[box type=’note’ fontsize=’16’] విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ కోవెల సుప్రసన్నాచార్య గారు రచించిన వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. ‘విశ్వనాథ మార్గము‘ అనే వ్యాసం రెండవ భాగం ఇది. [/box]
[dropcap]అం[/dropcap]దుకే కిన్నెరసాని వైయక్తిక వేదనా పరిధిలోంచి అతిక్రమించి వ్యతిరేకమైన పురుషరూప ప్రాగ్రూపంగా సముద్రం ఎదురుకాగా తప్పుకుని మంత్రరూపమైన గోదావరీ గర్భంలోకి ప్రవేశించింది. ఒక వలయం పూర్తయింది. విశ్వనాథ సరస్వతి ఉద్గమం పొందిన చోటికి తిరిగి చేరుకోవటం ప్రధాన లక్షణంగా కలది.
విమలత రార్థభావ పదవీ పద వీక్షణ చారుతా మనో
జ్ఞములగు నేత్రయుగ్మమున జాదిన నీ పదలాక్ష జేసి ర
క్తిమ ఫలియించె నా కనుల క్రేవల నీదెస నిత్యచింత నా
యెముకలలోన గూళ్ళు పడెనే
(భ్రష్టయోగి. పే. 90)
అని సరస్వతీ దేవితో కవి చెప్పుతాడు.
ఈ విమలతరార్థభావ పదవి మూల స్రోతస్పు. ఈ అన్వేషణలో తాను చేసిన నిరీక్షణలో కన్నులకు ఎరుపు, తపస్సులో ఎముకల గూళ్ళ కట్టడం జరిగిపోయింది. ‘నిత్యచింత’ విశ్వనాథను రచనా వేళలో ప్రత్యగ్ర దీప్తి మహితుణ్ణిగా చేసింది. ఆయనను బ్రాహ్మీమయమూర్తిని చేసింది. బ్రాహ్మీ ఆవిష్కార స్ఫురణలో నిత్య జాగ్రద్దశలో అరవై యేళ్ళు కొనసాగింది ఆయన రచనా జీవితం.
అందువల్ల అకృత పరిశ్రముల్ శ్రమగతాలస బుద్దులు ఈ మూలసూత్రాన్ని అందుకోలేరు. వారికి ‘అమిత తేలిక’ కావలె. పై పొరలను దాటి లోతుల్లోకి వెళ్ళలేరు. “చికిలి మెఱుంగునన్న నగిషీ పని బంగరు సేత మెచ్చలే’ రకలుషమౌ వనాంతర మహాఝరిణీ పరి వేగ మోర్వలేరు. ఒకటి జాగ్రద్దశలో కవి చేసే తీర్పు శిల్పప్రస్థానం. రెండవది నవనవోన్మేష శాలినియైన ప్రతిభా విలాసం.
కాల్పనికోద్యమ పరిధులను విస్తరించిన తొలి ప్రయత్నం ఏకవీరలోనే జరిగింది. ఏకవీరలో శరీరం అపవిత్రమైందనుకొన్న వేళలో ఆమె చైతన్యాన్ని శ్రీ సుందరేశ్వరుడు ఆక్రమించాడు. ఆమెకు మరొక వైపు మూర్తి మీనాక్షి. శ్రీ మీనాక్షీ దేవి సర్గస్థి త్యపహార హేతువైన శైవార్థ సీమంతిని. ఈ శైవార్థ సీమంతిని అనార్కలీ నాటకానిది. నాందీ దేవత. ఆమె యోగినియై రూపు కట్టింది. అందువలననే ఇస్లాం మతస్థుల కథలోని కైనా ‘సర్వభూతేషు చిత్ర రూపేణ సంస్థిత’యైన అమ్మవారు ప్రవేశింపక తప్పలేదు. అందుకే అనార్కలి నాందిలో నందమూరిలోని ఆత్మ వారణాసీ పుర నేత (వరణ-అసి-నదులు ఇడా పింగళలు తనలో) యైన విశ్వేశ్వరుని, ఉత్తమ మునులకు తత్త్వోపదేశం చేస్తూ ఉన్న శ్రీ రామచంద్రుడూ, ముక్తీంద్రియ భ్రాంతుడై తననావేశించిన రామచంద్ర పద పద్మాధీన చేతస్కుడైన ఆంజనేయుడు స్తుతింపబడినారు. అనార్కలి కథ ఎట్లా మత సంప్రదాయాల కాల్పనికోద్యమ పరిధులను అతిక్రమించిందో ఇది సూచన. ఈ ఆధారం మీద ఆ నాటకం చదివితే సలీము యొక్క యోగసాధన తెలియ వస్తుంది.
