విశ్వనాథ – ఆంధ్రాభిమానం

2
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా – డా. కాసల నాగభూషణం రచించిన ఈ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. మూల రచన ‘తెలుగు త్రైమాసిక వైజ్ఞానిక ‘ పత్రిక జనవరి – మార్చి 2004 తెలుగు సాహిత్యం-జాతీయ సమైక్యత సదస్సు ప్రత్యేక  సంచికలో ప్రచురితం. [/box]

[dropcap]’తె[/dropcap]లుగు సాహిత్యం – జాతీయ సమైక్యం’ అన్నది ఒక అఖండ గంగా స్రోతస్విని. ‘విశ్వనాథ – ఆంధ్రాభిమానం’ అన్నది అందులోని అంతర్వాహిని. జాతీయ సమైక్యం ఒక దృఢమైన భిత్తిక. ఆంధ్రాభిమానం ఆ నిర్మాణానికి ఉపయోగించిన ఇటుక. ఆ జాతీయ సమైక్యం గాని, ఈ ఆంధ్రాభిమానం గాని ఉత్తేజపూరితమైన ఒకానొక చారిత్రక సందర్భాన్ని స్ఫురింపచేసే అంశాలే! ఆ సందర్భం కూడా.
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను” అని శ్రీశ్రీ అన్నట్టుగా ఒక సంఘర్షణలోంచి, ఒక ప్రతిఘటనలోంచి పుట్టుకొచ్చిన, మనం మరిచిపోలేని – ఒక మహోజ్జ్వలమైన సందర్భం – చారిత్రక ఘట్టం!
శక యవన హూణులు, మహమ్మదీయులు, డచ్చి ఫ్రెంచి పోర్చుగీసులు సాగించిన దండయాత్రలకు పరాకాష్ట ఈ దేశంలో రెండున్నర శతాబ్దాల పాటుగా సాగిన బ్రిటిషువారి వలస పాలన. ఆ పరిపాలన సమయంలో భారతీయులలో రగులుకొన్న అస్వతంత్రతావేదన క్రమంగా ఒక మహోద్యమంగా పరిణమించింది. ఆసేతు శీతాచలం భరతజాతిని జాగృతం చేసి ఒక్క తాటిమీద నడిపించిన ఆ ఉద్యమమే భారత జాతీయోద్యమం. దాని ప్రధాన లక్ష్యం పారతంత్ర్య ప్రతిఘటనం, స్వాతంత్ర్య సముపార్జనం! ఆ లక్ష్య సిద్ధికి అలనాటి నాయకులు, కవులు ఎన్నుకున్న మార్గం – ప్రజలలో అఖండ భారతం – అన్న ఐక్యభావం కలిగించడం, దేశాన్ని మాతృశ్రీగా ఆరాధించడం! ఆ జాతీయోద్యమ ప్రభావఫలితంగా మనలో అంకురించిన అపూర్వమైన భావన జాతీయత!
భౌగోళికమైన పరిస్థితులు, రూపురేఖలు, వేషభాషలు, ఆచార వ్యవహారాలు లాంటి స్థితిగతులలో ఏవో కొన్ని చిన్న చిన్న తేడాలున్నా ఆ భిన్నత్వాన్ని మరిపింపచేసే హార్దమైన ఒకానొక అంతస్సూత్రానికి కట్టుబడి ‘అంతా ఒక్కటే’ అన్న భావనతో జీవనం సాగించే మానవ సమూహాన్ని మనం ‘జాతి’ అని పేర్కొంటున్నాం. ఆ జాతిని నడిపించే ఏకసూత్రతే ‘జాతీయత’. అదే ‘Nationalism’ . ఇది పూర్తిగా ఆధునికమైన భావన – Modern Concept, ఈ భావన ఊపిరిగా జాతీయ రంగంలో రూపుదిద్దుకున్న ఆ ఉద్యమానికి ఉపబలకంగా ప్రాంతీయ పరిధిలో ఆంధ్రాభిమానం ప్రకటించారు తెలుగు కవులు. భరతమాతను కీర్తించినట్టే ప్రాంతీయాభిమానంతో తెలుగుతల్లి వైభవాన్ని గానం చేశారు. ఈ రకమైన ప్రాంతీయాభిమానాన్నే ఇప్పుడు మనం ‘ఉపజాతీయత’ (Sub-nationalism)గా పేర్కొంటున్నాం. అంటే ఇది జాతీయతోన్ముఖమైన ఉపజాతీయతా భావన అన్నమాట.
