విరుగుడు

29
2

[dropcap]“ఈ[/dropcap] ప్రపంచంలో అన్నీ సమస్యలకు మూల కారణం ఏమిటో తెలుసా?”

ప్రొఫెసర్ పరబ్రహ్మం అలా అడిగాడంటే ఓ గంట ఉపన్యాసం ఉంటుందని నాకు తెలుసు. అంతే కాదు ఆయన ప్రయోగం కీలక దశకు చేరుకున్నదని సూచన అది. అందుకే ఓ గంట ఉపన్యాసం ఉంటుందని మానసికంగా సిద్ధమయిపోయాను.

ప్రొఫెసర్ ప్రరబ్రహ్మం నేను ఉద్యోగరీత్యా మాయాపురం రావటంతో పరిచయం అయ్యాడు. అది పనిష్మెంట్ పోస్టింగ్. ఉద్యోగం చేయటమంటే వెన్నెముక లేనట్టు, మెదడు ఎదగనట్టు ఉండాలని నాకు అర్థమయ్యేసరికి మాయపురం వచ్చి పడ్డాను. మాయాపురంలో నాకు పనేం లేదు. పనిష్మెంట్ పోస్టింగ్ కాస్తా ‘ప్లెజర్ ఔటింగ్’గా అయింది. ఉదయం లేవటం – చెట్లు, పుట్టలు, గుట్టలు, అడవులో తిరగటం, తినటం, పుస్తకాలు చదవటం. – ఇది నా పని.

ఇలా హాయిగా కాలం గడచిపోతున్న సమయంలో ప్రొఫెసర్ పరబ్రహ్మం పరిచయమయ్యాడు. ‘మాయాపురం’లో ఇంగ్లీషు పుస్తకాలు చదివేవాడు ఆయనే. కానీ ఆయనతో  మాట్లాడటం అంటే, ఆయన చెప్పిన ప్రతీ దానికీ మనం ‘ఊ’ కొట్టడమే. మనం మధ్యలో ఏదైనా చెప్పబోతే ఆయన వినడు. “అది కాదు, నీకేం తెలుసు. నోర్మూసుకుని చెప్పింది విను” అంటాడు.

ఆయన పెళ్లి చేసుకోలేదు. బంధువులందరితో తెగతెంపులు చేసుకున్నాడు. రిటైర్మంట్ డబ్బులతో మాయాపురం పొలిమేరల్లో ఇల్లు కట్టుకున్నాడు. పెన్షన్ వస్తుంది. ఇంటి నిండా పుస్తకాలు, సినిమాలు, సంగీతం సీడీలు.

ఆయన ఇచ్చే పుస్తకాల కోసం ఆయన ఉపన్యాసాలు భరిస్తాను. కానీ ఆ పుస్తకాలు ఆయన దగ్గర నుంచి తీసుకోవటం ఓ యజ్ఞం.

పుస్తకాలు చూపిస్తాడు. ఇవ్వడు. పుస్తకం గురించి చెప్తాడు. తప్పకుండా చదవాలి అంటాడు. చేతికిస్తాడు, లాక్కుంటాడు. ఇరవై పుస్తకాలు చూపిస్తాడు. ఒకటీ ఇవ్వడు. చివరకి నిరాశగా వెనుదిరుగుతుంటే అతి కష్టం మీద ఒక్క పుస్తకం ఇస్తాడు. అది తిరిగిస్తే ఇంకోటి ఇస్తానంటాడు. తిరిగి ఇస్తుంటే పుస్తకం గురించి సవాలక్ష ప్రశ్నలు వేస్తాడు. ఏ మాత్రం సరైన సమాధానం ఇవ్వకున్నా రెండు గంటలు ఉపన్యాసం ఇస్తాడు. ఇంకో పుస్తకం ఇవ్వనంటాడు. ఇదే మరోసారి సరిగ్గా చదవమంటాడు. చివరికి మరో పుస్తకం ఇస్తాడు.

ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు అమూల్యమైనవి. వాటి కోసం అన్నీ భరిస్తుంటాను.

ఒక రోజు ఇలాగే మాటల సందర్భంలో “ప్రపంచంలో అన్నీ సమస్యలకూ మూల కారణం ఏమిటో తెలుసా?” అని అడిగాడు.

నేను సమాధానం చెప్పబోతూంటే తిట్టి తనే చెప్పాడు.

