[box type=’note’ fontsize=’16’] ఇది కొలంబియా కథ. కథకుడు Hermando Tellez. ఆంగ్లంలోకి – ‘Just Lather, That’s All పేరిట అనువదించిన వారు – DONALD A YATES. ఈ కథ తెలుగు సేత కల్లూరు జానకిరామరావు. [/box]
[dropcap]నా[/dropcap] సెలూన్‌లోకి ప్రవేశించాడతడు ఏమాటా మాడ్లాడకుండ. నా దగ్గరున్న మంచి రేజర్లను పదును పెట్టడానికని చర్మము పట్టీపైన పైకీ క్రిందికీ ఆడిస్తూ వున్నా. ఆయన్ను గుర్తుపట్టగానే నాలో వణుకు పుట్టింది. అయితే నాలోని ఈ మార్పును ఆయన గమనించలేదు. నాలో రేగిన ఈ అలజడిని బయటకు కనబడనీయకుండా వుండటానికని రేజర్లనీ పదును పెడుతూ వుండిపోయాను. వాటి పదునును నా బొటనవ్రేలిపై సుతారంగా తాకించి చూచా. చురుక్కుమంది.
నాలో రేగిన ఈ అలజడిని కప్పిపుచ్చుకోటానికని నేనిలా తంటాలు పడుతూవుంటే, నింపాదిగా తన బెల్టును ఊడ దీసి, అందుండి తన హోల్‌స్టర్ నుంచి పిస్తోలు వేలాడుతూంటే దాన్ని అక్కడున్న గోడ హుక్‌కి తగిలించాడు అతగాడు. ఆ తర్వాత తన మిలిటరీ క్యాప్‌ని తీసి వాటిపైన ఉంచాడు. తన టై ముడిని సవరించుకుంటూ, నా వైపు తిరిగి, “ఓహ్! చాలా దుర్భరంగా వుంది. షేవ్ చెయ్యి” అంటూ చెయిర్‌లో కూలబడ్డాడు.
ఆ సమయాన, ఆయన నేనూ తప్ప ఇంకెవరూ లేరు. నాలుగు రోజులు పాటుగా ఆయన తన గడ్డాన్ని గీయించుకోన్నట్టుగా లేదు. మా దళాలని అన్వేషించటానికి ఈ నాలుగు రోజులూ గడిపి వుంటారు. ఎండవేడిమికి ముఖం కమిలినట్టుగా వుంది. అతి జాగ్రత్తగా సోపును తయారు చేయటంలో నిమగ్నడ నయ్యాను. కొన్ని సోపు ముక్కల్ని కప్‌లో వేసి, కొంచం వెచ్చటి నీటిని అందులో పోసి, బ్రష్ తోటి కలపటం ప్రారంభించాను. వెంటనే నురగ రావటం ప్రారంభించింది. “మా గ్రూప్‌లోని ఇతరులకీ నా యంతే గడ్డం పెరిగివుంటుంది,” అన్నాడు. సోప్ నురగను కలుపుతూపోయాను సమాధానమివ్వకుండా.
“నీకు తెలుసా, మేం చేసేదంతా చాలా పకడ్బందీగా వుంటుంది. ముఖ్యమైన వాళ్లని బంధించాం. కొందరి శవాలను తీసుకొచ్చాం. ఇంకా కొందరు మిగిలిపోయారు. వాళ్లు కూడా తప్పక శవాలుగా మారుతారు చూస్తూండు.”
“ఇప్పటికి ఎంత మందిని బంధించారు” అడిగాను.
“పద్నాలుగు మందిని. మిగతా వాళ్లని బంధించటానికి అడవి మధ్యలోకి జొరబడి పోవాల్సి వుంది. ఏదైనా గాని, వాళ్లని వదిలిపెట్టటమంటూ జరగదు. వాళ్లల్లో ఒక్కడు, ఒక్కడు కూడా బ్రతికి బట్టకట్టలేడు.”
