వృక్ష హృదయం – వృక్ష నవకం!

0
2

1
కొట్టకుమోయి గొడ్డలిపెట్టుల,నీమేలుకోరు చెట్టు నేస్తమును
పుట్టిన మొదలు నీ సేవయె ఆదర్శమై బ్రతుకు మౌనజీవిని
ఎట్టి ప్రత్యుపకార మాశించక నీ కూపిరు లూదు సంజీవనిని
చిట్టి చెంబుతో ఎపుడొ పోసిన నీటికి ఫలమిచ్చెడి యీవిన్!

2
మా ఆకులు నీ కాహారము,మా పూవులు నీ కలంకారము
మా ఆక్రృతి నీ కనులకు హాయి, మనసున కౌషధము
మా అటవులె నీ కెనలేని సు సంపదల కాకరము
మా ఆధిక్యమె,అబ్ధి నరికట్టు పెన్కాపు మానవాళికిన్!

3
ఎల చివురులు ముక్కు పచ్చలారని మా పసి పాపలు
నలు దిశల సాగిన కొమ్మలు,అందొచ్చిన కొడుకులు!
అల నింగికి మా ఉన్నతి,పరచుకొనిన మా విస్త్రతి
అలుపెరుగక మీ సేవకె,మన సావాసపు చిన్నలె!!

4
కదిలెడి గాలిని బంధించి మౌనధారు లౌమనె మీ నరుల
కదలక, మౌనముద్ర నొద్దిక మనుమనె విధి,మా తరుల
బంధము చూడరె,సామ్యముల కనరె,అకట,మీ సజాతితో
ఎందుకయ,దయ వీడి,విరతురు,చెరతురీ వన సంపదన్!

5
దేవతా పదమిచ్చి కార్తికాన మా ఉసిరి నెంతొ పూజింతురే
చవితి నాట భాద్రపదాన, పత్త్రి, గణపతిని సేవింతురే
శివుని, భక్తి నఘనాశి శివరాత్రి, మారేడుల నర్చింతురే
అవతారము సిరిదని తులసి వత్సరమంత కొలుతురే
(II)
దేవ నాయకుడా హర్యంశమని మా రావి కడు నాదరింతురే
ఈవిపరీతమేలయ్య నేడు మముకూల్చువినాశపు క్రీడల్?!

6
మామిడి మా రారాజు, పనస మా ప్రభువు,వేప నిండు వేదాంతి!
జామి మాకు తీయని కబురుల మామయ్య,జువ్వి మా భీష్మ తాత!
ఆ మేఘాలనె తాకు తాటి మా మేటి, కళ్యాణకరము అరటి!
ఆ మాధవు నివేదనలన్ని మావె,ఫల పత్ర పుష్పములన్!

7
దేవదారులము,హిమవన్నగ దివ్య శోభల మేటి వారము
దేవ రథ,శివ కార్ముక, సిరి గడపల తొలి రూపులము
అవని అందాల వనము కాయువిడు ఉన్నత గ్రీవులము
ఎవని మేలుకయ్య యిటు ఆధార పీఠము నరకెదవయ్యో!

8
భోజనముకు పరచిన ఆకు,పాయసమున కల్లిన దొన్నె/
రాజసముల సేవించు తాంబూలము,ముంగిట వెల్గు తోరణము/
యాజికుల సామగ్రి,లేమల మృదు పద లేపనమౌ పారాణి,/
అజు వరముర, మేమె యివన్నియై, వివేకోదయమెన్నటికో?!

9
మీ జనుల, ప్రేమ నొకటి జేయు వనభోజన వసతి మేమె/
త్రిజగద్రక్షకి అగజ నెమ్మేని పాటలీ సుమ ప్రభ మేమె/
ఆ జగన్నాథుడె అవతరించు దారుశిల్పపు పుణ్యము మేమె/
నిజము కనర,లోకాలౌకికముల,రెంట మేమె,మేల్కొనర!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here