శ్రీ మీనాక్షి దేవి సృష్టి ఆదిలో ఉన్న సలిలంలో కలిగిన ప్రప్రథమసృష్టి స్పందం. ఆమె శ్రీసుందరేశ్వరుని కోసం చేసే అన్వేషణయే ఈ జగద్వికాసం. శ్రీ అరవిందుల ‘ది మదర్’ అన్న గ్రంథంలో ఈ విషయం విపులంగా వ్యాఖ్యానింపబడింది. ఈ ఇద్దరినీ అనుసంధించే అంశం స్థితి కారకమైన విష్ణుచైతన్యం. ఈ విధంగా విశ్వనాథ సాహిత్య భూమిక శ్రీ మీనాక్షీ సుందరేశ్వరుల కలయిక. శ్రీమంజూషిక అంటే ఇదియే. విష్ణుస్థానం అనుసంధాత సుషుమ్న. ప్రకాశిం చేవాక్కు అంటే కవి. రామాయణ కల్పవృక్షంలో ఈ రహస్యం ఎరిగినవాడు రావణుడు, సృష్టి సమన్వయాన్ని భంగించడం కోసం సీతారాముల వియోగం కల్పించినవాడు. అట్లైతేనే ఈ సృష్టి శివుని నుండి పరిచ్యుత మౌతుంది. తన చేత చిక్కుతుంది. ఐతే ఆసురమైన ఈ ఘర్షణలో ఆద్యాశక్తియైన అమ్మవారు గెలిచింది. ‘ముట్టితి శ్రీరహస్యమున్’ అన్న రావణుడు తన సంహార వేళలో ‘ఇతనికి దేనికిందనరు నింతటి భేదము స్యూతభావనా తతముగ దేవియే యితడు’ అని ఆర్థనారీశ్వర తత్త్వాన్ని తనలోకి ఆవిష్కరించుకొంటాడు.
ఇలా అనేక గ్రంథాలలో విశ్వనాథ జీవుని విముక్తి సాధనను సంకేతంగా సాహిత్య నిర్మాణం కొనసాగించాడు. ఈ మనో భూమికను గూర్చి విశ్వనాథ
‘వెస సర్వ సృష్టి హేతువయి తగునెల్ల విక్షేప శక్తి
ముసరి నా మనసులో వచ్చి కూర్చుండే పులిపీట వెట్టి
ప్రసరత్సమస్త సృష్టి నిచయాధార రమ్యమహస్క
రసియింపు మిచట‘ అని రూపకల్పన చేస్తాడు.
తన సాహిత్య నిర్మాణంలో ఆయన సాధించిన ఫలం ద్విముఖమైంది, ఒకటి వేయి పడగలు, రెండు రామాయణ కల్పవృక్షం. మిగిలిన రచనలన్నీ వీటికి అనుబంధంగా ఉండవలసినవే. ఒకటి పాము. రెండవది చెట్టు. ఈ రెండూ ఆదిమకాలం నుంచీ మన కథల్లో ప్రతీకలుగా ఆవిష్కృతమౌతున్నవే.
పాము ‘పాతాళైక నికేతనాంతరము’ సృష్టినంతనూ భరించే ఆదిశేషుడు. ఆదిమమైన ‘ప్రధాన’ ద్రవ్యము. సర్వసృష్టి ఇక్కడనుంచి ఉద్గతమైంది. అది పిండాండంలో ఆధారమై ఉంటుంది. మేల్కొని సుషుమ్న నుండి సాగి సృష్టి శ్రీర్షానికి వేయి పడగలతో గొడుగు పడుతుంది. చైతన్యము యొక్క ఉద్గామి లక్షణము, పరిణామ లక్షణము, అంతస్సూత్రమైన కాల లక్షణము యిక్కడ స్పష్టంగా వ్యక్తీకరింపబడుతున్నవి. ఆందుకే –
‘వేయి పడగలతో నేల దాల్చినవాడు, నాల్గు పడగలతో పురుషార్థములు పాలించినవాడు, రెండు పడగలతో దంపతుల పాలించువాడు, ఒక పడగ విప్పి పైరుపచ్చకు గొడుగు పట్టినవాడు…… నన్ను సర్వదా రక్షించుగాక’ (వేయిపడగలు).
