Site icon Sanchika

సిరివెన్నెల నిశ్శబ్ద నిష్క్రమణ

[dropcap]అ[/dropcap]ది 1986వ సంవత్సరం.

రాహత్ థియేటర్, దేవుని కడప రోడ్, కడప.

సిరివెన్నెల విడుదల అయిన రోజుల్లో నేను ఇంకా ఇంటర్మీడియెట్ చదువుతున్నాను.

ఆయన సినీ ప్రపంచంలోకి ఎంత నిశ్శబ్దంగా ప్రవేశించాడో, ఈ లోకంలోంచి అంత నిశ్శబ్దంగా నిష్క్రమించాడు.

***

ఆ రోజు నాకింకా బాగా గుర్తు ఉంది.

‘సిరివెన్నెల’ సినిమా ఆ రోజే విడుదల. అప్పుడు సమయం దాదాపు పదకొండున్నర అవుతోంది.

నేను నా మిత్రుడు ఇద్దరం దేవుని కడప వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకుని, వస్తూ వస్తూ రాహత్ థియేటర్‍లో ఫస్ట్ షోకి అడ్వాన్స్డ్ బుకింగ్ కోసం ప్రయత్నం చేద్దామని వెళ్ళాము (ఈ థియేటర్‌ని స్థానిక తెలుగు వారు రహత్ అని పిలుచుకుంటారు వ్యవహారంలో). నాకు ఈ సినిమా థియేటర్ పేరు చూసినప్పుడల్లా వారి భావుకత్వానికి ముచ్చట వేస్తుంది. రాహత్ అంటేనే సాంత్వన కద.

అక్కడ సైకిల్ స్టాండ్‌లో ఓ పదో ఇరవయ్యో సైకిళ్ళు ఉన్నాయి అంతే. లోపల షో నడుస్తోంది అన్న సూచనగా సంగీతం, మాటలు అస్పష్టంగా బయటకి వినిపిస్తున్నాయి.

“ఫస్ట్ షోకి మాకు ఓ పది టికెట్స్ అడ్వాన్స్డ్ బుకింగ్ కావాలి” నా మాటలకి ఆ వ్యక్తి నా వంక జాలిగా చూశాడు.

సైకిల్ స్టాండ్ ముందు, ఓ పెద్ద వేపచెట్టు నీడలో గోద్రేజ్ కుర్చీ వేసుకుని, కడప ఎండలని తట్టుకోవటానికా అన్నట్టు విసనకర్రని అటూ ఇటూ తిప్పుకుంటూ కూర్చున్న ఆ పీచు గడ్డం వ్యక్తి “ఈ రోజు సాయంత్రం ఆట వేస్తే మీరు వచ్చి చూద్దురుగానీ. అసలు ఎవ్వరూ రావడంలేదు. సాయంత్రం ఆట ఉంటుందో ఉండదో” అని విసనకర్ర ఊపుకుంటూ కూర్చున్నాడు.

అదే చెట్టు కింద కాస్త వారగా టీలు, స్నాక్స్ అమ్మే స్టాల్ కుర్రాళ్ళు పులి, మేక ఆడుకుంటూ కూర్చున్నారు.

వాళ్ళెవ్వరికీ ఆ క్షణంలో తెలియదు, ‘జననీ జన్మ భూమి’ ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఈ సినిమా ద్వారా సింగిల్ కార్డ్ ఎంట్రీతో పూర్తి స్థాయి రంగ ప్రవేశం చేసిన ఓ సరస్వతీ పుత్రుడు తెలుగు సినిమా సాహిత్యాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకువెళ్ళబోతున్నాడని. వారికే కాదు నాకూ తెలియదు ఆ క్షణంలో.

ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ అవలేదు కానీ, పాటలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ సినిమా పేరే తన ఇంటిపేరుగా నిలిచింది ఆయనకి.

30 నవంబర్ 2021 మంగళవారం సాయంత్రం నాలుగున్నరకి దావానలంలా వ్యాపించింది ఆయన నిశ్శబ్ద నిష్క్రమణ వార్త. ఎస్పీ బాలసుబ్రమణ్యంగారి మరణ వార్త కూడా నిస్సందేహంగా తీరని దుఃఖాన్ని కలిగించింది.

