Site icon Sanchika

వివిధ రంగాలలో తొలి భారతీయ మహిళ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్

[box type=’note’ fontsize=’16’] ది 1-12-2020న శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]భా[/dropcap]రత స్వాతంత్ర్య పోరాటంలో పురుషులతో పాటు స్త్రీలు పాలుపంచుకున్నారు. కొందరు స్వతంత్ర భారత పునర్నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. తమకీ, దేశానికి పేరు తీసుకుని వచ్చారు. విదేశాల్లోనూ మన కీర్తిబావుటాను ఎగురవేశారు. వీరిలో ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సోదరి శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ఒకరు. అయితే నెహ్రూ కుటుంబీకురాలుగానే కాకుండా స్వంత ప్రతిభతో పేరు పొందారు.

ఈమె 1900 సంవత్సరం ఆగష్టు 18వ తేదీన అలహాబాద్‌లో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూలు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘స్వరూపకుమారి’. బాల్యం నుండి ఇంట్లోనే విద్యనభ్యసించారు. మిస్ హోపర్ ఈమెకు గురువు.

తండ్రి మోతీలాల్ నెహ్రూ స్వాతంత్ర పోరాటయోధులు. వారి ‘ఆనందభవన్’లో జాతీయనాయకులు సమావేశమై పోరాటపథం గురించి చర్చించేవారు. స్వరూపకుమారి ఈ చర్చలను విని అవగాహన చేసుకున్నారు. తల్లిదండ్రులు, అన్నతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు.

శ్రీమతి అనీబెసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమంలో వాలంటీర్‌గా పనిచేశారు. బాపూజీ భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన అనుయాయిగా పనిచేశారు. శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు.

తోటి ఉద్యమకారులు పండిట్ సీతారామ్‌ను గాంధీజీ ఆశీస్సులతో పెళ్ళి చేసుకున్నారు. ఆనాటి ఆచారం ప్రకారం స్వర చాప ‘విజయలక్ష్మి పండిట్’గా మారారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చంద్రలేఖ, నయనతార, రీటాలు. వీరిని పూనాలో పాఠశాలలో చేర్పించారు. తమ తల్లిదండ్రులు జాతీయోద్యమంలో పాల్గొనడాన్ని వీరు గొప్పగా భావించారు.

విజయలక్ష్మి దంపతులు ఉప్పు సత్యాగ్రహంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొన్నారు. అరెస్టయి జైలుకి వెళ్ళారు.

మన దేశంలో ‘1935 భారత ప్రభుత్వ చట్టం’ ప్రకారం వివిధ ఫ్రావిన్లలో ఎన్నికలు జరిగాయి. విజయలక్ష్మీ పండిట్ ‘యునైటెడ్ ఫ్రావిన్స్’ శాసనసభకు ఎన్నికయ్యారు. తొలి మహిళా మంత్రిణిగా బాధ్యతలను స్వీకరించారు. స్థానిక స్వపరిపాలన, ఆరోగ్య శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మంత్రివర్గాలు రాజీనామా చేసినపుడు ఈమె కూడా రాజీనామా చేశారు. యుద్ధానంతరం మళ్ళీ మంత్రి పదవిని నిర్వహించారు.

రాజ్యాంగ సభలో సభ్యులుగా పనిచేశారు. రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత విదేశ వ్యవహారాలలో ప్రముఖ పాత్ర నిర్వహించారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారత హైకమీషనర్ గా పనిచేశారు. అమెరికా, స్పెయిన్, మెక్సికో, ఐర్లండ్, రష్యా వంటి దేశాలలో రాయబారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అంతర్జాతీయ వేదిక ‘ఐక్యరాజ్య సమితి – సాధారణ సభ’కు తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. 1946, 1947, 1963 సంవత్సరాలలో మన దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొన్నారు.

దక్షిణాఫ్రికాలోని జాతి విచక్షణా విధానానికి వ్యతిరేకంగా సాధారణ సభలో ప్రస్తావించి, ఉపన్యసించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 1979వ సంవత్సరంలో మానవహక్కుల కమీషన్‌కి భారతదేశ ప్రతనిధిగా నియమితులయ్యారు.

రాజకీయ, విదేశ వ్యవహారాలలోనే కాదు, సామాజిక సేవలోను ముందున్నారు. స్వాతంత్ర్యం రావడానికి ముందు మంత్రిగా చేసినపుడు గ్రామీణ స్త్రీలు,

పిల్లల సమస్యలను అవగాహన చేసుకున్నారు. వయోజన విద్యాపాఠశాలలను స్థాపించారు. మంచినీటి పథకాలు, పసిపిల్లలకు పాల పంపిణీ పథకాలను ప్రవేశపెట్టారు.

స్థానిక సమస్యలు స్థానికులకే తెలుస్తాయని అవగాహన చేసుకునీ, ఈమె స్థానిక స్వపరిపాలనా మంత్రిణిగా ‘పంచాయితీరాజ్ బిల్లు’ను ప్రవేశపెట్టారు. మహిళా విద్యకోసం కృషిచేశారు.

ఆగర్భ శ్రీమంతురాలయినప్పటికీ వివిధ వర్గాల బాలల, మహిళల సమస్యలను అర్థం చేసుకున్నారు. వారి కోసం కృషి చేశారు.

‘ద ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇండియా’, ‘సో బికేమ్ ఎ మినిస్టర్’, ‘రోల్ ఆఫ్ ది ఉమన్ ఇన్ ద మోడరన్ వరల్డ్’, ‘ద స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్’ వంటి అనేక గ్రంథాలను రచించారు. 1915లో ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించిన తరువాత కాంగ్రెస్‌తో విబేధించారు. 1979వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో జనతాపార్టీ తరఫున కృషి చేశారు. అయితే ప్రభుత్వ పదవులను స్వీకరించలేదు. మౌనంగా వుండిపోయారు.

ఈ విధంగా ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో పుట్టి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుశిక్షననుభవించి, భారతదేశంలో తొలి మహిళా మంత్రిగా సంస్కరణలు రూపొందించి, విదేశాలలో రాయబారిగా, హై కమీషనర్‌గా విధులను నిర్వర్తించి, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వంటి అంతర్జాతీయ వేదికనలరించి, స్థానిక స్వపరిపాలనకి శ్రీకారం చుట్టిన శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ అభినందనీయురాలు.

1990 డిశంబర్ 1వ తేదీన అలహాబాద్‍లో మరణించారు. 2000 ఆగష్టు 15వ తేదీన భారత తపాలా శాఖ వీరి గౌర వార్థం 3 రూపాయల విలువ గల స్టాంపును విడుదల చేసి నివాళి అర్పించింది. ఆమె వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

Image Courtesy – internet

Exit mobile version