Site icon Sanchika

విశాల హృదయాలు

[dropcap]‘మ[/dropcap]నసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ…’ పాట టేప్ రికార్డర్‌లో మంద్రస్థాయిలో వస్తోంది.

చల్లని సాయంత్రం గిలిగింతలు పెట్టే గాలి, ప్రియరాలిలా పలుకరించి వెళుతుంటే ఎంతో విశ్రాంతిగా పడక్కుర్చీలో పడుకొని ఆ పాటలో సారాంశాన్ని, ఘంటశాలగారి గొంతులో వర్ణించలేని మాధ్యుర్యాన్ని టిఫిన్‌లా ఆస్వాదిస్తూ తన అనుభవాన్ని చట్నీలా కలిపి ఆలోచనల్ని తింటున్నాడు.

టిఫిన్ పెట్టడానికి అతని భార్య లేదు అక్కడ. అందుకే భావాలను ఆరగిస్తున్నాడు ‘మనీష్’. అతని ప్రతి ఆలోచనలో అర్ధాంగి ‘హొయలస’ అంటి పెట్టుకునే ఉంటుంది. కలలో ఇలలో కూడా! ఆమె తోడిదే అతనికి లోకం. ఆమె కంటే ప్రియమయినది మరేమీ లేదు.కానీ ఆమె ఎప్పుడూ అతన్ని ఉడికిస్తూ ఉంటుంది. నా కంటే మీకు ఇష్టమయినది ఒకటి ఉందని. లేదని అతడు దబాయిస్తాడు.

“నా కంటే నా కళ్లు మీకు ఇష్టం కాదా?” అంటే మాత్రం ఆనందంగా అవునంటాడు, అవును ఆమె అందమంతా ఆ కళ్ళలోనే.

ఆ కళ్లు ఎన్నో ఊసులు చెబుతాయి. విశాలమయిన ఆ కళ్ళు విశాల ప్రపంచాన్నే మరిపిస్తాయి. ఆ కనురెప్పలు ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటాయి. ఆమెను చూసిన ఎవరయినా ఈ లోకంలో ఇంతకంటే అందమయిన కళ్ళు ఇంకెవరికీ ఉండవేమో అని అనుకోకమానరు. అంతటి అందమయిన సౌందర్యాన్ని తాను సాధించానని అతనికి గర్వం. చిన్నప్పటి నుంచీ తనకు అందం అంటే పిచ్చి. అందాన్ని ఆరాధించటమేకాక ఆ అందాన్ని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నించేవాడు.

తన అదృష్టం కొద్దీ డిగ్రీ, పి.జి. అయిపోగానే గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం దొరికింది. ఇక అప్పుడు అమ్మాయిల వేటలో పడ్డాడు. సిటీ బస్సులు, పార్కులు, సినిమా హాళ్ళు, ఊర్లు ఎన్నో తిరిగాడు. ఎక్కడకు వెళ్ళినా తన కళ్ళు తన జీవిత భాగస్వామ గురించి వెదుకుతూనే ఉండేవి. రెండేళ్ళు గడిచినా తనకు నచ్చిన ఒక అమ్మాయి కూడా కనిపించలేదు.ఏడు వందల ముప్ఫై రోజుల తన నిరీక్షణ నిష్పలమయ్యేటప్పటికి నిరాశతో నీరసపడి,దానిని భగ్నం చెయ్యడానికన్నట్లు బీచ్‌కి వెళ్ళాడు.

సముద్రాన్ని చూస్తూ కూర్చుంటే ఎన్ని గంటలయినా విసుగు అనిపించదు.అలా కదిలి వచ్చే ప్రతి అలా తనను పలకరించి వెళ్ళిపోతూ, మళ్ళీ వచ్చి తన కాళ్లను తడుపుతూ… అది వరుసగా జరిగే కార్యక్రమమే అయినా, పొంగి పొర్లి వచ్చే నీటికెరటాలు ప్రతి సారీ క్రొత్తగానే అనిపించేది. ఆ అలల హోరు ఏ పాట ఇవ్వని ఆనందపు సంగీతాన్ని అందించేది. అలా ఆదమరిచిన తనకు ‘హొయలస’ పరిచయం తమషాగా జరిగింది.

‘హాసా! హాసా!’ అని వెనక నుంచీ అరుపులు. ముందు బాలు,వెనక ఆమె పరుగెట్టుకొచ్చారు.

బాలు సరిగ్గా వచ్చి నా కాలుకి తగిలి ఆగిపోయింది.

బాలును తీసుకుందామని ఒంగిన ఆమె చెప్పకపోతే బాగోదు అన్నట్లు తల ఎత్తి నా కళ్ళలోకి చూసింది.

ఆ చూపు సమ్మోహనాస్త్రమే!

అలవోకగా ఎత్తిన ఆమె కళ్ళ అందం ఏ కవీ వర్ణించలేడు.ఏ చిత్రకారుడు తన కుంచెతో స్పృజించ లేడు.

కానీ నా కళ్ళు కెమెరా కంటే వేగంగా ఆమె అందాన్ని క్లిక్ మనిపించాయి. నన్ను నేను మరిచి ఏదో లోకాల్లో విహరిస్తున్న నేను “బాలు ఇవ్వరా!” అన్న మృదుమధుర కంఠ ధ్వనికి ముగ్ధుడనవుతూ ఆమెను ఏడిపించాలని “నేను ఇవ్వను” అని బాలును చేతిలోకి తీసుకున్నాను.

“మీ కంత ఇష్టమయితే ఉంచుకోండి” అంటూ వెనుతిరిగిందామె.

ఈ రోజుల్లో అంత కామ్‌గా ఎవరు వెళతారు? దెబ్బలాడి తీసుకుంటారు.

అదంతా కాదు సమస్య. ఆమె వెళ్ళిపోయింది.

“మిస్! ఉండండి! బాలు తీసుకోండి” అంటూ అందించాను.

“మిస్ కాదు హోయలస” అంది బాలు తీసుకుంటూ ‘థాంక్స్’ చెప్పి కలసిన చూపులను విడదీసుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రండ్స్ దగ్గరకు.

ఆమెతో పాటు నా హృదయం కూడా!

ఇక క్షణం కూడా ఆగలేదు. వాళ్ళను అనుసరించాను.

“హాసా! గురుడు వెంటపడుతున్నాడే.”తమ బస్సే ఎక్కిన అతన్ని చూస్తూ.

“ఛ! ఊరుకోండే! ఆయన వెళ్ళాల్సింది మన ఇంటి వైపే అవ్వచ్చుగా”

గుసగుసగా మాట్లాడినా పెదాల కలయికను బట్టి వారు మాట్లాడే మాటలను గ్రహిస్తూనే ఉన్నాను నిశ్శబ్దంగా.

“కొట్టకే! రోజూ నీ వెనుక ఎంత మంది పడటం లేదు. అలాగే ఇతను.”

“ఉహుఁ!” అంటూ తల అడ్డంగా ఊపింది.

“మరి!”

“కాసేపు ఉండండే బాబు. అతను వెళ్లిపోయాక చెబుతాను.”

 “ఉహుఁ! ఇప్పుడే చెప్పు.”

“ఏమో!” ఆమె కళ్ళు అలవోకగా వాలిపోయాయి

“హాసా! ఏదో విశేషమే! చెప్పవా! చెప్పవా!”

“ఏమోనే! అతన్ని చూసినప్పటి నుంచీ ఎదలో ఏదో అలజడి.నాకే తెలియటం లేదు. తిరిగి తిరిగి అతన్నే చూడాలనిపిస్తోంది. ఏమిటో ఈ అర్థం కాని కోరిక.”

 అతని అంతరంగం ఉవ్వెత్తున కెరటంలా ఎగిరిపడింది.

ఇన్నాళ్ళూ పెదాల పరిభాష తెలుసుకోవటంలో ఉపయోగం ఇప్పటికి పనికి వచ్చింది. తనకు లైన్ క్లియర్ అయిపోయింది అనుకొన్నాడు.

వాళ్ళు ఉమన్స్ హాస్టల్ ముందు దిగారు.

రేపు వచ్చి హాస గురించి ఎంక్వయిరీ చెయ్యాలనుకున్నాడు.

ఆ రాత్రంతా ఆమె ఆలోచనలతోనే గడిచిపోయింది.ఆమె నయన సౌందర్యం తలచుకుంటూ కలత నిద్ర పోయాడు.ఎర్ర బడ్డ కళ్ళను కూడా పట్టించుకోలేదు.

