Site icon Sanchika

వింటూనే ఉండండి…

[box type=’note’ fontsize=’16’] “పాటలు విన్నా వినకపోయినా పెద్దగా ఇబ్బందేం లేదు. కాని జీవితంలో ఎదుటివారిని శ్రద్ధగా వినడం మాత్రం ఎంతో అవసరం” అంటున్నారు కొల్లూరి సోమ శంకర్ ఈ రచనలో. [/box]

[dropcap]మా[/dropcap] బంధువు ఒకాయన్ని రైలెక్కించడానికి స్టేషన్‌కి వెళ్ళాను.

రైలు రావడానికి ఇంకా టైమ్ ఉంది. కానీ జనాలు ప్లాట్‌ఫాం అంచులదాక వెళ్ళి తొంగి చూస్తున్నారు. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నా ఎవరూ వినడం లేదు. ఎవరి కంగారు వాళ్ళది. రిజర్వేషన్ లేనివాళ్ళు ఆత్రుత పడినా కాస్త అర్థం ఉంది, రిజర్వ్‌డ్ టికెట్లు ఉన్నా… జనాలెందుకు తొందరపడుతున్నారో అర్థం కాదు.

ఇంతలో రైలు వచ్చింది. మా బంధువుని ఎక్కించాను. రైలు కదిలే దాకా ఉండి వీడ్కోలు పలికి, బయల్దేరబోతుంటే నా సెల్ మోగింది. ఏదో ఎస్.ఎమ్.ఎస్. అది చదువుతూ కొన్ని క్షణాలు ప్లాట్‍ఫాం మీదే ఉండిపోయాను.

ఇంతలో ఓ ఎనౌన్స్‌మెంట్. రెండో నంబరు ప్లాట్‌ఫాంపైకి రావల్సిన రైలేదో ఇప్పుడు నాల్గవ నెంబర్ ఫ్లాట్‌ఫాం పైకి వస్తోందట. జాగ్రత్తగా విన్న కొందరు ప్రయాణీకులు తమ సామాన్లని మోసుకుంటూ ఆ ఫ్లాట్‍ఫాం వైపు పరుగులు తీశారు. సరిగ్గా వినని వారు, విన్నవాళ్ళని అడుగుతూ, వాళ్ళతో పాటు గబగబా నడుస్తున్నారు. చిన్నపాటి గందరగోళం!

నిజానికా రొదలో, “దయచేసి వినండి” అంటూ చేసే ఎనౌన్స్‌మెంట్స్ సరిగా వినిపించవు, అయినా ఎవరూ ఎవరి మాట వినడం లేదు. మొబైల్స్‌లో నెట్ చూసుకోడంతోనో లేదా తమ వాళ్ళతో కబుర్లాడుకోడాలతోనే సరిపోతుంది.

అందర్నీ గమనిస్తూ, బయటకి నడిచాను.

సెకండ్ హ్యాండ్స్ బుక్స్ ఏవైనా కొందామని లకడీ-కా-పూల్ దగ్గర బస్ దిగాను. ఓ బుక్ షాప్‌లో రకరకాల పుస్తకాల మధ్య కొన్ని పర్సనాలిటీ డెవలప్‍మెంట్ బుక్స్ ఉన్నాయి. హఠాత్తుగా నా దృష్టి అక్కడున్న ‘The Lost Art of Listening’ అనే పుస్తకంపై పడింది. దాన్ని తీసుకుని కాస్త బేరమాడి కొన్నాను.

అసలు కొన్నేళ్ళుగా మనలో చాలామంది వినడం మానేసారని మానసిక శాస్త్రవేత్తలు చెప్పారని ఈమధ్య ఓ పత్రికలో చదివాను. శ్రద్ధగా వినేవారు లేకపోవడం వల్ల మనుషుల మధ్య బంధాలు బీటలు వారుతున్నాయని ఆ పత్రిక వ్రాసినది గుర్తొచ్చింది.

ఉరుకులు పరుగుల జీవితంలో, పనుల ఒత్తిడిలో మనలో చాలామంది శ్రద్ధగా వినడం మానేస్తున్నాం. “Most people do not listen with the intent to understand; they listen with the intent to reply” అన్న స్టీఫెన్‌కోవె మాటలు ఎంతో నిజం.