నా చేతిలోని సోపు నురగతో కూడిన బ్రష్‌ని చూచి కుర్చీ వెనక్కి తలని ఆన్చాడు, గడ్డం గీయించుకోటానికి తను రెడీ అన్నట్టు. ఆయన ఛాతీ మీద, బట్టల మీద వెంట్రుకలు మీద పడకుండా కప్పే వస్త్రాన్ని ఇంకా కప్పలేదు. నేను అప్‌సెట్ అవుతున్నా. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. డ్రాయర్‌లోంచి ఓ వస్త్రాన్ని తీసి ఆయన ఎదని కప్పి మెడవైపుగా రానిచ్చి వస్త్రం రెండు కొనలకి ముడివేయటం ప్రారంభించా. ఆయన మాత్రం నిలపకుండా మాట్లాడుతూనే వున్నాడు. నేను, వాళ్ల పార్టీ సానుభూతి పరుడనని ఆయన అపోహ పడుతున్నట్టుంది.
“ఈ పట్టణం సరైన గుణపాఠాన్ని నేర్చుకుంది, మేం చేసిన పని నుంచి.”
“అవును” అన్నాను ఆయన మెడకి ఆ వస్త్రపు కొనలను ముడివేస్తూ.
“ఓ మహత్తరమైన ప్రదర్శన అది. ఓహ్.”
“అవునండి” అంటూ బ్రష్‌ని అందుకోటానికని వెనక్కుతిరిగాను.
సోపునురగ చెంపల్ని తాకుతూంటే, ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ హాయిగా కూర్చుండిపోయాడు కళ్లు మూసుకుని ఆ వ్యక్తి. నేనిది వరకూ ఈ వ్యక్తిని చూచి ఎరగను. ముఖాముఖి చూడటం కేవలం ఒక్కసారి మాత్రం – ఆ రోజు… ఆ ముగ్గురు తిరుగుబాటుదారుల్ని, స్కూలు ఆవరణలో ఉరితేసిన సందర్భాన. ఆ దృశ్యాన్ని చూడడానికని ఊరి వారినందర్నీ వరుసగా నుంచోమని ఆజ్ఞాపించిన రోజున, ఆ రోజున, అలా ఆ రోజున దారుణంగా ఉరితీయించిన ఆ ముఖం, ఈ రోజున నా రెండు అరచేతుల మధ్య వుండిపోతూవుంది.
వీడి ముఖం అంత వికారంగా ఏమీ లేదు. అయితే గడ్డం ఉండటం చేత ఉన్న వయసుకంటే ఎక్కువ వయసు వాడిగా కనిపిస్తున్నాడు. వాడి పేరు. తొరెస్స్-క్రాపైన్ తొడెస్స్. తిరుగుబాటుదారుల్ని, నిర్దాక్షిణ్యంగా నగ్నంగా ఉరేగించి పొట్టన బెట్టుకున్న నరహంతకుడు.
వాడి గెడ్డానికి మొదటి సోప్ పూత పూసాను. కళ్లు మూసుకునే అన్నాడు, “కొంచెం సేపు ఇంట్లో నిశ్చింతగా పడుకుంటా, అయితే ఈ మధ్యాహ్నం చేయవలసిన పని చాలా వుంది” అన్నాడు. సోపు పూయటం ఆపి, అంటే “ఫైరింగ్ స్క్వాడ్‌ని…” అని నేను అనేలోపుగానే… “అల్లాంటదే… అయితే అంత తీవ్రమైంది కాదు.”
గడ్డానికి సోపు పూయటం ప్రారంభించాను. నా చేతులు సరిగా పని చేయటం లేదు. వణుకుతున్నాయి. దాన్ని వీడు గమనించినట్టు లేదు. వాడు కళ్లు మూసుకుని వుండటం నాకు మేలయ్యింది. వీడు ఇక్కడికి రాకపోయివున్నట్లయితే బావుండేది. వీడు నా సెలూన్ లోకి, ఓ శత్రుస్థావరంలోకి రావటాన్ని మా వాళ్లు గమనించారు.