కాకపోతే ఇక్కడ ఒక తేడా ఏమిటి అంటే, ఒక విధంగా మీడియా మనల్ని మానసికంగా సంసిద్దులను చేసింది ఎస్పీ గారి విషయంలో. గాలి కబురులు, పుకారులు, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న స్థాయిలో వస్తూ ఉండిన వార్తల నేపథ్యంలో ఎస్పీ గారి మరణవార్త మనకు దుఃఖాన్ని కలిగించిందే కానీ ఒక విధమైన షాక్‌కి గురి చేయలేదు. అది కాస్త గుడ్డిలో మెల్ల.

కానీ సీతారామ శాస్త్రి గారి అనారోగ్యం గూర్చి కూడా ఎక్కడా మనకు వార్తలు తెలియరాలేదు. ఆయన ఆసుపత్రిలో చేరినట్టు కూడా మనకు తెలియదు. ఇందాకే వారి సోదరుడు చెప్పాడు, సీతారామ శాస్త్రి గారికి తన వ్యక్తిగత విషాదాలని కష్టాలని ప్రకటించుకోవడం ఇష్టం ఉండదని.

నవంబర్ ముఫైయ్యవ తేది అప్పుడే ఒక ఆన్‌లైన్ క్లాస్ ముగించుకుని, యధాలాపంగా ఫోన్ పట్టుకుని చూసిన నాకు నోట మాట రాలేదు కాసేపు. అకస్మాత్తుగా ఉరుము లేని పిడుగులా, ఈ వార్త సాధికారికమైన విశ్వనీయమైన మీడియా సంస్థల ద్వారా డిజిటల్ మాధ్యమం ద్వారా తెలిసింది. మనం ఎప్పుడూ చేసే మొదటి పని గూగుల్‍ని ఆశ్రయించడం నిర్ధారణకి. అక్కడ కూడా నాకు ఈ దుర్వార్త నిజమే అని తెలిసింది.

అప్పుడు కలిగింది దుఃఖం. ఒక ఆత్మీయుడిని కోల్పోతే ఆ దుఃఖం ఎలా ఉంటుంది అన్నది నాకు అనుభవైకవేద్యమే.

చిన్న వయస్సులోనే ఇంటల్లుడి మరణం మా కుటుంబంలో పెద్ద దుఃఖం కలిగించింది. నేను చూసిన మొదటి మరణం అది ఇంట్లో. ఆ దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ తరువాత కొన్నేళ్ళకు ఇంట్లో నాన్నగారిని, అమ్మగారిని కోల్పోయాను. అయిన వాళ్ళ మరణం ఎంత దుఃఖం కలిగిస్తుందో నాకు తెలుసు.

ఇప్పుడు కూడా ఆ స్థాయి దుఃఖం కలిగింది.

కళ్ళ నిండా నీళ్ళు ఛిప్పిల్లాయి. ఎదుట ఉన్న దృశ్యాలు మసకబారాయి. కాస్త కోలుకుని, శక్తి తెచ్చుకుని, నా ఆఫీస్ రూం నుంచి బయటకి వచ్చి, ఇంటి లోపలికి వెళ్ళాను. ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఏమీ మెరుగ్గా లేదు. అంతటా దుఃఖం.

అసంకల్పితంగా ఎప్పుడో విన్న కేజే జేసుదాస్ గారు పాడిన అయ్యప్ప పాట నా మదిలో మెదిలింది.

‘అంతా దుఃఖం, అంతము చేయుము దేవా

అంతా దోషం,హరియించు నీ చేతుల అనుగ్రహించు’

ఈ పాట సీతారామ శాస్త్రి గారు వ్రాసింది కాదు ఎవరు వ్రాశారో కూడా తెలియదు. ఆ క్షణంలో ఎందుకో ఆ పాట తన్నుకు వచ్చింది మనస్సులో. ఏదో నిస్సహాయత.

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మృతి ఇంకా పచ్చి పుండులా హృదయాన్ని సలుపుతోంది. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మనకేమీ కానీ పునీత్ రాజ్ కుమార్ గారి మరణ వార్త కూడా ఇదే మాదిరి కలచి వేసింది, సరిగ్గా ఒక్క రోజు ముందే శివశంకర్ మేష్టార్ గారి మరణ వార్త, ఇంతలో సీతారామ శాస్త్రి గారి మరణ వార్త. అంతే మా దుఃఖానికి అంతం లేదు.