ధ్రత్వము లేనినాడు కలదా మనకించుకయేని భారతీ
యత్వము…” అని ‘రాష్ట్రగానం’లో తుమ్మలవారు ‘మనజాతీయతకు ఆంధ్రత్వమే పునాది’ అన్న అంశాన్ని సూచించారు. నిజానికి జాతీయత, ఉపజాతీయత అన్న భావనలు రెండూ పరస్పర పరిపోషకాలు. ఈ రెండింటికి గత వైభవ సంస్మరణం ప్రాణం. ఇది కాల్పనిక కవిత్వానికున్న ఒక ముఖ్య లక్షణం. సాంఘికంగా ఆవిర్భవించిన జాతీయోద్యమానికి అప్పట్లో ఈ కాల్పనిక కవితోద్యమం తోడుకావడం ఒక చెప్పుకోదగ్గ విశేషం.
మరి తెలుగు కవిత ఆధునికత దిశగా సరికొత్త మలుపు తిరిగిన దశలో ఈ ఉపజాతీయత, జాతీయతల పరిధుల్ని అధిగమించి…
దేశమంటే మట్టికాదోయ్…..
దేశమంటే మనుషులోయ్….” అంటూ నిజమైన ‘దేశభక్తి’ని ప్రబోధించారు గురజాడ. ఆ రోజుల్లోనే రాయప్రోలు…
వేద శాఖలు వెలసెనిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!” అంటు భరతమాతను ప్రశంసించారు.
ఆ చాళుక్య నృపాలసత్తముల వియ్యమ్మంది, శ్రీకాకతి
క్ష్మాచక్రేశుల లాలనల్ పడసి కృష్ణప్రాజ్య సామ్రాజ్య పీ
ఠీ చంచజ్జయ కన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోఁబుచ్చు నీ
ప్రాచీనాభ్యుదయమ్మునెన్నెదరు గర్వస్ఫూర్తి తల్లీ! సుతుల్” అంటూ ఆంధ్రమాతను కీర్తించారు. సరిగా ఆ ఒరవడిలోనే ఆ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్నారు విశ్వనాథ. పుణికిపుచ్చుకున్నది ఆ స్ఫూర్తినే అయినా అందులో ఆయన పలికించిన ఆర్తిమాత్రం స్వతస్సిద్ధం. అది ప్రతిభామూలకం. నాన్యతో దర్శనీయం. ప్రత్యక్షరం విశ్వనాథీయ ధిషణాహంకార ముద్రాంకితం.
ఇంతకు ముందు మనవి చేసినట్టు గతవైభవ సంస్మరణం కాల్పనిక కవితా లక్షణమే అయినా విశ్వనాథ వారు గతవైభవాన్ని సంస్మరించడంలో ఓ విశేషం ఉంది. ఆయన గతాన్ని ప్రస్తుతించడంతో ఊరుకోలేదు. ఆ గతంలో ఆయా కాలాలలో, చారిత్రక స్థలాలలో ఆ వ్యక్తుల మధ్య తామూ జీవించినట్టు గట్టిగా విశ్వసించారు. ఆ పురావైభవం ఈ ఆధునిక యుగంలోను మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆశించారు. ప్రాచీన భారతంతో పాటు ఆంధ్రప్రాంత గత ప్రాభవం కూడా పునరావృతం కావలన్నది వారి ఆకాంక్ష! అనివార్యమైన ఆధునిక ప్రభావానికి తల ఒగ్గినా ఆర్ష సమాజ సంప్రదాయ ప్రవాహం మళ్ళీ పొంగి పొరలివచ్చి ఈ నేలని పునీతం చెయ్యాలన్నది వారి అభిమతం. అంతగా సంప్రదాయ అభినివేశం, ఆవేశం ఆవహించినవారు విశ్వనాథ. అంతేకాదు….
నన్నయ్యయు, తిక్కన్నయు
నన్నావేశించిరి పరిణాహ మనస్సం
ఛన్నత వారలు చూపిన
