Site icon Sanchika

విషవృక్షంలో ఒక కొమ్మ

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]సు[/dropcap]బ్బారాయుడు 92 సంవత్సరాల వృద్ధుడు. అతని భార్య కాత్యాయనికి 90 ఏళ్లు. అయినా ఇప్పుడు వాళ్ళిద్దరూ వృద్ధులు కాదు. 35 ఏళ్ళ యువతీ యువకుల్లా స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు. అందుకు కారణం వాళ్ల ఆఖరికొడుకు.. చంద్రం.

చంద్రానికి ఊహ తెలిసినప్పటి నుండి.. దేవుడంటే తెలియదు. తల్లిదండ్రులే దైవమని బ్రతుకుతున్నాడు. పండుగలు, పూజలు అతనికి అవసరం లేదు. ప్రతిరోజూ తల్లిదండ్రులకు పూజచేయటం.. సేవలు చేయటం.. అలా ప్రతిరోజు పండుగ అనుభూతిని ఆనందిస్తున్నాడు చంద్రం.

అందుకు కారణం.. తన కన్నా 20 ఏళ్లు ముందుగా పుట్టిన తన ఇద్దరు అన్నలే. వాళ్ల ప్రవర్తన వల్లే చంద్రంలో మానసిక మార్పు వచ్చింది. పెళ్లిళ్లు అయిన వెంటనే తల్లిదండ్రులతో తీవ్రంగా విరోధించి వాళ్లను కష్టాలపాలు చేసి చివరికి ఆస్తులు పంచుకుని కన్న తల్లిదండ్రులను వదిలి దూరంగా ఆ పెద్ద అన్నలు ఇద్దరూ వెళ్లిపోవడమే.. చంద్రం జీవితాన్నే మార్చేసింది. ఆ సంఘటన జరిగినప్పుడు చంద్రానికి ఐదు సంవత్సరాలే!

ఊరిలోవారు.. బంధువులు.. చుట్టుపక్కల వారు.. “బాబు.. చిట్టి తండ్రి.. చంద్రం.. ఇక మీదట జీవితాంతం నీ తల్లిదండ్రులకు నువ్వే దిక్కురా. నువ్వు కూడా చూడకపోతే వాళ్ళు చచ్చిపోతారు..” అని సమయం చిక్కినప్పుడు ఆ చిన్న వయసులో చిన్నిచంద్రానికి అర్థమయ్యేలా చెప్పారు. బాల భక్తుల పురాణ కథలు కూడా చెప్పి తల్లిదండ్రుల తర్వాతే దైవం.. అంటూ.. చంద్రం రెండు చెవుల్లోనూ నూరిపోశారు.

అదిగో.. అప్పటి నుండే దైవం ఫోటోలు కూడా చూడడం మానేసాడు చంద్రం. అతని రెండు కళ్ళు తెరిస్తే అమ్మా నాన్నలే కనబడడంగా అలవాటు చేసుకున్నాడు. ధనం సంపాదించుకోవడం, ఆరోగ్యం పెంపొందించుకోవడం, చివరికి భార్యాబిడ్డలతో జీవితం గడపటం.. వీటి మీద బొత్తిగా ఆశ లేదు చంద్రానికి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముందు అవన్నీ దండగ అనే అభిప్రాయంలో అతను ఉన్నాడు.

అలా.. అప్పటి బాల్యం నుండి ఇప్పటివరకు 25 సంవత్సరాల పాటు చంద్రం తల్లిదండ్రుల సేవలో పునీతుడు అయిపోతూనే ఉన్నాడు.. ఇప్పుడు అతని వయసు 30 ఏళ్ళు.

అయితే సంవత్సర కాలం నుండి చంద్రం ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వస్తుంది. అయినా అతను పట్టించుకోలేదు.. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తన గురించి ఆలోచిస్తూ వాళ్లు అనారోగ్యం పాలు అవ్వచ్చు అని.. తన వ్యాధులన్నీ రహస్యంగా దాచుకుంటూ వస్తున్నాడు.

***

గతం గతః.. ప్రస్తుతం..

చంద్రం ఉదయం నుండి పూర్తి శక్తి కోల్పోయినట్లు అయిపోయాడు. మగతగా అలా పడి ఉండి పైకి లేవలేకపోతున్నాడు. గ్రహించిన చంద్రం తల్లిదండ్రులకు అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు.

తండ్రి సుబ్బారాయుడు.. ఊరిలోనే ఉన్న తన తోడల్లుడు, తన కష్టసుఖాలను బాగా పంచుకునే శేషగిరికి కబురు పెట్టాడు. ఆలస్యం చేయకుండా శేషగిరి వెంటనే వచ్చాడు.

“తమ్ముడూ.. శేషగిరీ.. మా అబ్బాయి చంద్రం విషయం ఏం చేద్దాంరా?.. ఉదయం నుండి నా ముద్దుల కొడుకు ఏ మాత్రం స్పృహలో లేడు. గత సంవత్సరం నుండి ఆరోగ్యం విషయంలో వాడిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నా తెలుసుకోలేకపోయాను. ప్రస్తుతం వాడి పరిస్థితి విషమించినట్లు కనిపిస్తుంది. వాడు నీతో చనువుగా ఉంటాడు కదా అని నీకు కబురు పెట్టాను.. ఏదో ఆలోచన చెప్పరా నాకు కాళ్ళు కదలడం లేదు”.. అంటూ రోదిస్తూ అడిగాడు సుబ్బారాయుడు.. తన తమ్ముడు వరస అయిన శేషగిరిని… లోపల నుండి చంద్రం తల్లి కాత్యాయని కూడా వచ్చి మరింత గగ్గోలుగా కొడుకు గురించి ఏడవడం మొదలుపెట్టింది.

