Site icon Sanchika

విషాద యశోద – పద్యకావ్యం – త్వరలో – ప్రకటన

[ఆచార్య ఫణీంద్ర గారి పద్యకావ్యం ‘విషాద యశోద’ వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నాము. ఈ సందర్భంగా ఈ కావ్యాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తున్నారు డా. వోలేటి పార్వతీశం.]

‘విషాద యశోద’ కావ్య పరిచయం:

రూపు కట్టిన అమ్మతనం యశోద.

పేరుకు పెంపుడు తల్లైనా, బాలకృష్ణుని పసితనంతో విడదీయలేనంతగా అల్లుకు పోయిన తల్లి ఆమె. అంతటి ముద్దుల కొడుకు, కంసుని ఆహ్వానం మీద మధురకు తరలి వెళ్ళాక, తిరిగి ఆ తల్లిని కలిసిన సన్నివేశం మనకు ఎక్కడా తారసపడదు. అమ్మ తనపు తన్మయత్వానికి కన్నయ్య కల్పించిన వియోగం అది. సరిగ్గా ఈ సందర్భాన్ని తన కృతికి ఇతివృత్తంగా ఎంచుకొన్నారు ఈ కృతి కర్త – డా. ఆచార్య ఫణీంద్ర. వికలమైన అమ్మ మనసు ముందు అద్దంలా నిలబెట్టారు ఈ కృతిని ఆచార్య ఫణీంద్ర.

చాల కీలకమైన ఘట్టాన్ని పట్టుకొని, విలవిలలాడిన తల్లి గుండెను కమనీయ కావ్య రూపంలో ఆవిష్కరించారు ఫణీంద్ర.

నిజానికి ఈ వియోగ సందర్భాన్ని గురించి భాగవతం కూడా మనకేమీ వివరంగా చెప్పదు. పూర్వ కవు లెవరు భాగవతాన్ని తెనిగించడానికి పూనుకోకపోవడం – తన పురాకృత పుణ్యమని పోతన గారు చెప్పుకొన్నట్లు, ఆ తల్లీ కొడుకుల వియోగ సందర్భం పోతన గారు వర్ణించక పోవడం ఈనాడు ఫణీంద్ర గారికి కలిసొచ్చిన అంశం. కరుణార్ద్రమైన ఈ సందర్భాన్ని ఫణీంద్ర రసవద్వంతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఫణీంద్ర పద్యం కట్టిన తీరు పోతన పద్యంతో సహచరణయై నడిచింది. ఛందో వైవిధ్యంతో సాగిన ఈ కావ్యంలో మధ్యాక్కర, ఉత్సాహం, మానిని, మత్తకోకిల, మంగళ మహాశ్రీ వంటి విశిష్ట ఛందస్సుల ప్రయోగంతో ఆకట్టుకొంటారు ఫణీంద్ర.

ఫణీంద్రుని పద్యకళా ప్రావీణ్యం విషాద యశోదయై మూర్తిమత్వాన్ని కల్పించుకొంది.

– డా. వోలేటి పార్వతీశం

***

వచ్చే వారం నుంచి..

సంచికలో చదవండి..

విషాద యశోద పద్యకావ్యం..

Exit mobile version