[శ్రీ రాజేష్ కుమార్ పొన్నాడ రాసిన ‘వృద్ధాప్యమనే బాల్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]గ[/dropcap]డియారంలో సమయం రాత్రి తొమ్మిది గంటలు చూపిస్తోంది. కొత్తగా కొన్న సెల్ ఫోన్ మోగడంతో సున్నితంగా చేతిలోకి తీసుకుని మాట్లాడటానికి సిద్ధమయ్యాడు మోహన్. అవతలి వైపు వ్యక్తి నుంచి “రేయ్! మోహన్ ఏం చేస్తున్నావురా” అని గొంతు వినిపించింది. మోహన్ హుషారుగా “ఇప్పుడే నా భార్య చేసిన భోజనం తిన్నాను ఆనంద్. ఇదిగో నీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నా” అని అన్నాడు. ఆనంద్ నసుగుతూ “నీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలిరా. ఎల్లుండి ఆదివారం నీకు సెలవే కదా. మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను” అని అన్నాడు. మోహన్ ఆశ్చర్యంతో “ఏంటి విషయం? ఇప్పుడే ఫోన్‌లో చెప్పకూడదా?” అని ప్రశ్నించాడు. ఆనంద్ “లేదురా చెప్పకూడదు” అని సూటిగా సమాధానం చెప్పాడు. చేసేది లేక మోహన్ “సరేలే! ఎల్లుండి మా ఇంటికిరా మాట్లాడుకుందాం, గుడ్ నైట్” అని ఫోన్లో సంభాషణ ముగించాడు. ‘ఫోన్‌లో చెప్పకూడనంత పర్సనల్ విషయం ఏమిటా?’ అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళాడు మోహన్.
***
మోహన్, ఆనంద్ ఇద్దరూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. మూడవ తరగతిలో ఒకే స్కూల్లో పరిచయమైనప్పటి నుండి ఇద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మోహన్ తండ్రి జనార్దన్ ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. ఆనంద్ తండ్రి రఘురాం ఒక బట్టల దుకాణం యజమాని. జనార్దన్, రఘురాం ఇద్దరూ వేరే వేరే చోట్ల పనిచేసినా పిల్లల వలన స్కూల్‌లో ఇద్దరూ కలుసుకునేవారు. అలా వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు అయ్యారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని రఘురాం బాగా అభివృద్ధి చేసాడు. కానీ చదువు మాత్రం తొమ్మిదవ తరగతి వరకే చదివాడు. అందుకే చదువుకునే వాళ్ళంటే రఘురాంకి మక్కువ ఎక్కువ. తాను చదువుకోలేదు కాబట్టి తన కొడుకు ఆనంద్‌కి మంచి చదువు చెప్పించాడు. ఎమ్.బి.ఎ చదివిన ఆనంద్ కూడా తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వస్త్ర వ్యాపారాన్ని అందిపుచ్చుకుని దినదినాభివృద్ధి చేసాడు. అనారోగ్యంతో రఘురాం భార్య కాలం చేసింది. జనార్దన్ కూడా తన కొడుకు మోహన్ బాగా చదువుకుని మంచి జీవితం అనుభవించాలని కలలు కనేవాడు. మోహన్ కూడా స్కూల్లో, కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పేపర్ బాయ్‌గా, హోటల్లో సర్వర్‌గా, సెలవురోజుల్లోనూ తండ్రితో పాటు గుమాస్తాగా బట్టల దుకాణంలో పనిచేస్తూ కొంత డబ్బు సంపాదించి తండ్రికి చేయూతనిస్తూ ఉండేవాడు. అతని కష్టానికి కొంత మంది దాతల సహకారం తోడవడంతో బాగా చదివి ఫస్ట్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తద్వారా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి పదోన్నతి ద్వారా ప్రధానోపాధ్యాయుడిగా ఎదిగాడు. మోహన్ తల్లి చిన్నవయసులోనే చనిపోయినా కాని జనార్దన్ మరో వివాహం చేసుకోకుండా కొడుకును కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మరో వివాహం చేసుకోమని బంధుమిత్రులు పదే పదే బలవంతపెట్టినా జనార్దన్ సున్నితంగా వారించేవాడు. దాంతో అందరూ జనార్దన్‌తో “నీకు జనార్దన్ అని కాకుండా శ్రీరామ్ అని పేరు పెట్టాల్సింది” అని సరదాగా ఆటపట్టించేవారు.