శేషగిరి తను కూడా బాధను నొక్కి పెట్టుకుంటూ.. “అన్నయ్యా.. నిజమే.. సంవత్సరం నుండి విపరీతమైన మార్పులకు లోనవుతున్న మన చంద్రంని.. సిటీలో పెద్ద డాక్టర్‌కి చూపించడం తప్పించి ఏం చేయగలం.? అసలు.. ఇటువంటి ‘వింత’ నేను ఎక్కడ చూడలేదు. ఈ 90 ఏళ్ల పైబడ్డ వయసులో మీ భార్యాభర్త లిద్దరికీ 32 పళ్ళు బాగానే ఉన్నాయి.. అందుకోసం మీ అబ్బాయి చంద్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని సంవత్సరాల తరబడి చేసిన కృషి అమోఘం. కానీ.. మీ అబ్బాయి చంద్రంకి ఆ 32 పళ్ళు ఊడిపోయాయిరా.

ఎన్నో ఆయుర్వేద మందులు వాడి మీ ఇద్దరి తలల్లో ఒక తెల్ల వెంట్రుకలు లేకుండా చేశాడు.. మీ అబ్బాయి. అదే సమయంలో వాడి తలలో ఒక్క నల్ల వెంట్రుక ఉంటే ఒట్టు. తలంతా ముగ్గు బుట్టలా మారిపోయి కేవలం 30 సంవత్సరాల వయసులో 150 సంవత్సరాల వృద్ధుడుగా తయారైపోయాడు.

ఒరేయ్ అన్నయ్యా.. సుబ్బారాయుడు.. ఇక మీ భార్యభర్తలు కళ్ళు విషయం.. ఈ వయసులో కళ్ళజోడు లేకుండా ఇప్పటికీ మీరిద్దరూ చదవగలుగుతున్నారంటే.. అది నీ కొడుకు చంద్రం వల్ల కాదని చెప్పగలవా? డబ్బుకు, ఖర్చుకు వెనుకాడకుండా తనకు వచ్చిన వాట ఆస్తినంతా తెగ నమ్మి దూర ప్రాంతాలకు సైతం తీసుకుని వెళ్లి ప్రత్యేకమైన ఆపరేషన్ల ద్వారా మీ ఇద్దరి కంటిచూపు.. ఏ మాత్రం తగ్గకుండా చేయగలిగాడు.. మీ బిడ్డ చంద్రం. జ్ఞాపకం తెచ్చుకుని చెప్పడానికే ఏడుపొస్తుందిరా. ఇక.. ఇప్పుడు.. వాడి కళ్ళు రెండూ పూర్తిగా కనపడటం లేదు. ఆ విషయం మీకు తెలుసా..? కనిపిస్తున్నట్టు మీ ఇద్దరి దగ్గర నటిస్తున్నాడురా.. మీ మూడో కొడుకు, పిచ్చిసన్నాసి.. చంద్రంగాడు.

25 ఏళ్ల క్రితమే నీ మిగిలిన కొడుకులిద్దరూ పెళ్ళాలతో ముంబై వెళ్లిపోయి పెద్ద వ్యాపారాలు చేసి బోల్డంత ఆస్తిపాస్తులు సంపాదించారు.. హాయిగా ఆరోగ్యంతో హోదాగా ఉన్నారు. తల్లి తండ్రి చచ్చి పోయారు అనుకొని బతుకుతున్న వాళ్ళు మహారాజ వైభోగం అనుభవిస్తున్నారు.. పాతిక సంవత్స రాలుగా.

మరి వీడు.. తను స్నానం చేస్తే 30 నిమిషాలు మీ సేవకు దూరం అయిపోతానని ఆలోచిస్తూ పాతిక సంవత్సరాలుగా మీ సేవలో తరించి తరించి పునీతుడు అయిపోతున్నాడు. మీ మూడవ కొడుకు ఈ దరిద్రపు గొట్టు చంద్రంగాడు.. దమ్మిడీకి మారని ముష్టి ముదనష్టపు జీవితం గడుపుతున్న.. వీడు అసలు మనిషేనoటావా?? గుర్తు చేసుకుంటే గుండె పగిలి పోతుందిరా.. మెదడు వెయ్యి ముక్కలయి పోతుంది. ఈ ఎదవన్నర ఎదవని.. దేవుడు ఎందుకు పుట్టించాడో నాకు అర్థం కావడం లేదు.. ఇదేదో బాగుందే అనుకుంటూ దేవుడు కూడా ఖర్మ అంతా ఈ ఏబ్రాసిగాడు తలకే చుట్టపెట్టాడు కానీ.. మిగిలిన ఆ పెద్ద అన్నలు ఇద్దరు వైపు కనీసం కన్నెత్తి చూడలేకపోతున్నాడు. దేవుడు ఎంత స్వార్థపరుడో.. చూడరా.

మీ ఇద్దరికీ బీపీ, షుగర్ అంటే ఏమిటో తెలుసునా. నిరంతరం మీ ఆహార నియమాలలో చంద్రం శ్రద్ధ తీసుకుంటు.. మీకు బీపీ షుగర్ రాకుండా చేసేడు.