“’అహం’. అహం నశిస్తే ప్రపంచంలో సమస్యనే ఉండదు.  అహం అంటే నేను నాది అనే భావన. అహాన్ని నశింపచేసుకోవాలని అందరూ  చెప్తారు. ఏవేవో పద్ధతులు చెప్తారు. కానీ అహం అనేది పెరుగతోంది తప్ప తరగటం లేదు. అహం వద్దని చెప్పిన వాడి అహం దెబ్బతిన్నదని అతడి అనుచరులు హింసకు దిగటం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు అహం అణచి వేసేందుకు చెప్తున్న పద్ధతులేవి, అహాన్ని అణిచివేసేందుకు పనికిరావని అర్థమవుతోంది. రోగం ఒకటయితే, ఇంకో దానికి మందు వేస్తే రోగం తగ్గటం అటుంచి కొత్త రోగాలు పుట్టుకు వస్తాయి. అందుకే ఒక్కడు  ‘అహం వదలండి’ అని   పద్ధతులు సూచించగానే కొత్త రకం వికృతులు, కొత్త రకం హింస, కొత్త రకం అశాంతి సమాజాన్ని తరతరాలుగా అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈలోగా ఇంకోడెవడో వస్తాడు. ఇంకేదో చెప్తాడు. రోగం మానదు. కొత్త మందు వేసినపుడల్లా కొత్త రోగాలు పుట్టుకొస్తాయి అన్నట్టు ప్రపంచంలో అశాంతి పెరుగుతోంది.”

“అంటే అహం అణుచుకోవటానికి ఇప్పుడున్న పద్ధతులన్నీ తప్పంటారు?” అడిగాను.

“తప్పా, తప్పున్నర! అందుకే ఇలా అశాంతి పెరుగుతోంది.”

“మరి అసలు పద్ధతి ఏమిటి?”

“అదే నేను పరిశోధిస్తున్నాను. రా.. చూపిస్తా” అంటు అంత వరకూ నన్ను పిలవని గది వైపు దారి తీశాడు.

ఆ గదిలోకి అడుగు పెడుతుంటేనే అది ప్రయోగశాల లాంటిదని అర్థమయిపోయింది. కాని అహం అన్నది అభౌతికమైన భావన. దానికి భౌతిక ప్రయోగాల ద్వారా పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నించటం అసంబద్ధం అనిపించింది. ప్రొఫెసర్‌తో అదే అన్నాను.

“తెలిసీ తెలియకుండా మాట్లాడకు” చిరాకు పడ్డాడు.

నేను నోరు మూసుకున్నాను.

“మనిషి ఏమిటి?” అడిగాడు.

నేను మాట్లాడలేదు.

“మనిషి మూలకాల సంయోగం. కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. జీన్స్ ఏమిటి? రసాయనాలు. కెమికల్స్. నువ్వు తినే ఆహారం ఏమిటి? రసాయనాలు. నీ శక్తి ఏమిటి? ఈ రసాయనాలు, మూలకాలు. ATP అంటే తెలుసా?”

“అడినోసైన్ ట్రై ఫాస్పేట్. ఇదొక రసాయనం. ఇది చాలా ప్రాధాన్యం వహిస్తుంది. శరీరంలో జరిగే ప్రతి చర్యకు  శక్తిని విడుదల చేస్తుందీ కెమికల్. ఇది మైటోకాండ్రియాలో ఉంటుంది” గబగబా చెప్పాను.

“చిన్నప్పుడు పాఠాలు బాగా బట్టీ పట్టినట్టున్నావు. ఒక కెమికల్ అభౌతికమైన శక్తిని విడుదల ఎలా చేస్తుంది నీ మట్టి బుర్రకిప్పుడయినా తట్టిందా?’

“శక్తి అభౌతికమా  ?”

“మరి భౌతికమా ? శక్తి ప్రభావ ఫలితం భౌతికంగా కనిపిస్తుంది. రాయి కదలుతుంది. ఆకు ఆడుతుంది. శబ్దం వినిపిస్తుంది. నీరు ప్రవహిస్తుంది. ఎత్తున ఉన్న రాయిది స్థలం వల్ల కలిగే శక్తి ‘పొటెన్షియల్ ఎనర్జీ’. ప్రవహించే నీటిది కదలిక శక్తి. ‘కైనేటిక్ ఎనర్జీ.’ శబ్దం సౌండ్ ఎనర్జీ. వెలుతురు లైట్ ఎనర్జీ. వేడి హీట్ ఎనర్జీ. మనం శక్తి అంటున్నది అంతా భౌతికంగా కనబడే ఫలితమే. కానీ శక్తి అన్నది అభౌతికం. ఎలాగ నీ ప్రాణం అభౌతికమో.  మెదడున్న చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తుంది.”

