రంగుల హేల 45: వినదగునా? ఎవ్వరేం చెప్పినా!

15
2

[box type=’note’ fontsize=’16’] “ప్రతివారికీ జీవితం చెంప దెబ్బలు కొడుతూ, మొట్టికాయలేస్తూ బోలెడు పాఠాలు చెబుతుంటుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]ఎ[/dropcap]వ్వరు చెప్పినా వినమన్నారు పెద్దలు. సరే! అలాగే! అంటూ తలూపి, ఊహ తెలిసిన దగ్గరినుంచీ వింటూనే ఉన్నాం. విని విని విసుగెత్తి, వినదగినవేవో వినదగనివేవో తెలుసుకోవాలి కదా అనిపిస్తోందిప్పుడు. ప్రతి ఒక్కటీ వింటూ పొతే మన మెదడూ, తలా వాచిపోతాయి కదా! వాటి బాధ్యత మనదే కదా! మరేం చేయాలిప్పుడు? చూద్దాం పదండి.

రామాయణం ఆదర్శ ప్రభువు ఎలా ఉండాలో చెబుతుంది, మిగిలిన కుటుంబ బంధాల గొప్పతనంతో పాటుగా.

భారతం నవరసాలతో అద్భుతంగా గారెలు తింటున్నంత రుచిగా ఉంటూనే సమస్త మానవ ధర్మాలనూ చర్చిస్తుంది.

భాగవతం భగవంతుని అవతారాల గురించి చెబుతూ, భక్తుల గాథలు, తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు, భగవంతుని లీలల గురించి చెబుతుంది. ఇవన్నీ మనం గుడికి వెళ్లి ప్రసాదం తిన్నాక చిన్నప్పుడెప్పుడో అమ్మవడిలో తలవాల్చి నిద్రపోతూ విన్నవే. ఇప్పటికీ ఇంట్లో ఎవరో ఒకరు భక్తి చానెల్స్ పెట్టినపుడు కూడా వింటున్నవే. అన్నీ మానవ జాతిని సక్రమ మార్గంలో నడిపించడానికి విజ్ఞులు, ప్రాజ్ఞులు, కారణ జన్ములూ, దైవాంశ సంభూతులూ శ్రమకోర్చి మనకోసం రచించిన మహా గ్రంథాలే. అందుచేత అవి ఖచ్చితంగా వినవలసినవే.

ఒక సాంప్రదాయపు పెద్దాయన “యుగ యుగాలకీ ధర్మం మారుతూంటుంది. అయితే రామాయణ భారతాల ప్రత్యేకత ఏమిటంటే వాటిల్లో కథ ద్వారా లోకానికి చాటిన ధర్మాలు సార్వకాలికాలూ,సార్వజనీనాలూనూ.ఆ ధర్మాల్ని పాటించని వారికే చివరికి శిక్ష అని తెలియచేప్పేవి అవి. కనుక ఈ యుగంలో కూడా అవి అవసరం” అంటారు. ఒక మోడరన్ పండితుడు “ఆ యుగాలు వేరు, ఇప్పటి యుగాలు వేరూనూ. ఒక చెంప కొడితే మరో చెంప చూపిస్తే దాన్ని కూడా ఛెళ్లుమనిపించి ‘అబ్బో నేను పెదరాయుడిని’ అనుకుంటాడు తప్ప ఆ కొట్టినవాడు పెద్ద గొప్పగా ఏమీ ఆలోచించడు. అపకారికి నుపకారము కాలం కాదిది. నా కపకారం చేస్తే నీకు నేను రెట్టింపు అపకారం చెయ్యగలను జాగ్రత్త! అని బెదిరిస్తేనే బతగ్గల రోజులివి” అంటారు.