మరి ఈ పింజారి వెధవకి డాక్టర్ల భయపడేంత బీపీ షుగర్ ఉందిరా.. మీరు కంగారు పడిపోతారని.. దానితో హార్ట్ఎటాక్ వస్తుందని ఏ ఒక్క విషయము మీకు చెప్పవద్దని నాచేత ఒట్టు వేయించుకున్న విషయం మీకు తెలుసా.. ఒట్టు తీసి గట్టున పెట్టి ఇప్పుడు నేను ధైర్యం చేసి మీకు ఎందుకు పూర్తి విషయాలన్నీ చెప్పవలసి వచ్చిందో అదయినా మీకు తెలుసా.. మీ ఇద్దరికీ తెలియకుండా నేను 2 రోజుల క్రితం.. మన ఊరిలో ఉన్న వెంకటయ్య డాక్టర్ గారికి చూపించాను వీడిని..

మీ బడుద్దాయి.. ‘నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లవద్దు బాబాయ్.. అమ్మానాన్న క్షేమంగా ఉంటే చాలు.. నేను ఏమైపోయినా పర్వాలేదు.. వాళ్లు నాకు ప్రాణం పోసినందుకు వాళ్ళిద్దరి కోసం నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను..’ అంటూ రానన్నాడు.

నేను ఎలాగో బ్రతిమిలాడి తీసుకువెడితే ఆ డాక్టర్ ఏమన్నాడో చెప్పమంటారా.. మన చంద్రo పరిస్థితి ఇక రోజులు మీద ఉన్నది.. అని చెప్పారురా.”

శేషగిరి.. అలా గుక్కతిప్పుకోకుండా వాళ్ళిద్దరికీ చెబుతూ.. భరించలేని బాధను వెళ్లగక్కుతూ అక్కడే ఉన్న కుర్చీ మీద కూలబడి పోయాడు.

శేషగిరి చెప్పేదంతా వింటూ.. రోదిస్తూ.. కుమిలిపోతూ.. దీనంగా నిలబడి సుబ్బారాయుడు అతని భార్య కాత్యాయని.. బావురుమని ఏడుస్తూ రెండు చేతులతో మొఖం మూసుకొని.. పెద్ద తప్పు చేసిన నేరస్థుల్లా.. ప్రాణంలేని మనుషుల్లా ఊపిరి తీసుకోవడం మరిచిపోయినట్టయిపోయారు.

శేషగిరి ఇంకా చెబుతూ… “తెల్లారేసరికి బిందెడు పాలు.. బుట్టెడు పువ్వులు కొని తెచ్చి అమ్మానాన్నల కాళ్లకు పాలతో అభిషేకం చేసి పూలతో పూజ చెయ్యటo.. అసలు ఏ యుగంలోనైనా విన్నామురా ఈ విoత!! ఈ యుగంలో నీ కొడుకు చంద్రం ఒక్కడేరా ఈ ఘనత సాధించింది.

రాత్రి సమయాల్లో మీ ఇద్దరి మధ్య పడుకుని మీకు తెల్లారే వరకూ తెలివి రాకుండా.. హాయిగా నిద్ర పట్టేలా.. రెండు పక్కల విసనకర్రలతో విసురుతూ.. వీడేమో నెలల తరబడి నిద్ర లేకుండా చేసుకుని ఆరోగ్యం కావాలని క్షీణింప చేసుకున్నాడురా.. ఇలాంటి కొడుకులు ఏం చరిత్రలోనైనా.. ఎప్పుడైనా ఉన్నట్టు చదివావా??..

మీకు సేవ చేయాలనే ఆలోచనతో తన మొత్తం శరీర కీళ్ళు అన్ని అరగగొట్టుకున్నాడు.. తల్లిదండ్రుల సేవ కోసం బికారిగా మారిన మీ సుపుత్రుడు చంద్రాన్ని చూడండిరా ఎలా పడి ఉన్నాడో.. మీరిద్దరూ మాత్రం కాళ్లునొప్పులు లేకుండా నడుము నొప్పులు లేకుండా పరుగులు పెడుతున్నారు.. ఏ దేవుడో వచ్చి ప్రత్యక్షమై మీకీ సకల ఆరోగ్య భాగ్యాలు ఇవ్వలేదు రా.. మీ కడగొట్టు కొడుకు ఈ చంద్రంగాడు.. ఉన్నాడే వీడి వల్లే ఇదంతా సాధ్యమైందని ఒక్కసెకను మీరు ఎప్పుడైనా ఆలోచించారా?.. మీరు సకల ఆరోగ్యంగా ఉంటూ.. వాడి గురించి ఏమాత్రం ఆలోచించని మీరు.. అసలు తల్లిదండ్రులు ఎలా అవుతారురా?

కన్న తల్లిదండ్రులను కడదాకా చూస్తే తమ ఆస్తులు మొత్తం కరిగిపోతాయేమో అన్న భయంతో మీ పెద్ద కొడుకులు ఇద్దరూ మిమ్మల్ని వదిలి పెట్టి పారిపోయారు. వాళ్ళకన్నా 20 ఏళ్ల తర్వాత పుట్టిన నేరానికి వీడు ‘మానవత్వం’ అనే లక్షణం ఉన్న మొద్దు సన్నాసి కనుక.. మీ సేవలోనే ఉండిపోయి ఇదిగో ఇలా తయారయ్యాడు.

