చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే ‘భయంకర్’ నవల ‘విషకన్య’

6
2

[జూలై 1 న కొవ్వలి లక్ష్మీ నరసింహారావు జయంతి సందర్భంగా ‘విషకన్య’ నవలను విశ్లేషిస్తున్నారు ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ.]

[dropcap]తె[/dropcap]లుగులోనే కాక ప్రపంచంలోనే వెయ్యిన్నొక్క నవలలు రాసిన రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు ఒక్కరే అన్నది తెలుగువారు గర్వించదగ్గ విషయం. 1930 – 70 మధ్య మధ్యతరగతి పాఠకులను పెంచిందీ, ముఖ్యంగా స్త్రీలలో ‘రీడబిలిటీ’ని పెంచింది ఆయనే.

పెద్ద పెద్ద చదువులు చదువుకోలేని స్త్రీలు, చిన్న వయసులోనే పెళ్లయి అత్తవారింట వంటింటి పనులకే అంకితమైన ఆడపిల్లలే ఆ కాలంలో ఎక్కువ.‌ కాలక్షేపం కోసమైనా ఏదైనా పుస్తకం తీస్తే గ్రాంథికము, శిష్ట వ్యవహారికము ఉండటంతో చదివే శక్తి, ఆసక్తి లేని ఆడవారికి ఒక వరంలా దొరికాయి కొవ్వలి వారి నవలలు. 70 ఏళ్ల క్రితం అలాంటి యువత కోసమే వ్యవహారిక భాషలో, సరళమైన శైలితో, సామాన్య కుటుంబాల్లో ఉండే సన్నివేశాలతో నవలలు రాశారు ఆయన. ఆంధ్రుల అభిమాన రచయితగా నవలలు రచించి అనూహ్యమైన పేరు ప్రఖ్యాతులు పొందారు. తెలుగులోనే కాక ప్రపంచ భాషల్లో ఒక్క చేతి మీద వెయ్యి నవలలు రాసిన వారే లేరు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయడానికి అన్ని పుస్తకాలు సమర్పించాలి. కానీ ప్రస్తుతం ఆయన రాసిన వాటిలో సగం పుస్తకాలు కూడా లభ్యం కాకపోవటం తెలుగువారి దురదృష్టం.

మధ్యతరగతి గృహంలో ఆశలు ఆశాభంగాలు, ఆకాంక్షలు నిరాశలు, భార్యాభర్తల చిలిపి తగాదాలు, గడుసు సంభాషణలు చదివిన యువత ఆ సన్నివేశాలకి పులకించి పోయేవారట. ఆ పాత్రల్లో తమని తాము ఊహించుకొని ఆనందపడేవారుట. ఆ రోజుల్లో హైస్కూలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, చిన్న తరగతి చదువుకుని, తర్వాత మానేసిన గృహిణులు సైతం కొవ్వలి నవలలంటే పడి చచ్చిపోయేవారట. దాదాపు ప్రతివారం రెండు, ఒక్కోసారి మూడు నవలలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 60 70 పేజీల పాకెట్ సైజ్ నవల 60 పైసలకి కొనుక్కొని లేదా కాణీ అద్దె చెల్లించి తెచ్చుకొని చదివేవారు. మిస్టరీ, సస్పెన్స్ నవలలు నాటి తెలుగు వారికి చాలా చిత్రంగా అనిపించాయి. మంత్రాలు తంత్రాలు, పరకాయ ప్రవేశాలు, కత్తి యుద్ధాలు, రాజులు మంత్రుల రాజకీయ ఎత్తుగడలు వంటి అనేక జానపద ఇతివృత్తాలతో నవలలు రాసారు.

ఆయన తన పుస్తకాలకు శీర్షికలు ఉంచడం కూడా ఒక ప్రత్యేకత చూపారు. ముఖ్యంగా ఇంగ్లీష్ టైటిల్స్. ఆయన మొదటి నవల శీర్షికే ‘ఫ్లవర్ గర్ల్’. తర్వాత డాన్సింగ్ గర్ల్, బర్మా లేడీ, గుడ్ బై, డాక్టర్స్ వైఫ్, ఫిలిం స్టార్, చర్చి బెల్, థర్డ్ వార్నింగ్, లేడీ టీచర్, ఫాల్స్ ప్రెస్టేజ్, విడో మ్యారేజ్ వంటివి.

మరో తమాషా ఏమిటంటే – ఆ రోజుల్లో జంట నవలలు రాసింది కొవ్వలి గారే. తర్వాత కొద్దిమంది అనుసరించారు కానీ ఎక్కువ కాలం ఆ పంథా కొనసాగలేదు. 1. నీలో నేను 2. నాలో నీవు 1. మా వారు 2. శ్రీవారు 1. నీ దారి నీది 2. నా దారి నాది 1. కులం లేని గుణవతి 2. గుణం లేని కులవతి వంటివి.

