Site icon Sanchika

విశ్వంలో బాపురమణీయం!!

[box type=’note’ fontsize=’16’] 24 ఫిబ్రవరి 2020 నాడు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి వర్ధంతి అయిన సందర్భంగా అందె మహేశ్వరి అందిస్తున్న విశేష రచన ఇది. [/box]

మమ్మల్నందిరినీ మీరిద్దరు వదిలేసి వెళ్ళినా మేము మిమ్మల్నొదలము ఎప్పటికీ!!

[dropcap]వై[/dropcap]కుంఠంలో రాముడిలా ఉన్న విష్ణుసేవలో నిమగ్నమై కూడా కొంచెం దిగాలుగా ఉన్న ముళ్ళపూడి వెంకటరమణ గారికి హఠాత్తుగా ఒక కోలాహలం (కలంకలం) వినిపించింది. అదేంటో అని చిన్న చెవుల్ని చాటలుగా చేసుకుని వింటుండగా, గుండె శరవేగంతో పరుగెడుతూ, ఆత్మీయులెవరో చేరువయ్యారని సంకేతాన్ని పంపింది. ఆ వేగానికి చొక్కా జేబులోనుండి నక్కి చూస్తున్న కలానికి కాళ్ళొచ్చి, కళ్ళాద్దల్ని సరి చేసుకుంటున్న రమణగారిని చూస్తూ ఇలా అంది. “ఏమోయ్ రమణా! అద్దాలు సరిచేసుకుంటూ వాపోయింది చాలు గానీ, ఇక దిగాలు మొహం తీసేయవోయ్! పైకి నవ్వుతుంటావ్ గానీ, నీ బాధ నాకు తెలుసులే.. బాపుగాడొచేసాడట.. పనిలేక విశ్రాంతి లేని నాకు ఇప్పుడు విశ్రాంతి అంటే పని తీసుకునే సమయం వచ్చేసింది. నువ్వు నీ స్నేహితుడిని ఎంత miss అయ్యావో తెలియదు గాని, నేను నా పెండు అంటే కుంచె గాడ్ని మాత్రం miss అయ్యాను.ఇక ఆగడం నా వల్ల కాదు గాని నువ్వు మెల్లగా వచ్చెయ్… నేను గరుడ పక్షి మీద ఎక్కి వెళ్ళిపోతున్నా” అని ఎగిరిపోయింది.

తన్మయత్వంలో ఈ మాటలన్నీ విన్న రమణగారి చెవిలో కన్నీళ్ళోచ్చేశాయి (Tears in ears అన్నమాట) ఈ సంభాషణా సారం గ్రహించిన సీతారాములు పలుకే బంగారమాయెలా కాకుండా బంగారు పలుకులతో ఇలా అన్నారు.

“నా పాదాల చెంత ఉన్న నీ చింత నాకు తెలియదటయ్యా!! వచ్చేశాడు.. నీ ఆప్త మిత్రుడు, వస్తూ నీ ప్రాణాలు తెచ్చేశాడు. ఎప్పుడో పెళ్ళిపుస్తకమప్పుడు మీరిద్దరు రెండు నెలలు మాట్లడుకోలేదు.. మళ్ళీ నువ్వు ఇక్కడికొచ్చాక పాపం ఇన్ని రోజులు.. అందుకే పిలిచాను.. పరుగెత్తుకొచ్చేశాడు” అంటూ సీతమ్మ వంక ఓరకంట చూసి చిరుమందహాసం చేశారు. వెంటనే సీతమ్మ “బాపు-రమణలు, లవకుశలులా మీకు నచ్చిన రామకథని గానం చేస్తుండండి” అని దీవించారు.

