Site icon Sanchika

వర్చ్యువల్ మ్యారేజ్

[dropcap]”ఏ[/dropcap]మోయ్, ఇంకా ఏం చేస్తున్నావు? పెళ్లికూతురు గౌరి పూజ చేస్తోంది. రా రా తొందరగా” అన్నారు నారాయణరావు గారు.

ఆయన ఎర్రంచు జరీ తెల్ల పంచె, తెలుపు షర్ట్ వేసుకున్నారు.

“వస్తున్నా, అయిపొయింది, పట్టుచీర రంగు గాజులు ఉండాలి. కనిపించట్లేదు” గాజుల బాక్స్‌లో వెతుక్కుంటూ అంది లక్ష్మీదేవి.

“మీ ఆడవాళ్ళకి ఎంత టైమిచ్చినా చాలదోయ్. నేను చూడు పొద్దున్నే ఏడింటికే రెడీ అయిపోయా” అన్నారాయన.

“ఆ… మీరేమైనా జడ వేసుకోవాలా, నగలు పెట్టుకోవాలా, చీర కట్టుకోవాలా! ఓ పంచె, చొక్కా తగిలించుకోవటం ఎంతసేపు?” అంటూ వెతుకుతూనే ఉంది.

“రావోయ్, టైమవుతోంది” అంటూ పెళ్లి చూడ్డానికి వెళ్లిపోయారు నారాయణ రావు గారు.

‘అమ్మయ్య, దొరికాయి ఆకుపచ్చ గాజులు’ అనుకుంటూ రెండు చేతులకు బంగారు గాజుల మధ్య పచ్చ గాజులు వేసుకుని ఆకుపచ్చ రంగు ఉప్పాడ చీరతో పేరుకు తగ్గట్లు లక్ష్మీదేవిలా తయారైయి వచ్చింది.

“హల్లో నానమ్మా, తాతయ్య! పెళ్లికి వెళుతున్నట్లే తయారైపోయారు ఇద్దరూ. నువ్వైతే మరీ నానమ్మా, పట్టుచీర, నెక్లెస్, హారాలు ఇంట్లో కూర్చుని చూసే పెళ్ళికి ఇవన్నీ అవసరమా?” అన్నాడు మనవడు వెంకట్.

“అలా అనకురా, పెళ్ళికి వెళ్లినట్లు తయారవకపోతే ఇంట్లో చూసేదైనా చూసినట్లుండదు” అంది లక్ష్మీదేవి.

నారాయణ రావు గారి తమ్ముడి మనవరాలి పెళ్లి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇరువైపులా కుటుంబ సభ్యులు కాక, అతి ముఖ్యమైన బంధువులు పెళ్ళికి వచ్చారు. మిగతా వాళ్లందరికీ లైవ్ వీడియో పెట్టారు. నారాయణ రావు గారు అతి ముఖ్యమైన వ్యక్తి. ఇంటి పెద్ద. తమ్ముడు మాధవరావుకి అన్నగారంటే విపరీత మైన ప్రేమ, గౌరవం. అన్న, ఒదినలు లేకుండా వాళ్ళింటి ఏ ఫంక్షన్ జరగదు. నారాయణ రావు గారి వయసు రీత్యా కరోనా టైంలో ఇబ్బంది పెట్టకూడదని ఊరుకున్నారు. పెళ్లి మొదటి నుంచి చూడమని అన్న, ఒదినలకు మాధవరావు మరీ మరీ చెప్పాడు. పొద్దుటి నుంచి అదే హడావుడి ఆ ఇంట్లో!

లక్ష్మీదేవి, నారాయణ రావు పెళ్లి చూస్తున్నారు. కోడలు హరిత వంట పనిలో ఉంది. కొడుకు శ్రీరాం ఆఫీసుకు రెడీ అవుతున్నాడు. “బాబూ, ఇవాళ సెలవు పెట్టరా. పెళ్లి చూడచ్చు” అంది లక్ష్మీదేవి.

