Site icon Sanchika

వి’నాయక’ చవితి

[box type=’note’ fontsize=’16’] పండగ పూట రాధాకృష్ణ మనసెందుకు అశాంతికి గురయ్యింది? ఆ అశాంతిని తొలగించుకోడానికి అతనేం చేశాడో చెబుతున్నారు కె.ఎస్.ఎన్. రాజేశ్వరి “వి’నాయక’ చవితి”కథలో. [/box]

[dropcap]శ్రా[/dropcap]వణ మాసం. సాయంత్రం ఆహ్లాదంగా ఉంది. మేఘాలు వర్షిద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఎటూ తేల్చుకోలేక నెమ్మదిగా కదులుతున్నాయి. పిల్ల మేఘాలు అల్లరికి ఒకటీ అరా చినుకులు రాలుస్తున్నాయి.

రాధాకృష్ణ కారును పల్లంగా ఉన్న కచ్చా రోడ్డు మీంచి, తారు రోడ్డు మీదకి నెమ్మదిగా ఎక్కించాడు. బురదలో కూరుకుపోకుండా జాగ్రత్తగా ఎక్కించినందుకు తనని తనే అభినందించుకున్నాడు.

అది ఊరి చివర కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. పెద్ద నిర్మాణ సంస్థ ఒకటి అక్కడ ప్లాట్లు వేసి ఇళ్ళు కడుతోంటే అందులో ఒక ప్లాటు తీసుకున్నాడు. సగానికి పైగా ఇల్లు పూర్తయిపోతోంది. ఒకసారి వచ్చి చూసి ఏఁవైఁనా మార్పులుంటే చెప్పమని కంట్రాక్టరు ఫోన్ చేస్తే వచ్చి చూసి వెళ్తున్నాడు. తారు రోడ్డు ఎక్కాక మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశాడు.

‘నల్లని మబ్బులు గుంపులు, గుంపులు… తెల్లని కొంగలు బారులు బారులు… అవిగో… అవిగో…’ అని మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాట వినిపించింది. నవ్వుకున్నాడు. ‘సరిగ్గా సిచ్యుయేషన్‌కి తగ్గట్టే ఉంది. కాకపోతే ఇది ఎడ్లబండి కాదు, కారు అంతే’. ఇలా ఏవో ఆలోచనలతో కారు నడుపుతున్న వాడల్లా, ఓ పది మంది పిల్లలు రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుకు రావడంతో సడెన్ బ్రేక్ వేశాడు.

ఆ పిల్లల్లో ఎవరికీ సరైన బట్టల్లేవు. చిన్నపిల్లలకైతే అసలు లేవు. స్నానం చేసి ఎన్నాళ్ళయ్యిందో, మురికి మురికిగా ఉన్నారు. ఓ పిల్ల తమ్ముడిని కాబోలు చంకనేసుకుని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతోంది. ఇంకోడు గింజలన్నీ అయిపోయిన మొక్కజొన్న కండెని ఇంకా పళ్ళతో పీకుతున్నాడు. కారు ఆగగానే ఒకడు చిన్న డబ్బాని ముందుకు చాపాడు. దానికో చిన్న కన్నం పెట్టిన పసుపు గుడ్డ కట్టి ఉంది. వాడా డబ్బాని పైకీ, కిందకీ ఆడించాడు. చిల్లర డబ్బులు గలగలమన్నాయి.

కారు అద్దం కిందకి దింపి “ఏంట్రా ఈ గోల?” అన్నాడు చిరాగ్గా. సడెన్ బ్రేక్ వెయ్యకపోతే ఎవడికో ఒకడికి దెబ్బలు తగిలేవే.

“యినాయక చవితి చందా సార్” అన్నాడు డబ్బు పట్టుకున్నవాడు.

“ఎక్కడ పెడతార్రా?” అని చుట్టూ చూశాడు రాధాకృష్ణ.

“ఆడే సార్” అని ఓ వైపు చూపించాడు.

అక్కడన్నీ టెంట్‌ల్లాంటి గుడిసెలు వేసి ఉన్నాయి. ఈ ఇళ్ళు కట్టడానికి, ఆ నిర్మాణ సంస్థ కూలీలనీ, ప్లంబర్లనీ, కార్పెంటర్లనీ… ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సైట్ లోనే ఉంచి పని చేయిస్తోంది. అన్ని భాషల వాళ్ళూ, అన్ని మతాల వాళ్ళూ అందులో ఉన్నారు.