ఇంకెవరో వచ్చి బుద్ధుని శాంతిబోధనను కాస్త మార్చి, బ్యూటిఫుల్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నాది కొత్త థియరీ, నేనే కనిపెట్టానంటారు. గాలివాటుకి కొట్టుకు పోకుండా మనల్ని మనం కాస్త సక్రమ మార్గంలో పెట్టుకుందామని ఇవన్నీ వింటాం. విని వినీ మన బుర్ర గందరగోళంలో పడిపోతుందొకోసారి. అమ్మనాన్నా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు ఉన్నంత కాలమూ. అలాగే అత్తామామలూనూ. ఇంకా మేనత్తలూ, మేనమామలూ, ఇతర సన్నిహిత బంధువులూ కూడా సలహాలిస్తుంటారు. అన్నీ వింటాం. ఇలా చేస్తే అలా చెయ్యమనీ, అలాచేస్తే ఇలా చెయ్యవలసిందనీ గిల్లుతుంటారు. మనం చేసే వ్యవహారం కాస్త చెడిందనగానే వద్దన్నా పని గట్టుకునొచ్చి “నేను ముందే చెప్పానా! అలా చెయ్యొద్దని నా మాట విన్నావా? చూడిప్పుడు ఏమయిందో?” అంటూ మన జుట్టు పీకుతారు.

మనం చక్కగా వ్యవహారం నడిపి అభివృద్ధి చేస్తే “మేం చెప్పినట్టు చేసావు, కాబట్టి పైకొచ్చావు” అని మన క్రెడిట్‌లో కొంత షేర్ లాక్కుని వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. నిజానికి మనం ఎవరు చెప్పిందీ చెయ్యలేం. ఆ మాటకొస్తే మనం అనుకున్నది కూడా మనం చెయ్యలేం. ఏదో అదృష్టం పుచ్చి అలా థింగ్స్ వర్క్ అవుట్ అయిపోతాయంతే. చివరికి గాలి వాటమే నడుస్తుంది. నీటిలో గడ్డిపరక కొట్టుకుపోయినట్టే మనమూ సాగిపోతాం. లక్కీగా ఒకోసారి ఒడ్డు చేరుకుంటాం. అసలు రహస్యం నీటి వాలే తప్ప ఎవరి గొప్పతనమూ ఉండదు. ప్రతివారికీ జీవితం చెంప దెబ్బలు కొడుతూ, మొట్టికాయలేస్తూ బోలెడు పాఠాలు చెబుతుంటుంది. వాటిని చుట్టుపక్కల వాళ్ళు వింటారు కానీ వినాల్సిన వారు వినరు. అదే తమాషా.

అలా ఎలా? అంటున్నారా? ఇప్పుడో కథ రాశామనుకోండి. దానికి ఒక ఎత్తుగడ, నడక, ముగింపు, కొసమెరుపు ఉంటాయి. చెప్పదలుచుకున్నది స్పష్టంగా కనబడుతుంది. అదే నవలనుకోండి కథ ఎక్కడో మొదలయ్యి ఎటో వెళ్లిపోతుంటుంది. ఇక చాలు పేజీలెక్కువయ్యాయి అనుకున్నప్పుడు ఆ పాత్రల్ని పిలిచి ‘అయ్యా మీరింక అవతారం చాలించి ఎక్కడో ఓ చోట ముగింపు తీసుకోండి’ అని చేతులు కట్టుకుని చెప్పవలసి వస్తుంది. అప్పుడా పాత్రలన్నీ మన మీద దయతలిచి, మన మాటలు విని సెలవు తీసుకుంటాయి. లేకపోతే మన అక్కచెల్లెమ్మలు చూసే టీవీ సీరియల్స్‌లా అలా సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి. జీవితమూ అంతే! ఫుల్‌స్టాప్ పడేవరకూ సాగుతుంటుంది.