తయారై రోడ్డున పడ్డాడు. ఆ వెళ్ళటం, వెళ్ళటం ఉమన్స్ హాస్టల్ దగ్గిర తేలాడు. వాచ్‌మెన్ దగ్గరకు వెళ్ళాడు. అతని చేతిలో సిగిరెట్ చూసాడు. అంతే అల్లుకుపోయాడు.

“అబ్బా సిగిరెట్ ఎంత రింగులు రింగులుగా వదుల్తున్నావ్! నేనిలా ఇంత వరకూ సిగిరెట్ ఇంత స్టైల్‌గా తాగే వాళ్ళని చూడలేదు” అంటూ మాట కలిపాడు.

ఆ ఒక్క చిన్న మాటకు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.

“ఎవరి కోసం వచ్చారు బాబూ!” అన్నాడు తన పేరు గురవయ్య అని చెబుతూ.

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ‘హోయలస గారి కోసం’ చెప్పాడు.

“హోయలసాఁ! ఓఁ! హాసమ్మగారి కోసమా! ఆవిడ కోసం వచ్చిన మొదటి వ్యక్తి మీరే. సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నారు.ఒక్కరు కూడా రారు. ఆమెకి ఎవరూ లేరు.”

“అదేం?” అప్రయత్నంగా అడిగాడు.

“ఆ హాసమ్మ అనాథ శరణాలయం నుంచీ వచ్చారు బాబూ!”

“అలాగా! అయితే తన కెవ్వరూ లేరన్న మాట.”

‘పిచ్చి వెధవా! ఇక నుంచీ ఆమెకు అన్నీ నువ్వేగా’ అని మనసు మృదువుగా తిట్టడంతో ‘నిజమే! నిజమే!’ అని నవ్వుకున్నాడు.

“ఏంటండీ! మీలో మీరే నవ్వుకుంటున్నారు?”

“ఏం లేదులే! తనని కలుసుకోవటానికి దారి నువ్వే చూపించాలి!”

“విజిటర్స్ ఆదివారం సాయంత్రం అయిదు గంటలకు మాత్రమే కలవాలి.రేపు రండి బాబు! మీ ఇద్దరినీ కలిపే పూచీ నాది. మీరూ ఆ అమ్మ మంచి జోడీ అవుతారు.”

“ఏం చెప్పకుండానే అంతా గ్రహించేసావే. ఇలాంటి వాటిలో పండిపోయి వుంటావు. రేపు వచ్చేప్పుడు నీ బ్రాండ్ సిగరెట్ పెట్టి తెస్తాలే” అన్నాడు.

అంతే!వెలిగిపోయింది అతని ముఖం.

ఎంత డబ్బు ఇచ్చినా అతని సిగిరెట్ పెట్టె విలువ చెయ్యదని తనకు మాత్రమే తెలుసు.

మొదటి రోజు హాస పరిచయం సముద్రపు ఒడ్డున ప్రారంభమయినా మొదటి సారి మనసు విప్పి మాట్లాడిన ఆ ఆదివారాన్ని కూడా తను జన్మలో మరచిపోడు.

* * *

గురవయ్య వెళ్ళి హాసను పిలుచుకుని వచ్చాడు.

మౌనంగా కూర్చుంది హాస.

“మిమ్మల్ని ‘హాయ్’ అని పిలవచ్చా?”

విస్మయంగా చూసింది. తనింత చనువుగా మాట్లాడటం ఆమెకి అర్థం కాలేదు.

అతను వెంటనే “మీరు బస్సులో మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడిన మాటలు మీ పెదాల కలయికను బట్టి కనుక్కొన్నాను. అందుకే చనువు తీసుకున్నాను. మీ గురించి అంతా తెలుసుకున్నాను. మీకెవ్వరూ లేరు. నాకు ఎందరున్నా వారెవ్వరినీ నేను పట్టించుకోను. నా జీవిత సహచరి నా ఇష్టం.మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే అదే పది వేలు.”

“అమ్మో! నా మాటకు వాల్యూ పదివేలా?”

“అమ్మో! మీకు మాటలే రావనుకున్నాను. జోక్స్ కూడా వేస్తారే!”

కిలకిలా నవ్వుతూ “మాటలు రాని పాపాయి ననుకున్నారా?”

“మాటలు రావు అనుకున్నానే కానీ పాపాయి అని మాత్రం అనుకోలేదు. లేకపోతే ఉయ్యాల తెచ్చేవాడిని గద! సరే! పెళ్ళెప్పుడు చేసుకుందాం?”

“అప్పుడే! పరిచయం అయి మూడు రోజులు కాలేదు. అసలు మీరేమిటో తెలుసుకోనివ్వండి.”

“అంటే నేను నచ్చినా నా అలవాట్లు నచ్చకపోతే చేసుకోరా?”

“ఎలా చేసుకుంటాను?” అని ఎదురు ప్రశ్న వేసింది, కాసేపు అతన్ని ఏడిపించాలని.

“అన్నీ మార్చేసుకుంటాను. మీరెలా చెబితే అలా వింటాను. ఎదురు చెప్పను” బుద్ధిమంతుడిలా ప్రామిస్ చేసాడు.

“ఆఁ! అందరూ ఇప్పుడు అలాగే అంటారు. పెళ్ళి అయ్యాక మీ మాటే వినాలంటారు.”

“లేదు! లేదు.ఏం చెప్పినా వింటాను. కాదంటే అలా ప్రామిసరీ నోటు లేదంటే అగ్రిమెంట్. మీ ఇష్టం. మీరు కాదంటే ఇప్పుడే వెళ్ళి సముద్రంలో దూకేస్తాను.”

“మైగాడ్! అంత మాటలు వద్దు. సరదాగా అన్నాను. మా వార్డెన్ గారితో చెప్పి రిజిష్టర్ మేరేజ్ చేసుకుందాం. మంచి రోజు చూసి అప్లికేషన్ పెడదాం. ఈలోపు పిచ్చి ఆలోచనలతో నేను లేకుండా బీచ్ దగ్గరకు మాత్రం వెళ్ళకండే” అందామె.

“అలాగే హాయ్!” అన్నాడు.

ఆ పిలుపు ఆమెకెంతో హాయిగా అనిపించింది.

అలా ఒక నెల తరువాత జంట అయిన వాళ్ళిద్దరూ ఒక్క రోజు కూడా విడివిడిగా ఉండలేదు.ఏ ఊరు వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళ్ళేవారు.కలిసి వచ్చేవాళ్ళు.

మూడేళ్ళ తరువాత ఇదుగో ఇప్పుడు విరహం అంటే ఏమిటో తెలిసి వస్తోంది. తను చిన్నప్పటి నుంచీ పెరిగిన అనాథాశ్రమం వార్డెన్ చావు బ్రతుకుల మధ్య ఉన్నారంటే వెళతానంది. ఊళ్ళో లేమని ఏదో అబద్ధం చెప్పేద్దాం అన్నాడు. ఆమె వినలేదు “చిన్నప్పటి నుంచీ అమ్మ, నాన్నా లేకపోయినా ఆ ఇద్దరినీ మరిపించిన ఆమె చివరి దశలో ఉండి సేవ చేసుకోవటం నా అదృష్టం. వెళ్ళకపోతే బాగుండదు.” అని నచ్చచెప్పి వెళ్ళింది.

పరాయి వాళ్ళ కోసం తాము విడిపోవడం,అది మూడు రోజులయినా తనకు భారమే. చిన్నప్పటి నుంచీ తన తత్వమే అంత. అంతా స్వార్థం.ఎంత సేపూ తన జీవితం. అంత వరకే ఆలోచన. ప్రక్క వాడి గురించి ఆలోచించటం అనవసరమే అన్నట్లు ప్రవర్తిస్తాడు.కానీ దీనికి హాస పూర్తిగా వ్యతిరేకం. పదిమందితో అప్యాయంగా మాడ్లాడటం, ఎవరికి ఏ అవసరం వచ్చినా అడగకుండా సహాయం చేయటం ఆమె తన కర్తవ్యంలా భావిస్తుంది.

ఉత్తర, దక్షణ దృవాలు లాంటి భావాలు అయినా అప్పుడప్పుడు ఈ విషయంలో చిన్న చిన్న గొడవలొచ్చినా తెలివిగా సర్దుమణిగేట్లు చేసేది హాస.