***
“నాన్నా!” అని ఒక్కగానొక్క కొడుకు పిలవడంతో మోహన్ గతంలో నుండి బయటకు వచ్చాడు. ఆనంద్ రాక గురించి మోహన్ భార్యకు వివరించాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. కాలం ఎవరికోసమో ఆగకుండా ఆదివారం దాకా వచ్చింది. ఫోన్లో చెప్పినట్లుగానే ఆనంద్ ఆదివారం ఉదయమే మోహన్ ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక మోహన్ ఆనంద్‌ను తన ఇంటికి దగ్గరగా ఉన్న పబ్లిక్ గార్డెన్‌కు తీసుకెళ్ళాడు. ఇద్దరూ ఒక సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఆనంద్ భుజం మీద చెయ్యేసి “ఇప్పుడు చెప్పరా. పర్సనల్ విషయం ఏదో మాట్లాడాలని అన్నావ్. ఏమిటది?” అని మోహన్ ఆప్యాయంగా అడిగాడు. ఆనంద్ లేచి నిలబడి బాధతో “సమస్య మా నాన్న” అని నిట్టూర్చాడు. మోహన్ కంగారుగా “ఏమైంది మీ నాన్నకి? మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమా?” అని అడిగాడు. ఆనంద్ చికాగ్గా “ఆయనే పెద్ద ప్రాబ్లంరా బాబు. ప్రతిదానికీ విసుక్కుంటాడు. చెప్పినట్లు వినడు. పెట్టింది తినడు. కింద పారబోసుకుంటాడు. నా భార్య మా నాన్న వలన చాలా కష్టాలు పడుతోంది. రోజూ మధ్యరాత్రి ఆయన్ని బాత్రూమ్‌కి తీసుకెళ్ళాలి. అప్పటి వరకు నేను షాప్‌లో వ్యవహారాలు చక్కబెట్టుకుని వచ్చి భోంచేసి పడుకుంటే ఆయన వలన నిద్ర లేవాల్సి వస్తోంది. ఏదైనా అనాథ వృద్ధాశ్రమం ఉంటే చెప్పు. డబ్బు ఎంతైనా పర్వాలేదు. మా నాన్నను చేర్చాలి” అని అన్నాడు. మోహన్ ఆశ్చర్యంతో కూడిన కోపంతో “నువ్వు ఉండగా మీ నాన్నను అనాథలా ఆశ్రమంలో చేర్చడం ఏమిటి? తన తోటి వారందరూ పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తుంటే మీ నాన్న మాత్రం నా కొడుకు నా దగ్గరే ఉండి చదువుకోవాలి అని పట్టుబట్టాడు. చిన్నప్పుడు నిన్ను వదలని నాన్నను నువ్వు ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నావా? నీ చిన్నప్పుడు నీకు మలమూత్రాలు కడిగిన వ్యక్తిని బాత్ రూమ్‌కి తీసుకెళ్ళడానికి అవమాన పడుతున్నావా?” అని అడిగాడు. దానికి ఆనంద్ “అది కాదు నీతో మీ నాన్న ఉన్నంత సౌకర్యంగా నా తండ్రి నాతో లేడే” అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి మోహన్ నవ్వుతూ “మా నాన్న నాతో సౌకర్యంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావ్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. బాల్యం అనుభవిస్తున్న ఏ బిడ్డలైనా తమ తల్లిదండ్రులకు సౌకర్యంగా ఉండరు. అలానే వృద్ధాప్యంలో ఉన్న ఏ తల్లిదండ్రులు కూడా ఒక వయసు దాటాక తమ పిల్లలకు సౌకర్యంగా ఉండలేరు. వృద్ధాప్యం మరో బాల్యం లాంటిది. బిడ్డలను నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు, తమ బిడ్డలను అసౌకర్యంగా భావించరు. అలాగే తల్లిదండ్రులను నిజంగా ప్రేమించే బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులను అసౌకర్యంగా భావించరు. నీకు గుర్తుందా? మనం చిన్నప్పుడు అందరం కలిసి ఒక గుడికి వెళ్ళాం. ఆ గుడిలో మెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని మెట్లు నువ్వు ఎక్కలేకపోతుంటే మీ నాన్న నిన్ను భుజాలపై ఎత్తుకుని అన్ని మెట్లు తానే ఎక్కి నీకు దైవ దర్శనం చేయించారు. అలానే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా నిన్ను, నీ జీవితాన్ని దింపకుండా మోసిన మీ నాన్నను బరువులా భావించి దింపుకోవాలని చూస్తున్నావా? అయినా నేను మా నాన్నతో ప్రతిరోజూ వ్యవహరించే తీరు నీకు చెప్తాను. విను. నేను ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్ళి వచ్చాక అప్పుడే నిద్ర లేచిన మా నాన్నకు గ్రీన్ టీ ఇస్తాను. ఆ తరువాత అరగంటకి నా భార్య చేసిన టిఫిన్ నేనే మా నాన్నకు ఇస్తాను. నా భార్య ఇద్దామని ప్రయత్నించినా నేనే ప్రేమతో వారిస్తాను. నేను లేని సమయంలో నా భార్యే మా నాన్న పనులు చూసుకుంటుంది. సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అప్పుడప్పుడు అంటే వారానికి రెండుసార్లు మా నాన్నకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు తీసుకొస్తాను. వారంలో ఒకరోజు మా నాన్నకు ఇష్టమైన జీడిపప్పు మిఠాయి తినిపిస్తాను. ఆయనికి కూడా షుగర్ వ్యాధి ఉంది. ఆయన బాత్రూమ్‌కి వెళ్ళాలంటే నేనో లేక నా భార్య తీసుకెళ్తాం. రోజు రాత్రి ఎనిమిది గంటలకు అందరం కలిసి భోజనం చేస్తాం. రాత్రి పూట మా నాన్నకు ఏదైనా అవసరం అవుతుందేమోనని నేను, మా నాన్న ఇద్దరమూ ఒకే గదిలో పడుకుంటాం. వృద్ధాప్యం వలన మా నాన్నకి కాళ్ళు నొప్పులు. అందుకని రాత్రిపూట నేనే నాన్నకి డాక్టర్ ఇచ్చిన ఆయిల్ రాసి మర్దనా చేస్తుంటాను. డాక్టర్ ఇంటికి వచ్చి ప్రతి నెలా నాన్న హెల్త్ చెక్ చేస్తుంటాడు. ఇది మా నాన్నతో క్లుప్తంగా నా దినచర్య” అని ముగించాడు మోహన్.
