[dropcap]న[/dropcap]వ ప్రియులైన రాజులకు నూతన వధూసంగమేచ్ఛ సహజం. కానీ ఆమె సహజంగా నది కాదని కడలిరాజు గుర్తించలేదు. ఆత్మాభిమానం వున్న ఆడపడుచు. సముద్రుడు చూద్దామా, వయసులో పెద్దవాడు. వ్యక్తిత్వంలో ‘గంభీరుడు’. ‘మర్యాద’ (హద్దు) తెలిసినవాడు. లోకాలు తప్పు త్రోవల పోతే సరిదిద్ద వలసిన పెద్దరికం కలవాడు. అటువంటి వాడు ఇలా కామానికి గురియై తపించడం, తన పరువుప్రతిష్ఠలకు భంగం కాదా, తనకున్న గౌరవమర్యాదలకు లోపం కాదా అని అందరూ అనుకున్నారు.
కడలిరాజు డోలాందోళిత మనసుతో కళవళపడ్డాడు. నదిగా మారిన నారీమణి అని తెలుసుకుని తనకు దక్కుతుందా అన్న అనుమానం, ఎప్పుడైతే నదిగా మారిందో తనకు దక్కాల్సిందే అన్న నమ్మకంతో అవస్థ పడసాగాడు. ఎంతగా పొంగినప్పటికీ ‘చెలియలికట్ట’ దాటరాదన్న ‘మర్యాద’తో అక్కడే ఆగి చూస్తున్నాడు. కెరటాల కౌగిటలో తనను ఇముడ్చుకోడానికి ఉబికి, ఉప్పొంగి, ఉప్పరమంటుతూ నిలుచున్న కడలిరాజుని చూసి దిగులొంది పతిని తలుచుకుని, రాబోయే కీడును ఊహించుకుని హాయని కిన్నెర ఏడ్చింది. అతి ప్రయత్నం మీద రాళ్ళ నడ్డం చేసుకొని నిల్చుటకు, పొదలనడ్డం చేసుకొన ఆగుటకు ప్రయత్నించి, విఫలురాలైంది. మొదటి నుంచి జరిగిన విషయాలన్నిటిని తలుచుకుని తలుచుకుని దుఃఖించింది. తాను నీరుగా మారడం, భర్త శిలగా మారడం, నీటి గుణం చేత తన ప్రమేయంలేక పోయినా నిస్సహాయంగా ముందుకు సాగిపోవడం, ధర్మాలన్నీ తెలిసిన పెద్దవాడే తనని కోరడం తలుచుకుని, ఈ కష్టాలకడలిని దాటడం ఎట్లాగని దుఃఖించింది.
అయితే కేవలం దుఃఖిస్తూ కూర్చోవడం నిరుపయోగం. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఎవరు తనని రక్షిస్తారు? కడలిరాజు అంతటివాడి నుండి కాపాడి ఆశ్రయమివ్వగలరు? అంత ధైర్యం పెద్దమనసు ఎవరికి వుంది? ఆలోచించింది కిన్నెర. గోదావరిదేవి కడలిరాజు భార్య. గొప్ప గుణముల చాన. తెలివితో, మంచి ఆలోచనతో కిన్నెర వెళ్ళి గోదావరిని ఆశ్రయించింది. ఇంకెవరినో ఆశ్రయిస్తే సముద్రుడు లెక్కచేసేవాడు కాడు. కానీ తన భార్యనే ఆశ్రయించే సరికి అతని గుండెలో రాయి పడింది.
గోదావరి కిన్నెర కథ విని కన్నీరు కార్చి, పొంగి వచ్చి, అభయమిచ్చి, కెరటాలు చాచి రమ్మని పిలిచింది. వాత్సల్యంతో తన కౌగిలిలోకి తీసుకుంది. ‘గోదావరి సంగమం’ కోసం కిన్నెర గోదావరి ‘కెరటాలకు చిన్నియలల తానంది యిచ్చినది’. గోదావరి ఉదాత్తమైన మనసుతో కిన్నెరను స్వీకరించింది.
“గోదావరి జాలి గుండెగూడులు కదలి
సాధు కిన్నెర కెదురుపోయి, ఆమె
లో దిగులు తరగచేదోయూ వారించి
ఆదరముచే నామె నదిమి కౌగిటబూని
ఏది నీ మొగము నా తల్లీ
నీ దిగులునిక మాను చెల్లీ”
అని కిన్నెరను తన ఒడిలోకి తీసికొని ఓదార్చింది. పరుల కష్టాలకు కరిగిపోయే కరుణస్వభావం కలది గోదావరితల్లి. ఒకప్పటి సీతారాముల ఎడబాటు దుఃఖాన్ని చూసి ఉన్నందువల్ల కిన్నెర వేదనను అర్ధం చేసుకొనగల్గింది. గోదావరిలో లీనమైన కిన్నెరను తలచుకొని కడలి దిగులుతో వగచెందుతూ, తన పొంగును కుదించుకున్నాడు. కిన్నెర మాత్రం గోదావరిలో సంగమించిన తనకూ, తన పతికి కూడ చావు లేదని స్థిమిత పడింది. ఈ చావులేకపోవడం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. కిన్నెర వాగై గోదావరిలో కలిసిపోవడంతో ఆమెకు మృతి లేదు, రాయిగా మారిపోవడంతో అతనికీ మృతి లేదు ఈ లోకంలో. అంతేకాక, విశ్వనాథ వారి కావ్యంలో స్థిరంగా నాయికానాయకులుగా చిత్రించబడడంతో మృతి లేదు, సరికదా, సాహితీప్రపంచంలో సజీవులై శాశ్వతంగా నిలిచిపోయారు.