రాజకీయ పార్టీలు రకరకాల సిద్ధాంతాలు అజెండాగా పెడతాయి. అందరూ ప్రజా సేవా, సంక్షేమం అంటున్నాఎవరి అధికార దాహపు దారి వారిది. ఎవరి ట్రిక్కులు వారివి. అయితే పైకి చెప్పే వివరాలు వేరు లోపలి రహస్య అజెండా వేరు. ఇవన్నీ మనకి తెలిసినా ఆయా సందర్భాల్లో వాళ్ళు చెప్పే మాటలు విని చెవిలో పువ్వులు అంటే ఇవే కదా అని అవాక్కవుతుంటాం. ఎన్నికలు రాగానే ‘ఎవరో ఒకరికి ఓటు వెయ్యాలి, ఇంట్లో కూర్చోవడం తప్పు కదా మనలాంటి దేశభక్తులకి’ అనుకుని మరీ గమ్మత్తుగా అబద్ధాలు చెప్పిన పార్టీకి ఓటు వేసేసి ‘ఒక పని చేశాంలే’ అని సర్ది చెప్పుకుంటాం.

సినీ ఇంటర్వ్యూల్లో హీరో హీరోయిన్‌లు బోలెడంత ఫిలాసఫీ చెబుతుంటారు. చిన్న వయసులో వీళ్ళకింత జ్ఞానం ఎలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతుంటాం. వాళ్ళ అనుభవాలు వాళ్ళకి మంచి మంచి పాఠాలు చెబుతుండొచ్చు. మనకంటే అంత గొప్ప గొప్ప అనుభవాలుండవు కాబట్టి మనకి అంతంత వేదాంతాలు వంటబట్టవు. ఎవరైనా చెబుతుంటే కళ్లప్పగించి చూస్తూ పేపర్ మీద నోట్ చేసుకోవడం తప్ప. వాటిలో నిజమెంతో లెక్క కట్టలేం. ఎందుకంటే సినీనటులు వాళ్ళు నిత్యం అనేక కల్పిత పాత్రల్లో నటించేస్తూ అలవాటులో పొరపాటుగా ముఖాముఖీల్లో కూడా నటించేస్తూ ఉంటారు. అబ్బా ఎంత అందంగా మేకప్ వేసి చెప్పారో కదా అని మనలాంటి వాళ్ళం కూడా ఆ చాతుర్యానికి మురిసిపోతుంటాం. సినిమాల్లో నటింపచేయాలని తల్లో, పినతల్లో ఓ పిల్లకి నాట్యం నేర్పించి దర్శకుల చుట్టూ,నిర్మాతల చుట్టూ ఓపిగ్గా తిప్పి ఓ ఛాన్స్ ఇవ్వమని అడిగి, అడిగి ఒక్క జాక్‌పాట్ కొట్టి ఆ పిల్లని హీరోయిన్ చేస్తారు. అప్పుడా పిల్ల తననొక బర్త్ డే ఫంక్షన్‌లో ఓ డైరెక్టర్ గారు చూసి మా ఇంటికొచ్చి అమ్మనీ నాన్ననీ బతిమాలి నటించడానికి ఒప్పించారని చెబుతుంటుంది.

అలా సినీ తారలు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ అందమైన కార్పెట్ కింద దాచి (ఎందుకంటే అది గుర్తుచేసుకోవడం వాళ్ళకే ఇష్టం ఉండదు) మనకి రోజీ పిక్చర్ చూపిస్తారు. అది విని కుర్రకారు చేతికందిన డబ్బో, బంగారమో పట్టుకుని చెన్నై ట్రైన్ ఎక్కేసిన వాళ్ళున్నారు. అదృష్టం బావుండి పైకొచ్చిన వాళ్ళు పది మంది ఉంటే జీవితం నాశనం చేసుకున్నవాళ్ళు వందమంది ఉంటారు. ఆ వందమంది మనకి కనబడరు, వినబడరు. గెలిచిన వాళ్ళు తమ గ్లామర్‌కి దెబ్బని నిజం చెప్పరు. ఆ అబద్ధాలు వినడం వల్ల కొందరికి కాలక్షేపం, మరికొందరికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది.

