కాజాల్లాంటి బాజాలు-70: విఫల ప్రేమికులవారం..

6
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]రెం[/dropcap]డ్రోజులక్రితం వదిన ఫోన్ చేసి హఠాత్తుగా “నీకెన్ని యేరియాలు కావాలీ!” అనడిగింది.

నాకేం అర్థం కాలేదు. “ఏరియా లేవిటి వదినా!” అన్నాను.

“అదే.. బిజినెస్ చెయ్యడానికి..” అంది.

“ఏం బిజినెస్సూ..”

“నేనొక కొత్త బిజినెస్ మొదలెట్టేను. అన్ని యేరియాలూ నేను కవర్ చెయ్యలేను కదా.. అందుకని కొన్ని నీకూ, కొన్ని మా చెల్లెలికీ, ఇంకొన్ని ఫ్రెండ్స్ కీ కేటాయిద్దామనీ..”

“అసలు సంగతేవిటో అర్ధమయ్యేటట్టు చెప్పు..” గట్టిగా అన్నాను.

“స్వర్ణా..ఫిబ్రవరి పధ్నాలుగు ప్రేమికులరోజు కదా.. అప్పటిదాకా అంటే ఏడోతారీకునించీ పధ్నాలుగోతారీకు దాకా వారం రోజులపాటు ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్లూ గట్రా యిచ్చుకుంటారు కదా.. ఆ తర్వాతనుంచి యింకోవారంపాటు విఫల ప్రేమికుల వారం జరుగుతుందన్న మాట.”

“హాఆఆఆఆ..” నాకు మతిపోయింది.

వదిన మాటలని మధ్యలోనే అందుకున్నాను.. “అదికాదు వదినా.. ప్రేమికులరోజు సంబరాలు చేసుకుంటారని విన్నాను కానీ ఈ విఫలప్రేమికులరోజు గురించీ, దానిక్కూడా సంబరాలు చేసుకుంటారన్న సంగతీ నాకసలు తెలీదు.”

“నాకూ ఇప్పుడే తెల్సింది. సంగతేంటంటే ఈ వారమంతా చాలామంది ప్రేమికులవారం జరుపుకున్నారు కదా! అదే ఒకరోజు రోజ్ డే అనీ, ఇంకోరోజు ప్రపోజ్ డే అనీ, మూడోరోజు చాక్లెట్ డే అనీ, నాలుగోరోజు టెడ్డీ డే అనీ, అయిదోరోజు ప్రామిస్ డే అనీ, ఆరోరోజు హగ్ డే అనీ, ఏడోరోజు కిస్ డే అనీ, మరింక ఆఖరిరోజు ఫిబ్రవరి 14 ప్రేమికులరోజనీ సంబరాలు చేసుకున్నారు కదా! దానికోసం వందరూపాయిలు ఖరీదు చేసే వస్తువుల్ని వెయ్యిరూపాయిలకమ్మినా కొనే పిచ్చి ప్రేమికులవల్ల వాళ్ల వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది.”

“అవునుకదా!..”

“కదా! కానీ కొంతమంది కిట్టనివాళ్ళు యిదంతా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు పెంచుకుందుకు వ్యాపారస్తులు చేసే హడావిడి అన్నా కూడా నిజంగా చెప్పాలంటే యిందులో తప్పేముంది చెప్పు. వ్యాపారం పెంచుకుందుకు యెన్నిరకాల ప్రకటనలూ, ప్రచారాలూ చెయ్యాలీ.. అందుకు తగ్గట్టే వాళ్లకి లాభాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తూంటాయి.”

“ఊ..”

“ఇదంతా చూస్తుంటే ఖాళీగా యింట్లో కూర్చున్న నాకు కూడా ఈ బిజినెస్ చెయ్యాలనిపించింది. కానీ ఇప్పటికిప్పుడు యిందులో వేలు పెడదామనుకున్న నేను పెద్ద పెద్ద వ్యాపారస్తులతో యెలా పోటీ పడగలనూ! అందుకని దీనిగురించి వివరాలు తెలుసుకుంటుంటే నాకు ఈ విఫల ప్రేమికులవారం గురించి తెల్సింది. దీనిగురించి యింకా బైట చాలామందికి తెలీదు. అందుకని అందరికన్నా ముందే మనం ఈ వ్యాపారం మొదలెడితే లాభాలు బాగుంటాయి.”