అయితే నేనో బార్బర్‌ని. నా డ్యూటీ నే చేయాలి. ఇతర కష్టమర్లు గడ్డం గీయించుకోడానికి వచ్చినపుడు, ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా, ఓ చిన్న గాటు లేకుండా చేసినట్టే వీడికీ చేయాల్సివుంది. కస్టమర్లను సంతృప్తిపరచడమే నా ధ్యేయం. గీసిం తర్వాత, నా వ్రేళ్ల వెనక బాగాన్ని వాళ్ల చెంపలకి తాకించి, అతినునుపుగా వున్నదని తెలిసినాకే నేను సంతృప్తి చెందుతాను. అలాగే వీడి చెంపలు కూడా.
ఇక్కడనే చెప్పాల్సింది ఒకటుంది. నేనూ రహస్య తిరుగుబాటుదారుడనే. అయితే అంతరాత్మ కలిగిన క్షురకుణ్ణి. నే చేసే నా వృత్తి పట్ల నాకు తృప్తి, గౌరవం రెండూ వున్నాయి.
అలవాటు పడ్డ నా రెండు వ్రేళ్ల మధ్యా రేజర్ చకచకా పని చేసుకుంటూ పోతుంది. వీడి గడ్డం చాలా బిరుసు. ఒక పట్టాన లొంగటం లేదు. కొద్దికొద్దిగా రేజర్ వెంట్రుకల్ని కత్తిరిస్తూ పోతూవుండే మృదువైన చర్మం బయటపడుతూవుంది.
రేజర్ కంటుకున్న వెంట్రుకలతో పాటు సబ్బు నురగనీ తుడవటానికని ఒక్క క్షణం ఆగాను, మరలా రేజర్‌ని నునుపు చేయటానికని. కళ్లు మూసుకు కూర్చున్నవాడు నెమ్మదిగా కళ్లు తెరిచాడు. ఓ చేతిని గడ్డం గీసిన ఓ వైపుకు పోనిచ్చాడు ఎలా షేవ్ చేశానో తెల్సికోవాలని. చెంపలని తడుముకుంటూ “ఈ రోజు సాయంకాలం ఆరుగంటలకి స్కూల్‌కి రా” అన్నాడు నాతో.
“అంటే… ఆ రోజు జరిగినదాన్ని మరలా చూడటానికా” భయంతో అడిగాను.
“ఆ రోజుకంటే ఈ రోజు ఇంకా బాగుంటుంది.”
“ఏం చేయదల్చుకున్నారు?”
“ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. అయితే చూసే వాళ్లకి చాలా వినోదంగా వుంటుంది లే.” అన్నాడు; తిరిగి, కళ్లు మూసుకుని కుర్చీ వీపుకు తన వీపు ఆనిస్తూ.
నా రేజర్‌తో వాడిని సమీపేంచాను.
“అందర్నీ శిక్షించడానికే ప్లాన్ చేశారా” అడిగాను పిరికిగా, భయం భయంగా.
“అందర్నీ” అన్నాడు.
వాడి చెంపలకి పూసిన సోపు ఆరిపోతూవుంది. నేను తర్వపడాలి. అద్దం గుండా గమనించా వీధిని. సరుకుల కొట్టు, ఇద్దరు ముగ్గురు కస్టమర్లతో మామూలుగానే వుంది. గోడ గడియారం కేసి చూపు మరల్చాను. మధ్యాహ్నం 2.20 అయింది.
రేజర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నది, చకచకా వాడి నల్లటి గడ్డం పైన. కవులూ, కొంత మంది మతాధికారులూ పెంచినట్టు వీడూ గడ్డాన్ని అలానే వదిలేసి వుంటే బావుండేది. వీడికి చక్కగా సరిపోతుంది. చాలా మంది గుర్తుపట్టలేరు కూడా.
వెంట్రుకలు సుళ్లు తిరిగినచోట, రేజర్‌ని చాలా మెలకువగా ఉపయోగించాలి నైపుణ్యంగా. కొద్దిపాటి ఏమరుపాటు రక్తాన్ని చిందిస్తుంది. అయితే ఓ అనుభవశాలియైన క్షురకుడు మాత్రమే ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకొంటాడు.
ఈ రోజు జరగబోయే ఫైరింగ్‌లో వీడు మాలో ఎంత మందిని కాల్చి చంపాలని వున్నాడో! ఎంత మందిని అంగవికలురుగా చేయనున్నాడో!