జనానికి జీవహింస చెయ్యవద్దనీ, వెజిటేరియన్స్‌గా మారిపొమ్మనీ జీవకారుణ్య సంస్థ తరఫున అక్కడా ఇక్కడా ప్రజలకి సందేశాలిచ్చే మాజీ హీరోయిన్ గారు ‘తనింట్లో తన భర్త కుక్ చేత మాంసాహారాన్ని వండించుకుంటాడనీ తద్వారా తాను జీవహింస చేసే బాధ నుంచి తప్పించుకున్నాననీ’ మెరిసే కళ్ళతో చెబుతుంది. ‘భర్తనే మాన్పించలేని నువ్వు మాకెందుకు చెబుతున్నావమ్మా?’ అని జనం ఎదురుగా వచ్చి అడగరని ఆమె ధైర్యం.

ఇక బంధుమిత్ర వర్గాల్లో ఆస్తులమ్మేసి వ్యాపారం పెట్టి దాన్ని సరిగా వళ్ళు వంచి చూసుకోవడం మానేసి, నిండా మునిగిన వాళ్ళు కొందరుంటారు. వాళ్ళ గురించి మనం విన్న విషయాలు వేరు. కానీ సదరు వ్యక్తులు ఎదురుపడినపుడు వాళ్ళు మనకి చెప్పే కట్టుకథలు భలే బావుంటాయి. సినిమాకి పనికొచ్చే కథలవి. సెల్ఫ్ డిఫెన్స్‌తో వాళ్ళు ప్రపంచం మొత్తం ‘పాలో ఖెలో’ అనే రచయిత తన ‘ది ఆల్కెమిస్ట్’ నవలలో చెప్పినట్టు కుట్రచేసి వాళ్లకు అన్యాయం చేసినట్టు చెబుతుంటారు. వెనక విన్నవీ, ఎదురుగా విన్నవీ కలిపి మన బుర్ర పెనం మీద కట్లెట్‌లుగా చేసుకుని తింటూ ఉంటాం మనం. వైస్ వెర్సాగా మనం మునిగినపుడు మన గురించి ఇతరులూ అనుకోండి.

ఒకోసారి ఎవరో మనగురించి నెగటివ్‌గా ఇంకెవరికో చెప్పిన విషయం తెలుస్తుంది. అప్పుడు మనం తెగ బాధపడిపోయి ఉక్రోషపడి పోయి మధ్యవర్తులతో ఏదో ఒకటి అనేస్తాం. అది మళ్ళీ ఆ వ్యక్తికి చిలవలు పలవలుగా చేరుతుంది. అప్పుడతను మాటల ఆట మొదలు పెట్టింది నేనే అన్న సంగతి మర్చిపోయి మనం మొదలు పెట్టాం అనుకుని మళ్ళీ ఏదో ఒకటి అంటాడు. అందుకే మనం హాయిగా మన మీద విమర్శల్ని వినేసి మోసుకొచ్చినవాడితో ‘థాంక్స్ గురూ’ అనేసి వాణ్ణి కూడా దూరం పెట్టేస్తే హాయి. మన చిన్న చిన్న ఆనందాల్ని మనం చూసుకుంటూ ఈ జీవితాన్ని ఆనందంగా నెట్టేయొచ్చు. మా బామ్మ అనేది ‘మాటకి మాట నీటిలో నాచులా సహజం’ అట . మౌనం బెటర్ ఆప్షన్.

అతి మేకప్పుల, క్రూర స్త్రీల, అర్ధ రహిత, చాంతాడు, అంతులేని కధల సీరియళ్ల బారినుండి తప్పించుకోవడానికి వార్తా ఛానళ్ల బారిన పడక తప్పదు మనకి. అక్కడ వివిధ పార్టీల రాజకీయ నేతల వీరంగాలూ, అబద్ధాలూ వినక తప్పదు. ఇంతమంది చెప్పే అబద్ధాలను వడకట్టే ఫిల్టర్ ప్రపంచంలోఎవరూ తయారు చేసి ఉండరు. అతని కంటే ఘనులు అన్నట్టుగా ఒకరిని మించి ఒకరు అసత్యాలూ, వక్ర కోణాలూ, పిచ్చి పిచ్చి లాజిక్కులూ చెబుతూ జన సమూహాల్ని ఫూల్స్ చెయ్యడానికి కంకణం కట్టుకుని ఉంటారు వాళ్ళు. పేపర్‌లో చదివీ, టీవీల్లో చూసీ రాజకీయనాయకులంటే అలెర్జీ కలుగుతోంది. అలా బాధతో మతి చెడిన మనకి, మేధావులు సుపరిపాలనకూ,ఎన్నికలకూ సంబంధించి చెప్పే సూచనలూ,సలహాలూ విన్నా బుర్రకి ఎక్కవు. మరప్పుడు విచక్షణతో, వివేకంతో వాటిలోని వివరాలను మెదడు కెక్కించుకోవడం ఎంత అసాధ్యమో కదా!