ఇదిలా ఉండగా.. బాపుగారి వెనక అశేష వానర సేనావాహినిలా గోచరిస్తున్న బొలేడు అందాలు అయన వెనక నడుస్తూ వస్తున్నాయి. అలా వస్తున్న బాపు గారిని చుస్తూ నిలబడిపోయారు రమణగారు.. ఒకళ్ళనొకళ్ళు చూడగానే పోయిన రెండు ప్రాణాలు తిరిగొచ్చేశాయి. కుశల ప్రశ్నల పర్వం ముగిశాక “ఈ సైన్యమేంటిరా నీ వెనక?” అని అడిగారు రమణగారు…

“ఏముంది రా! నీకు దేవుడు అంటే రాముడు పట్టి ఇక్కడికొచ్చేశావు. అప్పటినుండి రోజు రాముడితో గొడవ పడుతూనే ఉన్నారా.. నువ్వుండేదెక్కడో చెప్పమని.. ఇదిగో సరిగ్గా ఆగష్టు 31న యమదూతలు, విష్ణుదూతలు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు… నన్ను భూలోకం నుండి అంతర్ధానం చేసి.. ఆకాశంలో వాళ్ళిద్దరూ గొడవ.. మాలోకంలో కంటే మాలోకంలో కని.. ఈ మాలోకాలేంటిరా బాబు అనుకుంటుండగా.. యమలోకం రానే వచ్చేసింది.

ఒకే ఒక్కసారి యమధర్మరాజుల వారి దర్శనం చేసుకుందామని నాకు కూడ వింత కోరిక కలిగి, ‘బాపు పేరుతో బతికే శాంతమూర్తిగా నా కోరిక మన్నించండి ఒకసారికి వెళ్ళి వచ్చేద్దాం పదండి’ అని విష్ణు దూతల్ని బుజ్జగించి వాళ్ళతో సహా యమలోకంలోకి వెళ్ళాను.. కుంచెంసేపు యమధర్మరాజుతో మాటమంతి మాటాడేసి.. ఏమి ఊసుపోక… చిత్రంగా కూర్చుని, గుప్తంగా లెక్కలు రాస్తున్న చిత్రగుప్తలవారిని కుంచెం కుంచెతో నాలుగు గీతలు గీసుకోవాలని ఒక దస్తా పేపర్లు ఇప్పించండంటే.. అయన ఎంత రాసినా తరగని ఒక పేపరు ఇచ్చారు….

దాని మీద నాలుగు గీతలిలా గీశానో లేదో, ఏమి గీస్తే అవి ప్రాణం పోసుకుని వచ్చేశాయి. ఏం జరుగుతుందో అర్థం కాని నా ముఖంలోని భావాలన్నీ ప్రశ్నర్ధకాలై చిత్రగుప్తులవారిని చుట్టేశాయి.. ఆ ప్రశ్నలకి సమాధానం ఇలా చెప్పారు. స్వర్గంలోని దేవతలకి Entertainment కోసం అప్సరసలు నిత్యం నృత్యగానాలు చేస్తుంటే, ఇక్కడ యమలోకంలో మాకు పాపుల గోల తప్ప ఇంకో Entertainment లేకుండా నరకం… నరకంలా ఉందని యముడు బ్రహ్మ దేవుడిని ‘ఏంటి ఈ పక్షపాతం’ అని అడిగితే… దానికి బ్రహ్మ ‘నాకు ఏదైనా చేసే అధికారం లేదు. దానికోసం మీరు కలియుగం వరకు ఆగాల్సిందే… అప్పుడు సత్తిరాజు లక్ష్మణరాజు అని అదేనయ్యా బాపు వచ్చి నీకు సాయం చేస్తాడు’ అని చెప్పాడు.. దాని మహిమే ఇది అని వివరిస్తే నేను అవాక్కయ్యాను. ఖాళీగా ఉండకుండా గీసిన గీతలే ఇదిగో ఇలా…” అని తన వెనక ఉన్న సేనని చూపించారు.

రమణగారు వెంటనే “నువ్వు నువ్వేరా” అని నవ్వేశారు..

ఇవన్ని ముందే ఊహించిన సీతారాముల వాళ్ళిద్దరిని పిలిచి.. “మీరు మీ మహిమలు తర్వాత చూపిద్దురుగాని.. ముందు సత్యలోకంలో బ్రహ్మ పిలుస్తున్నారు వెళ్ళిరండి” అని పంపారు.