ఒరేయ్ సుబ్బారాయుడు నువ్వు వరుసకు నాకు అన్నయ్య అయ్యావు కనుక సరిపోయింది.. లేకుంటే నేను ఊరుకునే వాడిని కాదురా.. చివరగా మీ ఇద్దరి గుండెలు ఆగిపోయే విషయం చెప్తాను.. విని తట్టుకోలేరు.. వింటారా… నీ కొడుకు చంద్రం మూత్రపిండాలు రెండు కూడా పాడైపోయాయి అని చెప్పారు మన ఊరిలో వెంకటయ్య డాక్టర్ గారు.” అంటూ శేషగిరి నెత్తి బాదుకుంటూ నేలమీద పడి దొర్లేస్తున్నట్లు చెప్పి.. అలా కూలబడి పోయాడు.

సుబ్బారాయుడు అతని భార్య కాత్యాయని.. ఇదంతా విని తిరిగి ఈ లోకంలోకి వచ్చి సాధారణ మనుషులు కావడానికి చాలా సమయం పట్టింది.

“మేమిద్దరం.. మాగురించి మాత్రమే ఆలోచించుకున్న మూర్ఖులoరా.. మా కళ్లెదుటే ప్రతి నిమిషం తిరుగుతున్నా.. మా చంద్రం ఆరోగ్యం నిమిషం నిమిషం క్షీణిస్తున్నప్పటికి ఆ పరిస్థితి గురించి ఒక్కసారి కూడా ఆలోచించని మేము నువ్వు అన్నట్టు నిజంగా తల్లిదండ్రులo కాదు.. క్షమించరా తమ్ముడు” అంటూ సుబ్బారాయుడు తమ్ముడు శేషగిరి చేతులుపట్టుకొని బ్రతిమిలాడాడు..

కాత్యాయని కూడా అతనికి నమస్కారం పెట్టింది.. కొడుకును రక్షించే దారి చూపించమని.

శేషగిరి తేరుకొని..

“నాకు నమస్కారాలు పెట్టడం కాదు.. ప్రస్తుతం మనం అందరం కలిసి అర్జెంటుగా వాడిని సిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్దాం. టాక్సీ డ్రైవర్ కనకలింగం బయటే ఉన్నాడు.. పిలుస్తాను. మనం నలుగురం వీడిని మోసి టాక్సీలో కూర్చోబెట్టి.. స్పీడ్‌గా వెళ్లి.. సమయం మించిపోకుండా పెద్ద డాక్టర్‌కు చూపిద్దాం.. తర్వాత అంతా ఆ రామచంద్రుని దయ.. రండి రండి..” అంటూ కంగారు పెట్టి.. అందరూ కలిసి మధ్యాహ్నానికి సిటీ హాస్పటల్‌కి వెళ్లారు.

‘ప్రాణ రక్షణ సెంటర్’ సిటీలో సకల సదుపాయాలు కలిగిన అతిపెద్ద ప్రపంచస్థాయి హాస్పిటల్. డాక్టర్. ఆర్మ్‌స్ట్రాంగ్.. తనతో సమానమైన మరో నలుగురు డాక్టర్ల పర్యవేక్షణలో చంద్రాన్ని ఐసీయూలో గంటల తరబడి పరీక్షలు చేస్తున్నారు.

ఏ విధమైన ప్రయత్నం మొదలుపెడదాం అన్నా చంద్రం గుండె కొట్టుకునే విధానo, ఊపిరితిత్తుల పరిస్థితి, మెదడు తరంగాల లయ.. చివరికి రక్తప్రసరణ పరిస్థితి కొంచెం కూడా సహకరించడం లేదు.

“ఒరేయ్ సుబ్బారాయుడు.. మీ ఇద్దరికీ కొత్త ప్రాణాలు పోయడానికి.. చంద్రం తన ఆస్తి మొత్తం కరగ పెట్టేసాడు.. ఇంకా తనకు తెలిసిన చాలా మంది దగ్గర అప్పులు కూడా చేసిన వెర్రిబాగుల వాడురా వీడు.. పెద్ద తింగరోడు.. తన గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోలేని నిస్వార్థపరుడు రా.

ఇలాంటి ఉత్తమ పరిపూర్ణ మహోన్నత లక్షణాలు కలిగిన కొడుకు నాకు లేడే అని.. బాధపడుతున్నాను. అయినా ఫర్వాలేదు.. వీడిని నా కొడుకు గా భావించి నాకున్న మేడ, పొలం తెగనమ్మి మీ చంద్రాన్ని నేను బాగుచేయిస్తాను రా..” అని శేషగిరి ఐసీయూ బయట నిలబడి అంటుండగానే.. డాక్టర్ల బృందం లోపలి నుండి బయటికి వచ్చి.. వాళ్ల చేతులు పైకి ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడలేక.. మాటలు చెప్పలేక.. ఏం చెప్పాలో అర్థం కాక.

వెనుకగా వచ్చిన నర్సు..

“సారీ.. లోపలున్న పేషెంటుకు మీరు ఏమి అవుతారో నాకు తెలియదు గానీ ఏదో సాధించాలన్న తపనతో.. ఎవరికో మహోపకారం చేయాలన్న ప్రేమాభిమానాలతో ఆ పేషెంట్.. తన గురించి ఏ మాత్రం ఆలోచించకుండా అతిగా కష్టపడటం వల్ల చిన్న వయసులోనే అతని శరీరం మొత్తo.. కృంగి కృశించిపోయిందని.. లోపల పరీక్షించిన డాక్టర్లు వింతగా విచిత్రంగా అనుకున్నారు.. అయినా సమయం దాటిపోయిందని పెదవి విరుచుకున్నారు.. ఈ ప్రపంచంలో ఉన్న ఏ మందులు ఇతనికి పనికిరావు అనుకోవడం నేను విన్నాను.. ఈ విషయమంతా మీతో తెలుగులో చెప్పమన్నారు పెద్ద డాక్టర్లు.. తగిన ఫీజు కౌంటర్లో చెల్లించి మీరు పేషెంట్‌ను తీసుకెళ్లి.. వేరే ప్రయత్నాలు చేసుకోండి..” అంటూ చెప్పింది.

