[శ్రీ పప్పు రామకృష్ణ రావు రచించిన ‘విశ్వ గురువు’ అనే బాలగేయం పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]గు[/dropcap]మ్మడమ్మా గుమ్మడి
గుడిలో దేవుడు నా బాబు
ఒడిలో ఆడుతు పెరిగేడు
గుమ్మడమ్మా..
గులకరాయి నా జీవితానికి
గుండె చప్పుడై నిలిచేడు
సంపదలన్నీ సర్వం వీడు
సంతోషానికి చిరునామా
గుమ్మడమ్మా..
కోతి చేష్టలు చేసే వీడు
కొంగు పట్టుకు తిరిగేడు
అమ్మ నాన్నల ప్రేమ ప్రపంచం
అందజేసిన రాగ విపంచి
గుమ్మడమ్మా..
కొసరి తీసిన రాగం తాను
వీపు తట్టిన వైనం వీడు
వేచి చూసిన పున్నమి వీడు
మనసు పూచెను మధురిమ నేడు
గుమ్మడమ్మా..
రాముడి తల్లిని కౌసల్యనురా
రాజ్యం నువ్వు ఏలాలి
రావణులను పరిమార్చాలి
రామరాజ్యము తేవాలి
గుమ్మడమ్మా..
కృష్ణుడి తల్లి యశోద నేను
వినూత్నమై నువు నిలవాలి
విశ్వ గురువువై వెలగాలి
విశ్వ గురువువై వెలగాలి
గుమ్మడమ్మా..