నేను ఇంక అక్కడ ఒక్క క్షణం ఉండలేదు. మళ్ళీ నా గదిలోకి వచ్చేశాను, నా కన్నీళ్ళని దాచుకుంటూ. మానసికంగా చాలా బలహీనం అయిపోయాము ఆ క్షణంలో అందరం.

***

సిరివెన్నెల గురించి నా మనసులో భావాలను రాయాలనుకున్నాను.

క్షణాలలో సామాజిక మాధ్యమాలలో ఎందరెందరో తమ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. రేప్పొద్దున వార్తా పత్రికల నిండా వారి గూర్చి వ్యాసాలు వస్తాయి. నేనేమి వ్రాసినా పునరుక్తి అవుతుందే కానీ కొత్తగా ఏమి వ్రాయగలను అని ఒక సందేహం వచ్చింది.

‘నాదైన అనుభూతి నాది గాన..’ నా స్పందనలు నేను తెలియజేస్తాను, అని నిశ్చయించుకున్నాను.

ముందుగా నేను ఎక్కువ స్పందించిన స్వర్ణకమలంలోని ఈ పాట గూర్చి చెప్పి నా అనుభూతులని చెపుతూ వెళతాను.

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా

ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా

అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా

ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా

వెన్నెల కిన్నెర గానం నీకు తొడుగా

పరుగాపక పయనించవె తలపుల నావ

కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

వ్యక్తిత్వ వికాస తరగతులలో నేను తరచు చెప్పే మాటలకి ఎక్కువభాగం ప్రేరణ నాకు సిరివెన్నెల పాటల ద్వారా లభిస్తూ ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు.

‘పాజిటివ్ అఫర్మేషన్స్ అనీ, గోల్ సెట్టింగ్ అని, విజువలైజేషన్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని గొప్ప గొప్ప మాటలు దొర్లుతుంటాయి నా ట్రైనింగ్ ప్రోగ్రాములలో. కానీ ఇవన్నీ చెప్పి ఒకటి మాత్రం మరచి పోకుండా చెపుతాను.

“ఆచరణ దిశగా నీ వైపు నుంచి మొదటి అడుగు పడకుంటే నీ కలలు, కోరికలు అన్నీ పగటి కలలు, భ్రమలుగానే మిగిలి పోతాయి. ఈ ప్రపంచంలో అసలైన నిజం ఒకటే ఒకటి ఉంది. అది జ్ఞానం కన్నా, విజ్ఞానం కన్నా, లక్ష్యాలకన్నా, సకారాత్మక దృక్పథం కన్నా, నీకు నీవు చెప్పుకునే పాజిటివ్ అఫర్మేషన్స్ కన్నా, ఇంకా ఇలాంటి అన్నింటికన్నాగొప్పది. అదేమిటంటే, అది నీవు వేసే మొదటి అడుగు. ఆ అడుగు ఇంకో అడుగుగా మారటం. దీనికి కావాల్సింది క్రమశిక్షణ.”

ఉత్తిగా కలలు కంటూ, ఏదో అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది అని చూస్తూ, నిష్క్రియాపరంగా కూర్చుంటే అది విజువలైజేషన్ అవదు, ఉత్తి డెల్యూషన్స్ (చిత్త భ్రమలు) మాత్రమే.

ఇంత కఠోరమైన సత్యాలని నా శ్రోతలకి నేను చెప్పేదానికి నాకు ప్రేరణ సిరివెన్నెల గారి పాటల్లోని సత్యాలే.

***

ఇప్పుడు ఇంకో పాట చెబుతాను.

మా ఇంట్లో ప్రతి రోజూ ఎందుకో తెలియదు ఈ పాట నిత్యమూ పలుకుతూ ఉంటుంది యూ ట్యూబ్‌లో.

“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి”, ఈ ఒక్క పాట గూర్చే ఒక గ్రంథం వ్రాయవచ్చు. నీకు ఏమి అస్త్ర శస్త్రాలు లేవని ఎందుకు అనుకుంటావు, అంగబలం అర్థ బలం లేవని ఎందుకనుకుంటావు, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా.

ఈ పాట అంతా సకారాత్మక ధోరణే. ప్రేరణే.