నేను మౌనంగా ఉండిపోయాను.

“అలాగే అహం కూడా ఒక భావం. దాని ఫలితం మనకు భౌతికంగా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పు శక్తిని నియంత్రించే రసాయనాలు అహాన్ని నియత్రించలేవా?”

“మోకాలికీ బోడిగుండుకీ ముడి పెడుతున్నట్టున్నారు” కసిగా అన్నాను.

“నీకు బోడి గుండు అయిన తరువాతే రా, ముడి పెడతాను. మానసిక వైద్యులు ఏం చేస్తారు? మందుల రూపంలో కెమికల్స్ ఇవ్వటం వల్ల శరీరంలో సరిగ్గా తయారవని కెమికల్స్ తయారయ్యేట్టు చేస్తారు. అవి మెదడును నియంత్రిస్తాయి. కోపం, అందోళన, అసహనం, నిరాశ వంటి వాటన్నింటినీ నియంత్రిస్తాయి. మనిషి వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి. ఆలోచనా విధానాన్ని నియంత్రిస్తాయి. అలాంటప్పుడు రసాయనాల సమ్మేళనం ఎందుకని అహాన్ని నియంత్రించలేదు?” అడిగాడు.

“అహం భావమైనా, అది జన్యు సంబంధమైనది. కొందరికి పుట్టుకతో అహం ఉంటుంది. కొందరికి సగంలో పెరుగుతుంది. కొందరికి ఏం చేసినా అహం ఉండదు…” ఇంకా చెప్పుబోతున్న నా మాటలను అడ్డు వచ్చాడు.

“అహం అహమే. ముందుండటం, తరువాత లేకపోవటం అంటూ ఉండదు. తెలీని వాడివి   తెలియనట్టుండు. నాది అంటే అహమే. ఇంత తెలియని వాడివి నీకు నా పుస్తకాలు ఇవ్వను” అని ఆ రోజు నన్ను పంపించేసాడు.

అప్పటి నుంచి ఆయన ఏమన్నా నేను ఒక్క శబ్దం కూడా నోటి నుండి రానివ్వటం లేదు. ఆయన కూడా అప్పుడప్పుడు తన పరిశోధన ఏ స్థాయిలో ఉందో చెప్పేవాడు తప్ప  ఆ ప్రసక్తి ఎక్కువగా తీసుకురాలేదు. అందుకే ఇవాళ నన్ను చూడగానే ఆయన ‘అహం’ ప్రసక్తి తీసుకరాగానే నోరు కట్టేసుకుని ఉపన్యాసం వినేందుకు సిద్ధమయిపోయాను.

కానీ ఆశ్చర్యంగా ప్రొఫెసర్ పరప్రహ్మం ఉపన్యాసం ఆరంభించలేదు.

నేను అతని ప్రశ్నకు సమాధానం చెప్తానేమోనని కాసేపు చూశాడు. నేనేమి అనకపోయేసరికి తనే అన్నాడు.

“నాతోరా…. నీకొకటి చూపిస్తాను” అంటూ అతని ప్రయోగశాలలోకి దారి తీశాడు. ప్రయోగశాల అంతా గందరగోళంగా, చిందర వందరగా ఉంది.

అతను ఏవేవో చూపిస్తూ ఏదో చెప్తున్నాడు కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు అసలు అతను నన్ను లోపలకు ఎందుకని పిలిచాడో అర్థం కాలేదు.

ఆ గదిలో పంజరాల్లొ వున్నజంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. బద్ధ శత్రువులుకూడా పక్క పక్కనే వున్నా ఏమీ పట్టనట్టు నిరాసక్తంగా వున్నాయి.

నేను ఆవిషయం అడిగేలోగా  “ఇటు చూడు” అంటూ పరబ్రహ్మం కదిలాడు. ఆ కదలికలో అతని చెయ్యి ఓ టెస్ట్‌ట్యూబ్‌కి తగిలింది. అది క్రింద పడింది. నయం ముక్కలు కాలేదు. దాన్ని తీసి ఇచ్చాను.