చాలామంది ఆడాళ్ళూ, మగాళ్ళూ కూడా పనికి బిల్డింగుల దగ్గరకి వెళ్ళిపోతారు. ఎవరో ముసలివాళ్ళూ, ఇలాంటి పిల్లలు ఇళ్ళ దగ్గరుంటారు. రాధాకృష్ణకి చిరాకొచ్చేసింది. ‘వెధవలు, తేరగా డబ్బులు దొరుకుతాయని ఇలా ఎత్తు వేశారు’ అనుకున్నాడు మనసులో. పైకి “కారు ఇలా రోడ్డు మధ్యలో ఉండిపోయింది, దారి ఇవ్వండి, పక్కకి తీస్తా” అన్నాడు. వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఒక్కసారి స్పీడు పెంచి వెళ్ళిపోయాడు.

***

ఆ రోజు ఆదివారం. రాధాకృష్ణ పొద్దున్నే తొమ్మిది గంటలకి నిద్రలేచి ‘ఇటునుంచి అటు అటునించిటు’ అనుకుంటూ బ్రూ కాఫీ పెట్టుకుని తాగుతున్నాడు. శ్రీమతి వరలక్ష్మీ వ్రతం పుట్టింట్లో చేసుకుంటానని వెళ్ళిపోయింది. “ఇద్దరు చిన్నపిల్లలతో నేనిక్కడ చెయ్యలేను. అక్కడైతే అమ్మ అన్నీ అమరుస్తుంది. నేను పూజ చేసేసుకోవడమే. అదీకాక, అమెరికాలో ఎమ్మెస్ చేస్తున్న చెల్లి కూడా వస్తుంది. మళ్ళీ వినాయక చవితి వెళ్ళాక వెళ్ళిపోతుంది. నేను కూడా ఆ తర్వాతే వస్తాను” అని చెప్పి మరీ వెళ్ళింది.

ఇలా సోఫాలో కూర్చుని పేపరు చదువుదామని తీశాడో లేదో కాలింగ్ బెల్ మ్రోగింది.

‘ఈ టైములో ఎవరొచ్చారబ్బా’ అనుకుంటూ తలుపు తీసేసరికి బిలబిలమంటూ ఓ పది మంది లోపలికి ప్రవేశించారు. అందరి వేళ్ళకీ ఉంగరాలూ, మాడ చైన్లూ, మెళ్ళో బంగారు గొలుసులూ ధరించారు. అందరూ ఒకే రకం కండువాలు వేసుకున్నారు. అందరిలోకి ఎక్కువ ఉంగరాలు పెట్టుకున్నతను ముందు తనో సోఫాలో కూర్చున్నాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఒంటి మీదున్న బంగారాన్ని బట్టి కూర్చోడమో నిలబడ్డమో చేశారు.

అంతా అయోమయంగా చూస్తున్న రాధాకృష్ణ “ఎవరండీ మీరు? ఏం కావాలి?” అని అడిగేసరికి ఆ లీడర్‌లా ఉన్నతను గొల్లున నవ్వాడు.

“నేను మీకు తెలియకపోవటమేమిటండీ? నేను ఈ వార్డు కౌన్సిలర్ హస్బెండుని. రెండేళ్ళ క్రితం మా ఆవిడకి ఓటు వెయ్యమని అడగడానికి వచ్చా కదా? ఔన్లెండి, రెండేళ్ళయింది కదా! మర్చిపోయుంటారు. అయినా నేను చాలా బిజీ అండీ! అసలు నేనే కౌన్సిలర్ అవుదామనుకున్నా. కానీ ఈ వార్డు లేడీస్‌కి రిజర్వుడు అన్నారు. అందుకని ఆవిణ్ణి నిలబెట్టి నేను కష్టపడి గెలిపించాను” అన్నాడు తుఫాను స్పీడుతో.

“అయితే ఇప్పుడెందుకొచ్చారు? ఇప్పుడేమీ ఎలక్షన్స్ లేవు కదా?” అన్నాడు రాధాకృష్ణ ఒకింత అసహనంగా.

అదేదో జోక్ అయినట్లు అతను మళ్ళీ నవ్వాడు.

‘నవ్వడం ఇతని మేనరిజమ్ కాబోలు’ అనుకున్నాడు రాధాకృష్ణ.

