Site icon Sanchika

ఓ వివేకి వ్యక్తిత్వానికి, సాహిత్యానికి సత్కృతి – ‘వివేచన’

[శ్రీ వివిన మూర్తి సాహిత్యం, వ్యక్తిత్వంపై వచ్చిన ‘వివేచన’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]కా[/dropcap]వలికి చెందిన ‘నా’ ఫౌండేషన్ వారు ప్రతీ ఏడాది ఇవ్వదలచిన లిటరరీ అవార్డును – మొట్టమొదటి సంవత్సరం 2023లో శ్రీ వివిన మూర్తి గారికి అందజేసిన సందర్భంగా వివిన మూర్తి గారి సాహిత్యం, వ్యక్తిత్వంపై వ్యాసాలతో కూర్చిన పుస్తకం ‘వివేచన’. శ్రీ ఎ. కె. ప్రభాకర్, శ్రీ కె.పి. అశోక్ కుమార్ సంపాదకత్వం వహించారు. ‘నా’ ఫౌండేషన్ తరఫున శ్రీ లేబాకుల సుధాకర్ రెడ్డి ప్రచురించారు.

వివిన మూర్తి గారికి 75 ఏళ్ళు నిండిన సందర్భంగా వెలువడ్డ ఈ పుస్తకం వారి సాహిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని పరిశీలించే వీలు కల్పిస్తుంది. సాహిత్యం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిందా, లేక ఆయన వ్యక్తిత్వం ఆయన సాహిత్యాన్ని ప్రభావితం చేసిందా? లేక రెండు ప్రవాహాలు కలగలిసిపోయి ఒకే నదిలా ప్రయాణించాయా? ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.

‘నేనేమిటి? నేనెవరిని’ అనే స్వగతంలో తన గురించి, తన సాహితీ ప్రస్థానం గురించి, తన ఆలోచనల గురించి చెబుతూ – తన జీవితమే తన సాహిత్యమని అన్నారు. తన ఆలోచనలన్నీ రచనలు కాలేదని అన్నారు. తనలోని మార్పులన్నీ రచనలో ప్రతిఫలించాయా అంటే, కొంత మేర అని చెప్పారు. కాలక్రమంలో ‘ఆలోచించి చేసుకున్న నిర్ణయాలతో కథలు రాయటం వదిలి, ఆలోచనలనే కథలు చేయటం స్థిరపడింది’ అన్నారు. కులం గురించిన ఆలోచనలు వెల్లడించారు. మానవుడి దురాశే మానవాభివృద్ధి అంటున్న పెట్టుబడీదారి విధానానికి ప్రత్యామ్నాయ తాత్త్విక దృక్పథం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

“వివిన మూర్తికి ‘సమాజంతో సంబంధంలేని వ్యక్తి’ (Pure individual) మీద నమ్మకం లేదు. వ్యక్తుల అస్తిత్వాన్వేషణ సమాజం పరిధికి వెలుపల జరగటానికి వీలు లేదన్నది అతని గట్టి నమ్మకం. దీనితోపాటు మానవ సంబంధాలు ప్రధానంగా ఆర్థిక సంబంధాలేనన్న నమ్మకం కూడా అతనికి గట్టిగానే ఉంది. వివిన మూర్తి అభిప్రాయం ప్రకారం సమాజంలో మార్పులు రావటమంటే సమాజంలోని మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలలో మార్పులు రావటమే. ఆర్థిక సంబంధాలు మారటాన్ని వివరించగల భావజాలాలనూ, జాతీయ, అంతర్జాతీయ కారణాలనూ అర్థం చేసుకోవటంకోసం వివిన మూర్తి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.” అని వ్యాఖ్యానించారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య ‘వివిన మూర్తి – కథన రీతులు’ అన్న వ్యాసంలో. ఇదే వ్యాసం చివరలో ఆయన, “గత ఐదారు సంవత్సరాలుగా వివిన మూర్తి కథా వస్తువులు సంక్లిష్టమౌతూ వచ్చాయి. వాటిని నాటకీయత ఉన్న కథలుగా అల్లుకోవటం చాలా శ్రమతో కూడిన కార్యవిధానం. అందుచేత కొన్ని కథల్లో కథా వస్తువులు, సంఘటనల ద్వారా కాకుండా చర్చల ద్వారా, అంతరంగ మథనాల ద్వారా వ్యక్తం కావలసి వచ్చింది. వాటిలో కొన్ని కథలు ఆర్యుమెంట్లుగా మారిపోయి, పరిమాణంలో పెరిగిపోయాయి. అందుచేత కథా వస్తువులు మరింత క్లిష్టమైపోయి ఈ కథలకు చదివించే శక్తి తగ్గిపోయింది. కీలకమైన ఈ కథన సమస్యను గురించి కూడా వివిన మూర్తి ఆలోచించవలసిన అవసరం ఉంది. కథా వస్తువును కథగా మార్చి, వాస్తవ జీవితంలో సహజంగా అనుసంధించగల objective correlatives కోసం అతడు తీవ్రంగా అన్వేషించవలసిన అవసరం ఉంది.” అని పేర్కొన్నారు. మూర్తి గారి కథా సంవిధానంలో చోటు చేసుకున్న మార్పులను ఈ వ్యాసం ప్రస్తావించింది.