మనం చదువుకునేటప్పుడు చరిత్ర అంటే అందరికీ ఒకటే. ఒక్కలాగే ఉండేది. అదంటే గౌరవ భావం ఉండేది. అందరమూ అదే నమ్మాము. ఇప్పుడు చరిత్ర కూడా రచయితని బట్టి రకరకాలుగా ఉంటోంది. రైటర్, తన కోణం నుంచి హిస్టరీ చెబుతున్నాడు. సో, మన హిస్టరీ కూడా కన్ఫ్యూషన్‌గా తయారయ్యింది. మహాత్మాగాంధీ చనిపోయేటప్పుడు ‘హే రామ్’ అన్నారని విన్నాం. ఇప్పుడెవరో ఆయన ‘హే రామ్’ అనలేదనీ అసలేమీ అనలేదనీ అంటారు. ఇంకా అనేక స్వాతంత్రోద్యమ సమయపు కీలక నిర్ణయాల గురించి పలురకాలుగా చెబుతున్నారు. ఇదంతా గందరగోళంగా ఉండదూ!

ఇక ఇతిహాసాలయిన రామాయణ, భారతం లాంటివి చూడబోతే వాటిని కూడా బోలెడు మంది తమ తమ దృష్టి కోణాలనుంచి తిరగ రాస్తున్నారు. ఇన్నాళ్లూ సీత మహాసాధ్వి, ఓర్పుతో అనేక కష్టాలు పడింది అనుకున్నాం. ఇప్పుడు సీత అంతరంగంలో ప్రవేశించి పురుషాధిక్యత వల్ల ఆమెపడిన బాధలు రాస్తున్నారు. ఫిక్షన్ కావచ్చు కానీ నిజమే. ఆ పాత్రలలా ఆలోచించి ఉండి ఉండొచ్చు కదా అనిపిస్తోంది. భారతం లోని ద్రౌపది పాత్ర గురించి ఒకాయన తన స్వీయ ధోరణిలో తన వికృతాలన్నీ ఆపాదించి రాశాడు. అది తప్పంటూ మరో పండితుడు ఆమె సౌశీల్యాన్ని గురించి గొప్పగా రాశాడు. పక్క రాష్ట్రంలో ఒక రచయిత్రి ద్రౌపది గురించి ఎంతో ఉన్నతంగా రాసి మన మనసులకు ఊరట కలిగించింది. ఇవన్నీ చదవడం వల్ల, వినడం వల్లనే మనకి ఇలా అతిగా ఆలోచించే ఈతి బాధలు కలుగుతున్నాయి. అన్నీ విన్న తర్వాత మనం ఎవరినీ జడ్జ్ చేసేదీ లేదు. అదంతే. ఇదింతే. అలా అయినా కావచ్చు, ఇలా అయినా కావచ్చు అని నిమ్మళంగా కూచోవడం తప్ప!

