Site icon Sanchika

యువభారతి వారి ‘వివేకానంద లహరి’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

వివేకానంద లహరి

[dropcap]1[/dropcap]893వ సంవత్సరం, సెప్టెంబరు 11 వ తేదీన చికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలో స్వామి వివేకానంద ఉపన్యసించిన చారిత్రాత్మక సన్నివేశానికీ, వివేకానంద స్వామి హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలను సందర్శించిన మరువలేని ఘట్టానికీ శతాబ్ద్యుత్సవాలు జరిగిన శుభతరుణంలో 1993 వ సంవత్సరంలో యువభారతి పట్టిన సాహితీ నీరాజనం – ‘వివేకానంద లహరి’ ఉపన్యాస కార్యక్రమం.

యువభారతి 30వ వార్షికోత్సవాల సందర్భంగా వివేకానంద లహరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆ కార్యక్రమం జరిగిన 30 సంవత్సరాల తర్వాత, అంటే యువభారతి షష్ట్యబ్ది పూర్తి ఉత్సవాల సందర్భంగా 2023వ సంవత్సరంలో ఆ ఉపన్యాస మంజరి గురించి ప్రస్తావించగలగడం కేవలం యాదృచ్ఛికం.

వివేకానందుడు సర్వ మానవ  సౌభ్రాతృత్వాన్ని బోధించాడు. విదేశాలకు వెళ్లి ఆంగ్లంలో ప్రసంగించినపుడు కూడా, ‘Ladies and gentlemen’ అనే వారి సాంప్రదాయాన్ని గాక, భారతీయ సంప్రదాయమైన “సోదర సోదరీమణులారా!” అన్న సంబోధనలో పాశ్చాత్యులను పులకిత గాత్రులను చేశారు. శ్రీ వివేకానంద స్వాములవారు కేవలం ఉపన్యాసకులే కాదు. సర్వజ్ఞమూర్తులు. నవయుగ ప్రవక్త. అవతారమూర్తి ఐన శ్రీ రామకృష్ణ పరమహంస గారిచే సుశిక్షితులై, నిర్వికల్ప సమాధిలో అపరోక్షానుభూతి పొందినవారు. జ్ఞాన యోగ రహస్యాలన్నీ వివేకానందుల వారికి కరతలామలకాలే. శ్రీ వివేకానంద స్వాములవారు తమకు సంపూర్ణ పరిచితాలైన, ప్రత్యక్ష అనుభూతులైన విషయాలను అధికారపూర్వక వాక్కులతో వివరించేవారు. పాశ్చాత్య దేశీయులు హైందవ తత్త్వ విచార మార్గాలలో సుశిక్షితులు గారు. ఆశిక్షితులు. వారి ముందు ప్రసంగించిన శ్రీ స్వామి వారు నిగూఢ విషయాలను ఎంతో సుబోధ రూపంలో, ఆధునిక భౌతిక శాస్త్రానుసార వ్యాఖ్య రూపంలో వివరించేవారు. శ్రీ వివేకానందుల వారు పాశ్చాత్య దేశంలో ప్రసంగించి వచ్చిన తర్వాత అచట వేదాంతం అపారవ్యాప్తి గాంచి సుస్థిరంగా పాదుకొనేది.

శ్రీ వివేకానందుల వారు గీతాచార్యులైన శ్రీ కృష్ణుని లాగా, అహింసా బోధకులైన బుద్ధునిలాగా, అద్వైత ప్రవక్త ఐన ఆదిశంకరుల వారి లాగా భారతీయ విచార ధార తెలిసిన గొప్ప బోధకునిలాగా కనిపిస్తారు. వారి ప్రసంగంలో వేదాలనుండి, ఉపనిషత్తులనుండి quotations ఇస్తూ ఉండేవారు. వాటిని అతి సులభమైన భాషలో విశ్లేషించి వివరిస్తూ ఉండేవారు. వారి ఉపన్యాసం విన్న దేశీయులైనా, విదేశీయులైనా స్ఫూర్తి పొందకుండా ఉండేవారు కారు.

ఈ లహరీ ఉపన్యాస కార్యక్రమంలో ‘వివేకానంద వాణి’ గురించి డా. సి. నారాయణ రెడ్డి గారు, ‘ఆత్మజ్ఞాన గోవిందుడు వివేకానందుడు’ అన్న అంశంపై డా. జె.బాపురెడ్డి గారు, ‘శ్రీ వివేకానందవాణి – భారతీయ అంతర్వాణి’ అన్న విషయంపై శ్రీ పి వి రాజేశ్వరరావు గారు, ‘ఆదర్శ సన్యాసి వివేకానందుడు’ అన్న అంశంపై డా. టి వి నారాయణ గారు, ‘విశ్వమత మహాసభ’ గురించి డా. ఉండేల మాలకొండారెడ్డి గారు, ‘యుగచైతన్య వైతాళికుడు శ్రీ వివేకానంద స్వామి’ అన్న విషయంపై డా. జి వి సుబ్రహ్మణ్యంగారు, ‘వివేకానంద జీవితం – సందేశం’ అన్న విషయంపై డా. ఓగేటి అచ్యుతరామశాస్త్రి గారు, ‘ఆధునిక జీవితం అనుష్టాన వేదాంతము’ అన్న అంశంపై శ్రీ వాకాటి పాండురంగారావు గారు, ‘సమాజంలో స్త్రీ: వివేకానందుని దృక్పథం’ అన్న అంశంపై కుమారి డా. కమలాజయరావు గారు, ‘వివేకానందుడు: యువత’ అన్న విషయం పై డా. ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి గారలు ప్రసంగించారు.

స్వామి వివేకానంద జీవితం గురించి,వారి వ్యక్తిత్వం గురించి, సంపూర్ణమైన అవగాహన రావాలంటే – ‘వివేకానంద లహరి’ పుస్తక పఠనం – అత్యంత ఆవశ్యకం, అనివార్యం.  క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%20%E0%B0%B2%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF/page/6/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version