[box type=’note’ fontsize=’16’] “ధనాపేక్షతోనే కాకుండా కంపెనీలు మానవతా దృక్పథంతోనూ వ్యవహరించి పరస్పరం సహకరించుకొన్ననాడు ఇటువంటి మహమ్మారులను నిలువరించడంలో, మానవాళి అలవోకగా విజయం సాధించగలుగుతుంది” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]
[dropcap]ఏ[/dropcap]దైన రోగం బారిన పడిన వ్యక్తి శరీరంలో ఆ రోగాన్ని కలుగజేసిన క్రిమిని ఎదుర్కోవడానికి తయారైన ఏంటీబాడీలు ఆ రోగి రక్తంలో చాలాకాలం పాటు ఉంటాయి. ప్లాస్మాలో కొన్ని నెలలు, ఏళ్ళబాటు ఉండే ఆ ఏంటీబాడీలను రోగనిరోధకాలుగా వినియోగించే అవకాశాలను చైనా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ‘కన్వల్సంట్ సిరమ్’గా పిలువబడే ఈ ప్లాస్మాతో చికిత్స కొంచెం జాగ్రత్తగా చేపట్టవలసి ఉంటుంది. ప్లాస్మాను ఎక్కించండంలో అరుదుగానైనా ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జెఫ్రీ హండర్సన్, జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఆర్టుకో వంటి వారు ఈ ప్రక్రియ పట్ల ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా, ఇజ్రాయేల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒకటేమిటి వనరులు సిద్దంగా ఉన్న దేశాలన్నీ వాక్సిన్ రూపకల్ప ప్రయోగాలలో తలమునకలుగా ఉన్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్, పైబర్, గ్లాస్కో వంటి కంపెనీలు, మన దేశంలో సిరమ్ ఇనిస్టిట్యూట్, కాడిలా వంటి సంస్థలు వాక్సిన్ తయారీ దిశగా పోటీపడుతున్నాయి. కరోనా వైరస్‍ను నిరోధించే దిశగా దాదాపు 30 వాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అతికొద్ది సమయంలోనే ఆ సంఖ్య 100కు చేరిపోయింది.
సాధారణంగా ఏదైన వాక్సిన్ తయారైన తరువాత ప్రయోగదశలన్నిటిని దాటుకొని క్లినికల్ ట్రయల్స్ వరకూ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా రెండు మూడు దశల్లో సాగుతాయి. ఆ దశలన్నిటినీ దాటుకొని సురక్షితమైనదని నిర్ధారింపబడిన తరువాతే వాక్సిన్ అందుబాటులోనికి తేవడానికి అనుమతులు లభిస్తాయి. ఈ తతంగం అంతా పూర్తి కావడానికి ఇంచుమించు పది సంవత్సరాలు పడుతుంది.
అయితే విజృంభిస్తున్న వ్యాధులు, తొందర పెడుతున్న అవసరాలతో బాటుగా విస్తరించిన వైద్యవిజ్ఞానం చలువతో ఆ సమయం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ‘ఎబోలా’కు వైరస్‍కు వాక్సిన్‍ను 5 సంవత్సరాలలోనే అందుబాటులోని తేగలిగారు. ‘జికా’ వైరస్‍కు వాక్సిన్‍ను రెండు సంవత్సరాలలోనే విడుదల చేయగలిగారు. ప్రస్తుతం కరోనాకు ఒక ఏడాది లేదా ఏడాదిన్నరలోగానే వాక్సిన్‍ను అందుబాటులోకి తేవడానికి దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి.
కరోనాకు సంబంధించి ఇప్పటికి రమారమి 100 రకాల వాక్సిన్లు తయారీ విధానంలోని వివిధ దశలలో ఉన్నాయి. మన దేశంలో కూడా విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే యు.ఎస్., బ్రిటన్, జర్మనీ, చైనా వంటి దేశాల నుండి ఏడు రకాల వాక్సిన్లు మనుష్యులపై (వలంటీర్లు) ప్రయోగాల వరకు రాగా మనదేశంలో ఆ దశకు రాలేదు. ఏది ఏమైనా అంతిమంగా కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోనగలనని నిరూపణ అయితే 2021 నాటికి వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అయితే ధనాపేక్షతోనే కాకుండా కంపెనీలు మానవతా దృక్పథంతోనూ వ్యవహరించి పరస్పరం సహకరించుకొన్ననాడు ఇటువంటి మహమ్మారులను నిలువరించడంలో, మానవాళి అలవోకగా విజయం సాధించగలుగుతుంది.