దానికి ఆనంద్ “నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ నీకు నీ భార్య సహకరిస్తోంది కాబట్టి నువ్వు మీ నాన్నని జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నావు. కానీ నా భార్య నీ భార్యలా కాదు. మా నాన్న అడిగే వంటలు అన్నీ చేసిపెట్టో లేక కొనుక్కునో తెచ్చి ఆయనకు తినిపించి ఆ తరువాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మేము ఆ తలనొప్పి పడలేము” అని చికాగ్గా అన్నాడు. అంతా విన్న మోహన్ “నువ్వు నీ భార్య ముందు నీ తండ్రికి సేవ చేస్తే అప్పుడు తను కూడా చేస్తుంది. నువ్వే తప్పించుకోవాలని చూస్తే, పరాయి ఇంటి నుంచి వచ్చింది కనుక తను ఎందుకు చేస్తుంది. ఇది అందరి ఇళ్ళల్లో జరిగే సర్వసాధారణ విషయమే. ఇక తిండి అంటావా? మన చిన్నతనంలో మీ నాన్న,మా నాన్న జలుబు చేస్తుందని మనల్ని ఐస్క్రీమ్ తినవద్దు అని అనేవారు. అలా అని మనల్ని స్ట్రిక్ట్‌గా కట్టడి చేయలేదే. ఎప్పుడైనా ఒకసారి తినేవాళ్ళం. ఏదైనా జ్వరం లాంటిది వస్తే మందులు వేసుకునేవారం. ఎవరికైనా జిహ్వ చాపల్యం సాదారణమే కదా. అందుకే ఇందాక నీతో అన్నాను వృద్ధాప్యం మరో బాల్యం అని. బాల్యంలో తీర్చుకోలేని చిన్న చిన్న కోరికలు, సరదాలు వృద్ధాప్యంలో తీర్చుకోవడంలో ఒక చిన్న సరదా ఉంటుంది” అని అన్నాడు. అంతా విన్న ఆనంద్ “ ఇదంతా కాదురా. నేను వచ్చినప్పటినుంచి ఇన్ని నీతులు వల్లించావు కదా. ఒక్క నెల రోజులు మా నాన్నని నీతో పాటు మీ ఇంట్లో ఉంచుకోరా. నెల రోజుల తరువాత కూడా నువ్వు ఇవే మాటలకు కట్టుబడి ఉంటే నేను కూడా నీ మార్గం లోకి వస్తాను. నీతో,నీ మాటలతో ఏకీభవిస్తాను” అని నవ్వుతూ అన్నాడు. మోహన్ కొంటెగా “ఏరా! నాతోనే ఛాలెంజా? నేను రెడీ” అని అంటూ థమ్స్అప్ కూల్ డ్రింక్ టైపులో బొటనవేలు చూపించాడు. ఆనంద్ ఆశ్చర్యంగా “బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో” అని అన్నాడు. దానికి మోహన్ ఆనంద్ భుజం మీద చెయ్యి వేసి “మీ నాన్న నిన్ను ఎలా చూసుకున్నారో, నన్ను కూడా అలాగే చూసుకున్నారు. నా చదువు సక్రమంగా సాగడానికి ధనసహాయం చేసిన దాతలలో మీ నాన్న కూడా ఒకరు. మీ నాన్న మీ తాతగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద, మధ్యతరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. ఆ ముద్ద రుచి చూసిన ఎంతో మంది విద్యార్థులలో నేను కూడా ఒకడినే. ఆయన రుణం తీర్చలేనిది. ఒక్క నెల రోజులు మీ నాన్నగారు మా ఇంట్లో ఉంటే మా ఆస్తులు ఏమీ కరిగిపోవులే. మీ నాన్నను మా ఇంటికి పంపించు. మీ నాన్న, మా నాన్న ఇద్దరూ కలిసి కొన్ని రోజులు మా ఇంట్లో గడుపుతారు” అని అన్నాడు. ఆనంద్ “సరే , నేను ఇంటికి వెళ్ళి నీకు ఫోన్ చేస్తాను” అని తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళిన ఆనంద్‌ను, రఘురాం “ఎక్కడ నుంచి వస్తున్నావు” అని అడిగాడు. తండ్రి అలా ప్రశ్నించే సరికి ఆనంద్ విసుగ్గా “మోహన్ వాళ్ళింటికి వెళ్ళాను నాన్నా. మోహన్ మిమ్మల్ని ఒక నెల రోజుల పాటు ఉండటానికి వాళ్ళింటికి ఆహ్వానించాడు” అని సమాధానం చెప్పాడు. రఘురాం ఆశ్చర్యంగా “ఇదేమిటి అకస్మాత్తుగా” అని అడిగాడు. తండ్రిని కొన్ని రోజులు వదిలించుకోవచ్చుననే ఆనందంతో ఆనంద్ లేని నవ్వు నవ్వి “వాడు ఎప్పటినుంచో నాతో అంటున్నాడు. మీరు వాడి చదువు విషయంలో చేసిన ధనసహాయాన్ని మోహన్ ఇప్పటికీ మర్చిపోలేదు. ఏదో ఒక సందర్భంలో నాతో ప్రస్తావిస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు ఒక నెల రోజుల పాటు మోహన్ ఇంట్లో ఉండండి. వాడు మరీ బలవంతం చేస్తున్నాడు.” అని చెప్పాడు. తన వ్యాపార అనుభవంలో ఎంతో మంది కస్టమర్లను డీల్ చేసిన రఘురాంకు, తన కొడుకు మాటల్లో ఏదో గూఢార్థం ఉందని పసిగట్టాడు. ఆ సంగతేమిటో చూద్దామని అనుకుంటూ రఘురాం “సరే ఆనంద్. నేను కూడా మోహన్ వాళ్ళ నాన్న జనార్దన్‌తో కొన్ని రోజులు గడపవచ్చు. ఎల్లుండి ఉగాది పండుగ రోజు. ఎల్లుండి వెళ్తాను” అని స్థిరంగా చెప్పాడు. ఆనంద్ సంతోషంగా “సరే నాన్నా, ఎల్లుండి నేను కారులో తీసుకెళ్తాను. ఎంజాయ్ యువర్ హాలిడే” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రఘురాం, ఆనంద్‌తో కరచాలనం చేస్తూ “థాంక్యూ” అని నవ్వాడు. కాలం అలా కరిగిపోతూ రఘురాం అన్న ఉగాది రోజు రానే వచ్చింది. యాదృచ్ఛికమో లేక దైవ సంకల్పమో కానీ ఆ ఎల్లుండి రోజు ఒకటో తారీఖు. ఆనంద్ తండ్రికి నెల రోజులకు సరిపడా బట్టలు, మందులు వగైరా అన్నీ సర్ది తండ్రిని సిద్ధం చేశాడు. “నాన్నా! ఇవాళ ఒకటో తారీఖు.