మన బాహుబలి ఎస్.ఎస్. రాజమౌళి తన జీవితంలో ఇంత ఎత్తుకు ఎదిగాడంటే కారణం ఈ పాటనే అని మీకు తెలుసా? రాజమౌళి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాలలో ఉన్నప్పుడు అతనికి అత్యంత ప్రేరణ ఇచ్చినది ఈ పాటనే అని చెప్పుకొచ్చాడు.

కిరణ్ ప్రభ గారి మాటల్లో విన్నాను, అమెరికాలో అనేక మంది తెలుగు సీఈఓలు తమ ఆఫీస్ గదిలో ఈ పాట ప్రింటవుట్ ని ఫోటో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నారని విని ఎంతో ప్రేరణ కలిగింది.

***

హిందీలో సాహిర్ లూధియాన్వీ అనే కవి రాసిన ఒక కవిత ప్యాసా సినిమాకు, మరో కవిత కభీ కభీ అనే సినిమాకు ప్రేరణ అంటారు.   కానీ ఒక  తెలుగు కవి  వ్రాసి పెట్టుకున్న కవితని చూసి సినిమా తీసిన దర్శకుడిని మీరు ఎరుగుదురా?

అది సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి విషయంలో జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఒకసారి సిరివెన్నెల గారు వ్రాసి పెట్టుకున్న కవితలని తిరగేస్తూ, ఒక కవిత దగ్గర ఆగిపోయారు. అది మళ్ళీ మళ్ళీ చదివాడు. అది చదివిన ప్రతి సారి పులకించి పోయాడు. అది చదివి అప్రతిభుడయ్యాడు. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ కవితని ఆధారం చేసుకుని ఒక సినిమా తీస్తాను అని, ఆ సినిమాకి హీరో ఆ కవితే.

ఆ పాట ఏదో తెలుసా?

“జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది” ఆ సినిమా మీకు తెలిసిందే. అదే చక్రం.

ఆ పాటలో కొన్ని వాక్యాలు ఉన్నాయి

“గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హృదయమే నా లోగిలి

నా హృదయమే నా పాటకి తల్లి

నా హృదయమే నాకు ఆలి

నా హృదయములో ఇది సినీవాలి”

నేను డిగ్రి చదివే రోజులలో విస్తృతంగా రచనలు చేసేవాడిని. ఆ రోజుల్లో ఆదోని ఆరెమ్మెస్ (రైల్వే పోస్టాఫీస్)కి వెళ్ళి నేను వ్రాసిన ప్రతి కథని పోస్ట్ డబ్బాలో వేసినప్పుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డని చేజేతులా నిర్దాక్షిణ్యంగా పోస్టు డబ్బాలో వేసేసిన అనుభూతి పొందేవాడిని.

చక్రం సినిమా వచ్చిన కొత్తల్లో, పై వాక్యాలు విన్నప్పుడు, ఆదోని పోస్టాఫీస్‌లో నాకు కలిగిన భావాలకి సీతారామ శాస్త్రి గారు అక్షరరూపం ఇచ్చినట్టు ఫీలయ్యాను.

ఒక కథని పంపగానే ఇంకో కథకి ఆలోచన పురుడుపోసుకునేది నా హృదయంలో ఆ రోజుల్లో. ఆరెమ్మెస్ నుంచి, సైకిల్ వేసుకుని ఇంటికి వచ్చేటంతలో దారి పొడుగునా మది లోగిలిలో మెదిలి మెదిలక, తోచి తోచక, స్పష్టాస్పష్టంగా అమావాస్య తరువాత అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న రేఖామాత్రపు చంద్రుడిలా ఒక కొత్త కథకి రూపం వచ్చేది.

కృత్యాద్యావస్థని సినీవాలితో (రేఖామాత్రపు చంద్రుడు) పోల్చి చెప్పడం నాకు అబ్బురంగా తోచింది. చాలా ఏళ్ళ క్రితం ఆరుద్ర గారు సినీవాలి అనే కవితా సంకలనం వెలువరించినట్టు గుర్తు. అప్పుడు తెలుసుకున్నాను ఈ పదం గూర్చి మొదటి సారి.

***

సిరివెన్నెల పాటలు విపరీతంగా ప్రాచుర్యంలో ఉన్న రోజులు అవి.

