Site icon Sanchika

విరిసిన తెల్లకాగితం

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘విరిసిన తెల్లకాగితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పి[/dropcap]లిచిన గాలికి ఆవైపు వొంగింది
చూసింది దేహం మనసై
నిమిరే మునివేళ్ళకు తెలిసింది
తొలికేకదే అద్భుత లోకమని

ఊరంటే
నాలుగు హద్దు రాళ్ళ లోపలి ఆవరణ కాదు
మమతలు లేని మనుషుల అడవీ కాదు
సొంతూరు
పడిలేచిన సంద్రం తిరుగాడిన లోగిలి
అనిర్వచనీయ భావోద్వేగాల జీవసంగమం

మట్టి వాసన పసిగట్టింది
ఈ పుట్టుక అచ్చంగా మట్టి ఒడి నీడని
సుందర ముంగురులై ఊగే
ఆకుపచ్చ నెచ్చెలి వెచ్చని ఊపిరని

ఊహల బొమ్మ ప్రాణం
విరిసిన ఆశల తెల్లకాగితం
ఎంత గొప్ప పరిచయం నాదీ నా జన్మది

పుట్టుక నేస్తం ఊరంటే నాకు
మా అమ్మ అంతరంగం

ఏంచేసినా తీరని శాశ్వత
ఋణమిది ఉండనీ
ఇలాగే ఈ బంధం కాలంలో
ఏ మట్టీ మనసూ రాయని కమ్మని కావ్యం

Exit mobile version