“కథారచనలో తనదైన ప్రత్యేక విధానాన్ని పాటించిన మూర్తి గారు, రాజకీయంగా – తాత్వికంగా గతితార్కిక ఆలోచనతో, పురోగామి దృష్టితో రచనలు చేసారు. సామాజిక అవగాహన, రాజకీయ స్పష్టతతో మానవ స్వభావంలోని చిక్కుముళ్లను విప్పుతూ పోయారు. మన కుల మత వర్గ సంక్లిష్ట వ్యవస్థలోని మనుషుల ముఖ్యంగా బుద్ధి జీవుల – పాలకుల ఆత్మవంచనను (hypocrisy) తేటతెల్లం చేసారు. ఆయా సామాజిక – రాజకీయ ఆత్మవంచనను ముసుగులను తొలగించే క్రమంలో, బాధ్యతాయుతంగా వుండవలసిన వ్యక్తులే భ్రష్టు చాకచక్యంగా తమను తాము మోసం చేసుకుంటూ, ఈ వ్యవస్థను మరింతగా పట్టించగలరనే వాస్తవాన్ని వివిన మూర్తి గారి కథలు విప్పి చెబుతున్నాయి.” అని నిఖిలేశ్వర్ పేర్కొన్నారు ‘మానవ స్వభావంలోని చిక్కుముళ్ళను శోధించే కథకుడు వివిన మూర్తి’ అనే వ్యాసంలో.

“‘కొంతమంది.. కొన్ని చోట్ల’ నవల ప్రాథమికంగా ఒక మార్పుకు ఒక సమాజం స్పందించే తీరుకి అద్దం పడుతుంది. ఏమి మార్పు? వివాహేతర సంబంధం మాత్రమే కాదు. స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ ఆశించే కుటుంబం, సమాజం, గౌరవం, వీటి కోసం ఆమె వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, ఎంచుకునే జీవన విధానం – ఇవి సమాజం చూపించిన మూసకి ఏ మాత్రం భిన్నంగా ఉన్నా అది మార్పు. ఈ నవల మొదలైనది జయ రామారావుల సంబంధం మీదే అయినా, దాని పునాదిగా నవల ఎన్నో మార్పులను ముందుకు నెట్టి చూపించింది. చర్చించింది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే, ఒక్కొక్క మనిషి ఆలోచించే తీరుని బట్టి, ఎలా ఈ సమాజం ఏర్పడుతుంది, ఎలా ప్రభావితమవుతుంది, ఎట్లాంటి మార్పులకు లోనవుతుంది అన్నది ఈ నవలలో అంతర్లీనంగా సాగిన అతిముఖ్యమైన పాయ.” అన్నారు మానస చామర్తి ‘ఆలోచనామృతం’ అనే వ్యాసంలో.