తెన్నున వంకలను తీర్చిదిద్దుచు పోదున్” – అని సంప్రదాయ కవుల వంకలను సైతం సరిదిద్దగలనన్న ధీమా ప్రకటించినవారు. కవుల కవిత్వాన్ని వారి కవితా ప్రతిజ్ఞల నేపథ్యంలోంచి పరిశీలించడం సాధారణమైన అంశమే అయినా ఆత్మాశ్రయ విధానంలో – గతాన్ని ఆవాహన చేసుకున్న విశ్వనాథ వారి విషయంలో – ఆ సమీక్ష మరింత సజీవంగా సాక్షాత్కరిస్తుందనడంలో సందేహం లేదు. అందుకు మనం చేయవలసిందల్లా కవిగా ఆయన సాధించుకున్న వ్యక్తిత్వాన్ని అనుక్షణం మననం చేసుకోవడం! ఈ అవగాహనతో ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్రజాతి, ఆంధ్రపౌరుషము, ఆంధ్ర భాష మొదలైన ఖండ కావ్యాలలో జాలువారే విశ్వనాథ వారి ఆంధ్రాభిమానాన్ని ఎంతో కొంత మీకు చవిచూపడానికి ప్రయత్నిస్తాను.
ఇంతకి ఆంధ్రము, తెనుగు, తెలుగు పర్యాయపదాలని: అవి వరుసగా జాతిని, ప్రాంతాన్ని, భాషను సూచించడానికి ఏర్పడ్డాయని పెద్దల అభిప్రాయం. కాగా ఆంధ్రజాతికి చెందిన రాజులు, మంత్రులు, వీరులు, కవి గాయకాది కళాకరులు, పండితులు, శాస్త్రజ్ఞులు మొదలైన మహాపురుషులు: తెలుగు నేలలోని రాజ్యాలు, తీర్థాలు, క్షేత్రాలు, పర్వతాలు, నదీనదాలు, వనాలు, పొలాలు మొదలైన ప్రాంతాలు: తెలుగు లిపి సౌందర్యం, శబ్ద మాధుర్యం మొదలైన భాషా విశేషాలు; తెలుగువారి వేషభాషలు, ఆచార వ్యవహారాలు, పండుగలు పబ్బాలు మొదలైన సంస్కృతీ సంప్రదాయాలు – వీటి వర్ణనలు, కీర్తనలు – అన్నీ ఆ ఆంధ్రాభిమాన ప్రవాహంలోని పాయలే! మరి –
లేత బుర్రలు కొక్కిరిస్తే
అతగాళ్ళతో ఏమిగానీ
తాత తాతలనాటి కతలూ
త్రవ్విపోస్తానోయ్” – అన్న విశ్వనాథ ’ఆంధ్ర ప్రశస్తి’లో
మా పూర్వాంధ్ర ధరాధినాయక కథా మంజూషికారత్న గా
థా పద్యావలి పేరి హారి సుమనోదామంబు మాధ్విక భా
షా పృక్తంబు మహా ప్రబంధ రచనా సౌందర్యపున్ వాసనల్
తీపై క్రమ్మగ ఆంధ్ర సోదరుల కందిత్తున్ గళాంకమ్ముగన్” అని సంకల్పం చెప్పుకుని కాలాక్రమానుసారం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును, శాతవాహన చక్రవర్తిని, గౌతమీపుత్ర శాతకర్ణిని, మాధవ వర్మను, నన్నయభట్టును, ప్రోలరాజును, అతని కుమారుడైన మొదటి ప్రతాపరుద్రుణ్ణి కీర్తించారు. ఆ కాలానుక్రమంలోనే చరిత్ర ప్రసిద్ధమైన వేగిక్షేత్రాన్ని, ముఖలింగాన్ని, ప్రోలరాజు వధను, కొండవీటి పొగమబ్బుల్ని, చంద్రవంక యుద్ధాన్ని వర్ణించారు. చివర అళియరామరాయలు కళ్యాణిదుర్గాన్ని ముట్టడించిన వైనాన్ని, కోటలోపల రాయలు విసరివేసిన ‘యమదంష్ట్రిక’ అన్న ఖడ్గాన్ని మళ్ళీ తెచ్చి సదాశివ నాయకుడు రామరాయలకిచ్చిన విధానాన్ని చిత్రించారు.
అందులో ఆంధ్ర విష్ణువు నిశుంభుడనే రాజును చంపి శ్రీకాకుళం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించాడని చెబుతూ ఆ శ్రీకాకుళాన్ని ఇలా వర్ణించారు.