అప్పట్లో నేను ఆదోనిలో ఉండేవాడిని. ఆ రోజుల్లో ఓ అమ్మాయి వేదిక ఎక్కి తెగ పాటలు పాడేది. వాళ్ళ తమ్ముడు ఫ్లూట్ వాయించేవాడు. లలిత సంగీతంలో భాగంగా అన్నమయ్య కీర్తనలు, కర్ణాటక సంగీతంలో భాగంగా త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు తదితరుల కీర్తనలు, పాడేది. కాకపోతే సినిమా పాట అంటూ పాడితే శంకరాభరణం, లేదా సిరివెన్నెల పాటలు మాత్రమే పాడేది.

‘ప్రాకృత వీణియ పైన దినకర మయూర తంత్రుల పైన…’ అని తెగ రెచ్చిపోయి పాడేది ఆమె. ఇక ఉండబట్టలేక ఆమెకి చెప్పేశాను ఒక సారి, తాను తప్పు పాడుతోంది అని.

‘ప్రాగ్దిశ వీణీయ పైన, దినకర మయూఖ తంత్రులపైన….’అని సవరించి చెప్పి దాని తాలూకు అర్థం వివరిస్తే అప్పుడు సవరించుకుంది ఆమె.

సిరివెన్నెలగారి పాటలు సాహిత్య సువాసనల్తో గుభాళించేవి., సిరివెన్నెలలో కావచ్చు, శృతిలయలు, స్వర్ణ కమలం, రుద్రవీణ తదితర సినిమాలలోని పాటల్ని అర్థం చేసుకోవాలి అంటే, ఇంచుమించు ఒక యూజర్ మాన్యువల్ లాంటిది అవసరమయ్యేది ఆ రోజుల్లో.

మా పెద్ద బావగారు శ్రీ బిఎల్‍ఎన్ మూర్తి తెలుగు ఎమ్మే చేసి తెలుగు ఉపాన్యాసకుడుగా ఉంటూండటం వల్లనూ, ఆయన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రియ శిష్యుడు అయి ఉండటం వల్లనూ, మీదు మిక్కిలి మా ఇంట్లో మొదటి నుంచి సాహితీ వాతావరణం నెలకొని ఉండటం వల్లనూ నాకు ఈ పాటి వెసులుబాటు దొరికింది. సామాన్యులగతి ఏమిటి అని నేను తెగబాధపడేవాడిని ఆ రోజుల్లో.

ఇటీవల త్రివిక్రం శ్రీనివాస్ నా సందేహం తీర్చేశాడు ఓ ప్రసంగంలో.

పామరులకోసం వ్రాస్తున్నాను కాబట్టి దిగజారి వ్రాయాలి అనుకోకుండా వారిలో సైతం భాష పట్ల, పదాల పట్ల, అందమైన భావాల పట్ల కుతూహలాన్ని కలిగించి, వారి స్తాయిని పెంచిన కవి సిరివెన్నెల అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

తమిళనాడులో ఇలాంటి ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనసు పెట్టి వెంటే తమిళంలో ఈ నాటికి ఒక్కొక్క పాట ఒక ఆణీ ముత్యమే. ఇంకా విశేషం ఏమిటి అంటే అక్కడి వారు సినీగీతాలకి సైతం సాహిత్యం స్థాయిని ఇచ్చి వాటిని గ్రంథాలుగా ప్రచురించి వాటిని గౌరవించి తమ అభిరుచిని చాటుకుంటారు.

హిందీ సినిమా పాటలలో కూడా ఇదేలాంటి ఉత్తమ అభిరుచులు మనకు కనిపిస్తాయి.

మన తెలుగులో మాత్రమే ఎందుకో సామాన్యులకోసం పాట అనగానే చౌకబారు పదాలతో వ్రాయించుకుంటారు దర్శక నిర్మాతలు.

ఇలాంటి పరిస్థితులలో సైతం తను నమ్ముకున్న విలువల్ని పణంగా పెట్టకుండా, నా పాట కావాలంటే నా స్థాయిలోనే వ్రాస్తాను, కావాలంటే తీసుకోండి, లేకుంటే మానేయండి అని చెప్పగలిగిన తెగువ స్థైర్యం ఉన్న ఒక ధీరుడు సిరివెన్నెలగారు.

***

ఒక సారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని అన్నమయ్య పూనాడు. మీకు తెలుసా ఈ ముచ్చట. వినటానికి కాస్త అతిశయోక్తి లాగా అనిపించవచ్చు గానీ ఇది నిజం.