“మూర్తిగారి మలితరం రచనలలో పాత్రల అంతరంగాలలోనూ, ప్రవర్తనలలోనూ సంఘర్షణ, సందిగ్ధత కనిపిస్తాయి. మూర్తి గారి కథలలోనూ, నవలలలోనూ ముఖ్యపాత్రలు మామూలు మనుషులకన్నా ఎక్కువ చైత్యన్యం కలిగిన వారు, చింతనాపరులు, ఆలోచనా జీవులు. ఆలోచించగలగటం హర్షణీయ విషయమే కావచ్చు. కానీ, ఆలోచనలు జీవితాలను సుఖమయం చేయవు. భౌతికంగానూ, మానసికంగానూ.. కలిగిస్తాయి; మనశ్శాంతిని హరిస్తాయి. అజ్ఞానం వల్ల వచ్చే ఆనందం, స్వార్థం వల్ల కలిగే ఆత్మవంచన, నిర్లక్ష్యం ఆలోచించేవారికి కుదరవు. నిజానికి ఈ పాత్రల సంస్కార స్థాయి గొప్పది; వీరు తమ గురించి మాత్రమే కాక తమ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి కూడా ఆలోచిస్తుంటారు. ఐతే మనుషులు ఆలోచనలు సరళరేఖల్లో సాగవు; అవి సమస్యల స్వరూపాన్ని సమగ్రంగా పట్టుకోలేవు; ముందుకూ, వెనక్కూ పక్కకూ జరుగుతూ, తిరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల తీసుకున్న నిర్ణయాలన్నీ మంచి ఫలితాలనే ఇస్తాయనీ లేదు. ఎంత ఆలోచనాజీవులైనా, ఆలోచనలను ఆచరణగా మార్చే క్రమంలో, ఒకోసారి సహజాత ప్రవృత్తి వల్ల ఆ ఆలోచనలను అమలుచేయకపోవటమే కాక, వాటికి విరుద్ధమైన పనులూ చేయవచ్చు. మూర్తి గారి మలితరం కథల్లో ప్రధానంగా కనిపించేది. ఆలోచనలకూ, సహజాత ప్రవృత్తులకూ, పరిస్థితులకూ మధ్య ఉండే ఈ సంఘర్షణే.” అని వ్యాఖ్యానించారు శ్రీ జంపాల చౌదరి తమ వ్యాసం ‘చింతన-చేతన’లో.

“వివిన మూర్తి గారి ‘తీర్థపురాళ్లు’ కథా సంకలనంలో మొత్తం 12 కథలున్నాయి. ప్రతి కథలో సమాజంలో తాను గమనించిన వివక్షని మనిషి తన జీవితంలో చాలా లౌక్యంగా ఉపయోగించే ద్వంద్వ వైఖరిని తన నిశిత పరిశీలన ద్వారా, సునిశితమైన దృష్టితో సున్నితంగా ప్రస్తావించారు రచయిత. అతి గంభీరమైన విషయాన్ని సున్నితంగా చెప్పడంలో వారు ఉపయోగించిన భాష, శైలి తెలుగు కథారచనలో వీరి స్థానానికి ఓ ప్రత్యేకతను చేకూరుస్తాయి. ఆయన రాసిన కొన్ని వాక్యాలు ఎంత పదునుగా ఉన్నాయంటే వాటిని విశ్లేషించుకుంటూ పోతే ఎన్నో అంశాలు ప్రస్తావనకు వస్తాయి. పదాలను అంతగా ఆచి తూచి ఆలోచించి ఉపయోగించే శక్తి ప్రతి కథా రచయితకు ఉండదు. వారి కథలు అందుకే తెలుగు భాషలో ఓ విశిష్టమైన సాహిత్య సృష్టి అనిపిస్తుంది.” అని వ్యాఖ్యానించారు పి. జ్యోతి తమ వ్యాసంలో.

“సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ దుష్పరిణామాలను అవి మన జీవితాలలో తెస్తున్న సంక్షోభాన్ని, కల్లోలాన్ని వివిన మూర్తి కథలు అద్భుతంగా ఆవిష్కరించాయి. అవి పైకి మామూలు కథలలా కనిపించినా, అంతర్లీనంగా రచయిత తాను చెప్పదలుచుకున్నవాటికి చర్చావేదికగా ఉపయోగించుకోవడం బాగా వచ్చింది. కొన్ని కథలు అంతరార్థక కథలుగా, కొన్ని మల్టీ లేయర్ కథలుగా కనిపిస్తాయి. ‘కృష్ణ స్వప్నం’ కథలో కనిపించిన ప్రతీకాత్మకత, మ్యాజిక్ రియలిజం ఆ కథను మంచి వ్యంగ్య కథగా తీర్చిదిద్దాయి. సమాజంలోని అన్ని విషయాలను, వ్యక్తుల మధ్య అంతరాలను, వారిలో పొడసూపే రకరకాల ధోరణులను చర్చకు పెట్టిన ఈ కథలు ఆసక్తికరంగా ఉండి మనల్ని ఆలోచింపజేస్తాయి.” అన్నారు కె. పి. అశోక్ కుమార్ తమ వ్యాసం ‘ఆలోచింపజేసే కథలు’లో.

“వివిన మూర్తి గారి కథలు అనంతమైన శిల్ప రీతులతో కూడుకొని తెలుగు కథను బలోపేతం చేశాయి. ఆయనది గంభీర శిల్పం. శరత్ రుతువులో పైన గంభీరంగా పారుతూ లోన సుడులు తిరిగే నదీ ప్రవాహం వంటిది. కథను ఇతిహాసంగా మార్చడానికి ఆయన చేసే వ్యాఖ్యలు చరిత్రను తవ్వి చూడమని సూచిస్తాయి.” అన్నారు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తమ వ్యాసంలో.

“మనిషి యేం చేస్తే వొప్పు యేం చేస్తే తప్పు? ఈ నిర్ధారణ యెలా చేయాలి? దోహదం చేసే అంశాలేవి? తప్పు వొప్పుల తీర్పు వైయక్తిక అస్తిత్వమా నిర్ధారణకి సాంఘికమా? అది మనిషి లోపలిదా – బయటిదా? బయటిది అయితే అన్ని సమాజాల్లోనూ అది వొకే రీతిగా మూసపోసినట్లు వుంటుందా భిన్నంగా వుంటుందా? భిన్నంగా వున్నప్పుడు వాటి మధ్య సమన్వయం యెలా సాధించాలి.. వంటి ప్రశ్నలు అనేకం యీ నవల పొడవునా రచయిత పరుచుకుంటూ పోతారు. పాత్రల బాహ్య సంభాషణల ద్వారా ఆంతరిక ఆలోచనల ద్వారా యీ ప్రశ్నల్ని రచయిత మనముందు గుమ్మరిస్తారు. కొన్నింటికి సమాధానాలు లభిస్తాయి. అవి కూడా అప్పటికి తోచినవే గానీ శాశ్వత పరిష్కారాలు కావు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలే లభించవు. మరి కొన్ని ప్రశ్నలు సమాధానం కోసం యెదురు చూస్తుంటాయి. కొన్నైతే కొత్త ప్రశ్నలకు ఆస్కారమిస్తాయి. సరిగ్గా అక్కడే పాఠకుల చైతన్య పరిధి విస్తరిస్తుంది. అందుకు దోహదం చేసే సంఘటనలు సందర్భాలు నవల్లో పలుచోట్ల యెదురౌతాయి. బుర్రకి పదును పెడతాయి.” అంటూ ‘కొంతమంది.. కొన్ని చోట్ల’ నవల గురించి అభిప్రాయం వ్యక్తం చేశారు ఎ. కె. ప్రభాకర్ తమ వ్యాసంలో.

‘ఎవరీ వివిన మూర్తి’ అనే తమ వ్యాసంలో దాసరి అమరేంద్ర – మూర్తి గారి సాహితీ యానాన్ని, సామాజిక దృక్పథాన్నీ, ఆలోచనా రీతులను, ఆయన మీద ఇతరుల ప్రభావాన్ని విహంగ వీక్షణం చేశారు.