సుబ్బారాయుడు కాత్యాయని శేషగిరిలకు తమ శరీరపు నరాలన్నీ చిట్లిపోయి రక్తం శరీరం బయట ప్రవహిస్తున్నట్లు అయిపోయింది.

శేషగిరి తీవ్రంగా ఆలోచించాడు.. ఇది బహుశా చేతబడి, చిల్లంగి లాంటిది అయితే అయి ఉండవచ్చు కూడా.. ఆ ప్రయత్నం కూడా చేస్తే పోలా.. అని నిర్ణయానికి వచ్చి.. హాస్పిటల్ వ్యవహారాలన్నీ పూర్తి చేసుకున్నాక టాక్సీడ్రైవర్ కనకలింగం సహాయంతో అందరూ కలిసి సిటీ నుండి తమ ఊరికి వస్తు.. ఊరి మొదట్లోనే ఉన్న శరభేశ్వరo ఇంటికి వెళ్లారు నిమిషం వృధా కాకుండా.. చంద్రాన్ని, డ్రైవర్ను బయటి ఉంచి.. లోపలికి వెళ్లారు తాము వచ్చిన విషయం శరభేశ్వరానికి చెప్పడానికి.

శరభేశ్వరo తన గదిలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో.. దీక్షగా ఏదో తతంగం చేస్తూ మంత్రాలు జపిస్తూ.. వచ్చినవాళ్లను గమనించి వాళ్ళు వచ్చిన విషయం కూడా గ్రహించి కూర్చుండబెట్టి..

“మీరు విషయం చెప్పకుండానే.. నాకు అర్థం అయ్యింది.. బయట టాక్సీలో ఉన్న ఒక వ్యక్తికి జరిగిన శారీరిక నష్టం.. సరిదిద్దుకోదానికి ఏమాత్రం అవకాశం లేనట్లుగా.. మీరు బయట కారు దిగి లోపలకు వస్తున్నప్పుడే నా అధీనంలో ఉన్న శక్తులు నాకు చెప్పేసాయి.. కారులో ఉన్న వ్యక్తి అందరూ నడుచుకునే మార్గంలో కాకుండా ఒక ప్రత్యేకమైన మార్గంలో నడుచుకోవడం వల్లే ఈ విపత్కర పరిస్థితి దాపురించిందని ఆ శక్తులు.. విచిత్రంగా తమలో తాము చెప్పుకుంటున్నాయి.. పైగా అవి ఆ వ్యక్తి వైపు చూడడానికి అతని పేరు ఎత్తడానికి భయపడుతున్నాయి. ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన నేనెప్పుడూ చూడలేదు.. ఆగండి ఇంకా ఏదో మాట్లాడుకుంటున్నాయి.. కాసేపు మౌనంగా ఉండండి.”  అంటూ.. అతను తన పీఠంలో ఉండే.. రెండు చెవులు చేతులతో చాలా సేపు మూసుకొని.. ఆ తర్వాత మరి కొంతసేపు.. తనలో తానే నవ్వుకొని..

“ఆ కారులో వ్యక్తి.. ఈ సమాజంలో బ్రతకడానికి ఏమాత్రం అర్హత లేనివాడట. పైగా ఇన్నాళ్లు అతను నడిచిన మార్గం ధర్మబద్ధమైనదేనట..! కానీ.. పదిమందీ ప్రస్తుతం ఆ మార్గంలో ప్రయాణించటం లేదట. అందుచేత ఎవరు అనుసరించని అటువంటి మార్గాన్ని ఎంచుకున్న వాళ్లు ఈ విధంగానే అవస్థలపాలు అయ్యే అవకాశం ఉందట! అంటూ.. ఇంకా ఏదేదో.. నవ్వుకుంటూ గుసగుస లాడుకుంటూ.. చెవులు కొరుక్కుంటున్నాయి. ధర్మబద్ధమైన పద్ధతిలో నడవడమే అతనుచేసిన పెద్ద తప్పు..అట! ఇదేదో నాకు కూడా అర్థం కాని సంకట పరిస్థితిగా.. నవ్వు తెప్పించేదిగా.. అర్థం కాని గత్తర బిత్తర సమస్యగా ఆనిపిస్తుంది.

ఇటువంటి సమస్యలో అనవసరంగా నేను మిమ్మ మోసం చేసి డబ్బులు గుంజే వాడిని కాదు. మీకు తోచిన దక్షిణ అక్కడ పెట్టి మీరంతా వెళ్లి.. ఏం చేయాలో ఆలోచించుకుని ముందుకు త్వరగా వెళ్ళండి.. ఎందుకంటే ఆ మనిషి పరిస్థితి గంటల మీద ఉన్నట్టు.. నా తరంగశక్తి చెబుతుంది..