“కుదరదమ్మా, ఆఫీసులో  పని  ఎక్కువగా ఉంది. ఆరుగురు కరోనాతో సెలవులో ఉన్నారు. ఇలాంటప్పుడు పెళ్లి కోసం లీవ్ అడగటం బాగోదు. అడిగినా ఇవ్వరు. నేను మాధవ బాబాయితో రాత్రి మాట్లాడానులే. మీరు చూడండి” అన్నాడు శ్రీరాం. వెంకట్‌ని మాత్రం ఎక్కడకు వెళ్లకుండా ఇంట్లోనే వాళ్ళ దగ్గరే ఉండమని, పెళ్లి వీడియోలో ఇబ్బంది ఏదైనా వస్తే చూడమని గట్టిగా చెప్పి శ్రీరాం ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. హరిత అత్త గారికి, మామగారికి టిఫిన్ ఇచ్చింది. వాళ్ళు పెళ్లి చూస్తూ తింటున్నారు.

“ఒరే బాబు, రాజు తాతయ్య వాళ్ళు పెళ్ళి చూస్తున్నారో లేదో, ఓసారి ఫోన్ చేయరా” అన్నారు నారాయణ రావు గారు మనవడితో. రెండు సందులవతల నారాయణ రావు గారి చిన్నాన్న కొడుకు రామరాజు వున్నాడు.

వెంకట్ ఫోన్ చేసి ఇచ్చాడు. రామరాజు భార్య జానకి తీసింది. “ఏమమ్మా! చిన్నారి పెళ్ళి చూస్తున్నారా?” అడిగారు నారాయణ రావు గారు.

“ఎక్కడ బావగారు, పనవలేదు ఇంకా. కొడుకు కోడలు ఇప్పుడే వెళ్లారు. ఫోనులో పెట్టి వెళ్ళాడు వాడు. ఆయన చూస్తున్నారు. కాని మాకు అంత బాగా రావట్లేదు” అంది.

“అదేంటమ్మా ఇంట్లో కూర్చుని కూడా చూడకపోతే ఎలా? మాధవుడు ఎన్ని సార్లు చెప్పాడు చూడమని? మనం వెళ్ళనందుకు ఎంత బాధ పడుతున్నాడో!సరే. మీరిద్దరూ ఉన్న పళాన వచ్చెయ్యండి. ఇక్కడే భోజనాలు. రాజుతో చెప్పు. ఇక్కడ టీ.వి.లో చక్కగా వస్తోంది పెళ్లి రండి” అన్నారు నారాయణ రావుగారు.

జానకమ్మ భర్తతో చెప్పింది. “అన్నయ్య చెప్పాక వెళ్లకపోతే ఎలా, పద, అక్కడే చూద్దాం సరదాగా” అన్నాడు రామరాజు.

నారాయణ రావు గారు వంటింట్లో కొచ్చి “అమ్మా, నువ్వు చూడవా?” అన్నారు కోడలుతో.

“అయిపోయింది మామయ్యగారు, వస్తాను. మీరు చూస్తూ వుండండి” అంది.

“మరి, రాజు, జానకి వస్తున్నారు ఇక్కడే భోజనం అన్నాను. నీకు పనేక్కువైపోతుందేమోనమ్మా” అన్నారు నారాయణ రావు గారు.

“అయ్యో! ఇదేం పెద్ద పని మామయ్య గారు! ఇద్దరేగా. అందరం కలిసి పెళ్ళి భోజనం చేద్దాం” అంది హరిత.

“మీ అత్తగారి సాయం ఇవాళ ఏం ఉండదమ్మా. మధ్యలో ఒకసారి కూడా ఇటు తొంగి చూడదు” అన్నారాయన.

“ఏం ఫరవాలేదు మామయ్య గారు, ఈ మాత్రం వంటకి సాయం అక్కరలేదు. నేను చేస్తాగా మీరు కంగారు పడకండి” అంది హరిత.