నేలదాల్చినప్పుడే సృష్టి ఉద్గతమైంది. ధర్మార్థ కామ మోక్షములలో వ్యవస్థ రూపుదిద్దుకొన్నది. దాంపత్యము సృష్టికి ఆధారబిందువైంది. అందరికీ భోగయోగ్యమైన పైరుపచ్చను గూడ పట్టి జీవన సాంతత్యానికి సూచిక అయింది. ఈ విధంగా ఈ ప్రతీక సృష్టి రహస్యాన్ని వర్తులాకారంలో తిప్పి ఆరంభ బిందువును చేరుకొన్నది. వేయిపడగలతో ప్రారంభమై ఒక్కపడగదాకా వచ్చి అనంతతత్వానికీ, ఆరంభానికీ ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది.
ఈ పీఠిక మీద ఏర్పడ్డ ఇతిహాసం ‘వేయి పడగలు’. సర్పములలో అనుకూల వ్యతిరేక రూపాలు రెండూ ఉంటాయి. రామేశ్వరశాస్త్రి వ్యవస్థ ధర్మానికీ రామేశ్వరము వ్యవస్థను కూల్చే వ్యక్తి పాతిత్యానికీ గుర్తులు. ఇద్దరికీ ఒకటే పేరు. భూమి క్రిందుగా అధోలోకాల చీకట్ల గుహలలోకి ప్రాకే సర్పాలు ఒక రకమైతే పైకిలేచే ఊర్ధ్వ సర్ప కోటి మరొక విధం బైబిల్‌లో సర్పం ఆసుర భావానికి ప్రతిరూపం. రామేశ్వరము మంగమ్మ ఎట్లో రామేశ్వరశాస్త్రి మంగలు అట్లే రెండు విభిన్న పార్శ్వాలు. రామేశ్వర శాస్త్రి మంగ వలన కశ్యప ప్రజాపతివలె సృష్టిమూలాన్ని ‘పసరిక’ రూపంలో తనలో ఆవిష్కరించుకున్నాడు. రామేశ్వరము వల్ల మంగమ్మ ధర్మవిరుద్ధము లైన అర్థకామాలకు లోగి ‘వాలి’ అవుతుంది. ఈ వాలి పరిణామంలో ఈశ్వరుని రథకేతన మవుతుంది.
విశ్వనాథ రచనల్లో పతిత భావానికి మరొక కథా దీర్ఘీరీకరణం ఉంటుంది. పతితలలో ఒక వైపు కర్మ ఫలానుభవమూ రెండో వైపు ఈశ్వరపథదర్శనమూ సంభవిస్తుంది. ఆరు నదులలో సోఫియాదాకా ఎందరి స్త్రీల కథలలోనైనా ఈ లక్షణం గమనించవచ్చు. కవి శరీరాన్ని శిక్షిస్తారు, మనస్సును పవిత్రీకరిస్తారు.
కల్పవృక్షం – ఆదివటము. ‘చిత్రం వట తరోర్మూలే….’ అక్కడ దర్శించేది దక్షిణామూర్తిని. అందుకే కల్పవృక్షం ‘ఆత్మ నిత్యమ్మకాలాద్యవచ్ఛిన్న’మని ప్రారంభమయింది. జీవునిలోని చైతన్యాన్ని త్రవ్వి వెలికి తీసింది. పురాణ జానపద కథలలో వృక్షం ప్రాణులకు విశ్రమ స్థానం. ఆముక్త మాల్యదలోలాగా బ్రహ్మ రక్షస్థానం. బ్రహ్మ రక్షస్సును వదిలించేది జీవునిలోని ఈశ్వరాన్వేషణానుగమైన సంగీత తరంగం. ఈ సంగీతము ఆత్మలో నదించేది. ఝుంకారమై మకారో పాసనతో ప్రణవ రహస్యాన్ని(మ్రోయు తుమ్మెదలోవలె) వెలువరించేదీ, భవ మహా నరకంలో ఏడు నిలువుల లోతులలోకి క్రుంగిపోతూ ‘లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం’ అని అరిచేదీ.