చివరగా మీకు ఓ మాట చెప్పాలి.. అని నాకు అనిపిస్తుంది. నా.. మీ.. మనందరి ప్రారబ్ధకర్మను నడిపించేవి.. దుష్టశక్తులు మాత్రం కాదు.. మనం పుట్టినప్పుడు ఉన్న నవగ్రహశక్తులు.. మీరు వెంటనే మహాపండితుడు చింతామణిశాస్త్రిగారిని కలిసి జాతకం ప్రకారం ఆయన ఏం చెప్తాడో విని.. ఆ రకంగా ప్రయత్నం చేయడం వల్ల ఉపశమనం కలగవచ్చు.. వెంటనే వెళ్ళండి” అంటూ కంగారుపెట్టి పంపించాడు.. శరభేశ్వరo.. వాళ్ళందరిని.

అంతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ నలుగురు చంద్రాన్ని అదే టాక్సీలో.. తమ ఊరి నడిబొడ్డున పాలరాతి రామాలయం పక్కన ఉన్న చింతామణిశాస్త్రిగారి పెద్ద ఇంటికి తీసుకెళ్లి పోయారు.. నిమిషాల వ్యవధిలో.

చింతామణిశాస్త్రిగారు .. వాళ్ళంతా జాగ్రత్తగా ఇంటిలోకి మోసుకొచ్చిన చంద్రాన్ని చూశారు.

చంద్రం పేరును బట్టి, తన దగ్గరకు చేరిన సమయాన్ని బట్టి చక్రం వేసి.. లెక్కలు కట్టి వచ్చిన జవాబు చూసి తల విదిలిoచుకున్నారు. మరోసారి నవచక్రాలు వేసి.. నిలువుగా అడ్డంగా ఐమూలగా లెక్కలు కట్టి.. మళ్లీ ఇంతకుముందు జవాబే రావడంతో శరీరం అంతా విదిలిoచుకున్నారు.

చింతామణి శాస్త్రి గారు బహుగ్రంధకర్త. అష్టావధానం.. శతావధానం కూడా ఆయనకు కరతలామలకం. చక్రం చూసి జాతకం చెప్పడంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే ఘనాపాటి. అంతేకాదు సినిమా యాక్టర్ల నుండి రాజకీయ నాయకుల వరకు.. ఆయన చెప్పిన జాతకం నూటికి రెండు వందల పాళ్లు జరిగి తీరుతుంది.. అలాంటి చింతామణి శాస్త్రిగారు చంద్రం జాతకం చూసి ఇంత వరకు తనకు తెలిసినది.. నేర్చుకున్నది అతి శూన్యం అని గ్రహించుకోగలిగారు. అనుమానం తీరక చాలా గ్రంథాలు తిరగేసి చూశారు.. చివరికి దైవ ప్రార్థన చేసి చంద్రం జాతకం విషయములో తనకు వచ్చిన జవాబు నిజమే అని నమ్మకం చేసుకున్నారు.

“మీ చంద్రం జాతకం బహు విచిత్ర విడ్డూరంగా ఉంది. నవగ్రహాలన్ని కూడా అతని జోలికి రావడానికి భయపడి దూరంగా ఉన్నాయి. ఇక ఏ గ్రహశాంతి చేయవలసిన అవసరం లేదు. అయితే ఇతను ఇలా ప్రాణాపాయస్థితికి ఎందుకు మారాడు.. అన్నది చెప్పగలిగే అంత శక్తి నా దగ్గర లేదు. ఇక మీకు ఆ దేవుడే దిక్కు.. మహామహిమాన్వితమైన మన పక్కనే ఉన్న రామాలయంలో రామచంద్రుని దర్శించుకుని వెళ్ళండి. ఆ రాముడే మీకు సమాధానం చెప్పాలి..”. అంటూ వాళ్లందరినీ పంపించారు చింతామణిశాస్త్రిగారు.

సుబ్బారాయుడు కాత్యాయని శేషగిరి.. శాస్త్రిగారికి నమస్కారం పెట్టి.. డ్రైవర్ సహాయంతో పక్కనే ఉన్న పాలరాతి రామాలయంలోకి చంద్రాన్ని మోసుకుంటూ తీసుకెళ్లారు.. పూజారి అందరికీ తీర్థం ఇచ్చి.. విషయం తెలుసుకుని.. “ఆ దేవదేవుడు.. పరమాత్ముడు.. శ్రీరామచంద్రమూర్తి దయవల్ల.. ఈ అబ్బాయి ఆరోగ్యం స్వస్థత పడి తీరుతుంది..” అంటూ దీవించి పంపించారు.

రాత్రి కావడంతో చేసేదిలేక అందరూ ఇళ్లు చేరుకున్నారు.. చంద్రానికి అతని తల్లిదండ్రులు తెల్లవార్లు తగిన సేవలు చేసి పడుకోబెట్టి తాము కూడా మంచం మీద జారపడ్డారు..

ఆ తెల్లవారు జామున కాస్త మగత నిద్ర పట్టగానే సుబ్బారాయుడు కలలో శ్రీరామచంద్రుడు కనిపించాడు.

ఆ మహానుభావుడు సుబ్బారాయుడుకి.. తన రెండుచేతులను అడ్డంగా ఊపి చూపిస్తూ ఏదో చెబుతున్నట్టు అనిపించింది.. శ్రీరాముడు చెప్పేది సుబ్బారాయుడికి అర్థం కావడంలేదు.. వినబడటం లేదు. అలా మూడు సార్లు జరిగాక ఆ దేవుడు మాయమైపోయాడు.

తెల్లవారింది.

వెంటనే శేషగిరిని రమ్మని పిలిపించి తనకు వచ్చిన కల వివరించాడు సుబ్బారాయుడు. శేషగిరి తల పట్టుకు చాలా సేపు ఆలోచించాడు.. చివరికి ఇందులో ఏదో ధర్మసూత్రం ఇమిడి ఉందని గ్రహించుకున్నాడు.. చాలాసేపు ఆలోచించి చివరికి దైవరహస్యం లాంటిది ఏదో బోధపడినట్టు తల ఆడించాడు శేషగిరి.