ఆలోచించే కొద్దీ కంపరం పుడుతోంది. దాన్ని గురించి ఆలోచించక పోకపోవడమే మంచిది. నేను, ఈ తొరెస్స్‌కి శతువుని అని బహుశః తెలీదు. వీడికే కాదు వీడి గ్రూప్‌లో వుండేవారికీ తెలిసే అవకాశమే లేదు. నేను తిరుగుబాటుదారుల మిత్రుడనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. తొరెస్స్ ఎప్పుడెపుడు ఎల్లాంటి చర్యలు తిరుగుబాటుదారులపై తీసుకోబోతున్నాడనే విషయం, తిరుగుబాటుదారులను ఎలా వేటాడాలనే విషయాన్ని నేను విప్లవకారులకి రహస్యంగా చేరేవేసేవాణ్ణి.
ఇప్పుడు వీడి తల నా రెండు చేతుల మధ్య వుంది. ఎల్లాంటి ప్రమాదం రాకుండా, వీడ్ని ప్రాణాలతో బయటకి పంపించటమా అనేదే నాలో చెలరేగుతున్న కష్టమైన ఆలోచన.
గెడ్డం గీయటం ఇంకా పూర్తికాలేదు. వెంట్లుకలు వెళ్లిపోగా నునుపాటి చెక్కిళ్లతో యువకుడుగా కన్పిస్తున్నాడు వీడు. సెలూన్ లోకి అడుగుపెట్టినప్పుడు, ఇప్పటికీ ఎంత తేడా. బార్బర్ షాప్ లోకి అడుగు పెట్టే ప్రతి వాడికీ ఇదే అనుభవం. తొరెస్స్‌లో నూతనోత్సాహం కన్పిస్తూవుంది. దీనికి కారణం టౌన్‌లో నేనో పేరున్న బార్బర్‌ని కావటమే.
ఎండతాపం ఎక్కువై పోతున్నది. నావలె తొరస్స్‌కి కూడా చెమటలు పట్టాయి. అయితే వాడు, ఈ సాయంకాలం ఖైదీలను ఏం చేయాలని ప్రశాంతంగా ఆలోచిస్తూంటే, నేను నా రేజర్‌ని తోలు పటకా మీద సానబెడుతున్నా సరైన ఆలోచన రాక.
వెధవ, వీడు రాకుండా వున్నట్లయితే బావుండేది. నేను విప్లవవాదినే, కాని హంతకుణ్ణి కాదు. వీణ్ణి ఈ సమయంలో, క్షణంలో చంపివేయవచ్చు. అతి సులువైన పని. వీడికి తగింది అదే… కాదా… నో… ఎంతటి పాపపు ఆలోచన! హంతకుడు కావటానికి ఎవరైన తన ప్రాణాన్ని త్యాగం చేయగలరా! దాంతో లభించేదేమిటి? నథింగ్. ఒకణ్ణి చంపితే, వాళ్లు వాణ్ణి ఆ తర్వాత మొదటి వాళ్లు రెండవ వాళ్లని.. తిరిగి వీళ్లని ఇంకొకళ్లు – ఇలా అందరూ అందర్నీ చంపుకుంటూ పోతే, ఈ లోకం రక్తపు సముద్రం కాదా!
వీడి కుత్తుకను నేనిప్పడు, జస్ట్ ఒకే ఒక వ్రేటుతో షప్ అని తెగవేయగలను. నాతో వీడికి పెనుగులాటకి తావుండదు, కళ్లు మూసుకున్నాడు గనుక. నా రేజర్ బ్లేడ్ తడి అవుతున్నదో లేదో నా కళ్లు తడి అవుతున్నాయో కూడా గమనించలేదు. అయితే నేనో హంతకుణ్ణి కాబోతున్నాననే ఆలోచన నాలో వణుకు పుట్టించింది. తెగవేశానా… వీడి గొంతు రక్తనాళాలు తెగి రక్తం చిమ్మి వీడి దుస్తుల మీద, కుర్చీమీద, నా చేతుల మీద, అటు తర్వాత నేలమీద తడిచేస్తుంది. తలుపులు తెరచి చేయడానికి వీల్లేదు ఈ పని. తలుపులు మూసి చేయాలి. ఆ తర్వాత, ఆ తర్వాత… వీడి వేడి ఎర్రటి రక్తం అంగుళంగుళం నేల మీదికి పారి వీధిలోకి చేరుతుంది.