నవ్వు ఆపి అతను “అదేంటి సార్! వినాయక చవితి ఇంకెన్నో రోజులు లేదు కదా? ఇప్పట్నించే ప్రయత్నాలు మొదలుపెట్టకపోతే మన వార్డులో వినాయక చవితి ఘనంగా చెయ్యలేం కదా? ఈ వేళ ఆదివారం కదా! అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారని బయల్దేరాం. ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. మీ వంతు ఒకటి రాసేస్తాను. చివర్లో సున్న ఉండకూడదు. పదహారు వేసేస్తాను” అని గుక్క తిప్పుకోకుండా చెప్పి చందా బుక్కు తీసి రాసేశాడు. “పేరూ, నంబరు బైట నేమ్‌ప్లేట్ మీద చూసి రాసేశాను. మీరు చెప్పక్కర్లేదు” అన్నాడు ఉదారంగా.

రాధాకృష్ణ ఏం చెయ్యలేక, లోపలికెళ్ళి, నూట పదహార్లు తీసుకొచ్చి చేతిలో పెట్టాడు.

చుట్టూ ఉన్నవాళ్ళు ఉలిక్కిపడ్డారు. అతను నూటపదహార్లనీ, రాధాకృష్ణనీ మార్చి మార్చి చూసి మళ్ళీ నవ్వాడు. ఈ నవ్వు పెదాల మీద ఉంది కాని కళ్ళలో చిన్న కోపం, అసహనం తొంగి చూశాయి.

నవ్వుతూనే, “సార్ ప్రాక్టికల్ జోకులు బాగా వేస్తారు. చూడండి. ఏఁవిఁచ్చారో” అని, “అదేంటి సార్ మరో వెయ్యి ఇవ్వండి” అన్నాడు.

ఈసారి ఉలిక్కిపడ్డం రాధాకృష్ణ వంతు అయింది.

“ఏఁవిఁటీ? వెయ్యి నూట పదహార్లా? మీరు ఒకటి అంటే నేను వందే అనుకున్నాను. వెయ్యి రూపాయలే…” అన్నాడు ఆశ్చర్యంగా. అప్పటికి రాధాకృష్ణకి కొంచెం బుర్ర పనిచెయ్యడం మొదలుపెట్టింది.

“అయినా ప్రతివాళ్ళూ వెయ్యంటే ఎక్కడినించి తెస్తాం? రేపు పక్కవీధిలో వాళ్ళు వస్తే వాళ్ళకీ ఇవ్వాలి కదా?” అని లాజిక్కు లాగాడు.

అంతే! కూర్చున్నవాడల్లా ఒక్క ఉదుటున లేచి నిల్చున్నాడు. “ఏఁవిఁటీ, పక్కవీధి వాళ్ళకిస్తారా? అది మన వార్డు కిందకి రాదు. ఆ కౌన్సిలరు మన పార్టీ కాదు. ఈ కండువాలు చూశారా? ఇది ఈ వార్డు పార్టీ కండువా. పక్క వీధి వాళ్ళు వేరే కండువాలు వేసుకుంటారు. ఆ వార్డు వినాయకుణ్ణి పెడితే మీరేం ఇవ్వక్కర్లేదు. ఈ రసీదు చూపించండి” అని నిల్చున్న వాళ్ళల్లో ఒకణ్ణి ఉద్దేశించి

“సార్ వెయ్యి రూపాయలిస్తారు. మన షాపుకెళ్ళి ఓ బియ్యం బస్తా పట్టుకొచ్చి పడేయ్. అన్నదానం రోజున సార్ పేరు బోర్డు మీద రాయిద్దాం” అని చెప్పి, “వస్తాం సార్” అని కొంతమందిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు.

వార్డుల వారీగా, పార్టీల వారీగా వినాయకుణ్ణి విభజించిన వాళ్ళ తెలివితేటలకి ఆశ్చర్యపోతూ వెయ్యి రూపాయలు తెచ్చిచ్చాడు. ఇంతసేపూ చేతులు కట్టుకుని నిలబడ్డవారు రిలాక్స్ అయ్యారు.

“ఏం లేద్సార్! ఆవిడ కౌన్సిలర్ అయితే వినాయక చవితి ఘనంగా చేయిస్తానని మొక్కుకుందిట. క్రితం ఏడు ఎవరో పోయారని కుదరలేదు. అందుకని పట్టుబట్టి ఈ ఏడు ఘనంగా చేస్తున్నారు” అని రాధాకృష్ణని సముదాయించినట్లు చెప్పి సెలవు తీసుకున్నారు.

“సుబ్బి పెళ్ళి ఎంకి చావు” డైలాగ్ గుర్తొచ్చింది రాధాకృష్ణకి.

