వింత లిపి

0
2

[బాలబాలికల కోసం ‘వింత లిపి’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]దే[/dropcap]వరకొండ రాజు వాసుదేవుడికి కళలంటే ఎంతో మక్కువ. ఆయన కళలను పోషించడమే కాకుండా అనేక కళాఖండాలు సేకరించేవాడు. వాటన్నిటిని తన ప్రదర్శనశాలలో పెట్టి వచ్చిన అతిథులకు, ఇతర రాజ్యాల రాజులకు చూపిస్తూ ఎంతో ఆనందం పొందేవాడు. అంతేకాక తన రాజ్యంలో గానీ ఇతర రాజ్యాలలోని వారు ఎవరైనా కళాఖండమో, అపురూప చిత్రమో తెచ్చిఇస్తే దానిని పరిశీలించిన మీదట తగిన బహుమతి ఇచ్చి పంపేవాడు.

ఈ విషయం సూత్రవర్మ అనే ఇత్తడి, కంచు తయారు చేసే నిపుణుడికి తెలిసింది. వాసుదేవరాజుకి తాను తయారు చేసిన వస్తువ ఇచ్చి బురిడీ కొట్టించి తగిన విలువైన బహుమతి పొందాలనే దుష్ట ఆలోచన చేశాడు.

అలా అనుకున్నదే తడవు సూత్రవర్మ ఒక కంచుపాత్ర తయారు చేసి దానిమీద ఎవ్వరికీ అర్థం కాని లిపిని వ్రాసి కొన్ని రసాయనాల్లో ముంచి పురాతన పాత్రగా భ్రమింప చేసేట్టు తయారు చేశాడు! అలా ఆ పాత్రను తీసుకవెళ్ళి  రాజు వాసుదేవుణ్ణి కలసి తనను తాను పరిచయం చేసుకుని, “నా పెరడులో చెట్టు పాతేందుకు త్రవ్వుతుంటే ఈ పురాతన పాత్ర దొరికింది. దీని మీద ఉన్న లిపి నాకు అర్థం కాలేదు, ఇది ఏ కాలంనాటిదో తెలియదు, దయచేసి దీనిని తమరు స్వీకరించండి” అని చెప్పి రాజుకు ఇచ్చాడు.

రాజు ఆ పాత్రను పరిశీలించి తనకు ఆ లిపి అర్థం కాక పక్కనే ఉన్న ఆస్థాన కవి బాణభట్టుకి ఇచ్చాడు. ఆయనకు కూడా ఆ లిపి అర్థం కాలేదు!

“చూడు సూత్రవర్మా ఈ పాత్ర మీద ఉన్న లిపి మాకు అర్థం కాలేదు. దీనిని నిశితంగా పరిశీలించాలి. మా గ్రంథాలయంలో కొన్ని పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఏమైనా ఎక్కడైనా ఇటువంటి లిపి ఉన్నదేమో మా పరిశోధకులు, నిపుణుల చేత పరీక్ష చేయిస్తాము. అందుకు నీవు రెండురోజుల తరువాత ఇక్కడకురా” అని చెప్పి పాత్ర తమ దగ్గర ఉంచుకున్నట్టు ఓ కాగితం మీద వ్రాసి రాజముద్ర వేసి ఇచ్చాడు. చిరునవ్వుతో ఆ కాగితం అందుకుని సూత్రవర్మ వెళ్ళిపోయాడు.

రెండురోజుల తలువాత  సూత్రవర్మ తనకు లభించే  బహుమతిని గురించి ఆలోచిస్తూ రాజుగారి వద్దకు వెళ్ళాడు.

“నీ కోసమే ఎదురు చూస్తున్నాము. నీవు ఇచ్చిన పాత్ర మీద లిపిని మా ఆస్థాన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. విశేషమేమిటంటే ఆ పాత్ర మీద ఉన్న లిపి ప్రకారం అది ఒక యక్షుని పాత్ర, అది ఎవరికి దొరుకుతుందో వారిని పది కొరడా దెబ్బలు కొట్టాలని ఉంది! అలా కొడితే ఆ పాత్ర దొరకిన వారికి, వారి నుండి పాత్ర గ్రహంచిన వారికి మేలు జరిగి ధనం లభిస్తుందని వ్రాసి ఉంది! అందువలన నీకు పది కొరడా దెబ్బలు బహుమతిగా ఇస్తాను, దానివలన నీకు ధనం లభిస్తుంది. నాకు కూడా మేలు జరుగుతుంది” చిరునవ్వుతో చెప్పాడు రాజు .

తన మోసాన్ని రాజు గారు గ్రహించినట్లు సూత్రవర్మ అర్థం చేసుకుని రాజుగారి కాళ్ళమీద పడ్డాడు.

“ప్రభూ, బుద్ధి గడ్డి తిని తమరిని నా వక్ర బుద్ధితో మోసం చేసి బహుమతి పొందాలనుకున్నాను నన్ను క్షమించండి, నాకు ఏ బహుమతి వద్దు” అని కన్నీళ్ళతో చెప్పాడు.

“చూడు సూత్రవర్మా నీలో కళ ఉంది. దానిని వక్రమార్గంలో ఉపయోగించి మోసం చెయ్యలనుకున్నావు. ఎందుకంటే నీలో అత్యాశ కలిగింది. అదే ఆ పాత్ర మీద వింత లిపి వ్రాసే బదులు చక్కని నగిషీలతో ఆ పాత్రను కళాత్మకంగా తయారు చేసి ఉంటే నీకు మంచి బహుమతి ఇచ్చి ఉండేవాడిని, ఎప్పుడు కానీ నీలో ఉన్న కళని దుర్వినియోగం చేయకూడదు అంతేకాని నీ కళ ఆహ్లాదం కలిగించాలి. ఇక ఎప్పటికీ ఇటువంటి పనులు చేయకు. నీలో కళ ఉంది కాబట్టి నీకు ఏ శిక్షా విధించను, దానికి బదులుగా నా వద్ద ఐదు పాత కంచు పాత్రలు ఉన్నాయి, వాటిని నగిషీలతో కళాత్మకంగా తీర్చిదిద్దు” అని ఐదు పాత్రలు ఇచ్చాడు.

రాజుగారికి దండం పెట్టి, “మహారాజా నా ఆలోచనలు మార్చారు. ఈ ఐదు పాత్రలు అద్భుతంగా చేసి ఇస్తాను, నాకు ఏ బహుమతి వద్దు” అని పాత్రలు తీసుకుని వెళ్ళి పోయాడు సూత్రవర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here