శ్రీ కృష్ణవేణీ గరిష్ఠ పాథస్తరం

గాహత ప్రాకారమైనయదియు

బురుజుల దితిజ సమూహరక్తము గ్రోలు

నాల్క వోలు పతాక నాటినదియు

ఆంధ్రవీరభటాళి కాత్మశౌర్యంబుల

యందు శాణోపలంబైనయదియు

ఘంటశాలా పురీ కలిత పూర్వాంధ్ర శి

ల్పాచార్యులకు తల్లియైనయదియు

రాజరాజాంధ్ర విష్ణుని రాజధాని
కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళంబు
కన్నులకు గట్టినట్లుగ కానబడెడు
వేదకాలము నాటి ముత్తైదువట్లు”

ఇక్కడ శ్రీకాకుళ పట్టణాన్ని వేదకాలం నాటి ముత్తయిదువతో పోల్చడం వేద సంస్కృతిపట్ల విశ్వనాథకున్న మక్కువకి నిదర్శనం.
తరవాత కుమార శాతవాహనుణ్ణి పుత్రుణిగా స్వీకరిస్తూ దీపకర్ణి చెప్పిన మాటల్లో ఆనాటి ఆంధ్రదేశ వైశాల్యాన్ని భంగ్యంతరంగా సూచిస్తూ –
ఈ నిఖిలాంధ్ర రాజ్యరమ కేలికవౌదువు; దీపకర్ణి సం
తానముగాగ నిన్గొలుచు ధాత్రి జనావళి; ప్రాక్సముద్రమం
దానిన నీరు పశ్చిమ మహాంబుధి ద్రాపుము; కృష్ణనీరు గం
గా నది జేర్పుమాంధ్ర సతి కంఠ లసన్నవహోరమో యనన్” అని ఎంతో ఆలంకారికంగా వర్ణించారు విశ్వనాథ.
తరవాత బెజవాడ రాజధానిగా తెలుగు నేలను పరిపాలించిన పల్లవరాజు మాధవవర్మ కథ. అతని కుమారుడు కోటవీధిలో వేగంగా రథాన్ని నడుపుతూ ఒక యువకుడి మీద ఎక్కించేస్తాడు. అతడు చనిపోతాడు. అతని ముసలితల్లి న్యాయం  కోసం రాజుదగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తుంది. రాజు తీర్పు చెప్పమని నాయ్యాధికారుల్ని అడుగుతాడు. “ప్రాణం ప్రాణాన్నే బదులుకోరుతుం”దంటారు వాళ్ళు. తన కుమారుణ్ణి కూడా రథం చేత తొక్కించి శిక్షను అమలు చేయిస్తాడు మాధవర్మ. ధర్మానికి, న్యాయానికి ప్రతీక అయిన ఈ రాజు కథ తమిళనాట బహుళ ప్రచారంలో ఉంది. అయితే ఆ రాకుమారుడు తొక్కించింది యువకుణ్ణి కాదు – ఒక ఆవు దూడను. అప్పుడు ఆ తల్లి ఆవు రాజప్రాసాదానికి వెళ్ళి అక్కడున్న ధర్మఘంటను మ్రోగిస్తుంది. తరువాత న్యాయ విచారణ, శిక్ష అమలుచేయడం ఆ కథలోలాగే జరుగుతుంది. అంటే తమిళ రాజు ఒక ఆవుదూడ ప్రాణానికి కూడా అంతగా విలువనిచ్చి, తన కన్నబిడ్డనే శిక్షకి గురిచేశాడన్నమాట! తమిళంలో ఆ రాజుగారి పేరు మనునీతి చోళుడు. చెన్నపురి హైకోర్టు ఆవరణలో రథం కింద తన కుమారుణ్ణి తొక్కిస్తూ శిక్షను అమలు చేస్తున్న ఆ రాజుగారి విగ్రహం ఉంది.
ఇక ‘వేగిక్షేత్రము’ అన్న ఖండికలో ఆ నేలని వేంగి రాజుల పాద పవిత్ర చిహ్న గర్భితంగా భావిస్తూ
ఇట వేగీశుల పాదచిహ్నములు లేవే! లేవుపో! భావనా
స్ఫుటమూర్తిత్వమునైన పొందవు సెదో పూర్వాహ్ణ దుష్కాలపున్
ఘటికల్ గర్భమునందిముడ్చుకొనియెన్ గాబోలు; నీ పల్లె చో
టట! లోకాద్భుత దివ్యదర్శనమటే! ఆ భోగమేలాటిదో!”
అని ఆ వేగిక్షేత్ర పూర్వవైభవాన్ని విస్మయపూర్వకంగా ఊహించడానికి ప్రయత్నిస్తారు.