శృతిలయలు సినిమాకోసం ఆయన వ్రాసిన పాట “తెలవారదేమో స్వామీ నీ తలపుల మునుకలో తడిసిన దేవేరి అలమేలు మంగకు..” అన్న పాటని నంది అవార్డుల పరిశీలన కమిటీ వారు విని, కోప్పడి వెనక్కు పంపేశారట.

‘ఏమయ్యా! అన్నమయ్య కీర్తనని అవార్డు కోసం పంపిస్తారా! హన్నా” అని కోప్పడారట.

“అయ్యబాబోయ్! అది అన్నమయ్య వ్రాసింది కాదండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వ్రాసింది” అని విశ్వనాథ్ గారు నెత్తి నోరు బాదుకుని సెలక్షన్ కమిటీ వారిని ఒప్పించే సరికి తలప్రాణం తోకకి వచ్చిందట.

***

సిరివెన్నెల గారు కథా రచయిత అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. మొదట భరణీ అన్న కలం పేరుతో వ్రాశారు. ఆ తరువాత తన పేరుతో కూడా కొన్ని కథలు వ్రాశారు.

‘ఎన్నో రంగుల తెల్ల కిరణం’ అన్న పేరుతో తన ఏడు కథల్ని సంపుటంగా వేస్తున్నామని ఆయన ఇటీవలే ప్రకటించారు. అందులో ‘కార్తికేయుని కీర్తికాయం’,’మరో సింద్‍బాద్’,’చరిత్రచోరులు’, ‘మహా శాంతి’ తదితర కథలు ఉన్నాయి.

***

గాయం సినిమాలో ఆయన తెరపై కనిపిస్తూ ‘నిగ్గదీసి అడుగు’ అనే తన పాటకి హావభావాల్ని ఆవేశంగా పలికిస్తారు. కాకపోతే ఈ పాట పాడింది ఎస్పీబాలు గారు.

అలాగే ‘కళ్ళు’ అనే చిత్రంలో మొదటి సారి ఆయన ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరొక్కో’ అనే పాటని పాడి, తెరపై కూడా కనిపిస్తారు.

***

యూ ట్యూబ్‌లో కిరణ్ ప్రభ టాక్ షోలో “వీరి మొదటి సినిమా” అనే కార్యక్రమంలో అయన స్వయంగా కిరణ్ ప్రభగారికి అందించిన వివరాలతో కూడిన సాధికారికమైన కార్యక్రమం చూడండి. అందులో ప్రతి అంశం మీకు ప్రేరణ కలిగిస్తుంది.

ఆయన బాల్యం, విద్యాభ్యాసం, వాళ్ళ నాన్నగారి మేధావిత్వం, పేదరికంతో పోరాటం. ఇలాంటి వ్యక్తులకు ఆర్థిక స్థాయి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే, కులాసాగా వాళ్ళు తమ తమ రంగాలలో ఎదిగి దేశానికి ఇంకా త్వరగా, ఎంతగానో ఉపయోగపడేవారు కద అని అనిపించింది. వాళ్ళ నాన్న గారి జీవితం అంతా పేదరికంతో, ఆర్థిక కష్టాలతో సరిపోయింది. ఆయనకున్న తెలివితేటలకి, అపర కంప్యూటర్ లాంటి ఆయన బుర్రకి, హోమియో వైద్యంలో ఉన్న ఆయనకి ఉన్న పట్టుకి, సంస్కృతం, తెలుగు సాహిత్యంలో ఆయనకి ఉన్న పాండిత్యానికి ఆర్థిక వెసులుబాటు ఉండుంటే వారు ఇంకా ఎక్కువ సమాజానికి దేశానికి ఉపయోగపడి ఉండేవారు కద అని అనిపించింది. అనర్హులకు, సాయం విలువ తెలియని వారికి అప్పనంగా ప్రభుత్వాలు సాయం చేసి బూడిదలో పోసిన పన్నీరు లాగా ప్రజాధనాన్ని వృధాచేస్తున్నాయి అని అనిపించింది.

ఆర్థిక స్థితిగతులని, మెరిట్‌ని ప్రభుత్వాలు పరిగణలోకి తిసుకుని ఉండుంటే సిరివెన్నెల గారి జీవితం ఇంకోలా ఉండి ఉండేది అని అనిపించింది. వినండి కిరణ్ ప్రభ గారి టాక్ షో.

