[బాలబాలికల కోసం ‘వినూత్న సాంకేతికత’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
[dropcap]కౌ[/dropcap]స్తుభపురం రాజావారు విశాలవర్మ తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. పక్క రాజ్యాలకు కూడా విశాలవర్మ ఆదర్శప్రాయుడైన రాజుగా పేరు పొందాడు.
కౌస్తుభపురం పక్కన ఉన్న అడవుల్లో వీరమల్లు అనే దొంగ తన పరివారంతో అనేక మందిని దోచుకుని బతుకుతున్నాడు. అతని కన్ను కౌస్తుభపురం మీద పడింది.
ఆ విధంగా చాకచక్యంగా అనేక గృహాలను, వ్యాపార సంస్థలను గుట్టుచప్పుడు కాకుండా దోచివేయసాగాడు.
వీరమల్లు బాధితులు చాలామంది రాజుగారి వద్దకు వెళ్ళి తమ బాధలు మొరపెట్టుకున్నారు. రాజావారు అనేక మంది గూఢచారులను, మెరికల్లాటి రక్షక భటుల్ని రాత్రి గస్తీకి పంపాడు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దొంగ పట్టుబడటం లేదు! వాడు నగరంలో రహస్యంగా ప్రవేశించి డబ్బుగల వారి గృహాలు, వ్యాపార సంస్థల ఆచూకీ కనుక్కుని దొంగతనాలు చేస్తున్నాడని రాజుగారు మంత్రులు అవగాహనకొచ్చారు.
ఈ విషయం మీద మంత్రులను, సైనికాధికారిని సమావేశపరచి చర్చించారు. ఆఖరికి సహస్తుడు అనే మంత్రి –
“రాజా దొంగలు తెలివిమీరిపొయ్యారు. పట్టుబడకుండా దొంగతనాలు చెయ్యడంలో ఆ దొంగ నిష్ణాతుడు అయిఉండవచ్చు. మనం కూడా పాత పద్దతుల్లో దొంగలను పట్టాలంటే అది కాని పని. అందుకే సంకేతికతను ఉపయోగిస్తే దొంగ తప్పక పట్టుపడతాడని నా ఆలోచన” అని చెప్పాడు.
“ఏ సాంకేతికత ఉపయోగిస్తావు?” అడిగాడు రాజు విశాలవర్మ.
“ఊరి బయట ఉన్న మన గ్రామదేవత ఎల్లమ్మ దేవాలయానికి రంగులు వేయించాలి. తరువాత ఎల్లమ్మ విగ్రహానికి ఇత్తడి నగలు బంగారం లాగ తయారు చేయించి దేవత మెడలో అలంకరించాలి.
మన ఆస్థాన సాంకేతిక నిపుణుడి సహాయంతో ఆ నగల నుండి విగ్రహం వెనుకవైపుకు ఓ సన్నని ఇనుప గొలుసు చాకచక్యంగా ఎవరికీ కనబడకుండా గుడి వెనుక వైపుఉన్న చిక్కటి,పచ్చని చెట్ల మధ్య ఒక చిన్న గంటకు అనుసంధానం చేస్తాము. అక్కడ మెరికల్లాటి ఐదుగురు రక్షక భటుల్ని పెడదాము. వారు ఆ చిక్కని చెట్ల మధ్య ఎవరికీ కనబడరు! దానికంటే ముందు మనం గుడి అభివృద్ధి చేస్తున్నట్టు, ఎల్లమ్మ దేవతకు కొత్త నగలు ధరింపచేస్తున్నట్టు దండోరా వేయించాలి, అప్పుడు చూడండి, కనీసం ఒకవారంలో ఆ దొంగో దొంగలో పట్టుబడతారు” చెప్పాడు సహస్తుడు.
సుహస్తుడి ఆలోచన రాజుకి మిగతా అందరికీ నచ్చింది. సుహస్తుడు చెప్పినట్లు గుడికి రంగులు వేయించి దేవతకు నగలు అలంకరింపచేసి పెద్ద ఎత్తున దండోరా వేయించారు.ఈ వార్త వీరమల్లుకు కూడా చేరింది గుడిలో హడావిడి తగ్గాక ఓ వారం రోజుల తరువాత ఒక తెల్లవారు జామున పరిసరాలు గమనించి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని మెల్లగా గుడి తలుపుతాళం పగులగొట్టి గర్భగుడిలో ప్రవేశించి విగ్రహం మీదున్ననగలను తీయసాగాడు. అంతే అతనికి తెలియకుండానే ఆ సన్నని గొలుసు కదిలింది. గుడి వెనుక వైపు చెట్ల మధ్య గంట మ్రోగింది! అక్కడి రక్షక భటులు అప్రమత్తం అయి శరవేగంతో గుడిని చేరుకుని వెనుక ముందు ద్వారాలవద్ద ఇద్దరు కాపలాగా ఉంటే మిగతా ముగ్గురూ లోపలికి ప్రవేశించి వీరమల్లును బంధించారు! అతను ఎంత పెనుగులాడినా రక్షకభటుల నుండి తప్పించుకోలేక పొయ్యాడు. అతనిని రాజావారి ముందు ప్రవేశ పెట్టారు. అతనికి ఖఠిన కారాగార శిక్ష విధించి వీరమల్లు సక్రమ మార్గంలో నడిచేందుకు తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని కారగార అధికారులకు సూచించారు మంత్రులు, రాజు.
మంచి సలహా ఇచ్చిన సుహస్తుడికి మంచి పురస్కారం ప్రకటించాడు రాజు.
చూశారా పిల్లలూ, ప్రతి పనిని ఒకే విధంగా చేయకూడదు. అభివృద్ధి చెందుతున్న మనం కొన్నింటికి సాంకేతికత జోడిస్తే అనుకున్నది సులభంగా సాధించవచ్చు.