదేశీ పుస్తకాలతో తూచి మనవే గొప్పవని తేల్చటం కనిపిస్తుంది. సాహిత్య సభలలో అయితే సరస్వతీ దేవి సైతం సిగ్గుపడేలా రచనను, రచయితను పొగడేయటం వినిపిస్తుంది. ఇంకా పలు సెమినార్లు, సమావేశాలలో పత్రాల సమర్పణలు,  విశ్లేషణలు మన తెలుగు సాహిత్య ప్రభల ముందు ప్రపంచ సాహిత్యం వెలతెలబోతున్నదన్న భ్రమను కలిగిస్తాయి. అయితే ఈ పొగడ్తల ప్రగల్భాలు, ఎత్తివేతల భజనల హోరును దాటి ఎవరయినా ఆయా రచయితల రచనలు చదివితే ఆశాభంగం చెందటం అటుంచి మళ్ళీ తెలుగు రచనల జోలికి వెళ్ళటం సందేహంలో పడుతుంది. అందుకే పత్రికలలో, సభలలో, సెమినార్లలో ఆకాశంలో చుక్కల్లా వెలిగే రచయితలు, పుస్తకాల అమ్మకాలు, పాఠకుల ఆదరణ దగ్గరకు వస్తే తెల్లవారి నక్షత్రాల్లా తెల్లముఖాలు వేస్తారు. ఇందుకు కారణం ఏమిటంటే తెలుగు సాహిత్యంలో ఒక రచన గొప్పతనానికి రచన ఆధారం కాదు. రచయిత ఆధారం.  తెలుగులో ఒక రచయితకు పేరు రావాలంటే రచనా చాతుర్యం, రచన పటిమ, సృజనాత్మక పటుత్వ సంపదలు కాదు కావాల్సింది . ప్రస్తుతం పదింట తొమ్మిదిమార్లు ప్రస్తావనకు గురయ్యే రచయితల రచనలను  పరిశీలిస్తే, తెలుగు సాహిత్యంలో పేరు రావాలంటే రచయిత/త్రులు ఈ క్రింది లక్షణాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా కలిగి  ఉండాలనిపిస్తుంది.