ఈ నా పదార్పితక్షోణి నే రాజు ధ

ర్మాసనంబుండి స్మృత్యర్థమనెనో!

ఈ నా దృగావృతంబైన భూముల లోన

నే శౌర్యధనులు శిక్షింపబడిరో!

ఈ నా శరీరమందివతళించిన గాలి

యెంత పౌరాతన్యమేచికొనెనో!

ఈ నా తనూపూర్ణమైన యాకాశమ్ము

నే క్రతుధ్వనులు శబ్దించినదియొ!

అస్మదజ్ఞాతపూర్వ దివ్యత్వమొప్పు
నీ పునీతావనీ ఖండ; మిచట నిలచి
అస్వతంత్రత దొరలు నా యాంధ్రశక్తి
నన్ను కంపింపజేయుచున్నది భృశమ్ము”
అని తమలోని అస్వతంత్రాతావేదనని వెల్లడిస్తారు.

ఇమ్ముగ కాకుళమ్ము మొదలీపఱుకుంగల యాంధ్రపూర్వ రా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలొ చలించుపోవు ఆ
ద్రీమ్మగు చిత్తవృత్తుల పురాభావ నిర్ణయమేని ఎన్ని జ
న్మమ్ములుగాగ ఈ తనువునన్ ప్రవహించునొ ఆంధ్రరక్తముల్”
అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ జన్మజన్మాలుగా తమ శరీరంలో ఆంధ్రరక్తమే ప్రవహిస్తోందంటారు.

ఎద పదిలించుకొన్న దిది యెక్కడి పూర్వపు జన్మవాసనో!” అని తమ ఎదలో పదిలపరచుకున్న వేగి క్షేత్రతోడి అనుబంధాన్ని తమ విశ్వాసాలకనుగుణంగా పూర్వజన్మ సువాసనగా సంభావిస్తారు.
విశ్వనాథవారికి తెలుగు నేలన్నా, అక్కడి పర్వతాలన్నా, తీర్థాలన్నా, క్షేత్రాలన్నా ప్రాణాధికంగా అనిపిస్తాయి. “తెలుగు నేలలో నేను ఎక్కిదిగని కొండలు లేవు. నేను తిరిగి చూడని ప్రాంతాలు లేవు” అని ఎన్నో సాహితీ సభలలో విశ్వనాథవారే స్వయంగా గర్వంగా చెప్పి మురిసిపోయేవారు.
రెడ్డిరాజుల వైభవాన్ని మూగ సాక్షిగా మిగిలిన కొండవీటిలో ఆ కొండ కొమ్ములపైన, కోట బురుజులపైన ఆవరించిన పొగమబ్బులను చూసి-