ఇప్పుడు మాత్రం తన మాటే నేను వినాలని హుకుం జారీ చేసి వెళ్ళిపోయింది పెద్ద మానవత్వం ఈవిడికి ఒక్కదానికే ఉన్నట్లు. పోనీ నన్ను కూడా తీసుకవెళ్ల వచ్చుగా. ససేమిరా అంది అనుకున్నాడు.

“అక్కడ అందరూ మిమ్మల్ని చూసి షై ఫీల్ అయి నా దగ్గరకు రారు, మా అమ్మకదా మా బుజ్జి కదా” అని గడ్డం పట్టకొని బ్రతిమాలింది.

అంతే అవుట్ అయిపోయాడు. ఫలితం ఇప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నాడు.

‘పూవు లేక తావు నిలువ లేదులే అది నిజంలే….’ పాట వస్తోంది.

‘ఇదొకటి నన్ను వెక్కిరించి చంపటానికి’ అని తిట్టుకుంటూ వెళ్ళి ఠక్కున టేప్ రికార్డర్ ని ఆపేసాడు.

అటు ఇటు పచార్లు చేసాడు. తోచలేదు. హాస ఉంటే టైమే తెలియదు. తను లేక ఎంత బోర్‌గా ఉందో! ఒంటరిగా ఉండలేక సినిమాకి పోదామని తలుపుకు తాళం వేసి బయటపడ్డాడు.

సినిమాకి వెళ్ళినా అందులో ఆనందాన్ని అనుభవించలేకపోయాడు.

ఏమిటీ హాస ఇంతలో ఇంతలా అల్లుకుపోయింది. ఆప్యాయతను చిందించే ఆమె కళ్ళు పదే పదే గుర్తుకొస్తున్నాయి.

మధువొలకబోసే ఆ చిలిపి కళ్ళు..అవును ఎప్పుడు తన కళ్ళు చూసినా ఆ పాటే గుర్తు వస్తుంది. దారిలో భోజనం కూడా చెయ్యబుద్ధి కాలేదు.

ఒక చాప, దిండు తీసుకొని డాబా పైకి వెళ్ళి పక్క పరుచుకుని పడుకున్నాడు. హాస ఉంటే ‘నేనుండగా మీకు దిండు ఎందుకు’ అనేది.

అరే! ప్రతి నిముషం తన ఆలోచనలేనా? వెన్నెల చిందే కాంతులు,చందమామ, చల్లటిగాలి ఇవన్నీ లేవా?ఎంత సేపూ తనను వదిలేసి వెళ్ళిన హాస గురించి ఎందుకు ఆలోచించాలి?

హాస పకపకా నవ్వినట్లు అనిపించింది.

నిజమే తను ఇతరుల గురించి ఆలోచిస్తుంటే ఇలాగే ప్రశ్నించేవాడు.

ఒకసారి ప్రక్కింటి బాబు సైకిల్ మీద నుంచీ క్రింద పడి బాగా దెబ్బ తగిలి రక్తం వచ్చింది. వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ కంగారు పడింది హాస. వెంటనే లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి వాడికి దెబ్బ తగిలిన చోట నీళ్ళతో తుడిచి మందు వేసి దూది పెట్టడమే కాకుండా వాడిని ఓదార్చి సముదాయించింది.వాళ్ళ అమ్మ ఇదంతా గుడ్ల నీరు కుక్కుకుంటూ చూస్తోంది. మరి పిల్లవాడికి అంత రక్తం పోయింది.

 తనకేమో ఒళ్ళు మండిపోయింది. ఆదివారం. హాయిగా మేమిద్దరం గడపాల్సిన సమయం. వాళ్ళ పిల్లవాడికి దెబ్బ తగిలితే వాళ్ళ అమ్మా, నాన్నా చూసుకోరా? ఈవిడగారే తగుదునమ్మా అంటూ అన్నీ చేయాలా? వాళ్ళు తమకి ఏమవుతారని. ఎన్నో ప్రశ్నలు. మనసులో హాసను ఎంతలా తిట్టుకున్నాడు?

ఆ రోజంతా ఓపికగా సమాధానమిచ్చింది హాస.

“నిజమే మన టైమ్ పాడయింది. మీ మూడ్ పాడు చేసాను.దానికి ఏం శిక్ష వేసినా భరిస్తాను. కానీ నేను చేసింది తప్పు అని మాత్రం అనకూడదు. ఎందుకంటే ప్రక్కింటి వాళ్ళు మనకు బంధువులు కాకపోవచ్చు.కానీ మన లాంటి వారు వారికి కష్టమొస్తే ఆదుకోవాలి. మనకి కష్టం వస్తే వాళ్ళు చూడాలి. ఎక్కడో దూరంగా ఉన్న అమ్మా, నాన్న, బంధువులు అప్పుడు రాలేరుగా. అందుకే ఒకరికి ఒకరం తోడు.ఇంత మాట్లాడుతున్నారు. రేపు నాకేదయినా రోడ్డు మీద ప్రమాదం జరిగితే…” మిగతాది చెప్పనివ్వకుండా నోరు మూసాడు తను.

“చెప్పనివ్వండి.”

“ఊహుఁ! నీకేదన్నా అవుతుందన్న ఆలోచన కూడా నేను భరించలేను.” చిన్న పిల్లవాడిలా ఆమె ఒడిలో తల దూర్చాడు.

తన జుట్టును నిమురుతూ “చూసారా! మనకున్న ఈ మూడేళ్ళ పరిచయంలోనే మీరెంత ఫీల్ అవుతున్నారు.మరి ఆ బాబు తల్లితండ్రులు అంతే కదా! వారి బిడ్డల గురించి వారికి బాధ ఉండదా? ఆ బాధలో వారికి ఏం చెయ్యాలో తోచదు. కొందరయితే ఏడుస్తూ కూర్చుంటారు. అలాంటి సమయంలో మనమే అంటే తోటివారమే సహాయం చెయ్యాలి. అదే కదా మానవత్వం. నన్ను చెప్పనివ్వరు కానీ ఏ రోడ్డు మీదో నాకిలా జరిగితే సరైన వైద్యం అందక నేను మీకు దక్కకపోతే మీరెంత బాధపడతారో ఆలోచించండి.”

ఆమె అలా నా తల నిమురుతూ నాకు హిత బోధ చేస్తుంటే అమ్మలా అనిపించింది. అప్పటి నుంచీ తనలో కూడా కాస్త కాస్త మార్పు రావటం ప్రారంభించింది. తను ఉన్న టైములో ఎవరితో మాట్లాడకూడదని, ఎవరికీ సహాయం చెయ్యకూడదని అని అనటం ఎంత మార్ఖత్వమో అర్థమవసాగింది. పెళ్ళి అయ్యాక తమ మధ్య ఏ విషయాలునూ గొడవలు వచ్చేవి కాదు. ఇలా బయటివారి గురించి గొడవలు పడటం తనకి బాధగా ఉండేది. తను ఎందుకది అర్థం చేసుకోదు అని ఎన్ని సార్లు అనుకోనేవాడో? ఇంతగా ప్రేమించే తను ఉండగా బయటి వారితో ఎందుకు ప్రేమలు అనేది అతని ప్రశ్న.

“ప్రేమకు పరిమితులుంటాయా? మీ ప్రేమ ఎవ్వరూ ఇవ్వలేరు.ఎవరయినా ఇస్తానన్నా పుచ్చుకోను. కానీ మిగతావి అలా కాదే! ఒక్కొక్కరు ఒక్కొ రకపు ప్రేమ.

ప్రక్కంటి చిన్న ‘అక్కా! ముద్దివ్వనా’ అంటూ తన చిన్న చేతులను నా భుజం చుట్టువేసి ముద్దు పెట్టుకుంటుంటే ఆ అనుభూతి చెబితే అర్థమయ్యేది కాదు. అనుభవించాలి.

అలాగే అమ్మ, నాన్న లేని వారు అత్త, మామల్లో ఆ ప్రేమను పొందుదామనుకుంటే తప్పు కాదు కదా!

అనాధని,తల్లి తండ్రి తెలియని దాన్ని చేసుకున్నారని నేను ఉంటే అందరూ ఉండి కూడా మిమ్మల్ని అనాథను చేసారు. అలాంటి ఆప్యాయతలను నేను ప్రక్క వారి నుంచీ పొందాలనుకోవటంలో తప్పేముంది?”