  1. రచయిత ఉన్నతోద్యోగి అయి ఉండాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నతోద్యోగి అయితే చాలా మంచిది. ఎందుకంటే ప్రభుత్వ సొమ్మును సాహితీవేత్తల నోటిదురద తీర్చేందుకు స్వేచ్ఛగా వినియోగించే వీలుంటుంది. పొగడ్తల పులకరింతలు పరవళ్ళు తొక్కించే వీలుంటుంది. ఇతర రంగాలలోనైనా,  ఉపయోగపడే ఉన్నత ఉద్యోగాలలో ఉంటే ఉపయోగకరం. ఎలాంటి రచనలు చేసినా చెల్లిపోతుంది. రచనలు చేయకున్నా నడచిపోతుంది.
  2. ఏదైనా ఓ ఉద్యమంలో చురుకుగా పాత్ర వహించాలి. అది ఇజం కావచ్చు, అస్తిత్వ పోరాటోద్యమం కావచ్చు. సంఘసేవ కావచ్చు, మైనారిటీవాదం కావచ్చు. ఏదో ఓ ఉద్యమంలో ఉండాలి. ఏం రాసినా, ఏం మాట్లాడినా ‘ఆవుకు నాలుగుకాళ్ళు’ అన్నట్టు ఆ అంశమే రచన ప్రతిఫలించాలి . అలా ఒకే అంశం ఎన్నిసార్లు అదేరకంగా రాస్తే అంత ‘అస్తిత్వం’ సంపాదిస్తారు. అంత గొప్ప రచయితలవుతారు.
  3. జర్నలిస్టు రచయిత  అయి ఉండాలి. ఇక్కడ రచయిత జర్నలిస్టులకు, జర్నలిస్టు రచయితలకు తేడా ఉంది. రచనలు చేస్తూ, రచనలపై మక్కువతో జర్నలిజంలో ప్రవేశించినవారు రచయిత జర్నలిస్టులు. వీరికి రచనల పట్ల, రచయితల పట్ల అవగాహన, సానుభూతి ఉంటాయి. అలాకాక జర్నలిజంలోకి వచ్చిన తరువాత, పత్రిక అందుబాటులో ఉందికదా అని రచనలు ఆరంభించిన వారు జర్నలిస్టు రచయితలు. ఆధునిక తత్త్వవేత్తల స్థాయి వీరిది. ఏం రాస్తే అదే ‘ఆదర్శం’గా పరిగణనకు గురవుతుంది. రకరకాల లాభాలు ఆశించి వీరి చుట్టూ చేరినవారు, వీరు కలంకదిలిస్తే సరస్వతీకంట భాస్పజలధార అన్నట్టు పొగడి వీరిని ఆకాశానికి ఎత్తుతారు. అక్షరం తెలియని జర్నలిస్ట్ రచయితలని ఆకాశంపై క్రింద ఎవరూ కనబడనంత ఎత్తున నిలబెట్టుతారు.
  4. ఏ ఉద్యమంలో లేనివారు, ఉన్నతోద్యోగాలలో లేనివారు పేరున్న రచయితలు అయిపోవాలంటే ఉద్యమాలలో ఉన్నవారికి సన్నిహితులయినా అవ్వాలి లేక జర్నలిస్టు రచయితల బృందాలలో వందనాలు చేస్తూ హీరోల పక్కన సైడు కిక్కుల్లా ఉండాలి. ఇలాంటివారు తొందరగా పేరున్న రచయితలు అయిపోతారు అంతగా రాయకున్నా.ఎందుకంటేఅ వీరి పేర్లు పదే పదే ప్రస్తావిస్తూ కృత్రిమ ఖ్యాతిని ఆపాదిస్తారు వీరు ఆశ్రయించినవారు.
  5. దిగజారుడు రచనలు చేయాలి. రచనలు ఎంత దిగజారుడుగా ఉంటే అంత మంచిది. ఎన్నెన్ని వికృతులను చక్కగా ప్రదర్శిస్తే అంత మంచిది. సంప్రదాయ దూషణ, వ్యవస్థల విద్వేషం, వ్యక్తిగత విలువల తిలోదకాలు, అక్రమమే సక్రమమని ప్రామాణికత కల్పించాలనే రచనలు చేయగలిగితే రచయితలకు బాగా గిట్టుబాటవుతుంది. ముఖ్యంగా మహిళా రచయితలు ఎంతగా తిరుగుబాటు, తిరస్కృతి, విశృంఖలత్వాలను ప్రదర్శిస్తే అంతగా ఆ పేరు మోసే ఈగల గుంపు రచయిత్రి చుట్టూ చేరుతుంది. రచయిత్రికి ఇమేజ్‍ని సృష్టించి పీఠారోహణం చేయిస్తుంది. ఎవరయినా ఏమయినా అంటే మహిళ స్వేఛ్చగా మాట్లాడితే భరించని మనువాదులని కంట తడిపెడితే ఖ్యాతి వెల్లువవుతింది. దిగజారుడు రచయిత అక్షరాలు కలిపి రాసేసి, అక్కడక్కడ సంస్కృత సమోసాలు ఎవరికీ అర్థం కానట్టు వెదజల్లితే అదొక వింత శైలిగా గుర్తింపు తెస్తుంది.
  6. ఎన్నారై రచయిత.…ఒకప్పుడు తమనెవరూ పట్టించుకోలేదని బాధపడే ఎన్నారై రచయితలిప్పుడు తమ రచనలు ప్రచురించే ప్రత్యేక పత్రికలను సంపాదించారు. తామేమి రాసినా పొగిడే ఒక గుంపునూ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నారై రచయితలలోకూడా కొందరు బ్రతకలేని రచయితలున్నారు. వీరిని వదిలేస్తే పేరు సంపాదించాలంటే ఎన్నారై రచయిత అయితే చాలా మంచిది.