కిరణ్ ప్రభ గారి జ్ఞాపకాలు కూడా వినండి.

***

సీతారామ శాస్త్రి గారికి అత్యంత సన్నిహితులైన శ్రీ ఎంవీఆర్ శాస్త్రి, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ యమునా కిషోర్ తదితరులు నాకు పరిచితులే, వీరిలో ఎవరినో ఒకరిని అడిగి వారి చిరునామా తెలుసుకుని ఈ వేళో రేపో వారిని కలుద్దాం అని అనుకుంటున్నంతలో ఈ విషాదం జరిగింది.

***

ఆయన సిగరెట్ త్రాగే అలవాటు గూర్చి కూడా ఇప్పుడే తెలిసింది.

ఎందరికో ఎన్నో విధాలుగా ప్రేరణ కల్గించిన ఆయన ఇలా ఒక చెడుపు చేసే అలవాటుకి బానిస అవకుండా ఉండుంటే, ఇంకా ఎక్కువ కాలం ఎందరినో ప్రభావితం చేసి ఉండేవాడు కద అని అనిపించింది.

***

మురారి సినిమాలోని ‘అలనాటి బాల చంద్రునికి అన్నింటా సాటి’,

ఖడ్గం సినిమాలో ‘నువ్వు నువ్వు…’,

గులాబి చిత్రంలో ‘ఈ వేళలో నువ్వు….’

క్రిమినల్ సినిమాలో ‘మనసా తెలుసా ఇది ఏ జన్మ సంబంధమో’

ఆర్జీవ్వీ ‘ప్రేమ కథ’ లో ‘దేవుడు కరుణిస్తాడని… వరములు కురిపిస్తాడని నమ్మలేదు నేను నీ ప్రేమను పొందేవరకు’

‘అతడు’ చిత్రంలో ‘నీతో చెప్పనా’

‘అవును వాళ్ళు ఇద్దరూ ఇష్టపడ్డారు’ లో ‘నాలో నేను లేనే లేను…ఎపుడో నేను నీవయ్యాను’

‘మల్లీశ్వరి’లో ‘నీ నవ్వులే వెన్నెలని’

తదితర పాటలు ఎన్నో తియ్యటి జ్ఞాపకాల్ని ఎందరిలోనో తట్టి లెపుతాయి అన్నది నిరివాదాంశం.

ఒక వ్యక్తిగత విషయం చెబుతాను.

నాకు పెళ్ళి జరిగింది 1995లో. మాకు నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్య దాదాపు మూడు నెలలు వ్యవధి ఉండింది. వేరే వేరే ఊర్లలో ఉండటాన మేము (నేను, నా కాబోయే శ్రీమతి) బోలెడు బోలెడు ఉత్తరాలు వ్రాసుకునే వాళ్ళం. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కద, అందుబాటులో లాండ్ లైన్లు కూడా లేవు.

నాకిప్పటికీ బాగా గుర్తు నేను అంతం లోంచి ‘నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో….’ పాట పూర్తిగా వ్రాసి ఆమెని తెగ ఆనందపరిచాను. అది ఒక తియ్యటి జ్ఞాపకం.

***

చివర్లో ఒక కొస మెరుపు.

కడపలో అప్పుడప్పుడు ప్రెస్ క్లబ్ కి వెళ్ళేవాడిని. ఒకరోజు ఒకాయన నేను కవినండీ అని పరిచయం చేసుకున్నాడు.

‘సంతోషం మీ పేరెప్పుడూ నేను వినలేదే’ ఆయన పేరు విన్నతరువాత సందేహం వ్యక్తం చేశాను ఆసక్తిగా.

ఆయన తడుముకోకుండా “మేము వెనుకపడ్డామండీ, మాకు ప్రభుత్వ ప్రోత్సాహం లేదండీ” అని బాధ వ్యక్తం చేశాడు.

అంటే ఆయన ఉద్దేశం సిరివెన్నెల తదితర స్వయంప్రతిభ కలిగిన కవులనందర్నీ ప్రభుత్వం ఓ డెబ్బై ఏళ్ళు తొక్కి పట్టేసి ఉంచి, ఆయనకి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఏవైనా పథకాలు అమలు చేయాలని చూస్తున్నాడల్లే ఉంది. మంచి ఆలోచనే!

అదీ విషయం.

Exit mobile version