[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
కం.
కల్లరివని, గోకులమున
నల్లరి వాడవని, పరుల కందరి కీవు
న్నుల్లము నొప్పింతువనుచు
నెల్లరు మాటాడుకొనుట నెటు లోర్తునయా! (46)
తే.గీ.
కొలది క్రమశిక్షణమ్ము నీ కలవడ –
పొలతి నొక్కింత ప్రేమతో పూని యటుల
కఠినముగ నుంటినయ్య నా కన్న తండ్రి!
అదియు నెప్పుడో యొకపరి! అదియు తప్పె? (47)
మ.
సరె! తప్పందువొ? యట్టులే యనెద కృష్ణా! నన్ను మన్నింపవో?
మరి యేవైనను వేయ శిక్షలను వేమారైన – నేనోర్తురా!
విరళంబై యిటులుండి నీవు నిక నన్ వేధింపగా భావ్యమా?
కరుణన్ జూపుము! రమ్ము నా కడకు! నా కన్నయ్య! నీ పుణ్యమౌ! (48)
మధ్యాక్కర.
పుట్టినావో? లేక నాకు పుట్టగా పుణ్యంబు కేను
నోచుకొనగ లేదొ గాని, నోచి తే నోమునో నిన్ను
పెంచుకొంటిని నేను నాదు ప్రేమంబు వెల్లువెత్తునటు!
పెండ్లి సైతము సేయనైతి – విడిపోతి వేల యీ వేళ? (49)
శా.
ఈ జన్మంబున గాని లేక మరు జన్మేదైన గానిమ్ము! నా
రాజా! నీ కొక చక్కనైన కలికిన్ రాజిల్లెడిన్ పందిరిన్
నే జోడించి మనోహరంబుగ జనుల్ నీరాజనాల్ పట్టగాన్,
బాజా మ్రోగగ – పెండ్లి సేయగలుగన్ భాగ్యంబు నా కబ్బునో! (50)
తే.గీ.
కన్నవారల ప్రేమమ్ము కన్న గూడ
పెంచినట్టి వారల ప్రేమ మించియుండు
నన్న నగ్న సత్య మెరుంగవైతి వీవె!
మా మనోవ్యధ నెవ్వ రింకే మెరుంగు? (51)
తే.గీ.
ఏడ్చి ఏడ్చి ఏడ్చి యిటుల నేరులయ్యె
నయ్య – నాదు కన్నుల యందు నశ్రువు లిక!
నా మనో వేదనను గని మనసు కరిగి,
అశ్రువులు గూడ కార్చురా అశ్రువులను! (52)
తే.గీ.
దేవకీ వసుదేవులు తీపి యైరె?
రాజ్య భోగ వైభవ మహా రమను జూపి,
మచ్చికను జేసికొనిరో – అమాయికుడగు
నిన్ను! నాదు దౌర్భాగ్య మింకెన్న తరమె! (53)
శా.
ఏ వైభోగము లెన్ని యేర్పరిచిరో? ఏ సౌఖ్యముల్ రాజ్యమం
దీవు, న్నా బలరాము డొందునటుల న్నేర్పాటులే జేసిరో?
నీ విట్లే మరి శాశ్వతంబుగ నటన్ నిల్వంగ కాంక్షింతువో ?
నా వంకన్ తలపోయజాల వకటా ! నా భాగ్య మెట్లేడ్చెరా ? (54)
ఆ.వె.
శాశ్వతముగ వీడజాలవులే నన్ను;
ఇంక కొన్ని నాళ్ళు తృప్తి దీర –
అచటి భోగములవి యనుభవిం చిక నన్ను
చేర వత్తువంచు చిన్ని యాశ! (55)
(సశేషం)