టూకీగా ఈ ఆరు వర్గాలకు చెందున రచయిత/త్రులే ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ఉత్తమ రచయితల్లా వెలుగొందుతున్నారు.

ఇక్కడ ఓ సందేహం వస్తుంది. ఈ రచయితల వర్గీకరణ చూస్తే మనకు తెలుగులో ప్రపంచం పట్టనంత ఉత్తమ రచయితలు ఉన్నా,  పాఠకులు పుస్తకం పట్టేట్టు చేయగల రచనల్లేవని అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో రచయితకూ, పాఠకులకూ నడుమ వారధిలా నిలవాల్సిన విమర్శకులు ఏం చేస్తున్నారన్న సందేహం వస్తుంది.

సాహిత్య ప్రపంచంలో రచయిత కన్నా ప్రముఖ పాత్ర విమర్శకుడిది. రచయిత రచన చేయందే సాహిత్యం ఉండదు. రచయిత బ్రహ్మ లాంటివాడు. కానీ ఆ రచన పాఠకులకు చేరువ అయి, దానిలోని సంపూర్ణ సౌందర్యం పాఠకుల మనస్సు అనుభవించాలంటే విమర్శకుడు అవసరం. విమర్శకుడు విష్ణువు లాంటివాడు. బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆ సృష్టిని నడిపించేది విష్ణువు. రచయిత సృజించిన రచనను అర్థం చేసుకుని, రచయిత భావావేశాన్ని లేక భావావేశంగా మలచుకుని, రచనను అనుభవించి పాఠకుడికి వివరించేవాడు విమర్శకుడు. మరోవైపు రచనలో రచయిత పొందుపరచిన అనేక నర్మగర్భిత అంశాలను, అవగాహన చేసుకుని పాఠకుడికి చేరువ చేసేవాడు విమర్శకుడు. అంటే రచయిత సృజనను సంపుర్ణంగా అర్థం చేసుకుని, అనుభవించి, దాన్లోని ప్రయోగాలు, ఒంపులు, సొంపులు పాఠకుడికి అందించేవాడు విమర్శకుడు. కానీ ఎప్పుడయితే రచయితలు ఒక వర్గీకరణలోకి ఒదుగుతున్నారో ఆయా రచనలు పాఠకుల ఆదరణ పొందటం లేదో, అపుడు విమర్శకుడి పనితీరు ప్రశ్నార్థకం అవుతుంది.

సాధారణంగా పాఠకుల దృష్టి వేరు. విమర్శకుల దృష్టి వేరుగా ఉంటుంది. విమర్శకులు మెచ్చిన రచన పాఠకుడు కూడా మెచ్చాలని లేదు. కానీ విమర్శకుల వివరణ పాఠకుడికి దృష్టిని ఇస్తుంది. రచన పట్ల అవగాహన పెంచుతుంది. అతడి ఆలోచనకు విస్తృతిని ఇస్తుంది. దాంతో రచన పాఠకుడి మెప్పు పొందుతుంది. కానీ ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. విమర్శకులకూ, పాఠకులకూ నడుమ ఎంతగా అగాధం ఏర్పడి ఉందంటే పాఠకులు మెచ్చిన రచనలు విమర్శకుల దృష్టికి ఆనవు. విమర్శకులు పొగిడిన రచనను ఆత్రంగా చదివిన పాఠకుడు మరో రచనను చదవాలంటే భయపడతాడు. అంటే అందరూ ఒక రచననూ ఆకాశానికి ఎత్తేస్తున్నారంటే పాఠకుడూ ఎలర్టయి ఆమడదూరం పారిపోయే పరిస్థితి ఉన్నదన్నమాట. విమర్శకులకూ పాఠకులకూ నడుమ trust deficit  అనే అగాధం అడుగు లేనంత లోతుగా ఉందన్నమాట.