అలాగే మూడు భాగాల సీరియల్ నవలలు. 1.ఇంతి 2.చామంతి 3.పూబంతి. 1.గంగా 2.యమున 3.సరస్వతి వంటివి.

జగజ్జాణ అనే సీరియల్ భాగాలు 25 పాకెట్ సైజ్ పుస్తకాలుగా రాయటం కూడా ఒక ప్రపంచ రికార్డు. మిస్టరీ, సస్పెన్స్ నవలలు చదవడం ఆ రోజుల్లో ఓ క్రేజ్. కొవ్వలి శైలికి అలవాటు పడినవారు ఏ వారమైన ఆయన పుస్తకం వెలువడక పోతే పబ్లిషర్స్ దగ్గర, షాప్స్ దగ్గర పడిగాపులు పడేవారట. సినీ నటీమణులు భానుమతి, జమున, మీనా కుమారి వంటి వారు, మాలతి చందూరు వంటి ప్రముఖ రచయిత్రులు కొవ్వలి రచనలు అంటే ప్రాణం పెట్టేవాళ్ళు. సినీ నటి కన్నాంబ తన భర్త కడారు నాగభూషణం గారిని పంపించి ఆయన్ను సినీరంగానికి ప్రవేశం చేయించి, ఒక కథ రాయించుకొని విజయవంతమైన సినిమా తీశారు. కైకాల సత్యనారాయణ హీరోగా రంగప్రవేశం చేసిన ‘సిపాయి కూతురు’ సినిమా కథ కూడా కొవ్వలి వారిదే. ఇక జగజ్జాణ నవలల్లోని ఎన్నో సన్నివేశాలు అనేక సినిమాల్లో చోటుచేసుకున్నాయి. ఆ నవల లోని సన్నివేశాలను ఆనాటి (కత్తి కాంతారావు) జానపద చిత్రాల్లో ప్రముఖ దర్శకులు యథాతథంగా ప్రవేశపెట్టారు. తను రాసిన సినిమా కథలకే రెమ్యూనరేషన్ గట్టిగా అడగని మొహమాటస్థులు కొవ్వలి, ఇక తన నవలల్లోని సన్నివేశాలను తనకు చెప్పకుండా వాడుకున్నా ఏమీ అనేవారు కాదు. నిజానికి ఆయనకి అంత సమయము లేదు. సాధారణ పాఠకులు ఆదరణే ఆయనకు ముఖ్యం.

అంత విస్తృతంగా రాయటానికి రచనాభిలాష మాత్రమే కాక ఒకరకంగా పేదరికం కూడా కారణము కావచ్చు. నవల రాసి, పబ్లిషర్‌కి ఇచ్చి, ఎంత ఇస్తే అంత తీసుకొని కుటుంబాన్ని పోషించుకునే వారట. (వారి కుమారులు కొవ్వలి నాగేశ్వరరావు, కొవ్వలి లక్ష్మీ నారాయణ చెప్పారు)

ఆయన రాసిన రొమాంటిక్ సంభాషణలు చదివిన స్త్రీలు చాలామంది ఆయనకు ఉత్తరాలు రాస్తే, మర్యాదగా సమాధానాలు ఇచ్చేవారు, కానీ వారితో ముఖాముఖిగా కలవటం ఆయనకి ఇష్టం లేదు. ఎత్తుగా, మంచి రంగుతో ఉండే ఆయన ఠీవిగా నడిచి వెళుతుంటే ఎందరో ఆయన్ని చూసేవారు కానీ ఆయన ఎవరి వైపు కన్నెత్తి చూసేవారు కారట. పాఠకులలో ఆయనకు వస్తున్న ఆదరాభిమానాలకు ఈర్షపడిన కొందరు సమకాలీన రచయితలు ఆయనపై లేనిపోని దుమారాలు రేకెత్తించి, అవి అసలు నవలలే కావని, ‘రైల్వే సాహిత్య’మని, ‘శవసాహిత్య’మని ఈసడించుకొని తక్కువ చూపు చూసేవారు. ఆయనకు దక్కుతున్న విశేషమైన పాఠకాదరణకి ఈర్ష్య పడి, ఆయనని కొట్టించడానికి కూడా కొందరు వెనుకాడ లేదట.

విషకన్య

మొదట విషకన్య నవలను 12 భాగాలుగా ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్, మద్రాసు వారు ముద్రించారు. తర్వాత విశేష ప్రజాదరణ పొందడంతో వారే రెండవ ముద్రణను ఆరు భాగాలుగా వేశారు. సంచలనానికి కేంద్రమైన ఈ నవలను స్వాతి వారపత్రిక ధారావాహికగా రెండేళ్ల పాటు ‘యువతుల యుద్ధం’ పేరున సీరియల్‌గా వేశారు. ఇటీవల ఎమెస్కోవారు 672 పేజీలతో పెద్ద పుస్తకంగా నవంబర్ 2020 లో ప్రచురించారు.