ఇంతలో ఒక ఆటో డ్రైవరు పాటలు హై వాల్యూమ్‌లో పెట్టుకుని నడుపుతూ నన్ను దాటుకుని వెళ్ళాడు. “పెళ్ళాం చెప్తే వినాలి… నీ కళ్ళకు గంతలు విడాలి” అనే పాట అది! నాకు నవ్వొచ్చింది. భార్యే కాదు, ఎవరు చెప్పిన మంచిమాటైనా వినాలి అనుకుంటూ బస్‌స్టాండ్‌వైపు నడిచాను.

ఉన్నట్టుండి చిరు జల్లులతో మొదలై, ఓ పది నిమిషాలు వాన జోరుగా పడింది.

ఆ సమయంలో హఠాత్తుగా ట్రాఫిక్ తగ్గి, కేవలం వాన చప్పుడు తప్ప మరేదీ వినబడడం లేదు.

మహేష్‍భట్ సినిమా ‘సర్’ లోని సున్ సున్ సున్ బర్సాత్‌ కి ధున్‘ పాట గుర్తొచ్చింది. వాన పడుతున్నప్పుడు ప్రకృతి గానాన్ని వినమనే పాట అది. కుమార్ సాను గొంతులో ఆ పాట మనల్ని వానలో తడుపుతుంది.

ఎంత హఠాత్తుగా మొదలైందో, అంతే హఠాత్తుగా ఆగిపోయింది వాన.

అయినా ఆ నిశ్శబ్దం కొంతసేపు కొనసాగింది. సాజ్ సినిమాలోని “సున్‌నేవాలే సున్‌లేతే హైఁ కణ్ కణ్ మెఁ సంగీత్ హో” అనే పాట మనసులో మెదిలింది. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ స్వరపరిచిన ఆ పాటకి జావేద్ అఖ్తర్ అందించిన సాహిత్యం మైమరపిస్తుంది.

ఇంతలో ఐదు కాళ్ళు ఉన్న ఓ ఆవుని తీసుకుని ఓ బండి వచ్చింది, “వినరా వినరా నరుడా… తెలుసుకోర పామరుడా… వినరా వినరా నరుడా… తెలుసుకోర పామరుడా … గోమాతను నేనేరా… నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా… తెలుసుకోర పామరుడా…” అనే పాట వినిపిస్తూ డబ్బులు అడుగుతున్నారు.

నేనెక్కాల్సిన బస్ రావడంతో ఎక్కాను. అదృష్టం కొద్దీ సీటు దొరికింది. నా పక్క సీట్ అతను ఫోన్‌లో పాటలు వింటున్నాడు, పైకి వినబడుతోందా పాట – “వినరా వినరా దేశం మనదేరా… అనరా అనరా రేపిక మనదేరా…” – రోజా సినిమాలో ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన పాట. దాని తర్వాత, “వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా” లవకుశలో పాట! ఆ పాట మధ్యలో ఉండగానే అతని దిగాల్సిన స్టాప్ వచ్చింది. దిగిపోయాడు. కాసేపయ్యాకా నేనూ ఇల్లు చేరాను.

వినడం గురించి ఆలోచిస్తుంటే, వినడం గురించిన పాటలే వినబడడం యాదృచ్ఛికమేనా?

***

మర్నాడు ఓ పని మీద విజయవాడ వెళ్ళాను. అక్కడ మా తమ్ముడి బైక్ తీసుకుని బీసెంట్ రోడ్డుకి వెళ్ళాను. పని పూర్తి చేసుకుని, వస్తుంటే టైర్ పంక్చర్ అయింది. దగ్గర్లోనే ఓ మెకానిక్ ఉంటే బండిని తోసుకెళ్ళి అతనికిచ్చి, కుర్చీలో కూలబడ్డాను. అతను రేడియో పెట్టుకుని వింటూ పని చేస్తున్నాడు. స్థానికంగా కొత్త ఎఫ్.ఎమ్. ఛానెల్ ప్రారంభమైందట. వాళ్ళ స్లోగన్‌ని మాటిమాటికి వినిపిస్తూ… ‘వింటూనే ఉండండి… వింటూనే ఉండండి’ అంటున్నాడా ఆర్.జె. ఆ ఆర్.జె. మాటతీరు, పెద్దా చిన్నా తేడా తెలుసుకోకుండా అందరినీ ఏకవచనంలో సంబోధించడం నాకు నచ్చలేదు.