ఒకే ఒక దెబ్బ, ఒక లోతైన కోత… అంతే… వీడికి బాధ అనేదే తెలీకుండా, ఏ మాత్రం సవ్వడి చేయకుండా ఒరిగిపోతాడు. అయితే, అటు తర్వాత వీటి బాడీని ఏం చేయాలి? ఎక్కడ దాచిపెట్టాలి??. ఉన్నదంతా వదిలేసి, పారిపోవాలి… ఎక్కడికి?…. ఎక్కడికి??… కాందిశీకుడిగా దూరంగా… అయితే వాళ్లు నన్ను విడిచిపెడతారా? నేను చిక్కేవరకూ నన్ను తరుముతూనే వుంటారు వేటకుక్కల్లా.
“కాప్టన్ తొరస్స్ గారి హత్య. ఆయనను షేవ్ చేస్తూ ఆయన కుత్తుకను కత్తిరించాడు. పిరికిపంద,” అని ఒకరంటే – “పగతీర్చుకున్నాడు చిరస్మరణీయుడై వుంటాడు – హీరో” అని మరికొందరంటారు.
హంతకుడా? హీరోనా? నా రేజర్ ఎడ్జ్ మీద వుంది నా భవిష్యత్తు. నా చేతులోని రేజర్‌ని చర్మంలోకి దింపేటట్లుగా చేయగలను. రబ్బర్ లాగా, సిల్క్ లాగా చర్మం తెగిపోతుంది. మానవ చర్మమంత అతి పలుచనైన చర్మం ఇంకోటి లేదు. దాని క్రింది రక్తం చిందుకొస్తుంది.
అయితే నేనో హంతకుడిని కాదలచుకోలేదు. షేవ్ కోసం వచ్చిన వాళ్లకి అతి నిజాయితీగా పని చేయాలి. నా చేతులకి రక్తం అంటరాదు. అంటుకోవల్సింది సబ్బు మరక మాత్రమే. దట్సాల్. నేను ఓ బార్బర్‌ని మాత్రమే. ఉరితీసే వాణ్ణి కాదు. ప్రతివాడికీ వాడి వృత్తి ధర్మాలు ఉంటాయి.
గెడ్డం గీయటం పూర్తి అయింది. ఆ వ్యక్తి లేచి, తన ముఖాన్ని అద్దంలో చూచుకున్నాడు. చేతుల్తో తడిమి చూసుకున్నాడు. సంతృప్తిపొందాడు.
“థ్యాంక్స్” అంటూ లేచి కెప్టెన్ తొరెస్స్, తన బెల్టుని, పిస్టోల్‌ని, క్యాప్‌ని అందుకున్నాడు. నా ముఖం వివర్ణమయింది. చెమటతో నా షర్ట్ తడిసిపోయింది. బకిల్‌ని సరిచేసుకుంటూ, పిస్టల్‌ని హోల్‌స్టర్ లోనికి దోపుకుని, తన తల వెంట్రుకలని సరిచేసుకుంటూ క్యాప్‌ని పెట్టుకున్నాడు. ప్యాంట్ ప్యాకెట్ లోని ఓ సిల్వర్ కాయిన్ నా చేతిలో పెడుతూ వాకిలి వైపు నడిచాడు.
పోతున్న వాడల్లా, గుమ్మం వేపు చేరి, కొంత సేపు ఆగి, “నీవు, నన్ను చంపుతావని వాళ్లన్నారు. చూద్దాం అని వచ్చా. నే చెబుతున్నా విను, చంపటం అంత తేలికైన పని కాదు” అంటూ తిరిగి వీధిలోకి నడచి వెళ్లిపోయాడు.
సమాప్తం
కొలంబియా మూలం: Hermando Tellez.
ఆంగ్ల అనువాదం: DONALD A YATES.
తెలుగు సేత: కల్లూరు జానకిరామరావు