మన ప్రతీకా సాహిత్యంలో వృక్షం – వటము శివునితో, అశ్వత్తముతో విష్ణువు, కదంబంతో దేవీ అనుసంధింపబడ్డారు. కల్పవృక్షమును విశ్వనాథ ఈ మూడు తత్త్వాలకు సంగమ తీర్థంగా నిరూపణ చేశాడు. ‘ఇది నారాయణ నామమౌ తరువు’. వేదం వ్యక్తావ్యక్తాలనూ, జీవేశ్వరులను రెండు పక్షులుగా నిరూపించింది. ‘ద్వాసుపర్ణా’ అని, భాగవతమునూ కల్పతరువుగానే పోతన్న భావించారు. కల్పవృక్షమును విశ్వనాథ నారాయణ నామక మనటంలో నాదాయనం కూడా. ఈ నాదం రామకథా నాదం అది ముని సింహమైన వాల్మీకినాదం. దాన్ని విన్నవాడు పరాగతికి పోవడం తప్పనిసరి. వాల్మీకియైన సింహం పైకి లేచింది. అవ్యక్త సముద్రంనించి లేచిన సింహం సూర్య సింహం. ఇది జడమైన స్తబ్ధ దశను చీల్చుకు వచ్చిన నారసింహ రూపం. సింహ శబ్దానికి మరొక ప్రతీకారూపం హంస. ఇక్కడి అకారం సింహంలో ఇకారమైంది. ‘ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి’ ఈ సింహము యుద్ధకాండలో హంసయై సీతారాములకు సందేశం అందించిన శివుడే.
విశ్వనాథ తపస్సు అంతా ఇన్ని భూమికలమీద కొనసాగింది. ఆయన సోదరుడు శ్రీ వేంకటేశ్వరులు తమ అన్నగారు శరీరాన్ని విడిచి పెట్టినప్పుడు ‘శ్రీమన్మైథిలి చిదగ్నిచిహ్నిత ఫాలా’ అని విశ్వనాథను ప్రకటించారు. ఈ చిదగ్నినే ధూళిపాళ శ్రీరామమూర్తి ‘జయత్యసౌ శివస్సాక్షాత్ విశ్వనాథో మహాగ్నిచిత్ జుహోతి నిఖిలం విశ్వం దృక్కుండే యః ప్రదీపితే’ అన్నాడు. ఇక్కడ కవి శివుడు. జగదనుభవ సర్వస్వాన్ని తనలోకి ఆవిష్కరించుకుని విశ్వమయం చేస్తాడు. పరిమితులను తొలగిస్తాడు. ఈ పరిణామానికి విశ్వమంతా వస్తువే. వాస్తవమయిన ఈ జగత్తు కవి వాక్కులో ఒక అమృతత్త్వాన్ని పొందుతుంది. ఇది కవి నుదుట మొలిచే మూడో నేత్రంవల్ల సంభవిస్తుంది. రవి గాంచనిచో కవి గాంచునన్నది ఈ దర్శనం. ఇది మన భాషగా కనిపించినా పైన వివరించిందంతా కళాసృష్టిలో మనోలోకంలో జరిగే మహా పరిణాహం, ఆయన నుదుట ఏర్పడ్డ కన్ను సీతాదేవి. సీతానామకమైన ఒకానొక యోగంలో తాను ఉపదేశం పొందినట్లు ఆయన చెప్పారొకచోట. (జ్ఞానపీఠ పురస్కారోపన్యాసం)
సీతారాములు శివుడూ ఒక త్రిభుజమైతే ప్రకృతి పురుషుడూ, సూర్యుడూ మరొక స్థాయిలో త్రిభుజం. మరొక త్రిపుటి ఆధార సహస్రారాలు – అనాహతము. ఆహత నాదంనుండి లోలోతుల్లోకి వెళ్ళి వినే దశలో ప్రణవం హృదయ చక్రంలో అనాహతమై వినబడుతుంది. హృదయ చక్రంలో నాదాయనుడైన ప్రభువు అంగుష్ఠమాత్ర పురుషుడై తానే సింహమై తానే హంసయై నిలిచివుంటాడు. ఇక్కడ నాదం విన్న వాడు నాదపు మూలంలోకి బొడ్డులోకి సులభంగా వెళ్ళి పరావాగ్దర్శనం చేస్తాడు. ‘యాతి పరాంగతిం’.
ఆనంద కుమారస్వామి ఒకచోట “The Sun door through which souls pass back from time to eternity, like the savior of the offering, burned in the fire of life and lifted on the axis of ascending smoke from the hub of earthly to that of the celestial wheel (Symbol of the Door – Anand K. Coomaraswamy) అన్నారు. ఈ అనాహత చక్రం మర్త్యామర్త్యలోకాల సంధి స్థానం. సత్యాన్ని తెరచి చూపించే ద్వారం.