“అక్కడ పెట్టు” అన్నాడు.

ఆయన చూపిన చోట పెట్టాను.

“నువ్వు క్రితం సారి ఏదో పుస్తకం అడిగావు కదా! నాకు పనికిరాదా పుస్తకం. నీకే ఇచ్చేస్తున్నాను” అంటూ లైబ్రరీలోకి దారి తీశాడు.

అతడి ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. అతడి నడకలో ఏదో ఉత్సాహం, ఉద్వేగం కనిపిస్తున్నాయి. మాటల్లో కూడా. ఎప్పటి లాగే ఎమోషనల్‌గా, వేగంగా మాట్లాడుతున్నా ఏదో ఉత్సాహం కనిపిస్తోంది.

నేను ఎన్ని నెలలుగా అడుగుతున్నా, ఆయన ఇవ్వటానికి ఇష్టపడని పుస్తకం ‘ఫాస్టస్’ ఇచ్చాడు.

“నువ్వే ఉంచేసుకో” అన్నాడు.

పుస్తకం చేతిలోకి తీసుకుంటుంటే తల తిరిగినట్టనిపించింది. పుస్తకం చేతిలోంచి జారిపోయింది.

“అయ్యో ఏమైంది?” ఆందోళనగా అడిగాడు ప్రొఫెసర్ పరబ్రహ్మం.

ఏదో చెప్పాలనుకున్నాను. తల తిరుగుతున్నట్టనిపించింది. కడుపులో తిప్పినట్టయింది.

ఫ్రొఫెసర్ నన్ను కుర్చీలో కూర్చో బెట్టాడు.

గబగబా పగెత్తుకు వెళ్ళి నీళ్లు తెచ్చిచ్చాడు.

నీళ్లు చేదుగా అనిపించాయి. కానీ అవి తాగిన తరువాత కొంచెం కుదుట పడ్డాను.

“ఏమైంది?” అడిగాడు.

“ఏమో… ఇప్పుడు బాగానే ఉంది” అన్నాను. నిజంగానే బాగానే ఉంది.

పుస్తకం తీసి ఇచ్చాడు.

దాన్ని తాకాలంటే భయం అనిపించింది. “వద్దు లెండి. నేను మళ్లీ తీసుకుంటాను” అన్నాను.

“పర్లేదు… తీసుకో, ఎప్పటి నుంచో అడుగుతున్నావు” చేతుల్లో కుక్కాడు.

పుస్తకం పట్టుకున్నాను, ఏమీ కాలేదు. నవ్వుకున్నాను. కానీ ప్రొఫెసర్ దృష్టి వేరే వైపు ఉన్నప్పుడు పుస్తకం ఆయన కంట పడకుండా సోఫా క్రిందకు త్రోశాను.

ఏమీ తెలియనట్టు బయటపడ్డాను.

ఇంటికి వచ్చిన తరువాత భోజనం కూడా చేయకుండా పడి గాఢంగా నిద్రపోయాను. మళ్లీ మెలుకువ వచ్చేవరకు నేను కదలలేదు.

మెలకువ వచ్చిన తరువాత కాస్సేపు నేను ఎక్కడ ఉన్నాను? ఎవరిని? అన్నది గుర్తుకు రాలేదు. కానీ లేవాలనిపించలేదు. అలాగే పడుకుని ఉండాలనిపించింది.

లేచి అలవాటు ప్రకారం పేస్టు, బ్రష్షు పై వేసుకున్నాను. నిరాసక్తంగా అనిపించింది.

అసలు పళ్లు ఎందుకు తోముకోవాలి? పళ్ళ పై పాచి వస్తుంది. తోముకోకపోతే పాడైపోతాయి.

దీర్ఘకాలం సక్రమంగా, ఆరోగ్యంగా ఉండేందుకు పళ్లను శుభ్రం చేసుకోవాలి. కానీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎప్పుడో పాడయిపోవల్సినవీ,  ఊడిపోవాల్సినవీ పళ్లు. వాటిని శుభ్రం చేస్తూ సమయం వ్యర్ధం చేయటం ఎందుకు? ఏం లాభం?

బ్రష్షు విసిరేశాను.

స్నానం చేయాలంటే కూడా అలాగే అనిపించింది.

ఎలాగో నశించి కృశించే శరీరానికి పోషణ చేసి ఏం లాభం?