ఒక్కసారి సాహిత్య పేజీల్లో వస్తున్న విమర్శలు, విమర్శకులుగా చలామణి అవుతున్న వారి సమీక్షలు, విమర్శనాత్మన రచనలు, ఉపన్యాసాలు పరిశీలిస్తే, రచయితల లాగే విమర్శకులను కూడా వర్గీకరించవచ్చనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యంలో విమర్శలో రకాలు దాదాపుగా 30 ఉన్నాయి కానీ విమర్శకులను వర్గీకరించటం మాత్రం తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఇతర భాషల విమర్శకులు విమర్శ పరిధులలో ఒదిగి  విమర్శిస్తే, తెలుగు విమర్శకులు మాత్రం తమ పరిధులు, పరిమితులు తామే నిర్ణయించుకుని మార్గదర్శనం చేస్తున్నారు.

తెలుగు సాహిత్య విమర్శకులను తొమ్మిది రకాలుగా వర్గీకరించవచ్చు అవి:

1. విహంగ వీక్షక విమర్శకులు:

వీరు ఆకాశంలో ఎగిరే పిట్టల్లాంటివారు. నేల దిగి రారు. ఏ పుస్తకాన్నయినా అట్టమీద రచయిత పేరు, ముందుమాట, అట్టవెనుక ఉన్నది చదివేసి నాలుగైదు ముక్కలు రాసేస్తాడీ విమర్శకుడు. ’ఇది అందరూ చదవదగ్గ పుస్తకం’ లాంటివి తన వాక్యాలుగా జోడిస్తాడు. పుస్తకాన్ని విహంగవీక్షణం చేసే ’పిట్టచూపు’ విమర్శకుడితడు. పుస్తకం మంచి చెడ్డలతో పని ఉండదీ విమర్శకుడికి.

2. భట్రాజు విమర్శకులు (కులం సంబంధి కాదు):

 పూర్వకాలం రాజుల సన్నిధిలో ఉండి ప్రతి విషయాన్ని గొప్పగా పొగడే భట్రాజుల్లాంటి విమర్శకులు వీరు. వీరికి సాహిత్యంలో చెడు కనపడదు. ఎటువంటిదాన్నయినా పాజిటివ్ దృక్పధంతో చూస్తారీ విమర్శకులు. భట్రాజు విమర్శకులు పొగడటం పుస్తకాలకీ, రచయితలకీ అవమానం లాంటిది. కానీ అందరినీ తన మన భేదం లేకుండా పొగడుతారు కాబట్టి అందరికీ ప్రీతిపాత్రులవుతారీ విమర్శకులు. కాస్త వాక్చాతుర్యం ఉంటే ప్రతి సభకు, సమావేశానికీ మంచి వక్తగా మంచి డిమాండ్ ఉంటుందీ విమర్శకులకు. నొప్పింపక తానొవ్వక అందరితో తిరిగే విలువైన విలువలేని విమర్శకుడు ఇతడు.

3. అధ్యాపక/ఉపాధ్యాయ విమర్శకులు:

ఈ వర్గానికి చెందిన విమర్శకులు రచయితలు రచనను ఇలా రాసి ఉండాల్సి ఉంది. అక్కడ ఆ పాత్రను అలా తీర్చిదిద్దాల్సి ఉంది అని సూచనల్లాంటి ఆదేశాలిస్తారు. స్వతహాగా ఒక్క సృజనాత్మక రచన  కూడా చేయని వీరు సృజనాత్మక రచయితల సృజన గురించి తీర్పులిస్తారు. పాఠాలు చెప్తారు. ఈ రకమైన విమర్శ తెలుగు విమర్శకులకు మాత్రమే ప్రత్యేకం. ప్రపంచ సాహిత్యంలో రచయిత రచనను విమర్శించటం, విశ్లేషించటం ఉంటుంది. కానీ రచయితలకు విమర్శకుడు పాఠాలు చెప్పడం ఉండదు.  రచనను విశ్లేషించాల్సిన ఎకడమీషియన్లు విమర్శకులై సాహిత్య రంగాన్ని నిర్దేశిస్తుండటంతో విమర్శకుడు ఉపాధ్యాయుడైపోయాడు. రచయిత రచన సమాధానపత్రం లాంటిదయిపోయింది.