హైదరాబాద్ చేరుకున్నాక కూడా ఆ ఆర్.జె. నా ఆలోచనల్లోంచి పోలేదు. ఉన్నట్టుండి ఈ మధ్య చదివిన ఓ వార్త గుర్తొచ్చింది. లండన్‌లో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఓ రోగిని కాపాడిన ఆర్.జె. సమయస్ఫూర్తి గురించిన వార్త అది!

బ్రిటన్ రేడియోలో రాత్రి పూట ప్రసారమయ్యే ‘లేట్ నైట్ ఆల్టర్‌నేటివ్’ కార్యక్రమానికి క్రిస్ అనే వ్యక్తి ఫోన్ చేసి, ఆ షో అంటే తనకి ఇష్టమని; ఆరోగ్య సమస్యల కారణంగా అధిక మోతాదులో మందులు వేసుకోవడం వల్ల కళ్లు తిరుగుతున్నాయని, మరికొన్ని క్షణాల్లో స్పృహ తప్పేలా ఉందని ఆర్.జె.తో చెప్పగా, ఆరె.జె. ఐయాన్ లీ అతను చెప్పేది శ్రద్ధగా వింటూ, తనతో మాట్లాడుతూనే ఉండమని చెబుతూ అతని వివరాలు తెలుసుకుని పోలీసులకు, హెల్త్ కేర్ సిబ్బందికి తెలియజేయడంతో వారు సకాలంలో స్పందించి క్రిస్‌ని కాపాడగలిగారు.

వింటూనే ఉండడానికి ప్రయోజనమిది అని నాకనిపించింది. ఒక తెలుగు ఎఫ్.ఎమ్. ఛానల్ వారి స్లోగన్ “విను వినిపించు లైఫ్ అందించు” ఈ వార్తకి బాగా నప్పుతుందని అనిపించింది.

దినపత్రిక అందుకున్నాను. మరుగున పడుతున్న కళ అంటూ బుర్రకథ గురించి వ్రాసిన వ్యాసమొకటి కనబడింది. నా చిన్నప్పుడు చూసిన బుర్రకథల ప్రదర్శనలు గుర్తొచ్చాయి. ‘వినరా భారత వీర కుమారా!’ అంటూ కంచుకంఠంతో కళాకారులు ప్రేక్షకులని వినమని కోరేవారు!

వినడం ప్రాముఖ్యతని తెలపడానికి మన ముఖాన్ని ఉదాహరణగా చూపిస్తారు. మనకి నాలుక ఒకటే కాబట్టి తక్కువ మాట్లాడాలనీ, చెవులు రెండు కాబట్టి ఎక్కువగా వినాలని అంటారు.

ఈ మధ్య ఇంటర్నెట్‌లో చదివిన ఓ విషయం జ్ఞాపకమొచ్చింది. ఇంటర్నేషనల్ లిజనింగ్ అసోసియేషన్ వారు గత సంవత్సరం అంటే 2018లో సెప్టెంబరు 20ని “ఇంటర్నేషనల్ డే ఆఫ్ లిజనింగ్”గా జరుపుకున్నారు. ఆ ఏడాది థీమ్‌గా “Listen – even when you disagree” ఎంచుకున్నారు. ‘ఫాదర్ ఆఫ్ లిజనింగ్’ అని పేరు పొందిన మిన్నెసోటా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. రాల్ఫ్ నికోలస్ ఈ సంస్థని స్థాపించారు. 1979 నుంచి ఈ సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందట.