నిన్ను చంద్రo గురించి అందరు చెప్పింది ఆకళింపు చేసుకున్నాక.. సమాజ తీరుకు ‘వ్యతిరేక దిశ’గా చంద్రం నడుస్తున్నాడని శేషగిరికి అనిపించింది.

సుబ్బారాయుడుకి కలలో రాత్రి శ్రీరాముడు కనబడి చెప్పిన భావాలు ఆ ‘వ్యతిరేక దిశ’కు.. అనుసంధానించడం.. ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు అనుకున్నాడు శేషగిరి.. డీకోడ్.. విధానం అతనికి తెలియకపోయినా అతని ఆలోచన అదే రకంగా సాగి ఒక పరిష్కారం కనబడింది. ఆనందంతో తనకు తానే చప్పట్లు కొట్టుకున్నాడు శేషగిరి. వెంటనే తన అన్నవదిన అయిన సుబ్బారాయుడు, కాత్యాయని దగ్గరకు వచ్చి..

“శ్రీరామచంద్రుని దయవల్ల సమస్యకు పరిష్కారం అర్థం చేసుకున్నానురా. అయితే ఈ విధానంలో తల్లిదండ్రులైన మీ ఇద్దరికీ తీరని నష్టం కలుగుతుంది.. అందుకు మీరు ఇష్టపడితే నా ప్రయత్నం మొదలు పెడతాను.. మీరు సిద్ధమేనా?.. మధ్యలో ప్రయత్నం ఆపకూడదు. మేం భరించలేకపోతున్నామని అసహనం చూపకూడదు. మీరు అంగీకరించినట్టే కదా” అంటూ అడిగాడు శేషగిరి.

ఇంత జీవితం చూశాక తాము ఏమైపోయినా ఫర్వాలేదని వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టమని.. తమ కొడుకును బ్రతికించమనీ.. ఆ తల్లి దండ్రులిద్దరూ శేషగిరిని కోరారు.

శేషగిరి చెబుతూ.. “ఒక కొడుకు తల్లిదండ్రులను చితకబాదడం మనం చూస్తున్నాం కదా. అదే విధంగా చంద్రం శక్తి తెచ్చుకున్నాక మిమ్మల్ని చేతులతో కొడతాడు.. మీరు భరించాలి.. కర్రతో చితగకొడతాడు. సహించాలి.. భరించి తీరాలి.. అయినా ఈ భూమి మీద చాలామంది తల్లిదండ్రులు.. ఈ కష్టానికి అలవాటు పడిపోయారుకదా..

దాంతో చంద్రం ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడితే.. నా ఊహా ప్రయత్నం సక్సెస్ అయినట్టే.. అలా కొన్నాళ్ళు మీరిద్దరూ బాధలు అనుభవించాక.. ఒక శుభ ముహూర్తాన చంద్రం కాళ్లతో మిమ్మల్ని ఇద్దరిని తన్నుతాడు. అది కూడా మీరు భరించాలి. ఈ విధానం కూడా సృష్టిలో చాలా చోట్ల జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం.. వింటున్నాం కదా.. ఇందులో మీరు అనుభవించే ప్రత్యేక బాధ అంటూ ఏమీ ఉండదు.. ఆనక.. వద్దు.. కాదు.. భరించలేకపోతున్నాము అనకూడదు.. అలా మీరు మధ్యలో ఆపేస్తే ఈ సమాజం నన్ను ఎగతాళి చేస్తోంది.

మూడవ అధ్యాయం… మీకు తిండి పెట్టడం మానేస్తాడు.. అది కూడా అలవాటు చేసుకోవాలి. ఏడుస్తూ అలా ఓ మూలన పడి ఉండాలి.. తప్పదు.. మీ ఇద్దరికీ ఇష్టమేనా.. ఇష్టం లేక పోయినా ఇష్టపడాలి. మీ ముద్దుల కొడుకు చంద్రం బ్రతికి బట్టకట్టాలని మీరు అనుకుంటే అభ్యంతరం చెప్పకండి.. మీరిద్దరూ ఇప్పటి కొందరు తల్లిదండ్రుల్లా నరకం అనుభవించి తీరాలి.” వాళ్లను ఒప్పించే విధానంలో వాళ్ళిద్దరు వైపు చూస్తూ అడిగాడు శేషగిరి..

వృద్ధులైన ఆ తల్లిదండ్రులు ఇద్దరూ తలవంచుకునే మౌనంగా నీ ఇష్టం అన్నట్టు ఉండిపోయారు.. ఏం జరుగుతుందో అర్ధంకాక!

శేషగిరి ఇంకా చెప్పటం ఆపలేదు.. “ఒరేయ్ అన్నయ్య.. నేను సమాజానికి విరుద్ధంగా ఏమీ చెప్పడం లేదు కదా.. ఆ శ్రీరామచంద్రుని దయవల్ల ఇందులో నాకు అంటుకునే దోషం ఏ మాత్రం కూడా ఉండదు. ఆ ధైర్యం నాకు ఉంది. అయినా శ్రీరామచంద్రుడు చేసిన తప్పే మన చంద్రం చేస్తున్నాడు. మన చంద్రoలాంటి వాడు ఈ భూ ప్రపంచం మొత్తం మీద వీడు ఒక్కడే రా.

