[డా. అమృతలత రచించిన ‘ఓటెందుకు?’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
[dropcap]కొం[/dropcap]దరు వ్యక్తులు సామాజిక బాధ్యతను మర్చిపోరు. సమాజానికి బాధ్యతలను గుర్తుచేస్తారు. కొన్ని పనులు చేయడం పట్ల అలసత్వం, నిర్లక్ష్యాలని సహించరు. తమకు తోచిన రీతిని సమాజాన్ని జాగృతపరచాలనుకుంటారు. జాగృతపరచడానికి ముఖ్యసాధనం సాహిత్యం. సాహిత్యం వ్యక్తులకు దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తుంది.
ఇటువంటి సాహిత్యాన్ని సృజించి సామాజిక బాధ్యతను ఎల్లవేళలా భుజాన వేసుకుని తాను ఆచరించే రచయిత్రి, విదుషీమణి డా. అమృతలత.
ఈమె వ్రాసిన ‘ఓటెందుకు?’ లఘు గ్రంథం ఓటు వెయ్యవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.
ఎలక్షన్ వచ్చేసరికి చాలా మంది “అబ్బే! ఓటు వెయ్యమండీ!” అంటుంటారు పోజుగా! కారణాలు చూస్తే సిల్లీగా అనిపిస్తాయి. అటువంటి కారణాలని ఎంచుకుని ఒక బుజ్జి పుస్తకాన్ని అందించారు ఆమె.
ఓటర్లు తాము ఓటెయ్యడానికి చెప్పే కారణాలకి జవాబులని వారితోనే చెప్పిస్తూ చిన్నచిన్న పదాలతో నాటకీకరణ పద్ధతిలో వ్రాశారు. ప్రతి ప్రశ్నకీ లాజికల్‌గా జవాబులని రాబట్టి అందరినీ ఓటు వేయించేటందుకు సిద్దం చేశారామె.
“ఓటర్ గుర్తింపుకార్డులో తప్పులున్నయ్యి, ఓటెయ్యను” అంటే “ఆధార్ కార్డు తప్పుల్ని ఏం చేశావు?” అని అడిగి, – “సరిచేయించుకున్నా”నంటే ఆధార్ కార్డు ఇంటి బాధ్యత అయితే ఓటర్ కార్డ్ సామాజిక బాధ్యత అని చెపుతారు.
“ప్రభుత్వాన్ని ఎన్నుకునే అర్హత కేవలం విద్యావంతులకు మాత్రమే కల్గించినపుడు ఓటేస్తాము” అంటే “పట్టభద్రుల యం.యల్.సి. ఎన్నికలో ఎంతమంది విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకున్నారంటావ్?” అనే ప్రశ్నకి సమాధానమేం చెపుతాము?
“ఇన్నిపార్టీలు పోటీ చేస్తుంటే ఏ పార్టీకి మెజారిటీ రాదు, వచ్చినా అది అతుకుల బొంతే అవుతుంది- ఓటేయను” అనేవాడికి “నీ చేతిలోని సూది-ఓటు. నీక్కావలసిన బొంత నువ్వేకుట్టుకో! అందరూ ఓట్లేయకపోతే ఎలా? బాధ్యతని మర్చిపోవద్దు” అని చెపుతారు.
“మా ఇంటికి రాలే – నన్ను కలవలేదు!- నేను ఓటెయ్యను” అనే వ్యక్తికి “నిముషానికి పదిహేను మందినీ కలవాల్సి వస్తుంది, సాధ్యమయ్యే పనేనా?” అని సర్ది చెప్పి ఓటెయ్యమని ప్రోత్సహించడం, ఈ అంశంలో ఇచ్చిన ఉదాహరణ.
సుమారు 500 మంది అతిథులను మనింటి ఫంక్షన్‍కి పిలవడానికే నెల చాలదు. మరి లక్షల మందిని 25 రోజులలో కలవడం సాధ్యమేనా? అంటే మన దగ్గర సమాధానం ఉంటుందా? దీనికి మనమందరం ఫిదా అయి తీరాలి. ఈ చిన్ని పుస్తకంలో ఇటువంటి చిత్రాలు కనిపిస్తాయి.
ఇంకా ఇటువంటి ప్రశ్నలు, జవాబులు ఓటెందుకో మనకి చెపుతాయి. వీటికి తోడు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, కార్టూనిస్ట్ శ్రీమతి నెల్లుట్ల రమాదేవి కార్టూన్లు నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ప్రముఖ చిత్రకారుడు బాబు బొమ్మలు ఈ పుస్తకాన్ని సుసంపన్నం చేశాయి.
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆశించేవారు, ఓటు వేసేందుకు ఓటర్లకు స్ఫూర్తిని కలిగించాలి అనేవారు ఈ పుస్తకం చదివి తీరవలసిందే!
ఓటు వెయ్యడం పౌరుల బాధ్యత అని, ఓటు హక్కు ప్రాధాన్యతను పిల్లలకు కూడా అర్థమయ్యేంత సరళ పదాలతో వివరించిన డా. అమృతలత అభినందనీయురాలు.
***
ఓటెందుకు? (సంభాషణల సమాహారం)
రచన: డా. అమృతలత
ప్రచురణ: అపురూప పబ్లిషర్స్, హైదరాబాద్
పేజీలు: 63
వెల: ₹ 50/-
ప్రతులకు:
డా. అమృతలత
విజయ్ హైస్కూల్
ముబారక్ నగర్, నిజామాబాద్
తెలంగాణ-503 003
ఫోన్: 08462-237887, 9848868068