వివాహ బంధం

0
2

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న కథ ఇది. రచన కిరణ్మయి గోళ్ళమూడి. [/box]

[dropcap]కా[/dropcap]లి అందియలు ఘల్లున మోగుతుంటే నా మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి ఆశగా చూస్తున్న రాశి వెన్నెల రాశిలా ఉంది…

పసిమి ఛాయలో బంగారు బొమ్మలా ఉన్న రాశి నా చెల్లెలు నర్మద కూతురు.

చిక్కని వెన్నెలలో చాప మీద కూర్చుని రాశి చేతులకు గోరింటాకు పెడుతూ తన పెళ్లి ముందు రోజు మా అమ్మాయి రవళి చేసిన అల్లరి గుర్తు వచ్చి పెదవులపై నవ్వు విరబూసింది.

“ఎందుకు నవ్వుతున్నావ్ పెద్దా?” ఆసక్తిగా అడుగుతున్న రాశి వైపు చూసి నిట్టూర్పు విడిచాను.

“నీ పెళ్ళికి ముందు రోజు నీ చేతులకు గోరింటాకు పెట్టిన నీ చెల్లెలు రవళి మొహం గుర్తు వస్తోంది. పండిన నీ చేతుల ఎర్రదనంతో పోటీ పడుతున్న నీ బుగ్గల్లో పూసిన గులాబీలు నాకు గుర్తు ఉన్నాయి!” కొంటెగా అన్నాను. శుష్క మందహాసం కదిలింది రాశి పెదవులపై.

“గోరింటాకు బాగా ఎర్రగా పండితే బంగారం లాంటి మొగుడు వస్తాడా?,”

“అక్కకు మొగుడు వస్తే నాకూ వస్తాడా? అన్న రవళి అమాయకత్వం అందర్నీ ఫక్కున నవ్వించింది కదూ!” అన్నాను రాశిని గమనిస్తూ.

“నీ పెళ్లి నువ్వు కోరుకున్న విధంగా జరగటం, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఉండాలని, మంచి కుటుంబం లోకి వెళ్ళావని మీ అమ్మ కళ్ళలో సంతోషం ఎప్పటికీ నిలిచి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను!” ఆపేక్షగా అంటుంటే ఇబ్బందిగా కదిలింది రాశి.

రాశి ముఖంలో భావాలు చదవటానికి ప్రయత్నించి విఫలం అయ్యాను. నా మనసు పంపే సంకేతాలు అలజడి రేపుతున్నాయి. గోదావరిపై గాలికి కదిలే అలలు నా మనసు తీరంలో నెలవై ఉన్నాయి. నా చెల్లెలు నర్మద వ్రాసిన ఉత్తరం కనుల ముందు నిలిచింది.

‘రాశి ఎందుకో కలవర పడుతోంది.. మనసు చెదరి ఉంది…నేను ఏమి చెప్పినా మనసుకు పట్టించుకునే స్థితిలో లేదు. ఈ దీపావళికి ఓ వారం రోజులు నీ దగ్గర ప్రశాంతంగా ఉంటుంది అని పంపిస్తున్నాను. నీ దగ్గర దానికి చనువు ఎక్కువే.. సాంత్వన వచనాలు చెబుతావని, ఊరట నిస్తావని, మనసును ఆవరించిన అమవస తిమిరము తొలగి కాంతులు నింపుతావని ఆశిస్తున్నాను… మిగతా విషయాలు రాశి చెబుతుంది’..ఇదీ ఉత్తరం సారాంశం…

రాగానే అడిగితే నొచ్చు కుంటుందని నేను కదపలేదు. రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే విషయాలు అవే తెలుస్తాయి అని కూడా నా అభిప్రాయం.

అయితే రాశితో పాటు ఆకాష్ రాకపోవటం నాకు అమిత ఆశ్చర్యం కలిగించింది… పని ఒత్తిడి వలన అయి ఉంటుంది అని సర్ది చెప్పుకున్నాను.

వాళ్ళు ఇద్దరూ పేరు మోసిన కంపెనీలో మంచి హోదాలో ఉద్యోగం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఒకరికి ఒకరు తెలుసు…ఇద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని, ఇష్టపడ్డారు. ఆకాష్ తల్లిదండ్రులు రాశిని ఇష్టపడి తమ ఇంటి కోడలిగా చేసుకుని ఆకాష్ నిర్ణయాన్ని గౌరవించడం మా అందరికీ నచ్చింది.

‘కట్నాలు, కానుకలు మేము ఆశించం.. పెళ్లి సింపుల్‌గా చేయండి’ అని అడిగారు వాళ్ళు. పెట్టు పోతలు మాకు పట్టింపులు లేవు అని కూడా చెప్పారు… అయినా ఏ లోటూ లేకుండా రాశి పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వేడుకగా జరిగింది. చిన్న చిన్న పొరబాట్లు కూడా నవ్వుతూ స్వీకరించారు ఇరు వైపులా.