బ్రహ్మ, శారదదేవిని చూడగానే రమణగారు గడగడా తేట తెనుగులో తిరుప్పవై అనువాదంలా నాలుగు పద్యాలు పాడేశారు. ఇడ్లీ కన్నా చట్నీ బాగుందన్న సామేతగా నేనెం తక్కువ తినలేదనుకుంటూ ఆ పద్యాలకి చిత్రరూపం చూపించేశారు బాపు.

“అసలు మిమ్మల్ని పిలిచిన కారణమేంటంటే.. బుడుగు రాసింది నువ్వేగా, గీసింది నువ్వేగా.. ఆ బుడుగు బుడంకాయకి ఎన్ని తెలివితేటలో.. నువ్వంటే నువ్వంటాడు అందరిని కొంటెగా.. అసలు ఆ సీగానపెసూనాంబని అంత popular చేసేశారు” అని ఇద్దరు కలిసి భలే భలే అని నాలుగు ముఖాలతో ఒకేసారి నవ్వేస్తే.. ఆ నవ్వుకు శృతిలో వీణ వాయిస్తూ నవ్వేసింది శారదమ్మ.

“అలానే బాపు అందరు నీ బొమ్మ లాంటమ్మాయి ఇంట్లో ఉండాలనుకుంటారు, అబ్బాయిలని ఎలాంటి అమ్మాయి కావలిరా అంటే బాపు బొమ్మ కావలంటున్నాడు.. ఈ సమస్యల్ని మీరే పరిష్కరించాలి. నేను తలుచుకున్నప్పుడు నువ్వొచ్చి నాకు సాయం చేద్దువుగాని. రమణా.. నీ కొంటె రాతలు వాళ్ళ బుర్రల్లోకి పంపి పుట్టేప్పుడే చదువులు మాట్లాడేలా చేసేద్దాం” అనగానే ఈ జంట ఆనందానికి ఆకాశంలేదు.

‘సరే పిలిచినప్పుడొస్తాం, సెలవిప్పించడ’ని అక్కడనుండి వస్తూ కైలాసానికి వెళ్ళారు.

కైలాసంలో శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో పూజలందుకుంటుండగా.. దర్శించి, పులకరింఛి పునీతులయ్యారు బాపురమణలు.

వారిరువురుని చూడగానే శివుడు.. “ఆటకదరా శివా! అని భరణి రాస్తే దానికి నువ్విచ్చిన గీత అమోఘం. దానికి మా నంది నీకు నంది బహుమతిస్తానన్నాడు” అని కితాబిచ్చారు.

“రమణా!! సామన్యులకి అసమాన్యమైన ఈ భక్తిని, పురణాలని నీ కథలో జొప్పించి వాళ్ళని మేల్కొలిపిన ఘనత మాత్రం నీదేనయ్యా.. మీరు చేసిన సిత్రాలు, మా శివకింకరులు సైతం చూసి సంసారంలో లోటుపాట్లని దిద్దేసుకుంటున్నారు” అన్న మాటలకి ఇద్దరి కళ్ళు చెరువులయ్యయి.

ఆనందంతో… ఇక ఇద్దరు కలిసి నోరారా స్తుతించి తమ భక్తిని ఇంకోసారి ప్రదర్శించి తిరిగి వైకుంఠానికి చేరుకుని లక్ష్మీనారాయణుల్ని సీతారాములుగా చూసుకుంటూ పట్టరాని ఆనదంతో పగలురేయి లేని లోకంలో, రేయింబవళ్ళు రామకథలు, బొమ్మలు గీసేసుకుంటూ, బోలెడు పాత్రలు సృష్టించి వాళ్ళందరిని రామసేవకు పంపడం మొదలేసేశారు. వైకుంఠం కాబట్టి ఎంత సృష్టి అయినా తట్టుకోగలదు. అదే అమ్మో భూలోకం అయితే ఇంకేమైనా ఉందా!! అందుకే వాళ్ళిద్దరూ అక్కడకెళ్ళి చిరంజీవులైనారు.

Exit mobile version