రేడియో ఆన్ చేశాను. ‘వివాహ బంధం’ సినిమాలో భానుమతి పాట ‘విన్నావా ఆ ఆ మనసులోన దాగి ఉన్న మధురగీతి విన్నావా’ వస్తోంది. పాటకి చెవులప్పగించాను. తర్వాత ఒక చిన్న ప్రకటన వచ్చింది. అనంతరం “మంచి మనుషులు సినిమా నుంచి ఆరుద్ర రాసిన పాట వినండి” అని అనౌన్సర్ చెప్పడం ముగియగానే…

“విను నా మాట.. విన్నావంటే..ఏ.. జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..” అనే పాట వచ్చింది. పాట మొత్తం శ్రద్ధగా విన్నాను.

చరణంలో వచ్చిన “ఎన్నడు నీవు ఏడవకూ.. కన్నుల నీరు రానీకు… కష్టాలందూ నవ్వాలి.. కలకల ముందుకు సాగాలీ..” అనే పదాలు బాగా నచ్చాయి. ఏది వినాలి అనే ప్రశ్నకి… ఇలాంటి పాటలు వినాలి అని జవాబు తట్టింది.

ఇంతలో నా దృష్టి గోడ మీద ఉన్న రెండు పోస్టర్ల మీద పడింది. చక్కని కొటేషన్స్‌ని అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ప్రింట్ చేసిన పోస్టర్లవి. మా మిత్రుడొకరు కానుకగా ఇచ్చారు.

“Always listen to your heart, because even though it’s on your left side, it’s always right” అని Nicholas Sparks చెప్పిన కోట్ ఉన్న పోస్టర్ ఒకటి. రెండోది “When the voices of doubt start whispering turn up the volume of faith and listen to your heart” అని Bryant McGill చెప్పిన పోస్టర్.

చక్కని సూక్తులు అనుకుంటూ, రేడియో ఆపు జేసి, లాప్‌టాప్‌లో టైప్ చేసుకుంటూ, పాత హిందీ సినిమా పాటల ఫోల్డర్ తెరిచి వేర్వేరు సినిమాల్లోంచి కొన్ని పాటలు సెలెక్ట్ చేసుకుని ప్లేలిస్ట్‌కి జోడించి ప్లే నొక్కాను.

మొదటగా ‘తేరే ఘర్‍ కే సామ్‌నే’ సినిమాలో రఫీ పాడిన “సున్‌ లే తు దిల్ కీ సదా, ప్యార్ సే ప్యార్ సజా” పాట వచ్చింది. విశ్వప్రేమని చాటే పాట. హృదయపు మాట వింటే ఏం జరుగుతుందో చెప్పే పాట ఇది.

తర్వాత రాజ్‌కపూర్ సినిమా ‘దిల్ హీ తో హై’ సినిమాలోంచి “దిల్ జో భీ కహేగా మానేంగే… దునియా మెఁ హమారా దిల్ హీ తో హై” వచ్చింది. కష్టంలోనూ సుఖంలోనూ హృదయం మాత్రమే నా వెంట ఉంటుంది, అందుకే హృదయం మాట వింటానంటున్నాడు కథానాయకుడు. ముకేష్ గొంతులో సాహిర్ లుధియాన్వి వ్రాసిన ఆ గీతం భావోద్వేగంతో సాగుతుంది.

తర్వాత ‘దస్ లాఖ్’ సినిమాలో రవి సంగీత దర్శకత్వంలో మహమ్మద్ రఫీ, ఆశాభోస్లే పాడిన “చాహే లాఖ్ కరో తుమ్ పూజా తీరథ్ కరో హజార్ దీన్-దుఃఖీ కో ఠుకరాయా తో సబ్ కుచ్ హై బేకార్” అనే పాట వచ్చింది. ఈ పాట పల్లవిలో “గరీబోం కో సునో, వో తుమ్హారీ సునేగా” అని ఒక వాక్యం వస్తుంది. మానవసేవే మాధవ సేవ అనే సూక్తికి అద్దం పట్టిన వాక్యం ఇది. ఈ గీత రచయిత కూడా రవే.

తరువాతి పాట ‘మేరీ కహానీ భూల్‌నే వాలే’ అనేది, దీదార్ సినిమాలోది వచ్చింది. ఈ పాటలో मेरे गीत सुने दुनिया ने मगर मेरा दर्द कोई न जान सका అనే వాక్యాలు గుండెల్ని పిండుతాయి. షకీల్ బదాయునీ రాసిన ఈ గీతాన్ని రఫీ స్వరంలో వింటుంటే కళ్ళు చెమరుస్తాయి.