ఆ సందడి ఎవరూ మరచిపోక మునుపే రాశిలో అసంతృప్తి మేఘం ఎలా కమ్ముకు వచ్చింది… విద్యావంతురాలు అయి ఉండి ఎందుకు సర్దుబాటు చేసుకో లేకపోతోంది? మంచి కుటుంబంలోకి వెళ్లిందని అందరూ కితాబు ఇస్తే. అది మేడిపండు చందం అంటూ ఎందుకు తాఖీదుకు సిద్ధ పడుతోంది?

“అయ్యిందేదో అయ్యింది!… ఇంక ఆ ఇంటితో బంధం..!” రాశి నోటిలో నుండి వచ్చిన మాటలు ములుకులు లాగా తోచాయి.

“రాశీ! అవేం మాటలు అసుర సంధ్య వేళ!” నోటి మీద వేలుతో వారించాను.

“లేదు పెద్దా! వారి పద్ధతులు వేరు, భావాలు వేరు. ఏదీ నోరు విప్పి చెప్పరు. గుంభనంగా ఉంటారు, ఏమి మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి అంటారు. మా అత్తగారి మనసులో ఏముందో ఆఖరికి బ్రహ్మ కూడా కనిపెట్టలేడు…ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతారు… కానీ ఆ నవ్వు వెనుక ఏముందో తెలియదు!” విరక్తిగా ఉంది రాశి స్వరం.

“రాశీ మీ అత్తింటి వారు నాకు తెలుసు! నువ్వు చిన్నపిల్లవు. లోకం తీరు తెలియని పసికూనవి!” నా మాటలు పూర్తికాక మునుపే అందుకుంది.

“మా మామగారు భార్య మాటకు విలువ ఇస్తారు. ఆమెకు అది వరమే… నేనూ అలాగే కోరుకుంటాను కదా.. అది వింతగా అనుకుంటే ఎలా? కొడుకు ఎక్కడ జారి పోతాడో అని ముందరి కాళ్లకు బంధం వేస్తే ఎలా?”

“మా ఆడపడుచులు ఇరువురూ పేరుకి ఉపాధ్యాయులు కానీ ఉపోద్ఘాతాల పుట్టలు.. జ్ఞాన సంపద అంతా తమ స్వంతం అన్నట్లు ఉంటారు… ఎప్పుడూ ఉపన్యాసాల హోరుతో పోటీ పడుతూ ఉంటారు. ఎదుటి వారిని మాటాడనివ్వరు…!”

“ఆకాష్‌కి ఎప్పుడూ పని ధ్యాస… ఇరవై నాలుగు గంటలు టార్గెట్ల గోల…అందరి మధ్య నాకు ఒంటరిగా ఉండటం అంటే భయంగా ఉంది. ఆ ఇంట్లో నేను పంజరంలో చిలుకను..!” బాధ ధ్వనించింది రాశి గొంతులో….రాశి చేతిలో చేయి వేసాను ఓదార్పుగా.

పెళ్లి అయ్యి రెండేళ్లు కాక మునుపే చిత్రంగా అసంతృప్తి జ్వాలలు రగులు తున్నాయి రాశిలో. ఒంటరిగా పెరిగిన రాశి పెద్ద కుటుంబంలో అనుబంధాలు చవి చూడాలని నా చెల్లెలు ఆరాట పడింది…

“పెదనాన్న నిన్ను ఎప్పుడూ కోప్పడగా నేను చూడలేదు పెద్దా! ఆయనకు కోపం రాదా?” సాయంకాలం వేళ సన్నజాజులు మాల కడుతుంటే నా పక్కన కూర్చుని అడిగింది రాశి కుతూహలంగా నేను ఏమి జవాబు ఇస్తానో అని.

“ఆయన స్వతహాగా మితభాషి! కోపం త్వరగా రాదు… కానీ వచ్చిందంటే మాత్రం పెద్ద చిక్కే. హరి బ్రహ్మాదులు బతిమాలినా వినరు. పట్టించుకోకుండా ఉంటే తాటాకు మంటలా చప్పున చల్లారుతుందని గ్రహించిన నేను గమ్మున ఉంటాను… వేడి చల్లారాక చేసే రాయబారం నాకు ఇష్టంగా ఉండేది! మనసులో అలిగిన వేళనే చూడాలి అని పాడుకుంటానని తనకు తెలియదు. తమకం నిండిన నా కళ్ళు అల్లరిని దాచలేవు!”

“పెద్దా! నీకు మీ అత్తగారి నుండి ఆరడి, అజమాయిషీ లేదా ఆ తరంలో?” విస్మయంగా అంది రాశి ఆరాగా.

“ఏం?.. మీ అత్తగారు అలా ఉన్నారా?” నా సూటి ప్రశ్నకు తడబడింది.