నారాయణరావు గారికి బంధు బలగం, బంధు ప్రీతి రెండు ఎక్కువే! ఇరువైపులా ఏ చిన్న శుభకార్యమైనా వదలకుండా వెళతారు ఇద్దరూ. కొడుకు, కోడలు ఊళ్ళో జరిగే వాటికి మాత్రం వెళుతూ ఉంటారు. అత్తగారు, మామగారు చిలకా గోరింకల్లా అలా శుభాలకి, అశుభాలకి అన్నింటికీ వెళ్ళటం చూస్తే హరితకి ముచ్చటగా ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు వాళ్ళు. అందుకే ఆరోగ్యంగా ఉంటారేమో! తననీ బాగా చూస్తారు. అత్తగారు పనిలో సాయం చేస్తారు. ఈ పెళ్ళికి వెళ్ళేవారే! కరోనా కల్లోలంలో కొడుకు వెళ్ళటానికి వీళ్లేదని అనటం, అక్కడ తమ్ముడి కొడుకులు కూడా అదే అనటంతో ఆగిపోయారు.

రామరాజు, జానకి వచ్చేసారు. “రండి, రండి, సరిగ్గా సమయానికి వచ్చారు. అమ్మాయిని బుట్టలో మేనమామలు తీసుకొస్తున్నారు” అంటూ ఆహ్వానించింది లక్ష్మీదేవి.

పెళ్లికూతురి చెల్లెలు శ్రీలక్ష్మి “నానమ్మా, చూస్తున్నారా” అంటూ ఫోన్ చేసింది.

“చూస్తున్నాం, ఇదిగో రాజు తాతయ్య, జానకి కూడా వచ్చారు. అందరం కలిసి చూస్తున్నాం” అంది లక్ష్మీదేవి.

“స్టేజి మీద పక్కన నిల్చున్నాడు, ఎవరే ఆ అబ్బాయి?” అంది లక్ష్మీదేవి.

“ఆ అబ్బాయా, పెళ్ళికొడుకు తమ్ముడు”

“బాగున్నాడే, నీకు సరిపోతాడు” అంది లక్ష్మీదేవి.

“పో నానమ్మా, ఆ అబ్బాయి నాకన్నా చిన్నవాడు” అంది శ్రీలక్ష్మి.

“అదిసరే కాని ఏ చీర కట్టుకున్నావు? చాలా బాగుంది” అంది శ్రీలక్ష్మి.

“నేను ఆకుపచ్చ ఉప్పాడ పట్టుచీర, జానకి గద్వాల నేతచీర” అంది లక్ష్మీదేవి.

“ఫోటో తీసి పెట్టమను వెంకట్‌ని. అమ్మకు చూపిస్తాను. నా ఫ్రెండ్స్ నీరజ, లలిత, ధీరజ్ వాళ్ళు తెలుసుగా నీకు. వాళ్లంతా వచ్చారు వాళ్లకు చూపిస్తా. మధ్యాహ్నం అమ్మతో వీడియో కాల్ చేయిస్తా అని” అక్కడున్న అందరిని ఒకసారి పలకరించేసి ఫోన్ పెట్టేసింది శ్రీలక్ష్మి.

“సరే సరే” అంది లక్ష్మీదేవి. “ఒరే నాన్నా, ఫోటో తీయరా మాకు శ్రీలక్ష్మి పంపమంది” అంటూ వెంకట్‌ని పిలిచింది. వెంకట్ ఫోటో తీసి పంపాడు.