నెల రోజులు అంటే ఈ నెల ముప్పైవ తారీఖు వరకు నువ్వు మోహన్ ఇంటి అతిథివి” అంటూ కారు స్టార్ట్ చేసాడు. రఘురాం చిరునవ్వు నవ్వాడు. ఆనంద్ తన తండ్రితో కలిసి మోహన్ ఇంటికి చేరగానే మోహన్, మోహన్ తండ్రి జనార్దన్ ఇద్దరూ ఆనంద్‌ను, ఆనంద్ తండ్రి రఘురాం ను సాదరంగా ఆహ్వానించారు. కుశల ప్రశ్నలు అయ్యాక ఆనంద్, మోహన్ కుటుంబం దగ్గర వీడ్కోలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. జనార్దన్ పక్కనే రఘురాం కు కూడా మోహన్ పడక ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఉగాది పండుగ కావడంతో అందరూ కలిసి పండగ చేసుకున్నారు. దగ్గర లో ఉన్న గుడిలో ఏర్పాటు చేసిన ‘పంచాంగ శ్రవణం’ కార్యక్రమానికి అందరూ వెళ్ళారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరునాడు ఉదయం మోహన్ స్కూల్‌కి వెళ్తూ తన తండ్రికి, రఘురాంకు ఇద్దరికీ చెరో వంద రూపాయలు ఇచ్చాడు. జనార్దన్ నవ్వుతూ “మెనీ థాంక్స్ రా” అంటూ ఆ వంద రూపాయలను అపురూపంగా చూసుకుని జేబులో పెట్టుకొన్నాడు. రఘురాంకు అర్థం కాక “ఏమిటి మోహన్? నాకు ఎందుకు వంద రూపాయలు ఇచ్చావ్?” అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి మోహన్ నవ్వుతూ “ఏమీ లేదు బాబాయ్. నా చిన్నతనంలో నేను బడికి వెళ్ళే ముందు నాకు మా నాన్న అప్పుడప్పుడు అర్థ రూపాయి ఇచ్చేవాడు. ఆ అర్థ రూపాయిని ఎంతో అపురూపంగా చూసుకుని ఖర్చు పెట్టుకునేవాడిని. ఖర్చు పెట్టుకుంటే అయిపోతోంది అని బాధపడేవాడిని. అలాగే నేను ఇప్పుడు టీచర్‌గా విధులు నిర్వర్తించేదుకు స్కూల్‌కి వెళ్తున్నా. వెళ్ళేముందు ఇలా అప్పుడప్పుడు మా నాన్నకి చిల్లర ఖర్చులకి నా సంపాదన వంద రూపాయలు ఇవ్వడం నాకు అలవాటు. అలా ఇవ్వడంలో నాకు సంతృప్తి. ఆ వందతో మా నాన్న ఏ పాలకోవానో, ఏ మిరపకాయ బజ్జీలో కొనుక్కుని తింటాడు. మీరు కూడా నాకు తండ్రి లాంటి వారే కదా బాబాయ్. అందుకే మీకు కూడా ఇచ్చాను” అని అన్నాడు. రఘురాం నవ్వుతూ మోహన్ ఇచ్చిన వంద రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. జనార్దన్, రఘురాం ఇద్దరూ కలిసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు గడిపారు. ఆ మరునాడు కూడా జనార్దన్, రఘురాం ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. ఈ సారి ఆ గుడిలో తనకు తెలిసిన తన వయసు వారైన స్నేహితులను జనార్దన్, రఘురాంకి పరిచయం చేసాడు. సమయానికి భోజనం, కొత్తగా పరిచయమైన స్నేహితుల పలకరింపులతో రఘురాంకు రోజులు సుఖంగా గడుస్తున్నాయి. ఆనంద్ తన తండ్రి రఘురాంకి ఫోన్ చేయడం కూడా రోజురోజుకూ తగ్గిపోసాగింది. అలా నెల రోజులు గడిచాయి. ఆనంద్ మోహన్‌కి ఫోన్ చేసి “నెల రోజులు గడిచిపోయాయిరా. ఇప్పుడేమంటావ్?” అని అన్నాడు. మోహన్ నవ్వుతూ “నాకేమీ ఇబ్బంది లేదు. ఇంకా ఎన్ని రోజులు అయినా మీ నాన్నను మా ఇంట్లో ఉంచుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదురా” అని నవ్వుతూ అన్నాడు. ఆనంద్ ఆశ్చర్యంగా “ఎందుకు బాబు? ఊరి వారంతా నన్ను అపార్థం చేసుకుని, నిన్ను మెచ్చుకోవడానికా? వద్దులే. నువ్వే పందెం గెలిచావు. ఎటు తిరిగి నెల రోజులు అయిపోయినాయి కాబట్టి నేనే మీ ఇంటికి వచ్చి మా నాన్నను మా ఇంటికి తీసుకెళ్తాను. ఎటు తిరిగి ఎటు వచ్చినా నాకు తప్పదుగా” అని అన్నాడు. మోహన్ నవ్వుతూ “సరేలే నీ ఇష్టం. రేపు సాయంత్రం అయిదింటికి మా స్కూల్ దగ్గరకు రా. ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం. అలా నువ్వు మీ నాన్నను మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు” అని అన్నాడు. “సరే” అని ఆనంద్ ఫోన్ కట్ చేసాడు. ఆ మరునాడు సాయంత్రం అయిదింటికి మోహన్ స్కూల్ ముగించుకుని ఇంటికి బయలుదేరడానికి బైక్ కోసం పార్కింగ్ ప్లేస్‌కు వెళ్ళాడు. అక్కడ ఆనంద్ మోహన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆనంద్‌ను చూడగానే మోహన్ నవ్వుతూ “కారు తేలేదా? మీ నాన్నను ఎలా ఇంటికి తీసుకెళ్తావ్” అని అడిగాడు. ఆనంద్ చిరాగ్గా “ఏదో ఒక షేర్ ఆటోలో తీసుకెళ్తానులే. ఎలా అయితే ఏముంది?” అంటూ సిగరెట్ ముట్టించాడు. దాంతో మోహన్ “సరే. నీ ఇష్టం” అని బైక్ స్టార్ట్ చేసి ఆనంద్‌ను బైక్ వెనుక ఎక్కమని సైగ చేసాడు. ఆనంద్ ఎక్కగానే మోహన్ బైక్‌ను రయ్ మంటూ వేగంగా పోనిచ్చాడు. దారిలో మోహన్ ఆనంద్తో “చిన్న పని ఉందిరా. అది చూసుకుని మా ఇంటికి వెళ్దాం. అప్పుడు నువ్వు మా ఇంటి దగ్గర నుంచి మీ నాన్నను మీ ఇంటికి తీసుకువెళ్దువుగాని” అని అన్నాడు. ఆనంద్ నిట్టూరుస్తూ “తొందరగా ఏదో ఒకటి చేయరా బాబు. నేను షాపుకు వెళ్ళాలి” అని తొందర పెట్టాడు. మోహన్ నవ్వుతూ బండి నడుపుతూ ముందుకు సాగాడు. అలా వెళ్తూ ఒక చోట మోహన్ బండిని ఆపాడు. బండి దిగుతూ ఆనంద్ ఆశ్చర్యంతో “ఏంటిరా ఇది?” అన్నాడు. మోహన్ ఒక బోర్డు చూపిస్తూ “ఇది చిల్డ్రన్ పార్క్. మన ఊళ్ళో చాలా రోజులుగా ఉంది.” అని అన్నాడు. ఆనంద్ “ అది సరే. ఇప్పుడు ఇక్కడికెందుకు?” అని ప్రశ్నించాడు. మోహన్ “చెప్పానుగా, కొంచెం పని ఉందని. నాతో రా. నువ్వేమి చేయనక్కరలేదు” అని ఆనంద్ భుజం చెయ్యి వేసి పార్క్ లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న రిసెప్షన్ రూమ్‌కి ఇద్దరూ కలిసి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి ఇద్దరికీ కూర్చోమని సీట్ ఆఫర్ చేసాడు. మోహన్ తనకు కేటాయించిన సీట్లో కూర్చుంటూ ఆనంద్‌తో “ఆనంద్! ఈ సార్ పేరు మల్లేశ్వరరావు గారు. ఈయనే ఈ చిల్డ్రన్ పార్క్‌కి ఇన్‌ఛార్జ్. ట్రస్ట్ మెంబర్స్‌లో ఒక కీలక సభ్యులు కూడా” అని పరిచయం చేసాడు. అలాగే మల్లేశ్వరరావు తో “సార్! ఇతను నా బాల్య స్నేహితుడు ఆనంద్” అని పరిచయం చేసాడు. ఇంతలో మల్లేశ్వరరావును ఎవరో పిలవడంతో ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు మోహన్ ఆనంద్‌తో “రేయ్! ఆనంద్, ఈ మల్లేశ్వరరావు గారి వయసు సుమారు డెబ్భై సంవత్సరాలు. అయినా కూడా ఈయన ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా చాలా బాగా పనిచేస్తారు” అని చెప్పాడు. ఆనంద్ “ఈయనకి పిల్లలు లేరా?” అని అనుమానం వ్యక్తం చేశాడు. మోహన్ “ ఉన్నారు. ఈ ట్రస్ట్ పెట్టినప్పటినుంచి ఈయన ఇక్కడ పనిచేస్తున్నారు. పిల్లలు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. ఇద్దరూ వెల్ సెటిల్డ్. ఈయన్ని కూడా అమెరికా రమ్మన్నారు. కానీ ఈయన నా చేతుల్లో సత్తువ ఉన్నంతవరకు, నేను ఏదైనా పని చేసుకుంటూ ఉంటేనే, నా మనసుకి సంతృప్తి కలుగుతుంది. నా చేతుల్లో చేవ తగ్గిన రోజు అప్పుడు మీ దగ్గరకు అమెరికా వచ్చేది, రానిది ఆలోచిస్తాను అని చెప్పి అమెరికాకు రానన్నారు.” అని కుర్చీ లోంచి లేచాడు మోహన్. “నాతో రా. నీకు ఒకసారి ఈ పార్క్ అంతా చూపిస్తాను” అని ఆనంద్‌ను లేవదీసాడు మోహన్. ఆనంద్ విసుగ్గా “ఇంకా ఎంత సేపురా? టైం వేస్ట్” అంటూ మోహన్‌తో పాటు కదిలాడు. అలా వెళ్తూ వెళ్తూ ఇద్దరూ ఒక గది దగ్గర ఆగారు. ఆ గది నెంబర్ నూట ఒకటి. మోహన్ ఆనంద్‌తో “ఇక్కడ నుంచి మొదలవుతాయి అందరికీ రూమ్స్” అంటూ నూట ఒకటో నెంబర్ తలుపు తట్టాడు. ఆ శబ్దం విని ఒక వ్యక్తి ఆ గదిలోనుండి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తికి ఒక కాలు లేకపోవడంతో రెండు కర్రల సహాయంతో నవ్వుతూ బయటకు వచ్చాడు. మోహన్ కూడా ఆ వ్యక్తికి నవ్వుతూ పలకరింపుగా కరచాలనం చేసాడు. కుశల ప్రశ్నలు అయ్యాక మోహన్ ఆ వ్యక్తికి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చాడు. ఆ స్వీట్ బాక్స్ తీసుకున్న ఆ వ్యక్తి మోహన్కు ధన్యవాదాలు చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. ఆనంద్ ఆశ్చర్యంగా “ఎవరీయన?” అని ప్రశ్నించాడు. మోహన్ “ఈ సార్ పేరు రామారావు గారు. ఈయన మనదేశ సైన్యంలో పనిచేసారు. ఒకసారి దేశ సరిహద్దుల్లో ఉన్న పరాయి దేశం కవ్వింపు చర్యలకు పాల్పడడంతో, సైన్యంలో మిగిలిన వారితో పాటు ఈయన కూడా యుద్ధంలో పాల్గొన్నారు. ఆ దాడిలో ఈయన తన కాలు కోల్పోయారు. అలా కాలు కోల్పోయి ఇంటికి చేరిన ఈయన్ని కన్నబిడ్డలు ఎవరూ కూడా ఆదరించలేదు. బిడ్డలకు భారం కాకూడదని ఈయన ఈ చిల్డ్రన్ పార్క్‌లో జాయిన్ అయ్యారు. తనకు తెలిసిన మంచి విషయాలు, అనుభవాలు నలుగురితో పంచుకుంటూ, ఆర్మీలో వెళ్ళే వారికి తగు సూచనలు చేస్తూ ఉంటారు. కాలు లేకపోయినా ఇక్కడి పనులు కూడా ఇక్కడి అకౌంట్ సెక్షన్‌లో పని చేస్తుంటారు.” అని చెమర్చిన కళ్ళతో చెప్పాడు. ఆనంద్ మోహన్‌ను ఓదార్చాడు. ఆ తరువాత మోహన్ ఆనంద్‌ను మరోగదికి తీసుకెళ్ళాడు. ఆ గది తలుపు తట్టాడు. దాంతో ఆ గదిలోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తికి కరచాలనం చేసిన మోహన్, ఆ వ్యక్తికి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆ బాక్స్ తీసుకుని మోహన్‌కు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన గదిలోకి వెళ్ళాడు. ఆనంద్ ఎగతాళిగా “ఈయన కథ ఏమిటి?” అని ప్రశ్నించాడు. మోహన్ నిట్టూరుస్తూ “ఈయన పేరు రమేష్. ఒక ప్రైవేట్ కాలేజీలో మాథ్స్ లెక్చరర్‌గా పనిచేసి ఆరోగ్యం బాగోలేదని పదవీ విరమణ తీసుకున్నారు. వయసు సుమారు అరవై రెండు సంవత్సరాలు. వివిధ కారణాల వలన పెళ్ళి చేసుకోలేదు. ఉన్న బంధువులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి చేరారు. తను సంపాదించిన డబ్బును బ్యాంకులో వేసారు. ఆ బ్యాంకు వడ్డీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇప్పటికీ ఈయన ఉచితంగా పేద విద్యార్థులకు ప్రైవేట్లు చెప్తున్నారు. అంతా విన్న ఆనంద్ “ఇక్కడ అందరూ మగవారే ఉన్నట్టున్నారు. ఆడవారు లేరా?” అని అనుమానం వెలిబుచ్చాడు. మోహన్ ఆనంద్‌ను మరోగదికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ గది బయట నుంచి “బామ్మగారు” అని పిలిచాడు. ఇంతలో ఒక ముసలావిడ ఆ గది బయట నుంచి వచ్చింది. “ఏం! మోహన్ బాబు బాగున్నావా” అని ఆప్యాయంగా పలకరించింది. మోహన్ నవ్వుతూ “చాలా బాగున్నాను బామ్మగారు. మీరెలా ఉన్నారు” అని తిరిగి పలకరించాడు. ఆ ముసలావిడ సంతోషంగా “మీలాంటి వాళ్ళ దయ వలన బాగానే ఉన్నాను బాబు” అని అంది. కొంచెం సేపు ఆవిడతో మాట్లాడిన మోహన్ ఆమెకు కూడా ఒక స్వీట్ బాక్స్ ఇచ్చాడు. ఆమె దగ్గర వీడ్కోలు తీసుకుని మరోగదికి వెళ్ళిపోతున్న మోహన్‌ను ఆనంద్ “రేయ్! ఈవిడ కథ చెప్పలేదే?” అని ప్రశ్నించాడు. మోహన్ బదులుగా “ఈవిడ భర్త చనిపోయాక, ఈమెకు సంక్రమించిన ఆస్తిని చూసి కూడా ఈమెను వృద్ధాప్యంలో చూడటానికి కన్నకొడుకులు, కన్నకూతుళ్ళు సిధ్ధంగా లేరు. ఒక కొడుకైతే చెత్తకుండీలో పారెయ్యమన్నాడు. తెలిసిన వాళ్ళ ద్వారా ఈమె గురించి తెలుసుకున్న నేను ఈమెను ఈ చిల్డ్రన్ పార్క్‌లో జాయిన్ చేసాను. తన మరణానంతరం ఈమె తన ఆస్తిని ఈ చిల్డ్రన్ పార్క్ యొక్క ట్రస్ట్‌కు రాసింది” అని చెప్పాడు. అంతా విన్న ఆనంద్ విసుగ్గా ముఖం పెట్టి “ఏరా! ఇది పేరుకే చిల్డ్రన్ పార్కా? ఇక్కడ అందరూ ముసలివారే కన్పిస్తున్నారు. పిల్లలు ఎవరూ లేరా?” అని వ్యంగ్యంగా అడిగాడు. దానికి మోహన్ నవ్వుతూ ఎందుకు లేరు! ఈ రూమ్‌లో ఉన్నారు.” అని మరోగది తలుపు తట్టాడు. దాంతో మరలా మరో వ్యక్తి వచ్చి ఆ గది బయట నిలబడ్డాడు. “నాన్నా! నువ్వేంటి ఇక్కడున్నావ్?” అని ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా అరిచాడు ఆనంద్. మోహన్ నవ్వుతూ “ఏంటిరా అంత షాక్ అయ్యావ్? నేను చెప్పిన చైల్డ్ ఈయనే. మీ నాన్నగారు. ఈయన కూడా ఇక్కడే ఉంటున్నారు. మీ నాన్నని నువ్వు మా ఇంట్లో దింపిన తరువాత, మీ నాన్న మా ఇంట్లో ఒక వారం రోజులు మాత్రమే ఉన్నారు. నీకు జరిగింది చెప్తాను విను” అని జరిగిన కథ చెప్పడం మొదలుపెట్టాడు.