కొందరు దేశాధినేతలు అమితాబ్ లెవెల్లో ఎమోషనల్‌గా ఇచ్చే ప్రసంగాలు బాగా ప్రాక్టీస్ చెయ్యడం వల్ల వచ్చినవే తప్ప సహజమైన భావోద్వేగంతో కూడుకున్నహృదయపూర్వక స్పందనలు కావు. అయినా మనం తరచూ వింటూ ఉండవలసి వస్తుంది. ఇంకా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో అప్పటికప్పుడు కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకుని ఆనక ‘రాష్ట్ర ప్రజలకోసం మేం దేవునితో కూడా కొట్లాడుతాం’ అనే నాయకులు తమను తాము దేశ భక్తులుగా చిత్రించుకునే నటనలు తప్ప నిజమైనవి కానే కావు. జనాల నుండి సానుభూతి పిండుకోవాలనే చివరాఖరి ఉద్దేశంతో, ఎన్నో కష్టాలకోర్చిన సీనియర్ నాయకులిప్పుడు అతి చిన్న కష్టానికే పబ్లిక్‌గా కంట నీరుపెట్టి దుఃఖించడం కూడా చూస్తున్నాం.

నిత్యం ఇవన్నీ వినీవినీ, చూసీచూసీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటా, చేసే ప్రతీ చేష్టా మనకి విరక్తిని కలిగిస్తోంది. మన స్పందన చూసి పక్కవాళ్ళకి మనం సినిక్‌గా మారిపోయామేమో అని అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్లింకా మనం విసిగెత్తి పోయినంతగా విసుగెత్తక పోయి ఉండొచ్చు. నిరక్షరాస్యులైన పెద్దమ్మలకీ, చిన్నమ్మలకీ వంట పాకలో చేరి చెప్పే కబుర్ల స్థాయిలో కల్ల బొల్లి కబుర్లు చెప్పే పొలిటికల్ లీడర్‌లను చూస్తే కడుపుతో తిప్పుతుంది. అయినా వినాలి. తప్పదు.

న్యాయంగా మనకి రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఫైల్లో అడ్డంగా రాసిన మాజీ పర్సనల్ ఆఫీసర్ మనింటి కొచ్చి తన నిజాయితీ డప్పు కొట్టుకుంటుంటే వినకేం చేస్తాం? టీ బిస్కట్ ఇచ్చి మరీ వినాల్సొస్తుంది. ఉద్యోగుల కోసం ఏర్పడ్డ సంఘ నాయకులు అస్మదీయులకు ఆఫీస్‌లో వర్క్ లేని సీట్లిచ్చి,పదోన్నతులు అడ్డ దారిలో కల్పించి తస్మదీయులైన మనబోటి అర్హులను వెనక్కి నెట్టి ఎంప్లొయెర్‌తో యుద్దానికి వీరుల్లా బయలు దేరుతూ గుంపులో వాళ్ళిచ్చే స్పీచ్‌లు వినడానికి మనల్ని రమ్మన్నప్పుడు నలుగురితో పాటుగా అందరి మంచి కోసం వెళ్లాల్సి వస్తుంది. ‘మీ కోసం మేం ఎన్నో చేశాం’ అని నాయకులు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నప్పుడు తిక్కరేగి హీరో విలన్ ల‌ని వరసగా పిలిచి చావబాదినట్టు మనకి అన్యాయం చేసిన వాళ్లందరినీ చితక్కొట్టాలనిపించినా పైకి నవ్వుతూ స్లోగన్‌లు చెప్పాలి.

మన తండ్రిగారిని అమాయకుడిని చేసి, మోసం చేసి ఆస్తి కొట్టేసిన పెదనాన్న చావుబతుకుల్లో ఉన్నప్పుడు మనం వెళ్లి నిలబడాల్సి వస్తుంది. అన్నీ తెలిసిన బంధువులు కూడా ఆయన గొప్పతనాన్నీ, త్యాగాన్నీ వివరిస్తుంటే తలూపాల్సి వస్తుంది మనకి. తప్పదు. ఇలా నటించి, నటించి ఎప్పుడో ఒక్కసారి, ఒక్క మిత్రుని దగ్గర మనసు విప్పుకుని చెప్పుకుంటే మనసుకు తెరిపిగా ఉంటుంది. ప్రాణానికి సుకూన్ దొరుకుతుంది. అంత వరకూ ఎవరేం చెప్పినా విని మింగాల్సిందే!

