వినదగు పెద్దలు చెప్పిన

0
2

[dropcap]ఇం[/dropcap]ట్లో అమ్మా నాన్న చెబుతున్నా వినకుండా ఉదయన్నే కొత్తగా కొన్న బుల్లెట్ బయటకు తీశాడు శంకర్. టీనేజి కుండే సహజ లక్షణాన్ని ప్రదర్శించాడు.

అప్పటికి లాక్‍డౌన్ విధించి మూడు నాలుగు రోజులైంది. అంతకుముందు ఒకరోజు జనతా కర్ఫ్యూ అన్నారు.

ఈ లాక్‍డౌన్ ఏమిటో, ఈ కరోనా ఏమిటో, ఎవరికీ అర్థం కావటం లేదు. లాక్‍డౌన్ పేరే ఎప్పుడు వినలేదట పక్కింటి తాతగారు చెప్పారు. బ్లాకవుట్‍లు, కర్ఫ్యూలు చూశాంగాని లాక్‍డౌన్ అనుభవం ఎప్పుడూ చూడలేదన్నారయన, కరోనా వైరస్ గురించి కూడా వినలేదట. స్వైన్‍ప్లూలు, ఎబోలాలు, ఇంకా ఏవేవో మహమ్మారుల గురించి చెప్పుకొచ్చారాయన. ఈ కరోనా గురించి ఆయన డెబ్బై అయిదు ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ వినలేదట. అందుకే దాన్ని నోవెల్ కరోనా అని అంటున్నారట.

అందరూ కరోనా గురించి భయభ్రాంతులవుతున్నారు. ఒక్క యువత తప్ప. ‘ఆఁ కరోనా… గిరోనా…’ అంటూ తీసిపారేస్తున్నారు. వాళ్ళు యువకుడైన ముఖ్యమంత్రికి ప్రతినిధులు మరి. ఉరకలేసే వయసు. వాళ్ళకు తోచదు. పెద్దవాళ్ళు చెపితే వినరు. అంతా దూకుడూ వ్యవహారం. ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ. పాలపొంగు వయసు.

మూడురోజుల నుంచి బందిఖానాలో పెట్టినట్టు వుంది. స్వేచ్ఛకు అలవాటుపడ్డ శంకర్‍కి ఒక్కసారిగా జైల్లో పెట్టినట్లు వుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు హక్కులు వచ్చేయని అవి అజేయమని కొందరి అభిప్రాయం.

అయితే హక్కులతోపాటు ప్రతి పౌరుడికి కొన్ని విధులు కూడా వుంటాయని మర్చిపోవటం ఈ దేశ విషాదం. హక్కులు, విధులు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలవంటివి. ప్రజల మంచికే విధులు. ప్రతి పౌరుడు తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తేనే దేశం అభివృద్ది చెందేది. రోడ్డుమీద అందరూ ఎడమవైపు పోవాలి. అలాకాక కొందరొకలా, మరి కొందరొకరూ వెళితే ఏమవుతుంది? ప్రమాదాలు జరగవా?

లాక్‍డౌన్ ప్రకటించింది కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే కదా. ప్రజలు కరోనా బారిన పడకుండా రక్షించేందుకే కదా. అదొక మహమ్మారి. ఒకసారి విజృంభిస్తే వున్న ఆసుపత్రులు సరిపోతాయా, ఉన్న మందులు సరిపోతాయా? వైద్యులు సరిపోతారా? ఏ రోగమైనా రాకుండా చూసుకోవడం మంచిదా, వచ్చిన తరువాత బాధపడటం మంచిదా? పైగా ఇది అంటురోగం. మందులేని రోగం దేశదేశాలు, ఖండఖండాలు చుట్టివచ్చింది. పోలీసులు, ఇతర అధికారులు రోజూ ముల్లు కర్రతో పొడవాలా?

తర్కంతో పనిలేదు శంకర్‍కి. బోనులో పడ్డ ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నాడు. లాక్‍డౌన్ విధించినందుకు ప్రభుత్వాన్ని వందసార్లు తిట్టుకున్నాడు. చెట్టుమీద కాకుల్ని చూసి అసూయపడ్డాడు. వాటి పని నయం అనుకున్నాడు. కొత్తబండి కొనుక్కుని నెలరోజులు కూడా కాలేదు. బండి మోజు తీరలేదు. మూడు, నాలుగు రోజులు బండి బయటకు తీయకపోవడంతో కాళ్ళు గుదులు పెడుతున్నాయి. అరికాళ్ళు దురదలు పెడుతున్నాయి. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదు అంటారు కదా. మామూలుగానే బండివున్నవాడు వీధి మలుపులో వున్న కిరాణాషాపుకో, బడ్డీకొట్టుకో వెళ్ళాలంటేనే నాలుగడుగులు వేయలేడు. అలాంటిది అప్పుడే యవ్వనంలో అడుగుపెడుతున్న శంకర్ సంగతి చెప్పాలా. పైగా కొత్తబండాయే. ఇంతలో ఈ లాక్‍డౌన్ వచ్చిపడింది. అందరూ ఇంట్లోనే వుండిపోవాలట. ఎవరూ బయటికి రాకూడదట. స్కూళ్ళు, కాలేజీలు మూసేశారు. హాళ్ళు, మాళ్ళు మూసేశారు. హోటళ్ళు బందు చేశారు. రోడ్లమీద జనం కనిపిస్తే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. బండికూడా లాక్కుంటున్నారట. ఎవరూ కిమ్మనకుండా వుండటానికి ఇదేమైనా ఉత్తరకొరియానా, నాలుగుపాదాల నడిచే ప్రజాస్వామ్యమాయే!