“వద్దు హాయ్. అదేమిటో. నీ ప్రేమను బయటి వాళ్ళకి పంచటం నా కిష్టముండదు. అలాంటిది నా ఇంట్లో కొచ్చే నా పిల్లలయినా నా శత్రువులే”

“ఏమిటి మీరు మాట్లాడేది, మీకు పుట్టే పిల్లలు మీకు శత్రువులా” ఆమె గొంతులో కాస్త వణుకు, భరించలేని బాధ, అంతులేని విస్మయం కదలాడుతున్నాయి.

“మీ అందరికీ నేను పిచ్చివాడిలా కనిపించవచ్చు.కానీ నా కెందుకో పిల్లలు ఇష్టం లేదు. అది నేను భరించలేను. నేను నిన్ను ఎవ్వరితో షేర్ చేసుకోలేను.”

నేను చెల్లికి చాక్‌లేట్ ఇవ్వనని అన్న పేచీ పెట్టినట్లు అనిపించింది ఆమెకు.

“అలాగే! మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే.”

తన భావాలను గరళకంఠుడు విషాన్ని మింగినట్లు మింగింది.

“అసలు వద్దు.”

ఆ టాపిక్ ఇక వస్తే తను భరించలేడు అన్న భావం స్పష్టంగా అతని కళ్ళలో మాటల్లో కనిపిస్తోంది.

అతని భావాలను మార్చటం ఎలా అనేది తరువాత ఆలోచించ వచ్చు. ముందు అతన్ని బుజ్జగించేస్తే సరిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కోపగించుకుంటే రగడే. ఒకళ్ళకి కోపం వచ్చినపుడు మరొకరు సర్దుకోవాలి.అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది. ప్రక్కింటి పిన్నిగారి సలహా గుర్తు వచ్చింది. ఇలాంటివి అమ్మలేని తనకు ఎవరు చెబుతారు. కాలమే అతనికి అన్నీ తెలియజెయ్యాలి.

“ఏమిటి నాతో మాట్లాడకుండా ఆలోచిస్తున్నావ్? మళ్ళీ ప్రక్కింటి ఏ పుల్లమ్మ గురించేనా?”

“లేదు. లేదు. మీకు పిల్లలు వద్దన్నారుగా. ఓ.కె. మీరే నాకు ఒక పిల్లవాడు అనుకుంటాను చాలు.” “నిజంగా!” అతని ముఖమంతా ఆనందంతో పొంగిపోయింది. కళ్ళు దివ్వెల్లా మెరుస్తున్నాయి.

“నిజంగా మీరు ప్రేమ పిచ్చివారు.” అంది హాస అతని ఉంగరాల జుట్టుని అటు ఇటూ ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటూ.

“ఏయ్! హాయ్! నన్ను పిచ్చివాడినంటావా” అని ఉడుక్కున్నాడు.

“ఛ! ఛ! మీరు మాములు పిచ్చివాడు కాదు. ప్రేమ పిచ్చి వాళ్ళన్నాను. “

“లేదు. నేనొప్పుకోను. నాది పిచ్చి ప్రేమ కాదు. అంతులేని ప్రేమ.”

“ఏమిటి అదో అంతు లేని కథలా చెబుతున్నారు.”

“అవును.నీ కళ్ళలోకి చూస్తే చాలు ప్రేమ పొంగిపొర్లుతుంది. రోజూ వాటికి దిష్టి తీసెయ్. లేకపోతే నా దిష్టే తగులుతుంది.”

ఆ పొగడ్తకు ఆమె కళ్ళు వాలిపోయాయి.

“మధువొలక బోసే నీ చిలిపి కళ్లు అవి నాకు వేసే బంగారు సంకెళ్లూ.”

కాస్త సమయం దొరికితే చాలు తన చుట్టూ తిరుగుతూ పాడే పాట అది. ముసి ముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది భోజనం వండటానికి.

వెళ్ళనీకుండా చేతులతో చుట్టేసాడు.

“బాబోయ్ నేను కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నాను. ఇంకొళ్ళయితే మీ అతి ప్రేమకు విడాకులు ఇచ్చేసేవారు.”

“ఇదెక్కడి విడ్డూరం? అతి ప్రేమకు విడాకులా?”

“అవును. స్వీట్ అతిగా తింటే ఎలా ఉంటుంది? అలాగే ఇది కూడా!”

“అంటే నీకు ఆ ఉద్దేశం ఉందా?”

“దేని గురించి.”

“నాకు విడాకులిద్దామని” గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ అడిగాడు.

“ఛా!ఏదో సరదాగా జోక్ చేసాను.మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అలాంటిది కలలో కూడా వదలను.”

“థాంక్యూ.” అంటూ ఒక్క ఉదుటన ఆమెను తన మీదకు లాక్కుని ముద్దులతో ముంచెత్తాడు. అతనికి అతి ప్రేమ వస్తే ఆమె కళ్ళను ముద్దు పెట్టుకోవటం అలవాటు. కాని ఆ నిముషాన వారికి తెలియదు మరునాడు ఏం జరుగుతుందో.

* * *

తెల్లవారి లేచేటప్పటికీ ఒళ్ళంతా కాలిపోతోంది హాసకు.

ఫ్యామిలీ డాక్టర్‌ని పిలిచాడు. అతను వచ్చి అది మలేరియా జ్వరమని మందులిచ్చాడు. వాటిని వేసుకున్న కొంత సేపటికి కళ్ళు మసకలు క్రమ్మటం ప్రారంభించింది. ఆ తర్వాత హాస తనకేమీ కనిపించటం లేదని గొడవ చేసింది. వెంటనే స్పెషలిస్టు దగ్గరకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు విరుగుడు మందు ఇచ్చాక కాస్త తెరిపిన బడింది. మలేరియా లేని వారికి ఆ మందు ఇస్తే అలాగే జరుగుతుందని, రెండు మూడు రోజులలో ఆమె చూపు మళ్ళీ సర్దుకుంటుందని చెప్పారు డాక్టరు. అలాగే హాసకి మళ్ళీ చూపు మాములయింది.

ఇంతలో తన కొచ్చిన ఆలోచనలు ఎన్నని?

అమ్మో! హాయ్‌ని కళ్ళులేని అమ్మాయిగా తాను చూడగలడా? నో ..ఆ ఊహే భరించలేకపోతున్నాడు.

ఈ సంఘటన జరిగిన రాత్రి మళ్ళీ తామిద్దరి మధ్య గొడవ జరిగింది.

“కొన్ని గంటలు కళ్ళు లేకపోతేనే ఎంతో బాధపడ్డాను. ఆ అంధకారాన్ని భరించలేకపోయాను. అలాంటిది గ్రుడ్డి వాళ్ళ పరిస్థితిని తలచుకుంటేనే జాలివేస్తోంది” అంది హాస.

‘దేనికో ఈ ఉపోద్ఘాతం’ స్వగతంలో అనుకున్నాడు.

“అసలు ఇంత మంది చనిపోతున్నారు కదా వాళ్ళంతా కళ్ళని దానం చేస్తే మన దేశంలో అసలు గ్రుడ్డి వాళ్ళే ఉండరు కదా! అలా ఎందుకు ఈ జనం ప్రవర్తించరు? కట్టెల్లో కాలిపోవటానికయినా ప్రయత్నిస్తారు కానీ కళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోరు. కాలిపోయే శవానికి కళ్ళు ఉంటే ఏం?లేకుంటే ఏం? బ్రతికున్న మనిషికి అవి ముఖ్యం. వీలు కుదురుతుంది,మార్చగలం, ఇవ్వండి అంటే కూడా పట్టించుకోకపోవటం అమానుషం.

నాకు ఏదయినా జరిగితే నా కళ్ళే కాదు నా బాడీలో ఏ పార్ట్ డాక్టర్స్‌ కి పనికి వస్తుందన్నా తీసుకోమనండి.ఈ ఒక్క మాట వినాలి మీరు.”

“ఛ! ఛ! హాయ్ ఎందుకొచ్చిన మాటలు వద్దన్నా అలాగే మాట్లాడతావు. నీకేదయినా అయితే నేను బ్రతికి ఉంటానా అవన్నీ చెయ్యిటానికి?”

