[dropcap]చి[/dropcap]గుళ్ళు పురిట్లో సంధికొట్టిన శిశువుల్లా ఊడిపడుతున్నాయి,
పండుటాకులేమో గబ్బిలాల్లా పట్టుకు వ్రేలాడుతున్నాయి.
శ్రుతి కుదరని వాద్య సమ్మేళనంలా రొద చేస్తున్న
తుమ్మెద మూకలూ వసంతోత్సవంలో కనబడతాయి
ప్రకృతి అంతా కాలుష్యంతో కళ తప్పినవేళ
గంధకం వాసల్ని భరించలేక గంధవహుడు గగ్గోలు పడుతున్నాడు.
అంతా కృత్రిమమే, వనాలే లేకపోతే పవనాలు
ఎక్కడ నుంచి వస్తాయి. పూలు ఎలా పూస్తాయి?
ప్లాస్టిక్ మొగ్గలే పలకరిస్తాయి.
పండగపూట కరువు ప్రాంతాల నుంచీ తరలిపోతున్నవారిలాగా,
మన సాంస్కృతిక ప్రత్యేకతకు నిదర్శనమై నిలిచే
ఉగాది కూడ ఊళ్ల నుంచి తరలిపోతుందేమో అని దిగులు కలుగుతోంది.
కాకులే కనబడడం లేదు, అవి గూళ్ళు పెట్టే చెట్లే లేవు…
ఇక వాటి గూట్లో గుడ్లు పెట్టే కోకిలకు తావెక్కడ
అందుకే ఇప్పటికి దిగులు.