శ్రీరామచంద్రుడు తమ తల్లిదండ్రులను దైవం కన్నా మిన్నగా భావించబట్టే.. వాళ్లు కోరినట్లుగా 14 సంవత్సరాలు నరకం అనుభవించాడు. అదేo కోరిక.. కన్న కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేయడం తల్లిదండ్రులు కోరవలసిన కోరికేనా.. దాన్ని అంగీకరించి అప్పుడు.. అలా.. శ్రీరామచంద్రుడు యవ్వనమంతా నాశనం చేసుకున్నాడురా.”

‘మానవత్వంతో ప్రేమతత్వంతో బతికితే.. నాలాగే తల్లిదండ్రులను పూజిస్తే.. నాలాగే అష్టకష్టాలు పడవలసి వస్తుంది రా.. ఆ యుగంలో అప్పుడు నేను చేసిన తప్పే ఈ యుగంలో ఇప్పుడు నువ్వు చెయ్యొద్దురా.. వద్దురా చంద్రం.. వద్దు వద్దు వద్దు.’ అని.. నీ ద్వారా శ్రీరామచంద్రుడు కలలో కనబడి మీ అబ్బాయి చంద్రానికి.. తన సంకేతాల ద్వారా అర్థమయ్యేటట్లు చెప్పడమే నీకు వచ్చిన కల అర్థం అన్నమాట!

ఇక నాలుగవ అధ్యాయం.. వినండి.. ఎంత చలి వచ్చిన, వర్షం వచ్చిన బయట వీధిలోనే మిమ్మల్నిద్దరిని పడుకోమనీ గెoటి పాడేస్తాడు.. మీరు తట్టుకోవాలి. ఆ వర్షంలోనే తడుస్తూ పడుకోవాలి.

చిట్టచివరి అధ్యాయంగా మిమ్మల్ని ఇద్దరిని దిక్కు లేని వాళ్లుగా చేసి ఊరు చివర వృద్ధాశ్రమంలో దిగవిడిచి వస్తాడు.. మీరు భరించాలి.. ఇష్టమేనా.. చెప్పండి?” చేయక తప్పదు.. అన్నట్టు చెబుతూనే ప్రశ్నించాడు శేషగిరి.

ఆ తల్లిదండ్రులు మూగజీవాలు వలె తల ఆడిస్తూ మౌనంగా ఉండిపోయారు.. ఏం జరుగుతుందో అర్థం కాక.

వెంటనే శేషగిరి చంద్రానికి బలం వచ్చేలా.. తగిన మందులు పదార్ధాలు ఇచ్చాక.. తన ప్రయత్నం మొదలెట్టాడు.

రెండు అధ్యాయాలు.. చంద్రం చేత బలవంతంగా ఒప్పించి తనే చంద్రాన్ని గట్టిగా పట్టుకుని చేయించాడు.. అతని తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టించాడు. వెంటనే చంద్రంలో.. విచిత్రంగా.. కొంచెం బలం మరికొంచెం సత్తువ చేకూరాయి.. దాంతోపాటు అతనిలో స్వార్థపు బీజాలు నాటుకున్నాయి.

ఆ తర్వాత రెండు రోజులకి మూడవ అధ్యాయం పూర్తయ్యే సరికి చంద్రం.. గ్రహణం విడిచిన వాడిలా పూర్తి శక్తివంతుడు అయిపోయాడు.. మంచిని సమాధి చేసే శక్తిని పొందాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు మిగిలిన 4వ అధ్యాయం తన బాబాయి చెప్పకుండానే పూర్తిచేసి.. మహాబలశాలి అయిపోయాడు.. చంద్రం.. కళ్ళు నెత్తికి ఎక్కినవాడుగా రూపాంతరం చెందాడు.

చంద్రంలో ఆరోగ్యం పూర్తిగా అభివృద్ధి చెందిన విషయం గమనించిన శేషగిరి తన ఆలోచన నూటికి నూరుపాళ్ళు విజయం సాధించినందుకు మహదానందపడి పోతున్నాడు.

చంద్రం మనసు, ఆలోచనావిధానం ఇప్పుడు మానవులు తాలూకు పూర్తి లక్షణాలుతో నిండి పోయింది!!!

‘మానవులకు తల్లిదండ్రులు దైవం కన్నా మిన్న.. వారికి తల్లిదండ్రుల సేవే అతిముఖ్యం’ అన్న వాక్యాలు ఉన్నాయి అన్న విషయం పూర్తిగా మరచిపోయాడు!

చంద్రం ఇక ఒక్క నిమిషం ఆలోచించకుండా వీధి అరుగు మీద వర్షంలో తడుస్తూ పడుకున్న తల్లిదండ్రులను తొట్టిరిక్షా లాంటిది తెప్పించి అందులో ఎక్కించాడు. తాను వాళ్ల వెనుక టాక్సీ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లి పదిమైళ్ళ దూరంలోఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాడు.

ఇప్పుడు చంద్రం.. ఈ యుగపు మానవుల కోవలోకి చేరిపోయాడు. దుష్టశక్తులకు.. నవగ్రహాల పీడలకు ప్రీతిపాత్రుడయ్యాడు. ఇప్పటి విషపు సమాజంలో.. ‘విషవృక్షం’లో ఒక కొమ్మ వలె భాగమైపోయాడు..! ఈ సమాజంలో బ్రతికి బట్టకట్టడానికి.. ఈ కాలంనాటి మానవ మేధస్సు ఉన్న మనిషిగా రూపాంతరం చెందాడు!

Exit mobile version