“ఏమో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. నా మనసులోని మాట మీకు చెప్పాను. ఆ తరువాత చూడటానికి నేను ఉండనుగా. కళ్ళని తీసుకువెళ్ళమని ఐ-బ్యాంకు వాళ్ళకు పోన్ చెయ్యాలి. వాళ్ళు వచ్చే వరకూ కళ్ళను తడిగుడ్డలో కాని,తడి దూదిలో కానీ కప్పి ఉంచాలి.”

“అబ్బా! హాసా! ఇంక ఆపుతావా? ఆ మాటలు. నాకు వినటం ఇష్టం లేని వన్నీ మాట్లాడి ఎందుకు నాకు విసుగు తెప్పిస్తావ్! నిజంగా నీకు అలా జరిగితే నువ్వు చెప్పినట్లే చేస్తాను. చాలా!?” కోపం, విసుగు ధ్వనిస్తోంది.

“సారీ! మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను.”అంది తనే మళ్లీ.

ఆ రోజు అలా ముగిసింది. హాస ఆలోచనల నుంచీ బయటపడదామని ఉంది. కానీ, తన అణువణువును ఆక్రమించుకున్న హాసను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేడు. ఎవరికయినా చెబితే ఇది హాస్యమని కొట్టి పారేస్తారేమో!

మరో రోజు అలాంటిదే అతని కళ్ళ ముందు మెదిలింది.

“ఏమండీ! ప్రక్కంటి వాళ్ళు విదియ భోజనాలని, నన్ను చెల్లెలిలా చూసుకుంటున్నారుగా. భోజనానికి వస్తానన్నారు. బాగుండదని రమ్మన్నాను.”

“రేపు ఆదివారం కదా.”

“అవును. కానీ ఆ భోజనాలు విదియ రోజునే చేసుకుంటారు.”

“మనికిష్టమయితే వాళ్ళకు బట్టలు పెట్టవచ్చు. లేదేంటే లేదు. అది మీ ఇష్టం.”

“బట్టలవి ఏం కావాలన్నా తీసుకోవచ్చు. వారానికి ఉన్న ఒక్క సండే అయిపోతుందే.”

“మనకి ఎన్ని ఆదివారాలు లేవు. ఒక్కటి వాళ్ళ కోసం ఖర్చు చేద్దాం.”

“అయినా హాయ్! నీకు నేను చూపించే ఆప్యాయత చాలదా? వీళ్ళు వాళ్ళూ ఎందుకు చెప్పు?”

“అది కాదు. నేను చిన్నప్పటి నుంచీ అనాథ శరణాలయంలో పెరిగాను. ఈ ప్రేమలూ, ఆప్యాయతలు తెలియవు. అమ్మ గోరుముద్దలు తెలియవు. నాన్న తో నవ్వులాటలూ లేవు. తాతయ్య కథలు అంతకన్నా లేవు. అన్నా, అక్క, చెల్లి అంటే ఏమిటో తెలియదు. అలా ఆప్యాయంగా నాతో ఉండాలని ఎవరన్నా కోరుకున్నా ‘ఊఁ!’ అనటంలో తప్పు ఏమిటి? అందిరికీ సొంతవాళ్ళే కావాలంటే ఎలా? అభిమానంతో చెల్లిలా చూసుకుంటానంటే మనమిద్దరమే ఉండాలనే స్వార్థం పనికిరాదు. జీవితం అంతా మనం ఒకరికొకరం ఉంటూనే ఉంటాం. కానీ సమాజం మధ్యలో బ్రతుకుతున్నాం మనం. ఈ సమాజంలో మనుషుల్ని కూడా గౌరవించాలి.”

“అన్ని మాటలూ నేనే వినాలి. నా మాట ఒక్కటి కూడా వినవు.”

ఈయనా విద్యార్థులందరి చేత బాగా పాఠాలు చెప్పే మాష్టారు అని పొగిడించుకొనేది. తన దగ్గిర విద్యార్థిలాగే ఉంటారేం?

“సరే! రేపొక్క రోజు నా మాట వింటే ఈ సంవత్సరమంతా నేను మీ మాట వింటాను.”

“ఇక మన గురించి మనం మాట్లాడుకుందామా?”

“అలాగే!” అంటూ ప్రక్కన చేరింది.

అంతే అంత సేపటి వాదనలు, కోపాలూ, తాపాలు అన్నీ మరిచిపోయాడు.

సన్నగా నీలి కాంతి పరచుకున్న ఆ రూమ్‍లో మిల మిల మెరిసే ఆమె కళ్ళు. అందులో ఉప్పొంగే సముద్రంలా ఉరికే ప్రేమ. వాటిని చూస్తూ సర్వాన్నీ మరచి పోవచ్చు అనుకున్నాడు.

అతని చూపుల ప్రేమవర్షానికి ఆమె నిలువెల్లా తడిసిపోయింది.

ఆత్రంగా ఆమెను చుట్టేస్తూ కనురెప్పల మీద లెక్కలేనన్ని ముద్దులిచ్చాడు.

“ఏమిటిది చిన్న పిల్లవాడిలా. ఆపండి” అనే దాకా అలా ఇస్తూనే ఉన్నాడు. అతని ప్రేమ సముద్రంలో ఆమె ప్రతి రోజూ అలా ఓలలాడుతూనే ఉంటుంది. అందుకే అతని స్వార్థ మనస్తత్వాన్ని మార్చాలని చూస్తుందే కానీ విసుక్కోదు. అతనిని మానవత్వమున్న మనిషిగా మార్చగలననే ఆమె నమ్మకం. అలా తనను ఈ మూడు సంవత్సరాలలో తన మాటలతో, తన భావాలతో ముగ్ధుడిని చేసింది.

తమ పెళ్ళయి మూడు నిముషాలే అయినట్లనిపిస్తుంది. ఇన్నాళ్ళు గడిచినట్లే ఉండదు. తను ఎండలో స్కూటర్‌లో వస్తే వాడిపోతోందని కారు కొందామనుకున్నాడు.

హాస వస్తే డబ్బు వృథా అని కొననివ్వదని ఆమె వచ్చే లోపే కొనే ఏర్పాట్లు అన్నీ చేసాడు. కారు ఇంటి ముందు రడీ.

హాస కిష్టమయిన తెల్లటి టాటా సఫారీ. ఇక తను రావటం. ప్రారంభించటం. ఇంతకు ముందే తను డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కాబట్టి ఆ ప్రాబ్లెమ్ లేదు. అదే సమయంలో సెల్ మ్రోగింది.

“అమ్మకి ఇంకా అలాగే ఉంది. రావటానికి నాలుగు రోజులు పడుతుంది” అంది హాస. అప్పటి దాకా వరదలై పొంగుతున్న ఉత్సాహమంతా ఒక్కసారి చప్పబడిపోయింది.

“ఇంకా నాలుగు రోజులా!” మనసు బాధగా మూలుగుతూ మారం చెయ్యడం ప్రారంభించింది. పోనీ తనే అక్కడికి వెళదామంటే రావద్దని లక్ష్మణ రేఖలా హాస రేఖ గీసి వెళ్ళింది.

ఏం భార్యలో! భర్తల గురించి ఒక్క నిముషమయినా ఆలోచిస్తారో! లేదో!

హాస గురించేనా నువ్విలా మాట్లాడేది అంటూ మనసు ఎదురు తిరిగింది.

తన ప్రక్క వాళ్ల గురించి వాళ్ళకంటే ఎక్కువ ఆలోచించే హాస నీ గురించి అసలు ఆలోచించదా?

మూడేళ్ళకే ఆమె గురించి నువ్వింత ఇదయిపోతున్నావే! ఇరవై ఏళ్ళు అక్కడ పెరిగిన ఆమెకు ఆ అనాథ శరణాలయంలో ఎంత అనుబంధం ఉంటుందో ఆలోచించు అర్భకా! అంటూ తిట్టింది అంతరాత్మ.

నీకేం! కబుర్లు బాగానే చెబుతావే. తనను విడిచి ఇంకా నాలుగు రోజులు ఉండటం ఎంత కష్టమో ఆలోచించు!

అందరి భార్యల్లా తనూ ఉంటే అందరి మొగుళ్ళలా తను ఈ పాటికి పైలా పచ్చీసుగా తిరిగేవాడు. కాలేజీలో తన కొలీగ్స్ నవ్వుతున్నారు తన అవతారం చూసి. ‘భార్యలు బయటి ఊరికి వెళితే ఇంకో నాలుగు రోజులు రాకుండా ఉంటే బాగుండును అనుకుంటారు అందరూ. నువ్వేమిటిలా, రెండు మూడు రోజులకే దేవదాసు అయ్యావనే వారి ఎగతాళికి ఒక పిచ్చి నవ్వు నవ్వాడు ఏడవ లేక.

