[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘విశ్వకవి.. రవి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]తూ[/dropcap]రుపు ఆకాశపు
అంచుల ధార కట్టి,
అంభుదికి ఆ అంచున
రాశిగ పోసిన
స్వర్ణ భస్మమునలుముకొని
తూరిన సూరీడు..
సాగరపు అలలపై
చిత్రకారుడై వర్ణ వైవిద్యాన్ని
ఆవిష్కరిస్తున్నాడు..
వర్ణ మిళితమైన
తూరుపు ఆకాశం నిండా
మంద గమనంతో
లేలేత నీరద కన్యలు
రంగుల కోకలతో కదులుతు ఉన్నాయి
బాల సూరీడిని ముద్దిడి
కరిగిపోదామని.
జీవికకై వలసేగుతున్న
పక్షుల గుంపులు ఆ చిత్తరువులో
చక్కగా ఓ పక్కన ఇముడుతూ సాగుతున్నాయి
సాగరాన కెరటాలు ఫణులెత్తుతూ
వెలతురు మణుల ధారణకై
ఉరకలేస్తున్నాయి..
తీరపు తిన్నెలన్నీ చల్లబడ్డ
తమ తనువులపై
వెచ్చదనపు కిరణ స్పర్శకై
ఉవ్విళ్ళూరుతున్నాయి..
మరో ఉదయం,
రసోదయం
శుభోదయం!!!