హరిత వంట చేస్తూ మధ్య మధ్యలో పెళ్ళి చూస్తోంది. శ్రీలక్ష్మిమళ్ళీ ఫోన్ చేసి వీడియోలో “ఇదుగో నానమ్మా, తాతయ్యలు, కిరణ్ అన్నయ్య పెళ్ళికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు కదా ఒంట్లో బాగుండలేదని. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి కరోనా నెగటివ్ అని. వచ్చాడు చూడండి” అని చూపించింది. కిరణ్ చేయూపాడు. “పోన్లే నాయనా, దేవుడి దయ. నీకేం కాలేదు. పెళ్ళికి ఇంకా సందడి వచ్చింది ఇప్పుడు” అంటూ లక్ష్మీదేవి ఇంకా అందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. పెళ్లికూతురుకి కిరణ్ చిన్నాన్న కొడుకు.

మంగళ సూత్రధారణ అయింది. అందరూ అక్షింతలు వేస్తున్నారు. లక్ష్మీదేవి ఇంట్లోనుంచి అక్షింతలు తెచ్చి అందరికీ ఇచ్చి టీ. వి. మీద వేసింది.

“నానమ్మా, టీ.వి. పాడవుతుంది. ఏమిటి నీ చాదస్తం మరీ ఎక్కువవుతోంది” అన్నాడు వెంకట్ విసుగ్గా.

అందరు నవ్వుకున్నారు.

తలంబ్రాల సన్నివేశంలో అక్కడున్నట్లు గానే అయిపోయి పెళ్లికూతుర్ని నలుగురు పెద్దవాళ్ళు “నువ్వు ముందు పొయ్యి, తగ్గకు” అంటూ అమితంగా ఉత్సాహ పరిచేసారు.

“ఏమండీ, మనం పంపిన డబ్బులు చదివిస్తారా?” అంది లక్ష్మీదేవి.

“వెళ్లినవాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టటమే కాని పంపిన డబ్బులు చదివించరు ఒదినా” అన్నాడు రామరాజు.

“మనం గుర్తింపు కోసం పంపామా, మన సంతోషం కోసం దీవెనల రూపంలో పంపాము” అన్నారు నారాయణ రావు గారు.

“నిజమే లెండి” అంది ఒప్పుకుంటూ లక్ష్మీదేవి.

కాని మాధవరావు గారు పురోహితుడి చెవిలో ఏదో చెప్పాడు.

పురోహితుడు మైకులో పెళ్లికుమార్తె పెద్ద తాతగారు నారాయణ రావుగారు, నానమ్మ లక్ష్మీదేవి వధువుని దీవిస్తూ పంపిన ఐదు వేలు అని చెప్పి అక్షింతలు వేశారు. అలాగే చిన్న తాత రామరాజు, నానమ్మ జానకి దీవిస్తూ పంపిన మూడు వేలు అని చెప్పి అక్షింతలు వేసాడు. వధూవరులు తమ వంక చూస్తూ నమస్కరిస్తున్నట్లే అనిపించి లక్ష్మీదేవి, జానకమ్మలకి ఆనందభాష్పాలు వచ్చాయి. చేతులెత్తి నలుగురు దీవించారు.

“ఎంత ప్రేమో మాధవుడికి మనమంటే. గుర్తు పెట్టుకుని చదివించాడు” అంది లక్ష్మీదేవి.

హరిత టొమోటో పప్పు, దొండకాయ ఫ్రై, కొబ్బరి పచ్చడి, సాంబారు, రవ్వకేసరి, పులిహోర చేసింది. “ఎప్పుడు చేసావు ఇవన్నీ, ఇక్కడే ఉన్నట్లున్నావు” అంటూ ఆశ్చర్యపోతు ఆనందంగా పెళ్లి భోజనం అందరూ చేస్తుంటే, స్క్రీన్ మీదకి పెళ్ళికొడుకు తల్లి వచ్చి “రేపు సత్యనారాయణ స్వామి వ్రతం మా ఇంట్లో. లింక్ పెడతాము. అందరూ చూసి వధూవరులను దీవించండి” అంటూ ఆహ్వానించింది.

“ఓ, మళ్ళీ రేపు ఉందా ఫంక్షన్” అని వెంకట్ అంటుంటే అందరూ నవ్వుకున్నారు.

Exit mobile version