హాస తన కెంత ప్రాణమో వాళ్ళకి తెలిస్తే ఇలా మాట్లాడరుగా! ఎంత సేపూ కాలేజీ, తరువాత రోడ్డు మీద, లేదా కోచింగ్ సెంటర్‍లకు, అకాడమీలకు వెళ్ళి పార్ట్ టైమ్‌ చెప్పటం. ఇంటికి ఏ పదకొండింటికో చేరటం. జీవితాన్ని యాంత్రికంగా గడిపే ఈ పిచ్చి జనానికి ప్రేమ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది?

కందరీగల్లా తననీ ఆలోచనలు ఎందుకు చుట్టుముడుతున్నాయి?

“ఎందుకు చుట్టుముట్టవు ఖాళీగా కూర్చుంటే? ఈ రోజు తారీఖు ఎంత? మీరు చెయ్యాల్సిన పని ఏమిటి?” నిజంగా హాస ఎదురుగా నుంచొని మాట్లాడుతున్నట్లే అనిపించింది.

టేబుల్ మీద తేదీలు మార్చే కేలెండర్ వైపు చూసాడు. అవి అసలు మారుస్తూ ఉంటే కదా! గబ గబ ఆలోచించాడు. హాస ఫిబ్రవరి 11న వెళ్ళింది. మూడు రోజులయింది అంటే ఈ రోజు ఫిబ్రవరి 14th. వాలంటేయిన్స్ డే. అంటే ప్రేమికుల పండుగ.

“గుర్తు వచ్చిందా” హాస పలకరిస్తున్నట్లే.

అవును. ఆ రోజు హాస చెప్పిన మాటలు తను ఎప్పటికీ మరువడు. మరువలేడు.

‘మానవులమై పుట్టాం కాబట్టి ఒకరికొకరం సహాయపడుతూ ఉండాలి. దానికి గుర్తుగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతి నెలా ఈ పధ్నాలుగవ తారీఖున మనమిద్దరం బ్లడ్ బ్యాంక్‌కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేద్దాం! ఏం!’

 ఏదైనా తన అందమయిన కళ్ళతో భావాలను చిలికిస్తూ, చిన్న పిల్లవాడికి చెప్పినట్లు చెప్పి చేయించే విధానం తనకు బాగుంటుంది. అందరి మీద అల్లరిగా ఎగిరే తను, చంఢశాసనుడిలా పేరు తెచ్చుకున్న తను తల్లి కొంగు పట్టుకొని నిక్కరు పైకి లాగుకుంటూ వెళ్ళే పిల్లవాడిలా హాస ఏం చెబితే అది వినే స్థాయికి ఎదిగాడు. బయటి జనం దిగజారాడు అంటున్నారు. అయినా తను పట్టించుకోడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఇద్దరూ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వస్తూనే ఉన్నారు. వెంటనే షర్ట్ వేసుకొని బ్లడ్ బ్యాంక్‌కు బయలు దేరాడు.ఇలా ఇచ్చిన తన రక్తం ఎందరికో ఆపద సమయంలో సహాయపడవచ్చు అనుకున్నాడు మనసులో.

తనలో వచ్చే ప్రతి చిన్న మార్పుకు హాస చిన్న పిల్లలా సంబరపడి చప్పట్లు కొట్టేది. ‘కీప్ ఇట్ అప్’ అనేది. హాస నా ఆశ. హాస నా ఊపిరి.

 * * *

మదర్ థెరిసా స్ఫూర్తితో పెట్టిన ‘అమ్మ’ అనాథ శరణాలయం.అక్కడఎవరి నోట విన్నా హాస పిలుపే! అక్కడ అందరికీ హాస బాగా అలవాటు. ఆమెకు ఉద్యోగం రావటంతో అనాథ శరణాలయం వదిలి వెళ్ళవలసి వచ్చింది. తనలాంటి మరొకరికి ఆ చోటు దక్కాలని వెళ్ళింది, కానీ దేవాలయం లాంటి శరణాలయాన్ని వదలటం ఆమెకిష్టం లేదు. ఆమె ఏ వంకతో వచ్చినా అందరికీ పండుగలా ఉంది.అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి పుట్టింటికి వచ్చినట్లుగా ఉంది. అమ్మకి బాగోలేదని బాధతో అంతా పూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు కానీ లేకుంటే ఇంకా ఆనందంగా ఉండేవారు.

హాస వచ్చిందంటే వారికి కొండంత బలంగా ఉంది. పగలంతా అమ్మను చూసుకోవటంతో, ఖాళీ ఉన్న టైములో తన తోటి వారితో గడిచిపోయినా రాత్రి అయ్యేటప్పటికి పసివాడిలా తన ఒడిలో చేరే ‘మనీష్’ గుర్తు వచ్చేవాడు. ఎలా ఉన్నారో! ఏమో! అని వ్యథ చెందేది. ఎంత తొందరగా అమ్మకు బాగయితే అంత తొందరగా వెళ్ళవచ్చుననుకొనేది.

అనుకున్నట్లు అన్నీ జరగవు. అలాగే తన ప్రయాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. సరిగ్గా వారం తర్వాత అమ్మకు ఫరవాలేదని డాక్టరు చెప్పాక అందిరికీ వీడ్కోలు ఇచ్చి బయలసుదేరింది.

“అక్కా! బావగారికి ఫోన్ చేసావా వస్తున్నానని.”

“లేదు. నేను వెళ్ళే టైమ్‍కి ఇంట్లోనే ఉంటారు. సర్ ప్రైయిజ్ చేద్దామని ఫోన్ చెయ్యలేదు.”

“సరే! చేరగానే ఫోను చెయ్యి.”

మనిషికి ఎంత నమ్మకం అంతా అనుకున్నట్లే జరుగుతుందని.

అతని గురించిన ఆలోచనలతో ఆనందంతో తేలిపోతూ ప్రయాణాన్ని ప్రయాస లేకుండా చేసింది. సూట్ కేస్ తీసుకుని స్టేషన్ బయటకు వచ్చి ఆటో అతనికి అడ్రస్ చెప్పి ఎక్కింది. ఇంకొన్ని క్షణాలలో భర్త ముందు ఉంటాననే ఉద్విగ్నత ఆమెను ఉక్కిరి బిక్కరి చేస్తోంది. అదిగో తమ ఇల్లు వచ్చేస్తోంది. తాళం వేసుకొని ఈయన ఎక్కడికీ వెళ్ళలేదు కదా. ఫోను కూడా చెయ్యకుండా వచ్చిందని ఆటోలోంచి తొంగి చూస్తోంది. ఇంతలోనే యమ ధర్మరాజులా బ్రేకులు పడకపోవటంతో అదుపు తప్పిన లారీ ఆటోని గుద్దేసింది.

“ఇదే ఇల్లు” అని చెబుతున్న హాస ఇంటి వేపు చూస్తున్న ఆటో డ్రైవరు ఎదురుగా వస్తున్న అపాయాన్ని గ్రహించలేకపోయాడు. ఆటో ముందు భాగం తుక్కుతుక్కు అయింది. తోటకూర కాడల్లా వాటి మధ్య డ్రైవరు, హాస. సెకన్లలో ఆ వార్త పొగలా వ్యాపించింది. కాలింగ్ బెల్ అదే పనిగా మ్రోగుతుంటే ఏమిటా అని బయటకు వచ్చాడు.

ఎదురుగా ప్రక్కింటాయన.

“హాస ఆటోలో” – వగరుస్తూ చెప్పాడు.

అతని హృదయం ఏదో కీడును శంకించింది. పరుగెత్తాడు.

తలంతా రక్తంతో హాస. అప్పుడే ఆమెకు కాస్త స్పృహ వచ్చింది. “డాక్టరు దగ్గరికి తీసుకువెళ్దాం” అంటున్న అతన్ని వారించి “ఏమండీ నా తలను మీ ఒళ్ళో పెట్టుకోరూ” అని అడిగింది.ఆమె కళ్ళు అప్పటికే సోలిపోతున్నాయి.

“హాసా! ముందు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళనివ్వు.”