అంతలో ఒక ఆలోచన వచ్చింది.

ఎవరిదీ శరీరం!!!!!!!!

నా శరీరం వైపు చూసుకుంటే  నాకే విచిత్రంగా అనిపించింది.

ఎప్పుడూ సరిగ్గా చూసుకోలేదు నా శరీరం వైపు నేను… చేతి నిండా వెంట్రుకల కణుపులు, చర్మం,  లోపల ఎముకలు, మధ్యలో మాంసం, వీటి గుండా రక్తనాళాలు, వాటి గుండా ప్రయాణించే రక్తం….

చేయి, చేతి వేళ్లు కదలుతూంటే, ఏదో ఛానెల్‌లో చూసిన చింపాంజీ గుర్తుకు వచ్చింది.

నాకు చింపాంజీకీ తేడా ఏముంది?

అదీ తింటుంది. తిరుగుతుంది. చస్తుంది. నేను అంతే… ఏదో చదువుతాను. సాధించాను అనుకుంటాను. కానీ ఓ జంతువూ చస్తుంది. నేను చస్తాను. తరువాత ఎవరయినా ఏమౌతారు?

అసలు నేనెవరు? ఈ శరీరమా? కాలాన్ని బట్టి శరీరం మారుతుంది. ‘నేను’ ‘నేను’ లానే ఉంటున్నాను. నా ప్రమేయం లేకుండా మారే శరీరం నేనెలా అవుతాను?

మరి ‘నేను’ అనుకుంటున్న నేనెవరు?

ఎందుకో పలురకాల ప్రశ్నలు, అలోచనలు, నాలో తుఫానులా ఎగసి పడుతున్నాయి.

ఏం చేయాలో తెలియటం లేదు. ఏమీ చేయాలనిపించటం లేదు. ఇందులో ఏదీ నాది కాదనిపిస్తోంది. ఏదీ నేను కాదనిపిస్తోంది.

అత్యంత ఉత్సాహంగా ఉంది. కానీ అంతా నిరుత్సాహంగా అనిపిస్తోంది. అంతా నిరుపయోగం, నిరర్థకం అనిపిస్తోంది.

ఏ పని చేయాలన్నా ఏవేవో సందేహాలు చుట్టుముడుతున్నాయి.

నిద్ర లేచినప్పటి నుంచీ అలాగే కూర్చుండిపోయాను. ఏ పనీ చేయలేదు. సమయం ఎంతయిందో తెలియదు.

ఎవరో తలుపు కొడుతున్నారు.

‘ఎవరో?’ అడగాలని కూడా అనిపించలేదు.

తలుపు తీయాలనిపించటం లేదు. తీసి ఏం లాభం?

ఎవరో వస్తారు. ఏదో అడుగుతారు. ఇస్తే ఏమిటి? ఇవ్వకపోతే ఏమిటి?

ఆగకుండా తలుపు కొడుతున్నారు. దబదబా బాదుతున్నారు.

అతి కష్టం మీద లేచాను. లేచి తలుపు వైపు నడుస్తుంటే గమ్మత్తుగా అనిపించింది. ఏదో జంతువు శరీరం తలుపు వైపు నడుస్తోంది, నన్ను కూడా వెంట తీసుకుని వెళ్తోంది. ఇందులో నేనెక్కడ ఉన్నాను? జంతువు శరీరం వెళ్తుంటే దాని తోటి నేనెందుకు వెళ్తున్నాను?

నా చేతి వేళ్లు గొళ్లెం తీసేస్తుంటే, నేను ఎప్పుడో ఏదో సినిమాలో ఓ జంతువు వేళ్లతో తలుపు తీసిన దృశ్యం గుర్తుకు వచ్చింది.

ఎదురుగా ఫ్రొఫెసర్ పరబ్రహ్మం ఉన్నాడు. కాదు నేను ప్రొఫెసర్ పరబ్రహ్మం అని పిలిచే శరీరం ఉంది. అసలు మనిషి ఎక్కడున్నాడు?

“ఎలా ఉంది? మొన్న పడిపోయావు కదా, ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను. ఆఫీసుకి వెళ్తే రాలేదని చెప్పారు” నన్ను పరిశీలనగా చూస్తూ అన్నాడు.

నాకు నవ్వు వచ్చింది.