***
“మీ నాన్న మా ఇంట్లో వారం రోజులు ఉన్న తరువాత నేను ఒకరోజు ఈ చిల్డ్రన్ పార్క్‌కు వస్తూ ‘మీరు కూడా నాతో వస్తారా’ అని మీ నాన్నను అడిగాను. ఆయన కూడా నీలాగే ఇది చిన్నపిల్లల పార్క్ అనుకున్నారు. కాని ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన కూడా తన బాల్య స్మృతులను ఈ వృద్ధులతో కలిసి పంచుకుంటూ తన వృద్ధాప్యమనే బాల్యాన్ని ఇక్కడే అనుభవించాలని అనుకున్నారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ చిల్డ్రన్ పార్క్ విశిష్టత గురించి పేపర్లో చదివాను. మన ఊళ్ళో ఇలాంటి ఒక సేవాసంస్థ ఉందని తెలిసి చాలా ఆనందపడ్డాను. అప్పటినుంచి నెలకోసారి ఇక్కడికి రావడం, నాకు తోచినంత డబ్బు ఇవ్వడం, ఈ చిల్డ్రన్ పార్క్ పనుల్లో పాల్గొనడం లాంటివి చేస్తున్నాను. నాతో పాటు వచ్చిన మీ నాన్నకు కూడా ఈ చిల్డ్రన్ పార్క్ పద్దతులు బాగా నచ్చాయి. నెల నెలా కొంత మొత్తం ఇస్తూ ఈ పార్క్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు మీ నాన్న. మనం అనుకున్న నెల రోజుల కాంట్రాక్టు అయ్యే వరకూ ఈ విషయం నీకు చెప్పవద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు మీ నాన్న. అందుకనే నీకు చెప్పలేదురా” అని ముగించాడు మోహన్.
***
అంతా విన్న ఆనంద్ కోపంతో “మరి మీ నాన్నను ఎందుకు ఇక్కడ చేర్చలేదు” అని అడిగాడు. దానికి రఘురాం “చూడు ఆనంద్! ఇందులో మోహన్ తప్పు ఏమీ లేదు. తను నీకు ముందే చెప్తానన్నాడు. నేను, మోహన్ కలిసి ఇక్కడికి వచ్చాక చూస్తే నాకు ఇక్కడి పద్దతులు బాగా నచ్చాయి. నేను నా ఈడు వాడైన మోహన్ తండ్రితో ఉన్న వారం రోజులు చాలా ఉత్సాహంగా గడిపాను. అలాంటిది నేను ఇక్కడ నా వయసు వారితో కలిసి ఉండటం వల్ల నేను కూడా వృద్దుణ్ణి అనే విషయం మర్చిపోయాను. నేను ఖాళీగా ఇంట్లో ఉండలేను. ఇక్కడ నేను చేయగలిగే పనులు చేస్తున్నాను. ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం. ఇక్కడ చేరిన వారిలో ఒక ఆయుర్వేద వైద్యుడు కూడా ఉన్నారు. ఆయన సలహాలతో మేము ఔషధ మొక్కలు పెంచుతున్నాం. నేను ఇక్కడ తోటపని చేస్తాను, వంటింట్లో కూరగాయలు కట్ చేస్తాను. ఇక మోహన్ వాళ్ళ నాన్న ఇక్కడికి ఎందుకు రాలేదంటే ఆయనకు కావాల్సిన జీవితం ఆయనకు ఇంట్లోనే లభిస్తోంది. తనకు కావాల్సినవి మితంగా, ఇష్టంగా తింటూ తన వృద్ధాప్యమనే బాల్యాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాడు. కానీ నాకు మాత్రం ఆ ఆనందం ఇక్కడ లభించింది. మన తోటి వారికి మనం చేయగలిగే ధన సహాయం మాత్రమే కాదు, మాట సహాయం, చేతల సహాయం కూడా గొప్ప దానం లాంటిదే. దీనికి నీకు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను వ్యాపార పని మీద చెన్నయ్ వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు తుఫాన్ వలన రైళ్ళు రద్దు అయినాయి. దాంతో నన్ను చెన్నయ్ నుంచి నెల్లూరుకు కారులో వెళ్తున్న ఒక వ్యక్తి నెల్లూరు దాకా తన కారులో తీసుకెళ్ళాడు. ఆ వ్యక్తి ఆ కారు డ్రైవర్. అతను నా దగ్గర నుంచి ప్రయాణపు అద్దె కూడా తీసుకోలేదు. అంతే కాక తన ఇంట్లోనే నాకు రెండు రోజులు వసతి ఏర్పాటు చేసాడు. రెండు రోజుల తరువాత కానీ తిరిగి రైలు సర్వీసులు పునరుద్ధరింపబడలేదు. ఆ వ్యక్తి కులం కూడా నాకు తెలియదు. ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నా కానీ, ఆ వ్యక్తి నా నుంచి డబ్బు తీసుకోలేదు. అలానే నేను కూడా ఇక్కడ నాకు చేతనైన సహాయం చేస్తూ ఉంటాను. అయినా నువ్వు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ నన్ను చూడవచ్చు. మోహన్ ఎటూ నెలకోసారి వస్తాడు కదా తనతో పాటు నువ్వు కూడా ఇక్కడికి వస్తుండు” అని కొడుకుని అనునయించాడు. ఇంతలో మోహన్ మధ్యలో అందుకుని “చూడు ఆనంద్. నాకు మీ నాన్న, మా నాన్న వేరు వేరు కాదురా. నాకు ఈ పార్క్ చాలా సంవత్సరాలుగా తెలుసు. ఈ చిల్డ్రన్ పార్క్‌లో ఉన్న చాలా మంది నాకు పరిచయమే. ముందే చెప్తే నువ్వు కంగారుపడతావని నీకు చెప్పలేదు. ఈ పార్క్‌కు చాలా మంది దాతలు సహాయం