“లేదండీ నేను వెళ్ళిపోతున్నాను. నాకు తెలిసిపోయింది. మీతో నా అనుబంధం ఇంత తొందరగా ముగుస్తుందని నాకు తెలియదు. అందుకే మీరు ఎంత గొడవ పెట్టినా మన టైమ్‌ని అందరికీ పెంచిపెట్టి అందరి ఆప్యాయతలను పొందాలనుకునే దాన్ని.మీ మనసును ఎన్నో సార్లు బాధపెట్టాను. అది తప్పో, ఒప్పో నిర్ణయించే సమయం లేదు. నేను తప్పు చేసి ఉంటే క్షమించెయ్యండి. నేను మిమ్మల్ని ఆశ్చర్యపరుద్దామనుకున్నాను చెప్పకుండా వచ్చి. దేవుడే నన్ను ఆశ్చర్యపరిచాడు. మీరు వచ్చి స్కూటర్‌తో తీసుకు వస్తే ఇలా అయ్యేది కాదేమో!”

ఆ కళ్ళ నుంచీ ధారాపాతంగా కన్నీళ్ళు. గొంతులోంచి మాటలు అతికష్టం మీద వస్తున్నాయి.

“హాసా! నువ్వలా అనకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీతో పాటే వచ్చేస్తాను. చూడు నీకు ఎండ తగలకూడదని అదుగో నీకిష్టమయిన కారు కూడా కొన్నాను. నన్ను వదిలి వెళ్ళిపోకు. నీ కళ్ళలో కన్నీటిని నేను భరించలేను.”

“ఏమండీ నేను చెప్పింది గుర్తుందిగా.మా అనాథాశ్రమం లో అరవింద అనే అమ్మాయికి కళ్ళు లేవు.ఆమెకు నా కళ్ళు ఇమ్మనండి. ఇదే నా చివరి కోరిక.ఐ బ్యాంక్‌కి ఫోన్ చెయ్యటం మరిచిపోరుగా. కళ్ళ మీద తడి గుడ్డ వేసి ఉంచాలి.నా శరీరాన్ని అవయవదానం వారికి అప్పగించండి.సారీ వెళ్ళిపోతున్నాను. మీరు మళ్ళీ…” అంటుండగానే మాట ఆగిపోయింది. “హాయ్!” అతను గొంతు చించుకుని అరిచాడు. “హాసా! నీ కళ్ళు మూత పడటం నేను చూడలేను. నేను భరించలేను. నేను భరించలేను.”

హాస మాటలు విన్న ప్రక్కింటి అర్జున్ వెంటనే తడి గుడ్డను తడిపి తీసుకు వచ్చి హాస కళ్ళను కప్పి ఉంచాడు. ప్రక్కన ఒక మగ్గులో నీళ్ళు వినీల్ తెచ్చి పెట్టాడు.

“వెళ్ళండి ప్లీజ్” వెనకనుంచీ ఎవరో తోస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు నిద్రలో లేచినవాడిలా ఇంట్లోకి వెళ్ళి డైరెక్టరీ తెరిచాడు. ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్లలో ఫస్ట్ వ్రాసిన ఆ నెంబర్‌ను, హాస రైటింగ్‌ని చూసి నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. ఇక తనకు అవే మిగిలాయి.

రింగ్ చేసాడు. “కళ్ళు డొనెట్ చెయ్యదలచుకున్నాం. వచ్చి తీసుకువెళ్ళండి.”

“థాంక్సండీ. తడి గుడ్డ వేసి ఉంచారుగా. మేం వెంటనే బయలు తేరుతున్నాం. అప్పటిదాకా కళ్లను తడుపుతూ ఉండండి.” అని అడ్రస్ రాసుకున్నాడు.

రిసీవర్‌ని క్రెడిల్ చెయ్యటం మరిచిన వాడిలా అలా కూలబడిపోయాడు.హాస లేదనే సత్యాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు.

సర్వం కోల్పోయినవాడిలా బేజారయిపోయాడు. ఇరుగు పొరుగుల ఓదార్పులు హాసను మరింత గుర్తు చేస్తున్నాయి. వాళ్ళంతా సొంత మనుషుల్లా జరగవలసిన కార్యక్రమాలు చూస్తుంటే ఇన్నాళ్ళు తాను ప్రవర్తించిన తీరు పరిహాసం చేసినట్లనిపిస్తోంది.

“హాసా! నువ్వే గెలిచావు! నువ్వే గెలిచావు! కాని నీ గెలుపును సెలబ్రేట్ చేసుకోవటానికి నాకు తోడెవరు? నా కింకెవరూ లేరు” రోదిస్తూనే ఉన్నాడు. అతనిని ఓదార్చటం ఎవరికీ సాధ్యం కావడం లేదు.కన్నీళ్ళు అతనికి ఆగటం లేదు. మగవాళ్ళు ఏడవటం ఎవరూ చూడలేదేమో అందరూ వింతగా చూస్తున్నారు. అందులో భార్య చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు అంత వరకూ కనిపించలేదేమో. జనం గుంపులు గుపులుగా గుమిగూడుతున్నారు. చిన్న వయసులోనే పోయిందని కొందరు, అదృష్టవంతురాలని మరికొందరు, ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతలో ఐ బ్యంక్ వాళ్ళు రావటం, కార్నియాలు తీసుకొని మనీష్‌కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఎవరికయినా ఫోన్ చెయ్యాలా ఎవరో అడుగుతున్నారు. ‘అమ్మ అనాథ శరణాలయం’ గుర్తుకు వచ్చింది. కాని అతనికి మనస్కరించలేదు. ఇప్పుడే ఆరోగ్యం కుదుట పడుతున్న అమ్మ, హాస అంటే ప్రాణం పెట్టే తోటివాళ్ళు. వాళ్ళ దృష్టిలో అయినా హాసను బ్రతికుండనివ్వనీ అనుకుంటూ “ఎవ్వరికీ చెప్పక్కర్లేదు” అన్నాడు.

మనీష్‌ని పైసా డబ్బు అడిగిన వారు కూడా లేరు.ఎవరికి తోచిన పని వారు చేస్తున్నారు. పనులన్నీ జరిగిపోతున్నాయి.

ఎవరు ఏడుస్తున్నా, ఎవరు నవ్వుతున్నా మా డ్యూటీలు మారవు అన్నట్లు సూర్యుడు అస్తమించటం,చంద్రుడు ఆకాశంలోకి రావటం ఒకేసారి జరిగాయి.

* * *

హాస కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్న ఆమెను తానొక్కసారి ఎందుకు చూడకూడదు?

గడ్డం మాసి ఉన్నదీ చూడలేదు. పట్టించుకోలేదు. లుంగీ మీద ఉన్నాడన్న విషయమూ అతనికి అక్కర్లేకపోయింది.ఆ ఊహ రాగానే బయటికి పరుగెత్తాడు.

గుమ్మం బయట రఘ “అంకుల్ షర్ట్ వేసుకోలేదు” అంటే వెంటనే లోపలికి వెళ్ళి షర్టు వేసుకొని స్కూటర్ తాళాలు తీసుకొని స్కూటర్ మీద ప్రయాణమయ్యాడు.

వార్డెన్ అనుమతితో ఆ అమ్మాయి అరవిందను చూసాడు. ఆ అమ్మాయిని తాను చూస్తున్నాన్న అనుభూతి కంటే హాస కళ్ళు తనని గమనిస్తున్నాయన్న తృప్తి అతనికి ఎక్కువగా ఉంది.అలా ఆమెనే చూస్తున్నాడు. ఆమె కూడా అతనిని ఆరాధనగా చూస్తోంది. తనకి ఈ విశాల మయిన ప్రపంచాన్ని చూసే అవకాశమిచ్చిన పుణ్యమూర్తి భర్త అతను.

అతనికి ఆమెను ఎంత సేపు చూసినా తనివి తీరటం లేదు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి! ఒకటే ప్రశ్న.

సమాధానం లేని ప్రశ్న.

ఈలోపు పవన్ కూడా వచ్చాడు. అరవింద అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. అతనిని చూసినా అదే అనుభూతి. వారిద్దరూ తనకు ఏమి కారు. తన జ్ఞాపకం వారిద్దరితో ముడిపడి ఉంది.

హాస లేకపోవచ్చు. కానీ ఆ చూపును తానెందుకు వదులుకోవాలి? ఆ అమ్మాయి కళ్ళలో బ్రతికే ఉన్న తన ప్రేమ చిహ్నాన్ని కళ్ళెదుట కనబడుతుంటే వదులు కోవటానికి తనేం మూర్ఖుడు కాడు. అరవింద అనాథ. తనకి ఎందరు ఉన్నా అందరూ లేనట్లే. ఈ ఆలోచన అతన్ని నిలువ నీయటం లేదు. వెంటనే ఏదో చేయ్యాలి.