ఇవి రెడ్ల రాజుల ఎదలలో పూరించు

కోరాని కోర్కెలు గుములుకట్టి

ఇవి తెన్గుబంటుల ఇందుప గింజలై

నాత్మలు వీడలే కరుగుదెంచి

ఇవియు శ్రీనాథుని ఎఱ్ఱప్రెగ్గడ కావ్య

తకు రాని భావముల్ తరకగట్టి

అవచి తిప్పయసెట్టినివి రత్నరాశిగా

మలచిన ప్రాణముల్ మగిడివచ్చి

కొండవీటి పొలాల్ వీడికొనులేక
ఆశబలమున మగుడు ప్రేతాత్మలవలె
సొరిది నీ గిరికొమ్ముల జుట్టుపట్ల
ఇట్టి పొగమబ్బులై భ్రమియించు గాక!”

అని ఆ రెడ్డిరాజుల తీరని కోరికలు, వీరమరణం పొందిన తెలుగు సైనికుల ఆత్మలు, శ్రీనాథుడు ఎఱ్ఱాప్రెగ్గడ కావ్యస్థం చేయలేకపోయిన రసవద్భావాలు, అవచి తిప్పయసెట్టి ఆ ప్రాంతాలను వదలిపెట్టిపోలేక ఆ కొండకొమ్ముల పరిసరాలలో పొగమబ్బులుగా పరిభ్రమిస్తున్నాయని వర్ణించారు.
చివరగా అంతకు మించిన రసావేశానికి లోనవుతూ –

నా ప్రాణములకును ఈ పొగమబ్బుల

కేమి సంబంధమో ఏనుగూడ

పొగమబ్బునై కొండ చిగురు కొసలపైన

బురుజుల పైని కొమ్ములకు పైని

వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల

రాలిపోనో గాలి తేలిపోనొ

నా ఊహ చక్రసుందర పరిభ్రమణమై

ఈ పొగమబ్బులనే వరించె

ఎన్ని పొగమబ్బు లెఱిగిలే నేను మున్ను
తూర్పు కనుమల విడుచు నిట్టూర్పు లట్టి
విచటి ఈ పొగమబ్బులే ఎడదలోని
లలితము మదీయ గీతి నేల వెలార్చు?”
అని ఆ మబ్బులలో మబ్బుగా కలిసిపోవాలని ఆకాంక్షించారు. తమ మనోభావాలను ఆ పొగమబ్బులు కూడా వ్యక్తం చేయలేవని వాపోతూ భావం ముందు శబ్దం ఓడిపోతుందన్న కవి అనుభవాన్ని ఆవిష్కరించారు.
ఇలా ఈ మహాపురుషుల రాజ్యాల గాథలకి తగిన చారిత్రకాంశాలను శాసనాల ఆధారంగా ప్రస్తావిస్తూ రచన సాగించిన ‘ఆంధ్ర ప్రశస్తి’ని సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారికి అంకితం చేస్తూ-

ఇది నీకై యిడినట్టి నా యుపద; మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదనై ఆంధ్రవిరోధి కంఠదళన ప్రారంభ సంరంభ మే
చు దినాలన్ మఱి తోడి సైనికులమై చూఱాడు ప్రేమంబులో
ఇది లేశంబనియైన చెప్పుటకు లేవే నాటి స్వాతంత్ర్యముల్”

అని తమ ఇద్దరినీ ఆనాటి సహ సైనికులనుగా సంభావించారు. ఆనాడున్న స్వాతంత్ర్యం ప్రస్తుతం లేదన్న నిర్వేదాన్ని వ్యక్తం చేశారు.

ఇక ‘ఆంధ్రజాతి’ వైశిష్ట్యాన్ని –

“ఒక్క తిమ్మరుసు నింకొక్క యుగంధరు

డిట్టి మంత్రులు పుట్టరెచట గాని

ఒక కృష్ణరాయలు నొక తెనాలి కవీంద్రు

డిట్టి కవుల్ పుట్టరెచట గాని

ఒక్క ధర్మప్పరా వొక వాసిరెడ్డియు

నిట్టి దాతలు పుట్టరెచటగాని

ఒక కూచిపూడియు నొక వీథి నాటక

మిట్టి సంస్థలు పుట్టవెచటగాని

రాజనీతియు క్లిష్టాక్షర ప్రలీన
ప్రౌఢగాన మర్మజ్ఞత ప్రభు వితరణ
భరత ముని గుండెలో చొచ్చి పట్టుకొన్న
ఇట్టి రసభావములు లేవ ఎచటగాని” – అని ఘంటాపథంగా నొక్కి చెప్పారు.