చేస్తుంటారు. ఆ దాతలు చేసే సహాయం కంటే ఈ పార్క్ లో ఉన్న సిబ్బంది, ఇక్కడ ఉన్న వృద్ధులకు చేసే సేవ ఎంతో విలువైనది. చిన్నతనంలో బిడ్డను ఎలా తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచుతారో అలానే ఇక్కడ వృద్ధులను ఇక్కడి సిబ్బంది అందరూ చూసుకుంటారు. అందుకే ఈ వృద్ధాశ్రమానికి ‘చిల్డ్రన్ పార్క్’ అని పేరు పెట్టారు. ఇక్కడికి వచ్చే ఎంతోమంది పేద, మధ్యతరగతి వారైన యువకులు, విద్యార్థులకు ఇక్కడ ఉండే రిటైర్డ్ ఎంప్లాయిస్ తమ సలహాలు, సూచనలు ఇస్తూ వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. ఇక్కడ అన్ని కులాల వారు, మతాల వారు ఉన్నారు. అన్ని మతాల పండుగలు ఇక్కడ అందరూ కలిసి చేసుకుంటారు. అన్ని మతాల దేవుళ్ళను ఇక్కడ పూజిస్తారు, ప్రార్థిస్తారు” అని అన్నాడు. ఆనంద్ కళ్ళు పశ్చాత్తాపంతో వర్షిస్తున్నాయి. అలా ఏడుస్తూనే ఆనంద్ “నాన్నా! నన్ను క్షమించు. నువ్వు ఏ పార్క్ లోనో, ఏ అనాథ ఆశ్రమంలోనో ఉండవద్దు. మనింటికి వెళ్దాం రా నాన్నా. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మోహన్ వాళ్ళ నాన్నలాగా నువ్వు కూడా నీ వృద్ధాప్యమనే బాల్యాన్ని మన ఇంట్లోనే నీకు ఇష్టం వచ్చినట్టు అనుభవిద్దువుగాని” అని అన్నాడు. దానికి రఘురాం నవ్వుతూ “లేదురా. నువ్వు చిన్నప్పుడు బడికి అసలు సెలవు పెట్టేవాడివి కాదు. ఎందుకంటే నీ ఈడు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ, పాడుకుంటూ, చదువుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు నేను కూడా ఇక్కడ అంతే. నా ఈడు వారికి, నా కన్నా పెద్దవారికి నేను చేయగల సహాయం చేస్తూ, అవసరం అయితే వారి నుంచి సహాయం పొందుతూ ఇక్కడే ఉంటాను. నా లాగే ఇలా అందరినీ వేరుగా ఉండమని అనను. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో స్వచ్చందంగా ఏదైనా అనాథ వృద్ధాశ్రమంలో వెళ్ళి చేరుతారు. మరి కొంత మంది పరువు కోసం తమ పిల్లల దగ్గర వృద్ధాప్యం వెళ్ళదీయాలనుకుంటారు. అప్పుడు పిల్లల కనుసన్నల్లో బతుకు ఈడ్చాల్సి వస్తుంది. ఇక పరాయి దేశంలో ఉన్న కన్న బిడ్డలను చూడాలంటే అతి కష్టం మీద ఆ దేశం వెళ్ళి చూడాల్సిన పరిస్థితి. ఆ దేశ సంప్రదాయాలకు, జీవన విధానానికి,వాతావరణానికి అలవాటు పడలేక ఇబ్బంది పెడుతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రుల కోసం కన్న బిడ్డలు పరాయి దేశం వదిలి స్వదేశానికి రారు. వారికి తల్లిదండ్రుల కంటే వారి ఉద్యోగం, కెరీర్ మాత్రమే ముఖ్యం. ఆ సందర్భంలో కన్నబిడ్డలు పక్కన లేకుండానే చాలా మంది తల్లిదండ్రులు ప్రాణాలు విడుస్తున్నారు. ఆ సమయంలో కన్నబిడ్డలు ఉన్నా కూడా ఎవరో పరాయి వారు ఆ తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. అలాంటి పరిస్థితి కంటే నేను ఇక్కడ ఉండటమే నాకు సంతోషంగా ఉంటుంది. నాకు నీ మీదా ఏ కోపం లేదు. నాపై ఎవరి ప్రోద్బలం లేదు. ఇది నేను స్వతహాగా తీసుకున్న నిర్ణయం. నెల నెలా కొంత డబ్బు నేను నా కష్టార్జితంతో కూడబెట్టిన డబ్బు లోనుంచి తీసి ఈ చిల్డ్రన్ పార్క్ అకౌంట్‌కి జమ చేస్తుంటాను. నా మరణానంతరం నా పేరు మీద ఉన్న ఆస్తి కూడా ఈ చిల్డ్రన్ పార్క్ ట్రస్ట్‌కే రాస్తాను. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తులు మాత్రం నీ పేరున రాస్తాను” అని ముగించాడు. అంతా విన్న ఆనంద్ “సరే నాన్నా. మీ ఇష్టమే నా ఇష్టం. కానీ నాకు ఏ ఆస్తులు ముఖ్యం కాదు. మీ తరువాతే ఏదైనా. నేను కూడా ఇకనుంచి ఈ చిల్డ్రన్ పార్క్‌కు ప్రతి నెలా కొంత డబ్బు విరాళంగా ఇస్తుంటాను. అంతే కాక నాకు వీలైనప్పుడు, సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి నేను చేయగల పనుల్లో పాల్గొంటాను. ఎంజాయ్ యువర్ చైల్డ్ హుడ్ హియర్ నాన్నా” అంటూ రఘురాంని ఆప్యాయంగా కౌగిలించుకుని కన్నీళ్ళతో మోహన్ వంక చూసాడు. మోహన్ నవ్వుతూ స్నేహితుడిని మనసులో అభినందిస్తూ థమ్స్అప్ ఫింగర్ బొటనవేలును చూపించాడు.
బాటమ్ లైన్: వృద్ధాప్యం మరో బాల్యం లాంటిది. హ్యాండిల్ విత్ కేర్