విపంచివై వినిపించితివి ఈ గీతాలు

6
2

[box type=’note’ fontsize=’16’] ఆయన గళంలోంచి వేలాదిగా ఒలికిన పాటల్లోంచి ఓ పాటలా, పాటే బాలు స్వరంకోసం తపించటాన్ని తన మనస్సు తపనగా వినిపిస్తున్నారు  శ్రీ. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అమృత స్వరానికి  నివాళి అర్పిస్తున్నారు డా. సిహెచ్. సుశీల. [/box]

[dropcap]ఆ[/dropcap]గండి కాసేపు నన్నేమి పలకరించకండి. ఎందరెందరి గళాల నుండో వెలువడిన నేను సుస్వరమై, రాగం తరంగమై, వీనుల విందై, అల లాగా, గాలి తరగ లాగా వెల్లువెత్తిన నేను వణుకుతున్నానెందుకిప్పుడు? అపస్వరమౌతున్నానెందుకు? దిక్కుతోచనట్టు, ఒంటరినైనట్టు గద్గదమౌతున్నానెందుకు?

నా బాలు ఎక్కడ? నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయాడా! తరలిరాదా తనే వసంతం ఇక తన దరికిరాని వనాల కోసం! 40 వేల పైన నన్ను తన స్వరంలో వినిపించాడే! తన సమ్మోహన మంత్రం వల్లనేగా 6 జాతీయ బహుమతులు అందుకున్నాను!

ఏ దివిలో నుండి ఏ గంధర్వలోకం నుండి నాకోసమే భువి లోకి దిగివచ్చి నన్ను ఒడుపుగా ‘పదిలంగా అల్లుకొన్న పొదరిల్లు’ లాంటి తన గళంలో ఒడిసి పట్టుకొని అమృత గానాభిషేకం చేశాడు. తెలుగే కాక భారతీయ భాషలన్నింటిలో మొత్తం 15 భాషల్లో నన్ను ఒక మ్యాజిక్‌లా ప్రవేశ పెట్టేశాడు.

తెలుగు మాటలు రాని నటులకు వారి హావభావాలకు అనుగుణంగా గళం అరువు ఇచ్చి , ముఖ్యంగా కమల్‌కి దశావతారంలో ఏడు పాత్రలకి గళం గమ్మత్తుగా ఇచ్చాడు. “బాలుడి”ని అని వినయంగా పలుకుతాడు కానీ సంగీతంలో ప్రౌఢుడు అని శంకరాభరణంలో‌ “ధిక్కరీంద్ర హిమగిరీంద్ర శిఖ కంధర నీలకంధరా! క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా, విని తరించరా” అని నన్ను ఆలపించినప్పుడే నాకు అర్థమైంది.

“కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు’- గంభీరంగా అన్న చోట, ప్రక్కనే “ఆరేసుకోబోయి పారేసుకున్నావా హరీ”అనే చాతుర్యం ఉంది .

“నా *పాట పంచామృతం” అని* నన్ను కీర్తించావు. ఆ పంచామృతాన్ని అందరికీ పంచావు. ఎంత పంచితే నేనంత పెరుగుతాను – అన్న సత్యం తెలుసుకొన్న స్వరాల అపర గంధర్వుడవు.

“బలపం పట్టి భామ ఒడిలో అఆఇఈ నేర్చుకున్నా… లక్స్ పాపా లుక్స్ పాపా లంచ్ కొస్తావా అన్నా… ఆకు చాటు పిందె తడిచే అన్నా.. జామురాతిరి జాబిలమ్మ అన్నా… శుభలేఖ రాసుకున్నా కాలంలో అన్నా… కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అన్నా… మామా చందమామ అన్నా… కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం… ఆడవే మయూరి నటనమాడవే మయూరి.. అన్నా …అన్నిటిలో నీ ముద్ర! నీ ప్రత్యేకత! దుర్యోధనుడికి డ్యూయెట్ అంటే నన్నెలా అమరుస్తావో అనుకున్నా, “చిత్రం బళ్లారే విచిత్రం” – భేష్ అనిపించావ్! సింపుల్‌గా నువ్వు ఒక మ్యాజిక్‌వి బాలు!!

ఘంటసాల వెళ్ళిపోయినప్పుడు చిత్రసీమ ఏమై పోతుంది, ఎన్టీఆర్ ఏఎన్‌ఆర్ ఎలా అని నేను కంగారు పడినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా నన్ను ఆదుకొన్నవు! నాకే నవ్వు వచ్చేలా గొంతు మార్చి మార్చి వాళ్లకి వాడేసావ్. హిట్టు లిచ్చేసావ్. ఇప్పుడు నువ్వు లేని లోటు కచ్చితంగా ఎవరు తీర్చలేరు .

నన్ను గంభీరంగా విషాదంగా, విరహంగా, చిలిపిగా, కరుణతో శోకంతో, రౌద్రంగా అన్ని రసాలతో పండిస్తావు. ప్రతి రాత్రిని వసంత రాత్రిగా చేస్తావు. ఒక్కోసారి నువ్వు మధ్య మధ్యలో కొంటె నవ్వుతో పాటు పలుకుతుంటే యువతరం వెర్రెక్కిపోయేది. ముఖ్యంగా ఆడపిల్లల బుగ్గల్లో గులాబీలు విరిసాయిలే!

అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య,  నారాయణ రెడ్డి, దాశరథి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి,  వేటూరి, సిరివెన్నెల, అశోక్ తేజ, వెన్నెలకంటి, భువనచంద్ర ఇంకొందరితోనో పలికించావు. 74 ఏళ్ల వయసు – నీ చిరునవ్వు ముందు, సంతృప్తితో ఆత్మవిశ్వాసంతో వెలిగే నీ కళ్ళ కాంతుల ముందు పాడుతా తీయగా లో స్వరాభిషేకం లో నీ హుషారైన ప్రోగ్రామ్స్ ముందు మరుగై పోయింది. అందరితోపాటు నేనూ గమనించలేకపోయాను.

నేనంటే నీకు ఎంత ఇష్టం! నాలోని చరణం పల్లవి లతో మీ పిల్లల్ని పిలుస్తూ తృప్తి పడ్డావు.

“గుంతలకిడి గుంతలకిడి” అన్నా, “నడక కలిసిన నవరాత్రి” అన్నా, “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి” అన్నా.. నవ్వించావు. కవ్వించావు. ఏడిపించావు. శృంగారపు మత్తులో ముంచావు. (ఒక్కోసారి కొందరు కన్నెర్ర చేసేలా బూతులు అర్థంలో పలికావట). “మాటే రాణి చిన్నదాని” అన్న పాటని ఊపిరి పీల్చుకోకుండా పాడి నన్ను ఇబ్బంది పెట్టావ్ అనుకో. అయినా ప్రజల నాలుకలపై కలకాలం నన్ను నిలిపావు. పాప పుట్టినప్పుడు నేనే. మారాం చేస్తే “ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు, జాజి మల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వు”! తాళికట్టు శుభవేళ “శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం”! యువతరం ఆరాటంలో “ఒకటే జననం ఒకటే మరణం గెలుపు పొందె వరకు అలుపు లేదు నీకు”! దేశభక్తిలో “పుణ్యభూమి నాదేశం నమో నమామి”! భక్తి గీతాలు “అందరి బంధువయ భద్రాద్రి రామయ్య”! వంటివి ఎన్నో.ఇంకా వైరాగ్య గీతాలు తత్వ గీతాలు ఎన్నెన్నో పలికించావు. అమరంగా నిలిపావు. నువ్వు వెళ్ళిపోయావు.

సుశీలమ్మ, జానకమ్మ, ఎల్ ఆర్ ఈశ్వరి, చిత్రమ్మ పాటు కొత్తగా వచ్చిన వారితో నన్ను జత కలిపి, చిట్టచివర బేబమ్మతో కూడా పలాస చిత్రంలో “ఓ సొగసరి ప్రియ లాహిరి”!! చివరిలో కూడా ఎంత “యువ” గళంలో వినిపించవు నన్ను! నీవు ఒక ప్రేమ పిపాసివి. నిజమే. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం అన్నావు. కాదు కాదు,నువ్వే కఠినుడివి.అందుకే హఠాత్తుగా వెళ్లిపోయావు.

శివాష్టకం లింగాష్టకం ప్రతి గుడిలో ప్రతిధ్వనింపజేసావు. ప్రతి ఇంటిలో, గుడిసెలో, బడ్డీ కొట్లో, బస్సులో, ఆటోల్లో, పబ్బుల్లో, క్లబ్బులో, సెల్లులో, ఇయర్ ఫోన్‌లో సుస్వర మధుర గీతాలాపనగా నన్ను వినిపిస్తున్నావు. నన్ను ఇక్కడ నీ అభిమానులందరికీ అంకితం చేసి ఒంటరిగా వెళ్లిపోయిన *పాటసారి* “అంతర్యామి అలసితి సొలసితి” అంటూ వెళ్ళిపోయావా! “శ్రీ తుంబుర నారద నాదామృతం” అని కలవరించావుగా! సరే. వెళ్లి ఆ కళావతితో ,కచ్ఛపితో, మహతితో కలసి విశ్రాంతి తీసుకో. ఓ బాలూ లాలీ!

కోదండపాణి, మహదేవన్, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా, రెహమాన్, రాజ్, కోటి, దేవి శ్రీ ప్రసాద్ వంటి సంగీత సామ్రాట్ దగ్గర అలవోకగా నాతో గమకాలు పలికించావు. నటుల గొంతులో పరకాయ ప్రవేశం చేసి తెలుగు భాషకి ప్రాణం పోసి అపస్వరానికి, అప శబ్దానికి అల్లాడిపోయి, సరిదిద్దటానికి తాపత్రయపడి, అప్పటికిగాని సంతృప్తి పడేవాడిని కాదు.