ఎందుకీయన కంగారు? కంగారుపడి ఏం సాధిస్తాడు? అయినా ఏమవుతుంది నాకు? మహా అయితే శరీరం కట్టె అయిపోతుంది. అందరి శరీరాలు ఏదో ఒకరోజు కట్టె అవుతాయి. దానికి ఇంత కంగారు ఎందుకు?

అతని వైపు విచిత్రంగా చూశాను.

“ఏమిటి రెండు రోజులుగా ఆఫీసుకి రావటం లేదంటున్నారు?” ఇల్లంతా తిరిగి చూశాడు.

“పంది బురదలో ఉంటున్నట్టు ఉంటున్నావు. ఇంత మురికిగా  అసహ్యంగా ఉంది ఇల్లు” అని బాత్రూంలో పడి ఉన్న బ్రష్షు చూశాడు.

“ఎన్ని రోజులయింది పళ్లు తోమి, స్నానం చేసి? ఏమైనా తిన్నావా?” వంటింట్లొకి  తొంగి చూశాడు.

నాకు నవ్వు వచ్చింది.

“ఎవరి పళ్లు తోమాలి? ఎవరికి స్నానం చేయించాలి? ఎవరికి తిండి వేయాలి?”

నా వైపు పరిశీలనగా చూశాడు ప్రొఫెసర్. “ఇంటికి పద” అన్నాడు.

“ఎవరి ఇంటికి? ఎందుకు? ఇక్కడ ఏది నీది? ఏది నాది?” ఇంకేదో అంటున్న నా చెంప చెళ్లుమనిపించాడు ప్రొఫెసర్.

తిండి, నీరు లేకుండా ఉన్నాను. ఆ దెబ్బకు కళ్ల ముందు చీకట్లు కమ్మాయి. పడిపోయాను స్పృహ తప్పి.

మెలకువ వచ్చేసరికి ప్రొఫెసర్ ఇంట్లో మంచంపై పడుకుని ఉన్నాను.

దిగ్గున లేచి కూర్చున్నాను.

“ఇక్కడేం చేస్తున్నాను?” లేచి మంచం దిగాను. తల తిరిగింది. తమాయించుకున్నాను.

“కదలకు. గ్లుకోజ్ ఎక్కించాను. కాబట్టి ఇట్లా ఉన్నావు. లేకపోతే చచ్చేవాడివి” అన్నాడు ప్రొఫెసర్ గదిలోకి అడుగు పెడుతూ.

“నాకేమయింది?” అయోమయంతో అడిగాను.

“పిచ్చి పట్టింది. ప్రభుత్వోద్యోగివి కదా….అహంకరిస్తే అన్నం దొరకదని బాస్ ఏమంటే దానికి గంగిరెద్దులా తలూపుతావు. నీకు అహం ఏమిటి?  అహం అంటే తెలియని వాడి అహాన్ని చంపాలనుకుంటే ఇలాగే అవుతుంది.”

“నాకు అర్థం కాలేదు.”

“అహాన్ని అణచి వేసే మందు కనుక్కోవాలన్న నా ప్రయత్నం ఒక దశకు చేరుకుంది. ఎలుకలు, పిల్లలు, దోమలపై ప్రయోగించి చూశాను. కానీ వాటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నదో తెలియటం లేదు. అవి మన్ను తిన్న పాముల్లా పడివుంటున్నాయి. అందుకని మనిషిపై ప్రయోగించి చూడాలని అనుకున్నాను. నాకు తెలిసింది నువ్వే. కాని తిన్నగా అడిగితే ఒప్పుకోవేమోనని నీకు తెలియకుండా ప్రయోగించాను. ఆ రోజు ల్యాబ్‌లో గ్లాసు పడిపోయింది చూడు, దాన్ని తీసిచ్చావు. ఆ గ్లాసుకి నా మందు పూశాను. నీకు అది తెలియదు. నీకు ‘ఫాస్టస్’ పుస్తకం ఇచ్చాను చూడు, దానికి కూడా మందు పూశాను. డోస్ ఎక్కువయినట్టుంది. వైరాగ్యం వచ్చేసింది. మత్తు మందులు వాడిన వాడిలా అయిపోయావు. నేను ఇంకో వారం అలా వదిలేస్తే చచ్చేవాడివి. అందుకే పట్టుకొచ్చి విరుగుడు ఇచ్చాను. బ్రతికి పోయావు” అన్నాడు.