విష్ణుశర్మ, కృష్ణశర్మ అన్నదమ్ములు. పేదరికం కారణంగా తల్లిదండ్రులు ఏకనాథుడనే గురువు దగ్గర ‘ఇద్దరికీ విద్య నేర్పమని, గురుదక్షిణగా తామేమీ ఇచ్చుకోలేమనీ, ఐదేళ్ల తర్వాత ఒక పిల్లవాడిని గురుదక్షిణ గా ఉంచుకుని, రెండో బిడ్డ తమకివ్వవలసింద’ని కోరారు. గురువుగారు ఒప్పుకున్నారు. కానీ విష్ణుశర్మకు సకల విద్యలు బోధించి, కృష్ణశర్మ చేత ఇంటి పనులన్నీ చేయించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత విష్ణుశర్మను తానుంచుకుని చదువబ్బని కృష్ణశర్మని తల్లిదండ్రులకు అప్పగించాలన్న అతని పన్నాగాన్ని విష్ణుశర్మ గ్రహించాడు. చివరిరోజు రాత్రి వాయువేగంతో తల్లిదండ్రులను కలిసి, పామరుడి వేషంలో ఉన్న తననే కోరుకొమ్మని, తర్వాత తమ్ముడిని గురువు గారు ఎలానూ వదిలిపెట్టేస్తాడని చెప్పాడు. మర్నాడు సరిగ్గా అలానే జరిగింది. (ఈ సన్నివేశం చూస్తే పాఠకులకు ఒక ప్రముఖ తెలుగు సినిమా గుర్తుకు వచ్చే ఉంటుంది. యథాతథంగా వాడేసారు)

భోగపురమునకు మహారాజు శంభునాథుని కుమార్తె మణిమేఖల. కూతురి కోరికపై ‘తానడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పిన వ్యక్తి కంఠమును వరమాల అలంకరిస్తుందని’ చాటింపు వేయించాడు. రాకుమారులు వరులుగా వచ్చారు. కానీ సమాధానం చెప్పలేని సందర్భంలో ఆ పుష్పమాల నుండి హఠాత్తుగా నాగుపాము పుట్టి ఆ వరుని కంఠాన కాటు వేసి, వెంటనే పుష్పంలోకి అంతర్ధానమవ్వడం జరిగేది. ఇలా నూటొక్క మంది రాకుమారులు కాటుకు గురవ్వడంతో ‘మణిమేఖల విషకన్య’ అని ప్రచారం జరిగింది.

చివరకు మారువేషంలో కృష్ణశర్మ వచ్చాడు. ఏదో క్లిష్టమైన ప్రశ్న ఉంటుందనుకుంటే “వైకుంఠ పురమును చూసావా? అక్కడి మోహనమూర్తిని వర్ణించి, ఆ పుర విశేషాలు చెప్పగలవా” అనగానే తెల్లబోయాడు. తెలివిగా నలబై రోజులు గడువు అడిగి, ఆ నగరాన్ని అన్వేషిస్తూ దేశాంతరగతుడయ్యాడు.

వైకుంఠ పురము సిరిసంపదలతో సమస్త భూమండలానికి తలమానికమై ఉండేది. మహారాజు ధర్మపాలుడు, ఆతని అర్ధాంగి కాంతిమతి. మోహనమూర్తి అను పేర అక్కడ వెలసిన దైవం పరమేశ్వరుడు.

ధర్మపాలుని సామంతరాజు అశ్వపతి. అతని కుమార్తె వసంతసేన మంత్రికుమారుడైన వసంతున్ని ప్రేమించింది., గురువుగారు అగ్నిహోత్రుల వారి కుమారుడు దండపాణి. గురువుగారు మురిపెంగా ఒకరోజు “నా కుమారుని ఏ రాచకన్య వివాహమాడుతుందో” అనగా వసంతసేన హేళనగా “దండపాణి వంటి శుంఠను ఏ కన్య పెళ్ళాడుతుంది” అన్నది. అది మనసులో పెట్టుకుని, ఎన్నో పన్నాగాలు పన్ని తన కుమారునితో వసంతసేన పెళ్ళాడే పరిస్థితి కల్పించాడు గురువు అగ్నిహోత్రుడు. ఒకరోజు దండపాణిని ఎవరో హత్య చేసారు. అది ఆమెపై మోపాడు గురువు. ఆమె మహారాజు ధర్మపాలుని ఆశ్రయించగా ఆయన అభయమిచ్చాడు. ఇది తెలుసుకున్న అగ్నిహోత్రుడు వచ్చి బెదిరించాడు. చివరకు ఆగ్రహోదగ్ధుడై “మహారాజా! వసంతసేన, మీరు, మీ సమస్త సైనిక దళాలే కాదు, ఈ రాజ్యంలోని సర్వప్రాణులు నిర్జీవులకు గాక! ఈ నగరంలోని సమస్త ప్రాణులు శవములై ఉంటాయి” అని శపించాడు. ఈ సన్నివేశ కల్పన, ఒక నగరంలోని వారంతా మృతులుగా ‘ఉండడం’ మరెక్కడా కనిపించదేమో!