“హంసగీతం శ్రీనాథుడి పుట్టుకతో మొదలై అమరపురికి అరిగేవరకూ వరసగా చెబుతుందని భావించాను. కానీ దాని సంవిధానం నాన్ లీనియర్ పద్ధతిలో సాగుతూ కూడా ఎక్కడా ఏమాత్రం రసభంగం కాకుండా చదివించుకుంటూ పోతుంటే కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఏది ఎక్కడ చెప్పాలో ఎంత చెప్పాలో ఎలా చెప్పాలో తెలిసినవారు రాసిందాన్ని చదువుతూంటే ఆ స్వారస్యం మనల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది.” అన్నారు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తమ వ్యాసంలో.

కాత్యాయనీ విద్మహే గారు వ్రాసిన సుదీర్ఘ వ్యాసంలో (161 – 215 పేజీలు) వివిన మూర్తి గారి నవలల దృక్పథ పరిణామాన్ని గొప్పగా విశ్లేషించారు. “మనిషి ప్రవర్తనకు ఉన్న సామాజిక కారణాలు వ్యక్తి ప్రత్యేకతలు రెండూ ఆలోచించవలసినవే అన్న భావం అన్ని నవలల్లో ఎక్కడో ఒకచోట మెరుపులా మెరుస్తుంది” అన్నారావిడ.

తరువాత మూర్తి గారి పుస్తకాలపై సమీక్షలను, ముందుమాటలను చేర్చారు.

“వివిన మూర్తి గారి రచనలో ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ప్రశ్నల్లో లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. విన్న ప్రశ్నలే అయినప్పటికీ అవి గాఢంగా అనిపిస్తాయి. అ ప్రశ్నలు, ఆలోచించకుండా ఉండలేని ఇబ్బందిని కలుగజేస్తాయి. ఏ రచన అయినా సాధించగలిగిన లక్ష్యం బహుశా అదే!” అన్నారు ఎ.వి. రమణమూర్తి తమ వ్యాసంలో.

దాసరి రామచంద్రరావు గారు వ్రాసిన వ్యాసంలో ‘కథానిలయం’ నిలదొక్కుకోడంలోనూ, డిజిటలైజేషన్ ప్రక్రియలోనూ వివిన మూర్తి గారి ప్రాతను వివరించారు. డిజిటలైజేషన్ విజయవంతం కావడంలో పరోక్షంగా మూర్తిగారి సతీమణి రామలక్ష్మి పాత్ర కూడా ఉందని అన్నారు.

మూర్తి గారి వ్యక్తిత్వాన్ని కాళీపట్నం సుబ్బారావు గారి వ్యాసం ‘వివినుడు’ పట్టిస్తుంది. ఈ వ్యాసంలో ఆయన వెల్లడించిన మూర్తిగారి ఇష్టాయిష్టాలు పాఠకులకు ఆసక్తిని కలిగిస్తాయి.

‘హంసగీతం’ నవల ఎందుకు రాశారో, స్ఫర్శ కథకి నేపథ్యమేమిటో రచయిత వివరించారు. చివర్లో కత్తి పద్మ గారు చేసిన ఇంటర్వ్యూ – మూర్తిగారి సాహిత్యపు దృక్కోణాన్ని వెల్లడించి, వ్యక్తిత్వపు కాంతులను ప్రసరిస్తుంది.

ఇంకా ఎన్నో చక్కని వ్యాసాలున్న ఈ పుస్తకం – ఓ వివేకి వ్యక్తిత్వానికి, సాహిత్యానికి సత్కృతి అని చెప్పవచ్చు.

[ఈ 360 పేజీల పుస్తకంలో ‘ధర’, ‘ప్రతులకు’ – వివరాలు లేవు. బుక్ డిజైన్ చేసిన విట్టుబాబు గారిది తప్ప ఎవరి ఫోన్ నెంబర్లు కానీ, మెయిల్ ఐడిలు కానీ ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.]

***

వివేచన – వివినమూర్తి సాహిత్యం వ్యక్తిత్వం

సంపాదకులు: ఎ.కె. ప్రభాకర్, కె.పి. అశోక్ కుమార్.

ప్రచురణ: నా ఫౌండేషన్, కావలి

Exit mobile version