ఈ క్లిష్ట సాధన ‘ఆత్మలోనుండి సముద్గతంబైన మనసు మరల నాత్మాభి ముఖముగా మలచునట్లు’ (అయోధ్య – ప్రస్థాన) సాగుతుంది. అప్పటి సృష్టి ‘తన యాత్మందెచ్చి యెలుక బోసిన చందమ్మున’ (అరణ్య – మారీచ) ఉంటుంది.
IV
అందుకే విశ్వనాథ శ్రీమద్రామాయణాన్ని కల్పవృక్షం అన్నారు. అది ‘సకలోహ వైభవ సనాథము’. ఇది తిక్కనగారు చెప్పిన ‘సకల బ్రహ్మ ప్రార్థనంబు’ చేసి, అన్నటువంటి మాట. సకల బ్రహ్మము సృష్టికి ఉన్ముఖమైన దశ. సకలోహ వైభవము వ్యక్త చైతన్య సమూహ సామగ్ర్యము. అందువల్లనే విశ్వనాథ శారద ‘సకలార్థదాయిని’ జగచ్చేతో వ్యవహారంలోని విభిన్న భిన్నదశా సూక్ష్మ సూక్ష్మ మర్యాదలను పట్టి యిస్తుందని తాత్పర్యం. ఇంత విస్తృతి గల రచన కాబట్టియే వ్యక్త జగత్తులోని వికారాలను ఎన్ని విధాలుగా చూస్తూ వున్నా దానిమీద అంత పట్టరాని మోహం. అందువలన ఆయనలో రెండు పార్శ్వాలు ఒకటి ‘జగదనిత్య భావనా నిరతుండు’ (యుద్ద-ఉపసంహరణ 411), ‘మన్మహా యోగనిష్ఠా సమాధినుండి బ్రహ్మ జగదతీతమను భావంబు లేక ఈ జగత్తత్వమున బ్రహ్మయోజచేసి’న భ్రష్టయోగి. హనుమంతుడు సీతాదేవికి కలిగిన కోపాన్ని ఉపసంహరించాలని ప్రార్థించినప్పుడు జగత్తు పై నింత మక్కువగల యితడెవ్వడో సృష్టికర్త యని (సుందర – ఉషస్సు 213) అనుకున్నదట. ఇక్కడ కవికీ బ్రహ్మదేవునికీ అన్వయించే శబ్దం ప్రయుక్తమయింది. ’అనార్కలీ’లో నన్నావేశించిన రామచంద్ర పదపద్మాధీన చేతస్కుడౌ ఈ భవిష్యద్బ్రహ్మ. యోగి లోనికి ఉపసంహరించుకుంటాడు. కవి బయటకు విస్తరించుకుంటూ పోతాడు. కవి యోగి సమాంతరంగా రెండు కార్యాలు కొనసాగిస్తూ వచ్చాడు. ఈ అంతరువుల ఎరుక తోడనే కల్పవృక్షం అనగాహనకు వస్తుంది.
‘పంచభూతములు దివాకరుండును నిశాకరుడు నీ తనుసప్తకంబ యేని ఈ శరీరంబు నీదే?’ అందువల్ల ఈశ్వరసన్నిధానం కన్ను విప్పినా మూసినా ఉన్నది. ఈశ్వర కళాభిసంగమం తోడి బ్రతుకుకూ తద్విరహితమైన నీరసపు బ్రతుకుకూ ఎంతో భేదం ఉన్నది. కవి తనలోని యోగితో ఎప్పుడూ సంవదించుతూ రెండు సాధనలు చేస్తున్నాడు. ఒకటి తన ఉనికి లేకుండా చేసికోవడం – ‘బిట్టు నేనన్న దభిజ్ఞ’ మాత్రమే కనుక. రెండవది తన్ను తాను సర్వముగా పెరిగి పోవడం. దీనితో వాక్కు ఏక పది, ద్విపది, చతుష్పది, అష్టాపది, నవపది చివరకు సహస్రాక్షరగా రూపొందిందన్న ఋక్కునకు అక్కడ లక్ష్యార్థం లభిస్తున్నది. ఈ వైరుద్ద్యం డాక్టర్ ‘జైకిల్ అండ్ హైడ్’లో వంటిది కాదు.