“లేదు.. లేదు.. అదేం లేదు!” కంగారుగా అంది

“మరి ఇప్పుడు నీ సమస్య ఏమిటీ? మీ అమ్మ ఉత్తరం వ్రాసింది!” ముసుగులో మంతనాలు నాకు ఇష్టం లేదు.

“మీ అత్తగారు తన పెద్దరికం నిలుపుకోవడం లేదా?”

మౌనంగా ఉన్న రాశి ని చూసి జాలి వేసింది.

“నువ్వు మౌనంగా ఉంటే నీ సమస్య పరిష్కారం అవుతుందా?” నా గొంతు లోని తీవ్రతకు బేలగా చూసింది.

“నా జీతం మా అత్తగారి చేతికి ఇవ్వ మంటున్నారు పెద్దా!” ఎట్టకేలకు నోరు తెరిచింది.

“ఏమిటీ?” అవాక్కయ్యాను నేను.

“అవును! పెళ్లి అయిన మూడో నెలలో మా అత్తగారు ఆకాష్‌తో చెప్పించారు”.

“ఎందుకు అలా?” ఆశ్చర్యంతో నా కనులు పెద్దవి అయ్యాయి.

“ఇప్పటి నుండే పొదుపు మొదలు పెట్టండి.. దుబారా ఖర్చులు నిలువరించండి అంటారు. పావలా పూలకు కూడా లెక్క చెప్పాలి. నాకూ కొన్ని ఖర్చులు ఉంటాయిగా.. పాకెట్ మనీలా నేను ఆవిడను అడగటం నాకు నచ్చటం లేదు!”

“రెండు నెలలుగా మా ఇద్దరి మధ్య మాటలు పొదుపుగా ఉన్నాయి…ఆకాష్ క్షమాపణ అడిగినా నాకు నేను సర్ది చెప్పుకోలేక పోతున్నాను!” ఉద్వేగంగా ఉంది రాశి గొంతు.

“రాశీ! ఆకాష్ క్షమాపణ కోరాడు అంటే తన తప్పు తెలుసుకున్నాడు అని కాదు అర్థం… ఈ బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నాడు. అది తెలుసుకోకుండా మరింత దూరాన్ని పెంచుకున్నావు… నీ చదువు నీకు ఏమి నేర్పింది? నీ సంస్కారం అహంకారం ముసుగులో మరుగున పడిందా?

వివాహం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు ఇరు కుటుంబాల అమరిక. ఇరు సంప్రదాయాలను ఒకటిగా ముడివేస్తూ పెళ్లి పరమార్థం నినదించే వేద మంత్రాల సాక్షిగా వేసే మూడు ముళ్ళు పవిత్ర బంధానికి ప్రతీకలు…ఆ బంధం కలకాలం నిలిచి ఉండాలని ఆరాట పడతాం. నమ్మకం అనే పునాదుల మీద నిలబడే కాపురాలు పటిష్టంగా ఉంటాయి అని మీలాంటి యువతకు ఎప్పటికి అర్థం అవుతుంది?

చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో చూస్తూ విపరీత అర్థాలు వెతుకుతూ భవిష్యత్తు నాశనం చేసుకో కూడదు. కుడి కాలు మోపి అడుగుపెట్టిన అత్తవారిల్లు నీకు అండగా ఉంటుందని నమ్మకం ఏర్పరుచు కోవాలి… భావి జీవితానికి బాటలు పరిచే అత్తమామలు నీకు మిత్రులే తప్ప పరాయి వారు కాదని గ్రహించాలి. బంగారం లాంటి భర్త నీకు తోడుగా లభించటం నీ అదృష్టం!”

రాశి లాంటి ఆడపిల్లలకు దిశానిర్దేశం చేయటం కష్టం కాదు అని నా అనుభవంకు తెలుసు. నిన్న రాత్రి ఆకాష్ కుటుంబంతో నెరపిన నా ప్రయత్నం వమ్ము కాదని నా నమ్మకం.

గుమ్మం దగ్గర అలికిడికి తల తిప్పి అక్కడ చేతులు కట్టుకుని నిలబడిన ఆకాష్‌ని చూసి ఒక్క క్షణం అచేతనురాలు అయింది రాశి. తేరుకున్న రాశి కళ్ళలో మెరుపు నా మనసు పసిగట్టింది. అది చాలు నేను అల్లుకు పోవడానికి.

అల్లిన పూల మాల రాశి పొడవైన జడలో తురిమి నేను లోపలికి నడిచాను, ఆకాష్‌కు బొటన వేలు చూపుతూ! కృతజ్ఞతగా అతని పెదవులు విచ్చుకున్నాయి.

చీకటి ముసిరిన ఏకాంతంలో ఆ జంట ఒకరికొకరుగా ఒదిగి పోతున్న దృశ్యం కనుల ముందు సాక్షాత్కరించింది… దీపాల వెలుగు సాక్షిగా! స్వస్తి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here