“ఇది మరీబాగుంది. ఎవరైనా సంబరాలు సంతోషంగా చెసుకుంటారు కానీ ప్రేమ విఫలమైతే సంబరాలెవరు చేసుకుంటారూ..” అన్న నన్ను గట్టిగా గదమాయించింది వదిన.

“స్వర్ణా, నేను చెప్పేది మాట్లాడకుండా పూర్తిగా విను. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయుందనుకో.. ఆ అమ్మాయికి ఒక్క అబ్బాయి మాత్రమే రోజ్ పట్టికెళ్ళి యివ్వడు కదా! కాలేజీలోనూ, చుట్టాల్లోనూ, స్నేహితుల్లోనూ చాలామంది అబ్బాయిలు ఆ అమ్మాయికి రోజ్ యిద్దామనుకుంటారు. కానీ ఆ అమ్మాయి ఒక్కళ్ళనే కదా ప్రేమిస్తుంది. మరి మిగిలినవాళ్ళంతా విఫల ప్రేమికులే కదా! వాళ్లన్నమాట మన టార్గెట్..”

కాస్త ఊపిరి పీల్చుకుంది వదిన. ఆ కాస్త సమయంలో నా అనుమానం అడిగేసేను వదినని.

“ప్రేమికులరోజు ముందు వారంరోజుల్నించీ రోజ్ డే అనీ, చాక్లెట్ డే అనీ ప్రేమని ప్రకటించుకునే రోజులుంటాయి కానీ అసలే విచారంలో వున్న ఈ విఫలప్రేమికులకి అలాంటి వేముంటాయీ..అసలే విచారంలోవున్నవాళ్ళు గిఫ్ట్స్ గట్రా యెందుకిచ్చుకుంటారూ!”

వదిన స్థిమితంగా నాకు అర్ధమయ్యేలా చెప్పసాగింది.

“నేనూ ఇవాళే చదివా నొకచోట. ప్రేమ విఫలమైనప్పుడు ప్రేమికులకు కలిగే ప్రతికూలమైన భావజాలం కలిగినవారినే విఫలప్రేమికులంటారు.

(ఏవిటో వదిన చెపుతుంటే పిల్లంటే మార్జాలమన్నట్టనిపించింది నాకు)

ప్రేమికులరోజుకి ముందు వారంరోజులూ ఒక్కొక్కరోజు ఒక్కొక్కదానికి కేటాయించినట్టే ఫిబ్రవరి 15 నుంచి 21 దాకా ఈ విఫలప్రేమికులకి ఒక్కొక్కరోజు ఒక్కొక్కదానికి కేటాయించేరుట. అవేంటంటే…

15న స్లాప్ డే,

16న కిక్ డే,

17న పెర్ఫూమ్ డే,

18న ఇంకేదో వుందమ్మా …మర్చిపోయేనూ..,

19న కన్ఫెషన్ డే,

20న మిస్సింగ్ డే,

ఇంక ఆఖర్న అంటే 21న బ్రేకప్ డే .

ఇలాగ మొత్తం వారంరోజులూ అయ్యేసరికి ఆ ప్రేమ విఛ్ఛిన్నం అయిపోతుందన్న మాట..”

నాకేంటో అంతా గందరగోళంగా అనిపించింది. “ఏంటి వదినా.. ఈ స్లేప్ డే ఏవిటీ.. కిక్ డే ఏవిటీ.. వీటికి గిఫ్ట్స్ ఏవిటీ.. ” అంటూన్న నన్ను వదిన ఆపింది.

“స్వర్ణా, పుట్టినరోజొచ్చినా, ప్రేమ సఫలమైనా సెలిబ్రేషన్ అంటూ అందరూ పార్టీలు చేసుకోరా. అలాంటప్పుడు బార్ల కెళ్ళి మందు కొట్టరా.. అదే ప్రేమ విఫలమైనప్పుడు విచారంగా అదే బార్‌కి వెళ్ళి అలాగే మందు కొడతారుగా.. దానికి గొప్ప ఎగ్జాంపుల్ దేవదాసేగా.. సంతోషానికైనా విచారానికైనా సెలిబ్రేట్ చేసుకునేది మందుతోనే. అందుకే కారణమేదైనా మందుకే గిరాకీ.. అలాగే ఇది కూడా.. రోజ్ డే నాడు ప్రేమికులు రోజ్ పువ్వునిస్తే అదే విఫల ప్రేమికుడు దానిని స్లేప్ డే గా భావించి యెదటివాణ్ణైనా కొడతాడు…లేదా తన్ని తనైనా కొట్టుకుంటాడు..”