నాకు పట్టలేనంత కోపం వచ్చింది. “నేనేమీ గీనియా పిగ్‌నా?” అరిచాను కోపంగా.

“అరవకు.. నా అహం మందులో లోపం అర్థమయింది. ఇంకా దాన్ని బాగు చేయాలి” అని ఏదో చెప్పబోతున్న అతని దృష్టి ముందు గదిలో సోఫా క్రింద కనిపిస్తున్న పుస్తకంపై పడింది.

“అదేమిటి?” గబగబా వెళ్లి చూశాడు.

‘ఫాస్టస్’ ఫైకి అన్నాడు. నా దగ్గరకు వచ్చి అడిగాడు “నువ్వీ పుస్తకం తీసుకెళ్లలేదా?”

“లేదు. ఏం?”

“బ్రతికిపోయావు. చిన్న డోసు తట్టుకోలేకపోయావు. దీన్లో ఉంచిన డోసు తట్టుకోలేకపోయేవాడివి. అదే అనుకున్నాను. ఎక్కువ కష్టపడనవసరం లేకుండా ఆ మైల్డ్ విరుగుడు ఇచ్చాను. తగ్గింది” అంటూ టేబుల్ వైపు చూశాడు.

అక్కడ టేబుల్ పై ఓ పది దాకా ద్రవాలున్నాయి. దాన్లో ఏదీ విరుగుడు?

“వాటిల్లో ఏది విరుగుడు?” అడిగాను ప్రొఫెసర్ వైవు తిరిగి.

ప్రొఫెసర్ నా ప్రశ్న విన్నట్టు లేదు. నా వైపు విచిత్రంగా చూస్తున్నాడు.

“ప్రొఫెసర్… ఏమైంది?” అడిగాను.

అతడికి నా మాటలు వినిపించినట్టు లేదు. విచిత్రంగా చూస్తున్నాడు.

“ప్రొఫెసర్” పిలిచాను గట్టిగా.

నా వైపు చూశాడు. తన వైపు చూశాడు.

“నేను అనంతమైన ఆత్మను. ఈ శరీరం పంజరంలో ఒదగలేను” అని తన శరీరాన్ని తనే పీకేసుకునే ప్రయత్నం ఆరంభించాడు.

నాకు అర్థమయింది.

‘ఫాస్టస్’లో ఆయన పూసిన మందు ప్రభావం పోలేదు. అది ఆయన మీదే ప్రభావం చూపిస్తోంది.

నాకు ‘వైరాగ్యం’ కలిగిస్తే, ప్రొఫెసర్‍లో శరీరమనే పంజరంలో ఒదిగిన ఆత్మను విడిపించి స్వేచ్ఛ కలిగించాలన్న తీప్రమైన తపన కలిగిస్తోంది.

రెండూ ప్రమాదకరమైనవే.

కనబడిన దానితో శరీరాన్ని గీకేసుకోవటం ఆరంభించాడు ఫ్రొఫెసర్,

ఆత్మ అనంతం. ఈ పరిమితమైన శరీరంలో అది ఒదగలేదు. అనంతమైన శూన్యంలో భాగం ఆత్మ. ఈ పరిమిత పరిధిని భరించలేరు. స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ” తనని తాను అతి ఘోరంగా హింసించుకుని చంపేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రొఫెసర్.

ప్రొఫెసర్ విరుగుడుగా చూపించిన టేబిల్ వైపు పరుగెత్తాను. అక్కడ ఉన్న ద్రవాల్లో ఏది విరుగుడు?

“ప్రొఫెసర్… వీటిల్లో విరుగుడు ఏది?” అరిచాను.

“శరీర పంజరాన్ని ఛేదించటమే విరుగుడు. ఆత్మకు విముక్తినివ్వటమే అహాన్ని అంతం చేస్తుంది. ఆత్మ విముక్తి. స్వేచ్ఛ స్వేచ్ఛ…” అరుస్తూ తనని తాను తీవ్రంగా హింసించుకోసాగాడు.

విరుగుడు దగ్గరేవున్నా, ఏది విరుగుడో తెలియక, ఏది ఇస్తే ఏమవుతుందో తెలియక, ఒక వ్యక్తి తనను తాను హింసించుకుంటూంటే, ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి చూస్తూండిపోవటాన్ని మంచిన భయంకరమైన అనుభవం మరొకటిలేదు.

నేనేం చేయలేక నిస్సహయంగా చూస్తూ నిలబడిపోయాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here