4. తూష్ణీంభావ విమర్శకులు:

చాలా తక్కువే అయినా ప్రత్యేక వర్గం ఈ విమర్శకులది. వీరు విదేశీ సాహిత్యమే సాహిత్యం తెలుగులో సాహిత్యమే లేదని తీర్మానించేసిన విమర్శకులు. వీళ్ళు చదివిన ఒకరిద్దరు విదేశీ రచయితలే రచయితలు, తెలుగు రచయితలంతా పనికిరాని వారు అన్న తూష్ణీభావంతో విమర్శలు రాస్తారు. ప్రతి విమర్శలో కాఫ్కా, బోర్హస్, నొబకోవ్, మురకామి, మార్క్వజ్ వంటి పేర్లను పేరాకు పదిమార్లు ప్రస్తావిస్తారు తూష్ణీంభావ విమర్శకులు.

5. తెలివైన అతి తెలివి విమర్శకులు:

ఈ వర్గానికి చెందిన విమర్శకులు రచన ఏదైనా ఎలాంటిదైనా విదేశీ భాషల రచనలు ప్రస్తావిస్తారు. వారి జర్నల్స్ లోని రచనలను కోట్ చేస్తారు. ఒకవేళ వారు విమర్శించేది తమకు కావాల్సిన వారి రచనలయితే, వాటి నాణ్యతతో సంబంధం లేకుండా విదేశీ కోట్‍లతో ఆకాశానికి ఎత్తుతారు. తమకు లాభంలేని రచయితల రచనల విషయంలో మాత్రం విదేశీ రచనలను చూపిస్తూ సూచనలు, సలహాలు ఇస్తూ రచయితను చులకన చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఇలాంటి విమర్శకులు విదేశాలలో ఉండేవారయితే వారు ఒక్క రచన చేయకున్నా వారిని ఓ పీఠం మీద ఉంచేసి నీరాజనాలర్పిస్తారు. అలా అర్పించేవారి రచనలకే ఈ తెలివైన అతి తెలివి విమర్శకులు విదేశీ పూలమాలలేస్తారు. ఇతరులపై పూలలా అనిపించే రాళ్ళు విసురుతారు. అయితే వీరి తెలివి అంతా విదేశీ రచనలకు, తెలుగు రచనలకూ ఉండే మౌలికమైన స్థల, కాల, సాంస్కృతి, చారిత్రక, సాంఘిక తేడాలను పట్టించుకోకపోవటంలోనే కనిపిస్తుంది.

6.  తెలివిలేని అతితెలివి విమర్శకులు:

ఇదొక ప్రత్యేక వర్గం. వీరికి రచన అంటే తెలియదు. రచన చదవటం రాదు. కానీ అతి తెలివి అనుకుంటూ తమ తెలివిలేనితనాన్ని బయటపెట్టుకుంటారు. ప్రతి విమర్శలో సందర్భం ఉన్నా లేకున్నా, ఔచిత్యంతో సంబంధం లేకుండా చలం తప్ప నాకేమీ తెలియదు. పతంజలిని తప్ప నేనెవ్వరినీ చదవను, రావిశాస్త్రిదే రచన అంటూ ఇలాంటి నిర్దిష్టమైన అభిప్రాయాలను గొప్పగా ప్రకటించి ‘నాకెంత తెలివి ఉందో చూశారా’ అంటూ గొప్పలు చెప్పుకుంటారు ఈ తెలివిలేని అతి తెలివి విమర్శకులు. అయితే వీరు తాము విమర్శిస్తున్న రచననే కాదు, ‘అదే రచన’ అంటున్న దాన్ని  కూడా చదివారన్నది సందేహాస్పదమే!