“కానీ వదినా, లెంపకాయలు వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారా.. ఎదుటివాళ్లని కొడతారా..అసలింతకీ నువ్వు లెంపకాయలు యెలా అమ్ముతావూ..”

ఫక్కున నవ్వింది వదిన. “ఆ మాత్రం తెలీదూ.. ఒక అబ్బాయి అమ్మాయిని లెంపకాయ కొడుతున్నట్టూ, ఒక అబ్బాయి అమ్మాయిని లెంపకాయ కొడుతున్నట్టూ కార్టూన్లు గీయించేసి కింద కాప్షన్ రాసేసి కార్డింతని అమ్మేయడమే.. మిస్సింగ్ డే కయితే ఓ మనిషి శాలువా కప్పుకుని తాగి తూలుతున్న బొమ్మలు వేయించెయ్యడమే..పనిలో పని శాలువాలు కూడా హోల్సేల్ గా కొని బోల్డు లాభాలకి అమ్మేసుకోవచ్చు.”

నాకు నోరు తడారిపోయింది. అంటే కికింగ్ డే అంటే ఒకళ్లనొకళ్ళు తన్నుకుంటున్నట్టు బొమ్మలేయించేస్తుందేమో మా వదిన అనిపించింది. బ్రేకప్‌కి ఏం చెప్తుందో అనుకుంటూ అదే అడిగేను వదిన్ని..

“అదింకా సులువూ.. ఎలాగూ ప్రేమికులరోజుకి హార్ట్ షేప్‌లో వున్న బొమ్మలు గిఫ్ట్‌గా యిస్తారుకదా.. అవి బోల్డు మిగిలిపోయుంటాయి. వాటిని హాఫ్ రేటుకి కొనేసి, సగానికి కోసేసి, ఇద్దరికీ చెరోముక్కా పంపించెయ్యడమే..”

నాకు భూగోళం తిరిగిపోయినట్టనిపించింది. మళ్ళీ వదినే అంది.

“ఇంతకీ నీకింత ముందుగా ఎందుకు ఫోన్ చేసేనంటే అప్పుడప్పుడు నువ్వేదో గిలుకుతుంటావుకదా.. ఈ విఫల ప్రేమికుల రోజులన్నింటికీ పేర్లు ఇంగ్లీషులోంచి తెలుగులోకి మార్చిపెడతావనీ.. ఓ గంటలో అవి చేసి పంపించు.. నేను ఆ కాప్షన్లు పెట్టి బొమ్మలేయించేస్తాను. ఇంకా చాలా పన్లున్నాయి.. ఓ గంటలో పంపించెయ్యేం.” అంటూ ఫోన్ పెట్టేసింది వదిన.

వదినగారి ఆజ్ఞను మీరగలనా…ఇదిగో యిలా రాసా తెలుగులో..

15th February 2021: Slap Day – చెంపదెబ్బరోజు,

16th February 2021: Kick Day – కాలితో తన్నురోజు

17th February 2021: Perfume Day- పరిమళద్రవ్యము వాడు రోజు.

18th February 2021: Flirting Day – సరదాకబుర్ల రోజు

19th February 2021: Confession Day-అపరాధాంగీకార రోజు.

20th February 2021: Missing Day – తప్పిపోయిన రోజు.

21st February 2021: Break Up – విచ్ఛిన్నం చేసుకునే రోజు.

అన్నీ రాసేక నాకో డౌటనుమానం వచ్చింది.

ఇంతకీ స్లేప్ డే ని చెంపదెబ్బ రోజనాలా.. లేకపోతే లెంపకాయ రోజనాలా..

మళ్ళీ వదిన ఫోన్ చేసి ఇంకా పంపలేదే మంటుంది…

కాస్త తొందరగా చెప్పండీ..ప్లీజ్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here