ఈ స్థితి సృష్టి అత్యున్నత శిఖరాల మీద కూర్చున్న మహారచయితకు అనివార్యమైన, దశ వివశ స్థితి. ‘ఇది మెచ్చెదరో మెచ్చరొ, యిదియును చదివెదరో చదువరేలానాకు’ అంటాడు. ఈ ద్వైవిధ్యం ఒక విధమైన కృతకత. ఆయనే ‘లేని కోపంబు వీరికై పూనుచుంటి. లేని కామంబు వీరికై పూనుచుంటి’నంటాడు. ఇది ఒక విలక్షణస్థితి,
ఇప్పుడు ‘మరల నీదేల రామాయణం’బన్న ప్రశ్న. జగత్తు నిత్యమూ దేహధారణకోసం అన్న ప్రాణమయకోశ తృప్తి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నది. తన మనోమయకోశం తృప్తి కోసం నిరంతరంగా స్త్రీపుంస యోగరూపమైన ప్రజాతంతు క్రతువును నిర్వహిస్తూనే ఉన్నది. ఒక చోట రుచి బ్రతుకులు నియమిస్తున్నవి. రెండవ చోట అనుభూతి నిలువరిస్తున్నది. ఈ రెంటికీ పరిమితులు ఉన్నవి. ఆ సరిహద్దులను దాటి అవి పోలేవు. రాముడు (మామూలు శబ్దమునే యిక్కడ వాడాడు) మంత్రమూర్తి, యోగమూర్తి, అవతారమూర్తి, ఆంతర్యామిమూర్తిగా ఈ శబ్దం రామతత్వాన్ని ప్రకటిస్తున్నది. ఇంకా మర్యాదా పురుషోత్తమత్వం ‘ఆత్మానం మానుషం మన్యే’ అన్న స్థితీ వాల్మీకి ప్రశ్నించిన షోడశ కళా మహిత్వమూ ప్రకటిస్తున్నది. తలచిన రామునే తలచెద. తాను తన కాలం కాదు, ఆనంతకాలం భూత భవిష్యత్తులు, ఆదికవి నుండి ఈనాటి వరకు వ్యాపించియున్న కవి పరంపర భావించిన రాముడు. భక్తి రచనలు తనవి. తాను తనవి అనేవి రెండూ ఒక స్థితిలో కేవలం అభిజ్ఞలే. అయినా మరొక దశ మమకారపారమ్య స్థితి. ఆ స్థితిలో తాను రాముడే తప్ప వేరొక అభిజ్ఞ లేదు. రాముని కథ అనే పగ్గాలు తన మనోశ్వాన్ని నిగ్రహిస్తూ వున్నవి. సారథి అభిజ్ఞకు సాక్షియైన ఉగ్రుడు. అందువల్ల విశ్వనాథ అవస్థాత్రయంలోనూ తనలో రామచైతన్యం ఎలా ప్రస్ఫుటంగా ఏకాకారంతో ఉన్నదో వివరించాడు.
జాగ్రదావస్థ నేమి యన స్వప్న సుషుప్తు లగూడ రామ నా
మగ్రహణంబే నావయిన మాసన జిహ్వలు సేయు తత్కథా
ప్రగ్రహ కృష్ట సంశ్లథ ధురావహమై చను మన్మనోశ్వ మో
యుగ్రుడ నీవ సారథివ యూనుము పగ్గములన్ కరంబులన్
మాండూక్యోపనిషత్తు అవస్థాత్రయ విజ్ఞానాన్ని విపులంగా చర్చించింది. జాగ్రత్స్వప్న సుషుప్తి దశల్లోను ఏ భావధారాస్థితిలో రచయిత ఉన్నా రామనామ గ్రహణమే జరుగుతున్నది. ఈ మూడు దశలలోనూ మేల్కొని ఉండే పురుషులు విశ్వతైజస ప్రాజ్ఞులు. ఒక దశ నుంచి యింకోదశకు చేరటమే సాధారణంగా వివశ స్థితిలో జరుగుతుంది. అ, ఉ, మ లు వీటికి ప్రతీకలుగా ఉపాసన చేయటం ఉన్నది. బిందువు తురీయమైన దశకు చేర్చే స్థితి.