ఆంధ్రత్వ మాంధ్ర భాషా చ
నాల్పస్య తపసః ఫలమ్” అన్న అప్పయ్య దీక్షితుల మల్లే-

బాహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి

ఆంధ్రుడై ధాత్రిలో నవతరించు

బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి

ఆంధ్ర భాషను మాటలాడుచుండు

బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి

ఆంధ్రత్వమన నిద్ది యని యెఱుంగు

బహుజన్మ కృత పుణ్య పరిపాకమున జేసి

ఆంధ్రీ మహామూర్తి నైక్యమెందు” నని తమ ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించారు.

ఆ ఎత్తు గీతిలో –
వట్టి నడమంతరపు సిరి పట్టినట్టి
బాసలం గని మది భ్రాంతిపడకుమోయి” అని పరభాషా వ్యామోహం పనికిరాదని హెచ్చరించారు.

‘ఆంధ్ర పౌరుషము’ అన్న ఖండికలో

గోదావరీ పావనోదార వాఃపూర

మఖిల భారతము మాదన్న నాడు

తుంగభద్రా సముత్తుంగ రావముతోడ

కవుల గానము శ్రుతిగలయు నాడు

పెన్నానదీ సముత్పన్న కైరవ దళ

శ్రేణిలో తెన్గు వాసించునాడు

కృష్ణాతరంగ నిర్ణిద్రగానము తోడ

శిల్పమ్ము తొలిపూజ సేయునాడు

అక్షర జ్ఞానమెఱుగదో ఆంధ్రజాతి!
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపు పాట పిచ్చుక గూండ్లు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలమందు”
అని ఆంధ్రజాతి కృష్ణానది ఇసుక తిన్నెలలో వెన్నెల రాత్రులలో పిచ్చుక గూళ్ళు కడుతూ కోయిల పాటను నేర్చుకొన్నదని శ్లాఘించారు.

ఒక్క సంగీతమేదో పాడునట్లు భా

షించునపుడు వినిపించు భాష

విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్ప

ష్టోచ్చారణంబున నొనరు భాష

రస భావముల సమర్పణ శక్తియందున

అమర భాషకును దీటైన భాష

జీవులలోనున్న చేవయంతయు చమ

త్కృతి పల్కులన్ సమర్పించు భాష

భాషలొకపది తెలిసిన ప్రభువు చూచి
భాష యన నిద్ది యని చెప్పబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష”

అని మన భాషా వైశిష్ట్యాన్ని ప్రశంసించారు. అలాగే
శ్రీ విష్ణువు కుర్మంబుగ
ఆవిర్భవమొంది యశమునందిన శ్రీ కూ
ర్మా విభవపురము మిక్కిలి
సేవితమై తెలుగుమాత శ్రీలనొసంగున్” అని శ్రీకాకుళాన్ని వర్ణించారు.

