[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
విశ్వనాధ సాహితీ సమాలోచనం
[dropcap]‘క[/dropcap]విసామ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిభా వైవిధ్యం అనన్య సాధ్యం. ఆంధ్ర సాహిత్య రంగంలో ఎన్నెన్నో ప్రక్రియలను చేపట్టి అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన – అంచులు ముట్టిన విరాణ్మూర్తి ఆయన.
శ్రీశ్రీ గారు అన్నట్లు –
విశ్వనాధ దిషణాహంకారంతో తన అభిమానాన్నీ, జాతి గౌరవాన్నీ, భారతీయ సంస్కృతీ మూర్తిమతాన్నీ, తలవంచనీయకుండా నిలిపిన ‘మాటలాడే వెన్నెముక’;
మానవుల భౌతిక సమస్యలకు ఉపరితలంలో భాసించే సాంఘిక, సామాజిక, రాజకీయ సమస్యలనే కాకుండా, అంతరంగ, ఆధ్యాత్మిక సమస్యలను సైతం తన రచనల్లో ప్రతిఫలింపజేసి మన జాతి జీవితాన్ని ‘పాట పాడే సుషుమ్న’;
బ్రతుకు – గోదారిలా విశ్వనాథ రచనల్లో పొంగులు వారుతుంది; కృష్ణమ్మలా కళావీచికలను వెలారుస్తుంది; కొండవీటి మబ్బుల్లా జననాంతర సౌహృదాలను జాగృతం చేస్తుంది; ‘తెలుగువాళ్ళ గోల్డ్ నిబ్’ లా పట్టింది బంగారం చేస్తుంది. దేశీయతను బంగారుపంటగా సాహితీ క్షేత్రంలో పండిస్తుంది.
‘కవిసామ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ గారి శతజయంత్యుత్సవాలను 1994 సెప్టెంబరు నెలలో ప్రారంభించి, ప్రతి నెలా మొదటి ఆదివారం సాయంకాలం ‘సమాలోచనం’ కార్యక్రమంలో భాగంగా, విశ్వనాథ సాహితీ సమాలోచనాన్ని పన్నెండు నెలలపాటు నిర్విఘ్నంగా నిర్వహించింది యువభారతి. ఈ కార్యక్రమంలో ఉపన్యసించిన శ్రీ విశ్వనాథ పావని శాస్త్రి, డా. కోవెల సంపత్కుమారాచార్య, డా. కోవెల సుప్రసన్నాచార్య, డా. ముదిగొండ వీరభద్రయ్య, శ్రీమతి కె బి లక్ష్మి, డా. ముక్తేవి భారతి, డా. నాయని కృష్ణకుమారి, శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, శ్రీ వాకాటి పాండురంగారావు, శ్రీ పేరాల భారత శర్మ, శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య, డా. వి.వి.ఎల్. నరసింహారావు, శ్రీ పాతూరి నాగరాజు, శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి, డా. నాయని కృష్ణకుమారి, డా. యన్ నిర్మలాదేవి, డా. వై. కామేశ్వరి, శ్రీ కోయి కోటేశ్వరరావు, డా. మసన చెన్నప్ప, వంటి లబ్ద ప్రతిష్టుల 34 వ్యాసాలు, 15 కవితా నీరాజనాల సంకలనమే ఈ పుస్తకం.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.