రోజూ పని. ఒక్కోసారి పదిసార్లు, ఒకసారైతే 17 సార్లు నన్ను మైకు ముందుకు తెచ్చావు. ఒక్కోసారి నీకు జ్వరము జలుబు దగ్గు కాలో చెయ్యో దెబ్బతగిలి ఇబ్బంది పడుతుంటే ఈరోజు విశ్రాంతి తీసుకో అని చెప్పాలనిపిస్తుంది. నువ్వు వింటేనా! నిర్మాత నష్టపోతాడు. సమయపాలన ముఖ్యం. మాట ఇచ్చాను అని అలానే వెళ్ళిపోతావు. మొండి వాడివి మిథునం లోలా. అమాయకుడివి కూడా, అదే పాత్రలో లా.

“ఒక్కడై రావడం”… నిజమే. “ఒక్కడై పోవడం”.. ఇది నీ విషయంలో నిజం కాదు. ఎన్నెన్నో మనసుల్ని అనుభవాల్ని, అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని వెంట తీసుకెళ్తున్నావు.

“కరోనా కరోనా “అని ఎందుకు పాడావు! ప్రపంచమంతా వణికి చస్తుంటే నువ్వు ధైర్యంగా “నాన్సెన్స్ నిన్ను తరిమికొడతాం” అని చిటికెలు వేస్తూ ఆ చైనా క్రిమిని పాడుతూ రెచ్చగొట్టావు. అయ్యో, నువ్వే బలైపోయావు. క్రమశిక్షణ, కమిట్మెంట్, ఏకాగ్రత, వృత్తి ధర్మం మీద మొక్కవోని నిబద్ధత, ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండే వినయ సంపద, తండ్రి ఇచ్చిన సంస్కారం నీకు సహజ కవచకుండలాలు. వాటిని ఎవరు బద్దలు చేయలేరులే అనుకున్నాము. కానీ కనిపించని శత్రువు ఆ క్రిమి అంత పని చేస్తుంది అనుకోలేదు.

ఎదుగుతున్నావు అనుకొన్నాను. కానీ ఎవరికీ అందనంత ఎత్తుకి, అనంత లోకాలకు వెళ్ళిపోతున్నావా అని ఊహా మాత్రంగానైనా అనుకున్నా ఆ దేవదేవుని కాళ్ళావేళ్ళా పడే వారము కామా సంగీత ప్రపంచంలో వారమంతా వాయిద్య సరంజామాతో సహా మౌనంగా ప్రార్థిస్తూ!!

జీర బోయాను.

మూగ బోయాను.

ఆగిపోయాను.

అయినా నీకోసం – 44 ఏళ్ళు నన్నింత ప్రేమగా భక్తిగా ఆరాధనగా నీ స్వరంలో పూజించి – ఇప్పుడు అంతే భక్తితో తిరిగి “వీరికి” అర్పించేసి “వచ్చిన పని సక్రమంగా సంపూర్ణంగా పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నాను” అని సంతృప్తితో వెళ్ళిపోయావు అని నమ్ముతున్నాను. నాకు తెలుసు ఇన్నాళ్ల నీ సాహచర్యంలో నీవేమిటో. పాటలు, మాటలు, డబ్బింగ్, నటన సంగీత దర్శకత్వం, వ్యాఖ్యాతగా, (అవును పడమట సంధ్యారాగం లో ఒక ఇంగ్లీషు కొంటె పాట రాశావు) దేశవిదేశాల్లో కచేరీలు ,కనీస సంగీత జ్ఞానం లేని పిల్లల్ని కూడా “బాగానే ఉంది… కొంచెం… అంటూ ప్రోత్సహించి అలా అలా వారిని మంచి గాయకులుగా తయారు చేశావు. ప్రపంచమంతా తెలుగు వారే కాదు అన్ని భాషల వారికీ నన్ను పరిచయం చేసి మంత్రముగ్ధుల్ని చేశావు. నీ కర్తవ్యాన్ని దీక్షగా పూర్తి చేశావు. ఆత్మీయుల్ని సంపాదించుకున్నావు. సంగీతసంద్రంలో తడిసి పోతున్నావు. ధన్యజీవివి బాలూ!

లేదు. లేదు. నేను ధైర్యం తెచ్చుకుంటాను. భౌతికంగా నువ్వు లేవు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో నీ రూపం కళ్ళ ఎదుట కనిపిస్తుంది. నీ ప్రతిరూపం అందరి గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. నువ్వు భుజం తట్టి చెయ్యి పట్టి నడిపించిన ఎందరెందరో నిన్ను గురువుగా దైవంగా పూజిస్తూ నన్ను తమ అందరి గళాల్లో నీ రూపంగా నిలుపుకుంటారు.

జ్ఞాపకాలే మైమరపు
జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే ఓదార్పు
జ్ఞాపకాలే నిట్టూర్పు

ఇక్కడే నీ జ్ఞాపకాలు పంచుతూ, నీ లోటు ఎవరు తీర్చలేరు- కానీ నీలాంటి కొందరినైనా నీలా తయారు చేయాలని అన్వేషిస్తూ నీ ఆశయాన్ని కొనసాగిస్తా. బాలూ…

“తేరే మేరే బీచ్ మే కైసా హై బంధన్ అంజానా….”

ప్రియాతి ప్రియమైన
‌నీ
పాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here