7. కలర్ బ్లైండెడ్, బ్లైండ్ ఫోల్డెడ్ విమర్శకులు:

ఈ రెండు రకాల విమర్శకులను ఒక వర్గంలో చేర్చటం ఎందుకంటే ఇద్దరి తత్త్వం ఒకటే. తమకు నచ్చిందే చూస్తారు. కలర్ బ్లైండెడ్ విమర్శకులకు ఒకే రచన కనిపిస్తుంది. రచన ఎలా ఉన్నా తమకు కావాల్సిన రంగు కనిపిస్తే పొగడ్త, రచన ఎలా ఉన్నా తమకు నచ్చని రంగు కనిపిస్తే విమర్శ. బ్లైండ్ ఫోల్డెడ్ విమర్శకులు  గాంధారి లాంటి వారు. తమకు నచ్చిన వారి రచనలు అమోఘం. నచ్చని వారి రచనలు అతిఘోరం. ఈ విమర్శకులిద్దరూ రచయితల పేర్లు చూస్తారు తప్ప రచనను చూడరు. అయితే వీళ్ళు పొగిడే వాళ్ళందరూ సాహిత్య పెద్దలు, ఉద్యమాల వాళ్ళు, ఉన్నత స్థానాల్లోని వారే కావటంతో ‘పొగడటం’ వీరి ఎదుగుదలలో భాగం,  ‘తిట్టడం’ వీరి ప్రోగ్రెస్సివ్‍నెస్ ప్రదర్శనలో భాగం. నచ్చినవారిని ఆకాశానికి ఎత్తి నచ్చని వారిని చీల్చి చెండాడి ‘ఏకేశాను ‘ అని కాలరెగరేస్తారీ రెండు రకాల విమర్శకులు.

8.  నెల్సన్స్ ఐ విమర్శకులు అను ఒంటికన్ను రాకాసి విమర్శకులు:

ఈ రకమైన విమర్శకులు కలర్ బ్లైండెడ్, బ్లైండ్ ఫోల్డెడ్ విమర్శకుల కలగలుపు సంకరజాతి విమర్శకులు. వీరికి నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. సృజనాత్మక రచన చేసిన పాపాన పోరు,  కానీ రచయితలు ఇలాంటి రచనలే చేయాలని పట్టుబడతారు. వీరి దృష్టిలో డిటెక్టివ్, క్రైమ్, హారర్, సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ ఫిక్షన్ వంటి రచనలు చేసే హక్కు విదేశీ రచయితలకు తప్ప తెలుగు రచయితలకు లేదు. విదేశీయులు చేస్తే క్లాసిక్. తెలుగు రచయితలు చేస్తే ‘యాక్’.  ఆవైపు కూడా చూడరు. సాహిత్యంలో అంటరాని తనం పాటించే విమర్శకులు వీరు. అసలు వీరికి సామాజిక స్పృహ (అదో బ్రహ్మపదార్థం) ఉన్న రచనలు, తప్ప మరొకటి కనబడవు. చూడరు. వాటిల్లో కూడా ఎవరిని పొగిడితే లాభాలుంటాయో వారి రచనలు మాత్రమే చూస్తారు. మిగతావి ప్రస్తావిస్తే ప్రాణాలు పోతాయన్నట్టు ఆవైపు చూడరు. వీళ్ళ ‘పాలిటికల్లీ కరెక్టు’ విమర్శల వల్ల వీరు విమర్శ అంటే తెలియకుండా సగం కథా ప్రపంచం చూడకుండానే గొప్ప విమర్శకులుగా పేరు పొందుతారు. ‘షేర్’ తెలియని షేర్ మార్కెట్ బ్రోకర్లలాంటి వారీ ఒంటికన్ను రాకాసి విమర్శకులు.

9. స్వంత డబ్బా విమర్శకులు:

సాధారణంగా వీరు రచయితలయి ఉంటారు. ఏ రచన గురించి రాసినా, ఎంత గొప్ప రచయిత గురించి రాసినా ‘నేను అలా రాశాను’, ‘నేను ఇలా రాశాను’ అనుకుంటూ తన రచనలనే ప్రస్తావిస్తూంటారు. తమ రచనలు ఓ స్థాయిలో ఉన్నాయన్న భ్రమలో ఉంటూ అందరినీ భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తూ, భ్రమ పెట్టేస్తున్నామని భ్రమపడతారీ స్వంత డబ్బా విమర్శకులు.