అవస్థాత్రయంలోనూ రామనామం సాగుతున్నది. అంటే అది ఆహతమైన నాదం కాదన్న మాట. అంతర్ముఖుడైనంతలో ‘హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రమ్ అహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి. హృది విశ మనసా వా చిన్వతా మధ్యతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్ఠాభవ త్వమ్ (రమణ గీత -2 అధ్యా) అని భగవంతుడైన రమణ మహర్షి తెలిపారు. ప్రణవోపాసనమే రామ మంత్రోపాసనము ‘మ్రోయు తుమ్మెద’. ఈ అవస్థాత్రయంలో కొనసాగవలసిన ప్రణవోపాసనను వెల్లడించింది. ‘నామగ్రహణంబె నావయిన మానస జిహ్వలు సేయు’ లోపలి నారాయణ క్షేత్రంలో నుంచి మానస జిహ్వలు గ్రహించుతాయని భావం. ఈ త్రివిధ దశలలోని సమస్థితి నిత్యయోగికే సాధ్యం. ఇది నిత్య జాగ్రదవస్థాలక్షణం. సుందరలో విశ్వనాథ జానకీ దేవిని గూర్చి నిత్య జాగ్రదవస్థాభూతురాలు అని వ్యాఖ్యానిస్తారు శ్రీగిరి శతకంలో (విశ్వనాథ మధ్యాక్కరలు).
అవిల జాగ్రదావస్థ యందు స్వప్నావస్థయందు
జీవుని ఆనుభవ భేదమింతగా జెందియు నొకడె
ప్రోవైన తెల్వి –
అని ఏకత్వ స్వరూపాన్ని వెల్లడిస్తారు. ఆనంద రామాయణంలో జాగ్రద్దశ లక్ష్మణ స్వామిదనీ, స్వప్న దశ భరతుడనీ, శత్రుఘ్నుడు సుషుప్తి దశ అనీ, శ్రీరామచంద్రుడు తురీయ దశ అనీ చెప్పడం జరిగింది. ఈ నల్వురూ పైకి నలువురే కానీ తాత్త్వికంగా వేద వేద్యమైన పరమ పురుషచైతన్యమే.
మనోదశలో ఈ వైవిధ్యాన్ని ఆధునిక శాస్త్రం వివేచిస్తూ వుంటే యోగం దాని ఐక్య లక్షణాన్ని చెప్పింది. జిడ్డు కృష్ణమూర్తి కూడా ఈ ఐక్యభావాన్నే విపులంగా స్పష్టం చేశారు. ఆయన స్వయంగా అమనస్క స్థితిలో ఎప్పుడూ వుండేవారు. అప్రయత్నసిద్ధంగా సమాధి స్థితి కలిగేది. అన్నీ చైతన్య పార్శ్వాలనూ ప్రతిఫలింపజేసే స్ఫటిక శకలంలాగా ఆయన తోచేవారు. ‘తల్లీన’మైన దశలో ఈ కృత్రిమ విభజన ఉండదేమో.
కృష్ణమూర్తి ఐక్యభావ స్థితిలో మనోనుభవాన్ని గూర్చి చెప్పుతూ మనలోని విభజించే లక్షణమే దీన్ని విడిగా చూస్తున్నదని స్పష్టంచేశాడు. ‘ప్రజ్ఞ’ (brain) మనలో సంపూర్ణంగా మేల్కొన్నప్పుడు మనస్సు శాంత స్థితిని పొందుతుంది. ప్రజ సంపూర్ణంగా మేల్కొన్నప్పుడు ‘విభాజనలు లేవు, విడిపోవటం లేదు. ద్వంద్వ స్థితి లేదు. శాంత స్థితి ఎంత ఉదాత్తమైనదో అదీ ముఖ్యం. కొన్ని ఔషధాలవల్ల మన చమత్కార కృత్యాలవల్ల మనస్పును శాంతంగా చేయవచ్చు. అలాంటి వైపరీత్యాలు మనలో విభిన్నమైన భ్రాంతులకూ వైరుధ్యాలకూ కారణమౌతవి. శాంత స్థితి ప్రజ్ఞ (Intelligence) యొక అత్యుత్తమమైన స్థితిరూపం. అది వైయక్తికంగాని అవైయక్తికం కాదు. నీదీ నాదీ కాదు. అనామకమై అది సర్వమూ పాప భావరహితమైంది. గుణరహితమై అది వర్ణనల కందదు. ఇదే ఎరుక. ఇదే శ్రద్ద. ఇదే ప్రేమ. ఇదే అత్యున్నతమైంది’. (ది సెకండ్ సెంగ్విన్ కృష్ణమూర్తి రీడర్ 251 -252).