‘విశాలసదన్’ నిర్వహించే ‘విమల’ గారిని కలిసాడు. తన ప్రాబ్లెమ్ చెప్పి “ఆమెను నేను తీసుకు వెళ్ళాలి అన్నాడు.”

“అలానే తీసుకవెళ్ళవచ్చు. ఆమె పేరు మీద ఇరవై వేలు డిపాజిట్ చేయాలి.”

“ఇరవై వేలు కాదు నలభై వేలు చెయ్యమన్నా చేస్తాను. ఆమె కావాలి అంతే.”

“సరే! ఆమెను పెళ్ళి చేసుకుంటారా?”

“పెళ్ళా! ఆశ్చర్యపోయాడు మనీష్.”

తనకా ఆలోచన లేదు.

“లేదు.” ధృడంగా చెప్పాడు.

“అదేం?మీ వయసు పెద్దదేం కాదు. ఎంత అందమున్నా అనాథను ఊరికే చేసుకొనే వాళ్ళుండరు. మీరెందుకు పెళ్ళి చేసుకోకూడదు అలోచించండి. మాములుగా మాకీ విషయాలన్నీ అనవసరం. కానీ మీకు మా హాస పట్ల ఎంత ప్రేమ ఉందో గమనించాం కాబట్టి ఈ సలహా ఇచ్చాను.”

“లేదండీ! హాస నా ప్రాణం. ఆమె ఊహలలో ఆమెతో గడిపిన క్షణాలు గుర్తులతో ఈ శేష జీవితాన్ని గడిపెయ్యగలను. నాకా ఉద్దేశం లేదు.”

“మీరు మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారు. కానీ ఒకళ్ళను బయటకు పంపే ముందు ఫుల్ సెక్యూరిటీ చూసుకోవటం మా బాధ్యత. మీకు తెలుసా, ఒకరు ఇలానే మనీ కట్టి మరో పదిహేను వేలు ఎక్కువగా బేరం కుదుర్చుకొని ఆమెను వేశ్యా గృహానికి అమ్మేశాడు. మేము అమ్మలంత ప్రేమ నివ్వలేకపోవచ్చు. కానీ అమ్మేవాళ్ళం కాదు. ఉన్నంతలో వాళ్ళకు తిండి, బట్ట, ప్రేమ ఇవ్వడానికే మేమున్నాం. వాటిని సమృద్ధిగా అందించే చోటు అయితేనే వారిని పంపుతాం. లేదంటే వాళ్ళ మా దగ్గిరే ఆనందంగా ఉంటారు. మీరు కావాలంటే ఆలోచించుకొని రండి. అన్ని అనాధ శరణాలయాల సంగతి నాకు తెలియదు. మాకు కొన్ని స్పెషల్ రూల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఫాలో అవుతాం.ఆలోచించుకున్నాకే రండి” అని చెప్పిందావిడ.

వెళ్ళేముందు మళ్ళీ ఒక్కసారి అరవింద, పవన్ లను చూసి వాళ్ళతో మాట్లాడి వెళ్ళాడు మనీష్. ఆ రాత్రంతా ఆలోచించాడు. తెల్లవారుఝామున ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు విశాల సదన్ ముందు వాలుతానా అని అతని హృదయం ఒకటే తపన పడుతుంది. తన నిర్ణయం తనకే ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తోంది. ఆ తృప్తి చాలు అనుకున్నాడు.

ఎనిమిది గంటలకంతా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసి ‘విమల’ విస్మయం చెందలేదు కానీ అతను చెప్పే విషయం విని ఆమె విస్తుపోయింది. ఒక మహాత్ముడిని చూసినట్లు చూసింది. చివరకు ఓ.కే. చెప్పి కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. “ఫార్మాలిటీస్ అన్ని నేను పూర్తి చేస్తాను. మీరు ముహుర్తాలు పెట్టుకొని రండి” అంది.

అతను ఆనందంతో బయటకు వచ్చాడు. మరొక్క సారి ఆ అమ్మాయిని చూడాలనిపించింది. వెనక్కు తిరిగి వెళ్ళి వార్డెన్‌తో చెప్పటంతో బెల్ కొట్టి అరవిందను రప్పించింది. అరవింద రాగానే అతనికి నమస్కరించింది. ఆమె కళ్ళలో మెరిసే మెరుపు అతనికేదో కొత్త సందేశాలు అందిచినట్లు భావన. పది నిముషాలు తరువాత థాంక్స్ చెప్పి బయటపడ్డాడు.

సరాసరి గుళ్ళోకి వెళ్ళి శుభ ముహుర్తం నిశ్చయించాడు

ఆరు గంటల ఆరు నిముషాలకు, ఎనిమిది గంటలకు మరొకటి రెండు ముహూర్తాలు అద్భుతంగా ఉన్నాయన్నాడు పూజారి.

థాంక్స్ చెప్పి రిలాక్స్‌డ్‌గా నడవటం ప్రారంభించాడు.

* * *

అందరూ ఎదురు చూసే ఆ రోజు రానే వచ్చింది. మనీష్ ఇంటి చుట్టు ప్రక్కలవారు, అనాథ శరణాలయం విశాలసదన్ వాళ్ళు, ఐ బ్యాంక్ స్టాఫ్, తన కాలేజి స్టాఫ్ – వారినే తన బంధువులుగా తలచి పిలిచాడు.

ముహుర్తం దగ్గర పడుతోంది “కార్యక్రమం ప్రారంభించండి” పురోహితుడి మాటలు మంగళవాయిద్యాలు ఒకేసారి మ్రోగాయి.

మనీష్ అరవిందను దత్తత తీసుకున్నాడు. ఆ కార్యక్రమం అయ్యాక పవన్ అంగీకారంతో అరవిందకిచ్చి వివాహం ఎమిమిది గంటల ముహుర్తానికే జరిపించి అందరి చేత అభినందలను అందుకున్నాడు. తనకున్న ఆస్తిని వారిద్దరికి పెళ్ళి కానుకగా బహుకరించాడు. అదే సమయంలో తన కళ్ళను కూడా మరణానంతరం వారికే దక్కేట్లుగా చెబుతూ, ప్రతి వాళ్ళు తమ కళ్ళను డొనేట్ చెయ్యమని హితబోధ చేశాడు. మరి పవన్ కూడా కళ్ళు లేని వాడే!

* * *

కన్నె పిల్ల కనిపిస్తే కాలరెగరేసే ఈ రోజుల్లో ఒక కన్నెపిల్లను దత్తత తీసుకొని, మరో అనాథకిచ్చి పెళ్ళి చేసి, వాళ్ళిదరికీ తన యావదాస్తిని ఇచ్చి, తన దగ్గరే తనకంటి పాపల్లా చూసుకుంటాననే ఆ మహత్తర పురుషుడిని స్తుతించని హృదయం లేదు అక్కడ. ఎంత వారివి హాస కళ్ళయినా హాస కిచ్చిన మాట నిలబెట్టుకున్నానని మనీష్ ఆనందపడుతుంటే, అతని హృదయంలో వచ్చిన మానవత్వపు మార్పును ఆకాశంలోని హాస ఆత్మ సంతృప్తిగా గమనిస్తోంది.

* * *

అలా మూడు సంవత్సరాలు గడిచాయి. మనవరాలు హాస రూపంలో ఆ ఇంట చేరింది.

అందరూ మనీష్‌ని ఇంత చేసాడని పొగుడుతుంటే భగవంతుడు నేనున్నానంటూ నిద్రలోనే మనీష్‌ని ‘మంచి వాడివి ఇక్కడెందుకు, హాస దగ్గరకు వచ్చేయ్’ అని తీసుకువెళ్ళిపోయాడు. అతని కళ్ళను పవన్‌కు అమర్చారు డాక్టర్లు.

ఇద్దరి విశాల హృదయాల విశాల నేత్రాలతో విశాల ప్రపంచంలో వారు ఒంటరితనాన్ని విడిచిపెట్టి మనీష్, హాసల నయనాలు తోడుతో జంటగానే కాపురం చేసారు.

భగవంతుడెంత విశాల హృదయుడు?

Exit mobile version