అయితే ఇప్పుడిప్పుడో ఏదో వర్గం ‘ఫేస్‍బుక్ విమర్శక వర్గం’ ఒకటి తయారవుతోంది. అయితే ఈ వర్గానికి చెందిన అధిక శాతం వారు ఇతర విమర్శకులలాగే తమవారిని పొగడి, ఇతరులను పట్టించుకోకపోవడమో, విమర్శించడమో చేస్తారు. అందుకే వీరికోసం ప్రత్యేకమైన వర్గం ఏర్పాటు చేయలేదు. పైగా వీరందరికీ విమర్శక స్థాయి ఇస్తే ఫేస్ బుక్ కామెంట్లను కూడా సాహిత్య విమర్శగా పరిగణించాల్సివుంటుంది. అప్పుడు ఇప్పటికే గందరగోళంగా వున్న తెలుగు సాహిత్య విమర్శ…గోళాగందరం అవుతుంది.

నవ గ్రహాల్లాంటి ఈ నవ విమర్శక శిఖామణలను గురించి తెలుసుకుంటే స్పష్టమయ్యే విషయం ఏమిటంటే వీరి విమర్శలో ‘స్వలాభం’ ఉంది తప్ప సాహిత్యం లేదు. ఎందుకంటే తమ నమ్మకాలు, ఇజాలు, దృష్టిదోషాలతో సంబంధం లేకుండా ఈ విమర్శకులంతా ఉన్నతస్థాయి ఉద్యోగులను, జర్నలిస్టు రచయితలను, విదేశీ సంస్థలతో సంబంధం ఉన్న రచయితలను మాత్రం తప్పకుండ పొగిడి తీరతారు.ఇతర సాహిత్యరంగాలలో కనపడని వైచిత్రి అందుకే తెలుగు సాహిత్య రంగంలో కనిపిస్తుంది. రచయితలు రచనలు చేయందే విమర్శకులకు పనివుండదు. ప్రత్యేక మనుగడవుండదు. కానీ, తమ అస్తిత్వం నిలుపుకోవటం కోసం తెలుగు రచయితలీ విమర్శకులకు ఊడిగం చేయటం, తాళంవేయటం, వారి కనుసన్నల్లో మెలగి మెప్పుపొందాలని తపనపడటం తెలుగు సమకాలీన సాహిత్య ప్రపంచంలో రచయితలంటే చిన్నచూపు కలగడానికి కారణం. తాము రచయితలకన్నా వున్నతులం అన్నట్టు విమర్శకులు కాలర్లెగరేయటానికి కారణం. అంటే, విష్ణు బ్రహ్మను చిన్నచూపు చూడటం, బ్రహ్మ విష్ణువుకన్నా తాను తక్కువ అని భావించటం అన్నమాట. ఈ పై వర్గీకరణలు, విమర్శకుల లక్షణాలు తెలుసుకున్న తరువాత తెలుగులో నిష్పాక్షికమైన విమర్శకులు, సౌమనస్యం, సౌజన్యం, అవగాహన, ఆలోచన, సమ్యక్ దృష్టి, జిజ్ఞాస, విజ్ఞానం ఉన్న విమర్శకులు లేరని, ఉన్నా వారెవరికీ తెలియదు, వారినెవరూ పట్టించుకోరని అర్థం అవుతుంది. అంతేకాదు ఈ నవ వర్గాల విమర్శకులను కలిపి ‘వందిమాగధ భట్రాజగణ (కులం కాదు) భజన బృందం’ అనేస్తే సరిపోతుందనీ స్పష్టమవుతుంది. అంటే ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ఒకరిద్దరిని వదిలేస్తే మిగతా అంతా విమర్శకుల ముసుగులో ఉన్న వంధిమాగధ భట్రాజు (కులం కాదు) గణ భజన బృందాలు అన్నమాట.

అందుకే దేశం పట్టని రచయితలు, ప్రపంచం పట్టని రచనలను తెలుగులో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నా గుప్పిట నిండే పాఠకులు కూడా లేరు.

Exit mobile version