పెన్నానది నెల్లూరుకు
విన్నాణంబగుచు సస్య విరివికి నెలవై
సన్నుత నెల్లూర్మండలి
పున్నెంబై తెలుగుమాత భూషణమయ్యెన్” అని నెల్లూరు జిల్లాను కీర్తించారు. ఆ వరసలోనే విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు మండలాలను సైతం ప్రస్తుతించారు.
తెలుగు వలరాణి భాగ్యమ్మ తేజమలర
గోలుకొండావనీపతి కుతుబు షాహ
భాగ్యమా పేర నిర్మించె భాగ్యపురిని
అదియె హైదరాబాదయ్యె హైదారాఖ్య!
హైదరాబాదు భాగ్యపుర; మందు నవాబులు వైభవోద్ధతిన్
మేదుర పాలనన్ నలిపి మిక్కుట బంగరు వజ్రరత్నముల్
గాదెల నింపి సౌధముల గట్టిరి; ఇప్పుడదాంధ్ర దేశపున్
మేదుర ముఖ్యపట్నమయి మెప్పుల కుప్పయి వెల్గుచుండెగా!” అని హైదరాబాద్ నగర ప్రస్తుత ప్రాముఖ్యాన్ని కూడా కొనియాడారు.
ఇలా తెలుగు పేరిట తెలుగుతనాన్ని ప్రత్యక్షంగా అభివర్ణించడం ఒక ఎత్తయితే విశ్వనాథ తమ రచనలన్నింటిలోను పరోక్షంగా తమ ఆంధ్రాభిమానాన్ని ప్రకటించడం మరో ఎత్తు. ‘వేయి పడగలు’లో ఆయన వర్ణించిందంతా తెలుగు వాతావరణాన్నే! ఆ నవలలోని ధర్మారావు ముర్తీభవించిన తెలుగుతనం! మరి ’కోకిలమ్మ పెళ్ళి’లో
వెదురులో ముత్యాల పేరులు
కదురులో దారాల బట్టలు
ఎదురుగా నెలపొడిచినట్టే
ఏపుమీరేడేయ్” అని ఒక రాజుగారిని వర్ణించారు విశ్వనాథ. ఆ కృతిని సమీక్షిస్తూ
“ఇందలి రాజు శాతవాహనుల కాలమునాటి ఏ తెలుగు రాజో కావచ్చు” నన్నారు ఆచార్య సాళ్వ కృష్ణమూర్తిగారు. ఇక జ్ఞానపీఠ పురస్కారాన్ని తెలుగువారికి తొలిసారిగా ఆర్జించి ఇచ్చిన రామాయణ కల్పవృక్షంలో అడుగడుగునా తెలుగుతనాన్ని గుభాళింపచేశారు విశ్వనాథ. ఎక్కడో జరిగిన కథను ఇక్కడ మన తెలుగునేలలో జరిగినట్టుగా “ఇది మన తెలుగువారి కథ” అనిపించేలా తెలుగు వాతావరణాన్ని కల్పిస్తూ కథ నడిపించారు. పాత్రల స్థితిగతులను, ఆచార వ్యవహారాలను తెలుగుతనం ఉట్టిపడేట్టుగా చిత్రీకరించారు. సీతాకల్యాణ ఘట్టంలో తెలుగువారి పెళ్ళి ఆచారాలను, వనవాస సందర్భంలో తెలుగు ప్రాంతపు అడవులను, కొండలను తనివితీరా వర్ణించారు. మొత్తంమీద విశ్వనాథవారి వచస్సులో ఆర్ష మహస్సును మించిన తెలుగు తేజస్సు జాలువారుతుందనడంలో సందేహం లేదు. అది మన భారత జాతీయ జీవన గానానికి శ్రుతి చేసిన ఆంధ్రాభిమాన వీణ. ఆ ఉపజాతీయత జాతీయతగా, అంతర్జాతీయతగా ఫలోన్ముఖం కావడం నేటి చారిత్రకావసరం. ఆత్మవత్సర్వభూతాని, బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న మన ఆదర్శాలు, ప్రకరణం వేరైనా “యత్ర విశ్వం భవత్యేక నీడమ్” అన్న యజుర్వేద వాణిలోని ఆర్ష భావనలు ప్రపంచమంతటా పరివ్యాప్తమై అందరిలోను విశ్వమానవ సౌభ్రాత్ర భావన అంకురిస్తుందని ఆశిద్దాం!

ఉపయుక్త గ్రంథాలు:
1. ఆంధ్రప్రశస్తి, విశ్వనాథ – వి.ఎస్.ఎన్. & సన్స్, 1961, మారుతీనగర్, విజయవాడ – 4
2. ఆంధ్ర ప్రశస్తి, సంకలన కర్త-డా. మునిరత్నం నాయుడు, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు – 4, 1989.
3. కోకిలమ్మ పెళ్ళి (వ్యాసం), ఆచార్య సాళ్వ కృష్ణమూర్తి, భారతి, సెప్టెంబర్ 1959

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here