ఏనాడూ ఒక ఆడబిడ్డని ఇంటికి పిల్చి బొట్టుపెట్టని మన మేనమామ భార్యగారు, తమ పిల్లలు విదేశాల్లో కోటీశ్వరులై పోయాక అర్జెంటుగా వైరాగ్యం తెచ్చుకుని, ఒక ఖరీదైన భక్తుల ఆశ్రమంలో చేరి, పలకరిద్దామని మనం ఫోన్ చేసినప్పుడల్లా ధర్మమూ, మానవ సేవా అంటూ ఆవిడ చేసే చిలక పలుకుల ఆధ్యాత్మిక ప్రసంగాల్ని వినక తప్పదు. ఇంకా మన బంధుకోటిలోనే పిల్లికి బిచ్చం పెట్టని సూడోభక్తులు ఎదురై వాళ్ళేదో దేవుడి వారసులన్నట్టు కథలు చెబుతుంటారు. ఎవర్నీఏమీ అనలేము. వినకుండా చెవులు మూసుకోలేము. వింటున్నప్పుడు ఒళ్ళు మండిపోతున్నాపైకి తలూపి ‘నువ్వు కాబట్టి ఇంత బాగా చెప్పావు’ అన్నఎక్స్‌ప్రెషన్ ఇచ్చి వాళ్ళని మెచ్చుకున్నట్టు మొహం పెట్టాలి. ఇలాంటి బాధల్ని ఏమంటారో చెప్పడానికి నాకు మన భాషలో పదం దొరకడం లేదు. నా అజ్ఞానాన్ని మిత్రులు మన్నింతురు గాక!

మనమెంత గింజుకున్నా రాజకీయ నాయకుల నుంచి అస్సలు తప్పించుకోలేము. టీవీలోనో,రే డియోలోనో ఆఖరికి మిత్రులు పంపే వీడియోల్లో నైనా వినక తప్పదు. అవన్నీ వింటూ బీపీ పెంచుకుని, జుట్టు పీక్కుంటే పోయేది మన ఆరోగ్యమే. సో, వాటిని బుర్రకెక్కించుకోకుండా విని ఊరుకోవాలి. నిత్యం నాయకుల మందిరాల్లో జరిగే రహస్య అరాచకీయాలు వేరు. బైటికి, మీడియా ముంది చెప్పేవి వేరు. కాబట్టి వాళ్ళు అసత్యాలు చెప్పి చెప్పి ఏది నిజమో ఏది అబద్దమో తెలీని స్థితిలో ఉండి ఏవో సంధి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం వారిపై జాలిపడి వదిలెయ్యాలి తప్ప అతిగా ఆలోచించకూడదు.

మనం బాగా బతికిన కాలేజీ రోజుల్లో, కొన్ని సినిమాలు వచ్చేవి. వాటిల్లో ఆఖర్న మన సంస్కృతి గురించో, కుటుంబ సభ్యులు పాటించాల్సిన పద్దతుల గురించో ఒక పాత్ర మరో పాత్రతో చెబుతున్నట్టుగా అనేక విలువైన, ఉపయోగకరమైన డైలాగులుండేవి. అవి మంచి మాటలు కావడంతో ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ లయ్యేవి. ఇప్పుడు దర్శక నిర్మాతలు సినిమాని బిజినెస్‌గా కాకుండా మరో విధంగా చూసే అవకాశమే లేదు. పోనీలెండి. మన బుర్రలకి కూడా పని తప్పింది.

ఎవరు విలువైన మాట చెబుతారో, వాళ్ళ అనుభవం నుంచి ఏ మాట వస్తుందో తెలుసుకోవాలి కాబట్టి ఇతరులు చెప్పేది ఓపికగా వినడం మంచి సంగతే. అయితే ఆ పనిలో మనం మెంటల్ హాస్పిటల్‌లో జాయినవ్వకుండా మనల్ని మనమే జాగ్రత్త కాపాడుకుంటుండాలి. ఎందుకంటే చివరికి మనకి మనం మిగలాలి కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here