[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
ఆ.వె.
పుట్టు గుణము నెపుడు పోదు! నీ విపుడును
కొంటె పనులు సేయ, గొడవబెట్టు
వారి నుండి నిన్ను భద్రమ్ముగా కాచు
నెవ్వ రనుచు చింత – హృదిని నాకు! (86)
చం.
అట గనుచుంద్రు – లేవనుచు నా పయి నింకొక ప్రక్క గంద్రు – నీ
వట నగుపించకున్న నిటు నాశగ జూతురు – కాన కిచ్చటన్
“ఎట గలడో?” యటన్ వెదకి యెల్లెడ కానక నిన్ను కన్నయా!
వెట వెట వెక్కి వెక్కి విలపించుచునుండిరి గోప కాంతలున్! (87)
చం.
కలువల బోలు కన్నులను కాంతుల జిమ్మెడినట్లు విప్పి – నీ
చెలువము గూర్చి, నీ చిలిపి చేష్టల గూర్చి సతమ్ము గోపికల్
చిలువలు పల్వలున్ సలిపి చెప్పుచు నుండెడివారు నాడు! ఆ
కలువలు వాడినట్లె – మరి కన్నులు వారికి వాడిపోయెరా! (88)
ఉ.
“నల్లని వాడు – పద్మ నయనంబుల వాడు – కృపా రసంబు పై
జల్లెడు వాడు – మౌళి పరిసర్పిత పించము వాడు – నవ్వు రా
జిల్లెడి మోము వాడిపుడు చెప్పరె యెచ్చట దాగెనో “ యటన్
పల్లియ లోన గల్గు ప్రతి వారికి ప్రశ్నల గ్రుచ్చుచుందురే! (89)
కం.
సుందర గోపిక లింతకు
ముం దనునిత్యమును వచ్చి మూగుచు నీపై
నిందలు వేసిరి – ఇపుడీ
సందులలో వేచి నిన్ను శ్లాఘింతు రయో! (90)
కం.
గొల్లల బాలురు సైతము
ఇళ్ళకు మళ్ళక, మనిల్లు నెల్ల వెదుకగా –
“వెళ్ళి తిరిగి రాలే” దన –
కల్లరి ననుకొంద్రు నన్ను కడు హీనముగాన్! (91)
కం.
“అల్లరి మూకగ మారె! మ
నెల్లరి సహవాసమున తనింతకు నింత
న్నల్లరి వాడయె నని, మన
కల్లంతయు దూర ముంచె” ననుకొందు రయో! (92)
కం.
“అత్తమ్మ!” యని పిలుచు వా
రుత్తుత్తగనే కను చిపు డుల్లములందున్
కత్తులను నూరుచుందురు!
కుత్తుక వర కెంత బాధ గూడెను నాకున్! (93)
ఆ.వె.
ఇంతమంది బాధ నెరుగవో? లేక, నీ
వెరిగి కూడ, “యైన నేమి? కలరు
నూతన సహచరులు! ప్రాత యేల?” యటంచు
కఠిన హృదయుడగుచు కదలవేమొ? (94)
కం.
“ఏమున్నది ‘వ్రజ పురము’న?
పాములు, కాళింది మడుగు, పచ్చిక, బురదల్,
గోమయము, గొల్లవా”రని
నీ మనమున నీసడింపు నెలకొనె నేమో? (95)
(సశేషం)