పూర్వజన్మ స్మృతి కలిగిన మణిమేఖల వైకుంఠ పురం విశేషాలను చెప్పమని తనను వరింపవచ్చిన రాజులను అడిగేది. చివరకు కృష్ణశర్మ అన్వేషించడమే కాక, స్వయంగా ఆమెను తీసుకుని వెళ్లి చూపించాడు. ఫణి రాజు తనకు ప్రసాదించిన శిరోమణితో వారందరినీ సజీవులుగా చేస్తాడు.

ఈమధ్యలో విష్ణుశర్మ ప్రేమించిన కాంచనమాల వృత్తాంతం, నాగకన్య మదనరేఖ, ఆమె చెలి మందాకిని, వారిరువురు ప్రేమించిన దయాసాగర్ కథ అత్యంత కీలకమైనవి, ఆసక్తికరమైనవి. ఇతివృత్తం, కథన నైపుణ్యం, చిత్ర విచిత్రమైన మలుపులు, ఆసక్తికరమైన శైలి విషకన్య నవల ప్రత్యేకతలు.

పాతాళ గుహలు, చిత్రించిన బొమ్మ మాట్లాడడం, పరకాయ ప్రవేశాలు, మాట్లాడే చిలుకలు, మాయలు, మంత్రాలు, అంతరిక్షంలో యుద్ధాలు, శిలా రూపులుగా మారడం, పక్షి ఆకారంలో ఉండే భయంకర రాక్షస రూపులు, సంయమనం గల దైవభక్తుడైన నాగరాజు ఫణిరాజు, రాక్షసులైనా నీతి నియమాలు గల సత్యవ్రతులు ఎన్నో పాత్రలు, ఊహించని మలుపులు, ఉత్కంఠ కలిగించే మాయలు ఎన్నో. ఇన్ని కల్పనలు చేసినా ఈ నవలలో కొవ్వలి వారు ప్రధానంగా చెప్పదలచుకొన్నది —

“స్త్రీలకు పాతివ్రత్యము, పురుషులకు ఏకపత్నీవ్రతము సర్వదా అనుసరణీయం”.

‘భయంకర్’ అనే‌ కలం పేరుతో చాలా నవలలు రాసారు కొవ్వలి. చిన్నప్పుడు తాము చదివిన ‘భయంకర్’ అసలు పేరు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు అన్న విషయం తెలియని తెలుగు పాఠకులు ఇప్పటికీ ఉన్నారు. ఇరవై ఐదేళ్ల వయసుకి నాలుగు వందల నవలలు, ముప్పై ఐదేళ్ళ వయసుకి ఆరు వందల నవలలు, నలభై ఐదేళ్ళ సాహితీ యానంలో వెయ్యిన్నొక్క నవలలు రచించిన ప్రతిభాశాలి ఆయన. ఘనమైన గౌరవ సన్మానాలు ఆశించని నిరాడంబరుడు. అద్భుతమైన ఆ రచయితకు సరియైన గుర్తింపును ఇవ్వని ‘తెలుగు’ వారం మనం.

2020, 2021ల్లో కొవ్వలి వారి జీవితం గురించి, ‘జగజ్జాణ’ నవలను సంక్షిప్తంగా ‘సంచిక’ అంతర్జాల పత్రికలోనే పరిచయం చేసాను. అది ఒక సంచలనంగా మారింది. ఆనాటి పాఠకుల నుండి సంచిక పత్రికకు, నాకూ స్పందనలు బాగా వచ్చాయి. హారీపోటర్‌లు, బాహుబలులు సూపర్ హిట్టయిన ఈరోజుల వారు ఆనాటి ఈ ‘సూపర్ డూపర్’ నవలా రచయితను ఊహించలేరు.

ఒక తరం పాఠకులను తన రచనా వైభవంతో ఉర్రూతలూగించిన వెయ్యిన్నొక్క నవలా సాహిత్య సార్వభౌమ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి జయంతి జులై 1 సందర్భంగా సవినయంగా నమస్సులు.

***

విషకన్య (నవల)
రచన: భయంకర్ (కొవ్వలి లక్ష్మీ నరసింహారావు)
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 672
ధర: ₹ 400.00
ప్రతులకు:
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Vishakanya-Kovvali-Lakshminarasimha/dp/B08PDG598H

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here