గేటు తీసుకుని బయటకొచ్చాడు శంకర్. తళతళలాడే బండినొకసారి ముద్దు పెట్టుకున్నాడు. జేబులోనుంచి ఒప్పో ఫోన్ తీసి ఓ నెంబరుపై టచ్ చేశాడు.

“ఆ చెప్పరా శంకర్” అవతలిపై నుంచి ఓ టీనేజరు.

“అదేరా చందూ! నేను బయటకొచ్చాను. నువ్వేమైనా వస్తున్నావేమోనని ఫోన్ చేశానురా”

“లేదురా. మా అమ్మా నాన్న ససేమిరా అంటున్నార్రా. వాళ్ళతో గొడవపడలేక రావటం లేదు” అమ్మానాన్న మాటలు వాడికి గొడవకింద అనిపించాయి.

“సరేరా. బై” స్నేహితుడు రాననేసరికి నిరుత్సాహపడ్డాడు శంకర్. ‘అమ్మకూచి’ అని నవ్వుకున్నాడు. ఒక్కడే బయలుదేరాడు.

స్టైలిష్‍గా ఒక్క ఉదుటున బైకుపైకి ఎగిరాడు. సెల్ఫ్ స్టార్ట్ బటను నొక్కగానే డబడబలాడుతూ ముందుకురికింది బుల్లెట్. మేఘాలలో తేలుతున్నట్టుంది శంకర్‍కి. అప్పటికే స్వాతంత్ర పిపాసులు కొంతమంది రోడ్డుపైకి విహారానికి వచ్చేశారు. కొంతదూరంలో క్రాస్‍రోడ్డు దగ్గర బ్యారికేడ్లు కట్టారు పోలీసులు. ప్రక్కగా బండి దూరు సందు వదిలారు. ప్రక్కనే ఓ చెట్టుకింద తెల్లవార్లూ డ్యూటీచేసి అలసిపోయిన ఇద్దరు పోలీసులు నిద్రలో జోగుతున్నారు. ఇంతలో ఒక్ పోలీసుకు చటుక్కున మెలకువ వచ్చింది. ఒక యువకుడు బ్యారికేడు సందులోంచి వెళుతుంటే ఏయ్ ఆగు అంటూ అరిచాడు. కాని వాడు ఎలాగో తప్పించుకుపోయాడు. ఆ కేకకి రెండోపోలీసు ఉలిక్కిపడి లేచాడు. విజిల్ ఊదాడు. ఈ హడావుడి చూసి బండిని సర్రున వెనక్కి తిప్పాడు శంకర్ పోలీసుల్ని తప్పించుకుందుకు. ‘ఆగరా ఆగు’ అంటూ పోలీసులు కేకలు వేశారు. ఆగలేదు శంకర్.

అంతలో పోలీసు వెనకాలే కొంతదూరం పరుగు పరుగున వచ్చి ఇంక పరుగెత్తలేక శక్తికొద్దీ లాఠీ విసిరాడు. అంతే అది నారాయణాస్త్రంలా గురి తప్పకుండా వచ్చి శంకర్ వెన్నుపూసకు తగిలింది. శంకర్ ఒక్కసారిగా ‘అమ్మో’ అంటూ మూలిగాడు. కాని బండి ఆపలేదు. దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. గట్టిగానే మూలిగాడు. కాని కింద పడిపోలేదు. బండి బ్యాలెన్సు చేసుకుంటూ బ్రతుకుజీవుడా అంటూ ఎలాగోలా ఇంటికొచ్చి పడ్డాడు. వచ్చినవాడు వచ్చినట్టే బండి స్టాండువేసి ఇంటిలోపలికొచ్చి పడ్డాడు. రావడం రావడం మంచం మీద వాలిపోయాడు.

నాలుగురోజుల దాకా మూలుగుతూనే ఉన్నాడు శంకర్. పడుకున్నవాడు లేస్తే ఒట్టు. మూలుగు, మూలుగు, మూలుగు. నానమ్మ ఆముదం తెచ్చి మర్దన చేసి కాపడం పెట్టింది. తల్లి ఏదో పట్టి వేసింది. నాన్న ఏదో మాత్రలు తెచ్చివేశారు. చెల్లి అన్నం ముద్దలు నోట్లో పెట్టింది. ఐదోరోజు కాస్త లేచాడు.

చివరకు ఓ సత్యం తెలుసుకున్నాడు శంకర్ – వినదగు పెద్దలు చెప్పిన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here