ఇంతలో నాకేదో ఫోన్ వస్తుండడంతో, పాటలు ఆపి, ఫోన్ అందుకున్నాను. ఏవో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మిత్రుడు… అతను చెప్తున్నదంతా జాగ్రత్తగా విని, నాకు తోచిన సలహాలు చెప్పి, అతనికి ధైర్యం చెప్పాను.

పాటలు విన్నా వినకపోయినా పెద్దగా ఇబ్బందేం లేదు. కాని జీవితంలో ఎదుటివారిని శ్రద్ధగా వినడం మాత్రం ఎంతో అవసరం.

***

ఎవరేం చెప్పినా వినాలా? మంచో చెడో తెలుసుకోవద్దా? తప్పకుండా తెలుసుకోవాలి.

“వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో సుమతీ”

అన్న శతకకారుడి మాటలను గుర్తుచేసుకోవాలి.

ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినాలి. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా… అందులో నిజానిజాలను తెలుసుకునేవాడే ఉత్తముడని కవి భావం.

ముఖ్యంగా పుకార్లను వ్యాపింపజేయకుండా ఉండడానికి ఈ పద్యం బాగా ఉపకరిస్తుంది.

***

రంపచోడవరంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్‍మాస్టర్‌గా పనిచేస్తున్న మిత్రుడు పొద్దున్నే ఫోన్ చేశాడు. అవీ ఇవీ మాట్లాడాకా – ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక పాఠశాలలలో “విందాం – నేర్చుకుందాం” శీర్షికన రేడియో పాఠాలు చెప్తున్నారనీ, పిల్లలకి ఈ బోధన ఆసక్తికరంగా ఉందని చెప్పాడు. ఈ శీర్షికని బడి పాఠాలకే కాకుండా జీవితపు పాఠాలకి కూడా వర్తింపజేస్తే అందరికీ మేలు కలుగుతుందని నాకు అనిపించింది.

వినడం ప్రాముఖ్యత గురించి దలైలామా “When you talk you are only repeating what you already know. But when you listen, you may learn something new” అని అంటారు.

‘వింటూనే ఉండండి… వింటూనే ఉండండి’ అన్న ఆ ఆర్.జె. మాటలు మదిలో మెదిలాయి.

వినడం! ఇది చాలా ముఖ్యమైనది!

వాళ్ళ మాటలను శ్రద్ధగా ఆలకించడం వల్ల ఎదుటివారికి మనసుకి సాంత్వన కలుగుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగుతాయి. జాగ్రత్తగా వినడం ద్వారా కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు. శ్రద్ధగా వినడమే చక్కని సంభాషణా చాతుర్యానికి తొలిమెట్టు.

మన తల్లిదండ్రులను శ్రద్ధగా ఆలకిస్తున్నామా? జీవిత భాగస్వామి అంతరంగాన్ని విని ఎంత కాలమయ్యింది? పిల్లలు చెప్తున్నవి ఎంత వరకు మన బుర్రలోకి వెళ్తున్నాయి? అని మనం తరచూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

వినడం ఒక కళ అని, వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు.

ఏది వినాలో నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఏది వింటే ఉపయోగమో పెద్దలెపుడో చెప్పారు.

“భద్రం కర్ణేభి శృణుయామదేవాః” అనే శాంతిమంత్రం ఒకటుంది. “విందుముగాక మా చెవుల వేలుపులార శుభంబు లెప్పుడు” అని పరవస్తు వేంకట రంగాచార్యులు గారు ఈ మంత్రాన్ని తెలుగులోకి అనువదించారు.

చెవులను, మెదడును, హృదయాన్ని మేళవిస్తేనే మేలు చేసే మాటలు మనవవుతాయి. అప్పుడే – వినడం అంటే విషయాల్ని తెలుసుకోవడమే కాదు. విజ్ఞానం పొందడం అనే సూక్తి నిజం అవుతుంది.

మంచి మాటలు, నలుగురికీ మేలు చేసే మాటలు వింటునే ఉందాం.

Exit mobile version