ఆవేళే వినాయక చవితి సెలవు. ఆ వార్డు కౌన్సిలర్ భర్త చెప్పినట్టు ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి.

రోడ్డు మీద రాటలు పాతి షామియానా వేశారు.

పెద్ద స్టేజి. పెద్ద విగ్రహం. కళ్ళు చెదిరేట్టు అలంకారాలూ, పెద్ద సౌండుతో పాటలూ. చాలా ఆర్భాటంగా ఉంది.

పొద్దుట్నించీ రాధాకృష్ణ ఏదో తెలియని అశాంతితో ఉన్నాడు. వాళ్ళావిడ చెప్పినట్లు ఇంట్లో దేవుడి దగ్గర అరటిపళ్ళూ, పాలు పెట్టి అగరొత్తులు వెలిగించాదు.

“పండగ పూట హోటల్లో ఎందుకు? మా ఇంటికి భోజనానికి రా” అని ఫ్రెండు పిలిస్తే వెళ్ళి వాళ్ళింట్లో భోజనం చేసి వచ్చేటప్పటికి మధ్యాహ్నం మూడయ్యింది. వస్తున్నప్పుడు చూశాడు, స్టేజి దగ్గర చిన్న పిల్లలు ఏదో సినిమా పాటకి గెంతులేస్తూ కనిపించారు. చటుక్కున రాధాకృష్ణకి రోడ్డు మీద ఆపి డబ్బులడిగిన ఆ పిల్లలు గుర్తొచ్చారు. గిల్టీగా అనిపించింది.

***

“ష్.. తప్పు. ముందు నవేద్దేం యెట్టినాక అప్పుడు మనం తినాల. అప్పటిదాక ముట్టుకోకూడదు” అని తమ్ముణ్ణెత్తుకున్న పిల్ల స్వీట్లు తీసుకోబోతున్న పిల్లల్ని మందలించింది.

“హాఁ హాఁ పహెలె చఢానా, బాధ్ మే ఖానా” అన్నాడు ఓ ముస్లిం కుర్రాడు.

బిల్డింగ్ కట్టే దగ్గర దొరికిన ముక్కాచెక్కా అన్నీ తెచ్చి స్టేజిలా తయారుచేశారు ఓ పెద్ద చెట్టు కింద. మామిడాకులకి కొదవే లేదు. చుట్టుపక్కలంతా మామిడితోటలే. ఓ చిన్ని వినాయకుణ్ణి పెట్తి, రెండు ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. కింద శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టారు.

“మరి నవీద్దెం ఓరెడతారు?” అడిగాడు ఓ కుర్రాడు. వాడివాళ కొంచెం శుభ్రంగానే ఉన్నాడు.

“ఓరెడతారు? బాబుగారే యెడతారు. ఇయ్యన్నీ తెచ్చినారు గందా” సమాధానం చెప్పిందా పిల్ల.

నిన్న మధ్యాహ్నం వాళ్ళ వార్డులో స్టేజి దగ్గర గెంతులేస్తున్న పిల్లల్ని చూశాక రాధాకృష్ణకి తనలో ఉన్న అశాంతికి కారణం తటాలున తట్టింది. టెంట్‌ల దగ్గర పిల్లలు గుర్తొచ్చారు. వెంటనే కారు వెనక్కి తిప్పి అరటిపళ్ళ గెలా, స్వీట్లూ, బెల్లం, అటుకులూ అన్నీ కొన్నాడు. ఈవేళ అన్నీ పట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ చూసి వాళ్ళ మొహాల్లో ఆనందం, ఆశ్చర్యం.

పిల్లలందరూ చేతులు జోడించి దణ్ణం పెడుతూ ఉంటే, రాధాకృష్ణ తనకి తోచినట్టు, చేతులు తిప్పుతూ “శుక్లాంబర ధరం…” చదివి, “ఇంక తీసుకోండి” అన్నాడు.

ఆ పెద్ద పిల్ల అందరికీ ఓ పండూ స్వీటూ చొప్పున పంచి, “మిగతాయి కార్లో ఎట్టీమంటారా  బాబూ?” అనడిగింది.

“వద్దు వద్దు. మళ్ళీ మీరే పంచుకుని తినెయ్యండి” అని చెప్పి, ఏ రణగొణ ధ్వని లేకుండా హాయిగా ప్రశాంతంగా అనిపించి మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టి ప్రశాంతంగా వెనుదిరిగాడు రాధాకృష్ణ.

Exit mobile version