ఈ అవిచ్ఛిన్న మనో ధారా చైతన్యం అందుకొన్న కవులను ఏ పరిధులూ పరిమితులూ సరిహద్దులూ బంధించలేవు. ఈ దశలో విశ్వనాథ రామాయణ కల్పవృక్ష రచన జరిగింది. అందుకే ఆయన వాక్కు తరచిన కొద్దీ నూతనార్థ సంగ్రహణశీలమౌతున్నది. కాలం సాగేకొద్దీ నూత్నాంశువులను ప్రకటింప జేస్తున్నది. అందుకే కాటూరి వేంకటేశ్వరరావు, విశ్వనాథ రామాయణారంభాన్ని గూర్చి తెలిసినంతనే ఆయనను ‘తద్రామాయణం బీవు గీర్బలముంజేసి పునః ప్రతిష్ఠిత సుధాప్రాయాఖిలాంగమ్ముగా నిలుపం జూచెదవోయి మంత్ర మయ వాణీ సత్యనారాయడా’ అని ప్రశంసించారు. 1941లో రామాయణ రచనలో కవివాక్కు మంత్ర మయత్వాన్ని పొందింది. శ్రీ అరవిందులు ‘సావిత్రి’లో మంత్రం ఆంటే ఎన్నోచోట వివరించారు.
‘నిశ్శబ్దం స్థిత హృదయం మీద ప్రసరించే శిఖరాల మీద
పరిక్రమించే శబ్దాలతోడి లయబద్ద చ్ఛందాలదాకా
త్రేతాగ్నుల సంగతుల సమర్చనం సాగించినవాడు
సుషుప్తికీ సమాధికి గల సంధిరేఖ మీద
ఆతడు పూర్వ అనుక్త సత్యధ్వని విన్నాడు
నిర్దుష్ట హఠాన్నిర్గత వాగ్దేవత జన్మస్థానం అది
అతడు సంబుద్ద సూర్యుని కిరణ జాలంలో నిలచినాడు‘.
(తెలుగులో ఈ రచయిత చెప్పిన వాక్యాలు ఇవి)
ఈ స్థితికి చేరుకున్న కవివాణి మంత్రమయ మౌతున్నది. ఆప్పటి భావస్థితిని గూర్చి ఆయన మాటలే మరికొన్ని,
Thought, Vision, feeling, sense, the body’s self
Are seized unalterably and he endures
An ecstasy and an immortal change
He feels a wideness and becomes a power
All knowledge rushes on him like a sea
Transmitted by the white spiritual ray.
He walks in naked heavens of Joy and calm
Sees the God face and hears Transcendent speech.
వాక్కు తన సరిహద్దులను దాటి విశ్వభావోన్మాదంలో దివ్యభావ ప్రకాశకంగా పరిణమించడం ఈ స్థితి. ఈ దశలో కవికీ వాక్కుకీ ఒక అభేదం తాదాత్మ్యం ఏర్పడుతుంది. గిరికుమారుని ప్రేమగీతాల ఆరంభంలో
‘అస్మదీయ కంఠమున యంచాడుచుండె
ఒక యెదో గీతి వెలుపలికుబిరా
చొచ్చుకొని లోనికింబోదు‘
ఆన్న స్థితి నుంచి నిత్య సరస్వతీ జాగద్భావనా మహితమైన దశకు రచయిత చేరుకుంటాడు. ‘సాధారణముగ నే ప్రయాణముం జేయు సమయంబు నందు నాముఖంబున కవితా సరస్వతి నాట్యమాడేది. స్వామి నా తుది యాత్ర నిన్ను పాడుచు సాగనీవే గవీమార్గం! అని ఆ దశనుగూర్చి వివరిస్తాడు.
ఇట్టి పరిణామ భావం గల రచయితను ఎవరితోనూ పోల్చడం ఉచితం కాదేమో. విశ్వనాథను విశ్వనాథగానే అందుకోవాలి. విపులమై, భావవర్చస్సుతో. విమలమైన చేతస్సుతో.
ఎప్పుడో 1960 ప్రాంతాలలో ఏదో ఒక కావ్యారంభం చేసి దానిలో విశ్వనాథ భారతిని గూర్చి వ్రాసిన పద్యం ఇది.
‘కొతిమెర చేలపై ముసుకొన్న పరీమళ వల్లు లట్లు, వేల్
బ్రతుకుల మున్ను పొల్చు రసభావమె సాగిన రాగమై గళ
మ్ము తొలచినట్లు ఈశ్వరుని మోహమె మండిన విశ్వనాథ భా
రతి సకలార్థ దాయిని‘.
(సమాప్తం)