కిన్నెరకు రక్షణ లభించింది. మానసిక ధైర్యం చేకూరింది. ఇక అంతా వైభవమే. ఆనందమే. ఆ ఆనందం శాశ్వతమైంది. గోదావరిలో లీనమై శాంతిని, ప్రశాంతిని పొందిన కిన్నెర తృప్తితో, మహావైభవంగా శోభిల్లిన వైనం ‘కిన్నెర వైభవం’లో అద్భుతంగా వర్ణింపబడింది. కాలానుగుణంగా కిన్నెర మార్పులు చెందుతూ ఎలా వర్ధిల్లిందో, వివిధ ఋతువుల్లో ఎలా శోభిల్లిందో విశ్వనాథవారు పాఠకులకు దర్శింపజేసారు. అతి నిశితంగా ప్రకృతిని పరిశీలించితేనే ఇన్ని అందమైన ఉపమలతో కిన్నెరను వర్ణించగలరు. కేవలం గ్రంథాల వల్ల ఆర్జించిన పాండిత్యంతో కాక, ప్రకృతిని తిలకించి, పులకించి, మననం చేసుకున్న అనుభూతితో మాత్రమే ఇంత అద్భుతమైన వర్ణనలు చేయగలిగారు.
‘కిన్నెరసాని వచ్చిందమ్మా…’ అంటూ ఎందరో కవులు తనివితీరా వర్ణించడానికి మూలమైన ఈ కిన్నెరసాని పాటలు అందమైన తీపిపాట మాత్రమే కాదు, ప్రధానంగా ఒక నీతి. తెలుగు కుటుంబం, తెలుగు ఆడబడుచు మనసు, ప్రకృతి వర్ణన, ముఖ్యంగా హైందవ నాగరికత సంప్రదాయాల్ని జీర్ణించుకున్న విశ్వనాథవారి విశ్వాసాలు, భారతీయ సంస్కృతి పరిఢవిల్లే కావ్యం. ఇదే దాని ప్రశస్తి, పరమార్థం.
చివరకు కిన్నెర ఏమైంది? ఆమె జీవితం నీటిపాలు, అడవిపాలే అయిందా? ఆమెకు జీవిత పరమార్ధం ఏమైనా దక్కిందా? అదుగో –
“తెలుగు దైవమ్ము భద్రాద్రి నెలకొన్న
రామయ్య అతని దర్శనము చేసే త్రోవ
కాచింది కిన్నెరా
తెలుగు యాత్రికుల కందించు చల్లని నీడ
పుణ్యాత్మ కిన్నెరా
తెలుగు యాత్రికుల కందించు చల్లని నీరు
పూతాత్మ కిన్నెరా”
తెలుగువారి దైవమైన భద్రాద్రి రామయ్యను నిత్యం దర్శించుకుంటూ, అటు వచ్చే తెలుగు యాత్రికులకు చల్లని నీడ, చల్లని నీరు అందిస్తూ ఉన్న కిన్నెరను పుణ్యాత్మురాలిగా, పూతాత్మురాలిగా చిత్రించి కావ్యాన్ని శుభాంతం చేసారు కవిసమ్రాట్. అనేక ఒడిదుడుకుల నోర్చుకుంటూ చివరకు శ్రీరాముని పాదాల చెంత చేరి చిరాయువుగా ఉండడం, నిత్యం దైవసాన్నిధ్యాన వర్ధిల్లడం కంటే కిన్నెరకు కావలసిందేముంది! వనిత వాగై, వాగు పాటై, దైవం చెంత చేరింది. ఘనరూపం ద్రవమై, ద్రవం తేజస్సయిపోయింది. నాశం లేకపోయింది.
“ఏ దారినో చచ్చుటే గదా, మరి యిపుడు
లేదు చావో తనకునైనా అనుకుంది
లేదు చావును మగనికైనా”
అని సంతోషించింది కిన్నెరసాని. ఇదే ఆమె తృప్తి. కవి సంస్కృతి. పాఠకుల సంతృప్తి. ఈ పాటలు ఆయన పాడితే వినడం తెలుగు వారికో అనుభూతి. సి.నా.రె. గారికెంతో ఇష్టమైన ఈ పాటల గురించి ఆయన పలికిన పలుకులు అక్షరసత్యాలు – ‘కిన్నెరసాని ఆంధ్రకవితా ప్రపంచంలో అపూర్వసృష్టి, అమృతవృష్టి.’